శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
24 - శ్రీ కపిల భగవానుడు జన్మించుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఉత్తమగుణ ములతో ప్రకాశించే మనుపుత్రియగు దేవహూతి వైరాగ్యము నిండిన పలు కులను పలికెను. అప్పుడు దయాస్వభావము గల కర్దముడు శ్రీహరి చెప్పిన విషయములను స్మరించి ఆమెతో నిట్లనెను.
కర్దమ మహర్షి ఇట్లు పలికెను --- దోషమునేరుంగని ఓ రాజకు మారీ! ఈ విధముగా నీ గురించి నీవు ఖేదపడకుము. అక్షర పరబ్రహ్మస్వ రూపుడగు శ్రీహరి తొందరలోనే నీ గర్భమునందు ప్రవేశించగలడు.
నీవు వ్రతములననుష్ఠించిన దానవు. నీకు మంగళమగు గాక! నీవు ఇంద్రియములను నిగ్రహించి నియమమును పాటిస్తూ ధనాదికమును దానము చేసి శ్రద్ధతో ఈశ్వరుని గురించి తపస్సును చేయుము.
నీచే ఆరాధించబడిన ఆ శ్రీహరి నీకు పుత్రుడై పుట్టి, నా కీర్తిని విస్త రింపజేసి, నీకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి, నీ అజ్ఞానమనే హృదయగ్రంథిని నిర్మూలించగలడు.
దేవహూతి కూడ కర్దమ ప్రజాపతియొక్క సందేశమును చక్కగా మర్యాదగా శ్రద్ధతో స్వీకరించెను. నిర్వికారుడు, జగత్తునకు తండ్రి, గురువు, తనకు గురువు కాబోవువాడు అగు పురుషోత్తముని ఆమె సేవించెను.
చాల రోజులు గడిచిన తరువాత మధువు అనే రాక్షసుని సంహరిం చిన శ్రీహరి భగవానుడు కర్దముని వీర్యము ద్వారా ఆమెయందు, కట్టె యందు అగ్నివలె, జన్మించెను.
అప్పుడు ఆకాశములో మేఘములు వాద్య ఘోషలవంటి గర్జన లను చేయుచూ వర్షించినవి. గంధర్వులు శ్రీహరి గాథలను గానము చేయగా, అప్సరసలు నాట్యమును చేసిరి.
దేవతలు దేవలోకమునందలి పుష్పములను వర్షించిరి. దిక్కుల న్నియు నిర్మలములైనవి. జలాశయములు, సకలప్రాణుల మనస్సులు కూడ నిర్మలములైనవి.
సరస్వతీనదిచే చుట్టువారబడియున్న కర్దముని ఆశ్రమమునకు - బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులతో గూడి విచ్చే సెను.
అంతశ్శత్రువులను జయించిన ఓ విదురా! పరబ్రహ్మ స్వరూపు డగు శ్రీహరి భగవానుడు సత్త్వగుణప్రధానమగు అంశతో జన్మించినాడని పుట్టుక లేని బ్రహ్మగారికి తెలియును. ఆయన ప్రకృతి మొదలగు తత్త్వము లను నిరూపించే శాస్త్రమును లోకములో బోధించ గోరుచున్నాడని కూడ స్వయంసిద్ధజ్ఞానసంపన్నుడగు బ్రహ్మగారికి తెలియును. ఆయన ఇంద్రియ ములన్నియు అతిశయించిన ఆనందమును ప్రకటించుచుండెను. ఆయన పరిశుద్ధమగు మనస్సుతో భగవానుని సంకల్పమునభినందించి, కర్దము నితో నిట్లనెను
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ వత్సా! పెద్దలకు మర్యాదనిచ్చే స్వభావము నీది. నీవు నాకు నిష్కపటముగా పూజను చేసితివి. ఏలయన గా, నీవు నా ఆజ్ఞను మర్యాదతో పాలించితివి.
పుత్రులు తండ్రికి ఇంతమాత్రము సేవను చేయవలెను. అది యేది న, వారు తండ్రి మాటను గౌరవముతో సరే అని అంగీకరించవలెను.
ఓ కుమారా! నీవు యోగ్యుడవు. నీ ఈ కుమార్తెలు సుందరులు వీరు తమ వంశముల ద్వారా ఈ సృష్టిని పలువిధముల వర్ధిల్లజేయగలరు.
కావున నీవీ కాలములో మహర్షులకు వారి వారి స్వభావమునకు రుచులకు తగ్గట్లుగా నీ కుమార్తెలనిచ్చి వివాహము చేసి, భూలోకములో నీ కీర్తిని విస్తరింపజేయుము.
ఓ మహర్షీ! నాకు తెలుసు. సకలప్రాణులకు నిధి (మనోరథములనీ డేర్చువాడు), ఆదిపురుషుడు అగు శ్రీహరి తన మాయచే దేహమును దాల్చి కపిలునిగా అవతరించినాడు.
ఓ మనుపుత్రీ! తేజోమయమగు కేశములు గలవాడు, పద్మముల వంటి కన్నులు పాదములు గలవాడు, పాదములయందు పద్మాకారపు రేఖలు గలవాడు, కైటభాసురుని సంహరించినవాడు అగు శ్రీహరి నీ గర్భ మును ప్రవేశించి ఈ కపిలుడై జన్మించినాడు. ఆత్మస్వరూపమును తెలి యుట, దానియందు నిష్ఠను కలిగియుండుట అనే యోగవ ) ద్వారా ఈయన జిజ్ఞాసువుల వాసనలను నశింపజేయగలడు. ఈ వాసనలే కర్మలకు మూలములోనుండి బంధించుచున్నవి. ఈయన స్వరూపముయొక్క అజ్ఞానము, ఇతరసంశయములు అనే జనుల హృదయగ్రంథిని ఛేదిస్తూ, భూలోకములో పర్యటించగలడు.
ఈ బాలకుడు సిద్ధుల గణములకు అధీశ్వరుడై, తత్త్వనిరూపణ మును చేసే సాంఖ్యశాస్త్రములో విద్వాంసులగు మహాత్ములచే ఆదరించ బడగలడు. ఈయన లోకములో కపిలుడను పేరిట ప్రసిద్ధిని గాంచి, నీ కీర్తిని ఇనుమడింప జేయగలడు.
మైత్రేయుడు ఇట్లు పలికెను --- సృష్టికర్తయగు బ్రహ్మగారు ఈ విధముగా దేవహూతికి కర్దమునకు నచ్చజెప్పి, సనకాదులు నారదుడు వెంట రాగా, తన హంసవాహనముపై బ్రహ్మాండములో సర్వోత్కృష్టమగు బ్రహ్మలోకమునకు వెళ్లాను.
ఓ విధురా! బ్రహ్మగారు వెళ్లిన తరువాత ఆయన ఆజ్ఞ ప్రకార ముగా కర్దముడు తన కుమార్తెలను ప్రజాపతులకు ఇచ్చి యథావిధిగా వివా హములను చేసెను.
కర్దముడు పులహునకు యోగ్యురాలగు గతిని, క్రతువునకు సాధ్వి యగు క్రియను, భృగువునకు ఖ్యాతిని, వసిష్ఠునకు అరుంధతిని ఇచ్చి వివాహము చేసెను.
ఆయన శాంతిని అథర్వణునకు ఇచ్చి వివాహము చేసెను. శాంతి వలననే యజ్ఞములు సమృద్ధములగును. వివాహమాడి భార్యలతో గూడి యున్న ఆ మహర్షులను కర్దముడు బహుమానములతో సంతోష పెట్టెను.
ఓ విదురా! తరువాత భార్యలతో గూడియున్న ఆ మహర్షులు అనందించి కర్దముని సెలవు తీసుకొని, తమ తమ ఆశ్రమములకు వెళ్లిరి.
కర్దముడు కూడ దేవశ్రేష్ఠుడు, కృతవ్రేతాద్వాపరములు అనే మూడు యుగములలో మాత్రమే దర్శనమిచ్చువాడు (ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే మూడు రెళ్లు ఆరు గుణములతో సంపన్నుడు) అగు శ్రీహరి అవతరించినాడని తెలుసుకొని, ఏకాంతములో ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి సంభాషించేను.
ఆశ్చర్యము! తమ పాపములచే నరకమువంటి ఈ సంసారము నందు, పీడలను పొందుతున్న జనులపై చాల కాలము తరువాత దేవత లకు అనుగ్రహము కలిగినది. ఇది నిశ్చయము.
సాధకులు అనేకజన్మలలో యోగమును అభ్యసించుట వలన అది సుదృఢమై చిత్తమునకు ఏకాగ్రత లభించును. వారు నిర్జనప్రదేశమునందు అట్టి చిత్తములో ఆ శ్రీహరియొక్క స్వరూపమును దర్శించుటకు ప్రయత్నించుచుందురు.
శ్రీహరి భగవానుడు తన భక్తుల పక్షమును సమర్థించును. కావున నే, అట్టి ఆ భగవానుడు తాను చులకన అగుదునేమో యని సరకు చేయ కుండా, ఈనాడు అవివేకులమగు మా ఇంటిలో జన్మించినాడు.
భగవానుడవగు నీవు భక్తుల హోదాను వర్ధిల్లజే సెదవు. నీవు సాంఖ్యశాస్త్రమును లోకములో ప్రవర్తిల్ల జేయగోరి, నాకిచ్చిన మాటను యథార్థము చేయుటకై నా గృహములో అవతరించితివి.
ఓ భగవానుడా! నీవు రూపము లేనివాడవు. నీ భక్తులకు నీ ఏయే రూపములు ఇష్టమగునో, అవియే నీకు కూడ అభీష్టములగుచున్నవి,
విద్వాంసులు తత్త్వముల స్వరూపమును తెలియగోరి సర్వదా సాక్షాత్తుగా నీ పాదపీఠమునకు నమస్కరించెదరు. ఈశ్వరభావము, వైరా గ్యము, యశస్సు, జ్ఞానము, వీర్యము (శక్తి), శ్రీ (సంపద, శోభ) అనే ఆరు గుణములు నీలో పూర్ణముగా నున్నవి. నిన్ను నేను శరణు వేడుచున్నాను.
నీవు ప్రకృతికి అతీతుడవు. జగత్తునకు ఉపాదానమగు ప్రధానము, దానికి అధ్యక్షుడగు పురుషుడు, దాని ప్రథమకార్యమగు మహత్తత్త్వము (సమష్టి బుద్దిశక్తీ), ప్రధానములో సంక్షోభమును కలిగించే కాలము, సాత్త్విక రాజస తామసములనే అహంకారములు, ఇంద్రాది లోకపాలకులు నీ రూప ములే. సర్వజ్ఞుడవగు నీవు ప్రకృతిలోని పరిణామమును దర్శించే సాక్షివి. నీవు నీ చిచ్చక్తిచే బ్రహ్మాండమును వ్యాపించి నీలో విలీనము చేసెదవు. శక్తులన్నియు నీ వశములోనుండును. కపిలభగవానుడవగు నిన్ను నేను శరణు వేడుచున్నాను.
నీవు ప్రాణులకు ప్రభుడవు. నేనీనాడు నీ అనుమతిని కోరుచునా ను. నీవు నాకు పుత్రుడవై జన్మించుటచే నా ఋణములన్నియు తీరిపోయి నవి. నీ అనుగ్రహముచే నా కోరికలు సిద్ధించినవి. నేను సన్న్యా సాశ్రమ మును స్వీకరించి నిన్ను మనస్సులో ధ్యానిస్తూ నిశ్చింతగా చరించెదను.
శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- వైదిక లౌకిక కర్మలలో మానవ నకు నేను చెప్పినదే ప్రమాణము. నీ పుత్రుడనై జన్మించెదనని నేను నీ చెప్పియుంటిని. ఆ మాటను సత్యము చేయుటకై జన్మించితిని.
కలుషితమగు అంతఃకరణము జీవుని లింగశరీరరూపములో బంధించును. దానినుండి విముక్తిని పొంది ఆత్మసాక్షాత్కారమును కోరువారలకు తత్త్వముల వివేకపూర్వకమగు అవగాహన ఆవశ్యకము. దానిని బోధించుటకు నేనీ లోకములో ఈ విధముగా అవతరించితిని.
ఈ ఆత్మజ్ఞానము అనే మోక్షమార్గము చాల సూక్ష్మమైనది. కాల ముయొక్క దీర్ఘమగు ప్రవాహములో ఇది కనుమరుగైనది. దీనిని మరల లోకములో ప్రవర్తిల్ల జేయుటకై నేనీ దేహమును దాల్చినానని తెలియుము.
నేను నీకు అనుజ్ఞనిచ్చుచున్నాను. యథేచ్చగా వెళ్లుము. మృత్యు వును జయించి మోక్షమును పొందుట చాల కష్టము. కాని, కర్మలను నాకు సమర్పించుట ద్వారా మృత్యువును జయించవచ్చును. అట్లు చేసి నన్ను భజించుము.
. నేను స్వయంప్రకాశస్వరూపుడను; సకలప్రాణుల బుద్దిగుహలో నివసించెదను. నన్ను నీవు నీయందే బుద్ధిచే . ఆత్మరూపునిగా దర్శించుము. నీ శోకము పోయి, అభయస్థానమగు మోక్షము లభించును.
ఆత్మతత్త్వమును ప్రకాశింపజేసే విద్యను నేను అమ్మకు కూడ బోధించెదను. దానిచే ఆమె సర్వకర్మల బంధమునతిక్రమించి సంసారభ యమునుండి బయట పడగలదు.
మైత్రేయుడు ఇట్లు పలికెను --- కపిల భగవానుడు ఈ విధముగా చక్కగా అనుమతినీయగా, కర్దమ ప్రజాపతి సంతోషించి, ఆయనకు ప్రదక్షి ణము చేసి అడవికి వెళ్లేను.
మననశీలుడగు కర్దముడు ఆత్మను మాత్రమే ఆశ్రయించి సంసార మునందలి ఆసక్తిని పరిత్యజించేను. సన్న్యసించుటచే ఆయనకు అగ్నిహో త్రాది కర్మలతో సంబంధము తప్పినది. పరివ్రాజకుడగుటచే ఆయనకు స్థిర నివాసము లేదు. ఆయన మౌనవ్రతమును స్వీకరించి భూలోకములో సంచ రించెను.
కార్యకారణములకు అతీతమైన పరబ్రహ్మ స్వయముగా నిర్గుణ మై, సత్త్వరజస్తమోగుణములను తన చైతన్యప్రకాశములో ప్రకాశింప జేయును. ఏకాంతమగు భక్తిచే దానిని ఆత్మరూపముగా దర్శించదగును. ఆయన అట్టి పరబ్రహ్మయందు మనస్సును ఏకాగ్రము చేసి సంచరించెను.
ఆయనయందు అహంకార మమకారములు లేకుండెను. ఆయన సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడై సంచరించెను. ఆయన సర్వత్రా పరమాత్మను మాత్రమే దర్శించెడివాడు. ఆత్మనిష్ఠ గల ఆయన బుద్ధి స్వరూపనిష్టమై ప్రసన్నముగా నుండెడిది. ఆత్మానాత్మవివేకము గల కర్ద ముడు తరంగములు సద్దుమణిగిన సముద్రమువలె ప్రశాంతగంభీరుడై యుండెను.
సర్వజ్ఞుడు, ప్రత్యగాత్మ స్వరూపుడు అగు వాసుదేవ భగవానుని యందు సర్వాతిశాయియగు భక్తిభావముతో స్థిరముగా నిలిచిన బుద్దిగల కర్దముడు సంసారబంధము తొలగి జీవన్ముక్తుడయ్యెను.
సకలప్రాణులలో భగవానుడే ఆత్మరూపముగా నిలిచియున్నాడని ఆయన దర్శించగలెను. ఇంతేగాక, సకలప్రాణులు ఆత్మరూపుడగు భగవా నునియందే ఉనికిని కలిగియున్నవని ఆయన దర్శించగల్గినాడు.
కర్దమునియందు రాగద్వేషములు లేవు. ఆయన అంతటా వ్యాపిం చియున్న భగవానుని మాత్రమే చూచుటచే, ఆయనయందు భేదదృష్టి లేదు. ఆయన మనస్సు భగవానునియందు భక్తితో నిండియుండెను. ఆయన భగవానుని పరమపదము (మోక్షము) ను పొందెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.
