శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

2 - దక్షుడు శివుని నిందించి శాపమునిచ్చుట

విదురుడిట్లు ప్రశ్నించెను: కల్యాణగుణములు గలవారిలో శివుడు ఉత్తముడు. దక్షునకు తన కుమార్తెలయందు గొప్ప ప్రేమ గలదు. అయిన నూ, ఆతడు తన కుమార్తెయగు సతీదేవిని నిరాదరణ చేసి, శివునియందు అధికమగు ద్వేషమును బూనుటకు కారణమేమి?

శివుడు కదిలే మరియు కదలని ప్రాణులన్నింటికీ తండ్రి. ఆయనకు ఏ ప్రాణియందైననూ వైరభావము లేదు. ప్రసన్నమగు రూపము గల ఆ శివుడు ఆత్మస్వరూపమునందు మాత్రమే నిష్ఠను కలిగియుండును. జగత్తు నకు గొప్ప దైవమగు అట్టి శివుని ఎవ్వాడు ద్వేషించును? అట్లు ద్వేషిం చుట ఎట్లు సంభవమగును?

ఓ మైత్రేయ మహర్షీ! మామకు, అల్లునకు అంతటి విద్వేషము కలుగుటకు కారణమేమి? ఆ విద్వేషము కారణముగా సతీదేవి విడువ శక్యము కాని ప్రాణములను కూడ విడిచి పెట్టినది. ఈ విషయమును నాకు చెప్పుము.

మైత్రేయ మహర్షి ఇట్లు చెప్పెను --- పూర్వము మరీచి మొద లగు ప్రజాపతులు సత్రయాగమును చేసిరి. అచటకు మహర్షులు (ఋషియనగా మంత్రద్రష్టు), సకలదేవతాగణములు, శిష్యులతో కూడిన మునులు (ముని యనగా మననశీలుడు, అనగా ఆత్మజ్ఞాననిష్ఠుడు), అగ్నులు (ఇదివరలో చెప్పబడిన అగ్ని-అభిమానిదేవతలు) విచ్చేసిరి.

తన కాంతులచే చీకట్లను పారద్రోలే సూర్యుని వలె ప్రకాశించు చున్న దక్షుడు ఆ గొప్ప సభలోనికి ప్రవేశించెను. ఆతనిని చూచిన మహర్షు లకు, ఇతర సభాసదులకు ఆతని కాంతీయొక్క ప్రభావముచే మతులు పోయెను. అపుడు వారందరు అగ్నులతో సహా లేచి నిలబడిరి. కాని, బ్రహ్మగారు, శివుడు లేచి నిలబడలేదు.

సభలోని ప్రముఖులు పూజ్యుడగు ఆ దక్షుని చక్కగా సత్కరించిరి, అపుడాతడు లోకములకు తండ్రి, స్వయంభువుడు అగు బ్రహ్మగారికి నమ స్కరించి, ఆయన అనుమతితో కూర్చుండెను.

తనకంటే ముందే కూర్చునియున్న శివుని చూచి, దక్షుడు ఆ విధ ముగా శివుడు తనను అవమానించినాడని భావించెను. అపుడాతడు శివుని ముఖములోనికి కన్నులతో దహించువాని వలె వంకరగా చూస్తూ, ఇట్లు పలికెను.

ఓ బ్రహ్మర్షులారా! మీరు దేవతలతో మరియు అగ్నులతో కూడి యున్నారు. నేను సత్పురుషుల నడవడిని గురించి చెప్పెదను. నేనీ విషయమును అజ్ఞానముతో గాని, మాత్సర్యముతో గాని చెప్పుట లేదు. నా మాటను వినుడు.

సిగ్గు లేని ఈ శివుడు లోకపాలకుల కీర్తిని చెడగొట్టుచున్నాడు. సత్పురుషులు నడిచే మార్గమును (సత్పురుషుల ఆచారమును) ఈ పొగ రుమోతు ధ్వస్తము చేయుచున్నాడు.

లోకపాలకుల కీర్తిని కూడ తిరస్కరించే కీర్తి గల శివుడు సర్వాధికు డగుటచే ఎవ్వరి ముందైననూ సిగ్గు పడనవసరము లేనివాడు. రక్షణ లేని వారికి రక్షకుడు అగు ఈ శివుడు ఆత్మారాముడగుటచే, కర్మఠులచే మరియు ఉపాసకులచే స్వీకరించబడే ఉపాసనాసముచ్చితమగు కర్మమార్గ మును దూరముగా నెట్టివేసినాడు, అని దక్షుని నిందావాక్యములకు స్తుతి రూపమైన అర్థము.

ఈతడు సత్పురుషుని వలె, బ్రాహ్మణుల యెదుట అగ్నిసాక్షిగా, సావిత్రి వలె పవిత్రమైన నా కుమార్తెను పాణిగ్రహణము చేసి, ఆ విధ ముగా నాకు శిష్యుడైనాడు.

నేను సత్పురుషుని వలె కనబడేదనే గాని, వాస్తవముగా సత్పురు షుడను కాను. సావిత్రివలె పవిత్రమైన నా కుమార్తెను బ్రాహ్మణుల యెదుట అగ్నిసాక్షిగా వివాహమాడినంత మాత్రాన సర్వేశ్వరుడగు ఈ శివుడు నాకు శిష్యుడై పోవునా? అని స్తుతిరూపమైన యర్థము.

కోతి కన్నులవంటి కన్నులు గల ఈ శివుడు లేడికూన కన్నుల వంటి కన్నులు గల సతీదేవిని చెట్టబట్టినాడు. కావున, ఈతడు నేను వచ్చిన ప్పుడు లేచి ఎదురువచ్చి నమస్కరించ వలసినవాడు. అయిననూ, ఈతడు నాకు మాట మాత్రముచేనైననూ సత్కారమును చేయలేదు.

కోతుల వలె విషయభోగములయందు పరుగులెత్తే నావంటివారి యందు దయాదృష్టిని బరపే ఈ శివుడు, నేను అయోగ్యుడనే అయిన నూ, దయతో నా కుమార్తెను వివాహమాడినాడు. ఆ విధముగా నేను సత్కారమునకు అర్హుడనైనాను. కాని, ఆయన నా పొగరును గమనించి నాకు గుణపాఠమును నేర్పుటకై నన్ను సత్కరించలేదు అని స్తుతిరూప మైన యర్థము.

శౌచము లేని ఈ శివుడు వైదికకర్మానుష్ఠానమును గాలికి వదిలినా డు. ఈ పొగరు మోతు వైదికమర్యాదల నుల్లంఘించినాడు. అయిననూ, అయోగ్యునకు సుందరమగు వేదమంత్రములనుపదేశించు తీరున, నేను ఇష్టము లేకున్ననూ, వీనికి నా కుమార్తెనిచ్చి వివాహము చేసినాను.

శివుడు పూర్ణుడగుటచే కర్మానుష్టానము ఆయనకు తొలగిపోయిన ది. ఆయన ఆత్మస్వరూపనిష్ఠుడగుటచే సమగ్రమగు శౌచము ఆయన యందే గలదు. పరిచ్చిన్నమగు అహంభావము బ్రహ్మస్వరూపుడగు ఆయ నకు లేదు. ఆయన స్వయముగా పూర్తుడే అయిననూ దయాళువగుటచే, తాను మర్యాదలను ఉల్లంఘించడు. ఆయనకు మామగారు అయ్యే యోగ్యత నాకు లేదు. కావుననే, ఇష్టము లేకున్ననూ నేను, అయోగ్యులు వేదమునుపదేశించు తీరున, ఆయనకు నా కుమార్తెనిచ్చి వివాహము చేసి నాను అని స్తుతిరూపమైన యర్థము.

ఈతడు దిసమొలతో జుత్తు విరబోసుకుని దెయ్యములుండే శ్మశా నములో దెయ్యములతో భూతముల గుంపులతో చుట్టువారబడి నివసించు ను. ఇంతే గాక, ఈతడు పిచ్చివానివలే ఒకసారి నవ్వుతూ, మరియొకసారి ఏడుస్తూ తిరుగాడుచుండును.

పుట్టి మరణించే జీవుల సముదాయములు, వారి సంసారములు శివునియందే స్థితిని కలిగియున్నవి. ఈ జగత్తును వెలయింపజేసిన శివుడు పిచ్చివాని వలె కన్పట్టిననూ, జగత్తు మిథ్య యగుటచే ఆయన పిచ్చివాడు కాదు. విరాడ్రూపుడగు ఆయనకు ఆకాశమే శరీరము కాగా, మేఘములే జుత్తు అగుచున్నవి. జీవుని స్వరూపము సర్వాంతర్యామియగు ఆయనయే గనుక, జీవుడు సంతోషించినప్పుడు ఆయనయే సంతోషించినట్లు, జీవుడు రోదించినప్పుడు ఆయనయే రోదించినట్లు అజ్ఞానముచే భాసించును, అని స్తుతిపరమైన యర్థము.

ఈతడు కాలిన శవముల మీది బూడిదను దేహమునకు పులుము కొనును. శవముల కపాలములను మాలగా. ధరించును. మరణించిన జనుల ఎముకలను ఆభరణములుగా ధరించును. ఈతడు పేరునకు శివుడే (మంగళస్వరూపుడు) అయిననూ, అమంగళమూర్తి, ఈ పొగరుమోతునకు స్నేహితులందరు పొగరుమోతులే. కేవలము తమోగుణమే స్వరూపముగా గల ప్రమథగణములకు, భూతగణములకు ఈతడు నాయకుడు.

జననమరణములు రెండు సర్వాధిష్ఠానమగు శివునియందే ఉన్న వని ఆయన బూడిదను ధరించుట ద్వారా సూచించుచున్నాడు. బూడిద వైరాగ్యమునకు గుర్తు. కపాలములను, ఎముకలను ధరించుటయందు కూడ తాత్పర్యము జగత్తు మిథ్యయని సూచించుటయే. ఈ విధముగా స్వతహాగా అమంగళమై యున్న జగత్తునకు అధిష్టానమగు బ్రహ్మము నిత్యమంగళస్వరూపమే. ఆయనకు గాని, ఆయనకు ప్రియులగు (ఆత్మస్వ రూపులగు) భక్తులకు గాని, పరిచ్చిన్నమగు అహంభావము లేదు. శ్మశాన మువంటి సంసారములో కొట్టుమిట్టులాడే జీవులు భూతప్రేతములవంటివారే. వారికి నాయకుడు సర్వాంతర్యామియగు శివుడే అని స్తుతిరూపమగు యర్థము.

అయ్యో! నశించిన శౌచము గల శివుడు ఉన్మాదులనే భూతగణ ములకు అధ్యక్షుడు. బ్రహ్మగారి ప్రేరణ వలన నేను ఆ దుర్బుద్ధియగు శివు నకు పతివ్రతయగు సతీదేవిని ఇచ్చి వివాహము చేసితిని.

ఆహా! అహంకారమదాంధులను తపింపజేయువాడు, భ్రష్టుల యెడల కూడ దయ గలవాడు, దుష్టుల హృదయమునందు కూడ ఆత్మరూపముగా నుండువాడు అగు శివునకు నేను బ్రహ్మగారి ప్రేరణ వలన పతివ్రతయగు నా కుమార్తెను ఇచ్చి వివాహము చేసితిని. అని స్తుతి రూపమగు యర్థము.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఆ దక్షుడు ఈ విధముగా కైలాసవాసియగు శివుని అధికముగా నిందించెను. కాని, శివుడు ఏమియు విరోధమును ప్రకటించకుండగా కూర్చుని యుండెను. అప్పుడు కోపించి యున్న దక్షుడు నీటిని స్పృశించి ఆయనను శపించుటకు ఉపక్రమించెను.

దేవతలను ఆరాధించే ఈ యజ్ఞములో ఇంద్రుడు, విష్ణువు మొద లగు దేవతలతో బాటుగా, దేవగణములలో అధముడగు ఈ శివునకు హవి ర్భాగము లభించకుండు గాక!

దేవతలను ఆరాధించే ఈ యజ్ఞములో సర్వదేవతలకంటె ఉత్తము డగు ఈ శివునకు ఇంద్రుడు మొదలగు దేవతలతో బాటుగా హవిర్భాగము లభించకుండు గాక! అయిననూ, అందరికంటే ముందే హవిర్భాగముపు పొందవలెను, లేక, సర్వప్రభుడు గనుక దేవతలతో సహపంక్తి ఆయన హోదాకు తగదు అని స్తుతిరూపమైన అర్థము.

కురువంశీయుడవగు ఓ విదురా! దక్షుని శివునకు శాపమునీయవ దనియు, తిట్టవద్దనియు సభలోని ప్రముఖులు వారించిరి. అయిననూ, చాల పెద్ద కోపమును పొందియున్న ఆతడు వారిని కాదని, ఆ కైలాసపతికి శాపమునిచ్చి, ఆ సభనుండి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్లాను.

కైలాసవాసియొక్క అనుచరులకు నందీశ్వరుడు నాయకుడు. శివు నకు దక్షుడు శాపమునిచ్చిన సంగతి తెలిసి, ఆయన మనస్సు కోపము అనే దోషముతో కలుషితమై పోయేను. శివుని నిందించవలసినదే అని ఆ సభ లోని కొందరు బ్రాహ్మణులు దక్షుని చర్యను అనుమోదించిరి. ఆ బ్రాహ్మ ణులకు మరియు దక్షునకు నందీశ్వరుడు భయంకరమగు శాపమునిచ్చెను.

సర్వత్రా భేదమునే దర్శించే దక్షుడు అజ్ఞాని. దేహము నశించే స్వభావము గలది అని తెలుసుకొనుటకు బదులుగా, ఆతడు తన దేహము గొప్పది అని భావించుచున్నాడు. అపకారమును తల పెట్టని శివభగవాను నకు ఆతడు ద్రోహమును తల పెట్టుచున్నాడు. ఆతడు పరమార్థము (తత్త్వ జ్ఞానము, లేక మోక్షము) నుండి విముఖుడు (శ్రద్ద లేనివాడు, జారిపోయిన వాడు) అగుగాక!

మానవుడు (ఈ దక్షుడు) ఇల్లే సర్వస్వమని నమ్మి, దంభాచారము నందాసక్తి గలవాడై, వేదములయందలి అర్థవాదముల (కర్మఫలములను స్తుతించే వాక్యముల) చే తప్పుదోవ పట్టించబడిన బుద్ధి గలవాడై, తుచ్చమగు విషయసుఖములయందలి కోరికతో, కామ్యకర్మల పరికరములను (కర్మకాండను) తన జీవితములో విస్తరింప జేసుకొనుచున్నాడు.

ఈ దక్షుడు దేహాభిమానియై, దేహాదులే తన స్వరూపమని గట్టిగా నమ్మి, భేదమే యథార్థమనే నిశ్చయము గలవాడై, ఆత్మస్వరూపమును మరచినాడు (జ్ఞానముచే ఆత్మస్వరూపమును పొందుట అనే లక్ష్యము వానికి లేదు). ఈ అజ్ఞానియగు దక్షుడు స్త్రీలయందు అధికమగు కామన గలవాడు అగుగాక! మరియు, తొందరలోనే వీడు మేకపోతు ముఖము గల వాడు అగుగాక!

మూర్ఖుడగు ఈ దక్షుడు కర్మరూపమగు అవిద్యయే జ్ఞానమనే బుద్దిని కలిగియున్నాడు. శివుని అవమానించిన ఈ దక్షుని అనుసరించు వారు కూడ వీనితో బాటుగా ఈ సంసారములో జననమరణప్రవాహములో పడియుందురు గాక!

వేదవాక్కు (కర్మకాండ) అనే లతకు అర్థవాదములు (కామ్యకర్మ లను పొగిడే వాక్యములు) అనే పువ్వులు గలవు. వాటిలో మనస్సునకు అధికమగు క్షోభను కలిగించే స్వర్గాది సుఖముల వర్ణనలు (తేనెల పరిమళ ములు) గలవు. వాటిచే కలిచివేయబడిన మనస్సులు గల ఈ శివద్వేషులు అధికమగు మోహము (నిత్య-అనిత్యవస్తువివేకము లేకుండుట) ను పొందే దరు గాక!

ఈ శివద్వేషులగు బ్రాహ్మణులు అన్నింటినీ (తినకూడని వాటిని కూడ) తింటూ, తమ విద్యను శరీరపోషణకు మాత్రమే వినియోగిస్తూ, తప స్సును ప్రతనిష్ఠను కూడ ఆర్థికలాభము కొరకు వినియోగిస్తూ, ధనము నందు దేహమునందు ఇంద్రియభోగములయందు మాత్రమే రమిస్తూ, యాచనను చేస్తూ, ఈ సంసారములో తిరుగాడెదరు గాక!

ఈ విధముగా నందీశ్వరుడు బ్రాహ్మణ సముదాయమునకు శాప మునీయగా, భృగుమహర్షి దానికి బదులుగా శాపమునిచ్చెను. అది వేదవే త్తయగు బ్రాహ్మణుడు ఇచ్చిన శాపమగుటచే, దానిని తప్పించుకొనుట శక్యము కాదు.

ఎవరైతే పాశుపత (దేవపూజ పేరిట ఏహ్యములగు ఎముకలను ధరించుట మొదలగు పనులను చేయుట) వ్రతమును చేపట్టెదరో, మరియు ఎవరైతే అట్టి పాశుపతులను అనుసరించెదరో, వారు సచ్చాస్త్రమగు వేద మునకు విరోధులై, వేదమును నిందించే అపధర్మీయులు అగుదురు గాక!

వీరు పవిత్రతను విడనాడి, బుద్దిలో మోహమును పొందినవారై, జటలను బూడిదను ఎముకలను ధరించెదరు. వీరు చేపట్టే పాశుపత దీక్ష యందు దైవము సారా మరియు కల్లు మాత్రమే.

వేదము వైయక్తిక జీవనమును కట్టడి చేసి సమాజజీవనమును నిల బెట్టును. అట్టి వేదమును, దాని స్వరూపమునెరింగిన బ్రాహ్మణులను కూడ మీరు పరిపరి విధములుగా నిందించుచున్నారు. కావున, మీరు వేదవిరుద్ద మగు అపధర్మమును ఆశ్రయించినారు.

లోకములకు, మానవులకు మంగళమును కలిగించేది ఈ సనాతనమగు వేదధర్మము మాత్రమే. దీనిని మన పూర్వజులు. ఆశ్రయించిరి. దుష్టశిక్షకుడగు శ్రీహరియే ఈ ధర్మమునకు మూలము.

వేదము పరమపవిత్రమైనది. సనాతనమగు వేదధర్మమును సత్పు రుషులు అనుసరించిరి. దానిని నిందించు మీరు అవైదికధర్మమును ఆశ్ర యించి, తామసప్రాణులకు ప్రభువగు రుద్రుని దైవముగా పూజించుడు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఆ భృగు మహర్షి ఈ విధ ముగా శాపమునిచ్చుచుండగా, ఆ శివభగవానుడు పరస్పరశాపముల కార ణముగా కొంచెము వికలమైన మనస్సు గలవాని వలె, అక్కడనుండి లేచి వెళ్లిపోయెను. ఆయన అనుచరులు ఆయనను అనుసరించిరి.

            గొప్ప ధనస్సు గల ఓ విదురా! ఆ ప్రజాపతులు వేయి సంవత్సర ములు సత్రయాగమును చక్కగా అనుష్టించిరి. ఆ యాగములో దేవాధిదే వుడగు శ్రీహరి ఆరాధించబడును. తరువాత వారు గంగాయమునొసంగమ మునందు అవభృథ స్నానమునాచరించిరి. అప్పుడు వారి మనస్సులు నిర్మలమాయెను. తరువాత వారందరు తమ తమ స్థానములకు వెళ్లిరి.

శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో దక్షుడు శివునకు శాపమునిచ్చుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది.