శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
7 - దక్షయజ్ఞములో దేవతలు శ్రీహరిని స్తుతించుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- గొప్ప బాహువులు గల ఓ విదురా! స్వయంభువుడగు బ్రహ్మగారు ఈ విధముగా ప్రార్థించగా, శివుడు సంతోషించి నవ్వుతూ, వినుడు అని పలికెను.
మహాదేవుడగు శ్రీ శివుడు .ఇట్లు పలికెను --- ఓ బ్రహ్మా! ఈశ్వరుని మాయచే మోహితులై వివేకమును కోల్పోయిన దక్షాదుల అపరాధ మును గురించి నేను వర్ణించను; దాని గురించి నేను ఆలోచించనైననూ ఆలోచించను. కాని, ఆ సమయములో ఆ అపరాధమునకు తగిన శిక్షను నేను అమలు చేసితిని.
దక్ష ప్రజాపతి తల దగ్గ మైనది. ఆతనికి మేక తల ఉండగలదు. కన్నులను పోగొట్టుకున్న భగదేవత యజ్ఞములో తన భాగమును మిత్రదేవ తయొక్క కన్నుతో చూడగలడు.
పూష దేవత యజమానుని దంతములతో ఆహారమును నములు గాక! ఆతడు పిండినైననూ తినవచ్చును. దేవతలు యజ్ఞములో మిగిలిన సర్వమును నాకు భాగముగా ఇచ్చినారు. కావున, వారి అవయవములు పూర్వమునందు వలె స్వస్థములగుగాక!
చేతులను పోగొట్టుకున్న ఇతరులగు అధ్వర్యులనే ఋత్విక్కులు అశ్వినీ దేవతల బాహువులతో, పూష దేవత ముంజేతులతో తమ తమ పనులను చేసుకొందురు గాక! మీసములను, గెడ్డమును పోగొట్టుకున్న భృగు మహర్షికి మేకపోతు మీసములు, గెడ్డము ఉండగలవు.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ వత్సా విదురా! అప్పుడు అక్కడివారు అందరు శివుని మాటను విని తమ తమ హృదయములలో చాల సంతోషించిరి. శివుడు భక్తుల కోర్కెలను వర్షించే దైవము. అపుడు వారు సంతోషముతో బాగు, బాగు అని ఆయనను ప్రశంసించిరి.
తరువాత ఆ దేవతలు శివుని ప్రార్థించి, ఆయనను బ్రహ్మగారిని దోడ్కొని, మహర్షులు వెంట రాగా, మరల ఆ దక్షుని యజ్ఞశాలకు వెళ్లిరి.
వారు అచట శివభగవానుడు చెప్పినట్లుగా సర్వమును చేసిరి. దక్ష ప్రజాపతి మొండెమునకు యజ్ఞపశువుయొక్క తలను అతికించిరి.
శివుడు దయాదృష్టితో చూచుచుండగా, తలను అతికించిన వెంటనే, దక్షుడు నిద్రించినవాడు వలె లేచి నిలబడెను. ఆతనికి యెదుట శివుడు కనబడెను.
వృషభధ్వజుడగు శివుని ద్వేషముచే దక్ష ప్రజాపతియొక్క అంతః కరణము కలుషితమైనదియే. కాని, శివుని దయాదృష్టి . ఆతనిపై పడెను. పైగా ఆతడు బ్రతికిన వెంటనే శివుని దర్శించెను. దాని వలన, ఆతని అంతఃకరణము శరత్కాలము రాగానే చెరువులలోని నీరు బురద దిగిపోయి తేటపడు విధముగా, స్వచ్ఛమయ్యెను.
దక్షుడు శివుని స్తుతించవలెనని సంకల్పించెను. కాని, ఆతనికి మర ణించిన కుమార్తె గుర్తుకు వచ్చి మనస్సు అనురాగముతో ఆందోళనతో నిండిపోయెను. కన్నీరు ధారగా స్రవించుచుండుటచే, ఆతడు మాటలాడ లేకపోయెను.
దక్ష ప్రజాపతి విద్వాంసుడు. కాని, ఆతని మనస్సు ప్రేమచే స్వాధీ నత తప్పియుండెను. ఆతడు కష్టము మీద మనస్సును నిలదొక్కుకొని, కపటము లేని భావము (భక్తి) తో శివుని స్తుతించెను.
దక్షుడు ఇట్లు పలికెను - నేను నిన్ను నిందించితిని. అయిననూ, నీవు ముందుగా నాకు శిక్షను వేసి, తరువాత ఆ శిక్షను రద్దు చేసి, రెండు విధములుగా నాయందు అనుగ్రహమునే చూపితివి. ఆశ్చర్యము! ఓ భగవానుడా! నీకు, శ్రీహరికి బ్రాహ్మణాధములయందు కూడ నిరాదరణ లేదు. అట్టిచో, యజ్ఞదీక్షను స్వీకరించినవారియందు మీకిద్దరికీ నిరాదరణ ఏల ఉండును?
ఓ పరమేశ్వరా! నీవు సర్వవ్యాపకుడవు. వేదములను, ఆత్మజ్ఞాన మును రక్షించుట కొరకై సృష్ట్యాదియందు బ్రహ్మరూపుడవై ముఖము నుండి బ్రాహ్మణులను సృష్టించితివి. వారు జ్ఞాననిష్ఠను, తపస్సు (ఉపాస న) ను, కర్మనియమములను పాటిస్తూ వేదధర్మమును రక్షించిరి. కావుననే, ఆపదలు వచ్చినప్పుడు నీవు ఆ వేదవేత్తలను బ్రహ్మవేత్తలను రక్షించుచు న్నావు. పశుపాలకుడు చేత కర్రను బట్టి వారిని తప్పే పశువులను అద లించి తద్వారా వాటిని రక్షించును. అదే విధముగా, నీవు కూడ దుష్టులను గట్టిగా శిక్షించి, తద్ద్వారా వారిని రక్షిస్తూ, వారి ద్వారా వేదధర్మమును రక్షిం చుచున్నావు. నీవు నా వంటి వారలకు విధించే శిక్ష కూడ మమ్ములను రక్షించుటయే అని తాత్పర్యము.
నేను శివుని యథార్థస్వరూపమును తెలియని వాడను. నిండు సభలో నేను ఆయనను నిందావచనములనే బాణములతో కొట్టితిని. కాని, దయామయుడగు ఆయన దానిని పట్టించుకొనలేదు. పరమపూజ్యుడగు శివుని నిందించుటచే నేను నరకములో పడబోవుచుండగా, ఆ శివ భగవా నుడు నన్ను తన దయాపూర్ణమైన చూపుతో చూచి, రక్షించినాడు. నాయందు అర్హత ఏమియు లేదు. నేను ఆయనకు చేయదగిన పూజాది కము కూడ సున్న. కాని, ఆయన నన్ను రక్షించినాడు. తన మహోద్దార మగు ఈ చేష్ట చేతనే ఆయన సంతుష్టుడగుగాక!
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఆ దక్షుడు భక్తులకు కోరికలను వర్షించే శివునకు క్షమాపణలు చెప్పుకొనెను. తరువాత ఆతడు బ్రహ్మగారి అనుజ్ఞచే ఉపాధ్యాయునితో మరియు ఋత్విక్కులతో గూడి, అగ్నులను వ్రేల్చి, మిగిలిపోయిన యజ్ఞకర్మను బాగుగా ప్రవర్తిల్ల జేసెను.
యుద్దవీరులు యజ్ఞభూమినంతనూ తొక్కివేయుటచే కలిగిన దోషము శాంతించి యజ్ఞము సుసంపన్నము అగుట కొరకై ఆ బ్రాహ్మణోత్త ములు మూడు ఘటశకలములలో సంస్కరించబడిన పురోడాశమును విష్ణువునుద్దేశించి హోమమును చేసిరి.
ప్రజలను శాసించే (ఇంద్రియవిజేతవగు) ఓ విదురా! అధ్వర్యుడు హవిస్సును చేతబట్టి నిలిచియుండగా, యజమానుడగు దక్షుడు పరిశుద్ద మగు అంతఃకరణముతో శ్రీహరిని ధ్యానించెను. వెనువెంటనే, శ్రీహరి అక్కడ సాక్షాత్కరించెను.
అప్పుడు గరుడుడు శ్రీహరిని అక్కడకు తీసుకొనివచ్చెను. సామ వేదస్తోత్రములగు బృహత్ మరియు రథంతరములే ఆ గరుడుని రెక్కలు. పది దిక్కులు వెలిగిపోవునట్లు చేసే ఆ శ్రీహరియొక్క కాంతి ముందు బ్రహ్మాదులు వెలవెల బోయిరి.
నల్లనివాడగు ఆ శ్రీహరి బంగరు మొలత్రాడుతో, బంగారము వంటి పచ్చని వస్త్రముతో, సూర్యుని వలె ప్రకాశించే కిరీటముతో శోభిల్లెను. తుమ్మెదలవంటి ముంగురులు గల ఆయన ముఖము కుండలములతో అలంకరింపబడి యుండెను. ఆయన బంగరు . ఆభరణములను కలిగి యున్న తన ఎనిమిది భుజములతో శంఖము, పద్మము, చక్రము, బాణము లు, ధనస్సు, గద, కత్తి, డాలులను ధరించి భక్తులను రక్షించుటకొరకై వేగిర పడుచుండెను. ఈ ఆయుధములతో ఆయన పుష్పించిన కొండగోగు చెట్టు వలె ప్రకాశించేను.
వక్షఃస్థలమునందు లక్ష్మిని దాల్చియుండే ఆ శ్రీహరి అడవి పువ్వుల దండను ధరించెను. ఆయన చిరునవ్వుతో మరియు కంటి చూపులతో ప్రేమను ఒలకబోస్తూ జగత్తును ఆహ్లాదపరచుచుండెను. ఆయనకు ఇరువైపులా రాజహంసలవంటి వింజామరలు కదలాడుచుండెను. తల పై చంద్రునివంటి తెల్లని గొడుగుతో ఆయన అధికముగా ఒప్పా రెను.
బ్రహ్మ ఇంద్రుడు మరియు ముక్కంటి నాయకులుగా గల దేవతా గణములు మరియు ఇతరులు దగ్గరకు వచ్చిన ఆ శ్రీహరిని చూచిరి. వారు వెంటనే లేచి ఆయనకు నమస్కరించిరి.
ఆ దేవతలు శ్రీహరి ప్రకాశము ముందు వెలవెలబోయిరి. ఆయనను చూడగనే వారు మాటలను కట్టిపెట్టి, కంగారు పడుతూ, తలల పై దోసిళ్లను ఒగ్గి నమస్కరించిరి. ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని తత్త్వము గల ఆ శ్రీహరిని వారు నిలబడి స్తుతించిరి.
స్వయంభువుడగు బ్రహ్మగారు మొదలుగా గల ఆ దేవతలు శ్రీహరియొక్క విభూతులు మాత్రమే. ఆయన మహిమ, వారు వాక్కులతో చేసే వర్ణనకు గాని, మనస్సుయొక్క ఊహకు గాని అందదు. అయిననూ, తమను అనుగ్రహించి తమ యెదుట తన రూపమును ప్రకటించిన ఆ శ్రీహరిని వారు తమ బుద్ధికి తగ్గట్లుగా స్తుతించిరి.
శ్రీహరి ఎక్కడ ప్రకటమైననూ భక్తులు పూజాసామగ్రిని ఉత్తమమగు పాత్రలో పెట్టి ఆయనకు సమర్పించగా, ఆయన వాటిని స్వీకరించును. దక్షుడు కూడ ఏకాగ్రమగు చిత్తముతో అటులనే చేయగా, శ్రీహరి ఆ పూజను స్వీకరించెను. నందుడు, సునందుడు మొదలగు అనుచరులు శ్రీహరిని చుట్టువారి యుండిరి. దక్షుడు చేతులను జోడించి ప్రజాపతులకు పరమగురువు, యజ్ఞేశ్వరుడు అగు ఆ శ్రీహరిని స్తుతిస్తూ శరణు వేడెను.
దక్ష ప్రజాపతి ఇట్లు పలికెను --- ఆత్మచైతన్యమునందు సర్వము ప్రకాశించుచున్ననూ, ఆ ప్రకాశించే సర్వముయొక్క గుణదోషములు వైతన్యమును ప్రభావితము చేయవు. కావుననే, ఆత్మచైతన్యము నిత్యశుద్ధ ము. దానియందు రెండవది లేదు గనుక, భయమునకు తావు లేదు. జాగ్ర త్తు, స్వప్నము, సుషుప్తి అనే మూడు అవస్థలు ఆత్మచైతన్యమునందే ప్రకా శించుచున్ననూ, ఆత్మ చైతన్యము ఈ మూడు అవస్థలకు అతీతముగనే నిలిచియుండును. అట్టి బ్రహ్మాభిన్నమగు ఆత్మ చైతన్యమే నీ స్వరూపమై యున్నది. స్వతంత్రుడవగు నీవు మాయాశక్తికి అతీతుడవై నీ స్వరూపమగు చిద్దనమునందే నిలిచియున్ననూ, మాయాశక్తియందు ప్రతిఫలించి మను ష్యభావమును పొందినవాని వలె, దోషము గలవాని వలె కన్పట్టెదవు.
ఋత్విక్కులు ఇట్లు పలికిరి --- ఓ దేవా! వివిధములగు దేహోపా ధులయందు నీవు ఆత్మరూపముగా ప్రకటమగుచున్ననూ, ఆయా ఉపా ధుల దోషములు నీకు అంటవు. నందీశ్వరుని శాపము వలన మా బుద్ధిలో కేవలము కర్మయందలి పట్టుదల మాత్రమే ఉన్నది. అట్టి మేము నీ యథా ర్థస్వరూపమును తెలియకున్నాము. జనులను ధర్మమార్గమునందు 'ప్రవ ర్తిల్ల జేయునది, మూడు. వేదములచే ప్రతిపాదించబడునది అగు ఈ యజ్ఞము నీ రూపమే. ఈ యజ్ఞము సిద్ధించుట కొరకై నీవే ఇంద్రుడు మొద లగు దేవతల రూపములో ప్రకటమైనావు. ఈ దేవతలు, నియమములు యజ్ఞసిద్ధి కొరకు మాత్రమే నీచే ప్రవర్తిల్ల జేయబడుచున్నవి.
సభాసదులు ఇట్లు పలికిరి --- రక్షణనిచ్చే ఓ దేవా! అజ్ఞానులగు మానవుల సమాజము జననమరణప్రవాహరూపమగు సంసారమార్గములో పడి పోవుచున్నది. మృత్యువు అనే భయంకరమగ పాము వెంటబడే ఈ మార్గములో వారికి రక్షకుడు లేడు. ఈ సంసారమార్గములో అవిద్య (ఆత్మ స్వరూపము తెలియకుండుట), అస్మిత (అహంకారము), రాగము, ద్వేష ము, అభినివేశము (మృత్యుభయము) అనే అయిదు చిత్తమలములనే దుర్గ ములను అధిగమించుట వారికి చాల కష్టమగుచున్నది. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములనే గోతులలో పడుతూ లేస్తూ ఉండే ఆ జనులకు, సమాజములోని దుష్టులు అనే క్రూరమృగముల వలన చాల బెడద కలుగుచుండును. ఈ సంసారమనే అడవి దారిలో శోకమనే దావాగ్ని మండుచుండును. మానవులు శరీరము, ఇల్లు-వాకిలి అనే పెద్ద బరువును మోసుకుంటూ, విషయసుఖములు (ఇంద్రియభోగములు) అనే ఎండమావుల కొరకై ఈ మార్గములో పడీ పోవుచున్నారు. వారిని కామ . నలు ఈ దారిలో పరవశులను చేయుచుండును. నీ పాదములను పట్టుకున్నచో, వారికి రక్షణ లభించును. కాని, వారా పనిని చేసేది ఎప్పుడు?
రుద్రుడు ఇట్లు పలికెను --- వరములనిచ్చే ఓ శ్రీహరీ! ఈ జగ త్తులో కామనలు గల జనులు మాత్రమే గాక, కామనలు లేని మహర్షులు కూడ నీ శ్రేష్ఠమగు పాదమును శ్రద్ధతో పూజించెదరు. నా చిత్తము అట్టి నీ పాదమునందు స్థిరముగా లగ్నమై యున్నది. అట్టి నన్ను అజ్ఞానియగు వ్యక్తి తప్పుగా నిందించిననూ, నేనా నిందను లెక్క చేయను. ఏలయన, భక్తులపై నీవు చూపే ఉత్కృష్టమగు నీ అనుగ్రహము నాకు గలదు.
భృగుమహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మగారు మొదలగు దేహధారులు (జీవులు) దాట శక్యము కాని నీ మాయచే మోహితులై తమ స్వరూపమును తెలియకున్నారు. తమ హృదయములో నీవు చైతన్యరూపముగా ప్రకటమగుచున్ననూ, అజ్ఞాననిద్రలో నున్న ఆ బ్రహ్మాదులు ఇప్పటికి కూడా నిన్ను ఆత్మరూపముగా గుర్తించలేకున్నారు. నీవు భక్తులకు ఆత్మ బంధుడవు. అట్టి ఈ నీవు నాపై ప్రసన్నుడవగుదువు గాక!
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఈ మానవుడు ఇంద్రియములతో జగత్తులోని పదార్థముల మధ్యనుండే భేదమును మాత్రమే తెలియగల్గును. ఆ విధముగా భేదమును చూస్తూ ఉన్నంత కాలము వానికి నీ స్వరూపము తెలియదు. ఏలయనగా, ఒక పదార్థముయొక్క జ్ఞానమును కలిగించే చైత న్యావిష్ణమగు మనోవృత్తికి, ఆ పదార్థమునకు మరియు ఆ పదార్థమును గుర్తించే ఇంద్రియమునకు కూడ నీవే అధిష్ఠానము. అనగా, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే త్రిపుటి ఆత్మచైతన్యస్వరూపుడవగు నీయందే అధ్య స్తమగుచున్నది. లేకున్ననూ కానవచ్చే ఈ పదార్థములకంటె విలక్షణమగు ఆత్మచైతన్యమే నీవు.
ఇంద్రుడు ఇట్లు పలికెను --- వినాశము లేని ఓ శ్రీహరీ! నీవీ రూపములో జగత్తును పాలించుచున్నావు. నీవు దండముల వంటి ఎనిమిది భుజములలో ఆయుధములను సంసిద్దముగా దాల్చి, దేవతలను విశేష ముగా ద్వేషించే రాక్షసులను మట్టుబెట్టుచున్నావు. అట్టి నీ ఈ రూపము కూడ మనస్సునకు, కళ్లకు ఆనందమును కలిగించుచున్నది.
యాజ్ఞికుల పత్నులు ఇట్లు పలికిరి --- ఓ పద్మనాభా! నీవు యజ్ఞ స్వరూపుడవు. బ్రహ్మగారు నిన్ను జనులు ఆరాధించుట కొరకై యజ్ఞమును సృష్టించెను. అట్టి యజ్ఞమును చేయుటకు దక్షుడు పూనుకొనెను. కాని, వాని కోపము యజ్ఞమునకు విఘ్నమును కలిగించినది. రుద్రుడు దక్షునిపై కోపించి, ఆ యజ్ఞమును నాశము చేసినాడు. ఇప్పుడా యజ్ఞశాల కర్మల న్నియు ఆగిపోయి శ్మశానమును పోలియున్నది. నీవు కలువ కాంతుల కన్నులతో చూచి దానిని పావనము చేయుము.
మహర్షులు ఇట్లు పలికిరి --- ఓ భగవానుడా! నీ లీల అద్భుత ము. ఏలయన, నీవు శరీరముతో కర్మలను ఆచరిస్తూనే ఉంటావు. కాని, నీయందు కర్తృత్వము గాని, ఫలాసక్తి గాని లేవు. జనులు సంపద కొరకు లక్ష్మీదేవిని ఆరాధించేదరు. అట్టి లక్ష్మీ నిన్ను అనుసరించి యున్ననూ, నీవు సంపదలపై స్పృహను కలిగియుండవు. నేను లక్ష్మీపతిని అనే అభి మానము నీకు ఉండదు.
సిద్దులు ఇట్లు పలికిరి --- ఏనుగు వలె నిలబెట్ట శక్యము కాని మా ఈ మనస్సు అజ్ఞానము, అహంకారము, ఇచ్చ, ద్వేషము మరియు మృత్యుభయము అనే చిత్తమలముల తాపమును అనుభవిస్తూ, విషయభో గములయందలి తృష్ణచే పీడితమై యున్నది. అడవిలో దావాగ్నిచే తాప మును పొంది, దప్పికను గొన్న ఏనుగు నదీప్రవాహములో కూర్చుండి బయటకు రాని తీరున, అట్టి ఈ మా మనస్సు నీ గాథలు అనే అమృతప్ర వాహములో మునకను వేసియున్నది. నీ గాథల అమృతము మా మన స్సునకు బలమును గూర్చినది. ఇప్పుడు మాకు ఆ చిత్తమలముల స్మర ఐయే లేదు. మాకు ఆ గాథలను విరమించాలనే భావనయే కలుగుట లేదు. మా మనస్సు పరబ్రహ్మలో విలీనమైనట్లే ఉన్నది.
దక్షుని భార్యయగు ప్రసూతి ఇట్లు పలికెను --- ఓ శ్రీనివాసా! నీవు పరమేశ్వరుడవు, జగన్నాథుడవు. నీకు స్వాగతము. మమ్ములను అనుగ్రహించుము. నీకు నమస్కారము. నీవు ప్రియురాలగు లక్ష్మీదేవితో గూడి మమ్ములను రక్షించుము. యజ్ఞేశ్వరుడవు నీవే. తల లేని మొండెమునకు కాళ్లు, చేతులు మొదలగు అవయములు ఉన్ననూ శోభ లేని విధము గా, ప్రయాజలు మొదలగు యజ్ఞాంగములతో కూడియున్ననూ నీవు లేని యజ్ఞమునకు శోభ లేదు.
లోకపాలకులు ఇట్లు పలికిరి --- ఓ పరబ్రహ్మ స్వరూపా! ఆత్మ చైతన్యమే నీ స్వరూపము. నీవు జీవుల బుద్ధియందు సాక్షి చైతన్యరూపముగా ప్రతిఫలించి, ఇంద్రియములకు జ్ఞానమును కలిగించే శక్తిని అనుగ్రహించు చున్నావు. ఈ ఇంద్రియములు మిథ్యాభూతములగు నామరూపములను మాత్రమే దర్శించగలవు. అట్టి ఇంద్రియములు దృశ్యజగత్తును చూడగలవే గాని, నిన్ను చూడగలపో? చూడలేవు. ఈ జగత్తు నీ మాయాశక్తినుండి పుట్టినది. పంచభూతములతో కూడిన ఈ జగత్తు అధిష్టానమగు నీయందే భాసించుచున్నది. కాని, నీవు ఆరవవాడుగనే, అనగా పాంచభౌతిక జగత్తు కంటే విలక్షణుడుగనే నిలిచియున్నావు. నీవు పంచభూతములకు అతీతుడ వైననూ, భౌతికశరీరముతో ప్రకాశించుచున్నావు. అనగా, పంచభూతములు నీ అఖండసత్తను ప్రకటింపజేసే ఉపాధులు.
యోగేశ్వరులు ఇట్లు పలికిరి --- ఓ ప్రభూ! ఈ జగత్తుయొక్క వాస్తవస్వరూపము నీవే. అట్టి నీయందు తాను గాని, సకలజీవులు గాని ఐక్యమును పొందియున్నారే గాని వేరుగా లేరని' ఆత్మవేత్తలు దర్శిం చెదరు. అట్టి జ్ఞానులకంటె అధికముగా నీ ప్రీతికి పాత్రులు మరియొకరు లేరు. భక్తులు నిన్ను తమ స్వామిగా స్వీకరించి, ఇతరములగు ఆకాంక్షలను విడిచి నీయందు నిశ్చలమగు భక్తిని చేయుదురు. భక్తజనప్రియుడవగు నీవు అట్టి భక్తులను కూడ అనుగ్రహించుము.
ఈ జగత్తు పరమేశ్వరుని మాయాశక్తినుండి పుట్టి, పరమేశ్వరుని వలన స్థితిని పొంది, మరల ఆయనయందే విలీనమగుచున్నది. ఆయా జీవుల ప్రారబ్ధకర్మానుసారముగా మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణముల సమ్మేళనము వివిధజీవులలో విభిన్నముగా కానవచ్చును. ఈ విధ ముగా జీవులలో ప్రకటమయ్యే భేదాభిమానము కూడ ఆ ఈశ్వరునియందే అధ్యస్తమై యున్నది. ఆ పరమేశ్వరుడు తన స్వరూపమునందు నిలిచి ఉంటూనే, మాయాశక్తియొక్క ఈ గుణములకు, వాటి వలన కలిగే భేద భ్రాంతికి ఆలంబనమగుచున్నాడు. అట్టి పరమేశ్వరునకు నమస్కారము.
వేదపురుషుడు ఇట్లు పలికెను ... నీవు సత్త్వగుణప్రధానుడవై ధర్మార్థకామమోక్షములను భక్తులకు అనుగ్రహించుచున్నావు. కాని, నీవు నిర్గుణుడవు కూడా. నీ తత్త్వమును జ్ఞానరూపుడనగు నేనే తెలియకు న్నాను. ఇతరులు కూడ నీ స్వరూపమును తెలియకున్నారు.
అగ్ని ఇట్లు పలికెను --- నేను ఆ శ్రీహరియొక్క తేజస్సుచేతనే చక్కగా ప్రజ్వరిల్లే తేజస్సును కలిగినవాడనై, యజ్ఞములో ఋత్విక్కులు శ్రద్దతో సమర్పించే నేతితో తడిసిన హవిస్సును ఆయా దేవతలకు చేర్చుచున్నాను. యజ్ఞమూర్తియగు ఆ శ్రీహరియే అగ్నిహోత్రము, దర్శ, పూర్ణ మాస, చాతుర్మాస్యము, సోమయాగము అనే ఐదు యజ్ఞముల రూపములో నున్నాడు. ఆశ్రావయ (ఓ ఆగ్నీధ్రా! హవిస్సు సిద్ధముగానున్నదని దేవతకు వినిపించుము అనే అధ్వర్యుని వచనము), అస్తు శౌషట్ (సరే, ఓ దేవతా! వినుము, హవిస్సు తయారుగా నున్నది అనే ఆగ్నీధ్రుని వచనము), యజ (ఓ హో! యాజ్యమంత్రమును పఠించుము అనే అధ్వర్యుని వచనము), యే యజామహే (అధ్వర్యునిచే ప్రేరితులమైన మేము యాజ్య మంత్రములను పఠించుచున్నాము అనే హోతృగణముయొక్క వచనము), వషట్ (దేవతకు హవిస్సు సమర్పితమగుగాక! అనే అధ్వర్యుని వచనము) అనే ఐదు యజుర్మంత్రములతో ఋత్విక్కులు (ఆగ్నీధ్రుడు, అధ్వర్యుడు, హోత అనునవి ఋత్విక్కుల పేర్లు) యజ్ఞరక్షకుడగు ఆ శ్రీహరిని చక్కగా ఆరాధించెదరు. నేనాయనకు నమస్కరించుచున్నాను.
దేవతలిట్లు పలికిరి --- ఈ సృష్టికి పూర్వము కల్పము పూర్తి అయినప్పుడు ప్రళయము ఆసన్నము కాగా, నీవు నీచేతనే సృష్టించబడిన వికారసముదాయరూపమగు కార్యజగత్తును. నీ పొట్టలో పెట్టుకొని, ఆ ప్రళయజలమునందు నాగరాజగు ఆదిశేషుడే గొప్ప పడక కాగా పరుండెదవు. తమ హృదయములో ఆత్మచైతన్యస్వరూపుడవై యున్న నిన్ను సిద్ధపురుషులు తమ మనస్సులో ధ్యానించుచుందురు. ఆదినారాయణుడవగు అట్టి నీవే ఈనాడు మా కన్నులకు కనబడి, సేవకులమగు మమ్ములను రక్షించు చున్నావు.
గంధర్వులిట్లు పలికిరి --- పరబ్రహ్మరూపుడవగు ఓ దేవా! మాకు నీవే నాథుడవు. మరీచి మొదలగు ఈ ప్రజాపతులు, దేవతలకు అగ్రేసరు డగు రుద్రుడు, బ్రహ్మగారు ఇంద్రుడు మొదలుగా గల దేవతల గణములు నీ అంశలకు కూడ అంశలై యున్నారు. ఈ బ్రహ్మాండము నీ లీలలకు ఉప కరించే సాధనము. అట్టి నిన్ను మేము సర్వదా నమస్కరిస్తూ ఉండెదము గాక!
విద్యాధరులు ఇట్లు పలికిరి --- ఈ మనుష్యదేహము పురుషార్థ సాధనము. ఇది పుణ్యకర్మల బలముచే లభించును. దీనిని పొంది కూడ దుర్బుద్ధియగు జనుడు, తన వారు మరియు తన ఇంద్రియములు తప్పుదారిలో నడుచుటను అనుమతించుచున్నాడు. నీ మాయచే మోహితుడైన ఇట్టి జనుడు శరీరమే తాననియు, లేదా శరీరము తనదనియు అభిమానము పెట్టుకొనియున్నాడు. అట్టి మూర్ఖుడు హానిని చేసే ఇంద్రియభోగ ములయందు తగుల్కొనియుండును. కాని, దీనికి భిన్నముగా నీ భక్తుడు నీ గాథలనే అమృతమును సేవిస్తూ, తన బుద్ధియందలి అజ్ఞానమును దూరముగా పారద్రోలుచున్నాడు.
బ్రాహ్మణులిట్లు పలికిరి --- యజ్ఞము నీవే. దానిలో దేవతకు సమర్పించబడే ద్రవ్యము, అగ్నిలో ఆ ద్రవ్యమును సమర్పించే క్రియ, ఆ అగ్ని హోత్రుడు మరియు ఆ దేవత కూడ స్వయముగా నీవే. మంత్రము, సమిధలు, దర్భలు, యజ్ఞపాత్రలు, సోమరసము, నేయి మరియు పశువు కూడ-నీ రూపములే. సభాసదులు, ఋత్విక్కులు, యజమానుడు, ఆయన పత్ని కూడ నీ రూపములే. పితృదేవతలకు చేసే శ్రాద్ధాదులు కూడ నీ రూపమే.
మూడు వేదములే శరీరముగా గల ఓ శ్రీహరీ! యజ్ఞమును చేయాలనే సంకల్పము కూడ నీ రూపమే. నీవు పూర్వము గొప్ప వరాహ మూర్తిగా అవతరించి నినదిస్తూ, పాతాళమునుండి భూమిని కోరతో పైకి తెచ్చితివి. పెద్ద ఏనుగు పద్మపు మొక్కను సరస్సునుండి పైకి తీసినంత అవలీలగా నీవా పనిని చేయగా, సిద్ధులు నిన్ను స్తుతించిరి.
ఓ యజేశ్వరా! మేము నీ దర్శనమును గట్టిగా కోరుచున్నాము. మేము మొదలు పెట్టిన మంచి యజ్ఞము వినష్టమైనది. మమ్ములననుగ్రహించుము. నీ నామమును కీర్తించు జనులకు యజ్ఞములో విఘ్నములు దూరమగును. నీకు నమస్కారము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- మంగళకరుడవగు ఓ విదురా! ఈ విధముగా వారు ఇంద్రియాధిపతి, యజ్ఞరక్షకుడు అగు శ్రీహ రిని కీర్తించుచుండిరి. అపుడు దక్షుడు స్వచ్చమగు అంతఃకరణముతో వీరభద్రునిచే ధ్వస్తము చేయబడిన యజ్ఞమును మరల చేయ మొదలిడెను.
పాపమునేరుగని ఓ విదురా! శ్రీహరి సర్వులకు ఆత్మయై ఉన్నాడు గనుక, సర్వదేవతల యజ్ఞభాగములను భుజించువాడు ఆయన యే. కాని, ఆయన తన భాగముతో తృప్తిని చెందినాడా యన్నట్లు దక్షుని సంబోధించి ఇట్లు పలికెను.
శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- నేను పర్వకారణకారణుడను. నేను జగత్కారణుడనే అయిననూ, జగత్తునకు అతీతుడను (అనగా, జగత్తు నా వివర్తము మాత్రమే, అనగా, నాయందు వాస్తవముగా లేకున్ననూ ఉన్నట్లు కనబడేది). ఈ సర్వమునకు ఆత్మ (స్వరూపసత్త) నేనే. ఈ జగత్తునకు ఆ విధముగా అధీశ్వరుడను కూడ నేనే. స్వయంప్రకాశస్వరూపుడనగు నాకు జగత్తు అనే ఉపాధి గుణములు సంక్రమించవు. నేను ఎట్టివాడనో బ్రహ్మగారు, శివుడు కూడ అట్టివారే. అనగా నాకు వారితో భేదము ఏమియు లేదు.
ఓ దక్షా! అట్టి నేను త్రిగుణాత్మకమగు నా మాయాశక్తిని నా వశ ములో నుంచుకుంటూ, దానిని ఉపాధిగా చేసుకొని జగత్తును సృష్టించి, రక్షించి, ఉపసంహరించుచుందును. క్రమముగా ఈ మూడు జగత్కార్యము లకు తగిన బ్రహ్మవిష్ణురుద్రులనే మూడు పేర్లను నేనే కలిగియుందును.
అఖండసత్తారూపమగు పరబ్రహ్మకంటే రెండవది మరియొకటి లేదు. జీవులలో అంతరతమమగు ఆత్మ చైతన్యము రూపములో ఆ పరబ్ర హ్మయే ఉన్నది. అదియే నేను. కాని, అజ్ఞాని బ్రహ్మగారు, రుద్రుడు, ఇతర జీవులు అనే భేదమును పరబ్రహ్మయందు దర్శిస్తూ, ఆట్టి భేదమే సత్య మని తలపోయుచున్నాడు.
మానవుడు తల, చేయి మొదలగు తన శరీరావయవములు తన కంటె వేరుగా నున్నవని ఎక్కడైనా ఎప్పుడైననూ తలపోయడు. అదే విధ ముగా, నా భక్తుడు సకలప్రాణులు నాకంటె వేరుగానున్నవని తలపోయడు.
ఓ మహాత్మా విదురా! బ్రహ్మవిష్ణురుద్రుల స్వరూపము, సకలప్రా ణుల ఆత్మస్వరూపము ఒక్కటీయే. తేడా లేదు. ఈ సత్యమును తెలుసు కున్న వ్యక్తి మోక్షమును పొందును.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శ్రీహరి ఆదే శించగా, ప్రజాపతులకు నాయకుడగు దక్షుడు శ్రీకపాలేష్టి (మూడు కపాల ములయందు సంస్కరించబడిన పురోడాశము సమర్పించబడే యాగము) చే శ్రీహరిని అర్చించెను. ఇతరదేవతలను కూడ అంగయాగము, ప్రధాన యాగము అనే రెండు యాగములతో ఆరాధించెను.
దక్షుడు ఏకాగ్రచిత్తముతో శివునకు యజ్ఞశిష్టమగు భాగమును సమర్పించి పూజించేను. యజ్ఞమునకు ఆఖరులో చేసే ఉదవసానేష్టిని కూడ చేసి, సోమమునందు భాగము గల ఇతరదేవతలను కూడ ఆతడు పూజించెను. తరువాత ఆతడు ఋత్విక్కులతో గూడి అవభృథ స్నానమును (యజ్ఞదీక్ష అయిన తరువాత చేసే స్నానము) చేసెను.
ఈ విధముగా భగవానుని స్వయముగా ఆరాధించి, దాని ప్రభావముచే మాత్రమే దక్షుడు ధర్మమును సిద్ధింపజేసుకొనెను. దేవతలు ఆతనికి ధర్మమునందు మాత్రమే బుద్ధి నిలుచునట్లు అనుగ్రహించి, స్వర్గమునకు వెళ్లిరి.
దక్షుని కుమార్తెయగు సతీదేవి ఈ విధముగా ఆ దేహమును విడిచి పెట్టి, హిమవంతుని భార్యయగు మేనకు కుమార్తెయై జన్మించినదని విని యున్నాము.
ప్రళయకాలములో భగవంతునియందు ఉపసంహరించబడిన మాయాశక్తి సృష్టికాలములో పునరుత్థానమును చెంది ఆ ఈశ్వరుని మాత్రమే ఆశ్రయించును. అదే విధముగా జగన్మాతయగు ఆ పార్వతి ఆ శివుని మాత్రమే తనకు ప్రియమైన భర్తగా సేవించెను. ఇతరమునందుప్రేమ లేనివారలకు ఆయన ఏకైకశరణ్యుడు గదా!
శంభుభగవానుడు ఈ విధముగా దక్షుని యజ్ఞమును ధ్వంసము చేసిన లీలను నేను ఉద్ధవునినుండి వింటిని. బృహస్పతికి శిష్యుడగు ఉద్ధ వుడు భగవద్భక్తుడు.
ఓ విదురా! శివుని ఈ లీల మిక్కిలి పావనము. ఈ లీల భక్తులకు కీర్తిని, ఆయుర్దాయమును ఇచ్చి పాపప్రవాహము ఎండిపోవునట్లు చేయు ను. ఏ మానవుడైతే దీనిని నిత్యము భక్తిభావముతో విని కీర్తించునో, వాని పాపములు నశించును.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో దక్షయజ్ఞమునందు దేవతలు శ్రీహరిని స్తుతించుటను వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).
