శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

23 - పృథూపాఖ్యానము - పృథువు పరమగతిని పొందుట

వేనపుత్రుడగు పృథువు గొప్ప ధైర్యము గలవాడు. ఆయన ప్రజ లను పాలిస్తూ స్వయముగా పల్లెలు, పట్టణములు మొదలగు వాటిని నిర్మించి, వాటిని స్వయముగా అభివృద్ధి చేసెను. ఆయన కదిలే ప్రాణుల కు, కదలని ప్రాణులకు కూడ బ్రతుకు దెరువును కల్పించి, సత్పురుషుల ధర్మమును రక్షించెను. ఆయన ఏ ప్రయోజనము కొరకై ఈ లోకములో అవతరించినాడో, అట్టి ఈశ్వరాదేశమును పూర్ణముగా సంపన్నము చేసెను. ఆయన భూమిని తన కుమార్తెగా స్వీకరించియుండెను. ఆయన తనను విడిచి పెట్టుచున్నాడనే దుఃఖముతో భూమి ఏడ్చుచున్నదా యన్నట్లుండె ను. ఆయన ఆ భూమిని తన కొడుకులకు అప్పజెప్పి, తాను భార్యతో గూడి తపస్సును చేయుటకై అడవికి వెళ్లాను. ఆయన అనుచరులు లేకుం డగా వెళ్లిపోవుచుండగా, ప్రజలు విశేషముగా దుఃఖించిరి.

పృథువు ఆ తపోవనములో తన నియమములు, చెడిపోకుండా జాగ్రత్త వహిస్తూ, వానప్రస్థులకు మిక్కిలి అభీష్టమైన తీవ్రమగు తపస్సును చేయుటకారంభించెను. ఆయన ఒకప్పుడు పృథివిని జయించుటయందు ఎట్టి ప్రయత్నమును చేసెనో, ఇప్పుడు తపస్సునందు కూడ అట్టి పట్టుదలనే కలిగియుండెను.

ఆ పృథువు దుంపలను, వేళ్లను, పళ్లను తిని తపస్సును చేయు చుండెను. ఒకప్పుడు ఆతడు ఎండుటాకులను మాత్రమే తినెడివాడు. కొన్ని పక్షములు ఆయన నీటిని మాత్రమే త్రాగి, ఆ తరువాత గాలి, మాత్రమే ఆహారముగా గలవాడై తపస్సును కొనసాగించెను.

వీరుడగు (మననశీలి అగు) ఆ పృథువు వానప్రస్థుడై వేసవి యందు అయిదు అగ్నుల (నాలుగు దిక్కులలో మంటలు, పైన సూర్యుడు) తాపమును సహిస్తూ, వర్షాకాలములో వర్షపు ధారలను సహిస్తూ, చలి కాలమునందు కంఠము వరకు నీటిలో నిలబడి, తపస్సును చేసెను. ఆయన ఆ కాలములో నేలపై పరుండెడివాడు.

ఇంద్రియనిగ్రహము గల పృథువు శీతోష్ణాది ద్వంద్వములను సహిస్తూ వాగీంద్రియముపై నియంత్రణను కలిగియుండెను. ఆయన బ్రహ్మచర్యమును పాటిస్తూ ప్రాణాయామమునభ్యసించేను. ఆయన శ్రీకృష్ణుని ఆరాధించ గోరువాడై ఉత్తమమగు తపస్సును చేసెను.

ఆ పృథువుయొక్క తపస్సు క్రమముగా మెల్లగా పరిపక్వమై, ఆతని కర్మవాసనలన్నియు నశించి, అంతఃకరణము పరిశుద్దమయ్యెను. ఆతడు ప్రాణాయామమును అభ్యసించి, కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనే అయిదు జ్ఞానేంద్రియములను మరియు మనస్సు అనే అంతరింద్రియమును చక్కగా నియంత్రించేను. ఈ విధముగా ఆతడు సంసారబంధమునుండి విముక్తుడయ్యెను.

సనత్కుమార భగవానుడు పృథువునకు సర్వశ్రేష్టమగు అధ్యాత్మ యోగమును బోధించేను. ఈ యోగములో సాధకుడు అంతర్ముఖుడై ఆత్మరూపముగా ఈశ్వరుని దర్శించును. మనుజశ్రేష్ఠుడగు పృథువు ఈ యోగము చేతనే ఆ పురుషోత్తముని సేవించెను.

సత్పురుషుడగు పృథువు అన్ని కాలములలో శ్రద్దతో భగవానుని ఆరాధనయే ధర్మముగా గలవాడై సాధన చేసెను. అపుడాయనకు పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీహరి భగవానునియందు ఇతరములగు సాంసారిక విషయముల ప్రసక్తి లేని భక్తి ఉదయించేను.

భగవత్సేవచే పృథువుయొక్క అంతఃకరణము శుద్దమగు సత్త్వగు ణము ప్రముఖముగా గలది ఆయెను. ఆయన ఆ భగవానుని నిరంతర ముగా స్మరించుటచే భక్తి వర్ధిల్లెను. ఆ భక్తిచే వైరాగ్యము, ఆత్మజ్ఞానము కలిగెను. ఆ తీక్ష్ణమగు జ్ఞానముచే ఆయన తాను దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారము అనే భ్రాంతధారణల రూపములోనుండే సంసారబంధమును ఛేదించెను. ఆయనకు గల సంశయములన్నియు పటా పంచలయ్యేను. ఈ సంశయములు తాను జీవుడననే భ్రాంతధారణను ఆశ్ర యించి ఉండునవి మాత్రమే.

ఆత్మతత్త్వమును తెలియుట తోడనే పృథువునకు భేదబుద్ది నశిం చి, కామనలు తొలగిపోయేను. అపుడాతడు జీవభావమును ఛేదించే జ్ఞాన మును కలిగించిన ఆ అధ్యాత్మయోగమును కూడ విడిచి పెట్టెను. యతనశీ లుడగు సాధకుడు తనకు శ్రీహరి గాథలయందు ప్రీతి కలుగునంతవరకు, యోగసిద్ధులయందు ఆసక్తిని విడనాడలేడు. పృథువునకు అట్టి ప్రీతి కలుగుటచే, యోగసిద్ధులయందు ఆసక్తి కలుగలేదు.

వీరులలో ఉత్తముడగు ఆ పృథువు ఈ విధముగా తన బుద్దిని ఆత్మస్వరూపమునందు నిలిపి, బ్రహ్మీభూతుడాయెను. సమయము వచ్చి నప్పుడు ఆయన దృఢమగు దేహమును విడిచి పెట్టెను.

ఆతడు కాలి మడమలతో విసర్జనేంద్రియమును గట్టిగా నొక్కి పెట్టి (మూలబంధము), ప్రాణశక్తిని మెల్లగా పైకి లేవదీయుచూ, ప్రేగులు (స్వాధిష్టాన చక్రము), బొడ్డు (మణిపూరము), వక్షఃస్థలము (అనాహతము), కంఠము క్రింది భాగము (విశుద్ది), కంఠము, కనుబొమల నడుమ (ఆజ్ఞా చక్రము) అనే స్థానములయందు వరుసగా నిలిపి, దానిని క్రమముగా పైకి ప్రసరింప జేసి, శిరస్సునందలి బ్రహ్మరంధ్రమునందు ప్రవేశ పెట్టెను. కామ నలు లేని ఆ పృథువు అప్పుడు తన శరీరరూపములోనున్న పృథివి, అగ్ని, వాయువులను సమష్టి పృథివి, అగ్ని, వాయువులతో కలిపి వేసెను. అనగా, దేహాభిమానమును త్యజించెను.

ఆతడు ఇంద్రియముల (వివరముల) ను మహాకాశమునందు, శరీ రములోని ద్రవపదార్థమును మహాజలమునందు, ఈ విధముగా శరీరమును నిర్మించిన పంచభూతములను స్థానము తప్పకుండగా మహాభూత ములయందు కలిపి వేసెను. మరియు, ఆయన తత్త్వములు ఏ క్రమ ములో పుట్టినవో, దానికి విపరీతక్రమములో వాటిని విలీనము చేసెను. ఆ విధముగా పృథివిని జలమునందు, జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు విలీనము చేసెను. మన స్సును ఇంద్రియములయందు, ఇంద్రియములను పంచ సూక్ష్మభూతము లయందు, వాటిని భూతాది అనబడే అహంకారమునందు, దానిని మహత్త త్వమునందు విలీనము చేసెను.

సత్త్వరజస్తమోగుణముల కార్యములన్నింటికీ ఆశ్రయమగు ఆ మహత్తత్త్వమును మాయోపాధికుడగు జీవునియందు విలీనము చేసెను. లింగశరీరోపాధియందు అభిమానముచే జీవభావాపన్నుడై యున్న పృథు మహారాజు జ్ఞానవైరాగ్యముల ప్రభావముచే స్వస్వరూపమునందున్నవాడై, ఆ లింగశరీరోపాధిని కూడ విడిచిపెట్టెను.

పృథువుయొక్క భార్య అర్చిస్సు అని ప్రసిద్ధిని గాంచిన మహారా ణి. ఆమె నేలపై అడుగు పెట్టలేనంతటి సుకుమారి. ఆమె కూడ ఆయన వెంట అడవికి వెళ్లెను.

భర్తయగు పృథువు ప్రతనిష్ఠతో ధర్మము నాచరించుచుండగా ఆ అర్చిస్సు ఆయనకు సేవను చేస్తూ, మహర్షులకు సహజమైన ఆహారవ్యవ హారములతో అన్ని విధములుగా చిక్కిపోయెను. అయినప్పటికీ, ఆమె ప్రియుడగు పృథువు తనను చేతితో స్పృశించి సత్కరించుటచే గొప్ప ఆనందమునే పొందినదే గాని, దుఃఖముననుభవించలేదు.

పతివ్రతయగు ఆ అర్చిస్సు తనకు ప్రియుడైన పృథు మహా రాజుయొక్క దేహమును చూచెను. ఆ దేహములో ప్రాణవ్యాపారముల న్నియు తొలగిపోయేను. ఆమె అప్పుడు కొద్దిగా ఏడ్చి, కొండ చరియపై ఏర్పాటైన చితియందు ఆ దేహమును అధిరోహింప జేసెను.

ఆమె దహనకర్మను చేసి, నదిలో స్నానమును చేసి, గొప్ప ప్రజా కార్యములను చేసిన తన పెనిమిటికీ జలదానకర్మను చేసి, స్వర్గవాసులగు దేవతలకు నమస్కరించి, మూడు సార్లు ప్రదక్షిణము చేసి, భర్త పాదము లనే స్మరించుచున్నదై, అగ్నిలో ప్రవేశించెను.

వీరులలో ఉత్తముడగు భర్తను అనుసరించి వెళ్లిపోయిన ఆ పతివ్ర తను దేవతల భార్యలు తమ భర్తలతో గూడి వేల సంఖ్యలో దర్శించిరి. వర ములనిచ్చే ఆ దేవతల పత్నులు భర్తలతో సహా ఆమెను ప్రశంసించిరి.

వారు దేవదుందుభులు మ్రోగుచుండగా ఆ మందరపర్వతము యొక్క చరియపై పుష్పవర్షమును కురిపించిరి. మరియు వారిలో వారు ఇట్లు కొనిరి.

దేవపత్నులు ఇట్లు పలికిరి --- ఆశ్చర్యము! ఈ పతివ్రత ధన్యురా లు. ఈమె భర్తయగు పృథువు రాజాధిరాజు. పతివ్రతయగు లక్ష్మీదేవి యజేశ్వరుడగు శ్రీహరిని వలె, ఈమే తన భర్తను ఈ తీరున సకలవిధము లుగా (మనోవాక్కాయములతో) సేవించినది.

చూడుడు! పతివ్రతయగు ఈ అర్చిస్సు ఊహించ శక్యము కాని పతి సేవారూపమగు కర్మచే తన భర్త, వేనపుత్రుడు అగు పృథువును అను సరిస్తూ మనలను దాటుకొని నిశ్చయముగా పై లోకములకు వెళ్లుచున్నది.

భూలోకములో మానవులు అల్పమగు ఆయుర్దాయము గలవారే అయిననూ, ఆత్మ అకర్త అని తెలుసుకొని నివృత్తి ధర్మ పరాయణులై ఈశ్వరునిలో ఐక్యమగుచున్నారు. అట్టి మానవులు సాధించలేనిది మరి యొకటి ఏమి ఉండును?

అయ్యో! ఎవడైతే మోక్షమునీయగలిగే మనుష్యజన్మను భూలోక ములో పెద్ద కష్టము మీద పొందియు, ఇంద్రియ భోగములయందు తగు ల్కొనినాడో, వాడు వాటిచే వంచితుడై, తనకు తానే ద్రోహమును చేసుకో నుచున్నాడు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దేవస్త్రీలు ఈ విధముగా స్తుతించుచుండగా ఆ పతివ్రత భర్త పొందిన లోకమునే పొందేను. ఆత్మవేత్తలలో అగ్రేసరుడు, అచ్యుతుడగు శ్రీహరిపై లగ్న మైన మనస్సు గలవాడు అగు పృథువు పొందిన ఉత్తమలోకమునే ఆమె కూడ పొందెను.

అతిశయించిన ఐశ్వర్యము గల ఆ ఈ పృథువు ఇట్టి అలౌకికమగు ప్రభావము గలవాడు. ఆయనయొక్క శ్రేష్టమగు చరితమును నేను నీకు వివరముగా చెప్పితిని.

ఈ చరితము చాల గొప్పది, పవిత్రమైనది. దీనిని సావధానముగా శ్రద్ధతో పఠించువాడు, ఇతరులకు వినిపించువాడు మాత్రమే గాక, విను వాడు కూడ పృథువు పొందిన లోకమును పొందెదరు.

దీనిని పఠించు బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సును పొందును. క్షత్రి యుడు భూపతి అగును. వైశ్యుడు వైశ్యప్రభుడు అగును. శూద్రుడు ఉత్త ములలో అగ్రేసరుడు అగును.

పురుషుడు గాని, స్త్రీ గాని దీనిని శ్రద్దతో మూడు సార్లు విన్నచో, సంతానము లేనివారు మంచి సంతానము గలవారిలో శ్రేష్ఠులుగను, ధనము లేనివారు ధనవంతులలో అగ్రేసరులుగను, వ్యాపించని కీర్తి గలవాడు మంచి కీర్తి గలవాడుగను, మూర్ఖుడు పండితుడుగను అగుదురు.

ఈ చరితము మానవులకు ‘మంగళములకు నిధానము. ఇది అమంగళములగు దుఃఖాదులను నివారించి, ధనమును కీర్తిని ఆయుర్దాయ మును ఇచ్చును. ఇది కలిదోషములను పోగొట్టి స్వర్గమునిచ్చును.

ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థములలో చక్కని సంసిద్దిని కోరు మానవులు దీనిని శ్రద్దతో అనుదినము పండితుడు చెప్పగా వినవలెను. ఈ నాలుగు పురుషార్థములను సిద్ధింప జేయు సాధనములలో ఇది సర్వోత్తమమైనది.

పృథువు ఏ రాజ్యమునకు వెళ్లినా, ఆ రాజు బహుమతులతో ఆయనకు ఎదురేగెడివాడు. అదే విధముగా, విజయమార్గములో పయ నించే రాజు ఈ గాథను శ్రవణము చేసి ముందుకు సాగినచో, ఆయా దేశపు రాజులు ఎదురు వచ్చి బహుమతులను (కప్పములను) సమర్పించేదరు.

సాధకుడు ఇతరవిషయములయందలి ఆసక్తిని విడిచి పెట్టి, భగవం తునియందు నిర్మలమగు (నిష్కామ) భక్తిని కలిగియున్నవాడై, వేనపుత్రు డగు పృథువుయొక్క పవిత్రమగు చరితమును వినవలేను, లేదా ఇతరు లకు వినిపించవలెను, లేదా పఠించవలేను.

విచిత్రవీర్యుని పుత్రుడవగు ఓ విదురా! శ్రీహరియొక్క (మహాత్ము లయొక్క) మహిమను సూచించే ఈ చరితమును నీకు చెప్పితిని. దీని యందు భక్తి గల మానవుడు పృథువు పొందిన ఉత్తమగతిని పొందును.

సాధకుడైన మానవుడు సంసారమునందలి ఆసక్తిని విడిచి పెట్టి, ప్రతిదినము ఈ పృథుచరితమును వింటూ, పది మందికి చెప్పుచున్నచో, వానికి భగవానునియందు దృఢమగు ప్రేమ (భక్తి) కలుగును. సంసారమనే సముద్రమును దాటుటకు భగవానుని పాదము నావ వంటిది. భగవానుని యందలి భక్తి భక్తునకు సర్వమును చేకూర్చే సామర్థ్యము గలది.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు పృథువు పరమగతిని పొందుటను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది.