శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

21 - పృథూపాఖ్యానము - పృథువు చేసిన ఉపదేశము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథు మహారాజుయొక్క నగరములోని బంగరు బహిర్ధ్వారములను ముత్యాల హారములతో, పుష్ప మాలలతో, వస్త్రములతో అలంకరించిరి. ఆ నగరములో అక్కడక్కడ గొప్ప పరిమళము గల ధూపములను ఏర్పాటు చేసిరి.

ఆ నగరములోని రథమార్గములలో, కూడళ్లలో మరియు ఇతర మార్గములలో గంధము, అగరు కలిపిన నీళ్లను చల్లి, పుష్పములు ఫలములు అక్షతలు చిగుళ్లు పేలాలు మరియు దీపములతో అలంకరించిరి.

ఆ నగరమును గెలలతో కూడియున్న అరటి బోదెలతో, లేత పోక చెట్లతో మరియు చెట్ల చిగుళ్ల మాలలతో అంతటా చక్కగా అలంకరించిరి.

పృథువు నగరమునకు వచ్చుచుండగా, ఉజ్వలములగు కుండల ములనలంకరించుకొని గొప్పగా ప్రకాశించుచున్న కన్యలు మరియు ఇతర జనులు కూడ దీపములను, పూజాద్రవ్యములను మరియు సకలమంగళద్రవ్యములను సమకూర్చుకొని ఆయనకు ఎదురేగిరి.

పృథువు గర్వము లేని వీరుడు. ఆయనను వందిమాగధులు స్తుతించుచుండిరి. శంఖములను పూరించిరి. భేరీలను మ్రోగించిరి. ఋత్వి క్కులు వేదమంత్రములను పఠించుచుండగా ఆయన రాజప్రాసాదములో నికి ప్రవేశించేను.

గొప్ప కీర్తి గల పృథువు ప్రజలకు అభీష్టములగు వరములనిచ్చును. ఆయనను నగరములో పలు స్థానములలో జనులు పూజించుటచే ఆయన చాల సంతోషించేను. నగరములో మరియు రాజ్యములోని పల్లె లలో నివసించే ప్రముఖులను ఆయన కూడ పూజించెను.

గుణములచే గొప్పవాడగు ఆ పృథువు నిర్దుష్టమగు కార్యములు గలవాడగుటచే పూజనీయుడు. ఆయన ఈ భూమండలమును ఈ విధమగు అనేకకర్మలను చేయుచూ పాలించెను. ఆయన ఈ లోకములో అతిశయించిన కీర్తిని వర్ధిల్లజేసి, శ్రీహరియొక్క ధామమును అధిష్ఠించెను.

సూత మహర్షి ఇట్లు పలికెను --- సభాపతివగు ఓ శౌనక మహర్షీ! ఆదిరాజగు పృథువుయొక్క అట్టి కీర్తి ఆతని సకలసద్గుణములచే మరింత విజృంభించెను. గుణవంతులు ఆయన కీర్తిని ఆదరించిరి. అట్టి ఆ కీర్తిని వర్ణించుచున్న మైత్రేయ మహర్షిని, భాగవతోత్తముడగు విదురుడు సత్కరించి, ఇట్లు పలికెను.

విదురుడు ఇట్లు పలికెను --- మహర్షులు పృథువును చక్రవర్తిగా అభి షేకించగానే, దేవతలందరు ఆయనకు బహుమతులను సమర్పించిరి. ఆయన తన బాహువులయందు శ్రీహరియొక్క పాలనాశక్తిని ధరించినవాడై, భూమినుండి సకలసంపదలను సంపాదించెను.

పృథువు తన పరాక్రమముచే భూమినుండి సంపదలను సంపొదీం చెను. ఈ నాటికీ భూపాలురు, లోకపాలకులు మరియు లోకములు ఆ సంపదలలో మిగిలిన వాటినే యథేచ్ఛగా భోగించుచున్నారు. అట్టి పృథు వుయొక్క కీర్తిని వివేకియైనవాడు ఎవడు వినకుండును? ఆతని పవిత్రమగు ఆచరణమును గురించి నాకు చెప్పుము.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథువు గంగా యమునా నదుల మధ్యనున్న భూభాగములో మకాము చేసెను, ఆయన పుణ్యమును కూడ బంధముగనే భావించి, దానిని వదిలించుకొనుటకై ప్రారబ్ధకర్మఫలరూపములగు భోగములను మాత్రమే అనుభవించెను.

బ్రాహ్మణ సమూహమును, విష్ణువును శరణు జొచ్చిన భక్తులను విడిచిపెట్టి, పృథువు ఏడు ద్వీపములలో ఏకైకసమ్రాట్టుమై శాపనమును చేసెను. ఆయన ఆజ్ఞకు ఎదురు లేకుండెను.

సత్పురుషులలో శ్రేష్ఠుడవగు ఓ విదురా! ఒకప్పుడు పృథువు గొప్ప సత్రయాగమును చేయుటకు దీక్ష బూనెను. ఆ యాగమునందు దేవ తలు, బ్రహ్మర్షులు మరియు రాజర్షులు కూడ సమావేశమైరి.

ఆ యాగములో పూజ్యులగు సర్వులను వారి వారి యోగ్యతలకు తగినట్లుగా సత్కరించిరి. సభామధ్యములో పృథువు లేచి, తారల మధ్యలో చంద్రుడు వలె నిలబడెను.

పచ్చని దేహవర్ణము గల పృథువు పొడవాటి వ్యక్తి. ఆయన చేతులు బలిసి పొడవుగా నుండెను. పద్మములవలె ఎర్రని కన్నులు గల ఆయన ముక్కు అందముగా నుండెను. ప్రసన్నమగు ముఖము గల ఆయనను చూచువారలకు ఆహ్లాదము కలుగును. పుష్టిగానుండే భుజస్కంధ ములు గల ఆయన చక్కని పలువరుసలతో చిరునవ్వు కలిగియుండును.

ఆయన విశాలమగు వక్షఃస్థలముతో, రావియాకు వలె పైన విశా లముగా క్రింద సన్నగా ఉండే నడుముతో ప్రకాశించెను. ఆయన ఉదర ముపై ముడుతలు ఉండెను. విశాలమగు కటిభాగము గల ఆయన ఊరు వులు బంగరు వర్ణము కలిగియుండెను. మహాశక్తిమంతుడగు ఆయన నాభి సుడి తిరిగి లోతుగానుండెను. ఆయన పాదములు ఎత్తైన కొనలను కలిగియుండెను.

శంఖమువంటి మెడ గల ఆయన జుట్టు సన్నగా నల్లగా చిక్కగా వంకరలు తిరిగి యుండెను. ఆయన మిక్కిలి విలువైన శ్రేష్ఠమగు ధోవతిని ధరించి, ఉత్తరీయమును వేసుకొని యుండెను.

యజ్ఞనియమమును బట్టి ఆయన ఆభరణములను విడిచి పెట్టి కృష్ణమృగచర్మమును ధరించియుండెను. కావుననే, ఆయన అవయవములన్నింటి శోభ ప్రకటమగుచుండెను. శోభాయుక్తుడగు ఆ పృథువు నిత్యకర్మలను పూర్తి చేసుకొని చేతియందు దర్భలను పట్టుకొని యుండెను.

పృథు మహారాజు నునుపైన కనుపాపలు గల కన్నులతో సభనంతా తిలకించి, తన ప్రేమపూర్ణమైన చూపులతో వారి తాపమును పోగొట్టి ఆనందమును కలిగించుచున్నాడా యన్నట్లు ఈ మాటలను పలికెను.

అప్పుడాయన మధురమైన వైవిధ్యము గల ప్రశస్తమైన శుద్ధమైన గంభీరార్థము గల వ్యాకులతను కలిగించని పలుకులను తొందరపాటు లేని విధముగా పలికెను. ఆయన తన అనుభవమును అందరి ఉపకారము కొరకై చెప్పుచున్నాడా యన్నట్లు అనిపించెను.

పృథు మహారాజు ఇట్లు పలికెను --- సభాసదులారా! సత్పురుషులగు మీరు ఇచటకు వచ్చితిరి. మీకు మంగళమగు గాక! నా మాటను వినుడు. ధర్మమును తెలియగోరు జనులు తమ అభిప్రాయములను సత్పురుషుల యెదుట విన్నవించవలెను.

నన్ను మహర్షులు ఈ సామ్రాజ్యములో ప్రజాపాలకునిగా నియోగించిరి. కావున, నేను దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షిస్తూ, ప్రజలకు జీవికను కల్పించి, వారిని యథాయోగ్యముగా తమ తమ ధర్మమర్యాదల యందు స్థాపించుచున్నాను.

నేను నా ధర్మమును అనుష్ఠించుచున్నాను. స్వధర్మానుయాయులకు కోరికలీడేరే పుణ్యలోకములు లభించునని వేదవేత్తలు చెప్పుచున్నారు. కర్మసాక్షియగు ఈశ్వరుడు నా యెడల ప్రసన్నుడై, నాకు కూడ అట్టి పుణ్యలోకములు లభించును.

ఏ రాజైతే ప్రజలను ధర్మమునందు నడిపించకుండగా వారివద్ద నుండి పన్నును వసూలు చేయునో, ఆతడు ప్రజల పాపమును తాను పొంది, తన భాగ్యమును పోగొట్టుకొనును.

ఓ ప్రజలారా! కావున, మీరు దోషములను మాత్రమే పట్టుకొనే బుద్ధిని విడనాడి, ఆ బుద్ధిని శ్రీహరిపై నిలుపుడు. శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణములకు లభ్యుడు కాడు. మీ రాజునగు నేను పుణ్యలోకములను పొందాలంటే, మీరు మీ మీ ధర్మములను అనుష్ఠించవలెను. మీరు అట్లు చేసినచో, నన్ను అనుగ్రహించినవారు అగుదురు.

ఓ పితృదేవతలారా! దేవతలారా! మహర్షులారా! నేను చెప్పిన మాటను పవిత్రులగు మీరు అనుమోదించుడు. ఏలయనగా, అట్టి ధర్మమును చేయువానికి, ఉపదేశించువానికి, అనుమోదించువానికి కూడ దాని ఫలము పరలోకములో సమానముగా లభించును.

పూజించదగిన మహాత్ములారా! యజ్ఞేశ్వరుడు, కర్మఫలదాత అగు భగవానుడు ఉన్నాడు అని కొందరు మహానుభావుల సిద్ధాంతము. ఇదియే యథార్థము. ఏలయనగా, ఇహపరలోకములలో తేజోమయములగు ప్రదేశ ములు (సుఖకరములగు శరీరములు) అక్కడక్కడ కానవచ్చుచున్నవి.

జీవులకు ధర్మార్థకామములను, పుణ్యలోకములను మరియు మోక్షమును వారి వారి యోగ్యతలను బట్టి అనుగ్రహించే ఏకైక నియామక తత్త్వము ఒకటి ప్రధానముగా ఉండి తీరవలెను (కర్మాదులు అప్రధానములు). అదియే గదాధారియగు శ్రీహరి. ఈ విషయమును స్వాయంభువ మనువు, ఉత్తానపాదుడు, ధ్రువ మహారాజు, రాజర్షియగు ప్రియవ్రతుడు, మా తాతగారైన అంగ మహారాజు, ఇతరులగు ఇట్టి చక్రవర్తులు మాత్రమే కాకుండా, బ్రహ్మ, శివుడు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి కూడ అంగీకరించినా . రు. కేవలము మృత్యువుయొక్క కూతురు కొడుకగు వేనుడు మొదలగు వారు శ్రీహరిని అంగీకరించలేదు. వారు ధర్మము విషయములో వ్యామోహమును పొంది శోచనీయమగు స్థితిని చేరుకున్నారు.

సంసారతాపముచే పీడితులై తపస్సును చేసుకొనువారలకు శ్రీహరియొక్క పాదములను సేవించాలనే అభిరుచి దీనదినప్రవర్ధమానమై, వారు అనేకజన్మలలో ప్రోగు చేసుకున్న మనోమాలిన్యమును, ఆ శ్రీహరి యొక్క పాదము బొటనవేలినుండి ఆవిర్భవించిన గంగానది వలె, వెంటనే నశింప జేయును.

మానవుడు తన మనస్సులోని మాలిన్యములను పూర్తిగా కడిగివేసుకొని శ్రీహరియొక్క పాదమూలములను శరణు పొందవలెను. అట్టివానికి వైరాగ్యముచే ఆత్మసాక్షాత్కారము, దాని వలన విశిష్టమగు మనోబలము కలుగును. అట్టి వ్యక్తి మరల దుఃఖరూపమగు ఈ సంసారమును పొందడు.

మీరు కపటము లేనివారు, మీరు మీ యోగ్యతననుసరించి మీ మీ ధర్మములననుష్ఠించి సిద్దీని బడసి యున్నారు. అట్టి మీరు మీ మీ వృత్తుల ను, మీ మీ కర్తవ్యములను చేసుకుంటూనే, పోటీ ద్వారానే ఆ శ్రీహరిని ఆరాధించుడు. మీరు మనస్సులో శ్రీహరిని ధ్యానిస్తూ, వాక్కుతో స్తుతిస్తూ, శరీరముతో నమస్కారాదులనాచరించుడు. శ్రీహరి పాదపద్మము మీ కోరిక లనీడేర్చే కామధేనువు.

శ్రీహరి స్వరూపముచే నిర్గుణుడు, అసంగుడు, ఏకరసుడు, జ్ఞానఘనుడు. కాని, ఆయన ఈ లోకములో కర్మమార్గములో, పురోడాశము, మొదలగు ద్రవ్యములచే, తెలుపు మొదలగు గుణములచే, ధాన్యమును (హోమము కొరకై) దంచుట మొదలగు క్రియలచే, మంత్రములచే యజ్ఞ రూపముగా సంపన్నమగుచున్నాడు. ఆ యజ్ఞమునకు ప్రయోజనము, సంకల్పము, పదార్థముల శక్తి మరియు నామము అనే అనేకములగు విశే షణములు కూడ సంపన్ననుగుచున్నవి.

ఈశ్వరుని మాయాశక్తి, దానిలో సంక్షోభమును కలిగించే కాలము, జీవవాసనలు, జీవుని ప్రారబ్ధకర్మ (అదృష్టము) ఇవన్నీ కలిసి శరీరము పుట్టును. అగ్ని కట్టెలయందు ప్రకటమై ఆ కట్టెల రూపమే తన రూపమా యన్నట్లు కొనవచ్చును. అదే విధముగా, సర్వవ్యాపకుడగు ఈశ్వరుడు ఆ శరీరమునందు విషయముల రూపములోనుండే బుద్ధితో తాదాత్మ్యమును చెంది, కర్మల ఫలములు గలవోడుగా కొనవచ్చుచున్నాడు (అటులనే జను లచే జీవరూపముగా స్వీకరించబడుచున్నాడు).

ఈ నా ప్రజలు భూలోకములో దృఢమగు నిష్ఠను కలిగి స్వధర్మ మును అనుష్ఠిస్తూ శ్రీహరిని నిరంతరముగా ఆరాధిస్తూ, ఆ విధముగా - నన్ను అనుగ్రహించుచున్నారు. ఇది ఎంతటి భాగ్యమో గదా! యజ్ఞభాగ ములను భుజించే దేవతలకు అధీశ్వరుడగు శ్రీహరి ముల్లోకములకు తండ్రి.

వేదవేత్తల ఈ సముదాయము పరాజయమునెరుంగని శ్రీహరిని కులదైవముగా ఆరాధిస్తూ, సహనము తపస్సు మరియు విద్య అనువాటిచే తనంత తానుగా గొప్పగా ప్రకాశించుచున్నది. రాజవంశములోని తేజస్సు నకు గొప్ప సంపదలే మూలము. అట్టి క్షత్రియతేజస్సు, ఈ బ్రాహ్మతేజమును ఏనాడైననూ ప్రభావితము చేయకుండు గాక!

పూర్ణుడు, కాలమునకు అతీతుడు అగు శ్రీహరి ఆత్మజ్ఞానులచే తాను ఆరాధించబడుటయే గాక, తానే స్వయముగా వారిని పూజించును. ఆయన ఇంద్రాది దేవతలందరికి అధినాయకుడు. అట్టి శ్రీహరి వేదవేత్తల (ఆత్మజ్ఞానుల) పాదములకు నమస్కరించి, ఆ ప్రభావముచే ఎన్నటికీ తొల గిపోని సంపదను లక్ష్మీదేవి రూపములో పొందెను. అంతే గాక, జగత్తును . పావనము చేసే కీర్తి కూడ ఆయనకు లభించెను.

సకలప్రాణుల బుద్దిగుహలో ఆత్మరూపముగా నివసించే శ్రీహరి బ్రహ్మవేత్తలచే తాను ప్రేమించబడుటయే గాక, తాను స్వయముగా వారిని ప్రేమించును. అట్టి బ్రహ్మవేత్తలను సేవించినచో, స్వయంప్రకాశ స్వరూపుడు, జగన్నాథుడు అగు శ్రీహరి మిక్కిలి సంతోషించును. కావున, భగవానుని ఆరాధనయందు పరాయణులైన భక్తులు వినయముతో బ్రహ్మవేత్తల సముదాయమును, సర్వము వీరే అనే భావనతో, అన్ని విధములుగా నిష్టతో సేవించవలెను.

బ్రహ్మవేత్తలతోడి నిత్యసంగమును పెట్టుకొని వారిని నిష్టతో సేవించే మానవునకు తొందరలోనే అంతఃకరణము శుద్దమై సాక్షాత్తు ఆత్యంతిక సంసారోపరమము అనే మోక్షము తనంత తానుగా లభించును. కావున, దేవతలకు హవిర్భాగములను సమర్పించుటకు బ్రహ్మవేత్తలే ముఖము. అనగా, వీరిని సేవించినచో, సకలదేవతలను సేవించినట్లే. దేవతలనారాధించే ఉపాయము ఇంతకంటే గొప్పది మరియొకటి లేదు.

తత్త్వవేత్తలు పూజ్యులైన ఇంద్రాదుల నామములతో బ్రహ్మవేత్తల ముఖమునందు శ్రద్ధతో హవిస్సును హోమము చేయుదురు, అనగా బ్రహ్మ వేత్తలకు భోజనాదులను సమర్పించి సేవను చేయుదురు. ఇట్లు హోమము చేయబడిన హవిస్సును అనంతుడగు శ్రీహరి చాల ప్రీతితో భుజించును. అచేతనమగు అగ్నియందు హోమము చేయబడిన హవిస్సును శ్రీహరి అంతటి ప్రీతితో భుజించడు. ఇది నిశ్చయము. పరమహంసల జ్ఞాననిష్టకు, దారి చూపిన ఉపనిషద్వచనములు పరమతాత్పర్యరూపముగా శ్రీహరి యొక్క జ్ఞానఘన స్వరూపమును మాత్రమే బోధించును.

వేదములో పురుషుల రాగద్వేషాది దోషములకు తావు లేదు. అది ఈశ్వరునినుండి ఆవిర్భవించినది గనుక అనాది. దానియందు పురుషార్థ ములు అద్దములో ముఖము వలే స్పష్టముగా గోచరించును. ఈ వేదవే త్తలు శ్రద్ధతో తపస్సును చేసి, ఇతరమగు వాగ్వ్యాపారమును కట్టిపెట్టి, ఇంద్రియనిగ్రహముతో అట్టి వేదమును వల్లించి, దానిని చిత్తెకాగ్రతతో బుద్ధి యందు ధారణ చేసి, నిషిద్దాచరణమునకు దూరముగా ఉంటూ, దాని అర్థ మును తెలియుచున్నారు.

పూజ్యులారా! నేను జీవించి యున్నంత కాలము వారి పాదపద్మ ముల ధూళి కణమును కిరీటముపై ధరించెదను. అట్లు నిత్యము ధరించు వాని పాపము వెంటనే నశించును. వానిని సకల గుణములు సేవించును.

గుణములకు నిలయమై, సచ్చీలమే సంపదగా కలిగి, ఇతరులు చేసిన ఉపకారమును గుర్తులో నుంచుకొని, పెద్దలను సేవిస్తూ ఉండే వ్యక్తిని వరుసగా సంపదలు చక్కగా వరించును. నా విషయములో బ్రహ్మ వేత్తల సముదాయము, గోవుల సముదాయము, అనుచరుల (భక్తుల) తో కూడిన జనార్దనుడు ప్రసన్నమగు గాక!

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా పలికిన పృథు మహారాజును, పితృదేవతలు దేవతలు ఋత్విక్కులు మరియు సాధుపురు షులు చాల సంతోషించిన మనస్సులతో బాగు బాగు అని కొనియాడిరి.

సత్పుత్రుని కన్న తండ్రి పుణ్యలోకములను పొందునని వేదము. చెప్పే వచనము యథార్థము. ఏలయనగా, పాపియగు వేనుడు బ్రహ్మవేత్తల శాపముచే సంహరించబడిననూ, ఈ పృథువుయొక్క పుణ్యబలముచే నరకమును దాటివేసినాడు.

హిరణ్యకశిపుడు కూడ భగవానుని నిందించుటచే నరకమును పొందుననే ఆశంక ఉండెను. కాని, పుత్రుడగు ప్రహ్లాదుని భక్తియొక్క మహి మచే ఆతడు నరకమును దాటవేసెను.

వీరులలో శ్రేష్టుడవగు ఓ పృథూ! భూదేవికి నీవు తండ్రివి. నీవు శాశ్వత కాలము చక్కగా జీవించుము. ఏలయన, సకలలోకములకు ఏకైక ప్రభుడు, అవినాశి అగు శ్రీహరియందు నీకు ఇట్టి భక్తి గలదు.

ఏమి భాగ్యము! పవిత్రమగు కీర్తి గల ఓ రాజా! ఈనాడు నీవు మాకు నాథుడవగుటచేతనే, మేము మోక్షదాతయగు శ్రీహరి నాథుడుగా గలవారమైతిమి. ఏలయనగా, శ్రీహరియొక్క పవిత్రమైన గాథను నీవు ప్రచారము చేయుచున్నావు. పావనమగు కీర్తి గలవారిలో శ్రీహరి అగ్రేసరుడు. ఆయనను వేదవేత్తలు తమ దైవముగా కొలిచెదరు.

ఓ ప్రభూ! నీవీ విధముగా నీ ఆశ్రితులను సమగ్రముగా ఆదేశిం చుట గొప్ప ఆశ్చర్యము కానేరదు. ఏలయన, దయాహృదయులగు గొప్ప వారికి ప్రజలయందు అనురాగము సహజసిద్ధముగా నుండును.

ఓ ప్రభూ! మేము వివేకదృష్టి లోపించినవారమై, దైవము అని పిలువబడే ప్రారబ్ధకర్మల ప్రభావముచే సంసారములో తిరుగాడుచుంటిమి. నీవీ నాడు మమ్ములను అజ్ఞానసముద్రపు ఆవలి తీరమును చేర్చితివి.

పురుషోత్తముడు, విశేషముగా వర్ధిల్లిన సత్త్వగుణమే ఉపాధిగా గలవాడు అగు శ్రీహరికి నమస్కారము. ఆయనయే బ్రాహ్మణ క్షత్రియుల యందు తన తేజస్సును నింపి తద్ద్వారా పరస్పరమును మరియు జగ త్తును నిలబెట్టుచున్నాడు.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పృథూపాఖ్యానములో పృథువు సభాసదులకు చేసిన ఉపదేశమును వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).