శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
22 - పృథూపాఖ్యానము - పృథు సనత్కుమార సంవాదము
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- జనులు గొప్ప పరాక్రమము గల పృథువును ఈ విధముగా స్తుతించుచుండగా, సూర్యుని వలె వెలిగిపోతున్న నలుగురు మహర్షులు అచటకు విచ్చేసిరి.
ఆ మునీశ్వరులను పృథు మహారాజు వారి కొంతిని బట్టియే గుర్తించెను. వారు తమ కాంతిచే లోకులను పాపనిర్ముక్తులను చేయుచూ ఆకాశ మునుండి దిగుతుండగా, ఆ మహారాజు మరియు ఆయన అనుచరులు వారిని చూచిరి.
వారిని చూచిన తోడనే పైకి పోయిన ప్రాణములను, ఇంద్రియములకు ప్రభువగు మనస్సు శబ్దాది విషయములను వలె, తిరిగి లోపలికి తెచ్చుకొనే కోరిక గలవాడా యన్నట్లు, వేనపుత్రుడగు పృథువు లేచి నిలబ డెను. ఆయనను అనుసరించి సభాసదులు, ఆయన అనుచరులు కూడ లేచి నిలబడిరి.
వారియందలి గౌరవముచే సత్పురుషుడగు పృథువు వారికి వశుడై పోయెను. ఆయన వినయముతో వంగిన మెడ గలవాడై, వారికి అర్ఘ్యమును ఆసనమును సమర్పించేను. వారు వాటిని స్వీకరించి ఉపవిష్ణు లైన పిదప ఆయన వారిని యథావిధిగా పూజించెను.
ఆయన వారి పాదములను కడిగి ఆ జలమును తన తలపై చల్లు కొనెను. ఆ నీటితో ఆయన జుట్టు ముడి తడిసెను. ఈ విధముగా సచ్చీలము గలవారి నడవడిని ఆయన ఆ సభలో సమగ్రముగా ఆచరించెను.
సనకాది మహర్షులు రుద్రునకు కూడ అన్నలు. వారు బంగరు ఆసనములయందు, వేదులయందు అగ్నులవలె, కూర్చుండిరి. వారి యెడల శ్రద్ద మరియు చిత్త సమాధానము కలిగియున్న పృథువు వారి రాకచే సంతసిల్లి, వారితో నిట్లనెను,
పృథు మహారాజు ఇట్లు పలికెను --- ఏమి భాగ్యము! ఓ మహర్షు లారా! మీ రాక మంగళకరమైనది. నేను ఏమి పుణ్యమును చేసితినో! యోగులకైనమా దుర్లభమగు మీ దర్శనము నాకు కలిగినది.
ఎవనికైతే వేదవేత్తలు మరియు అనుచరులతో కూడిన శివవిష్ణు వులు ప్రసన్నులగుదురో, వానికి ఇహ పరలోకములలో మిక్కిలి లభించ శక్యము కానిది ఏమి ఉండును?
సర్వసాక్షియగు ఆత్మస్వరూపమును మానవులు గుర్తించ లేకు న్నారు. దృశ్యమగు ఈ జగత్తునకు కారణమగు మహత్తత్త్వము మొదలగు తత్త్వములను జనులు గుర్తించ లేకున్నారు. అదే విధముగా, మీరు లోక ములను పర్యటించుచున్ననూ, సామాన్య జనులు మిమ్ములను గుర్తు పట్ట లేరు.
ఏ గృహస్థుల గృహములకు మహాత్ములు విచ్చేసి, వారి ఇంట్లో కూర్చుండి, వారిచ్చిన నీటిని త్రాగెదరో, ఏ గృహస్థులు మరియు వారి సేవకులు కూడ మహాత్ములకు సేవ చేసెదరో, అట్టి సాధుపురుషులగు గృహస్థులు నిర్ధనులే అయిననూ, ధన్యులు అగుదురు.
శ్రీహరి పాదములనుండి గంగ పుట్టినది. అట్టి శ్రీహరియొక్క భక్తుల పాదములను కడిగి ఏ గృహములలో సత్కరించరో, అట్టి గృహములు, సకలసంపదలు పూర్ణముగా కలిగియున్ననూ, పాములకు నెలవైన చెట్ల వంటివి.
ఓ మహర్షులారా! మీకు స్వాగతము. వివేకవంతులగు మీరు బాల్యములోనే మోక్షకాములై శ్రద్ధతో గొప్ప వ్రతములనాచరించుచున్నారు.
ఓ ప్రభువులారా! ఇంద్రియములకు విషయములగు శబ్దాదులే (భోగ్యములే) పురుషార్థములని భావించి మేము మా కర్మల చేతనే సంసా రములో బద్ధులమై పడి యున్నాము. ఈ సంసారము దుఃఖములకు క్షేత్ర ము. అట్టి మాకు క్షేమము గలదా?
ఆత్మనిష్ఠులై ఆత్మానందముననుభవించే మిమ్ములను కుశల ముగా నున్నారా యని ప్రశ్నించుట యుక్తియుక్తము కాదు. మీ మనస్సు లలో ఇది కుశలము, ఇది కుశలము కాదు అనే ఆలోచనలకే తావు లేదు.
శోకతాపమును పొందియున్నవారికి మీరు హితమును చేయుదురు. కావున, మీయందు విశ్వాసము ఏర్పడియున్న నేను మిమ్ములను ఒక ప్రశ్నను వేసెదను. ఈ సంసారములో మానవునకు తేలికగా క్షేమము కలిగే ఉపాయమేది?
పుట్టుక లేని శ్రీహరి భగవానుడు సకలప్రాణులలో ఆత్మరూపుడై యున్ననూ, ఆత్మానాత్మవివేకము గల ధీరులకు మాత్రమే ఆ రూపముగా ప్రకాశించుచున్నాడు. అట్టి శ్రీహరి తన భక్తుల ననుగ్రహించుటకై మీవంటి సిద్ధపురుషుల రూపములో సంచరించుచున్నాడు. ఇది నిశ్చయము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథువు సారవంతములైన గంభీరమగు మధురవాక్యములను మితముగా చక్కగా చెప్పెను. ఆ మాటలను విని సనత్కుమారుడు ప్రేమతో చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఈ విధముగా బదులు చెప్పెను.
సనత్కుమారుడు ఇట్లు పలికెను --- ఓ మహారాజా! నీవు స్వయముగా విద్వాంసుడవు. అయిననూ, సకలప్రాణుల హితమును గోరి నీవు చక్కగా.. ప్రశ్నించితివి. సాధు పురుషులు ఆలోచించే తీరు ఇటులనే యుండును.
సాధు పురుషులతోడి సమాగమము శ్రోత మరియు వక్త అనే ఇద్దరికీ కూడ అభిమతమే యగును. ఏలయనగా, మహాత్ములను కలిసి వారిని యోగ్యమగు రీతిలో ప్రశ్నించుట వలన అందరికీ సుఖము విస్తరిల్లును.
ఓ రాజా! నీకు మధుసూదనుని పాదపద్మముల గుణములయొక్క వర్ణనయందు నిశ్చలమగు ప్రీతి నిశ్చయముగా గలదు. ఇట్టి ప్రీతిని కలిగి యుండుట దుష్కరము. ఈ ప్రీతి వ్యక్తియొక్క కామనలను, రాగద్వేషాది వాసనలను పోగొట్టి అంతఃకరణమును పరిశుద్దము చేయును.
అనాత్మయగు ఈ ప్రపంచమునందు వైరాగ్యమును కలిగి, నిర్గుణ పరబ్రహ్మయందు ఆత్మరూపముగా దృఢమగు నిష్ఠను కలిగియుండుట మాత్రమే మానవుల క్షేమమునకు ఏకైక సాధనము. ఇది శాస్త్రము (వేదము) లను బాగుగా విచారించి తేల్చి చెప్పిన సంగతి.
సాధకుడు నిత్యము శ్రద్ధతో భగవానునకు ప్రీతిని కలిగించే ధర్మ ములనాచరించవలెను. ఆత్మజ్ఞానమునందాకాంక్ష గలవాడై సర్వకాలము 'లలో ఆత్మనిష్ఠను అభ్యసించవలెను. మరియు, యోగులకు ప్రభువగు శ్రీహరిని నిత్యము ఉపాసించవలెను. శ్రీహరియొక్క కీర్తి జనులను పావ నము చేయును. కావున, సాధకుడు అట్టి శ్రీహరియొక్క గాథలను నిత్యము వినవలెను. ఇట్లు చేయుచున్నచో, సాధకునకు ప్రత్యగభిన్నబ్రహ్మ నిష్ఠ కుదురును.
సంసారమునందలి జనులు ధనమునందు, ఇంద్రియభోగము నందు ఆసక్తి గలవారై ధనము వెనుక, భోగ్యవస్తువుల వెనుక పరుగులెత్తు . దురు. సాధకుడు వారితోడి సంగమునందు తృష్ణను కలిగియుండరాదు. వారికి అభీష్టమైన ధనభోగాదులకు దూరముగా నుండవలెను. సాధకుడు శ్రీహరియొక్క గుణానువాదము అనే అమృతపానము వలన తృప్తిని చెందవలెను. లేదా, ఏకాంతమునందు ప్రీతి గలవాడై ఆత్మస్వరూపము నందే సంతోషమును పొందవలెను. ఇట్లు చేయు సాధకునకు దృఢమగు, ఆత్మనిష్ఠ కుదురును.
సాధకుడు అహింసను, శమము దమము మొదలగు పరమహంసల ధర్మములను పాటిస్తూ, జీవన్ముక్తి అనే తన లక్ష్యమును గుర్తులో నుంచుకొని మెలగవలేను. ఆతడు మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క లీలలు అనే శ్రేష్టమగు అమృతమును సేవించవలెను (లీలలను స్మరించి ఆనందించవలెను). అహింస, సత్యము, అస్తేయము (పరధనమును ఆశిం, చకుండుట), బ్రహ్మచర్యము, అపరిగ్రహము (భోగవస్తువులను ప్రోగుచేయ కుండుట) అను ఐదు యమములు. శౌచము (బాహ్యమునందు, అంతఃకర ణమునందు శుచిగా నుండుట), సంతోషము, తపస్సు, స్వాధ్యాయము (మోక్షశాస్త్రమును అధ్యయనము చేయుట), ఈశ్వర ప్రణిధానము (శరణా గతి) అను ఐదు నియమములు. సాధకుడు ఈ యమ నియమములను నిష్కామముగా ఆచరించవలెను. సాధకుడు ఇతరులను నిందించరాదు. ఆతడు స్వార్థము కొరకై ప్రయత్నమును చేయరాదు. ఇంతేగాక, ఆతడు శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమచిత్త ముతో సహించవలెను. ఇట్లు చేయు సాధకునకు ఆత్మసాక్షాత్కారము కలిగి జీవన్ముక్తుడగును.
సాధకుడు దినదినప్రవర్ధమానమగు హరిభక్తి గలవాడై శ్రీహరి గుణములను పలుమార్లు కీర్తించవలెను. ఈ గుణములు హరిభక్తుల చెవులకు అలంకారములు. ఇట్లు చేయు భక్తునకు కార్య (భౌతికపదార్థములు) కారణ (పంచభూతములు) రూపమగు ఈ అనాత్మప్రపంచమునందు వైరాగ్యము కలిగి, నిర్గుణ పరబ్రహ్మయందు తేలికగా నిష్ఠ కుదురును,
ఆచార్యుడు గల సాధకునకు పరబ్రహ్మయందు నిశ్చలమగు ప్రీతి కలిగిన వెంటనే జ్ఞానవైరాగ్యముల తీవ్రతచే లింగశరీరము (నేను పరిచ్ఛిన్న వ్యక్తిననే తప్పుడు ధారణ), కట్టెయందు పుట్టిన అగ్నిచే కట్టె వలె, దహించ బడును. జ్ఞానముచే దగ్ధమైన లింగశరీరము తిరిగి పుట్టే ప్రసక్తి లేదు. అవి ద్య, అస్మిత (అహంకారము), రాగము, ద్వేషము మరియు అభినివేశము (మరణభయము) అనే అయిదు లక్షణములతో కూడిన ఈ లింగ శరీరమే జీవునకు బంధ హేతువు అగుచున్నది.
జీవునకు జ్ఞానము కలుగుటకు ముందు తనకు పరబ్రహ్మకు భేదము గలదనే ధారణ ఉండును. కాని, జ్ఞానముచే ఆ ధారణ నశించగానే, ఆత్మకు (అజ్ఞానకల్పితమైన) లింగశరీరోపాధి (జ్ఞానముచే) దహించబడు ను. దానితో బాటు దాని గుణములగు కర్తృత్వ భోక్తృత్వములు కూడ దూర ముగా విడువబడును. వ్యక్తి స్వప్నములో తనను, తనకంటే భిన్నమగు జగ త్తును చూచును. కాని, స్వప్నమునుండి తెలివి రాగానే ఆ సర్వము తన యందే విలీనమగును. అదే విధముగా, అప్పుడా జ్ఞాని తనకంటే భిన్న ముగా బయట ప్రపంచమును దర్శించడు. ప్రపంచముకంటే వ్యతిరిక్తముగా తాను దేహీననే భావన కూడ ఆతనికి ఉండదు.
అంతఃకరణము అనే ఉపాధి (పరికరము) క్రియాశీలముగా నున్నప్పుడు మాత్రమే వ్యక్తికి ద్రష్టనను తాను, ఇంద్రియములకు గోచరమయ్యే దృశ్యజగత్తు మరియు ఈ రెండింటికీ సాక్షియగు చైతన్యము అను భేదము అనుభవమునకు వచ్చును. లేదా, దృశ్యజగత్తు, అజ్ఞానముచే దానికంటే భిన్నముగా స్వీకరించబడే దేహము, మరియు అహంకారము అనే భేదము అనుభవమునకు వచ్చును. గాఢనిద్ర మొదలగు అవస్థలయందు అంతఃకరణము విలీనము కాగా, ఈ భేదములేమియు దర్శించబడుట లేదు.
నీరు, అద్దము మొదలగు కాంతిని పరావర్తనము చేసే నిమిత్తము ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి తనకు, తన ప్రతిబింబమునకు భేదమును చూచుచున్నాడు. అట్టి నిమిత్తము లేనప్పుడు ఆ ప్రతిబింబము తనలో విలీ నమై యుండునే గాని, భిన్నముగా కనబడదు. ఈ స్థితి లోకములో ఎట్లో, తన విషయములో కూడ అంతే.
సరస్సు ఒడ్డున మొలిచే చిన్న గడ్డి మొక్క ఆ సరస్సులోని నీటిని వేళ్ల ద్వారా లాగివేయును. అదే విధముగా, వ్యక్తి విషయభోగములను గురించి ఆలోచించుచున్నచో, ఆ భోగముల ఆకర్షణకు లోనైన ఇంద్రియములు మనస్సు ద్వారా వాని బుద్ధినుండి వివేకశక్తిని అపహరించును.
వివేకజ్ఞానము నశించుట తోడనే పూర్వాపరముల స్మరణము లేకుండ పోవును. అట్టి స్మరణము లేనివాడు స్వరూపజ్ఞానమును కోల్పో వును (ఆత్మజ్ఞానమును పొందే అవకాశమును జారవిడుచుకోనును). అట్లు వ్యక్తి ఆత్మజ్ఞానమునకు దూరమగుట ఆత్మహత్యయే అగునని విద్వాం సులు చెప్పుచున్నారు.
వ్యక్తికి ఆత్మ అత్యంతము ప్రియము. ఆత్మసంబంధమును బట్టియే వ్యక్తికి అనాత్మలగు దేహాదులయందు ప్రీతి కలుగుచున్నది. మానవుడు ఈ జన్మలో అట్టి ఆత్మస్వరూపజ్ఞానమునకు తనకు తానే భంగము కలిగించుకున్నచో, అంతకంటే పెద్ద స్వార్థవినాశము మరియొకటి ఉండదు.
వ్యక్తి ధనమును గురించి, ఇంద్రియభోగములను గురించి అదే పనిగా ఆలోచించరాదు. అట్లు చేసినచో, వ్యక్తి నాలుగు పురుషార్థములను చెడగొట్టుకొనును. అట్టి ఆలోచన వలన వ్యక్తికి శాస్త్రముచే బోధించబడే ఆత్మజ్ఞానము గాని, ఆత్మసాక్షాత్కారము గాని కలిగే అవకాశము జారిపోయి, ఆతడు మరుజన్మలో చెట్టుచేమల రూపములో జన్మించును.
భయంకరమగు అజ్ఞానమనే సముద్రమును దాటగోరు వ్యక్తి ఏ కాలమునందైననూ సంసారమునందు ఆసక్తిని పెంచుకొనరాదు. ఇట్టి ఆసక్తి వలన మానవుడు ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములను పూర్తిగా పోగొట్టుకొనును.
ధర్మార్థకామములనే త్రివర్గమునకు చెందిన పురుషార్థములు సర్వదా కాలపురుషుని భయమునకు లోబడి యున్నవి. అనగా, ఈ పురుషార్థములు అనిత్యము. కాని, మోక్షము అనే పురుషార్థము నిత్యము గనుక అదియే నాలుగు పురుషార్థములలో సర్వోత్కృష్టమైనదిగా స్వీకరించబడుచున్నది.
దేవతలు మొదలగు గొప్ప ప్రాణులు, పశువులు మొదలగు నికృష్టప్రాణులు అన్నీ సత్త్వరజస్తమోగుణముల పరిణామముచే మాత్రమే పుట్టినవి. ఇట్టి ప్రాణుల మనోరథములను కాలపురుషుడు వినష్టము చేయుచుం డును. కావున, ఈ ప్రాణులకు ఆత్యంతికమగు క్షేమము లేదు.
ఓ మహారాజా! చరాచరములగు సకలప్రాణులు దేహము, ఇంద్రియములు, ప్రాణములు, బుద్ది మరియు అహంకారములయందు ఆత్మభావము గలవారై వాటిచే కప్పివేయబడిన స్వరూపమును కలిగియున్నారు. అట్టి సకలప్రాణుల హృదయములో భగవానుడు దేహేంద్రియమనస్సులకు (క్షేత్రము) సాక్షియై, సర్వమును నియంత్రించే అంతర్యామియై, ప్రత్య గాత్మ (అంతరతమమగు స్వరూపము) రూపముగా స్వానుభూతి రూపములో ప్రకాశించుచునే యున్నాడు. అట్టి పరమాత్మను నేనే అనే విధముగా అభేదజ్ఞానముతో తెలియుము.
మాలయందు వాస్తవముగా పాము లేకున్ననూ అజ్ఞానముచే ఉన్నట్లుగా భాసించును. విషయము తెలియగానే ఆ పాము కనబడుట మానివేయును. అదే విధముగా ఆ పరమాత్మయందు కార్య (భౌతికములు) కారణ (పంచభూతములు) రూపమగు జగత్తు వాస్తవముగా లేకున్ననూ ఉన్నట్లుగా భాసించును. వివేకజ్ఞానము కలుగగానే జగత్తు మిథ్య యని తేలిపోవును. ఆ పరమాత్మ సర్వకాలములలో ముక్తుడు, పుణ్యపాపముల సంసర్గము లేనివాడు, అఖండజ్ఞానస్వరూపుడు. కర్మఫలములగు సుఖదుఃఖములతోడి సంసర్గము అనే మాలిన్యము ప్రకృతికార్యములగు దేహేంద్రియాదులలో ఉండునే గాని, ఆ పరమాత్మకు ఈ మాలిన్యము అంటదు. అట్టి ఆ పరమాత్మను నేను శరణు పొందుచున్నాను.
పూర్వకర్మల వాసనలన్నియు కలిసి జీవునకు అహంకారగ్రంథి రూపములో మండును. సత్పురుషులు వాసుదేవుని పాదపద్మముల వ్రేళ్ల కాంతియందు భక్తిని చేసి, దాని ప్రభావముచే ఆ అహంకారగ్రంథివి తేలికగా విప్పుకొని కృతార్థులగుచున్నారు. కాని, యోగాభ్యాసపరులు ఇంద్రియముల సమూహమును నిరోధించి (ప్రత్యాహారము) అంతఃకరణవృత్తు లను ఆపివేపి (సమాధి) కూడ అంత తేలికగా గ్రంథిభేదనమును చేయలేకున్నారు. అట్టి వాయుదేవుని నీవు శరణు పొంది సేవించుము.
సంసారమనే సముద్రము అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు అనే ఆరు మొసళ్లతో కూడియున్నది. దీనిని కొందరు కఠినమైన యోగసాధనలచే తరించ గోరెదరు. వారు ఈశ్వరుడు అనే పడవవానిని ఆశ్రయించరు. వారికి దీనిని తరించుట చాల కఠినము. కావున, నీవు శ్రీహరి భగవానుని పాదమును పడవగా చేసుకొని, తరింప శక్యము కాని సము ద్రమువంటి ఈ సంసారదుఃఖమును తేలికగా తరించి వేయుము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మపుత్రుడు, ఆత్మజ్ఞాని లగు సనత్కుమారుడు ఈ విధముగా ఆత్మతత్త్వమును వివరించి చెప్పగా, ఆ పృథు మహారాజు ఆయనను బాగా కొనియాడి, ఇట్లు పలికెను.
పృథు మహారాజు ఇట్లు పలికెను --- పూజ్యుడవగు ఓ మహాత్మా! దీనులపై దయ చూపే శ్రీహరి ఇంతకుముందే నన్ను అనుగ్రహించినాడు. ఆ అనుగ్రహమును పూర్ణము చేయుటకై తాము విచ్చేసినారు.
దయామయులు, పూజ్యులు అగు మీరు సర్వమును సంపన్నము చేసినారు. ఈ దేహముతో సహా నా సర్వము సత్పురుషులు నాకు ప్రసాదము రూపముగా అనుగ్రహించినదియే. నేను మీకేమి ఈయగలను?
ఓ మహాత్మా! నా ప్రాణములు, భార్య, పుత్రులు, సామగ్రితో కూడిన భవనము, రాజ్యము, సైన్యము, భూమి, ఖజానా అనే సర్వమును మీకు సమర్పించుచున్నాను.
వేదశాస్త్రములను తెలిసిన విద్వాంసుడు సేనాపతి పదవికి, రాజ్యాధికారమునకు, దుష్టులను శిక్షించే అధికారమునకు మాత్రమే గాక ముల్లోకముల ఆధిపత్యమునకు కూడ అర్హుడే.
వేదవేత్త తన స్వంత ఆహారమును మాత్రమే భుజించి, స్వంత వస్త్రమును మాత్రమే దాల్చి, స్వంత ధనమును మాత్రమే దానము చేయు చున్నాడు. క్షత్రియులు మొదలగువారు వేదవేత్తయొక్క అనుగ్రహముచే మాత్రమే భోగముల ననుభవించుచున్నారు.
మీరు పర్వకాలములలో అతిశయించిన కరుణగలవారు. గొప్ప వేదవేత్తలగు మీరు నాకు అధ్యాత్మవిచారములో భాగముగా - ఇట్టి అపూర్వ మగు భగవత్తత్త్వము నుపదేశించితిరి. ఈ విధముగా నాకు. గొప్ప ఉపకార మును చేసిన మీరు మీ ఉపకారముతోనే సంతోషించేదరు గాక! ఏలయన, మీకు దోసిలి యొగ్గుటను మినహాయించి ఎవ్వరైననూ మీ ఉపకారమునకు ప్రత్యుపకారమును చేయగల్గుదురా? అట్లు చేయ బూనుకున్నవాడు ఎవడై ననూ పరిహాస భాజనుడగును.
ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠులగు ఆ మహర్షులను ఆదిరాజగు పృథువు సత్కరించెను. వారప్పుడు ఆతని సచ్చీలమును కొనియాడుతూ, జనులు - చూచుచుండగనే, ఆకాశమార్గముగుండా వెళ్లిరి.
వేనపుత్రుడగు పృథువు గొప్పవారిలో ముఖ్యుడు. ఆయన సన త్కుమారుని ఆత్మతత్త్వోపదేశముచే తన స్వరూపమునందు. నిశ్చలమగు మనస్సుతో నిలిచియుండెను. ఆయన తాను పూర్ణకాముడైన జీవన్ముక్తుడనై తినని భావించెను.
పృథువు దేశకాలములకు తగ్గట్లుగా తన శక్తిని సంపదను మించ కుండగా యథోచితమగు కర్మలను ఈశ్వరార్పణబుద్దితో చేసెను.
ఆయన కర్మఫలమును ఈశ్వరునకు సమర్పించి, కర్తృత్వాసక్తి లేనివాడై, ఏకాగ్రచిత్తముతో కర్మలను చేసెను. ఆయన ప్రకృతి (దేహేంద్రి యమనస్సంఘాతము) కంటె అతీతమైన సాక్షిభావములో నిలిచి యుండెను.
సామ్రాజ్యలక్ష్మితో కూడియున్న ఆ పృథువు అహంభావము లేని వాడు. ఆయన ఇంటిలో ఉంటున్నా, సూర్యుడు తాను ప్రకాశింపజేసే దేశ ముతో సంపర్కమును పొందని విధముగా, ఇంద్రియభోగ్యములగు శబ్దాది , విషయములయందు ఆసక్తి లేకుండ నుండెను.
ఈ విధముగా పృథువు ఆత్మనిష్ఠయందుంటూనే శాస్త్రవిహితము లగు కర్మలను చక్కగా ఆచరించెను. ఆయనకు భార్యయగు అర్చిస్సు నందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యక్షుడు, ద్రవిణుడు, వృకుడు . అనే అయిదుగురు తనకు తగ్గ కొడుకులు కలిగిరి.
అచ్యుతుడగు శ్రీహరియొక్క అవతారమైన పృథువు ఒక్కడే లోక పాలకులందరి గుణములను ధరించి, వారి వారి కాలములలో జగత్తులోని ప్రాణులను రక్షించెను. "
ఓషధులకు హితమును చేకూర్చే చంద్రుడు సోమరాజు అనే సార్థ కనామమున కలిగియున్నాడు. అదే విధముగా పృథువు ప్రజల హిత మును గురించి తన మనస్సులో చింతిస్తూ, వారి హితమునే పలుకుతూ, తన మనోహరమగు గుణములచే వారిని రంజింపజేసి, చంద్రుని తరువాత రాజు అనే సార్థకనామధేయము గల రెండవ రాజు ఆయెను.
సూర్యుడు బాగా ఎండలు కాసి భూమిపై ఉండే నీటిని ఆవిరిగా తీసుకొని మరల వర్షము రూపములో విడిచి పెట్టును. అదే విధముగా ప్రతా పశాలియగు పృథువు భూమీయొక్క సంపదను పన్నుల రూపములో వసూలు చేసి, ప్రజాహితకార్యముల రూపములో ఖర్చు పెట్టెడివాడు. అగ్నివలె తేజశ్శాలియగు ఆయనకు శత్రువుల భయము లేకుండెను. ఆయన మహేంద్రుని వలె అజేయుడుగ నుండెను.
ఆయన సహనములో భూదేవితో సమానమైనవాడు. ఆయన స్వర్గము వలె మానవుల అభీష్టములను నెరవేర్చెడివాడు. మేఘము మావ వులకు చాలినంతగా వర్షించి తృప్తిని కలిగించును. అదే విధముగా ఆయన జనుల కోరికలకు తగ్గట్లు సంపదలను వర్షించి, వారికి తృప్తిని కలిగించెను.
సముద్రపు లోతును తెలియుట కష్టము. అదే విధముగా ఆయన మనస్సు లోతు ఇతరులకు అంతు పట్టెడిది కాదు. ఆయన పర్వతమువలె చలనము లేని ధైర్యము గలవాడు. తప్పు చేసినవారిని యమధర్మరాజు వలే ఆయన నిష్పక్షపాతముగా శిక్షించెడివాడు. ఆయనను చూచినప్పుడు హిమవత్పర్వతమును చూచినంత ఆశ్చర్యము కలిగెడిది.
పృథువు కుబేరుడు వలె సమృద్ధమగు ధనమునకు స్వామి. ఆయన తాను చేపట్టే ప్రణాళికలు కార్యరూపమును దాల్చునంతవరకు రహస్యముగా నుండెడివాడు. ఇట్టి రహస్యగోపనములో ఆయన వరుణుడు వంటివాడు. వాయువు సకలప్రాణులను ప్రాణశక్తిరూపముగా నియంత్రిస్తూ వాటి దేహములకు ఇంద్రియములకు మనస్సునకు శక్తిని కలిగించుచుండు ను. అదే విధముగా, పృథువు తన దేహబలముచే ఇంద్రియముల పటుత్వ ముచే మనోబలముచే సకలజనులను నియంత్రించెడి వాడు.
ఆ పృథువు సహింప శక్యము కాని తేజస్సులో స్వయంప్రకాశ స్వరూపుడగు రుద్రభగవానుని పోలియుండెను. అందములో మన్మథుని పోలియున్న ఆ రాజు రీవిలో సింహమును పోలియుండెను.
స్వాయంభువ మనువు వలె ప్రేమపూర్ణుడగు ఆ పృథువు జను లను పాలించుటలో బ్రహ్మదేవుని వంటివాడు. బ్రహ్మవిచారములో ఆయన బృహస్పతియే. జితేంద్రియత్వములో ఆయన సాక్షాత్తుగా శ్రీహరియే.
గోవులు, గురుజనులు, వేదవేత్తలు, శ్రీహరి భక్తులు అనువారి యెడల భక్తి, బిడియము, వినయము, మంచి స్వభావములను కలిగియుం. డుటలో, మరియు పరోపకారము కొరకు నడుము బిగించుటలో ఆ పృథు మహారాజు తనకు తానే సాటి.
ముల్లోకములలో ఆయా స్థానములలో పురుషులు బిగ్గరగా పృథువు త్రివి గానము చేయగా ఆ కీర్తి, శ్రీరాముడు సత్పురుషుల హృద యములలో ప్రవేశించిన విధముగా, గృహకార్యములలో వ్యగ్రముగానుండే స్త్రీల చెవులకు కూడ వినవచ్చేను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పృథూపాఖ్యానములో పృథుసనత్కుమారసంవాదమనే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది.
