శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
1 - దత్తాత్రేయావతారము, నరనారాయణావతారము
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! స్వాయంభువ మనువునకు శతరూపాదేవికి ముగ్గురు అమ్మాయిలు కూడ జన్మించిరి. వారు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లతో లోకములో ప్రసిద్ధిని గాంచిరి.
స్వాయంభువ మనుమహారాజు శతరూపాదేవి అంగీకారముతో ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహము చేసెను. ఈ వివాహమును ఆయన ఒక షరతు పై చేసెను. ఆకూతికి కలిగిన మొదటి పుత్రుని ఆమె తన తండ్రికి అప్పజెప్పవలెను. దీనికి పుత్రికాధర్మమని పేరు. స్వాయం భువ మనువునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు గలరు. అయిననూ, ఆయన ఆ షరతుతోనే వివాహమును చేసెను.
పూజ్యుడగు ఆ రుచి ప్రజాపతి సర్వోత్కృష్టమగు పరమేశ్వర ధ్యానముచే బ్రహ్మవర్చస్సు కలిగియుండెను. ఆయనకు ఆ ఆకూతి యందు ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి కలిగిరి.
వారిలో మగపిల్లవాడు స్వయముగా శ్రీమహావిష్ణువే. విష్ణువు వేదో క్తమగు యజ్ఞమునకు ప్రతీకయగు యజ్ఞుడనే ఆ పిల్లవాని రూపములో అవ తరించెను. లక్ష్మీదేవి విష్ణువును విడిచి ఉండదు. కావున, ఆమె ఒకానొక అంశచే దక్షిణ అనే ఆ అమ్మాయి రూపములో జన్మించేను. ఈ అమ్మాయి యజ్ఞములో ఋత్విక్కులకు యజమాని ఇచ్చే ధనమునకు ప్రతీక. ధన ముతో వేదోక్తకర్మలను చేసి దక్షిణలనిచ్చుట వలన ఈశ్వరానుగ్రహముచే పంపద స్థిరమగువే గాని, తరిగిపోదు.
స్వాయంభువ మనువు చాల సంతోషించి తన కుమార్తెయగు ఆకూతికి పుత్రుడగు ఆ యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకొనెను. ఆ పిల్లవాడు తన, కాంతులతో చుట్టూ ప్రకాశింపజేయుచుండెను. రుచి ప్రజాపతి అమ్మాయి దక్షిణను తన వద్ద పెంచేను.
మంత్రములకు, యజ్ఞములకు ప్రభువగు విష్ణుభగవానుడు యజ్ఞుని రూపములో నుండెను. ఆయనను లక్ష్మియొక్క అవతారమగు దక్షిణ ప్రేమించేను. ఆయన ఆమెను వివాహమాడెను. అపుడు వారిద్దరు సంతోషించిరి. వారికి పన్నెండుగురు పుత్రులు కలిగిరి.
తోషుడు (యజ్ఞమును చేయ సంకల్పించినప్పుడు యజమానికి కలిగే ఆనందమునకు ప్రతీక), ప్రతోషుడు (యజ్ఞము నిర్విఘ్నముగా కొన సాగుచుండగా యజమానికి కలిగే ఆనందము), సంతోషుడు (యజ్ఞమును. పూర్తి చేసి దక్షిణలనిచ్చినప్పుడు యజమానికి కలిగే పూర్ణమగు ఆనందము), భద్రుడు (వైదికకర్మల అనుష్టానము మంగళప్రదము), శాంతుడు (యజ్ఞము సక్రమముగా పూర్తి అయినప్పుడు కలిగే మనశ్శాంతి), ఇడ స్పతి (భూమిని పాలించే రాజు), ఇధ్ముడు (యజ్ఞములో ఉపయోగించే సమిధల కట్ట), కవి (యజ్ఞవిజ్ఞానము), విభుడు (యజ్ఞమును చేసే సామర్థ్యము), స్వహ్నుడు (యజ్ఞము నడిచే రోజులు మంచి రోజులు), సుదేవుడు (యజమాని ఈశ్వరరూపుడే), రోచనుడు (యజమానికి యజ్ఞము వలన గొప్ప ప్రకాశము) అనునవి వారి పేర్లు.
స్వాయంభువ మన్వంతరమునందు ఈ పన్నెండుగురే తుషితులు (ఆనందము గలవారు) అనే పేరు గల దేవతలు కాగా, మరీచి మొదలగు ఏగ్గురు మహర్షులుగను, యజ్ఞుడే దేవతాగణములకు ప్రభువగు ఇంద్రుడు గను ఉండిరి.
గొప్ప ప్రభావశాలురగు ప్రియవ్రత-ఉత్తానపాదులు మనువు యొక్క పుత్రులు. ఆ మన్వంతరము వారి కొడుకులు, కూతుళ్లు, మరియు వారి సంతానములచే వ్యాపించబడి, వారిచే పాలించబడినది.
వత్సా! విదురా! స్వాయంభువ మనువు తన కుమార్తెయగు దేవ హూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహముమ చేసెను. ఆ వృత్తాంత మును నేను విస్తారముగా చెప్పగా, నీవు వినియే యున్నావు.
పూజ్యుడగు స్వాయంభువ మనువు ప్రసూతిని బ్రహ్మగారి కుమా రుడగు దక్షునకు ఇచ్చి వివాహమును చేసెను. వారి విస్తృతమగు వంశా వళి ముల్లోకములలో వ్యాప్తిని చెందెను.
కర్దమ ప్రజాపతియొక్క తొమ్మిదిమంది కుమార్తెలు బ్రహ్మర్షుల భార్యలు. ఈ విషయము ఇదివరలో చెప్పబడినది. నేనిప్పుడు వారి సంతా, నముయొక్క వంశవిస్తారమును గురించి చెప్పుచున్నాను. గమనించుము.
కర్దమ ప్రజాపతియొక్క కుమార్తెయగు కళ మరీచి మహర్షియొక్క ధర్మపత్ని. ఆమెకు కశ్యపుడు, పూర్ణిముడు అనే ఇద్దరు కొడుకులు కలిగిరి. వారిద్దరి వంశావళి విస్తరించి భూలోకమును వ్యాపించినది.
అంతశ్శత్రువులను ఎండగట్టిన ఓ విదురా! పూర్ణిమునకు విరజు డు, విశ్వగుడు అనే ఇద్దరు కొడుకులు, దేవకుల్య అనే కుమార్తె కలిగిరి. ఈ దేవకుల్య శ్రీహరియొక్క పాదములను కడిగిన ప్రభావముచే మరుజన్మలో స్వర్గమునందలి మందాకినీ (గంగా) నదియై ప్రవహించెను.
అత్రిమహర్షియొక్క భార్యయగు అనసూయ దత్తాత్రేయుడు, దుర్వాసమహర్షి, చంద్రుడు అనే ముగ్గురు కొడుకులను కనెను. క్రమముగా విష్ణువు, శివుడు, బ్రహ్మల అంశల వలన జన్మించిన ఈ ముగ్గురు గొప్ప కీర్తిని పొందిరి.
విదురుడిట్లు పలికెను --- ఓ గురుదేవా! బ్రహ్మవిష్ణురుద్రులు క్రమముగా జగత్తుయొక్క సృష్టిస్థితిప్రళయములకు కారణమగుచున్నారు. దేవతలలో శ్రేష్టులగు ఆ త్రిమూర్తులు ఏమి చేయగోరి అత్రి గృహములో అవతరించినారు ? నాకీ విషయమును చెప్పడు.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు అత్రి మహర్షిని బ్రహ్మగారు సృష్టిని చేయుమని ప్రేరేపించిరి. అపుడాయన తన భార్యయగు అనసూయతో గూడి ఋక్షమనే కులపర్వతమునకు వెళ్లి, తపస్సును చేసెను.
ఆ పర్వతమునందలి అడవులలో మోదుగు, కంకేళి వృక్షములు పువ్వుల గుత్తులతో నిండియుండెను. నిర్వింధ్యానదియొక్క ప్రవహించే జలముల ధ్వని ఆ పర్వతమంతా వ్యాపించుచుండెను. అత్రి మహర్షి ఆ పర్వతమునందు శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వము లకు అతీతుడై, గాలిని మాత్రమే భోజనము చేయుచూ, ప్రాణాయామముతో మనస్సును వశము చేసుకొని, వంద సంవత్సరములు ఒంటి కాలిపై నిలబడి తపస్సును చేసెను.
జగన్నాథుడగు పరమేశ్వరుని వేను శరణు పొందుచున్నాము, ఆయన నాకు తనతో సమానమగు సంతానమును అనుగ్రహించుగాక! అవి ధ్యానిస్తూ, ఆయన తపస్సును చేసెను.
ప్రాణాయామమే ఇంధనము కాగా అత్రి మహర్షియొక్క శిరస్సు నుండి అగ్ని బయల్వెడలుచుండెను. దానిచే ముల్లోకములు తాపమును చెందెను. అప్పుడు సర్వసమర్ధులగు బ్రహ్మవిష్ణురుద్రులు ఆ పరిస్థితిని చూచి అత్రి మహర్షియొక్క ఆశ్రమమునకు వెళ్లిరి. అట్లు వారు వెళ్లుచుండగా, అప్సరసలు మహర్షులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు మరియు నాగులు వారి కీర్తిని విస్తారముగా గానము చేసిరి.
ఒకే సారి త్రిమూర్తులు ఆవిర్భవించుటచే అత్రి మహర్షియొక్క మనస్సు గొప్పగా ప్రకాశించెను; అనగా, వారి దర్శవముచే ఉల్లాసమును పొందెను, లేక జ్ఞానప్రకాశమును పొందెను, లేక అమనీభావరూపమగు సమాధి తొలగీ మనస్సు పనిచేయజొచ్చెను. ఆయన ఒంటి కాలిపై నిటా రుగా నిలబడియుండెను. దేవతలలో శ్రేష్టులగు ఆ త్రిమూర్తులను ఆయన చూచెను.
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు క్రమముగా హంస, గరుడుడు, వృష భము వాహనములుగా కలిగి తమ తమ చిహ్నములతో (కమండలము, చక్రము, త్రిశూలము మొదలగునవి) ప్రకాశించుచుండిరి. వారి చూపులు దయను బరపుచుండెను. వారి ముఖములలో చిరునవ్వు తొణికిసలాడు చుండెను. దానినిబట్టి వారు తనపై ప్రసన్నులైనారని మహర్షికి తెలిసెను. అపుడాయన దండము వలె నేలపై బడి వారికి నమస్కరించి, లేచి నిలబ డి, దోసిలిలో పువ్వులు మొదలగువాటిని పట్టుకొని వారిని పూజించెను.
ఆ త్రిమూర్తుల కాంతికి అత్రి మహర్షి కన్నులు మిరుమిట్లు గొల్పె ను. ఆయన కన్నులను మూసుకొని దోసిలి యొగ్గి మనస్సును ఆ త్రిమూర్తులపై నిలిపెను. మధురమైన, భావపూర్ణమైన (వేదసూక్తముల రూపము లోనున్న) వాక్కులతో ఆయన, ముల్లోకములలో ఉత్తములగు ఆ త్రిమూర్తు లను స్తుతించెను.
అత్రి మహర్షి ఇట్లు పలికెను --- ప్రతికల్పమునందు పరమేశ్వ రుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తి ఉపాధిగా గలవాడై జగ త్కార్యమును చేయును. భగవానుడు మాయాశక్తియొక్క రజోగుణము ఉపాధిగా గలవాడై బ్రహ్మరూపమును దాల్చి జగత్తును సృష్టించి, సత్త్వగు జోపాధిచే విష్ణురూపమును దాల్చి పాలనను చేసి, తమోగుణోపాధిచే రుద్రరూపమును దాల్చి జగత్తును సంహరించును. అట్టి మీ త్రిమూర్తులకు నేను నమస్కరించుచున్నాను. కాని, నేను మీలో ఒక్కరినే ధ్యానించితిని. నేను ధ్యానించిన మూర్తి మీలో ఎవరో మీరే చెప్పుడు.
నేను సంతానమును గోరి నా హృదయములో ఒక్క భగవానుని ఏకాగ్రచిత్తముతో నిలిపి వివిధములగు ఉపచారములతో ఆరాధించితిని. మీరు దేహధారుల మనస్పులకైననూ అందని దేవతోత్తములు. నేను ఒక్క రిని ఆరాధించగా, మీరు ముగ్గురు ఇచటకు వచ్చుటకు కారణమేమి? మీరు దయచేసి నాకీ విషయమును చెప్పడు. నాకీ విషయములో గొప్ప ఆశ్చ ర్యము కలుగుచున్నది.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కథాశ్రవణములో సమర్థుడ వగు ఓ విదురా! అత్రి మహర్షియొక్క ఈ మాటను విని, దేవతలలో శ్రేష్టు లగు ఆ ముగ్గురు నవ్వి, మధురమగు వాక్కుతో ఆయనకిట్లు బదులిడిరి..
త్రిమూర్తులు ఇట్లు పలికిరి --- ఓ మహర్షీ! నీవు సత్యసంకల్పుడ వు. నీ సంకల్పము ఎట్లున్నదో, అటులనే ఘటిల్లును. మరియొక విధముగా. ఉండదు. నీవు ఏ ఒక్క జగదీశ్వరుని ధ్యానించితివో, మేము ముగ్గురము. అదియే. ఇది నిశ్చయము. మాలో భేదము లేదు.
ఓ మహర్షీ! కావున, నీకు మా అంశలతో ముగ్గురు కొడుకులు కలు గగలరు. వారు లోకములో ప్రసిద్ధిని గాంచి, నీ కీర్తిని విస్తరింపజేయగలరు. నీకు మంగళమగు గాక!
దేవతోత్తములగు ఆ త్రిమూర్తులను ఆ మహర్షి బాగుగా పూజించే ను. వారాయన కోరుకున్న వరముననుగ్రహించిరి. అపుడా దంపతులు కళ్లను అప్పగించి చూచుచుండగా, వారు తిరిగి వెళ్లిరి.
బ్రహ్మగారి అంశచే చంద్రుడు, విష్ణువు అంశచే దత్తాత్రేయ మహర్షి, శంకరుని అంశచే దుర్వాస మహర్షి జన్మించిరి. ఇప్పుడు అంగిరసుని (బ్రహ్మగారి మూడవ పుత్రుడు) సంతానమును గురించి తెలుసుకొనుము.
అంగిరసునకు (సాధకుని శరీరావయవములయందలి రసము లేక ఓజస్సు) శ్రద్ద అనే భార్య (సాధకునకు నిత్యము తోడుగా ఉండేది సాధన యందలి శ్రద్దయే) యందు సినీవాలి (కృష్ణ చతుర్దశి, కుహు (అమావా స్య), రాకా (పూర్ణిమ) మరియు అనుమతి (శుక్ల చతుర్దశి) అనే నలుగురు కన్యలు జన్మించిరి. ఈ కన్యలు దర్శపూర్ణమాసలు మొదలగు వైదికకర్మ లకు ప్రధానమైన కాలములకు ప్రతీకలు.
ఈ నలుగురు కన్యకలే గాక, వారికి ఇద్దరు కొడుకులు కూడ కలిగిరి. సాక్షాత్తు భగవానుడు మరియు బ్రహ్మనిష్ఠుడు అగు ఉతథ్యుడు మొదటి కొడుకు. బృహస్పతి రెండవ కొడుకు. వీరిద్దరు స్వారోచిష మన్వంతర ములో ప్రసిద్ధిని గాంచిరి.
పులస్త్యునకు భార్యయగు హవిర్బువయందు అగస్త్యుడు, విశ్రవ సుడు అనే ఇద్దరు కొడుకులు కలిగిరి. వీరిలో అగస్త్యుడు మరుజన్మలో జఠ రాగ్ని అయినాడు. విశ్రవసుడు గొప్ప తపశ్శాలి.
ఆ విశ్రవసునకు ఇడవిడ అనే భార్యయందు సాత్త్విక స్వభావము గల కుబేరుడు జన్మించి, యక్షులకు ప్రభుడాయెను. ఆ విశ్రవసునకే మరి యొక భార్యయగు కేశినియందు రావణ కుంభకర్ణ విభీషణులనే రాక్షసులు జన్మించిరి.
గొప్ప బుద్ధిశాలివగు ఓ విదురా! పులహునకు పతివ్రతయగు గతి (మోక్షమునకు ప్రతీక) అనే భార్యయందు కర్మశ్రేష్ఠుడు (వైదికకర్మలలో దిట్ట), వరీయాంసుడు (ఉపాసకులలో గొప్పవాడు), సహిష్టుడు (సహనశీ లము గలవాడు) అనే ముగ్గురు కొడుకులు కలిగిరి.
క్రతు (వేదోక్తమగు కర్మకు ప్రతీక) మహర్షికి క్రియ (క్రతువునకు అంగమగు వైదికక్రియ) అనే భార్యయందు గొప్ప బ్రహ్మవర్చస్సు గల అరవై వేలమంది వాలఖిల్యులనే ఋషులు జన్మించిరి.
అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ విదురా! వసిష్ట మహర్షికి, అరుంధతియందు చిత్రకేతువు మొదలగు ఏగ్గురు బ్రహ్మర్షులు పుత్రులై జన్మించిరి. చిత్రకేతువు మొదలైన పేర్లతో ప్రసిద్ధివి గాంచిన ఈ ఋషులు మహాపుణ్యాత్ములు. అరుంధతికి ఇంకో పేరు ఊర్జ.
చిత్రకేతువు, సురోచి, విరజసుడు, మిత్రుడు, ఉల్భణుడు, వసుళ్ళ ద్యానుడు, ద్యుమంతుడు అనునవి ఆ ఏడురి పేర్లు. వీరే గాక, వసిష్ఠునకు మరియొక భార్యయందు శక్తి మొదలగు పుత్రులు కలిగిరి.
అథర్వణునకు భార్యయగు చిత్తియందు దధ్యజ్ (దధీచి) అనే కొడుకు కలిగెను. గొప్ప ప్రతనిష్ట గల ఆ దధీచికి అశ్వశిరసుడు అనే పేరు కూడ గలదు (ఆయన తల గుర్రపు తలను పోలియుండెడిది). నేను ఇప్పుడు భృగుమహర్షియొక్క వంశమును గురించి చెప్పెదను. గమనించుము.
ఓ మహాత్ముడవగు విదురా! భృగు మహర్షికి భార్యయగు ఖ్యాతి యందు ధాత, విధాత అనే ఇద్దరు కొడుకులు, శ్రీ అనే ఒక కూతురు కలిగిరి. లక్ష్మి అంశ అయిన ఈ శ్రీదేవి భగవానునకు అంకితమైనది.
ధాత, విధాత అనే వారిద్దరికి మేరువు తన కుమార్తెలగు ఆయతిని, నియతిని ఇచ్చి వివాహము చేసెను. ఆ దంపతులకు క్రమముగా మృకండుడు, బ్రౌణుడు అనే కొడుకులు కలిగిరి.
మృకండు మహర్షికి మార్కండేయ మహర్షి అనే కుమారుడు, ప్రాణునకు వేదశిరసుడు అనే కుమారుడు, భృగు మహర్షికి కవి అనే కుమా రుడు కలిగిరి. ఆ కవియొక్క పుత్రుడే పూజ్యుడగు శుక్రాచార్యుడు.
ఓ విదురా! ప్రసిద్ధులైన ఈ మహర్షులు తమ సంతానములచే లోక ములను వర్ధిల్లజేసిరి. నీకీ విధముగా కర్దమ మహర్షియొక్క కుమార్తెల పుత్రుల సంతానమును గురించి చెప్పితిని.
ఈ గొప్ప వృత్తాంతమును శ్రద్ధతో వినువారి పాపములు వెంటనే నశించును. బ్రహ్మపుత్రుడగు దక్షుడు మనుపుత్రికయగు ప్రసూతిని వివాహ మాడేను.
గొప్పగా ప్రకాశించే ఆ దక్షునకు ఆమెయందు పదహారు కుమా రైలు కలిగిరి. ఆయన వారిలో పదముగ్గురిని ధర్మునకు, ఒకామెను అగ్నికి, ఇంద్రియజయము గల పితృదేవతలందరికి కలిపి ఒకామెను, భక్తుల సంసా రమును నశింపజేసే శివునకు ఒకామెను ఇచ్చి వివాహము చేసెను.
శ్రద్ద (వేదవచనములు జ్ఞానసాధనములు అనే ధారణతో వాటి యందు ఉత్సాహమును కలిగియుండుట), మైత్రి (స్నేహభావము), దయ (భూతదయ), శాంతి (మనస్సు ప్రసన్నముగా నుండుట), తుష్టి (లభించిన దానితో సంతోషమును పొందుట), పుష్టి (సంతోషము వలన మనస్సు నిండుగానుండుట), క్రియ (వేదోక్తకర్మ), ఉన్నతి (ఆధ్యాత్మికముగా ఎదుగు ట), బుద్ది (సరిగా నిర్ణయములను చేసే సామర్థ్యము), మేధ (శాస్త్రవిషయ ములను బుద్ధియందు ధరించి ఉండే శక్తి), తితిక్ష (సుఖదుఃఖములను ప్రసన్నమగు మనస్సుతో స్వీకరించే సామర్థ్యము), హీ (వినయము), మూర్తి (శుద్ధసత్త్వస్వభావము) అనునవి ధర్ముని (ధర్మముయొక్క) భార్యలు (తో డుగానుండు లక్షణములు).
శ్రద్దకు శుభుడు (శ్రద్ద ఉన్నచోట శుభము కలుగును), మైత్రికి ప్రసా దుడు (స్నేహభావము గల మనస్సు ప్రసన్నముగా నుండును), దయ అభ యుని (దయ ఉన్నవాడు. సకలప్రాణులకు అభయమునిచ్చి తాను భయర హీతుడై యుండును), శాంతి సుఖుని (మనశ్శాంతియే సుఖము), తుష్టి ముదుని (సంతోషము ఉన్న వ్యక్తికి సర్వకాలములలో మనస్సులో ఆనం దము ఉండును), పుష్టి స్మయుని (మనస్సు నిండుగా నున్నచో శరీరము నిండుగానుండి ధర్మకార్యములయందు సమధికమగు ఉత్సాహము ఉద యించును) పుత్రులుగా కనిరి.
క్రియ యోగుని (కర్తవ్యబుద్ధితో చేసే కర్మయే సాధకుని భగవా నుని వద్దకు చేర్చే ఉపాయము), ఉన్నతి దర్పుని (ఉన్నతమగు జీవితల క్ష్యము గల వ్యక్తి తపస్సును ఆచరించుటయందు, లేక జ్ఞానార్జనయందు పట్టుదలను కలిగియుండును), బుద్ధి అర్థుని (సరియగు నిర్ణయములను చేయు వ్యక్తి సంపదను పొందును), మేధ స్మృతిని (శాస్త్రవిషయములను గుర్తులో పెట్టుకున్నవాడు సరియగు సమయములో వాటిని గుర్తుకు తెచ్చు కొనగల్లును), తితిక్ష క్షేముని (సుఖదుఃఖములను ప్రసన్నమగు మనస్సుతో స్వీకరించువాడు ఆత్మజ్ఞానమును పొంది మోక్షము అనే సర్వోత్కృష్టమగు క్షేమమును పొందును), ప్రీ ప్రశ్రయుని (అధర్మమును చేయుటకు సిగ్గు పడువాడు వినయమును కలిగియుండును) పుత్రులుగా కనిరి. సకలకల్యా ణగుణములకు నిలయమగు భగవానుని అవతరింపజేసిన మూర్తి నర నారాయణులనే మహర్షులను కనెను (సత్త్వగుణప్రధానమగు అంతఃకరణ ములో నరునకు నారాయణునితో మైత్రి ఏర్పడును).
ఆ నర నారాయణులు జన్మించిన కాలమునందు ఈ జగత్తు అంతయు ఆనందముతో నిండి పండుగను జేసుకోనెను. జనుల మన స్సులు కోపము మొదలగునవి తొలగి ప్రసన్నములయ్యెను. దిక్కులు ధూళి లేకుండుటచే ప్రసన్నములయ్యెను. గాలులు సుఖకరమగు స్పర్శను కలిగి ప్రసన్నములయ్యెను. నదులు బురద తొలగి ప్రసన్నములయ్యెను. అడవులలోని చెట్లు పుష్పించి ఫలించుటచే పర్వతములు ప్రసన్నముల
య్యెను.
ఆ సమయములో అంతరిక్షమునందు బాజాలు మ్రోగి, పువ్వుల వానలు కురిసినవి. సంతోషమును పొందిన మహర్షులు స్తోత్రములను పఠించిరి. గంధర్వులు, కిన్నరులు గానము చేసిరి.
ఆ సమయములో అప్సరసలు నాట్యమాడిరి. అంతటి గొప్ప మంగళము కలిగెను. బ్రహ్మ మొదలగు దేవతలు అందరు స్తోత్రములను చేసిరి.
దేవతలు ఇట్లు పలికిరి --- ఆకాశములో ఘటాకాశము, మఠాకా శము మొదలగు భేదములు లేకున్ననూ కల్పించబడుచుండును. అదే విధ ముగా అద్వయ పరబ్రహ్మయందు భేదములు లేవు. అయిననూ, ఆ పర బ్రహ్మ తన మాయాశక్తిచే తనయందే ఈ నానానామరూపాత్మకమగు జగత్తును ప్రకటింపజేసెను. అట్టి తన యథార్థస్వరూపమును భక్తులకు ప్రకాశిం పజేయుట కొరకై ఆ పరబ్రహ్మ ఈ నాడు ఈ ఋషిదేహముతో ధర్ముని గృహములో ఆవిర్భవించెను. ప్రకృతికి అతీతుడు, పూర్ణ స్వరూపుడు అగు అట్టి పరమేశ్వరునకు నమస్కారము.
పరమేశ్వరుని యథార్థస్వరూపమును మానవుడు శాస్తోపదేశము ద్వారా మాత్రమే తెలియగల్గును. ఆయన జగద్రక్షణకు విరుద్ధముగా పని చేసే దుష్టశక్తులను ఉపశమింప జేయుటకొరకై సత్త్వగుణప్రధానులగు దేవ తలను సృష్టించినాడు. ఆ దేవతలము మేమే. ఆయన చూపు అందము నకు నెలవైన పద్మమును కూడ తన సౌందర్యముచే తిరస్కరించుచున్నది. ఆయన చూపులో దయ నిండియున్నది. ఆయన అట్టి దయాదృష్టిని మాపై బరపు గాక!
వత్సా ఓ విదురా! ఈ విధముగా దేవతలు నరనారాయణ భగవా నులను స్తుతించి పూజించిరి. ఆ దేవతలకు వారి దర్శనము, కృపాదృష్టి కూడ లభించెను. అపుడా నరనారాయణులు గంధమాదన పర్వతమునకు వెళ్లిరి.
శ్రీహరి భగవానుని అంశలగు ఆ నరనారాయణులే ఈ కృష్ణార్జునులు. వీరు క్రమముగా యదు, కురు వంశములనుద్దరించినారు. వీరు భూభా రము (అధర్మమే బరువు గాని, జనసంఖ్య బరువు కాదు) ను తగ్గించుటకు ఈ భూలోకము పై అవతరించినారు.
మన యెదుట మండే నిప్పుకు అభిమాని దేవత అగ్ని దేవుడు. ఆయన భార్య స్వాహా దేవి. వారికి పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వీరు కూడ నిప్పుకు అభిమాని దేవతలే. మనము హోమము చేసే ద్రవ్యములను వారు ఆరగించెదరు.
ఆ ముగ్గురికి నలభై అయిదు మంది అగ్నులు పుట్టిరి. వీరు, వీరి తండ్రులు ముగ్గురు, తాత ఒకరు కలిసి వెరసి నలభై తొమ్మిది మంది అగ్నులు అయినారు.
వేదవిహితములైన యజ్ఞకర్మలయందు వేదవేత్తలు అగ్నుల నామములను ప్రస్తావించి అగ్నిదేవతాకములగు ఇష్టులను చేయుచుందురు. ఆ అగ్నులు వీరే.
అగ్నిష్వాత్తులు (అగ్నియందు పక్వమైన పురోడాశము మొదలగు వాటిని ఆస్వాదించువారు), బర్హిషదులు (దర్బలు ఆసనముగా గలవారు), సౌమ్యులు (సోమరసమును పానము చేయువారు) మరియు ఆజ్యపులు (ఆజ్యమును పానము చేయువారు) అనువారలు పితృదేవతలు. వీరిలో కొందరికి అగ్నియందు సమర్పణము విహితమై యుండగా, మరికొందరికి అట్లు లేదు. ఇట్టి విభాగములతో కూడిన ఈ పితృదేవతలకు దక్షుని కుమార్తె యగు స్వధా దేవి భార్య యైనది.
ఆ పితృదేవతలకు స్వధాదేవియందు ధారిణి, వయున అనే ఇద్దరు కన్యలు కలిగిరి. వారిద్దరు ఆత్మస్వరూపమును గురించి తెలుసుకొనుటయే గాక, ఆ జ్ఞానమును అనుభవమునకు తెచ్చుకొని, దానిని జిజ్ఞాసువులకు బోధించిన మహాత్మురాండ్రు.
శివదేవుని భార్యయగు సతీ గొప్ప ప్రేమతో ఆయనను సేవించే ను. అయిననూ, ఆమెకు తన గుణశీలములకు తగిన పుత్రుడు కలుగలేదు.
శివునియందు దోషమేమియు లేకున్ననూ, సతీదేవి తండ్రి అయ నపై కోపముతో ఆయనయందు ప్రతికూలమగు ఆచరణను చేపెను. అప్పటికింకనూ సతీదేవి ప్రొడవయస్కురాలు కానేలేదు. అట్టి యౌవనవతియగు సతీదేవి తనంత తానే ఒక నిర్ణయమును తీసుకొని, యోగశక్తినాశ్రయించి, తన దేహమును వదిలి పెట్టెను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో మనుకన్యలవంశములను, నరనారాయణావతారమును వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది.
