శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

12 - ధ్రువోపాఖ్యానము - ధ్రువుడు పరమ పదమును పొందుట

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువునకు కోపము పోయిన దనియు, ఆతడు యక్షుల హింసను ఆపివేసినాడనియు తెలుసుకున్న పూజ్యుడగు కుబేరుడు అచటకు వచ్చెను. ఆయన వచ్చుచుండగా, చారణులు యక్షులు కిన్నరులు ఆయనను చక్కగా స్తుతించుచుండిరి. ఆయ నకు ధ్రువుడు చేతులు జోడించి నమస్కరించెను. అప్పుడాయన ధ్రువుని ఉద్దేశించి ఇట్లు పలికెను.

ఓయీ రాజకుమారా! నీవు పుణ్యాత్ముడవు. నేను నీ విషయ ములో చాల సంతోషించితిని. వైరభావమును విడిచి పెట్టుట చాల కష్టము. కానీ, నీవు తాతగారి ఆదేశముననుసరించి యక్షులయందలి వైరబుద్దిని విడిచిపెట్టితివి.

వాస్తవములో యక్షులను సంహరించినది నీవు కాదు. నీ తమ్ముని సంహరించినది యక్షులు కాదు. ఏలయనగా, సకలప్రాణుల జన్మమరణము లకు సమర్థమైనది కాలము మాత్రమే.

వ్యక్తి స్వప్నములో కానవచ్చే సర్వము తానే అయి ఉన్ననూ, ఒక దేహమునందు నేను అనే బుద్ది ఉండుటచే, ఇతరము అంతా తనకంటే భిన్నము అనే భావన కలుగును. కాని, ఈ భావన తప్పు స్వప్నములోని సర్వము స్వప్నద్రష్ట తానే అయి ఉన్నాడు. జాగ్రదవస్థలో కూడ వ్యక్తికి దేహమునందు నేను అనే భ్రాంతి ఉండుటచేతనే, నేను నీవు అనే భేదబుద్ధి కలుగుచున్నది. ఈ భేదబుద్ధి అజ్ఞానకృతము, అయథార్థము మాత్రమే. ఈ భేదబుద్ధి వలననే వ్యక్తికి కర్మబంధము మరియు సంసారదుఃఖము కలుగు చున్నవి,

ఓ ధ్రువా! వెళ్లుము. నీకు మంగళమగు గాక శ్రీహరి భగవానుడు ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాడు. కాని, ఆయనయే. మన ముందు సకలప్రాణుల రూపములోనున్నాడు. ఆయన పాదములను సేవిం చువారలకు సంసారము తొలగిపోవును. ఆయన సత్త్వరజస్తమోగుణాత్మక మగు మాయాశక్తి అనే ఉపాధిని స్వీకరించి జగత్తుయొక్క సృష్టిస్థితిలయ ములను చేయువాడే అయిననూ, ఆయన స్వరూపమునందు మాయాశ క్తితో సహా రెండవది ఏదీ లేదు. అట్టి శ్రీహరిని నీవు సంసారనివృత్తి కొరకైసేవించుము. సకలప్రాణులను ఆత్మరూపముగా దర్శించుము.

ఉత్తానపాదుని కుమారుడవగు ఓ రాజా! నీవు వరమునకు అర్హుడ వు. ఏలయన, నీవు పద్మనాభుని పాదపద్మములకు చాల దగ్గర భక్తుడవని మేము వినియుంటిమీ, కావున, నీవు శంకను పెట్టుకొనకుండగా యథే చ్ఛగా నీ మనస్సులోని వరమును నానుండి కోరుకొనుము.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువుడు గొప్ప భగవద్భ క్తుడు మరియు పెద్ద మనసు గలవాడు. ఆయనను రాజరాజగు కుబేరుడు వరమును కోరుకొమ్మని ప్రేరేపించెను. అపుడాయన తనకు విచలితము కాని శ్రీహరియొక్క స్మరణము ఉండవలెనని కోరెను. అట్లు శ్రీహరిని స్మరించువాడు, తరింప శక్యము కాని అజ్ఞానమును, తత్కృతమగు సంసా ర సముద్రమును తేలికగా తరించివేయును.

ఇడవిడాపుత్రుడగు కుబేరుడు తన మనస్సులో చాల సంతోషించి, ధ్రువునకు అఖండమగు హరీస్మరణము కలుగునట్లుగా వరమునిచ్చి, ఆతడు చూచుచుండగనే అంతర్ధానమయ్యెను. అపుడు ధ్రువుడు కూడ తన నగరమును చేరుకొనెను.

తరువాత ధ్రువుడు అధికమగు దక్షిణలు గల క్రతువులచే యజ్ఞేశ్వ రుడగు శ్రీహరిని ఆరాధించెను. పురోడాశాది ద్రవ్యము, ప్రయాజ మొద లగు కర్మాంగములు మరియు దేవతలతో కూడియున్న కర్మ శ్రీహరి రూపమే. అట్టి కర్మకు ఫలమునిచ్చువాడు కూడ శ్రీహరియే.

ఈ సర్వముయొక్క మౌలికస్వరూపమగు సత్త శ్రీహరియే. కాని, ఈ అన్ని ఉపాధులు ఆయనయందే ప్రకాశించుచున్ననూ, వాస్తవముగా ఈ ఉపాధులు ఆయనయందు లేవు. అట్టి అవినాశియగు శ్రీహరియందు ధ్రువుడు అఖండ చిత్తవృత్తి ప్రవాహమును నిలిపి భక్తిని చేసెను. ఆతడు తనయందు, సకలప్రాణులయందు అంతర్యామియై సర్వవ్యాపకుడగు శ్రీహరిని ఆత్మరూపముగా దర్శించెను.

ఈ విధముగా భక్తి ధ్రువుని స్వభావములో భాగమై పోయెను. ఆత నికి వేదవేత్తలయెడల ఆదరము, దీనుల యెడల ప్రేమ ఉండెడివి. ఆతడు ధర్మముయొక్క మర్యాదలను రక్షించెడివాడు. అట్టి ధ్రువుని ప్రజలు తమ తండ్రిగనే భావించిరి.

ధ్రువుడు రాజోచితములగు భోగములననుభవించుటచే ఆతని పుణ్యము ఖర్చు అయ్యెను. భోగములను విడిచి యజ్ఞాదులను చేయుటచే పాపము క్షయమయ్యెను. ఈ విధముగా ఆతడు భూమండలమును ముప్పది ఆరు వేల సంవత్సరములు శాసించెను.

ధ్రువుడు విచలితము కాని ఇంద్రియములు గల మహాత్ముడు. ఆయన ఈ విధముగా అనేకసంవత్సరముల కాలమును ధర్మార్థకామము లనే పురుషార్థముల సేవనములో గడిపి, రాజ్యాధికారమును పుత్రుడగు ఉత్కలునకు ఇచ్చెను.

మనకు కల వచ్చినప్పుడు దానిలోని పదార్థములన్నియు యథార్థ ములే యనిపించును. కాని, ఆ కల కేవలము మనస్సుచే కల్పితమై ఆత్మ చైతన్యముచే ప్రకాశించుచున్నది. మేఘముల గుంపులో ఏవేవో రూప ములు కానవచ్చును. ఆ రూపములు కేవలము మనస్సుయొక్క కల్పనలు మాత్రమే. కాని, ఆ కల్పిత రూపములను ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యమే. అదే విధముగా ఈ జగత్తు కూడ వాస్తవముగా ఆత్మచైతన్యమునందు లేకు న్ననూ, అజ్ఞానముచే ఉన్నట్లు కానవచ్చుచున్నది. ఈ సత్యమును ధ్రువుడు తెలుసుకున్నాడు.

దేహము, భార్య, సంతానము, మిత్రులు, సైన్యము, సంపదలతో నిండియున్న ఖజానా, అంతఃపురము, చుట్టూ సుందరమైన విహారోద్యాన ములు, సముద్రతీరము వరకు వ్యాపించిన సామ్రాజ్యము అనే ఈ సర్వము కాలముచే కబళించివేయబడును అని ఆ ధ్రువుడు దర్శించి, బదరికాశ్రమ మును చేరుకోనెను.

ఆ ధ్రువుడు బదరియందు పవిత్రజలములలో స్నానమును చేసి పరిశుద్దమగు ఇంద్రియములు, మనస్సు గలవాడై (యమ నియమములు), ఆసనమును బిగించి కూర్చుండెను. అపుడాయన. ప్రాణాయామమును చేసి, మనస్సుచే ఇంద్రియములను ప్రత్యాహారము చేసి, భగవంతుని స్థూలమగు విరాడ్రూపమునందు మనస్సును ధారణ చేసెను. ఆ రూప మునే ఏకాగ్రముగా ధ్యానిస్తూ, ధ్యాత-ధ్యేయము అనే భేదమునకు అతీత మైన నిర్వికల్ప సమాధిని పొంది, ఆ రూపమును కూడ విడిచి పెట్టెను.

ధ్రువుడు శ్రీహరి భగవానునియందు అఖండమగు భక్తి గలవాడై కనుల వెంబడి ఆనందబాష్పముల ప్రవాహము స్రవించుచుండగా పలు మార్లు పరవశుడగుచుండెను. భక్తిభావముచే విశేషముగా ద్రవించుచున్న హృదయము గల ఆతని అవయవములన్నియు రోమాంచముచే వ్యాప్తమ గుచుండెను. శరీరాభిమానమును విడిచి పెట్టిన ఆ ధ్రువునకు తాను ధ్రువుడ ననే స్మరణము కూడ లేకుండెను.

ఆ ధ్రువునకు ఆకాశమునుండి దిగుతున్న ఒక గొప్ప విమానము కనబడెను. అది ఉదయించిన పూర్ణచంద్రుని వలె పది దిక్కులను విశేష ముగా ప్రకాశింపజేయుచుండెను.

విమానమును చూచిన ధ్రువునకు వెంటనే ఇద్దరు గొప్ప దేవతా మూర్తులు కనబడిరి. నాలుగు చేతులు గల వారిద్దరు నీలవర్ణముతో శోభిల్లి రి. గదను పట్టుకొని నిలబడియున్న వారిద్దరి కన్నులు పద్మములవలె ఎర్రగా ప్రకాశించెను. వారిద్దరు మంచి వస్త్రములను, కిరీటమును, హారమును, భుజకీర్తులను, అందమగు కుండలములను ధరించి యుండిరి.

వారిద్దరు పవిత్రమగు కీర్తిగల శ్రీహరి అనుచరులని ధ్రువుడు గుర్తు పట్టెను. వెంటనే ఆయన లేచి నిలబడి, వారు శ్రీహరి అనుచరులలో ముఖ్యులైన కారణముగా చాల కంగారు పడినవాడై, అతిథులను పూజించే పద్ధతిని విస్మరించినాడు. ఆయన కేవలము మధువైరియగు శ్రీహరి నామ ములను కీర్తిస్తూ, దోసిలి ఒగ్గి వారికి నమస్కారమును మాత్రమే చేసెను.

ధ్రువుని మనస్సు శ్రీకృష్ణుని పాదములయందు దృఢముగా నిలిచి యుండెను. ఆతడు చేతులను జోడించి వినయముతో తలను వంచి నిలబడెను. సునందనందులనే వారిద్దరు పద్మనాభుని అనుచరులలో శ్రేష్ఠులుగా ప్రసిద్ధిని గాంచినవారు. వారు చిరునవ్వుతో ఆతనిని ఉద్దేశించి ఇట్లు పలికిరి.

సునంద నందులిట్లు పలికిరి --- ఓ రాజా! మా మాటను సావధా నముగా వినుము. నీవు అయిదు సంవత్సరముల వయస్సులోనున్నప్పుడే తపస్సును చేసి శ్రీహరి దేవుని సంతోష పెట్టితివి.

  మేమిద్దరము సకలజగత్తునకు తండ్రి, శార్ జ్ఞము అనే ధనస్సును ధరించువాడు అగు శ్రీహరిదేవుని అనుచరులము. మేము నిన్ను శ్రీహరి భగవానుని ధామమునకు గొనిపోవుటకై ఇచటకు వచ్చియుంటిమి.

విష్ణుధామమును జయించుట చాల కఠినము. కాని, నీవు దానిని జయించితివి (పుణ్యముచే సంపాదించితివి). దానిని సప్తర్షులు సైతము చేరుకొనలేక, కేవలము దూరమునుండి చూచుచుందురు. దాని చుట్టూ సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, నక్షత్రములు, తారకలు మొదలగునవి ప్రదక్షిణముగా తిరుగుచుండును. దానిని నీవు ఇప్పుడు అధిష్ఠించుము.

ఓ ధ్రువా! లోకములకు నమస్కరించదగిన శ్రీహరియొక్క ధామ మును ఇదివరలో నీ తండ్రితాతలు గాని, ఇతరులు గాని ఎవరైననూ పొంది యుండలేదు. వేదములలో ప్రసిద్ధమైన సర్వోత్కృష్టమైన అట్టి శ్రీహరి ధామమును నీవు అధిష్టించుము.

ఓ ఆయుష్మంతుడా! పవిత్రమగు కీర్తి గలవారిలో అగ్రేసరుడగు శ్రీహరి ఈ గొప్ప విమానమును పంపినాడు. నీవు దీనిని అధిరోహించుటకు అర్హుడవు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువునకు శ్రీహరి ప్రియు డు, శ్రీహరికి ధ్రువుడు ప్రియుడు. వైకుంఠవాసియగు శ్రీహరియొక్క అను చరులు ఇద్దరు పలికిన ఆ తేనెలొలికే పలుకులను విన్న ధ్రువుడు స్నాన మునాచరించి, సంధ్యావందనాది నిత్యకర్మలను పూర్తి చేసుకొని, మంగళాలంకారములను ధరించి, అక్కడి మహర్షులకు నమస్కరించి, వారి ఆశీర్వ చనములను తీసుకొనెను.

ధ్రువుడు ఆ గొప్ప విమానమును చక్కగా పూజించి ప్రదక్షిణ మును చేసెను. తరువాత ఆ శ్రీహరి అనుచరులకు నమస్కరించెను. అపు డాయన తేజోమయమగు రూపమును దాల్చినవాడై విమానమును అధి ష్ఠించుటకు సంసిద్ధుడాయెను. .

అప్పుడు అచటకు కాలము (మృత్యువు) రూపమును దాల్చి విచ్చే సెను. ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు ఆ మృత్యువును చూచి, దాని తలపై కాలిని పెట్టి, ఆ అద్భుతమగు విమానమునెక్కెను.

అప్పుడు భేరీలు, మద్దెళ్లు, తప్పెట్లు మొదలగునవి మ్రోగినవి. గంధర్వులలో ముఖ్యులగు తుంబురుడు మొదలగువారు గొప్పగా పాడిరి. పూల వానలు కురిసినవి.

స్వర్గలోకమును అధిరోహించబోయే ముందు ధ్రువునకు తల్లి సునీతి గుర్తుకు వచ్చెను. దీనురాలగు తల్లిని విడిచి పెట్టి పొంద శక్యము కాని స్వర్గలోకమునకు వెళ్లిపోవుచున్నానే అని ఆయన తలపోసెను.

ధ్రువుని ఈ మనోభావము దేవతోత్తములగు నందసునందులకు తెలిసిపోయేను. వారాయనకు దేవమార్గములో దేవవిమానముపై వెళ్లు చున్న సునీతీదేవిని చూపించిరి.

మార్గములో అక్కడక్కడ విమానములలోని దేవతలు ధ్రువునిపై పువ్వులను చల్లుతూ కొనియాడు చుండిరి. ఆయన వరుసగా గ్రహములను చూచెను.

తరువాత ధ్రువుడు ఆ దేవవిమానముపై దేవలోకమార్గములో నిశ్చలముగా పయనించి, ముల్లోకములను సప్తర్షిమండలమును కూడ దాటి, ఆ పైన ఉండే శ్రీహరి ధామమును సుఖముగా చేరుకొనెను. ఈ విధ ముగా ధ్రువుడు శాశ్వతమగు స్థానమును పొందెను.

ఆ శ్రీహరి ధామము స్వయంప్రకాశము. అది అంతటా తనంత తానుగా ప్రకాశించుచుండగా, ఈ ముల్లోకములు దాని ప్రకాశములో మాత్రమే ప్రకాశించుచున్నవి. ప్రాణులయందు దయను చూపి మంగళకార్యములను చేసే పుణ్యాత్ములు మాత్రమే ఆ లోకమును పొందగల్గుదురు. ప్రాణులయందు దయ లేని క్రూరచిత్తులు అచటకు చేరలేరు.

ప్రసన్నమగు చిత్తము గలవారై సర్వమునందు పరబ్రహ్మను దర్శించే పరిశుద్దాంతఃకరణులగు జనులు సకలప్రాణులను సంతోష పెట్టెద రు. వీరికి శ్రీహరి మరియు శ్రీహరి భక్తులు మాత్రమే ప్రియబంధువులు. ఇట్టివారు శ్రీహరికి ప్రియబంధువులగుదురు. వీరు శాశ్వతమగు ఆ శ్రీహరి ధామమును తేలికగా పొందేదరు.

ఈ విధముగా ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు పవిత్రమగు అంతఃకరణము గలవాడై శ్రీకృష్ణునియందు అనన్యమగు భక్తిని చేసి, ముల్లోకములకు తలమానికము వంటివాడయ్యెను.

కురువంశీయుడవగు ఓ విదురా! ధాన్యపు కుప్పలను నూర్చున ప్పుడు మైదానమునకు మధ్యలో పాతబడిన రాటకు కట్టబడి దాని చుట్టూ ఎద్దుల గుంపు గంభీరమగు వేగముతో తిరుగుచుండును. అదే విధముగా జ్యోతిర్మండల చక్రము అలుపునేరుగని గంభీరమగు వేగముతో ధ్రువలోకమునకు కట్టుబడియున్నదై, దాని చుట్టూ తిరుగుచుండును.

పూజ్యుడగు నారద మహర్షి ధ్రువునియొక్క ఈ గొప్పదనమును చూచి, ప్రచేతసరాజుల సత్రయాగములో వీణను వాయిస్తూ, కొన్ని శ్లోకము లను పాడెను.

నారదుడిట్లు పలికెను --- భర్తయే దైవముగా గల సునీతియొక్క పుత్రుడగు ధ్రువుడు తపస్సుయొక్క మహిమచే ఇట్టి ఫలమును పొందెను. వేదవేత్తలగు మహర్షులు కూడ ఈ విషయమును చూచి, ధ్రువుడు అను ష్ఠించిన అంతరంగ సాధనములను అనుష్ఠించుటలో సమర్థులు కాకుండిరి. కావుననే, వారు అట్టి మహాఫలమును పొందకుండిరి. ఇక రాజులు ట్టి ఫలమును పొందలేకున్నారని వేరుగా చెప్పవలయునా?

ధ్రువుడు అయిదు సంవత్సరముల వయస్సులో ఉండగా సవతి తల్లి పలికిన ఈటెలవంటి మాటలచే హృదయమునకు చాల పీడ కలిగి డ వికి వెళ్లిపోయెను. అచట ఆతడు నా ఆదేశమును పోలించి తపస్సును - చేసెను. శ్రీహరిని ఆరాధించి వశపరచుకొనుట చాల కష్టము. అయిననూ, ఆయన తన భక్తుల సద్గుణములకు లొంగిపోవును. అట్టి శ్రీహరిని ధ్రువుడు తన వశము చేసుకొనెను.

ఈ లోకములో క్షత్రియులు ఎంతటి గొప్పవారైనా ధ్రువునికంటే తక్కువయే. వారెవరైనా ధ్రువుడు అధిష్ఠించిన ధామమును అనేక సంవత్స రములు తపస్సు చేసియైననూ అధిష్టించ గల్గుదురా? అట్లు కోరుటకై ననూ వారికి తాహతు చాలదు. ధ్రువుడు అయిదారేళ్ల వయస్సులోనే కొద్ది రోజులలో బుద్దిగుహయందు నివసించే శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొని ఆ ధామమును చేరుకొనినాడు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- నీవు నన్ను ఇప్పుడు ఇక్కడ గొప్ప కీర్తి గల ధ్రువుని వృత్తాంతమునంతను చెప్పమని కోరితివి. సత్పురు షులకు మిక్కిలి ప్రియమగు ఈ చరితమును నేను నీకు చెప్పితిని. దీనిని సత్పురుషులు చాల ప్రశంసించెదరు.

ఈ గొప్ప చరితము సంపదను, కీర్తిని, ఆయుర్దాయమును ఇచ్చు. ను. పవిత్రమైన ఈ చరితము మంగళములకు నిధానము. కొనియాడదగిన ఈ చరితము భక్తులకు స్వర్గమును, ధ్రువపదమును, దేవత్వమును ఇచ్చు ను. ఇది పాపములను కడిగివేసి మనస్సునకు ప్రసన్నతను కలిగించును.

ధ్రువుడు శ్రీహరికి చాల ప్రీతిపాత్రుడు. ధ్రువునకు శ్రీహరియందు ప్రీతి మెండు. ఆయన వృత్తాంతమును పలుమార్లు శ్రద్ధతో విన్నవారికి ఆ శ్రీహరి భగవానునియందు భక్తి కుదురును. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే అయిదు చిత్త క్లేశములు అట్టి భక్తి వలన తొలగిపోవును.

ఈ వృత్తాంతమును శ్రవణము చేయువారలకు గొప్పదనము గాని, బ్రహ్మవర్చస్సు గాని, దేనిని కోరితే అది లభించును. సచ్చీలము మొదలగు గుణములు కలుగును. మరియు మానమర్యాదలు గలవారికి సమ్మానము లభించును.

పవిత్రమగు కీర్తి గల ధ్రువుని గొప్ప వృత్తాంతమును వైదికసంస్కా రవంతుల సభలో వక్త ఏకాగ్రచిత్తము గలవాడై ఉదయ సాయంకాలముల యందు కీర్తించవలెను.

పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, శ్రవణ నక్షత్రము ఉన్న దినము, తిధి ఆరంభమై పూర్తి అయ్యే దినము, సంక్రాంతి, ఆదివారము, రథసప్తమి అనే దినములలో వీలును బట్టి ఈ గాథను కీర్తించవలెను.

శ్రీహరి పాదములనుండి గంగ పుట్టినది. అట్టి పాదములను శరణు జొచ్చిన భక్తుడు ప్రతిఫలాపేక్ష లేనివాడై ఈ వృత్తాంతమును శ్రద్ధాళువు లకు వినిపించవలెను. అట్లు చేయుట వలన వానికి తనలో తనకు సంతో షము లభించును. దాని వలన ఆతడు ఆత్మనిష్ఠను పొంది కృతార్థుడగును.

సత్యమార్గములో యథార్థ జ్ఞానము లేని వ్యక్తికి ఎపడైతే ఈ జ్ఞానము అనే అమృతమును ఇచ్చునో, వాడే దీనులనుద్ధరించే దయామ యుడు. అట్టివానిని దేవతలు అనుగ్రహించెదరు.

 కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! ధ్రువుని పరమపవిత్రమగు చరితము లోకములో ప్రసిద్దీని గాంచినది. ధ్రువుడు పిల్లవాడుగా నుండగనే ఆటవస్తువులను, తల్లి గృహమును కూడ విడిచి పెట్టి, శ్రీహరిని శరణు జొచ్చినాడు. ఆ వృత్తాంతమును నేను నీకు చెప్పితిని.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో ధ్రువోపాఖ్యానములో ధ్రువుడు పరమపదమును పొందుటఅనే పన్నెండవ అధ్యాయము ముగిసినది.