శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
19 - పృథూపాఖ్యానము - పృథువు ఇంద్రునితో మైత్రిని నెరపుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- తరువాత ఆ పృథు మహారాజు బ్రహ్మావర్తమునందు వంద అశ్వమేధయాగములను చేయుటకు సంకల్పించెను. స్వాయంభువ మనువు కూడ అక్కడనే యజ్ఞములను చేసెను. అచట సరస్వతీ నది తూర్పు వైపునకు ప్రవహించును.
పృథువు వంద యజ్ఞములను చేసి తనకంటే గొప్ప కర్మానుష్ఠానపరుడుగా కాదలచుకున్న సంగతి తెలిసిన ఇంద్రుడు ఆ యజ్ఞముల గొప్ప ఉత్సవమును చూచి సహించ లేకపోయెను.
యజ్ఞములకు ప్రభువు, జగన్నాథుడు, సకలలోకములకు తండ్రి, సర్వశక్తిమంతుడు అగు శ్రీహరి భగవానుడు ఆ పృథువు యజ్ఞములో స్వయముగా దర్శనమిచ్చెను.
అపుడు బ్రహ్మగారు, శివుడు, లోకపాలకులు, వారి అనుయాయులు ఆ శ్రీహరి వెంట నడచిరి. గంధర్వులు, మహర్షులు, అప్సరసల గణములు ఆయనను కీర్తించుచుండెను.
సిద్దులు, విద్యాధరులు, దితి దను వంశములకు చెందిన రాక్షసు లలో భగవద్భక్తులైనవారు, యక్షులు మొదలగువారు, శ్రీహరి అనుచరులలో ప్రముఖులగు సునందుడు నందుడు మొదలగువారు శ్రీహరిని అనుసరించి అచటకు వెళ్లిరి. కపిలాచార్యుడు, నారద మహర్షి, యోగులకు ప్రభువగు దత్తాత్రేయ మహర్షి, సనక సనందనాదులు శ్రీహరిని సేవించాలనే ఉత్సాహము గల భగవద్భక్తులు. వారు కూడ వెళ్లిరి.
భరత వంశీయుడవగు ఓ విదురా! ఆ యజ్ఞమునందు భూమి కామిత పదార్థములనన్నింటినీ సంపాదించి పెట్టి ధర్మమును వర్ధిల్లజేసెను. యజ్ఞమును చేయుచున్న పృథువునకు భూమి కామధేనువు రూపములో అభీష్టములగు ప్రయోజనములను సంపాదించిపెట్టెను.
పాలు, పెరుగు, పానకము, నేయి, మజ్జిగ మొదలగు రసములు అన్నీ నదులై పారినవి. పెద్ద మ్రానులు గల చెట్లు తేనెలను స్రవించి, పుష్కలముగా పండ్లను సమకూర్చినవి.
సముద్రములు రత్నముల రాశులను, పర్వతములు భక్ష్యము (నమిలి తినదగినది) భోజ్యము (త్రాగదగినది) లేహ్యము (నాలుకతో ఆస్వాదించదగినది) చోష్యము (పీల్చదగినది) అనే నాలుగు రకములు ఆహారమును సమర్పించినవి. జనులు, సామంత ప్రభువులు అనేక పదార్థములను బహుమతులుగా సమర్పించిరి.
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని శ్రీహరియే పృథువునకు నాథుడు. ఆయనకు పట్టిన ఈ గొప్ప అభివృద్ధిని చూచి పూజ్యుడగు ఇంద్రుడు ఓర్వలేక, విఘ్నమును చేసెను.
వేనపుత్రుడగు పృథువు తన ఆఖరి వందవ అశ్వమేధయాగమును చేయుచూ యజ్ఞేశ్వరుడగు శ్రీహరిని ఆరాధించుచుండెను. దీనిని చూచి ఓర్వలేకపోయిన ఇంద్రుడు కంటికి కానరానివాడై యజ్ఞాశ్వమును అపహ రించెను.
ఇంద్రుడు పాఖండుని వేషమునే కవచముగా ధరించి ఆకాశమార్గ ములో వేగముగా వెళ్లిపోవుచుండగా, పూజ్యుడగు అత్రి మహర్షి చూచేను. ధార్మికవేషమును వేసుకొని జనులకు అధర్మమునందు ధర్మమనే భ్రాంతిని కలిగించువాడు పాఖండుడు.
అత్రి మహర్షి పృథువుయొక్క పుత్రుని ప్రేరేపించెను. హారథుడగు (రథయుద్ధములో దిట్ట) ఆతడు చాల కోపించి ఇంద్రుని వెంబడి పరు గెత్తి, నిలు నిలు అని పలికెను.
ఇంద్రుడు ఆ వేషములో జటలను దాల్చీ భస్మను పూసుకొని యుండెను. ఆతనిని చూచి పృథుపుత్రుడు మూర్తి దాల్చిన ధర్మమే అని భావించి, వానిపై బాణమును విడిచి పెట్టలేదు.
పృథుపుత్రుడు ఇంద్రుని బాణముతో కొట్టకుండుటను చూచి, అత్రి మహర్షి మరల ఆతనిని ఇంద్రుని వధించుమని ఇట్లు ప్రేరేపించెను: ఓ కుమారా! దేవతలలో అధముడగు ఈ మహేంద్రుడు యజ్ఞమును చెడగొట్టి నాడు. కావున, దీనిని వధించుము.
వేనుని పుత్రుడగు పృథువుయొక్క పుత్రుని అత్రి మహర్షి ఈ విధముగా ప్రోత్సహించెను. అపుడాతడు చాల కోపించి, జటాయువు రావణుని తరిమిన విధముగా, ఆకాశమార్గములో తొందరగా వెళ్లిపోవుచున్న ఇంద్రుని వెంట పరుగెత్తాను.
అపుడు స్వర్గాధిపతియగు ఇంద్రుడు ఆ పాఖండ వేషమును మార్చివేసి, గుర్రమును పృథుపుత్రునకు విడిచి పెట్టి, అంతర్ధానమాయెను. వీరుడగు ఆ పృథుపుత్రుడు యజ్ఞపశువగు ఆ గుర్రమును దోడ్కొని, తండ్రి యజ్ఞము జరుగుచున్న స్థానమును చేరుకొనెను.
సమర్థుడవగు ఓ విదురా! ఆ పృథుపుత్రుని ఆ ఆశ్చర్యకరమగు చేష్టితమును చూచిన మహర్షులు ఆతనికి విజితాశ్వుడు (జయించబడిన గుర్రము గలవాడు) అని పేరు పెట్టిరి.
సర్వసమర్థుడగు ఇంద్రుడు దట్టని చీకటిని సృష్టించి దానిలో కనబడకుండా వచ్చి, బంగరు జీనుతో కూడియున్న ఆ గుర్రమును మరల, చషాలము (చెక్కతో చేసిన కడియము, యూపమునకు కొనయందుండునది)తో కూడియున్న యూపము (పశువును కట్టే రాట) వద్దనుండి అపహరించెను.
ఇంద్రుడు ఆకాశమార్గము గుండా వేగముగా వెళ్లుచుండగా అత్రి మహర్షి వీరుడగు విజితాశ్వునకు చూపించేను. కాని, ఆ ఇంద్రుడు చేతికర్రపై పుర్రెను. దాల్చి ధార్మికవేషములోనుండుటచే, విజితాశ్వుడాతనికి ఇబ్బందిని కలిగించలేదు.
అత్రి మహర్షి ప్రేరేపించగా, విజితాశ్వుడు కోపించి దానిని కొట్టుటకు బాణమునెక్కు పెట్టెను. అప్పుడు స్వర్గాధిపతియగు ఆ ఇంద్రుడు ఆ వేషమును గుర్రమును కూడ విడిచి పెట్టి, అంతర్ధానమును చెందెను.
అప్పుడు వీరుడగు విజితాశ్వుడు ఆ గుర్రమును దోడ్కొని తన తండ్రి యజ్ఞమును చేయుచున్న స్థానమును చేరుకొనెను. ఇంద్రుని ఆ నింద్యమగు వేషమును జ్ఞానయోగమునందు శక్తిలేని జనులు స్వీకరించిరి.
ఇంద్రుడు గుర్రమును అపహరించగోరి, ఏయే వేషములను వేసు కొనెనో, అవి పాపమునకు గుర్తులు, పాపముయొక్క ఖండములు (అనగా, పాపచిహ్నములు) అని పాఖండ శబ్దమునకు శాస్త్రములో నిర్వచనము చెప్పబడినది.
ఈ విధముగా ఇంద్రుడు వేనపుత్రుడగు పృథువుయొక్క యజ్ఞమును చెడగొట్టగోరి, గుర్రమును అపహరిస్తూ అనేకవేషములను దాల్చి విడిచి పెట్టేను. పాపపు గురుతులగు ఆ వేషములను కొందరు దాల్చి పాఖండులైనారు. ఇట్టివారిని చూచి జనులు ధార్మికులని భ్రమపడుచుందురు. వీరు పాలించేది ధర్మాభాసమే (ధర్మము వలె కన్పట్టుట) గాని ధర్మము కాదు. వీరిలో కొందరు దిగంబరులు కాగా, మరికొందరు ఎర్రని వస్త్రములను ధరింతురు. ఇంకొందరు కాపాలికులు. వీరు జనులను ఆకర్షించుటలో నిపుణులు, మంచి తర్కకౌశలము గలవారు. కావుననే, జనుల బుద్ది తరచుగా వీరియందు లగ్నమగుచుండును.
పూజ్యుడు, గొప్ప పరాక్రమము గలవాడు అగు పృథు మహారాజునకు ఆ విషయము తెలిసెను. ఆయనకు ఇంద్రునిపై కోపము కలిగెను. ఆయన ధనస్సును సంధానము చేసి, చేతిలోనికి బాణమును తీసుకొనెను.
ఇంద్రుని వధించాలనే నిర్ణయమునకు వచ్చిన పృథువుయొక్క తేజస్సు చూడ శక్యము గాకుండ నుండెను, ఆయన వేగమును శత్రువులు ఓర్చుకోలేరు. ఆయనను ఆ విధముగా చూచిన ఋత్విక్కులు ఆయనను ఆ ప్రయత్నమునుండి విరమింప జేయుచూ, ఇట్లు బోధించిరి: ఓ మహా రాజా! నీవు గొప్ప బుద్ధిశాలివి. అయ్యో! యజ్ఞశాలలో వేదవిహితమైన పశువును తప్ప, ఇతరమగు ప్రాణిని దేనినైననూ వధించుట తగదు.
ఓ రాజా! ఇంద్రుడు నీ యజ్ఞమును చెడగొట్టుటకు యత్నించి నీకు శత్రువైనాడు. నీ కీర్తియొక్క ప్రభావముచే ఇప్పటికే వాని తేజస్సు క్షీణించినది. అట్టి ఇంద్రుని మేము ఇచటకు మంత్రములతో ఆహ్వానించెదము. మా ఆహ్వానమంత్రముల శక్తి ఇంకనూ నశించలేదు. తరువాత వానిని వెంటనే అగ్నిలో బలాత్కారముగా హోమము చేయుదము.
ఓ-విదురా! ఈ విధముగా యజమానుడగు పృథువుయొక్క ఋత్విక్కులు ఆయనను ఒప్పించి, సుక్కు (హోమసాధనము) లను చేతి లోనికి తీసుకొని కోపముగా ఆహ్వానమంత్రములతో హోమమును చేయ బోవుచుండగా, స్వయంభువుడగు బ్రహ్మగారు అచటకు వచ్చి వారిని వారించిరి.
మీరు యజ్ఞవిఘాతము నిమిత్తముగా, మరల యజ్ఞమును చేసి, ఇంద్రుని సంహరించ గోరుచున్నారు. కానీ, ఇంద్రుని సంహరించుట మీకు తగదు. ఇంద్రునకు యజ్ఞుడు అని పేరు. ఆయన భగవానుని శరీరమే. దేవ తలు ఇంద్రునకు ప్రియమైన శరీరములవంటి వారు. (యజ్ఞము శ్రీహరి స్వరూపమే. యజ్ఞములో ఆరాధించబడే ఇంద్రాది దేవతలు శ్రీహరికి ప్రియమగు శరీరములవంటి వారే).
ఓ బ్రాహ్మణులారా! పృథుమహారాజుయొక్క యజ్ఞమును చెడగొట్టగోరి ఇంద్రుడు మహాత్ములు అనుష్టించే ధర్మము యెడల పెద్ద అపరాధమును చేసి, పెద్ద అధర్మము (పాఖండము) ను సృష్టించినాడు. ఈ విషయమును మీరు గమనించుడు.
అట్లైనచో, గొప్ప కీర్తి గల పృథువునకు ఒక క్రతువు తగ్గి, తొంభై తొమ్మిది మాత్రమే క్రతువులు మాత్రమే పూర్తి యగునందురా? అటులనే యగుగాక!. మహారాజా! నీవు చాలినన్ని చక్కని క్రతువులను చేసితివి. పైగా, నీవు మోక్షధర్మములను తెలిసినవాడవు.
మహేంద్రుడు నీ రూపమే గనుక, నీవాయనకు కోపమును తెప్పించుట సుతరాము తగదు. ఏలయన, మీరిద్దరు పవిత్రమగు కీర్తి గల భగవానుని అవతారములే. నీకు మంగళమగు గాక!
ఓ మహారాజా! నీవీ విషయములో చింతిల్లకుము. నీవు ఆదరముతో మా మాటను వినుము. దైవము విఘ్నమును కలిగించిన కార్యమును గురించి మాత్రమే చింతిల్లువాని మనస్సులో అధికమగు కోపము పుట్టును. దాని వలన వాని మనస్సు గాఢమగు అజ్ఞానములో కూరుకొని పోవును.
ఈ యజ్ఞమును ఇంతటితో ఆపుడు. దేవతలకు దురాగ్రహము ఉండును. ఈ క్రతువు కారణముగా ఇంద్రుడు నిర్మించే పాఖండులచే ధర్మమునకు ముప్పు వాటిల్లుచున్నది.
ఇంద్రుడు నీ గుర్రమునపహరించి నీ యజ్ఞమునకు ద్రోహమును చేసినాడు. అదే ఇంద్రునిచే లోకములో ప్రవర్తిల్ల జేయబడిన ఈ పాఖండులు జనులను తమ వైపునకు ఆకర్షించుచున్నారు. వారి వెంట పడి పోవు చున్న ఈ జనమును చూడుము.
ఓ వేనపుత్రా! వేమని అపరాధముచే జనులలో ధర్మము లోపించి నది. అట్టి ధర్మమును దేశకాలములకు అనురూపముగా పరిరక్షించుటకై నీవు వేనుని దేహమునుండి ఈ లోకములో ఈ కాలములో అవతరించితివి. నీవు శ్రీహరియొక్క అంశము అగుచున్నావు.
ఓ మహారాజా! శ్రీహరి అంశవగు నీవు ఈ జగత్తుయొక్క ఉత్పత్తిని గురించి విచారించుము. విశ్వమును సృష్టించిన ప్రజాపతుల సంకల్పమును నెరవేర్చుము. నీవు సర్వసమర్థుడవు. ఇంద్రుని మాయచే అనేకులు దురాచారులు పాఖండులు అగుచున్నారు. అధర్మము వేగముగా ప్రబలి పోవుచున్నది. ఈ ముప్పును నివారించుము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- నరపాలుడగు పృథువును లోకములకు తండ్రియగు బ్రహ్మగారు ఈ విధముగా ఆదేశించెను. పృథువు ఆ ఆదేశమును స్వీకరించి, ఇంద్రునితో స్నేహపూర్వకమగు సంధిని చేసు కొనెను.
ఈ విధముగా అనేకములగు యజ్ఞములను చేసిన పృథు మహారాజు ఆ యజ్ఞములో హవిస్సులనిచ్చి దేవతలను సంతోష పెట్టెను. వరము లనిచ్చే ఆ దేవతలు - అవభృథ (యజ్ఞమునకు అంతమునందు చేసే) స్నానమును చేసిన పృథువునకు వరములనిచ్చిరి.
ఓ విదురా! ఆదిరాజగు పృథువు అమోఘమగు ఆశీర్వచనము గల ఆ బ్రాహ్మణులకు శ్రద్ధతో దక్షిణలనిచ్చి సత్కరించెను. వారు పంతో షించి, ఆయనకు ఆశీస్సులనిచ్చిరి.
ఆ బ్రాహ్మణులు పృథువుతో నిట్లు పలికిరి : గొప్ప బాహువులు (పరాక్రమము) గల ఓ మహారాజా! నీవు ఆహ్వానించిన పితరులు, దేవతలు, మహర్షులు, మానవులు అందరు విచ్చేసిరి. నీవు వారిని చక్కగా సత్కరించి ఆయా ద్రవ్యములనిచ్చి పూజించినావు.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు పృథువు ఇంద్రునితో మైత్రినినెరపుటను వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
