శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

29 – భక్తిలోని మర్మములు - కాల మహిమ

దేవహూతి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! మహత్తు మొదలగు తత్త్వములు, ప్రకృతి, పురుషుడు అనువాటి లక్షణమును సాంఖ్యశాస్త్రపద్ధ తిలో నీవు నాకు చెప్పితివి. ఈ లక్షణములను బట్టి వారి పరమార్థ స్వరూ పమును తెలియవచ్చును. ఈ జ్ఞానము భక్తియోగమునకు సాధనమని పెద్దలు చెప్పుచున్నారు గదా! నాకు నీవు ఆ భక్తియోగముయొక్క మార్గ మును విస్తారముగా చెప్పుము.

ఓ భగవన్! అట్టి వర్ణనము వలన సాధకుడు సర్వమునందు తొల గిన ఆసక్తి గలవాడగును. జననమరణప్రవాహరూపమగు ఈ సంసార ములో జీవులు పొందే వివిధగతులను కూడ నాకు చెప్పుము.

 లోకేశ్వరులగు బ్రహ్మాదులను కూడ నియమించే కాలము సర్వే శ్వరుడవగు నీకంటే భిన్నముగా లేదు. దాని ప్రభావము చేతనే, జనులు పుణ్యములను చేయుచున్నారు. దాని స్వరూపమును నాకు చెప్పుము.

మానవుడు మిథ్యారూపములగు దేహాదులయందు ఆత్మబుద్ధి గలవాడై జ్ఞానవిహీనుడై అజ్ఞానకార్యమగు సంసారమనే చీకటిలో చిరకాల మునుండి నిద్రించుచున్నాడు. ఆతడు కర్మలయందు ఆసక్తమైన బుద్దిచే అలసి సొలసి యుండగా, జ్ఞానసూర్యుడవగు నీవు ఆవిర్భవించితివి..

మైత్రేయుడు ఇట్లు పలికెను --- కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! తల్లి పలికిన ఈ మధుగమగు వచనములను విని కపిల మహా ముని సంతోషించెను. ఆయన హృదయము కరుణతో ద్రవించెను. ఆయన ఆమెను అభినందించి ఇట్లు పలికెను.

అమ్మా! భక్తియోగములో మహాత్ములు అనేకభేదములను అంగీక రించుచున్నారు. స్వభావము, గుణములు అను అంశములను బట్టి మాన వుల అభిప్రాయములు వేర్వేరుగా నున్నవి.

తాను, పరాయి అనే భేదమే సత్యమని భావించే ఏ మానవుడు ఇతరులకు హింసను గాని, లేక తాను గొప్ప ధర్మాత్ముడననే బడాయిని గాని, ఇతరుల మేలును చూడలేని తనమును గాని సంకల్పించి నాయందు భక్తిని చేసినచో, అట్టి కోపిష్ఠి తామసభక్తుడనబడును.

 ఎవడైతే తనకు నాకు భేదమును స్వీకరించి, ఇంద్రియభోగములు కీర్తి సంపద మొదలగు వాటిని పొందాలనే ఆకాంక్షతో ప్రతిమ మొదలగువా టియందు నన్ను ఆరాధించునో, అట్టివాడు రాజసభక్తుడనబడును.

పాపక్షయము కొరకు గాని, లేదా కర్మను పరమేశ్వరునకు అర్పిం చుట కొరకు గాని, లేదా కర్మ విధించబడినది గనుక చేయవలసినదే అని గాని ఎవడైతే పూజాదికమును భేదభావనతో చేయునో, అట్టి భక్తుడు సాత్త్వి కభక్తుడనబడును.

నా గుణములను విన్నంత మాత్రాన భక్తుని మనస్సు, గంగాప్రవా హము సముద్రములో కలిసే తీరున, సకలప్రాణుల బుద్దిగుహయందు సాక్షిరూపముగానుండే నాయందు నిరంతరముగా సంచరించును. భక్తునకు నాయందు గల ఆ ప్రేమకు ఫలాభిలాష కారణము కాదు. భక్తుడు నన్ను తన ఆత్మకంటే అభిన్నముగా దర్శించును. అట్టి భక్తి నిర్గుణభక్తియోగ ముయొక్క లక్షణము.

నిర్గుణభక్తులు కేవలము నా సేవయందు మాత్రమే ప్రీతిని కలిగి యుందురు. సాలోక్యము (శ్రీహరితో ఒకే లోకమునందు ఉండుట), సార్షి (శ్రీహరితో సమానమగు ఐశ్వర్యమును కలిగియుండుట), సామీప్యము (శ్రీహరికి సమీపములోనుండుట), సారూప్యము (శ్రీహరితో సమానమగు రూపమును కలిగియుండుట), సాయుజ్యము (శ్రీహరిలో ఐక్యమగుట) అనే ఫలములను ఇచ్చిననూ వారు తీసుకోరు.

అట్టి భక్తియోగమే పరమపురుషార్థమని చెప్పబడినది. దాని వలన సాధకుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు సంసారమునుండి విముక్తుడై నాలో ఐక్యమగును.

సాధకుడు శ్రేష్ఠమగు స్వధర్మమును ఫలతృష్ణ లేకుండగా అను ష్ఠించవలెను. నిత్యము పువ్వులను కోయుట మొదలగువాటికంటే అధిక మగు హింసకు తావులేని ప్రశస్తమైన కర్మయోగముననుష్ఠించవలెను. నా మూర్తిని దర్శించి స్పృశించి పూజించి స్తుతించి నమస్కరించవలెను. సకల ప్రాణులయందు ఆత్మరూపముగానున్న నన్ను దర్శించవలెను. ధైర్య ముతో వైరాగ్యమును కలిగియుండవలెను. పెద్దలను ఆదరించవలెను. దీనులపై దయను చూపవలెను. తన సాటివారితో మైత్రిని నెరపవలెను. అహింస, సత్యము, అస్తేయము (పరధనమును కోరకుండుట), బ్రహ్మచ ర్యము, అపరిగ్రహము (భోగముల వెనుక పడకుండుట) అను యమముల ను, శౌచము (ఆంతర బాహ్యములయందు శుద్ది), సంతుష్టి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరశరణాగతి అనే నియమములను పాటించవలెను. అధ్యాత్మశాస్త్రమును శ్రవణము చేయవలెను. నా నామములను కీర్తించవ లెను. ఋజుస్వభావము కలిగి సత్పురుషులతో సంగమును చేయవలెను. అహంకారమును విడనాడవలెను. నా ధర్మములను (భాగవతధర్మము లను) అనుష్టించే సాధకునకు ఈ గుణములచే మనస్సు చాల పరిశుద్దమై, నా గుణములను వింటూనే తేలికగా నాయందు లగ్నమగును.

 పరిమళము తన స్థానమునుండి గాలి ద్వారా ముక్కునకు తాకు ను. అదే విధముగా భక్తియోగముచే విశుద్ధమైన మనస్సు తన మూలమగు ఆత్మను చేరును (ఆత్మయందు విలీనమగును).

నేను సకలప్రాణులలో నిత్యము ఆత్మరూపుడనై నిలిచియున్నాను. అట్టి నన్ను కాదని త్రోసిపుచ్చి ఎవడైతే ప్రతిమయందు నన్ను పూజించునో, ఆ పూజ అపహాస్యము, మోసము తక్క మరియొకటి కాదు."

నేను సకలప్రాణులలో ఆత్మరూపునిగానుండి దేహేంద్రియాదు లను నియమించుచున్నాను. అట్టి నన్ను ఉపేక్ష చేసి ప్రతిమను మాత్రమే సేవించువాడు చేసే పూజ బూడిదలో చేసిన హోమము వంటిది మాత్రమే.

భేదమే యథార్థమని భావించి గర్వియై ఇతరప్రాణులయందు వైర మును బూని ద్వేషించు వ్యక్తి ఆ ప్రాణుల దేహములయందు ఆత్మరూపు డనై యున్న నన్నే ద్వేషించుచున్నాడు. వానికి మనశ్శాంతి లభించదు.

ఒకడు అనేకవిధముల సామగ్రితో విధివిధానముగా నన్ను మూర్తి యందు ఆరాధించవచ్చును. కాని ఆతడు ప్రాణిసమూహమును అవమా నించువాడైనచో, ఆ పూజ ఎంత గొప్పదైనా, నన్ను సంతోష పెట్టదు.

మానవుడు తన కర్తవ్యమును చేస్తూ, తన హృదయములో సకల ప్రాణులలో ఈశ్వరుడనగు నేనే నిలిచియున్నాననే సత్యమును గుఎచనం తవరకు మూర్తి మొదలగు వాటియందు నన్ను పూజించవలెను.

భేదమును దర్శించే స్వభావము గల వ్యక్తి తనకు ఇతరులకు మధ్యలో, తనకు పరమాత్మకు మధ్యలో భేదమును చూచును. ఆ విధ ముగా అల్పమైననూ భేదమును భావన చేయువానికి మృత్యురూపుడనగు నేను తీవ్రమగు భయమును కలిగించెదను..

నేను సకలప్రాణులలో ఆత్మరూపముగా నివసించియున్నాను. కావున భక్తుడు సకలప్రాణులయందు సమదృష్టిని కలిగియుండవలెను. తన కంటే గొప్పవారిని సత్కరించవలెను. తనకంటే తక్కువ 'వారికి దానమును చేయవలెను. తనతో సమానమైన వారితో మైత్రిని నేరపవలెను. ఇట్లు చేసిన చో, అది నన్ను పూజించినట్లే యగును.

ఓ శుభస్వరూపురాలా! ప్రాణము లేనివాటికంటే ప్రాణము గల చెట్లు మొదలగునవి గొప్పవి. వాటికంటే ఉచ్చ్వాసనిశ్శ్వాస గల జంతు వులు గొప్పవి. వాటికంటే మనస్సు గలవి గొప్పవి. వాటికంటే ఇంద్రియవ్యా పారములు గలవి గొప్పవి.

 ఇంద్రియవ్యాపారములు గల ప్రాణులలో కేవలము స్పర్శజ్ఞా నము మాత్రమే గల చెట్ల కంటే రసమును కూడ గ్రహించే చేపలు మొదల గునవి గొప్పవి. వాటికంటే గంధమును కూడ గ్రహించే తుమ్మెద మొదలగునవి గొప్పవి. వాటికంటే శబ్దమును కూడ గ్రహించే పాములు మొదలగు నవి గొప్పవి.

వాటికంటే రూపభేదమును కూడ గుర్తించే కాకులు మొదలగునవి గొప్పవి. వాటికంటే క్రింద పైన కూడ దంతములు గల కోతులు మొదలగు నవి గొప్పవి. పాదములు లేని సర్పము మొదలగు ప్రాణులకంటె అనేకపా దములు గల తుమ్మెద మొదలగునవి గొప్పవి. వాటికంటే నాలుగు పాద ములు గల పశువులు, వాటికంటే రెండు పాదములు గల మానవుడు గొప్పవారు.

మానవులలో నాలుగు వర్ణములు గొప్పవి. వారిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణులలో కూడ వేదమునెరింగినవాడు గొప్ప. వేదార్థము తెలిసినవాడు వానికంటే గొప్ప.

కేవలము వేదార్థము తెలిసినవానికంటే దానిలోని సంశయము లను తీర్చువాడు గొప్ప. వానికంటే వేదము చెప్పిన విధముగా స్వధర్మ మునాచరించువాడు గొప్ప. వానికంటె తన ధర్మమును నిష్కామముగా ఆచరిస్తూ సంసారమునందు ఆసక్తిని విడిచినవాడు గొప్పవాడు.

అట్టి ముక్తసంగునికంటె నాయందే అన్ని కర్మలను వాటి ఫలము లను మాత్రమే గాక దేహాది సంఘాతమును కూడ సమర్పించి నాతో అభే దమును దర్శించే జ్ఞాని గొప్పవాడు. జ్ఞాని నాయందు తన బుద్ధిని, కర్మ లను సమర్పించి, తాను అకర్తృ-ఆత్మస్వరూపుడై సర్వత్ర ఈశ్వరుని దర్శిస్తూ ఉండును. ఈ సృష్టిలో జ్ఞానికంటే గొప్ప ప్రాణి నాకు కానరాదు.

సర్వేశ్వరుడగు శ్రీహరి భగవానుడే ఈ ప్రాణులలో జీవరూప ముగా ప్రవేశించి యున్నాడు. కావున, భక్తుడు సకలప్రాణులను అధికముగా ఆదరిస్తూ మనస్సులో వాటికి నమస్కరించవలెను.

ఓ మనుపుత్రీ! నేను నీకు భక్తియోగమును, అష్టాంగయోగమును కూడ చెప్పితిని. సాధకుడు ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని సాధన చేసినా, ఆ పరమపురుషుని పొందును.

 ప్రకృతి, దానికి అతీతుడగు పురుషుడు, జీవుని కర్మల ఫలమునకు ఆశ్రయమగు అదృష్టరూపమగు దైవము అనునవి పరబ్రహ్మ పరమాత్మ భగవానుని రూపములే.

భగవానుని మాయాశక్తి విభిన్నరూపములు గల ఈ విశ్వముగా , ఉదయించుటకు కారణమైన భగవానుని అద్బుతప్రభావమునకే కాలమని . పేరు. మహత్తు మొదలగు తత్త్వముల అభిమాని దేవతలతో సహా భేదదృ ష్టిగల ప్రాణులు ఈ కాలమునకు భయపడుచుందురు.

 సర్వమునకు ఆశ్రయమగు కాలమే ప్రాణుల లోపల ప్రవేశించి పంచభూతముల ద్వారానే వాటిని నశింపజేయును. జగత్తును శాసించే బ్రహ్మాదులను కూడ కాలము శాసించును. ఆ కాలము యజ్ఞఫలదాత యగు విష్ణువే అని చెప్పబడినది.

ఈ కాలమునకు ఒకడు ప్రియుడని గాని, మరియొకడు శత్రువని గాని లేరు. దానికి బంధువులు కూడ లేరు. అది అందరినీ సంహరించును. సర్వమును నశింపజేసే ఈ కాలము నిత్యము జాగరూకమై యుండును. ఈ కాలము భోగములలో మునిగి ఒళ్లు మరిచియున్న జనుని ప్రవేశించి నశింపజేయును.

కాలరూపుడగు భగవానుని భయము వలననే గాలి వీచుచున్నది; సూర్యుడు ఎండలు కాయుచున్నాడు; ఇంద్రుడు వర్షించుచున్నాడు; నక్షత్ర ములు ప్రకాశించుచున్నవి.

చెట్లు, మొక్కలు, తీగలు కాలమునకు భయపడి తమ తమ సమ యము వచ్చినప్పుడు పువ్వులను, పండ్లను ఆవిర్భవింప జేయుచున్నవి.

కాలమునకు భయపడి నదులు ప్రవహించుచున్నవి; సముద్రము చెలియలికట్టను దాటకున్నది; అగ్ని మండుచున్నది; పర్వతములతో కూడిన భూమి నీటిలో మునిగిపోకుండ నున్నది.

కాలముయొక్క ఆజ్ఞకు లోబడి ఈ ఆకాశము ప్రాణులకు స్థానము నొసగుచున్నది. అటులనే, మహత్తత్త్వము కాలమునకు వశవర్తియై అహంకారరూపమైన తన శరీరమును ఏడు ఆవరణలతో కూడిన బ్రహ్మాండము రూపములో విస్తరించుచున్నది.

కాలమునకు భయపడియే రజస్సత్త్వతమోగుణముల అభిమాను లగు బ్రహ్మవిష్ణురుద్రులు ప్రతి కల్పమునందు క్రమముగా ఈ జగత్తు యొక్క సృష్టిస్థితిలయములనే కార్యములయందు ప్రవర్తిల్లుచున్నారు. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు ఆ దేవతల వశములోనున్నది.

సర్వమునకు అంతమును కలిగించు ఈ కాలము స్వయముగా అంతము లేనిది. సర్వమునకు జన్మనిచ్చే ఈ కాలము స్వయముగా ఆది లేనిది. కాలమునకు వృద్ధి, హోసము మొదలగు వికారములు లేవు. అది తండ్రి మొదలగు జనునిచే పుత్రుడు మొదలగు జనునకు జన్మనిప్పించు ను. మృత్యువు ద్వారా అది ఇతరులను చంపే పెద్దపులి మొదలగు వాటికి, యమధర్మరాజునకు కూడ మరణమునిప్పించును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).