శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
3 - సతీ పరమేశ్వరుల సంవాదము
మైత్రేయ మహర్షి ఇట్లు పలికేను --- దక్షుడు మామగారు. శివుడు అల్లుడు. వారిద్దరి మధ్యలో విద్వేషము అదే విధముగా కొనసాగుతుండగా, చాల కాలము గడిచేను.
దేవాధిదేవుడగు బ్రహ్మగారు దక్షుని ప్రజాపతులందరిపై అధిప తిగా అభిషేకించెను. అప్పుడు దక్షునకు గర్వము కలిగెను.
ఆ దక్షుడు వాజపేయయాగమును చేసెను. గర్వించియున్న కార ణముగా ఆతడు బ్రహ్మనిష్ఠులను అవమానించెడివాడు. ఆతడు వాజపే యము తరువాత బృహస్పతిసవము అనే యజ్ఞమును చేయుటకు ఉపక్రమించెను.
బ్రహ్మర్షులు, దేవర్షులు, మరియు తమ తమ భార్యలతో కూడియున్న అందరు పితృదేవతలు ఆ యజ్ఞమునకు విచ్చేసిరి. ఆ దంప తులందరు మంగళకార్యములను పూర్తి చేసుకుని సత్కారమును స్వీకరించి యుండిరి.
గంధర్వులు మొదలగు ఉపదేవతలు ఆకాశమార్గములో వెళ్లుచు న్నవారై ఆ దక్షుని యజ్ఞము అనే మహోత్సవమును గురించి కబుర్లు చెప్పుకొనుచుండగా, దక్షపుత్రికయగు సతీదేవి వినెను, ఆకాశములో అన్ని దిక్కులనుండి అందగత్తెలగు ఆ ఉపదేవతల భార్యలు, మెడలో పచ్చలను పెట్టుకొని, కొత్త చీరలను కట్టుకొని, గొప్పగా ప్రకాశించే కుండలములను ధరించి, విమానములపై నెక్కి, చంచలమగు నేత్రములతో అన్ని వైపులకు చూస్తూ, తమ భర్తలతో కలిసి యజ్ఞమునకు వెళ్లుచుండిరి. సతీదేవి తన మకామునకు సమీపములో ఆకాశములో వారినందరినీ చూచెను. అపుడామె ఉత్కంఠతో, భూతపతి మరియు తనకు భర్త అగు శివదేవునితో నిట్లు పలికెను.
సతీదేవి ఇట్లు పలికెను --- ఓయీ చతురా! వామదేవా! నీ మామ గారగు దక్ష ప్రజాపతి యజ్ఞమును గొప్ప ఉత్సవముగా చేయుచున్నాడు. నీకు ఇష్టమైనచో, నీకు నా కోరిక అంగీకారమైనచో, మనము కూడ అచ్చ టకు వెళ్లేదము. ఏలయనగా, దేవతలింకనూ యజ్ఞమునకు వెళ్లుచునే యున్నారు సుమా! (ఇంకను సమయము మించిపోలేదు).
నా అక్కలు చెల్లెళ్లు బంధుమిత్రులను చూడగోరువారై, తమ తమ భర్తలతో గూడి ఆ యజ్ఞమునకు తప్పక వెళ్లెదరు. నేను కూడ నీతో కలిసి వెళ్లి, యజ్ఞములో మా తల్లిదండ్రులు ఇచ్చే కానుకలను స్వీకరించగోరుచున్నాను.
సుఖప్రదుడవగు ఓ శీవా! బంధువులను చూడాలనే తహతహ నాకు చాల కాలమునుండియు ఉన్నది. నేను అక్కడ నా అక్కచెల్లెళ్లను, మా అమ్మగారి అక్కచెల్లెళ్లను, ప్రేమార్ద్రహృదయురాలగు మా అమ్మగారి ని, మహర్షులచే నిర్వర్తించబడే ఉత్కృష్టమగు యజ్ఞమును, దానిలో నిల బెట్టబడే యూపమును, ఎగురవేయబడే ధ్వజమును కూడ చూచెదను సుమా!
పుట్టుక లేని ఓ భవా (అఖండసత్తా స్వరూపా)! సత్త్వరజస్తమోగు ణాత్మకము, అద్భుతము అగు ఈ జగత్తు నీచే నీ మాయాశక్తిచే నీయందు నిర్మించబడి నీయందే ప్రకాశించుచున్నది. కాని, నేను నీ తత్త్వమునెరుం గని దీనురాలనగు యువతిని. నేను పుట్టి పెరిగిన స్థానమును చూడగోరు చున్నాను.
ఓ శివా! నీకు పుట్టుక లేదు. కావున, బంధువియోగము నీకు తెలి యదు. ఇతరుల కొరకై విషమునైననూ భక్షించుటకు సిద్దపడే నీ దయాహృ దయమును నీ నల్లని కంఠము సూచించుచున్నది. ఆకాశము కేసి చూడుము. దేవతాస్త్రీలు దక్షునకు బంధువులు కాకున్ననూ, గొప్పగా అలంకరించుకుని భర్తలతో గూడి గుంపులుగా యజ్ఞమునకు వెళ్లుచున్నారు. వారు వెళ్లుచుండగా, రాజహంసలవలె తెల్లనైన వారి విమానములచే ఆకాశము. అలంకరించబడియున్నది.
దేవతోత్తముడవగు ఓ శివా! తండ్రిగారి ఇంటిలోని ఉత్సవమును గురించి విన్న తరువాత కూడ నా ఈ దేహము కదలకుండా ఇక్కడనే ఉండుట యెట్లు కుదురును? మిత్రుడు, భర్త, గురువు మరియు తల్లిదం డ్రులు అనువారల ఇళ్లకు జనులు ఆహ్వానము లేకున్ననూ వెళ్లేదరు.
ఓ దేవా! నాపై ప్రసన్నుడవు కమ్ము. నీవు దయాళుడవు. నా కోర్కెను నిశ్చయముగా నేరవేర్చుము. నీవు సర్వజ్ఞుడవు. నన్ను నీ అర్ధభా గములో స్థాపించియున్నావు. నేను నిన్ను కోరుచున్నాను. కావున, నన్ను అనుగ్రహించుము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ప్రియురాలగు పార్వతి యొక్క ఈ ప్రార్థనను విన్న శివునకు దక్ష ప్రజాపతి ఇతరప్రజాపతుల సమక్ష ములో పలికిన హృదయవిదారకములగు బాణములవంటి చెడు పలుకులు గుర్తుకు వచ్చేను. మంచి హృదయము గలవారలకు మేలు చేసే కైలాసాధి పతియగు ఆ శివుడు నవ్వి, ఆమెకు ఇట్లు సమాధానమునిచ్చెను.
ఓ సుందరీ! నీవు చెప్పిన మాట బాగుగనే యున్నది. బంధువుల ఇంటికి ఆహ్వానము లేకున్ననూ వెళ్లవచ్చును. కొందరు అనాత్మయగ దేహాదులయందు అభిమానము గలవారై, దర్పముచే మరియు క్రోధముచే దోషదృష్టిని కలిగి యుందురు. మన బంధువులు అట్టివారు కానప్పుడు మాత్రమే నీ అభిప్రాయము సరియగును. బంధువులు అట్టివారై యుండ గా, మనము ఆహ్వానము లేకుండగా వెళ్లరాదు.
చదువు, తపస్సు, సంపద, అందము, యౌవనము, కులము అను ఆరు గుణములు సత్పురుషులకు శోభనిచ్చును. కాని, ఇవే గుణములు పరమదుష్టులయందు ఉన్నచో, అవి వారి అహంకారమునే బలోపేతముగా చేసి, వారి వివేకజ్ఞానమును నశింపజేయును. అప్పుడు వారి ఆలోచించే విధానము దుష్టముగా తయారగును. అట్టి గర్విష్ఠులు మహాత్ముల గొప్పద నమును కనజాలరు.
అస్థిరమగు చిత్తము గల ఈ దక్షుడు మొదలగువారి ఇంటి దరిదా పులకైననూ, వీరు నా బంధువులు అనే భావముతో వెళ్లరాదు. ఏలయనగా, వీరు ఇంటికి వచ్చినవారిని వక్రబుద్దీతో కనుబొమలను పైకెత్తి కోపముతో నిండిన కన్నులతో కన్నులలోనికి చూచెదరు (అవమానించెదరు).
వక్రమగు బుద్ధిగల తన బంధువులే చెడ్డ మాటలు అనే బాణ ములతో హృదయమునందు కొట్టినప్పుడు, ఆ వ్యక్తి బాధాతప్తహృద యుడై రాత్రింబగళ్లు చాల దుఃఖముననుభవించును. శత్రువులచే బాణము లతో శిథిలము చేయబడిన అవయవములు గలవాడై మంచము మీద పడి యున్న వ్యక్తియైననూ మనస్సులో అంతటి దుఃఖముననుభవించడు.
ఓ సుందరీ పార్వతీ! దక్ష ప్రజాపతి ఉన్నతమైన స్థితి గలవాడు. ఆయనకు కుమార్తెలందరియందు ప్రీతి గలదు. నీయందు అధికమగు ప్రీతి గలదు. ఇది నిశ్చయము. ఈ విషయము నాకు కూడ తెలియును. కాని, నీకు తండ్రి ఈయదగిన మర్యాద (గౌరవము) లభించదు. ఏలయనగా, నీకు నేను భర్తనై యుండుట కారణముగా, దక్ష ప్రజాపతి చాల తాపమును అనుభవించుచున్నాడు.
దక్షుడు ద్వేషముతో నిండిన హృదయములో మిక్కిలి తాపమును పొందుచున్నాడు. ఆతని ఇంద్రియములు దుఃఖముచే కల్లోలితములగుచు న్నవి. సకలజీవుల బుద్దులకు సాక్షిగా ఉండే ఆత్మచైతన్యమునందు నిష్ఠ గల మహాత్ములు పొందే పరమపదము (మోక్షము) ను, ఆతడు తన వద్ద ఉండే లౌకికసంపదలతో తేలికగా పొందలేడు. ఈ అసమర్థత ఆతని ద్వేష మును, ఇనుమడింపజేసినది. కావున, ఆతడు అసురులు శ్రీహరిని ద్వేషించే విధముగా, కేవలము ద్వేషభావమును మాత్రమే మనస్సులో నింపుకొని యున్నాడు.
ఓ సుందరీ పార్వతీ! సమాజములోని జనులు ఒకరినొకరు కలిసిన ప్పుడు ఎదురేగి ప్రేమతో మాటలాడి నమస్కరించెదరు. మహాత్ములు ఈ క్రియలనన్నింటినీ మానసికముగా, సర్వాంతర్యామి పరమపురుషుడు అగు పరమేశ్వరుని విషయములో చక్కగా చేయుచునే యుందురు. కొని, మహా త్ములు దేహాభిమానులగు అజ్ఞానుల యెడల ఈ క్రియలను చేయరు.
రజస్తమోగుణముల సంపర్కము లేక కేవలసత్త్వగుణప్రధాన ముగా నుండుట వలన అంతఃకరణము శుద్దమగును. అట్టి పరిశుద్దమగు అంతఃకరణమునందు అవిద్యయొక్క ఆవరణము తొలగిపోయి, పరమేశ్వరుడు ఆత్మరూపముగా ప్రకాశించును. కావుననే, అట్టి అంతఃకరణమునకు వసుదేవ అని వ్యవహారము కలిగినది. అట్టి అంతఃకరణములో ప్రకాశించే భగవానుడు వాసుదేవుడైనాడు. ఆయన ఇంద్రియములకు గోచరము కాడు. ఇంద్రియములు ఉపసంహరించబడి (ఇంద్రియజ్ఞానము మిథ్యయని నిరాక రించబడి), మనస్సు తన స్వరూపమునందు విలీనము. కాగా ఆ ఈశ్వ రుడు ఆత్మరూపుడై గోచరించును. కావుననే, ఆయన అధోక్షజుడైనాడు. అట్టి పరమేశ్వరుని నేను నా అంతఃకరణమునందు నమస్కారాదులచే సేవించుచునే యుందును.
ఓ సుందరీ! కావున, దక్షుడు. నీకు దేహమునిచ్చిన తండ్రియే అయిననూ, ఆతడు నన్ను ద్వేషించుచున్నవాడు గనుక, నీవు వెళ్లి ఆతనిని గాని, ఆతని అనుయాయులను గాని చూడదగదు. నేను ప్రజాపతుల యజ్ఞ మునకు వెళ్లితిని. అక్కడ నేను ఆచరించిన దోషమేమియు లేదు. అయిన నూ, ఆతడు నన్ను చెడు మాటలతో అవమానించినాడు.
నీవు నా మాటను ఉల్లంఘించి వెళ్లినచో, నీకు అట్టి యాత్ర వలన కల్యాణము కలుగదు. సత్కారమును పొందే వ్యక్తికి తన వారి వలన పరాభ వము ఎదురైనచో, అది వెంటనే ఆ వ్యక్తియొక్క మరణమునకు హేతువు అగును.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో ఉమారుద్రసంవాదము అనే మూడవ అధ్యాయము ముగిసినది.
