శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

27 - పురంజనోపాఖ్యానము - కాలకన్యోపాఖ్యానము

నారద మహర్షి ప్రాచీనబరీషునితో ఇట్లు పలికెను --- ఓ మహా రాజా! పురంజని ఈ విధముగా భర్తయగు పురంజనుని విలాసలతో పూర్తిగా తన వశము చేసుకొని, తాను రమిస్తూ ఆయనను రమింపజేసెను.

ఓ రాజా! సుందరవదనయగు పురంజని చక్కగా స్నానమాడి కుంకుమ మొదలగు మంగళద్రవ్యములతో అలంకరించుకొని, ఆనంద ముతో భర్తయగు పురంజన మహారాజు వద్దకు రాగా, ఆయన ఆమెను అభినందించెను.

ఆమె ఆతనిని కౌగిలించగా, ఆతడు ఆమె మెడను కౌగిలించెను. ఆమె ఏకాంతములో ఆతనితో గుసగుసలాడుచుండగా, మనస్సు ఆమెచే ఆకర్షించబడి, పురంజనుడు మత్తెక్కించే ఆమెయే జీవితధ్యేయముగా గల వాడు ఆయెను. ఆతనికి రాత్రింబగళ్ల రూపములో పరుగు దీ సే కాలము యొక్క వేగము తెలియలేదు. కాలమును దాటుట ఎవరికైననూ శక్యము కాదు గదా!

అధికముగా గర్వము పెరిగి వీరుడగు పురంజనుడు పెద్ద అభిమా నము గలవాడయ్యెను. మిక్కిలి విలువైన శయ్య పై భార్య భుజముపై తల పెట్టుకొని పరుండియున్న ఆ రాజునకు ఆమే మాత్రమే పరమపురుషార్థముగా గోచరించెను. అజ్ఞానముచే పరాభూతుడైయున్న ఆ రాజునకు తన స్వరూపమగు పరబ్రహ్మను తెలియుట పురుషార్థమగునని తోచనేలేదు.

ఓ మహారాజా! ఈ విధముగా కామముచే మలినమైన మనస్సు గల పురంజనుడు ఆమెతో గూడి రమించుచుండగా, యౌవనము అర్దక్ష ణము వలే కరిగిపోయెను.

ఓ ప్రజాపతీ! పురంజన చక్రవర్తికి ఆ పురంజనియందు నూట పద కొండుమంది కొడుకులు, నూట పదిమంది కుమార్తెలు కలిగిరి. అప్పటికి ఆతని ఆయుష్షు సగము గడిచిపోయెను. పౌరంజనీలు అని పేరు పొందిన ఆ కుమార్తెలు సచ్చీలము, పెద్ద మనస్సు అనే మంచి గుణములు గలవారై తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చి పెట్టిరి.

పంచాలదేశప్రభువగు ఆ పురంజనుడు పితృవంశమును వర్ధిల్ల జేసే పుత్రులకు వివాహములను చేసెను. కుమార్తెలకు కూడ అనురూ పులగు వరులతో వివాహములను చేసెను.

పురంజనుని ఆ పుత్రులలో ఒక్కొక్కనికి వంద చొప్పున పుత్రులు కలిగిరి. వారు పంచాలదేశములో పురంజనుని వంశమును వర్ధిల్లజేసిరి.

ఆ పుత్రులు, వారి పుత్రులు, ఇల్లు, డబ్బు, పరిచారకులు అనువా టియందు పురంజనునకు మిక్కిలి దృఢమగు మమకారము ఏర్పడెను. దాని కారణముగా ఆతడు సంసారములోని శబ్దాదివిషయములయందు గట్టిగా తగుల్కొనేను.

అనేకములగు కామనలు గల ఆ పురంజనుడు దీక్షను బూని, పశు హింసతో కూడియుండుటచే భయమును గొల్పే క్రతువులను చేసి, దేవతలు పితృదేవతలు భైరవుడు మొదలగు భూతనాయకులు అనువారిని, నీవు చేసినట్లే ఆరాధించెను.

ఈ విధముగా కుటుంబమునందు తగుల్కొన్న మనస్సు గలవాడై, ఈశ్వరారాధనవంటి యోగ్యములగు ప్రవృత్తులయందు అసావధానముగా నున్న పురంజనునకు ముసలిదనము వచ్చిపడెను. ప్రియమగు భార్యతో రమించ గోరువానికి, తాను ప్రేమించే భార్యకు కూడ ఆ కాలము అనుకూ లము కాదు.

ఓ మహారాజా! చండవేగుడని ప్రసిద్దిని గాంచిన గంధర్వనాయ కుడు ఒకడు గలడు. ఆయన వద్ద బలశాలురగు గంధర్వులు మూడు వందల అరవై మంది గలరు.

ఆ గంధర్వునకు అంతే సంఖ్యలో బలవతులగు గంధర్వస్త్రీలు కూడ గలరు. నలుపు, తెలుపు రంగు గల వారు గంధర్వులతో జత గట్టియుండెదరు. సకలభోగ్యవిషయములతో నిర్మించబడిన నగరమును పరిభ్రమిస్తూ, వారు దానిని ఒకరి తరువాత మరియొకరు చొప్పున దోపిడీ జేసెదరు.

చండవేగుని అనుచరులు పురంజనుని నగరమును దోచుకొనుట కారంభించగా, ప్రజాగరుడనే అయిదు తలల పాము వారికి అడ్డుపడెను.

పురంజనుని నగరమునకు అధ్యక్షుడు, బలశాలి అగు ఆ ప్రజాగ రుడు ఒక్కడే ఏడు వందల ఇరవైమంది గంధర్వులతో వంద సంవత్సర ములు నిరంతరముగా పోరాడెను.

అనేకులగు గంధర్వులతో యుద్ధము జరుగుచుండగా, పురంజ నుని రక్షకుడగు ప్రజాగరుడు ఒంటరిగా పోరాడుతూ క్రమముగా నీరసపడు చుండెను. దేశమునకు, నగరమునకు కూడ ప్రభువగు ఆ పురంజనుడు అప్పుడు చాల దుఃఖమును, చింతను పొందెను.

భార్యకు వశుడైయున్న ఆ పురంజనుడు పంచాలదేశములో ఆ నగరమునందు తన అనుచరులచే తీసుకురాబడిన కప్పమును గ్రహిస్తూ సుఖములననుభవిస్తూ ఉండెను. ఆతనికి మీద పడిన ఈ భయమును గురించి తెలియకుండెను.

ఓ బర్హిషత్ మహారాజా! కాలునకు జర అనే ఒక కుమార్తె ఉండెను. ఆమె భర్తను గోరి ముల్లోకములను తిరిగెను. కాని, ఒక్కరికైననూ ఆమే నచ్చలేదు.

ఆమె చాల దురదృష్టవంతురాలగుటచే లోకములో దుర్బగ అని ప్రఖ్యాతిని గాంచినది. ఆమె రాజర్షియగు పూరువు తనను స్వీకరించినందు లకు చాల సంతోషించి, ఆయనకు రాజ్యాధికారము అనే వరమునిచ్చినది.

ఆమె కామముచే మోహమును పొంది తిరుగాడుచుండెను. నేను ఒకప్పుడు బ్రహ్మలోకమునుండి భూలోకమునకు వెళ్లితిని. నేను నైష్ఠిక బ్రహ్మచారినని తెలిసి కూడ ఆమె నన్ను అచట వరించెను.

ఆమె నాయందు కోపించి నాకు మిక్కిలి సహించ శక్యము కాని పెద్ద శాపమునిచ్చినది. ఓ మునీ! నీవు నా కోరిక విషయములో విముఖు డవై ఉన్నావు గనుక, నీవు ఒకచోట స్థిరముగా నుండజాలవు అని ఆమె శపించినది.

ఈ విధముగా ఆ కన్యయొక్క సంకల్పము భగ్నమైన తరువాత, ఆమెకు భయుడనే పేరు గల యవనప్రభుని నేనే సూచించితిని. ఆమె నా సూచన ప్రకారముగా ఆతని వద్దకు వెళ్లి, ఆతనినే భర్తగా వరించెను.

ఓ వీరా! యవనులలో శ్రేష్టుడవగు నిన్ను నేను నా మనస్సునకు నచ్చిన భర్తగా వరించుచున్నాను. ప్రాణులు నీ యెడల చేసిన సంకల్పము విఫలము కాదు గదా!

లోకవ్యవహారములో గాని, శాస్తోపదేశముచే గాని దానము చేయ వలసిన దానిని దానము చేయనివాడు, అదే రీతిలో సంప్రాప్తమైన దానిని స్వీకరించనివాడు అనే వీరిద్దరు మూర్ఖులు. వీరి పట్టుదల వ్యర్థ మైనది. వీరు శోకింప దగినవారు.

ఓ మంగళకరమైన వాడా! కావున నిన్ను ప్రేమించుచున్న నన్ను స్వీకరించుము. నాపై దయను చూపుము. దీనుల యెడల దయను చూపు టయే పురుషులు చేయదగిన ధర్మము.

కాలకన్యయగు జర చెప్పిన మాటలను విని, ఆ యవనప్రభుడు దేవతల రహస్యకార్యమునొకదానిని చేయగోరి, చిరునవ్వుతో ఆమెను ఉద్దే శించి ఇట్లు పలికెను.

నేను ఏకాగ్రమగు చిత్తముతో ఆలోచించి, నీకు భర్తను కనుగొంటిని. నీవు అమంగళకరురాలవగుటచే లోకులకు నీవు నచ్చుబాటు అగుట లేదు. కావుననే, వారు నిన్ను స్వీకరించుట లేదు.

నీ రాక ఎవ్వరికైననూ తెలియదు. నీవు కర్మలచే నిర్మితమైన ఈ ప్రాణుల శరీరములను అనుభవించుము. నా సైన్యము నీకు తోడు కాగల దు. నీవు సకలప్రాణులను నశింప జేయగలవు.

ఈ ప్రజ్వారుడు నాకు తమ్ముడు. నీవు కూడ నాకు చెల్లెలివి కమ్ము. మీ ఇద్దరు తోడు కాగా, భయంకరులగు సైనికులు గల నేను ఎవ్వ రికైననూ తెలియకుండా ఈ లోకములో సంచరించెదను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పురంజనోపాఖ్యానములో కాలకన్యోపాఖ్యానమును వర్ణించే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది.