శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
26 - పురంజనోపాఖ్యానము - పురంజనుడు పురంజనిని అనునయించుట
నారదుడిట్లు పలికెను - పురంజనుడు ఒకనాడు గోప్ప ధన స్సును, అక్షయములగు అంబుల పొదులను తీసుకొని, బంగరు కవచ మును దాల్చి, పదకొండుగురు సేనానాయకులు వెంట రాగా, రథమునెక్కి పంచప్రస్థమనే అడవికి వెళ్లాను. అయిదు గుర్రములను పూన్చిన ఆ రథము వేగముగా పరుగెత్తును. దానికి రెండు అడ్డకర్రలు, రెండు చక్రములు, ఒక ఇరుసు, మూడు జెండాలు, అయిదు కమ్మీలు, ఒక పగ్గము, ఒక ఆసనము, రెండు కాడిని గట్టే మ్రానులు, అయిదు అరలు (ఆయుధములు), ఏడు రక్ష ణకవచములు గలవు. ఒక సారథచే నడుపబడే ఆ రథము బంగరు అలంకా రములను కలిగియుండెను. దానికి అయిదు రకముల నడక గలదు.
దర్పముతోనున్న పురంజనునకు వేట అనే వ్యసనమునందు తీవ్ర మగు ఆసక్తి ఉండెను. ఆతడు విడిచి పెట్టకూడని భార్యను విడిచి పెట్టి ధన స్సును బాణములను తీసుకొని ఆ అడవిలో వేటాడెను.
దయ లేని ఆ పురంజనుడు భయంకరాకారుడై క్రూరమగు రాక్షస ప్రవృత్తితో అడవిలో చెట్ల గుంపులలో తిరిగే జంతువులను వాడి బాణ ములతో కొట్టి చం పెను.
రాజు మాంసమునందు అధికమగు ఆసక్తి గలవాడైనచో, శాస్త్రవి హితములైన యజ్ఞము మొదలగు సందర్భములలో మాత్రమే అడవి యందు మాత్రమే పవిత్రములగు (నిషిద్ధములు కాని) పశువులను మాత్రమే వినియోగమున్నంత వరకు మాత్రమే సంహరించవలెనని నియమించబడినది. అనగా, విశృంఖలముగా పశువులను చంపరాదు.
ఓ మహారాజా! వివేకియగు మానవుడు నిత్యకర్మలను చేయుచు న్నచో, ఆతని అంతఃకరణము పరిశుద్ధమై ఆత్మజ్ఞానము ఉదయించును. దాని ప్రభావముచే ఆతనికి కర్మఫలముల లేపము (బంధము) ఉండదు.
అట్లు రాకుండా, నేను కర్తను అనే అభిమానావేశము గలవాడై కామ్యాది కర్మలను కూడ చేయు మానవుడు సంసారములో గట్టిగా బంధిం చబడును. అట్టి వాడు వివేకశక్తిని కోల్పోయి సత్త్వరజస్తమోగుణముల ప్రవాహరూపమగు సంసారములో పడి, అధోగతిని (పశుపక్ష్యాది జన్మను) పొందును.
ఆ అడవిలో ఆ రాజు రంగురంగుల రెక్కలు గల వాడి బాణము లతో పశువుల అవయవములను తెగగొట్టుచుండగా, అవి గొప్ప దుఃఖమును పొందినవి. ఆ సమయములో దయాహృదయులు చూచి సహించ లేని ప్రాణినాశము కలిగెను.
పురంజనుడు కుందేళ్లను, అడవి పందులను, అడవి దున్నలను, గురుపోతులను, నల్లచారల దుప్పులను, ముళ్ల పందులను మరియు ఇత రములగు పవిత్రములైన పశువులను వేటాడుతూ అలసిపోయెను.
తరువాత ఆ పురంజనుడు ఆకలి దప్పికలచే చాల అలిసిపోవు టచే వేటను విరమించి ఇంటికి చేరుకొని, స్నానమును చేసి, తగిన ఆహార మును తీసుకొని కూర్చుండగా, ఆతని శ్రమ తొలగిపోయెను.
ఆతడు ధూపము, గంధపు పూత, పుష్పమాల మొదలగువాటిచే తనను తాను ముస్తాబు జేసుకొని, అవయవములన్నింటియందు చక్కటి ఆభరణములను ధరించెను. అపుడాతని మనస్సు భార్య పైకి పోయేను.
మిక్కిలి గర్వించియున్న పురంజనుడు ఆకలి తీరి హర్షమును పొందెను. అపుడాతని మనస్సు మన్మథునిచే ఆకర్షితమయ్యేను. ఇంటిని చక్కదిద్దే గొప్ప సుందరియగు ఆతని భార్య అపుడాతనికి కానరాలేదు.
ఓ బర్హిషత్ మహారాజా! భార్య కనబడక పోవుటచే పురంజనుని మనస్సు చెడినట్లాయెను. ఆతడు అంతఃపురమునందలి పరిచారికలనిట్లు ప్రశ్నించెను: ఓ యువతులారా! మీరు, మీ అమ్మగారు కులాసాయేనా? నేను వేటకు వెళ్లుటకు ముందు ఇంటిలోని సంపదలు ప్రకాశించిన విధముగా, ఇప్పుడు ప్రకాశించుట లేదు.
ఇంటిలో తల్లి గాని, భర్తయే దైవముగా గల భార్య గాని లేనిచో ఆ ఇల్లు విరిగిన అవయవములు గల రథము వంటిది. వివేకియగు వ్యక్తి ఎవ్వాడు అట్టి ఇంటిలో దీనుడు వలె ఉండును?
నేను కష్టముల సముద్రములో మునిగిపోవుచున్న సమయములో, ఆమె నాలో వివేకశక్తిని ఉద్బుద్ధము చేసి నన్ను ఉద్దరించును. అట్టి ఆ సుందరి ఎక్కడ నున్నది? -
పరిచారికలు ఇట్లు పలికిరి --- ఓ మహారాజా! నీవు శత్రువులను సంహరించినవాడవు. నీ ప్రియురాలి నిశ్చయమేమో మాకు తెలియదు. ఆమె చాప లేని కటిక నేలపై పరుండియున్నది. చూడుము
నారదుడిట్లు పలికెను --- నేలపై పడియున్న తన భార్యను పురం జనుడు చూచెను. ఆమెతోడి సమాగమముచే ఆతని జ్ఞానము శిథిలమయ్యె ను. ఆతడామెను చూచి చాల ఆందోళనను చెందెను.
దుఃఖితమైన హృదయము గల పురంజనుడు మధురమగు వచన ములతో ఆమెను ఓదార్చుచుండెను. ఆమెకు కలిగిన ప్రణయకోపమునకు కారణమైన తన అపరాధమేమియో ఆతనికి తెలియరాలేదు.
వీరుడగు పురంజనుడు అనునయించుటలో నిపుణుడు. ఆతడా మెను పాదములను స్పృశిస్తూ మెల్లగా అనునయించెను. తరువాత ఆతడు ఆమెను తొడపై కూర్చుండబెట్టుకొని లాలిస్తూ ఇట్లు పలికెను.
పురంజనుడిట్లు పలికెను --- ఓ శుభకరమైన దానా! సేవకులు అపరాధము చేసినప్పుడు ప్రభువులు వారిని తమ వశములో నుంచుకొని, వారికి నేర్పుట కొరకై తగిన దండము (శిక్ష) ను వేసెదరు. అట్లు ఏ సేవ కుల విషయములో జరుగలేదో, వారు పూర్వములో పుణ్యము చేసుకున్న వారు కాదు. ఇది నిశ్చయము.
ఓ సుందరీ! ప్రభువు తప్పు చేసిన సేవకునకు శిక్షను విధించుట వానికి గొప్ప అనుగ్రహము. కాని, సహనము వివేకము లేని కోపిష్టియగు మూర్ఖుడు, ప్రభువు తనకు శిక్షను వేసి హితమునే చేసినాడనే సత్యమును గుర్తించడు.
ఓ అభిమానవతీ! నీ పలువరుసలు, కనుబొమలు చాల అంద ముగా నున్నవి. నీ ముఖమునందు చిరునవ్వుతో కూడిన చూపులు అధిక మగు అనురాగము మరియు సిగ్గుచే మెల్లమెల్లగా అంకురించుచున్నవి. తుమ్మెదలవంటి నల్లని ముంగురులు నీ ముఖమునకు అలంకారములైనవి. ఎత్తైన ముక్కు కలిగి, మధురమగు పలుకులను పలికే నీ ముఖమును నీవా డనగు నాకు చూపుము.
వీరుడనైన నా భార్యవగు ఓ పురంజనీ! నీయెడల అపరాధమును చేసినవాడు బ్రాహ్మణుడు గానిచో, నేను వానికి శిక్షను వేసెదను. కాని, మురారి (మురుడనే రాక్షసుని సంహరించిన శ్రీహరి) భక్తుని మినహాయించి నచో, నీయెడల అపరాధమును చేసి నిర్భయముగా ఆనందముగా ఉండగ లిగే వ్యక్తి ముల్లోకములలో గాని, ముల్లోకములకు బయట గాని నాకు ఎవ్వరైననూ కానవచ్చుట లేదు. ఇది నిశ్చయము.
నీ ముఖము బొట్టు లేకుండా మలినముగానున్నది. నీ ముఖము హర్షముతో ప్రకాశించుటకు బదులుగా, కోపముతో భయమును గొల్పుచు న్నది. నీ ముఖములో నాకు అనురాగము కానవచ్చుటలేదు. నీ సుందర మగు స్తనములు శోకాశ్రువులతో తడిసియున్నవి. కుంకుమ ముద్దవలే ఎర్రనైన దొండపండువంటి నీ క్రింది పెదవి రంగును కోల్పోయినది. ఈ స్థితిలో నిన్ను నేను ఇదివరలో ఏనాడైననూ చూడలేదు.
కావున, నీవు నా యెడల ప్రసన్నురాలవు కమ్ము. వేట అనే చెడు అలవాటు గల నేను నిన్ను విడిచి స్వేచ్చగా వేటకు వెళ్లి నీ యెడల అపరాధమును చేసితిని. కాని, ఇప్పుడు నేను మన్మథుని బాణముల వేగముచే జారిపోయిన ధైర్యము గలవాడనై నీకు వశుడనై యున్నాను. భర్తను ప్రేమించే ఏ యువతి యోగ్యమగు దేశకాలములలో అట్టి భర్తను సేవించ కుండును?
శ్రీమద్భాగవత మహాపురాణమునందు నాల్గవ స్కంధములో పురంజనోపాఖ్యానములో పురంజనుడు పురంజనిని అనునయించుటను వర్ణించే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది.
