శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
6 - దేవతలు శివుని ప్రసన్నుని చేసుకొనుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- అప్పుడు రుద్రుని సేనలు దేవగణములను, ఋత్విక్కులను, సభాసదులను, శూలములు అడ్డకత్తులు కత్తులు గదలు ఇనుపగుదియలు మరియు సమ్మెటలు అనే ఆయుధములతో గట్టిగా కొట్టిరి. వారి అవయవములన్నియు బాగా ఛిన్నాభిన్నములా యెను. వారు భయముచే కంగారు పడిపోయి, స్వయంభువుడగు బ్రహ్మగారి వద్దకు వెళ్లిరి. వారాయనకు నమస్కరించి, జరిగిన వృత్తాంతమును విన్నవించిరి.
పద్మసంభవుడగు బ్రహ్మ భగవానునకు, జగత్తునకు అధిష్టానమైయున్న నారాయణునకు దక్షుని యజ్ఞముయొక్క ఈ పరిస్థితి ముందే తెలియును. కావుననే, వారా యజ్ఞమునకు వెళ్లలేదు.
బ్రహ్మప్రభుడు ఆ మాటను విని ఇట్లు పలికెను: శివుడు గొప్ప తేజశ్శాలి. దక్షుడు కూడ స్వయముగా తేజశ్శాలియే అయిననూ, తేజశ్శాలి యగు శివుని విషయములో అపరాధము చేసినాడు. అపరాధము చేసిన మహాత్ముల యెడల కూడ అపరాధమును చేయరాదు. అపరాధమునెరుంగని శివుని యెడల ఆతడు అపరాధమును చేసినాడు. అట్టి దక్షుడు, ఆతనిఅనుయాయులు తమకు క్షేమము కలుగవలెనని కోరుకున్ననూ, క్షేమము కలుగుట సంభవము కాదు.
యజ్ఞములో భాగమును పొందియున్న శివుని మీరు యజ్ఞభాగము నుండి బహిష్కరించి, ఆయన విషయములో అపరాధమును చేసియున్నారు. అయినప్పటికీ, పరిశుద్దమగు అంతఃకరణముతో పద్మములవంటి ఆయన పాదములను గట్టిగా పట్టుకొనుడు. ఆయన తొందరగా ప్రసన్నుడగును. శివుని ఆ విధముగా ప్రసన్నుని చేసుకొనుడు.
దక్షుని యజ్ఞము పునరుజ్జీవనమును పొందవలెనని మీరు కోరుచున్నారా? అయైనచో, వెంటనే వెళ్లి శివప్రభునకు క్షమార్పణను చెప్పుడు. ఆయనకు ప్రియురాలగు సతీదేవితో వియోగము కలిగినది. ఆయన హృదయము చేడు పలుకులతో గాయపడినది. ఆయనకు కోపము వచ్చినచో, లోకపాలకులతో సహా జగత్తు వినాశమును చెందును.
శివుడు సర్వస్వతంత్రుడు. ఆయన యథార్థస్వరూపమును గాని, ఆయన బలపరాక్రమములు ఇంతటివి అని గాని, నాకు తెలియదు; ఇంద్రు నకు, విష్ణువునకు, మీకు, మహర్షులకు కూడ తెలియదు; దేహధారులగు ప్రాణుల కేవ్వరికైననూ తెలియదు. ఆయనకే కోపము వచ్చినచో, ఆ కోప మును తగ్గించే ఉపాయమును చేయుటకు ఎవరు ముందుకు రాగలరు?
స్వయంభువుడగు ఆ బ్రహ్మగారు ఆ దేవతలనీ విధముగా ఆదేశించీ, తన రోమమునుండి కైలాసమునకు వెళ్లెను. ఆ దేవతలు, ప్రజాపతులు. మరియు పితృదేవతలు కూడ ఆయనకు తోడుగా వెళ్లిరి. త్రిపురాసురసంహారకుడగు శివప్రభునకు పర్వతములలో ఉత్తమమగు కైలాసము చాల ప్రీతికరమైన నివాసస్థానము.
సిద్దుల కులమునందు పుట్టుట, ఓషధులు, తపస్సు, మంత్రము మరియు యోగము అనే అయిదు పద్దతులలో ఏదో ఒకదానియందు సిద్దులైన దేవతలు కైలాసమును సేవించెదరు. అచట అన్ని కాలములలో గంధర్వులు, కిన్నరులు మరియు అప్సరసలు ఉండెదరు.
కైలాసపర్వతముయొక్క శిఖరములు అనేకవిధముల మణులతో దట్టముగా
నిండియున్నవి. గైరికము మొదలగు ధాతువుల వలన ఎన్నో రంగులతో ప్రకాశించే ఆ శిఖరములపై అనేకవిధములైన చెట్లు, తీగలు, పొదలు గలవు. ఆ శిఖరములపై అనేకవిధములైన జంతువులు గుంపులు గుంపులుగా తిరుగాడుచుండును. ఆ శిఖరములపైనుండి జారిపడే కొండ , కాలువలలోని నీరు స్వచ్చముగా నుండును. అనేకవిధములైన గుహలతో మరియు కొండచరియలతో ఒప్పారే ఆ శిఖరములయందు సిద్ధపురుషుల భార్యలు తమ భర్తలతో గూడి విహరించుచుందురు. వారికా శిఖరముల శోభ ఉల్లాసమును కలిగించును.
కైలాస పర్వతము అంతటా నెమళ్ల కూతలతో ప్రతిధ్వనించుచుండెను. తేనెను త్రాగి మత్తెక్కి కళ్లు మూసుకుపోయిన తుమ్మెదలు ఇటునటు వేగముగా తిరుగుతూ ఝంకారమును చేయుచుండెను. కోకిలలు కుహూ రావములను చేయుచుండెను. వివిధములగు పక్షుల కూతలతో ఆ శిఖర ములు ధ్వనించుచుండెను. అట్టి కైలాసమునకు బ్రహ్మగారు వెళ్లిరి.
పక్షులకు చిగుళ్లను, పళ్లను అందించే చెట్లతో (కల్పవృక్షములతో) ఆ పర్వతము చేతులను పైకెత్తి పక్షులనే అతిథులను ఆహ్వానించుచున్నట్లు ఉండెను. ఏనుగులు తిరుగాడుచుండగా, వాటి కదలిక పర్వతమే కదులుచు న్నదా యన్నట్లు ఉండెను. ఆ పర్వతము కొండ కాలువల కలకల ధ్వను లతో మాటలాడుచున్నదా యన్నట్లు ఉండెను.
కల్పవృక్షములు, పారిజాత వృక్షములు, తెల్లతెగడ, ఉలిమిరి చెట్లు, శాలవృక్షములు, తాడి చెట్లు, రక్తకాంచన వృక్షములు, వేగిస, ఏరు మద్ది చెట్లతో ఆ కైలాసము. ప్రకాశించుచుండెను.
మామిడి, కడిమి, మంకెన, పొన్న, సురపొన్న, సంపెంగ, కలిగో ట్టు, కంకేళి, పొగడ, గన్నేరు మరియు ఎర్రగోరంట్ల చెట్లతో ఆ కైలాసము ప్రకాశించుచుండెను.
కైలాసము బంగరు వన్నెల వందరేకుల పద్మములతో, గన్నేరు ఏలకులు జాజి మల్లె తీగలతో, ఉత్తరేణి మొక్కలతో, పూవుల గురివెంద చెట్లతో సుందరముగా నుండెను.
పనస, మేడి, రావి, జువ్వి, మర్రి, ఇంగువ, బుజపత్తిరి, పోక, నేరేడు చెట్లతో, మరియు రాజపూగ వృక్షములతో కైలాసము ప్రకాశించు చుండెను. ఒకే కాపుతో అంతమయ్యే అరటి మొదలగు చెట్లు కూడ అక్కడ గలవు.
ఖర్జూరము, అంబాళము, మామిడి, మోరటి, ఇప్ప, గార చెట్లతో మాత్రమే గాక, ఇతరవృక్షజాతులతో, మరియు వేదురు సన్నవెదురు పొదలతో కైలాసము ప్రకాశించెను.
కైలాసమునందలి సరస్సులలో తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలువలు, తామర పువ్వులు గుంపులు గుంపులుగా ప్రకాశించుచుండె ను. ఆ సరస్సులలో పక్షులు గుంపులు చేరి మధురముగా కూయుచుండగా, అచ్చోటు చాల సుందరముగా నుండెను.
కైలాసపర్వతమునందు లేళ్లు, కోతులు, అడవి పందులు, సింహములు, ఎలుగు బంట్లు, ముళ్ల పందులు, గురుపోతులు, శరభమృగములు, పెద్ద పులులు, నల్లచారల దుప్పిలు, అడవి దున్నలు, గోకర్ణ మృగములు, కర్ణాంత్ర మృగములు, గుర్రపు ముఖము గల మృగములు, తోడేళ్లు, కస్తూరి మృగములు మొదలగు జంతువులు సంచరించుచుండును. అక్కడి నదులకు, సరస్సులకు తీరములపై అరటి చెట్లు దట్టముగా ఆవరించి చాల శోభను చేగూర్చును.
సతీదేవి స్నానము చేయుటచే మిక్కిలి పవిత్రము చేయబడిన నీరు గల నందా నది కైలాసము చుట్టూ ప్రవహించుచుండును. సకలప్రా ణులకు నాథుడగు శివుని నివాసమగు ఆ పర్వతమును చూచి, దేవతలు ఆశ్చర్యమును పొందిరి.
వారు ఆ కైలాసమునందు అలకాపురము అని ప్రసిద్ధిని గాంచిన నగరమును, సౌగంధికమనే వనమును చూచిరి. ఆ అడవిలోని పద్మము లకు సౌగంధికములు అని పేరు.
నంద, అలకనంద అనే రెండు నదులు అలకాపురమునకు బయట ప్రవహించుచున్నవి. పావనము చేయు పాదములుగల శివుని పాదపద్మముల ధూళిచే ఆ నదులు మిక్కిలి పవిత్రములు అయినవి.
ఓ విదురా! దేవతాస్త్రీలు దేవభోగములచే అలసి సొలసినప్పుడు దేవలోకమునుండి క్రిందకు దిగి వచ్చి, ఆ రెండు నదులలో ఈదులాడుతూ, తమ భర్తలపై నీళ్లను చల్లుచూ, విహరించెదరు.
దేవతాస్త్రీలు ఆ నదులలో జలకములాడినప్పుడు వారు కొత్తగా పెట్టుకున్న కుంకుమ కరిగిపోవుట వలన ఆ నీరు పచ్చగా నగును. అట్టి ఆ నీటిని మగ ఏనుగులు దాహము లేకున్ననూ, సుగంధముచే ఆకర్షింపబడి, ఆడ ఏనుగులకు త్రాగించి, తాము కూడ త్రాగుచుండును.
అలకానగరముపై ఆకాశములో వందలాది విమానములు రద్దీగా తిరుగుచుండును. ఆ విమానములు ముత్యములతో, బంగారముతో మరియు గొప్ప రత్నములతో నిండియుండును. వాటిలో యక్షస్త్రీలు విహ రించుచుందురు. ఈ విధముగా, అలకాపురిలోని ఆకాశము, మెరుపులతో (యక్షస్త్రీలకు పోలిక), మేఘములతో (విమానములకు పోలిక) నిండిన ఆకాశము వలె శోభిల్లుచుండును.
దేవతలు యక్షరాజగు కుబేరుని నగరమగు అలకాపురిని దాటి సౌగంధిక వనమును చేరుకొనిరి. ఆ వనము కోరికలనీడేర్చే కల్పవృక్షము లతో మనోహరముగా నుండెను. ఆ వృక్షములు రంగు రంగుల పుష్పము లతో, పండ్లతో మరియు చిగుళ్లతో ప్రకాశించుచుండెను.
ఆ వనములో కోకిల గుంపుల కూతలు తుమ్మెదల ఝంకారము లకు తోడైనవి. రాజహంసలకు మిక్కిలి ప్రీతికరమైన పద్మములతో సర స్సులు. నిండియుండెను.
ఆ వనములో హరిచందన వృక్షములు గలవు. అడవి యేనుగులు దురదను తీర్చుకొనుటకై ఆ చెట్లకు తమ దేహములతో రాపిడి చేయగా, బెరడు బయట పడి, ఆ వృక్షముల మీదుగా వీచే గాలులు ఆ సుగంధ ముతో నిండియున్నవి. అట్టి పరిమళభరితములగు గాలులు యక్షస్త్రీల మనస్సులను పదే పదే అధికమగు క్షోభకు గురి చేయుచున్నవి.
ఆ వనములోని దిగుడు బావుల మెట్లు వైదూర్యమాణిక్యములతో పొదగబడి యున్నవి. ఆ బావులు నల్ల కలువల వరుసలతో శోభిల్లినవి.వారా బావులను, అక్కడ విహరించే కింపురుషులను చూచి, దగ్గరలో ఒక మర్రి చెట్టును చూచిరి.
ఆ చెట్టు వంద యోజనముల యెత్తు ఉండెను. దాని కొమ్మలు డెబ్బది అయిదు యోజనముల పొడవు కలిగియుండెను. దాని క్రింద అన్ని వైపులా ఉండే నీడ ఎప్పటికీ తొలగిపోదు. దానిపై పక్షి గూళ్లు లేవు. దాని క్రింద తొషము ఉండదు.
ఆ చెట్టు అణిమ మొదలగు గొప్ప సిద్దులకు నిలయము. దాని వద్ద సనకాది యోగిపుంగవులు తరచు కానవచ్చెదరు. మోక్షమును కోరు సాధకులు ఆ వృక్షమును ఆశ్రయించెదరు. దాని వద్ద కూర్చుండియున్న శివుడు దేవతలకు- కానవచ్చెను. ఆయన కోపమును వీడిన యముని వలె, నుండెను.
రాగద్వేషములు లేని సనక సనందనాది మహాసిద్దులు పరమశాం తస్వరూపుడగు ఆ శివుని ఉపాసించుచుండిరి. యక్షరాక్షసప్రభువు, శివు నకు మిత్రుడు అగు కుబేరుడు కూడ ఆయనను సేవించుచుండెను.
జగన్నాథుడగు శివుడు సాధకులకు మార్గదర్శనమును చేయుటకై ఉపాసన, చిత్తేకాగ్రత మరియు అష్టాంగయోగము అనే సాధనములను అనుష్ఠించుచుండును. జగత్తునకు హితకారి, మిత్రుడు అగు ఆయన ప్రేమ స్వరూపుడగుటచే, లోకములకు కల్యాణమును చేయుచుండును.
శివుని శరీరము సంధ్యాకాలమునందలి మేఘము వలె ఎర్రగా ప్రకాశించుచుండెను. ఆయన భస్మను, దండమును, జటలను, మృగచర్మమును ధరించియుండెను. ఈ చిహ్నములు తపశ్శాలురకు ప్రియమైనవి ఆయన శిరస్సు పై చంద్రవంకను కూడ దాల్చియుండెను.
శివుడు దర్భాసనముపై కూర్చుండి, తనను ప్రశ్నించిన నారదు నకు కాలాతీతమగు పరబ్రహ్మతత్త్వమును ఉపదేశించుచుండెను, సనకాది మహాత్ములు ఆ ఉపదేశమును వినుచుండిరి.
ఆయన కుడితొడపై పద్మమువంటి ఎడమపాదమును పెట్టి (వీరా సనము), ఎడమచేతిలో జపమాలను పట్టుకొని, దానిని ఎడమ మోకాలిపై ఆన్చి, కుడిచేతితో జ్ఞానముద్ర (బొటనవ్రేలితో చూపుడు వ్రేలును కలిపి, మిగిలిన మూడు వేళ్లను నిటారుగా నుంచుట) పట్టి కూర్చుండెను.
శివుడు యోగపట్టమును గట్టిగా దగ్గరకు లాగి కట్టుకొని మనస్సును బ్రహ్మానందమునందు స్థిరముగా లగ్నము చేసి కూర్చుండెను; ఆత్మనిష్ఠులగు వారీలో ఆయన అగ్రగణ్యుడు. ఆ కైలాసపతిని చూచి, లోకపాలకులు, మహర్షులు చేతులను జోడించి నమస్కరించిరి.
శివుని పాదపద్మములకు దేవప్రభువులు , మరియు రాక్షసప్రభువులు కూడ నమస్కరించుచుందురు. శ్రీమహావిష్ణువు పూజనీయులలో సర్వశ్రేష్ఠుడే అయినా, (వామనావతారములో) కశ్యప ప్రజాపతికి నమస్కరించును. అదే విధముగా శివుడు కూడ, తన వద్దకు వచ్చిన స్వయంభువుడగు బ్రహ్మగారిని చూచి, లేచి నిలబడి, తల వంచి నమస్కరించెను.
అదే విధముగా, శివుని అనుయాయులు, శివునకు నలువైపులా ఉన్న సిద్ధగణములు, మహర్షులు కూడ బ్రహ్మగారికి నమస్కరించిరి.(శివుడు కంఠమునందు నీలవర్ణమును, దేహమంతటా ఎర్రని రంగును కలిగి యుండును). సర్వులు శివునకు నమస్కరించిరి. శివుడు చంద్రవంకయే శిరోభూషణముగా గలవాడై ప్రకాశించుచుండెను. . స్వయంభువుడగు బ్రహ్మగారు అప్పుడు చిరునవ్వుతో, తనకు నమస్కారమును చేసిన ఆ శివుని ఉద్దేశించి ఇట్లు పలికెను.
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- నీవు సర్వజగన్నాథుడవు. జగత్తు పుట్టుటకు ఉపాదానము మాయాశక్తి కాగా, నిమిత్తము శివుడగుచున్నాడు. ప్రకృతి పురుషుల కలయిక చేతనే జగత్తు ఉద్భవించుచున్నది. ఈ విధ ముగా జగత్తునకు శక్తి, శివుడు తల్లిదండ్రులగుచున్నారు. అట్టి శివశక్తులకు అతీతమైనట్టియు, రెండవది లేనట్టియు, వేదాంతములలో ప్రసిద్ధమైన ఏకర సమగు పరబ్రహ్మ యేది గలదో, అది నీవేనని నాకు తెలియును.
ఓ భగవానుడా ! నీవే శివశక్తుల రూపములో ప్రకటమై ఆ రూపములలో క్రీడించుచున్నావు. శివశక్తులు నీయందు అభేదమును పొందుచున్నారు. ఈ జగత్కార్యములు నీకు లీల మాత్రమే. సాలెపురుగు గూడును తన నుండియే ప్రకటము చేసి, మరల తనలోనే విలీనము చేసుకొనును. అదే విధముగా, నీవు కూడ నీనుండియే ఈ జగత్తును వెలయింపజేసి, దానికి స్థితికాలములో ఉనికిని చైతన్యప్రకాశమును అనుగ్రహించి, మరల నీ లోనికి ఉపసంహరించుకొనుచున్నావు.
ధర్మార్థకామములనే పురుషార్థములను వేదము జనులకు అనుగ్ర హించుచున్నది. అట్టి వేదమును రక్షించుట కొరకై నీవు దక్షుని నిమిత్త ముగా చేసి, యజ్ఞమును ప్రవర్తిల్ల జేసినావు. ఈ లోకములో ధర్మము యొక్క మర్యాదలను నిలబెట్టేది నీవే. ఆ మర్యాదలనే నియమనిష్ఠ గల వేదవేత్తలు శ్రద్ధతో అనుష్ఠించుచున్నారు.
మంగళమయుడవగు ఓ శివా! లోకములో మంగళకర్మలను సకామముగా చేయువారికి స్వర్గసుఖములను, నిష్కామముగా చేయువారలకు పరమపురుషార్థమగు మోక్షమును నీవు అనుగ్రహించుచున్నావు. తప్పు పనులను చేయువారలను నీవు భయంకరమగు నరకములోనికి నెట్టివేయు చున్నావు. కాని, ఒకప్పుడు మాకు తెలియరాని కారణములచే ఒకానొకనికి ఈ ఫలములు తల్లక్రిందులగును. అనగా, దక్షుడు వంటి వాడు మంచి పనిని మొదలిడి అమంగళమును పొందును.
పశువులకు, అజ్ఞానులకు కోపము వచ్చినచో తరచుగా ఒళ్లు తేలి యదు. కాని, మహాత్ములు ఆ విధముగా కోపముచే పరాభూతులు కారు. వారు తమ మనస్సును నీ పాదములపై నిలిపి యుంచెదరు. సకలప్రాణు లలో ఆత్మరూపముగా వ్యాపించియున్న నిన్ను వారు సర్వత్రా దర్శించెదరు. మరియు, వారు బ్రహ్మాభిన్నమగు ఆత్మయందు సకలప్రాణులను (సక లజగత్తును) అభిన్నముగా దర్శించెదరు.
కొందరు సర్వత్ర భేదమునే గాంచెదరు. వారి దృష్టి కర్మలయందే గాని, ఈశ్వరునియందు ఉండదు. చెడు బుద్ధి గల ఇట్టి జనులు ఇతరుల ఉన్నతిని చూచి తమ హృదయములో సర్వదా మాత్సర్యదుఃఖమును పొందుచుందురు. వారు మర్మస్థానములను పొడిచే ఈటేలవంటి మాట లతో ఇతరులకు విశేషముగా దుఃఖమును కలిగించెదరు. అట్టి దుష్టులను కర్మఫలరూపమగు దైవమే వధించును. దక్షుడు అట్టివారిలో ఒకడు. వానిని నీవంటి మంగళస్వరూపుడు సంహరించ వద్దని ప్రార్థించుచున్నాము.
పద్మనాభుని మాయను అధిగమించుట చాల కష్టము. దానినే మోహమును పొందిన బుద్ధి గల జనులు భేదమును మాత్రమే దర్శించు చుందురు. అట్టివారు ఏయే దేశకాలములయందు దైవబలముచే ఏయే అపరాధములను చేసిననూ, ఆయా దేశకాలములయందు ఆయా అపరాధ ములను మహాత్ములు దయతో క్షమించి, అనుగ్రహమునే చూపెదరు. అంతేగాని, వారిపై మహాత్ములు తమ పరాక్రమమును చూపించరు.
ఓ ప్రభూ! పరమపురుషుడగు భగవానుని మాయను అధిగమిం చుట కష్టము. కాని, సర్వజ్ఞుడవగు నీయొక్క బుద్ధివి ఆ మాయ స్పృశించలేదు. కాని, ఆ మాయచే నశింపజేయబడిన బుద్ధి గల దక్షాదులు కర్మల యందు మాత్రమే తగుల్కొన్న చిత్తమును కలిగియుందురు. వారియందు నీవు ఈ జరిగిన అపరాధము విషయములో అనుగ్రహమును చూప దగు దువు.
ఓయీ ఆదికారణా శివా! నీవు ధ్వంసము చేయుటచే దక్ష ప్రజాపతియొక్క. యజ్ఞము సమాప్తము కాలేదు. ఆ యజ్ఞమును నీవు ఉద్దరించుము. యజ్ఞమునందు నీకు భాగము గలదు. యజ్ఞమునకు ఫలమునిచ్చువాడవు నీవే. కాని, దుష్టులగు యాజ్ఞికులు నీకా యజ్ఞమునందు భాగమునీయకుండిరి.
యజమానుడగు ఈ దక్షుడు తిరిగి జీవించునట్లు, భగునకు కన్నులు వచ్చునట్లు, భృగు మహర్షికి మీసములు గౌడ్డములు తిరిగి మొలు చునట్లు, మరియు పూష దేవతకు పూర్వమునందు వలెనే దంతములు వచ్చునట్లు నీవు అనుగ్రహించుము.
ఓ రుద్రదేవా! ఆయుధములచే మరియు రాళ్లచే దేవతలకు, ఋత్విక్కులకు అవయవములు విరుగగొట్టబడినవి. వారికి మరల నీ అనుగ్రహముచే వెంటనే స్వస్థత చేకూరుగాక!
యజ్ఞమును ధ్వంసము చేసిన ఓ రుద్రా! యజ్ఞము సమాప్తము కాగా మిగిలిన సర్వము నీ భాగమే అగుగాక! ఓ రుద్రదేవా! ఈనాడు యజ్ఞము నీ భాగముతోనే సుసంపన్నమగును గాక!
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో బ్రహ్మగారు రుద్రుని స్తుతించుట, దేవతలు రుద్రునిప్రసన్నుని చేసుకొనుట అనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).
