శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

5 - వీరభద్రుడు దక్షయజ్ఞమును విధ్వంసము చేయుట

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దక్ష ప్రజాపతి చేసిన అవ మానము కారణముగా భవపత్నియగు సతీదేవి ప్రాణత్యాగమును చేసెను. దక్షుని యజ్ఞములో ఉద్భవించిన ఋభువులనే దేవతలు రుద్రానుచరుల సైన్యము పారిపోవునట్లు చేసిరి. ఈ వృత్తాంతమునంతనూ నారదుని వలన తెలుసుకున్న శివునకు అంతు లేని కోపము కలిగెను.

కంపించుచున్న జటలు గల ఆ శివుడు కోపముతో పెదవుల అగ్ర ములను కొరుకుచుండగా భయంకరాకారుడై కన్పట్టెను. ఆయన మెరుపు వలె అగ్నికీలలవలె మెరిసిపోయే ఒక జటను తన జటాజూటమునుండి పెరికి, వెంటనే లేచి నిలబడి నవ్వుతూ గంభీరమగు. నాదమును చేస్తూ, దానిని నేలపై విడిచి పెట్టెను.

ఆ జటనుండి పెద్ద శరీరము గల ఒక పురుషుడు ఉదయించెను. ఎత్తైన ఆ పురుషుడు తన దేహముతో ఆకాశమును స్పృశించుచున్నాడాయన్నట్లు ఉండెను. వేయి చేతులు, సూర్యునివంటి మూడు కన్నులు, ఎత్తైన భయంకరమగు కోరలు, మండే నిప్పువంటి కేశములు, పుర్రెల మాల, ఎత్తి పట్టుకున్న అనేకములగు ఆయుధములు గల ఆ పురుషుడు మేఘమువంటి కాంతిని కలిగియుండెను.

ఆ పురుషుడు చేతులను జోడించి, అయ్యా! నేను ఏమి చేయవ లెను? అని ప్రశ్నించగా, జగన్నాథుడగు ఆ శివభగవానుడు ఇట్లు చెప్పెను: భయంకరముగా యుద్ధమును చేయబోయే ఓ వీరుడా! దక్షుని సంహరించి వాని యజ్ఞమును నాశము జేయుము. నా అంశనుండి పుట్టిన నీవు నా అనుచరులకు నాయకుడవు కమ్ము.

వత్సా విదురా! కోపించియున్న రుద్రుడు ఈ విధముగా ఆజ్ఞాపిం చగా, ఆ పురుషుడు దేవదేవుడగు ఆ శివప్రభునకు ప్రదక్షిణము. చేసెను. శివుని శక్తిచే సృష్టించబడిన తన వేగమును ఎవ్వరైననూ ఎదిరించలేరనియు, తాను గొప్ప బలవంతుల వేగమునైననూ సహించగలననియు ఆతడా సమయములో తలపోసెను.

ఆ పురుషుని (వీరభద్రుని) పాదములకు అలంకరించబడిన నూపు రములు గలగల ధ్వనిని చేయుచుండెను. ఆతని అనుసరించి నడిచే రుద్ర కింకరులు నాదములను చేయుచుండిరి. ఆతడు కూడ మిక్కిలి భయమును గొల్పు విధముగా సింహనాదమును చేసెను. జగత్తులోని సకలప్రాణులను అంతము చేయు యముని కూడ సంహరించునా యన్నట్లు ఉన్న శూలమును ఆతడు ఎత్తి పట్టుకొని మహావేగముతో ముందుకు సాగెను.

అప్పుడు యజ్ఞశాలలోని ఋత్విక్కులు, దక్షుడు, సభాసదులగు బ్రాహ్మణులు, వారి భార్యలు ఉత్తరదిక్కునందు పెద్ద దుమ్మును చూచిరి. ఈ చీకటి ఏమి? ఈ దుమ్ము ఎక్కడనుండి వచ్చుచున్నది? అంటూ వారు పరిపరివిధములుగా తలపోయుచుండిరి.

ఇప్పుడు తుఫాను గాలులు వీచుట లేదు. నేరగాళ్లకు కఠినమగు శిక్షలను వేసే ప్రాచీనబరిష మహారాజు జీవించియే యున్నాడు గాన, దుమ్మును రేగగొట్టే చోరులు కూడ లేరు. ఇది గోవుల మంద రేగగొట్టుచున్న ధూళి కూడ కాదు. మరి ఈ ధూళి ఎక్కడనుండి వచ్చుచున్నది? జగత్తునకు ప్రళయము రాబోవుచున్నదా యేమి?

ప్రసూతి (దక్షపత్ని) మొదలగు స్త్రీలు కలత జెందిన మనస్సులు గలవారై ఇట్లు పలికిరి: దక్ష ప్రజాపతి ఏ పాపమునెరుంగని తన కుమార్తె యగు సతీదేవిని అవమానించినాడు. తన మిగిలిన కుమార్తెలు చూచుచున్ననూ ఆతడు లెక్క చేయలేదు. ఆ పాపమునకు ఇది ఫలము.

ఆ శివుడు ప్రళయకాలమునందు జటల సమూహమును విరబోసు కొని, తన శూలముయొక్క కొనలయందు గొప్ప దిగ్గజములను గ్రుచ్చి పట్టుకొనును. ఆయన బిగ్గరగా కఠోరముగా నవ్వగా, పిడుగుపాటువంటి ఆ ధ్వనికి దీక్కులు పిక్కటిల్లును. ఆయన భుజములయందు అస్త్రములను పట్టుకొని, వాటిని ధ్వజములవలే చాచి నాట్యమును చేయును.

కోపముతో నిండియున్న శివుని తేజస్సును సహించుట శక్యము కాదు. ఆయన కనుబొమలు కోపముతో వంకర కాగా, ఆయనను చూచుట కూడ కష్టమే. భయంకరమగు ఆయన కోరలు నక్షత్రముల గుంపులను చెల్లాచెదరు చేయును. అట్టి శివుని సహనమును పరీక్షించి, ఆయనకు కోపమును తెప్పించిన ఈ దక్ష ప్రజాపతికి కల్యాణము కలుగునా యేమి?(ఆయనకు కోపమును కలిగించినవాడు సాక్షాత్తుగా బ్రహ్మయే అయినా, ఆయనకు శుభము కలుగునా?)

మహాత్మునివలే డంబము చూపినా దక్షుడు దుష్టుడే. ఆతని యజ్ఞములో జనులు భయముతో చూస్తూ ఇట్లు పరిపరి విధములుగా చెప్పుకో నుచుండిరి. అప్పుడు భూమిపై మరియు అంతరిక్షములో అంతటా పెద్ద అపశకునములు వేలాదిగా బయల్వెడలి భయమును గొల్పినవి.

ఓ విదురా! అంతలో ఆ గొప్ప యజ్ఞమును రుద్రుని అనుచరులు అడ్డుకొనిరి. వారందరు అనేకవిధముల ఆయుధములను ఎత్తి పట్టుకొని యుండిరి. వారిలో కొందరు మరుగుజ్జులు. కొందరు కపిలవర్ణము వారు కాగా, మరికొందరు పచ్చని వర్ణమును కలిగియుండిరి. కొందరి. పొట్టలు మొసలి పొట్టలను పోలియుండగా, మరికొందరు ముఖములలో మొసలి పోలికలను కలిగియుండిరి. వారు యజ్ఞశాల అంతటా ఇటునటు పరుగులెత్తుచుండిరి.

వారిలో కొందరు యజ్ఞశాల పైకప్పు దూలమును విరిచివేసిరి. మరికొందరు యజమాన పత్ని కూర్చుండే శాలను, కొందరు ఆగ్నీధ్రుని శాలను, కొందరు యజమానుని గృహమును, మరికొందరు ముందుండే మండపమును, ఇంకొందరు వంటశాలను కూలగొట్టిరి.

వారిలో కొందరు యజ్ఞపాత్రలను పగులగొట్టగా, కొందరు అగ్నులను నాశనము చేసి, అగ్నికుండములలో మూత్రించిరి. కొందరు ఉత్తరవేదికి కట్టిన సూత్రములను ఊడబెరికిరి.

కొందరు మునులను పీడించగా, మరికొందరు వారి పత్నులను భయ పెట్టిరి. కొందరు దగ్గరగా నున్నవారిని మాత్రమే గాక, పారిపోవుచున్న దేవతలను కూడ పట్టుకొనిరి.

మణిమంతుడు భృగు మహర్షిని, వీరభద్రుడు దక్ష ప్రజాపతివి బంధించిరి. చండీశుడు పూషదేవతను, నందీశ్వరుడు భగదేవతను పట్టుకోనిరి.

ఋత్విక్కులు, సభాసదులు మరియు దేవతలు అందరు ఈ కల్లో లమును చూచి నలుదిక్కులకు పారిపోజొచ్చిరి. వారిని రుద్రానుచరులు రాళ్లతో కొట్టి పీడించిరి.

భృగు మహర్షి చేతిలో ప్రవమును పట్టుకొని హోమమును చేయు చుండెను. దక్షుడు శివుని నిందించే సమయములో ఆయన మీసమును గెడ్డమును సవరించుకుంటూ నవ్వెను. కావుననే, వీరభద్ర భగవానుడు ఆ భృగువుయొక్క మీసమును గెడ్డమును పెరికివేసెను.

ప్రజాపతులు చేసిన సత్రయాగములోని సభయందు దక్షుడు శివుని నిందించిన సమయములో భగుడు కన్నుతో సైగచేసి దక్షుని ప్రేరేపించెను. కావుననే, వీరభద్ర భగవానుడు కోపముతో ఆయనను నేలపై పడగొట్టి కళ్లను పీకివేసెను.

దక్షుడు ఆ సభలో శివుని నిందించుచున్న సమయములో పూష దేవత పళ్లను ఇకిలిస్తూ నవ్వెను. కావుననే, బలభద్రుడు కళింగదేశాధిపతి పళ్లను పెకిలించిన విధముగా, వీరభద్రుడు ఆయన పళ్లను రాలగొట్టెను.

ముక్కంటియగు వీరభద్రుడు దక్షుని గుండెలపై కాళ్లతో తొక్కి పెట్టి వాడి కత్తితో తలను నరుకుటకు ప్రయత్నించాను. కాని, ఆ ప్రయత్నములో ఆతడు సఫలుడు కాలేదు.

ఈ విధముగా మంత్రశక్తితో కూడిన ఆయుధములతో నైననూ ఆ వీరభద్రుడు దక్షుని తలను నరుకుటకు గాని, వాని చర్మమును ఒలుచుటకు గాని సమర్థుడు కాలేదు. జీవులకు నాథుడగు ఆ వీరభద్రుడు అప్పుడు చాల ఆశ్చర్యమును పొంది, దీర్ఘమగు ఆలోచనలో పడెను

అట్లు ధ్యానించినప్పుడు జీవులకు ప్రభుడగు ఆ వీరభద్రునకు ఒక ఉపాయము తోచెను. యజ్ఞములో యజమానుడే పశువు. కావున, పశువిశ సనము చేసినట్లు యజమానుడగు ఈ దక్షుని ప్రాణములనపహరించ వచ్చును. ఆతడు అట్లు తోచగానే, వెంటనే ఆ ఉపాయమును అమలు చేసి, దక్షుని తలను మొండెమునుండి వేరుజేసెను.

అప్పుడు రుద్రుని అనుచరులగు భూతప్రేతపిశాచములు వీరభ ద్రుని ఆ పనిని స్తుతిస్తూ, బాగు బాగు అని ప్రశంసించిరి. దక్షుని పక్షము వారు అయ్యో! అయ్యో! అంటూ దుఃఖించిరి.

శివుని నిందను సహించలేని వీరభద్రుడు మిక్కిలి కోపించి, ఆ తలను దక్షిణాగ్నియందు హోమము చేసి, యజ్ఞమండపమును తగులబెట్టి, కైలాసమునకు తిరిగి వెళ్లాను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి నాల్గవ స్కంధములో వీరభద్రుడు దక్షయజ్ఞమును విధ్వంసము చేయుటను వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది.