శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
25 - శ్రీ కపిల భగవానుని ఉపదేశము -భక్తియోగ మహిమ
శౌనక మహర్షి ఇట్లు పలికెను --- పుట్టుక లేని శ్రీహరి భగవానుడు మానవులకు ఆత్మతత్త్వమును బోధించుటకై తన మాయాశక్తిచే స్వయముగా సాక్షాత్తుగా సాంఖ్యశాస్త్రమును ప్రవర్తిల్ల జేసిన కపిలుడై జన్మించెను.
నేను భగవానుని గాథలను అధికముగా శ్రవణము చేసినవాడనే. కాని, మానవశ్రేష్ఠుడు, యోగిపుంగవుడు అగు ఈ కపిల భగవానుని కీర్తిని ఎంత విన్నా నా ఇంద్రియములకు, ఇక చాలును అనిపించుట లేదు.
భగవానుడు తన భక్తుల కోరికకు తగ్గట్లుగా దేహమును స్వీకరించి అవతరించును. కపిల భగవానుడు చేసిన కార్యములన్నియు కీర్తించదగిన వే. శ్రద్ధాళువునగు నాకు వాటిని వర్ణించి చెప్పుము.
సూతుడు ఇట్లు పలికెను -- పూజ్యుడగు మైత్రేయ మహర్షి వ్యాసుని మిత్రుడు. ఆయనను .ఇదే విధముగా విదురుడు బ్రహ్మవిద్యను బోధించుటకు ప్రేరేపించెను. అప్పుడాయన కూడ విదురుని శ్రద్దకు ఆనం దించి ఆ ప్రశ్నకు తగ్గట్లుగా విదురునితో నిట్లనెను.
మైత్రేయుడు ఇట్లు పలికెను --- తండ్రియగు కర్దమ కు వన మునకు వెళ్లిన తరువాత, కపిల భగవానుడు తల్లియగు దేవహూతికి ప్రియ మును చేయు కోరికతో ఆ బిందుసరమునందే నివసించెను.
ఒకనాడు జ్ఞానమార్గములో పారదృశ్వయగు కపిల భగవానుడు కర్మలనుండి విరతుడై కూర్చుని యుండెను. దేవహూతి బ్రహ్మగారి వచన ములను గుర్తు చేసుకొని, తన కుమారుడగు కపిలునితో నిట్లనెను.
ఓ పరబ్రహ్మస్వరూపా! ప్రభూ! నేను నిరంతరముగా ఈ దుష్టము లగు ఇంద్రియములను సంతోష పెట్టి చాల భేదమును పొందియున్నాను. దాని వలన నేను అజ్ఞానాంధకారములో పడిపోయినాను.
నీవు దాట శక్యము కాని ఆ గాఢమగు అజ్ఞానాంధకారమును దాటించే గొప్ప కన్నువంటివాడవు. నీ అనుగ్రహము చేతనే నాకు నేడు నీవు లభించినావు. అనేకజన్మల తరువాత నాకు జ్ఞానము కలిగే అవకా శము వచ్చినది. ఇది నాకు ఆఖరు జన్మ.
సర్వకారణుడు, సకలప్రాణులకు అధీశ్వరుడు అగు భగవానుడు నీవే. అజ్ఞానముచే గ్రుడ్డిదైయున్న లోకమునకు వెలుగునిచ్చే సూర్యుని వంటి నీవు ఉదయించినావు.
ఓ దేవా! ఈ దేహమునందు నేను, నాది అనే అభిమానమును నీవే కలిగించినావు. కావున, నాకు అట్టి వ్యామోహము నీవే దూరము చేయ దగుదువు.
నిన్ను శరణు పొందిన భక్తుల సంసారవృక్షమును నీవు గొడ్డలి వలె నశింపజేసెదవు. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రకృతి పురుషుల స్వరూపమును తెలియగోరుచున్నాను. మోక్షధర్మములు తెలిసినవా రిలో నీవు శ్రేష్ఠుడవు. నేను నీకు నమస్కరించుచున్నాను.
మైత్రేయుడు ఇట్లు పలికెను -- జితేంద్రియులగు సత్పురుషులచే ఫలముగా పొందబడే (ఆత్మరూపముగా తెలియబడే) కపిల భగవానుడు తల్లియొక్క ఈ పవిత్రమైన కోరికను విని ఆమెను తన మనస్సు లోపలనే ప్రశంసించెను. ఆ కోరిక మానవులకు మోక్షమునందు ప్రీతిని వర్ధిల్లజేయును. ఆయన చిరునవ్వుతో ప్రకాశించే ముఖము గలవాడై, ఇట్లు పలికెను.
శ్రీ కపిల భగవానుడిట్లు చెప్పెను -- మానవులు మోక్షమును పొందాలంటే ఆత్మనిష్ఠయే సాధనమని నా సిద్దాంతము. దానిలో మానవు నకు సుఖదుఃఖముల ద్వంద్వమునుండి శాశ్వతనివృత్తి లభించును.
ఓ పుణ్యాత్మురాలా! అట్టి ఈ అన్ని అంగములతో సంపన్నమైన యోగమును నేను నీకు బోధించెదను. నేను దీనిని పూర్వము వినగోరు చున్న మహర్షులకు బోధించియుంటిని.
ఈ మానవుని మనస్సే బంధమోక్షములు రెండింటికీ కారణమగు నని మహర్షులు చెప్పుచున్నారు. భోగములయందు ఆసక్తి ఉన్న మనస్సు బంధమును, పరమేశ్వరుని భక్తి గల మనస్సు మోక్షమును కలిగించును.
ఇది నేను, ఇది నాది అనే అభిమానములనుండి మనస్సులో కామము లోభము మొదలగు దోషములు పుట్టును. మనస్సునుండి ఇవి తొలగిన నాడు ఆ మనస్సునందు సుఖమునకు విర్రవీగుట గాని, దుఃఖము నకు క్రుంగిపోవుట గాని ఉండదు. అప్పుడు మనస్సు ప్రసన్నమగును.
అప్పుడు మానవుని మనస్సులో భక్తి వైరాగ్యము కలిగి, జ్ఞానము ఉదయించును. అపుడాతడు ఆత్మ (తన స్వరూపము) అద్వయము, ప్రకృ తికి అతీతము, లోపల బయట అనే భేదము లేనిది, స్వయంప్రకాశము, ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కానిది, నీవు నేను అనే భేదము లేనిది, సుఖదుఃఖాది ద్వంద్వములకు సాక్షి అని గ్రహించును. మరియు, ఆతడు ప్రకృతికి తనను బంధించే శక్తి క్షీణించిపోయినదని గుర్తించును.
సాధకులు బ్రహ్మత్వమును పొందుటకు, సకలమునకు ఆత్మరూ పుడైయుండే భగవానునియందు భక్తిని చేయుటతో సమానమైన మరియొక మంగళకరమగు ఉపాయము లేదు.
మానవుడు సంసారమునందు ఆసక్తిని కలిగియున్నచో, అది వానికి దృఢమగు పాశము అగునని మహర్షులు చెప్పుచున్నారు. కాని, మాన వుడు అదే ఆసక్తిని సాధుసంగతియందు చూపినచో, అది వానికి తెరుచు కున్న మోక్షద్వారమే అగును.
సాధుపురుషులయందు సహనగుణము ఉండును. వారు సకలప్రా ణులయందు దయ గలిగి సహజముగనే ఉపకారమును చేయుచుందురు. ఈ లోకములో వారికి శత్రువు అన్నవాడు పుట్టలేదు, పుట్టబోడు. శాంతమే స్వభావముగా గల సాధువులకు సచ్ఛీలమే అలంకారము.
సాధువులు ఇతరమును సర్వమును (భేదభావమును) ప్రక్కన బెట్టి ఏకాంతమగు మనస్సుతో నాయందు దృఢమగు భక్తిని చేయుదురు. వారు నన్ను పొందుట కొరకై తమవారిని బంధుజనమును విడిచి పెట్టి, సర్వకర్మసన్న్యాసులై యుందురు..
సాధువులు నన్నే శరణు వేడి నన్ను వర్ణించే పవిత్రములగు గాథ లను వినెదరు; లేదా, చెప్పెదరు. వారు నాయందే మనస్సును లగ్నము చేసియుందురు. వారిని వివిధములగు దుఃఖములు పీడించలేవు.
ఓ పతివ్రతా! అన్ని విధముల సంసారాసక్తిని విడిచి పెట్టిన ఇట్టి వారు మాత్రమే సాధువులు అనబడుదురు. వీరు సంసార-ఆసక్తి అనే దోష మును పోనాడెదరు. కావున, నీవు వారితోడి సంగమును కోరుకొనుము.
సత్పురుషుల సంగమును చేసినచో నా గాథలను వినుట సంభవమగును. హృదయమునకు చెవులకు సుఖమును ఇచ్చే ఆ గాథలు నా మహిమను గురించి చక్కని అవగాహనను కలిగించును. వాటిని సేవిం చుట వలన శీఘ్రమే మోక్షమార్గమునందు శ్రద్ద, ప్రేమ మరియు భక్తి క్రమ ముగా వికసించును.
మానవుడు నా సృష్టిరచనను స్మరించుటచే నాయందు భక్తి కలు గును. దాని వలన వానికీ ఐహిక-ఆముష్మికములగు ఇంద్రియసుఖముల యందు విరక్తి కలుగును. అపుడాతడు సావధానమనస్కుడై యోగమును చేపట్టి భక్తిప్రధానమైన (ఆయాసము లేని) యోగమార్గముల ద్వారా మనో నిగ్రహమును పొందుటకు ప్రయత్నమును చేయగలడు.
మానవుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క కార్య ములైన విషయభోగములను సేవించుట మానివేయవలెను. ఆతని జ్ఞాన మునకు వైరాగ్యము గట్టి తోడు కావలెను. అట్టి మానవుడు యోగసాధనను చేయుచూ నాయందు భక్తిని చేసినచో, ఆతడు ఈ జన్మలోనే అంతరాత్మ రూపుడనగు నన్ను పొందును.
దేవహూతి ఇట్లు పలికెను --- మోక్షమును పొందుటకు యోగ్య మగు భక్తి యెట్టిది? నావంటి అబలలకు తగిన భక్తియొక్క స్వరూపమేమి? ఏ భక్తిచే నేను శోకరహితమైన నీ పరమపదమును తేలికగా పొందేదను?
ఓ భగవాన్! నిరతిశయమగు ఆనందమే నీ స్వరూపము. నీవు బోధించిన యోగము లక్ష్యమునందు ప్రయోగించబడిన బాణము వలె తత్త్వజ్ఞానమును కలిగించి భగవానుని పొందించును. దాని స్వరూపమే ట్టిది? దాని అంగములు ఎన్ని?
ఓ శ్రీహరీ! నేను అబలను, మందబుద్దిని. ఈ యోగమును తెలి యుట చాల కష్టము. కాని నీ అనుగ్రహము వలన నేను దానిని తేలికగా తెలియగలిగే విధముగా నాకు వివరముగా బోధించుము.
మైత్రేయుడు ఇట్లు పలికెను --- తల్లియొక్క ఈ విధమగు అభి ప్రాయమునెరింగిన కపిలునకు ఆమెయందు ప్రేమ కలిగెను. తాను ఆమె నుండియే జన్మించినాడు గదా! అపుడాయన ఆమెకు పెద్దలచే సాంఖ్యము అని పిలువబడే తత్త్వములను నిరూపించే శాస్త్రమును, భక్తి యొక్క విస్తార మును మరియు యోగమును బోధించెను.
భగవానునియందు మాత్రమే లగ్న మైన మనస్సు గల సాధకుని శబ్దాది విషయములను గ్రహించే జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రి యములు వేదవిహితమైన కర్మలయందు మాత్రమే లగ్నమై యుండును. అవి స్వతస్సిద్ధముగా సత్త్వమూర్తియగు శ్రీహరియందు నిష్కామముగా ప్రవర్తిల్లుటయే భగవద్భక్తి యనబడును. ఈ భక్తి యోగసిద్ధి (మోక్షము) కంటే గొప్పది. భుజించిన అన్నమును జఠరాగ్ని వలె భక్తి జీవుని కర్మసం స్కారముల రాశియగు లింగశరీరమును శీఘ్రముగా భస్మము చేయును.
నా పాదములను సేవించుటయందు ప్రీతిగల కొందరు భగ వద్భక్తులు తమ ఇంద్రియముల చేష్టలనన్నింటనీ నా కొరకు మాత్రమే చేయుదురు. వారు బ్రహ్మాత్మైకత్వము అనే సాయుజ్యమోక్షమును కోరరు. వారు పరస్పరము కలుసుకొని నాపరాక్రమకార్యములను శ్లాఘించెదరు
అమ్మా! ప్రసన్నమగు ముఖము ఎర్రని కన్నులు గల నా అంద మైన వరములనిచ్చే దివ్యరూపములను ఆ సత్పురుషులు దర్శించి, నాతో బాటు ప్రేమపూర్వకముగా సంభాషించెదరు. నాతోడి అట్టి సంభాషణ మును మహాత్ములు అందరు కోరెదరు.
దర్శనీయములగు అవయవములు గల నా రూపములు ఆ సాధు పురుషుల మనస్సులను దోచివేయును. నా గంభీరమగు లీలలు, నా చిరు నవ్వుతో కూడిన చూపులు, నా మధురభాషణములను చూచి వారి ప్రాణ ములు ఎగిరిపోవును. అట్టి వారలను ఆ భక్తియే బ్రహ్మాత్మైక్యరూపమగు మోక్షమును పొందించును.
తరువాత వారు మాయాధీశుడనగు నా సత్యాదిలోకముల భోగ! సంపత్తిని గాని, తనంత తానుగా సిద్ధించే అణిమ మొదలగు ఎనిమిది ఐశ్వర్యములను గాని, వైకుంఠలోకమునందలి భగవానుని సంపదను గాని కోర రు. కాని, పరమేశ్వరుడనగు నా వైకుంఠలోకమునందు వారు దుఃఖసంప ర్కము లేశమైననూ లేని విభూతిని పొందెదరు.
ఎవరైతే ఆత్మరూపుడనగు నన్ను అధికముగా ప్రేమించెదరో, పుత్రునివలె నన్ను హృదయములో దాచుకొందురో, మిత్రునివలె నమ్మె దరో, గురువును వలె ఆదరించెదరో, మిత్రునివలె హితకారియని స్వీకరిం చెదరో, ఇష్టదైవమును వలె ఆరాధించెదరో, అట్టి నన్ను శరణు పొందిన భక్తులు ఏకాలమునందైననూ వినాశమును పొందరు. వారు శాంతిమయ మగు నా వైకుంఠధామములో నివసించెదరు. నా శస్త్రమగు కాలము వారి జోలికి పోదు.
ఎవరైతే ఇహలోక పరలోకములయందలి ఆసక్తిని, ఈ రెండు లోక ములకు పయనించే లింగదేహమును, ఈ జన్మలో ఈ దేహము పై గల అహంకారమును, దేహసంబంధి జనులను, ధనము పశుసంపద ఇల్లు మొదలగువాటిని, ఇతరము సర్వమును విడిచి పెట్టి, సర్వవ్యాపకుడగు నన్ను అభేదభావముతో కూడిన ఏకాంతభక్తితో సేవించెదరో, వారిని నేను జననమరణప్రవాహరూపమగు సంసారమునుండి తరింప జేసెదను.
ప్రకృతికి, జీవులకు అధీశ్వరుడను నేనే. భగవానుడనగు నేను సక ప్రాణులలో ఆత్మరూపముగా నున్నాను. నన్ను విడిచి ఇతరమునాశ్రయించుటచే తీవ్రమగు ఈ సంసారభయము తొలగదు.
ఈ గాలి నా భయము వలన వీచుచున్నది. ఈ సూర్యుడు నా భయము వలననే తపించుచున్నాడు. ఇంద్రుడు వర్షించుట, అగ్ని దహించుట నా భయము వలననే. మృత్యుదేవత నా భయము వలననే తన పనిని చేయుచున్నది.
యోగులు క్షేమరూపమగు మోక్షమును పొందుట కొరకై జ్ఞానవే రాగ్యములతో కూడిన భక్తియోగముతో నా పాదమూలమునాశ్రయించి సర్వభయములనుండి విముక్తిని పొందెదరు.
ఈ లోకములో మానవులకు సర్వోత్కృష్టమగు కల్యాణము లభించుట యనగా, వారి మనస్సు తీవ్రమగు భక్తియోగముచే నాయందు అర్పి తమై, నాయందే స్థిరముగా నిలిచియుండుటయే.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది.
