శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

24 - రుద్రగీతము - రుద్రుడు ప్రచేతసులకు చేసిన ఉపదేశము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథువు తరువాత ఆయన పుత్రుడు, గొప్ప కీర్తి గలవాడు అగు విజితాశ్వుడు చక్రవర్తి ఆయెను. సోద రులయందు ప్రేమ గల ఆయన తన నలుగురు తమ్ముళ్లకు నాలుగు దిక్కు లయందు అధికారమును అప్పజెప్పెను.

సర్వసమర్థుడగు విజితాశ్వుడు తూర్పు దిక్కును హర్యక్షునకు, దక్షిణమును ధూమ్రకేశునకు, పడమరను వృకునకు, ఉత్తరమును ద్రవీణునకు ఇచ్చెను.

విజితాశ్వునకు ఇంద్రుడు అంతర్ధానమయ్యే శక్తిని ఇచ్చేను. దానిని బట్టి ఆయనకు అంతర్ధానుడు అని పేరు కలిగెను. ఆయనకు భార్యయగు శిఖండినియందు ముగ్గురు కొడుకులు కలిగిరి. వారందరు జనులచే బాగా ఆదరించబడిరి.

పావకుడు, పవమానుడు మరియు శుచి అనే మూడు అగ్నులు పూర్వములో వశిష్ట మహర్షి ఇచ్చిన శాపము కారణముగా విజితాశ్వుని పుత్రులై జన్మించిరి. వారు యోగమార్గముననుష్ఠించి మరల తమ లోకమును చేరిరి.

ఇంద్రుడు గుర్రమునపహరించుచుండగా చూచియు విజితాశ్వుడు ఆతనిని సంహరించ లేదు. అంతర్ధానుడనబడే అట్టి విజితాశ్వునకు నభస్వ తియందు హవిర్ధానుడనే కొడుకు కలిగెను.

రాజులు పన్నులను, అపరాధ రుసుములను వసూలు చేయుచూ అపరాధులను శిక్షించుట మొదలగు కార్యములను చేయుదురు. కావున, అంతర్ధానుడు వారి జీవన శైలి క్రూరమైనదని తలపోసి, చిరకాలము జరిగే సత్రయాగముననుష్ఠించే సాకుతో రాజ్యాధికారమును విడిచి పెట్టెను.

ఆ సత్రయాగములో కూడ అంతర్ముఖుడగు ఆ అంతర్ధానుడు దృఢమగు చిత్తేకాగ్రతతో అజ్ఞానమును పోగొట్టే పూర్ణ పరమాత్మను ఆరా ధించి, ఆ పరమాత్మ సాక్షాత్కారమును (దివ్యలోకమును) పొందెను.

విదురా! హవిర్డానునకు హవిర్హానియందు బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితప్రతుడు అనే ఆర్గురు పుత్రులు కలిగిరి.

కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! హవీర్ధానుని పుత్రుడగు బర్షి షత్ మహారాజు గొప్ప మహానుభావుడు. ఆయన వేదోక్తమగు కర్మలను చేయుటయందు మాత్రమే గాక, ఎనిమిది యోగాంగములయందు కూడ నిష్ణాతుడు.

బర్హిషత్ ఒక యజ్ఞమును చేసి, ఆ యజ్ఞవాటమునకు ప్రక్కనే మరి యొక యజ్ఞమును చేయుచూ, ఈ విధముగా యజ్ఞములను విస్తరింప జేసుకుంటూ పోవుటచే, ఈ భూతలమంతయు తూర్పు వైపు కొనలు గల దర్భలచే కప్పబడి పోయెను.

బర్హిషత్ దేవదేవుడగు బ్రహ్మగారి సలహా ప్రకారముగా సముద్రక న్యకయగు శతద్రుతిని వివాహమాడెను. యౌవనవతియగు ఆ శతద్రుతి సక లావయవములు సుందరముగా నుండెను. వివాహములో ఆమె చక్కగా అలంకరించుకొని అగ్నిని ప్రదక్షిణము చేయుచుండెను. అపుడామెను చూచి అగ్ని, పూర్వము శుకీని వలె, కామించెను.

కొత్త పెళ్లి కూతురగు ఆ శతద్రుతి నడచుచుండగా కాలి అందేల ధ్వని దిక్కులయందు ప్రసరించేను. ఆ ధ్వనిమాత్రముచే ఆమె దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మహర్షులు, సిద్ధులు, మానవులు మరియు నాగుల మనస్సులను దోచివేసెను.

ప్రాచీనబర్హి అని పేరు గాంచిన బర్హిషత్ నకు శతద్రుతియందు ప్రచేతసులు అనే పదిమంది కొడుకులు కలిగిరి. ధర్మములో నిష్ణాతులగు వారందరు సమానమగు పేరును మరియు ఆచరణమును కలిగియుండిరి.

వివాహము చేసుకొని వంశమును వృద్ధి చేయుడని తండ్రి వారిని ఆదేశించగా, వారు దాని కొరకు ఈశ్వరానుగ్రహమును పొందుటకై తప స్సును చేయగోరి, సముద్రములో ప్రవేశించిరి. వారు పది వేల సంవత్సర ములు తపస్సును చేసి, తపస్సునకు ప్రభువు (తపస్సుచే ఆరాధించబడు వాడు, తపస్సునకు ఫలమునొసంగువాడు) అగు శ్రీహరిని ఆరాధించిరి.

మార్గములో వారికి కైలాసవాసియగు రుద్రుడు కనబడెను. ఆయన ప్రసన్నుడై వారికి తత్త్వమునుపదేశించెను. వారు జితేంద్రియులై ఆ తత్త్వమునే ధ్యానిస్తూ, జపిస్తూ, ఆ ప్రకారముగనే పూజించుచుండిరి.

విదురుడిట్లు పలికెను --- ఓ మహర్షీ! తపస్సునకు వెళ్లుచున్న ప్రచేతసులకు మార్గములో కైలాసపతియగు రుద్రునితో సమాగమము ఏ విధముగా కలిగెను? మరియు ప్రసన్నుడైన ఆ రుద్రుడు వారికి చెప్పిన ప్రయోజనకారియగు ఉపదేశము ఎట్టిది? మాకీ విషయమును చెప్పుము.

ఓ బ్రహ్మర్షీ! ఈ లోకములో ప్రాణులకు శివునితోడి సమాగమము పొంద శక్యము కానిది గదా! మహర్షులు సైతము శివుని పొంద గోరి సంసారమునందలి ఆసక్తిని విడనాడి ఆయనను ధ్యానించుచున్నారు (కాని, పొందుట లేదు).

శివ భగవానుడు ఆత్మయందే ఆనందము గలవాడు. అయిననూ, ఆయన ఈ లోకముల రచనను పాలించుట కొరకై భయంకరమగు శక్తితో గూడి సంచరించును.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- సత్పురుషులగు ప్రచేతసు లకు మనస్సులో తపస్సునందు ఆదరము మెండు. వారు తండ్రి ఆదేశ మును శిరసా వహించి పడమర దిక్కునకు బయలు దేరిరి.

వారు సముద్రమా అనదగ్గంత పెద్ద విశాలమగు సరస్సును చూచి రి. అది మహాత్ముల మనస్సు వలె స్వచ్చమైన నీటితో నిండి యుండెను. దానియందలి జలజంతువులు కూడ ప్రసన్నముగా కనబడెను.

ఆ సరస్సులో నల్ల కలువలు ఎక్కువగా నుండెను. ఎర్ర నల్ల రంగులు కలిసియున్న కలువలు, పద్మములు, అధిక పరిమళము గల ఎర్ర కలువలు మరియు నల్ల కలువలు ఉండెను. హంసలు బెగ్గురు పక్షులు జక్కవ పిట్టలు మరియు కన్నెలేడు పక్షుల కూతలతో ఆ సరస్సు ప్రతిధ్వ నించుచుండెను.

మత్తెక్కిన తుమ్మెదల చక్కని అఖండఝంకారముచే తీగలతో కూడిన చెట్లు హర్షమును పొంది పులకాంకురములను పొందినవా యన్నట్లు వాటి చిగుళ్లు ప్రకాశించెను. ఆ సరస్సు తనయందలి పద్మముల గర్భములోని పుప్పొడిని దిక్కులలో వాయువు ద్వారా వెదజల్లుతూ ఉత్సవమును చేయుచున్నదా యన్నట్లు ఉండెను.

ఆ రాజపుత్రులకు అచట దివ్యమగు స్వరభేదములతో మనోహర మైన గానము వినబడెను. ఆ గానమును మద్దెల, భేరీ మొదలగు విద్య ముల ధ్వని అనుసరించి యుండెను. వారా గానమును విని విస్మితులైరి.

అదే సమయములో ఆ సరస్సునుండి అనుచరులతో గూడి ముక్కంటి దేవుడు బయటకు వచ్చుచుండెను. దేవతలలో శ్రేష్ఠుడగు ఆయ నను దేవతల అనుయాయులగు గంధర్వులు కీర్తించుచుండిరి. పుటము పెట్టిన బంగారపు ముద్దవలె ప్రకాశించుచున్న ఆ నీలకంఠుడు భక్తులననుగ్ర హించుటకు సుముఖముగా నుండెను. ఆయనను చూచుట తోడనే ప్రచేత సులు ఉత్సాహముతో ఆయనకు నమస్కరించిరి.

శరణు పొందినవారి కష్టములనీడేర్చే శివభగవానుడు ధర్మము నందు ప్రేమ గలవాడు. ధర్మము తెలిసినవారు, శీలము నిండా కలవారు అగు ప్రచేతసులు శివుని దర్శనముచే ప్రీతులైరి. వారి విషయములో ప్రసన్నుడైన ఆ శివుడు వారితోనిట్లనెను.

శ్రీరుద్రుడు ఇట్లు పలికెను --- వేదవేత్తలగు మీరు వేదవేత్తయగు బరిషత్ మహారాజుయొక్క పుత్రులని నాకు తెలియును. మీరు ఏమి చేయ గోరుచున్నారో కూడ నాకు తెలియును. మీకు మంగళమగు గాక! మిమ్ము లను అనుగ్రహించుట కొరకై నేను మీకు ఈ తీరున దర్శనమునిచ్చినాను.

వాసుదేవ భగవానుడు సూక్ష్మము, త్రిగుణాత్మకము అగు ప్రకృతి కంటే, మరియు జీవతత్త్వము కంటే అతీతుడు. ఆయనను సాక్షాత్తుగా శరణు పొందిన వ్యక్తి నాకు నిశ్చితముగా ప్రియుడు.

వంద జన్మలు తన ధర్మమునందు నిష్ఠ గల వ్యక్తి బ్రహ్మ పదవిని, అంతకంటే ఎక్కువ పుణ్యమున్నచో నన్ను పొందును. కాని, భగవద్భక్తుడు వైష్ణవ ధామమును పొందును. దేవతలు మరియు నేను కూడ మా మా అధికారములు సమాప్తమైనప్పుడు లింగ శరీర భంగముచే పొందేది. జగ త్తునకు అతీతమైన ఆ ధామమే.

మీరు భగవద్భక్తులు గనుక, నాకు భగవంతుడు ఎంతటి ప్రియు డో, మీరు కూడా అంతే ప్రియులు. భగవద్బక్తులకు కూడ ఏ కాలమునందై ననూ నాకంటె ప్రియమైనవాడు మరియొకడు లేడు.

నేను మీకు పావనము, గొప్ప కల్యాణకారి, మోక్షమును సైతము ఇచ్చేది అగు ఈ గీతమును చెప్పెదను. వినుడు. దీనిని కలగాపులగము చేయకుండా జపించుడు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఆ రాజపుత్రులు చేతులను జోడించి యుండిరి. దయాహృదయుడు, నారాయణుడే పరాయణముగా గలవాడు అగు శివ భగవానుడు వారినుద్దేశించి ఇట్లు పలికెను.

ఆత్మవేత్తలలో అగ్రేసరులగువారి కల్యాణము (ఆత్మానందము) కొరకై నీవు నీ ఉత్కర్షను ఆవిష్కరించినావు. నాకు కూడ మంగళమగు గాక! పరమానందరూపుడవగు నీవు ఆత్మరూపముగా నిత్యసిద్దుడవై యున్నావు. సర్వము రూపములో ఉన్న నీవు ఆత్మరూపుడవై యున్నావు. నీకు నమస్కారము.

పద్మనాభుడు (లోకమనే పద్మము తనయందు ప్రకటమైన ఆకాశ మునందు గలవాడు), ప్రాణులలో సూక్ష్మభూతముల కార్యములగు ఇంద్రి యములలో ఆయా శక్తుల రూపముగా ప్రకటమై ఆ ఇంద్రియములకు తానే ఆత్మ (నియంత) అయి ఉన్నవాడు, ప్రకృతిలోని చలనము తన స్వరూప మునందు లేనివాడు, ప్రకృతి వికారములకు అతీతుడు, స్వయంప్రకాశచైత న్యస్వరూపుడు, వాసుదేవుడు (సకలప్రాణులలో అంతర్యామియగు ఆత్మరూపముగా నున్నవాడు, మరియు చిత్తమునకు అధిష్ఠాత) అగు శ్రీహరికి నమస్కారము.

అవ్యక్త స్వరూపుడు, అంతము లేనివాడు, లోకములను అంతము చేయువాడు అగు సంకర్షణ దేవునకు (అహంకారమునకు అధిష్టాత, జగ త్తును తన లోనికి ఉపసంహరించువాడు) నమస్కారము. చైతన్యాధిష్ఠాన రూపములో సకలప్రాణులకు వివిధరూపముల జ్ఞానమును కలిగించువాడు, సకలప్రాణుల అంతర్యామి అగు . ప్రద్యుమ్నునకు (ప్రకృష్టమగు ద్యుమ్నము, అనగా శక్తి లేక చైతన్యప్రకాశము గలవాడు, బుద్ధికి అధిష్ఠాత) నమస్కారము.

కన్ను మొదలగు ఇంద్రియములకు ప్రభువైన మనస్సునకు అధి ష్ఠాన దేవతయగు అనిరుద్ధునకు (ఆటంకములు, లేక ఆవరణము లేనివాడు) అనేక నమస్కారములు. జగత్తులోని చీకట్లను పోగొట్టే గొప్ప తేజోమం డలమైన సూర్యుని (ఆత్మజ్ఞాని) రూపములోనున్న శ్రీహరికి నమస్కార ము. శ్రీహరి పూర్ణుడగుటచే ఆయన స్వరూపమునందు వృద్ధిక్షయములు ఉండవు. అట్టి శ్రీహరికి నమస్కారము.

నిత్యము మంచివారిచే తమ హృదయములో ఆరాధించబడే శ్రీహరికి నమస్కారము. అగ్నిదేవుడు కామనతో ఆరాధించువారికి స్వర్గాది పుణ్యలోకములను, నిష్కామముగా ఆరాధించువారికి అంతఃకరణశుద్ధి ద్వారా మోక్షమును ఇచ్చును. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులచే సంపాదించబడే అగ్నిహోత్రకర్మకు సాధనము అగ్నిదేవుడే. ఆ విధముగా శ్రీహరియొక్క తేజోమయమగు శక్తియే అగ్నిదే వుడు. అగ్నిదేవుని రూపములో వైదికకర్మను విస్తరింపజేసే శ్రీహరికి నమస్కారము.

పితృదేవతలకు మరియు దేవతలకు ఆహారము, యజ్ఞము చేసిన మానవులకు ఫలము చంద్రుడే. ఆ చంద్రుని రూపములోనున్నది, కర్మకు మూలమైన ఋగ్యజుస్సామవేదములకు ప్రభువు అగు శ్రీహరియే. సకలర సముల రూపములోనుండి ప్రాణులకు దాహశాంతిని కలిగించే నీరు రూప ములోనున్న శ్రీహరికి నమస్కారము.

సకలప్రాణుల వ్యష్టి దేహము, ఈ పృథివి మరియు సమష్టిస్థూల బ్రహ్మాండము (విరాట్) కూడ శ్రీహరియే. ముల్లోకములలోని ప్రాణులకు ఇంద్రియమనోదేహముల శక్తిని ఒనగే వాయువు రూపములో శ్రీహరియే ఉన్నాడు. అట్టి శ్రీహరికి నమస్కారము.

పదార్థముల పరస్పరభేదమునకు సూచకము, లోపల బయట అనే వ్యవహారమునకు మూలము అగు ఆకాశము శ్రీహరి రూపమే. పుణ్య ముచే లభించే గొప్ప ప్రకాశము గల స్వర్గము మొదలగు ఊర్ధ్వలోకములు కూడ శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరి కొరకు నమస్కారము.

ప్రవృత్తి (యజ్ఞాది), నివృత్తి (శమదమాది) అని కర్మ రెండు రూప ములలో నున్నది. ఈ కర్మయు, దాని ప్రభావము వలన లభించే పితృలోక ము, స్వర్గలోకము కూడ శ్రీహరి రూపములే. పితృదేవతలు, దేవతలు కూడ శ్రీహరి రూపములే. అధర్మమునాచరించువారు మరణించి దుఃఖభా జనులగుదురు. ఆ మృత్యువు, దుఃఖమునిచ్చే నరకలోకము కూడ శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరికి నమస్కారము.

ఓ ప్రభూ! కర్మఫలరూపముగా కామనలనీడేర్చువాడవు నీవే. నీవు సర్వజ్ఞుడవు. మంత్రము నీ స్వరూపమే. స్వాయంభువ మనువు నీ రూపమే. గొప్ప ధర్మము నీ రూపమే. పరబ్రహ్మ నీ స్వరూపమే. మొక్కవోని మేధాశక్తి గలవాడై లోకములో సాంఖ్యయోగ కర్మయోగములను ప్రవర్తిల్ల జేసిన గీతాచార్యుడగు శ్రీకృష్ణుడు నీ అవతారమే. అనాదియగు నీవు సకల . ప్రాణులలో అంతర్యామిగా నుండే పూర్ణుడవు. నీకు నమస్కారము.

కర్త (చేయువాడు), కరణము (చేసే సాధనము), క్రియ అనే మూడు శక్తులను కలిగి అహంకారరూపుడై భక్తులకు కామనలను వర్షించే రుద్రుని రూపములోనుండే శ్రీహరికి నమస్కారము. సృష్టిజ్ఞానమును కలిగి వివిధసృష్టులను చేస్తూ, వేదరూపమగు వైవిధ్యము గల వాక్కును వెలయించే బ్రహ్మదేవుని రూపములోనుండే శ్రీహరికి నమస్కారము. ప్రాణుల దేహములోనుండి పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలు రకముల వాక్కును ప్రకటించే ప్రాణశక్తిరూపముగా నీవే ఉన్నావు.

భక్తులకు నీ రూపము మిక్కిలి ప్రియమైనది. నీ రూపము తన గరి మచే మా ఇంద్రియములను రంజింప జేయగలదు. భక్తులచే ఆదరించబడే అట్టి నీ రూపమును మేము చూడగోరుచున్నాము. మాకు దర్శనమిమ్ము.

దట్టని వర్షాకాలమేఘము వలె నల్లని శ్రీహరి రూపము సకలసౌం దర్యములు ఒకచో గ్రుమ్మరించినట్లు ఉండును. ఆయన పొడవాటి నాలుగు చేతులతో, కోమలమగు ముఖముతో అందముగా నుండును.

అందమైన కనుబొమలు, ముక్కు, దంతములు మరియు చెక్కి ళ్లతో శ్రీహరి ముఖము అందముగా నుండును. పద్మగర్భమునందలి రేకల. వంటి కళ్లు, సమమైన చెవులు ఆ ముఖమునకు శోభను చేకూర్చుచున్నవి.

ఆయన ముఖము ప్రేమపూర్వకమగు చిరునవ్వుతో కూడిన కడ గంటి చూపులతో, ముంగురులతో మరియు ఉజ్జ్వలమగు కుండలములతో , ప్రకాశించును. ఆయన పద్మపరాగమువలె ప్రకాశించే నాజూకైన వస్త్రములను దోల్చును.

కిరీటము, కంకణములు, హారములు, నూపురములు, మొలనూ లులతో ప్రకాశించే శ్రీహరి రూపము, శంఖము చక్రము గద పద్మము వనమాల మరియు కౌస్తుభమణులతో ఉత్తమమగు శోభను కలిగియుండును.

బంగరు ఆభరణముల కాంతులతో విలసిల్లే శ్రీహరి భుజస్కంధ ములు జూలుతో ప్రకాశించే సింహపు మూపును పోలియున్నవి. కౌస్తుభ మాణిక్యముతో ఆయన మెడకు శోభ ఇనుమడించెను. లక్ష్మీదేవి బంగరు రేఖ రూపములో నిత్యనివాసముండే ఆయన వక్షఃస్థలము బంగరు గీత గల గీటురాయి శోభను తల దన్నుచున్నది.

రావియాకును పోలియున్న శ్రీహరియొక్క ఉదరము ఉచ్ఛ్వాసని శ్వాసలతో బాటు కదలాడే .మూడు ముడుతలతో అందముగా నుండెను. సుడిగుండమువలె లోతైన నాభి తనగుండా బయటకు వచ్చిన జగత్తును తిరిగి తనలోనికి ఉపసంహరించుటకు సంసిద్ధముగా యున్నదా యన్నట్లు ప్రకాశించును.

శ్యామవర్ణము గల కటిభాగమునందు పీతాంబరము మరియు బంగరు మొలనూలు ప్రకాశించుచుండును. పాదములు, పిక్కలు, తోడలు సమముగను, మోకాళ్లు ఎత్తు లేకుండగను ఉండుటచే శ్రీహరి రూపము చూడ చక్కగా నుండును.

ఓ తండ్రీ! అజ్ఞానాంధకారములో వడి కొట్టుకుపోవువారలకు నీవు మార్గమును చూపే గురుడవు. శరత్కాలపద్మదళమువంటి కాంతి గలదై, నఖకాంతులచే మా అంతఃకరణమునందలి మాలిన్యమును పోనాడే నీ పాదము మాకు గల సంసారభయమును చెదరగొట్టును. అట్టి నీ స్వరూప మును మాకు దర్శనమిమ్ము.

అంతఃకరణశుద్దిని గోరు భక్తులు. ఈ రూపమును నిరంతరముగా ధ్యానించవలెను. ఏలయనగా, స్వధర్మానుష్ఠానపరులగు భక్తులకు భక్తియో గమే అభయమునిచ్చును.

నిన్ను పొందుట సకలప్రాణులకు సంభవము కాదు. స్వర్గలోకాధిప తియగు ఇంద్రుడు కూడ విన్ను పొంద గోరుచుండును. ఆత్మవేత్తలు ఏకాం తమునందు ఆత్మనిష్ఠచే పొందేది నిన్ను మాత్రమే. అట్టి నీవు భక్తులకు లభించెదవు.

సంసారాసక్తులకు శ్రీహరిని ఆరాధించుట శక్యము కాదు. సత్పురు షులకైననూ ఏకాంతమగు (అన్యము లేని) భక్తి దుర్లభమే. అట్టి భక్తితో నిన్ను ఆరాధించువాడు ఎవ్వాడు, నీ పాదమూలమును గాక బాహ్యవిష యములను కోరును?

యముడు వీర్యోత్సాహములతో కనుబొమలను ముడివేసి జగ త్తును నశింపజేయ సమర్థుడు. కానీ, అట్టి కాలుడు కూడ నీ పాదమూల మును శరణు జొచ్చినవాని పట్ల తన ప్రతాపమును చూప పూనుకోనడు.

భగవద్భక్తులతోడి అర్ధక్షణకాలము సత్సంగముతో స్వర్గము గాని, పునర్జన్మ లేని మోక్షము గాని సమానము కాదన్నచో, ఇక మర్త్యులు కోరే కామనలు దానికి సాటి కావని వేరుగా చెప్ప వలయునా?

కావున, పాపములను పోగొట్టే పాదములు గల నీ కీర్తియందు అంతస్నానము (అంతఃకరణములో కీర్తిని స్మరించుట) ను, నీ పాదముల - నుండి పుట్టి తీర్థ మైన గంగయందు బాహ్య (శారీరక) స్నానమును సాధు పురుషులు ఆచరించి, తమ మాలిన్యములను పోగొట్టుకొనెదరు. వారు సక లప్రాణులయందు దయ గలవారై, పవిత్రమగు అంతఃకరణమును మరియు సచ్చీలమును కలిగియుందురు. అట్టి సాధు పురుషులతో మాకు సమాగ మము కలుగు గాక! ఇదియే నీవు మాయందు చూపదగిన అనుగ్రహము.

సాధకుడు మననశీలుడై తన పవిత్రమగు అంతఃకరణము భక్తి యొక్క అభ్యాసముచే అనుగ్రహించబడునట్లు చూసుకొనవలెను. సాధకునిమనస్సు బాహ్యవిషయములయందలి ఆసక్తిచే వ్యామోహితమై యుండ రాదు (రజోగుణప్రధానము కారాదు). మరియు సాధకుడు తన చిత్తము అజ్ఞానమనే గుయ్యారములో విలీనము (తమోగుణ ప్రధానము) కాకుండ చూచుకొనవలెను. సాధకుడు ఏ కాలములో అట్టి చిత్తమును తయారు చేసుకొనునో, అదే కాలములో నిశ్చయముగా అనాయాసముగా నీ తత్త్వ మును సాక్షాత్కరించుకొనును.

ఆత్మ చైతన్యమునందే ఈ జగత్తు ప్రకటమగుచున్నది. ఈ జగత్తు నందు ఆత్మచైతన్యము ఆకాశము వలె వ్యాప్తమై సచ్చిద్రూపముగా ప్రకా శించుచున్నది. అట్టి ఆత్మజ్యోతి పరబ్రహ్మస్వరూపుడవగు నీవే.

ఓ భగవానుడా! అనేకరూపములు గల ఈ మాయాశక్తి నిన్ను మోహింప జేయలేదు. నీవు వికారములు లేకుండగనే ఈ మాయాశక్తిచే యథార్థము వలె కానవచ్చే ఈ జగత్తును సృష్టించి, పాలించి, మరల ఉప సంహరించుచున్నావు. జీవులకు ఈ మాయయొక్క ప్రభావము వలననే జగత్తు రూపముగా కనబడే భేదము యథార్థమనే ధారణ కలుగుచున్నది. కాని, నీవు ఆ మాయాశక్తికి అతీతముగా స్వతంత్రుడవై యున్నావని మేము తెలియుచున్నాము.

పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణము. అనునవి సృష్టిస్థితిసంహారకారణమగు నీ సగుణరూపమును లక్షితము చేయుచున్న వి (అనగా, వీటిచే వీటి ప్రేరకుడవగు నీవు నిర్దేశించబడుచున్నావు). అట్టి నీ సగుణరూపమును ఎవరైతే కర్మపరాయణులు (నిష్కామభావనతో కర్మను ఆచరించు భక్తులు) శ్రద్దతో గూడి అనేకములగు పూజాపద్దతులతో చక్కగా ఆరాధించెదరో, వారే వేదశాస్త్రముల సారమునెరింగినవారు.

నీవు అద్వితీయ పూర్ణ పరబ్రహ్మవు. మాయాశక్తిచే నీవు ఈ జగతునకు కారణమగుచున్నావు. ప్రళయములో మాయాశక్తి నీలో విలీనమై యుండును. సృష్టి కాలములో దానియందలి సత్త్వరజస్తమోగుణములలో సంక్షోభము కలిగి మహత్తత్త్వము, అహంకారము, ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనే పంచభూతములు, దేవతలు, మహర్షులు, సకల ప్రాణుల సమూహములతో కూడిన ఈ జగత్తు ప్రకటమగుచున్నవి.

పరబ్రహ్మ తన మాయాశక్తిచే జరాయుజములు (మానవులు మొదలగు ప్రాణులు జరాయువు అనగా గర్భవేష్టన-చర్మమునుండి పుట్టున వి), అండజము (పక్షులు మొదలగు ప్రాణులు, గ్రుడ్డునుండి పుట్టునవి), స్వేదజములు (క్రిమి కీటకములు, మాలిన్యమునందు పుట్టునవి) మరియు ఉద్భిజ్జములు (చెట్టు చేమలు, నేలను పగుల్చుకొని పుట్టునవి) అనే నాలుగు రకముల ప్రాణులను సృష్టించెను. అట్లు సృష్టించిన తరువాత చైతన్యఘనమగు ఆ పరబ్రహ్మ తనచే సృష్టించబడిన పురములవంటి ఈ నాలుగు రకముల దేహములలో ప్రవేశించినాడు. దేహముల అల్పత్వము చైతన్యమునందారోపించబడుటచే ఈ దేహములలో ప్రకటమగుచున్న చైతన్యము పరబ్రహ్మచైతన్యముయొక్క అంశ వలె భాసించును. ఈ విధ ముగా సకలప్రాణులలో చైతన్యరూపముగా ప్రకటమగుచుండుట చేతనే పరబ్రహ్మ పురుషుడు (పురమునందుండువాడు) అని జ్ఞానులు చెప్పుచు న్నారు. తేనెటీగలు ప్రోగుచేసుకునే తేనెవలె అల్పమగు విషయముల సుఖ మును ఆ పురుషుడు ఈ ఉపాధియందు అజ్ఞానముచే ఇంద్రియముల ద్వారా భోగించుచున్నాడు.

ఈ విధముగా జగత్తును సృష్టించి దానిలో చైతన్యము రూపముగా ప్రకటమైన నీ స్వరూపము అనాత్మని షేధరూపముగా మాత్రమే లక్షితమగు చున్నది. మాయాశక్తియొక్క ప్రచండమగు వేగము గల నీవు ప్రళయకాల ములో, సహించ శక్యము కాని వేగము గల వాయువు మేఘపంక్తులను వలె, ఆకాశము మొదలగు భూతములచే పృథివీ మొదలగు భూతములను ఇటునటు కదల్చుచూ (అనగా విలోమక్రమములో ఉపసంహరిస్తూ), ఈ లోకములను ఉపసంహరించెదవు.

మానవుడు వేర్వేరు పనులను చేసుకొనే హడావుడిలోనున్నవాడై, భోగ్యవస్తువులయందు ధనమునందు లంపటమును పెంచుకొని, తన స్వరూపము విషయములో అసావధానుడుగ నుండును. కానీ, కాలరూపుడవగు నీవు అసావధానుడుగ నుండవు. వానిని కాలరూపుడవగు నీవు, ఆక లీగొన్న పాము ఎలుకను వలే, అకస్మాత్తుగా ఆక్రమించి, మ్రింగి వేసెదవు.

ఈశ్వరుడవగు నిన్ను ఉపేక్షించిన, కొలములో ఈ శరీరము వృథాగా ఖర్చు అయిపోవుచుండును. ఈ పత్యమును గుర్తించిన వివేకి యగు ఏ వ్యక్తి నీ పాదపద్మమును విడిచి పెట్టును? మాకు తండ్రియగు బ్రహ్మగారు కూడ ఆయుర్దాయము వృథయగుననే ఆశంకతో నీ పాదపద్మ మునారాధించుచున్నాడు.. పదునల్గురు మనువులు కూడ నిష్కామముగా నీ పాదపద్మమునారాధించెదరు

ఓ పరబ్రహ్మా! (సర్వజగత్కారణుడు) పరమాత్మా! (ప్రాణియొక్క అంతరతమమగు ప్వరూపము) కాలరూపుడగు రుద్రుని (సంహారకుని) భయముచే ఈ జగత్తు ధ్వస్తమైనది. కావున, వివేకవంతులగు మావంటివా రలకు దేనివలనైననూ భయము లేని శరణము నీవే అగుచున్నాను.

రాజకుమారులారా! మీరు పరిశుద్దహృదయులై స్వధర్మమును అనుష్ఠించుచుండుడు. భగవంతునియండు మనస్సును నిలిపి ఈ స్తోత్ర . మును జపించుడు. మీకు మంగళమగు గాక!

శ్రీహరి సకలప్రాణుల బుద్ధియందు ఆత్మరూపుడై ఉన్నాడు. మీరు ఆయనను తప్పని సరిగా నీరంతరముగా కీర్తిస్తూ ధ్యానిస్తూ పూజించుడు.

ఈ స్తోత్రమునకు యోగాదేశము (భగవత్ప్రాప్తికి ఉపాయముగా శివునిచే బోధించబడినది) అని పేరు. దీనిని మీరందరు నానుండి పొంది, గుర్తులోనుంచుకొని, నిష్టతో మననము చేయుడు. మీరు ఏకాగ్రచిత్తులై ఆదరముతో ఈ స్తోత్రమునభ్యసించుడు.

ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మదేవుడు పూర్వము సృష్టిని చేయ గోరెను. అపుడాయన సృష్టిని చక్కగా చేయగోరుచున్న తన పుత్రులగు భృగువు మొదలైన మాకు ఈ స్తోత్రమునుపదేశించెను.

ప్రాణులను సృష్టించుడని ప్రజాపతులమగు మమ్ములనందరిని బ్రహ్మదేవుడు ప్రేరేపించెను. మేమీ స్తోత్రమును పఠించగా మా అజ్ఞానము నశించెను. అపుడు మేము అనేకరకముల ప్రాణులను సృష్టించితిమి.

కావున, వాసుదేవుడే పరమలక్ష్యముగా గల వ్యక్తి ఏకాగ్రమగు చిత్తముతో ఈ స్తోత్రమును సావధానముగా జపించవలెను. అట్లు చేయు వ్యక్తి తొందరలోనే శ్రేయస్సును పొందుచున్నాడు.

ఈ లోకములో హితములన్నింటిలో ఆత్మజ్ఞానము సర్వోత్కృష్ట మైన హితము. జీవన్ముక్తి రూపమగు ఆత్మజ్ఞానము కంటే గొప్పది అగు శ్రేయస్సు మరియొకటి లేదు. అట్టి ఆత్మజ్ఞానమనే నావ గల వ్యక్తి దుఃఖస ముద్రమును తేలికగా తరించును. ఈ సంసారసముద్రమును మరియొక విధముగా తరించుట శక్యము కాదు.

శ్రీహరిని ఆరాధించుట అంత తేలిక కాదు. కాని, ఎవడైతే నాచే కీర్తించబడిన ఈ శ్రీహరి స్తోత్రమును శ్రద్ధతో అధ్యయనము చేయునో, అట్టి వాడు తద్ద్వారా శ్రీహరిని సునాయాసముగా ఆరాధించుచునే యున్నాడు.

నేను తొట్రుపాటు లేకుండగా ఈ గీతముతో శ్రీహరిని స్తుతించితి ని. శ్రీహరి పకలకల్యాణములకు ఏకైకమగు ప్రియనిధానము. ఆయనను ఈ గీతముతో స్తుతించినచో ఆయన ప్రసన్నుడగును. అట్లు స్తుతించు వ్యక్తికి కోరికలన్నియు ఈడేరును.

ఏ వ్యక్తియైతే తెల్లవారు జామున నిద్ర లేచి చేతులను జోడించి . ఈ గీతమును శ్రద్ధతో వినునో, లేక ఇతరులకు వినిపించునో, అట్టి వ్యక్తి కర్మబంధములనుండి విముక్తిని పొందుచున్నాడు.

రాజకుమారులారా! పరమపురుషుడగు శ్రీహరి సకలప్రాణులలో అంతరతమమగు ఆత్మరూపుడై యున్నాడు. నేనాయనను స్తుతించిన ఈ గీతమును ఏకాగ్రచిత్తముతో జపిస్తూ మీరు గొప్ప తపస్సును ఆచరించుడు. తపస్సునకు అంతమునందు ఆ శ్రీహరి మీ కోరికలీడేర్చును.

శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు రుద్రగీత మనే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.