శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

20 - పృథూపాఖ్యానము - శ్రీహరి పృథు సంవాదము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- సర్వవ్యాపకుడు, యజ్ఞేశ్వరుడు, యజ్ఞములోని హవిర్భాగములను భుజించువాడు, సకలప్రాణుల బుద్ధి గుహలో ఆత్మరూపముగా నుండువాడు, వైకుంఠవాసి అగు శ్రీహరి భగవానుడు కూడ పృథువు చేసిన యజ్ఞములకు సంతోషించెను. ఆయన ఇంద్రునితో గూడియున్నవాడై పృథువుతో నిట్లు పలికెను.

శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- నీ వందవ అశ్వమేధ యాగమును ఈ ఇంద్రుడు భంగము చేసినాడు. ఈతడు ఇప్పుడు నిన్ను క్షమించుమని కోరుచున్నాడు. నీఏతనిని క్షమించుము.

ఓ మహారాజా! లోకములో మంచి బుద్ధి కలిగిన సాధుపురుషులు ఇతర ప్రాణులయెడల ద్రోహబుద్ధిని, కోపమును కలిగియుండరు. ఇట్టివారే మానవులలో ఉత్తములు. ఏలయనగా, ఈ దేహము మానవుని ఆత్మ (య థార్థస్వరూపము) కాదు.

నీవంటి పురుషులు కూడ ఈశ్వరుని మాయచే మోహితులై ద్రోహాదులను చేసినచో, చిరకాలము పెద్దలను సేవించినందు వలన ఏ ప్రయోజ నము కలుగలేదు. ఆ సేవ కేవలము వ్యర్థమగు శ్రమయే యగును. .

మానవునకు తన స్వరూపము పూర్ణమని తెలియకపోవుట చేతనే మనస్సులో కామనలు పుట్టి వాటిని తీర్చుకొనుటకై కర్మలను చేసి, ఆ కర్మల ఫలరూపముగా ఈ దేహమును పొందును. కావుననే, ఈ సత్యమును తెలుసుకున్న వివేకి ఈ దేహమునందు నేను, నాది అనే ఆసక్తిని సుతరాము కలిగియుండడు.

వివేకి ఈ దేహమునందైననూ ఆసక్తి లేకుండ నుండును. అట్టి స్థితిలో వివేకము గలవాడు ఎవడైననూ, ఈ దేహసంబంధమును బట్టి వచ్చిన ఇల్లు, సంతానము, ధనము అనువాటియందు మమకారమును కలి) గియుండునా?

ఈ ఆత్మ రెండవది లేనిది (దేహములు అనేకములు), పుణ్యపాపముల సంసర్గము లేనిది (దేహము మలినము), స్వయముగా ప్రకాశించు నది (దేహము జడము), సత్త్వరజస్తమోగుణములకు అధిష్టానము అయి ఉన్ననూ, తన స్వరూపమునందు గుణములు లేనిది (దేహము ఈ గుణ ముల కార్యము). సర్వము ఆత్మచైతన్యమునందే భాసించును గనుక, ఆత్మ సర్వవ్యాపకము (దేహము, దేశకాలములయందు పరిచ్చిన్నము). ఆత్మ అద్వితీయము గనుక, దానికి మరియొక ఆవరణ లేదు (దేహము నకు ఇల్లు మొదలగు ఆవరణలు ఉండును). ఆత్మ సర్వమునకు సాక్షి (దేహము చూడబడేది మాత్రమే). చైతన్య-ఆత్మ ద్రవ్యము కాదు గనుక, దాని యందు స్వగతభేదము లేదు (ద్రవ్యమగు దేహమునందు వేర్వేరు అవయవములు గలవు). కావున, ఆత్మ దేహముకంటె విలక్షణమైనది (కాని, ఆత్మను వీడి దేహము మనలేదు).

సత్-స్వరూపమగు ఆత్మ ప్రతి ప్రాణిలో నేను అనే భావనలో ప్రకటమగుచున్నది. అట్టి ఆత్మను శరీరముకంటే విలక్షణముగా తెలుసుకున్న వాడు ఆత్మరూపుడనగు నా (పరబ్రహ్మ) యందే ఐక్యమును చెందియుండును. ఆతడు ప్రకృతియొక్క సత్త్వరజస్తమోగుణముల కార్యమగు దేహ మునందున్నట్లు కానవచ్చిననూ, ఆ గుణములు ఆత్మస్వరూపుడగు ఆతనికి పుణ్యపాపాది లేపమును కలిగించవు.

ఓ రాజా! ఎవడైతే కామనలు లేకుండా నిత్యము తన కర్తవ్యమును శ్రద్ధతో అనుష్ఠిస్తూ ఆ విధముగా నన్ను భజించునో, వాని మనస్సు మెల్లగా ప్రసన్నమగును.

ఈ విధముగా స్వచ్చమైన అంతఃకరణము గల సాధకుడు సత్త్వర జస్తమోగుణకార్యములగు సుఖదుఃఖమోహాత్మకములైన మనోవృత్తుల యందు తాదాత్మ్యమును విడిచి పెట్టి, సర్వమునందు పరబ్రహ్మను దర్శిం చును. అట్టివానికి పరమశాంతి (పూర్తిగా సంసారము నివృత్తమగుట) రూపమగు జీవన్ముక్తి లభించును. ఆ స్థితిలో ఆతడు ఆత్మరూపుడనగు నాయందే నిష్ఠను కలిగియుండును.ఇదియే బ్రహ్మీభావము అనే అద్వైత స్థితి.

దేహము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మరియు మనస్సులకు సాక్షిగా ఉండే ఆత్మ వాటికి అతీతముగనే యుండును గనుక, వాటిచే ప్రభావితము గాదు. కావుననే, ఆత్మయందు వికారములేమియు ఉండవు, అట్టి ఆత్మను (తన స్వరూపమును) తెలుసుకున్న వ్యక్తి పరమకల్యాణమగు జీవన్ముక్తిని పొందును.

పంచభూతములు, అధిష్టానదేవతలతో కూడిన ఇంద్రియములు, అంతఃకరణము అనే ఈ సంఘాతమునందు ఆత్మ ప్రతిఫలించుటచే ఇవి మనుగడను సాగిస్తూ ప్రకాశించుచున్నవి. ఈ పరిచ్చిన్నమగు ఉపాధి యందు ఆత్మభావము గల లింగ శరీర రూపుడగు జీవునకు సత్త్వరజస్తమోగుణముల కార్యములగు సుఖదుఃఖమోహములు నిరంతరముగా జన్మ తరువాత జన్మలో కలుగుచునేయుండును. కాని, ఆత్మరూపుడనగు నాయందు దృఢమగు నిష్ఠ (ప్రీతి) గల జ్ఞానులు సంపదలు కలిగినప్పుడు హర్షము అనే వికారమును గాని, ఆపదలు వచ్చినప్పుడు విషాదము అనే వికారమును గాని పొందకుండగా, సాక్షులుగా నిలిచియుందురు.

ఓ వీరా! నీవు ఇంద్రియములను మనస్సును నిగ్రహించి, సుఖదుఃఖములయందు సమమగు చిత్తమును కలిగియుండుము. జనులలో కొందరు ఉత్తములు కాగా, మరికొందరు మధ్యములు, ఇంకొందరు అధములు ఉండెదరు. వారియందు నీవు సమానమగు ప్రీతిని కలిగియుండుము. నేను సృష్టించిన ఈ లోకమంతయు నీ యెదుట నున్నది. దానిలోని జనుల సహకారముతో, నీవు సకలప్రాణులకు రక్షణను కల్పించుము.

ప్రజలకు రక్షణను కల్పించుటయే రాజునకు శ్రేయస్కరము. ఏల యన, ప్రజలను రక్షించే రాజునకు ప్రజల చేసుకున్న పుణ్యములో ఆరవ వంతు లభించి, ఆతడు పరలోకములో ఆ పుణ్యముననుభవించును. అట్లుగాక, ప్రజలను రక్షించకుండా వారివద్ద పన్నును వసూలు చేసే రాజునకు ప్రజల పాపము చుట్టుకొని, ఆతడు పాపఫలమును అనుభవించును. ఆతని పుణ్యమును ప్రజలు తీసుకొనెదరు.

నీవు ఈ విధముగా మహర్షులకు సమ్మతమైన ధర్మమే ప్రముఖముగా గలవాడవై, సర్వమునందు కేవలము సాక్షిభావముతో ఉంటూ, దేశమును రక్షిస్తూ, ప్రజారంజకముగా పరిపాలించుము. ఈ ప్రజాపాలన ధర్మము రాజులకు పరంపరాప్రాప్తమై యున్నది. అట్లు చేసినచో, నీకు కొద్ది కాలములోనే నీ ఇంటికి తరలివచ్చిన సిద్ధపురుషుల దర్శనము కాగలదు.

ఓ మహారాజా! నీవు నానుండి ఏదేని వరమును కోరుకొనుము. నేను నీ గుణములకు, శీలమునకు వశుడనైతిని. సుఖదుఃఖములయందు సమమగు చిత్తము గలవారికి (పరబ్రహ్మయందు లగ్నమైన మనస్సు గల వారికి) లభించినంత తేలికగా, నేను ఆ గుణములు శీలము లేకుండగా, కేవలము యజ్ఞములచే గాని, తపస్సులచే గాని, అష్టాంగయోగము మొదలగు సాధనలచే గాని లభించను.

లోకములకు. తండ్రి, సూర్యరూపములో అంతటా వ్యాపించిన కాంతులు గలవాడు అగు శ్రీహరి జగద్విజేతయగు పృథువును ఈ విధముగా ఆదేశించెను. పృథువు భగవానుని ఆదేశమును శిరసా వహించెను.

వంద యజ్ఞములను చేసిన ఇంద్రుడు తాను చేసిన పనికి సిగ్గు చెంది పృథువు పాదములపై పడెను. పృథువు ఆయనను ప్రేమతో కౌగిలించుకొని వైరభావమును విడిచి పెట్టెను.

జగత్తు రూపములో ప్రకటమైన శ్రీహరి భగవానుడే జగత్తుయొక్క యథార్థస్వరూపమై యున్నాడు. అప్పుడు పృథువు ఆయనకు పూజాద్రవ్యములను సమర్పించి, క్షణక్షణప్రవర్ధమానమగు భక్తితో, పద్మములవంటి ఆయన పాదములను పట్టుకొనెను.

 పద్మపత్రములవంటి కన్నులు గల శ్రీహరి సత్పురుషులకు మిత్రుడు. ఆయన బయలు దేరుటకు సంసిద్దుడాయెను. కాని, పృథువును అనుగ్రహముతో చూస్తూ ఉండిపోవుటచే, బయలు దేరుట ఆగిపోయి, ఆయనకు విలంబము కలిగెను.

ఆదిరాజగు ఆ పృథువు చేతులను జోడించి శ్రీహరికి నమస్కరించెను. కాని, ఆయన కన్నులు ఆనందబాష్పములతో నిండిపోవుటచే, ఆతడు వ్యాకులతను చెంది, శ్రీహరిని చూడలేకపోయెను. కేవలము నిలబడి హృదయముతో ఆయనను కౌగిలించి పట్టుకొనెను.

అప్పుడు పృథువు కన్నీటిని తుడుచుకొని పూర్ణస్వరూపుడగు శ్రీహరితో నిట్లనెను. పాదములతో నేలను స్పృశిస్తున్న ఆయనను చూచుచున్న పృథువుయొక్క కన్నులకు తృప్తి కలుగకుండెను. ఆయన తన అర చేతిని నాగశత్రువు అగు గరుత్మంతుని ఎత్తైన భుజముపై నుంచెను.

పృథు మహారాజు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! వరములనిచ్చే దేవతలకు కూడ నీవు నాథుడవు. భోగపరాయణుల చిత్తములు త్రిగుణాత్మి కయగు ప్రకృతియొక్క కార్యములైన శబ్దాది విషయములచే వికారమును పొంది. అనేకములగు కామనలను కలిగియుండును. అట్టి కామనలను నీనుండి వరముగా పొందవలెనని వివేకియైనవాడు ఎవడు కోరును? అట్టి భోగములు నరకములోని జీవులకు కూడ లభించుచునే యుండును. నీవు మోక్షమునిచ్చే ప్రభుడవు. నేను నిన్ను అట్టీ వరములను కోరుట లేదు.

ఓ ప్రభూ! మహాత్ముల హృదయములోపల ఉండే నీ పాదపద్మముల మధురపము వారి నోటినుండి మీ గాథల రూపములో జాలువారు చుండును. అది మోక్షమునందు లభించనిచో, అట్టి మోక్షము కూడ నాకు ఏ కాలమునందైననూ అభీష్టము కాదు. నీ గాథలను వినుటకు నాకు పది వేల చెవులవిమ్ము. అదియే నాకు గొప్ప వరము.

ఉత్తమమగు కీర్తి గల ఓ ప్రభూ! మేము జ్ఞానమార్గమును విస్మరించి చంచలమగు చిత్తములు గలవారమై యున్నాము. మహాత్ముల నోటి నుండి జాలువారే నీ పాదపద్మముల కీర్తి అనే అమృతకణముల గాలి తగిలిననూ, మాకు మరల నీ స్మరణము కలుగును. కావున, ఇతరములగు వరములతో పని లేదు.

పవిత్రమగు కీర్తి గల ఓ శ్రీహరీ! ఏ వ్యక్తియైననూ మహాత్ముల తోడి సమావేశమైనప్పుడు ఒక్కసారి అనుకోకుండా ఈశ్వరేచ్చచే నీ మంగళకరమగు కీర్తిని శ్రవణము చేయునో, అట్టి వ్యక్తి మూర్ఖుడైతే తప్ప, గుణమును తెలుసుకొనే శక్తి గలవాడైనచో, నీ కీర్తి శ్రవణమును విడిచి పెట్టడు. అట్లు విడిచి పెట్టువాడు పశుప్రాయుడే. ఏలయనగా, లక్ష్మీదేవి కూడ తనయందు పురుషార్థములను సంపాదించగోరి, నీ కీర్తిని శ్రవణమును చేయాలనే వరమును నీనుండి చాల గట్టిగా కోరుకొనెను.

కావున, సకలప్రాణులలో అంతర్యామిగా ఉండే పూర్ణపురుషుడ వగు నిన్ను నేను లక్ష్మీదేవితో సమానమైన ఉత్సుకతతో సేవించెదను. నీవుఓం త్రిగుణాత్మకయగు ప్రకృతికి అధిష్ఠానమవు. ఈ విధముగా నేను, లక్ష్మీదేవి నిన్ను మాత్రమే ప్రభువుగా సేవించుటకు పోటీ పడుచున్నాము. మా ఇద్దరి మనస్సు నీ పాదములయందు మాత్రమే అఖండముగా ఏకాగ్రమైయున్నది. ఇట్టి స్థితిలో ఈ పోటీ వలన మాకిద్దరికి కలహము రాకుండు గాక!.

ఓ జగన్నాథా! జగన్మాతయగు లక్ష్మీదేవితో మాకు విరోధము వచ్చి తీరును. ఏలయనగా, నిన్ను సేవించుట అనే పనిని అమె చేయుచుండును. కాని, ఇప్పుడు ఆ పనిని మేము చేయగోరుచున్నాము. పైగా, దీను లయందు వాత్సల్యము గల నీవు, భక్తులమగు మేము చేసేది అల్పమే అయినా, అదే గొప్పది అని మన్నించెదవు. నీ స్వరూపము పూర్ణము. అట్టి పూర్ణస్వరూపమునందు మాత్రమే ఆనందఘనుడవై యుండే నీకు ఆమెతో పని యేమి?

ఓ భగవానుడా! నీవు దీనవత్సలుడవు గనుకనే, మహాత్ములు ఆత్మజ్ఞానము కలిగిన తరువాత కూడ నిన్ను సేవించుచున్నారు. నీయందు మాయాశక్తియొక్క గుణముల విలాసము (గుణముల వలన కలిగే భ్రాంతి) లేశమైననూ లేదు. మహాత్ములకు నీ పాదములను స్మరించుట కంటే మరి యొక ప్రయోజనము లేదని మాకు తెలియును.

నీ వాక్కు లోకులకు మోహమును కలిగించునది యని నా అభిప్రాయము. ఏలయనగా, నిన్ను సేవించే నాతో నీవు, వరమును కోరుకొమ్మని పలికితివి. వేదరూపమైన నీ వాక్కు మానవుని బంధించియున్నది. అట్లుగానిచో, మోహమును పొందియున్న మానవుడు మరల మరల కామ్యకర్మలనేల చేయును? .

ఓ ప్రభూ! అజ్ఞానియగు మానవుడు నీ మాయచే మోహితుడై తన యథార్థస్వరూపమునుండి ఖచ్చితముగా విడిపోయినాడు. ఏలయనగా, మానవుడు ఆత్మరూపుడవగు నిన్ను గాక, ఇతరములను కోరుచున్నాడు. తండ్రి పిల్లవాని హితమును తనంత తానుగా నిర్ణయించి తదనుగుణముగా ఆచరించును. అదే విధముగా, నీవు కూడ మాకు ఏది హితమో నిశ్చయించి, దానిని సంపాదించి పెట్టుము.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- సర్వసాక్షియగు ఆ శ్రీహరిని ఆదిరాజగు పృథువు ఇట్లు స్తుతించగా, ఆయన పృథువుతో నిట్లనెను : ఓ రాజా! నీకు నాయందు భక్తి. స్థిరముగా నుండుగాక! నీవు దైవవశముచే నాయందు ఇట్టి నిష్కామమగు ప్రేమను కలిగియున్నావు. ఇట్టి బుద్ధిచే మానవుడు తరింప శక్యము కాని నా మాయను తరించి వేయును సుమా!

ప్రజలను పాలించే ఓ రాజా! కావున, నీవు నేను చెప్పినట్లు చేయుము. నా ఆదేశమును పాలించే మానవుడు అన్ని కాలములలో అన్ని దేశములలో (ఇహ పరములలో) కల్యాణమును పొందును.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- రాజర్షి, వేనపుత్రుడు అగు పృథువుయొక్క వచనమును శ్రీహరి ఈ విధముగా అభినందించెను. పృథువుచే పూజించబడిన శ్రీహరి ఆయనను అనుగ్రహించి వెళ్లుటకు సంసిద్ధుడాయెను.

దేవతలు, మహర్షులు, గంధర్వులు, సిద్దులు, చారణులు, నాగులు, కిన్నరులు, అప్సరసలు, శ్రీహరి భక్తులగు మానవులు, పక్షులు, అనేక రకముల ప్రాణులు, శ్రీహరి అనుచరులు వీరినందరినీ పృథువు సాక్షాత్తుగా యజ్ఞేశ్వరుడగు శ్రీహరియే అనే భావనతో పలకరించి, చేతులను జోడించి నమస్కరించి, ధనాదులను భక్తిపూర్వకముగా సమర్పించి సత్కరించెను. వారందరు అక్కడనుండి తమ తమ స్థానములకు వెళ్లిరి.

శ్రీహరి భగవానుడు కూడ రాజర్షియగు పృథువుయొక్క మనస్సు ను, ఆతని ఋత్విక్కుల మనస్సులను దోచుకున్నవాని వలె వైకుంఠము నకు చేరుకొనెను.

శ్రీహరి ఇంద్రియగోచరుడు కాడు. అయిననూ, దేవాధిదేవుడగు ఆయన తన సగుణ రూపమును పృథువునకు చూపించెను. అట్టి శ్రీహరి కనుచూపు మేర దాటి వెళ్లాను. పృథువు ఆయనకు నమస్కరించి, తన నగ రమునకు చేరుకొనెను. .

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానమునందు శ్రీహరిపృథుసంవాదమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము

ముగిసినది.