శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

16 - జయ విజయులు వైకుంఠమునుండి పతితులగుట

బ్రహ్మగారు ఇట్లు పలికిరి --- ఆత్మజ్ఞాననిష్ఠయే ధర్మముగా గల ఆ మహర్షులు చేసిన ఈ స్తోత్రమును వైకుంఠాధిపతియగు (శుద్దమగు బుద్ధియందు ఆత్మరూపముగా ప్రకాశించే) శ్రీహరి విభుడు అభినందించి, వారితో ఇట్లు పలికెను.

మీ శాపమునకు గురియైన ఈ జయవిజయులనే వారిద్దరు నా అనుచరులు. వీరు మీ విషయములో పెద్ద అపరాధమును చేసినారు. అట్లు చేయుటలో, వారు నన్ను కూడ అవమానించినారు.

ఓ మహర్షులారా! దేవతాస్వరూపులగు. మిమ్ములను పరిహసించుట ద్వారా వీరు నన్ను కూడ పరిహసించినట్లే అయినది. నన్ను భక్తితో ఆరాధించే మీరు వీరిద్దరికి విధించిన శిక్షను నేను కూడ ఆమోదిస్తున్నాను.

కావున, నేనిప్పుడు మిమ్ములను ప్రసన్నులు కండని ప్రార్థించుచు న్నాను. ఏలయనగా, నాకు బ్రహ్మవేత్త పరమదైవము. నా అనుచరులు మిమ్ములను అవమానించినచో, అది నేను మిమ్ములను అవమానించినట్లే యగును.

లోకములో సేవకుడు అపరాధము చేసినప్పుడు జనులు వాని స్వామిని నిందించెదరు. దాని వలన ఆ స్వామి యొక్క కీర్తి, చర్మరోగ ముచే చర్మము పాడైన విధముగా, చెడిపోవును.

ఈ లోకములో నా నిర్మలమైన యశస్సు అనే అమృతవాహినియందు శ్రవణము అనే మునకను వేయువాడు ఎవడైనా, పరమకిరాతకుడే అయినా, వెంటనే పవిత్రుడగును. అట్టి గొప్ప పావనమగు కీర్తి నాకు మీవంటి మహాత్ముల వలననే లభించినది. మొక్కవోని సామర్థ్యము గల అట్టి నేను, మీకు ప్రతికూలముగా వ్యవహరించినచో, నా చేతినైననూ తెగగొట్టెదను.

బ్రహ్మవేత్తలగు మిమ్ములను సేవించుటచే మీ పాదపద్మముల ధూళి నన్ను పవిత్రునిగా చేసి, నాలోని సకలదోషములను పారద్రోలినది (బ్రహ్మవేత్తలగు మిమ్ములను సేవించుటచే నా పాదపద్మముల ధూళికి సేవించువారిని పవిత్రము చేసే మహిమ అబ్బినది; లేదా, బ్రహ్మవేత్తలగు మిమ్ములను సేవించినప్పుడు మీ పాదపద్మముల ధూళి సోకుటచే జగ త్తును పావనము చేసే శక్తి నాకు లభించినది). పైగా, మీ సేవ వలస నాకు సుందరమగు శీలము అబ్బినది. దాని ప్రభావము చేతనే, నేను విరక్తుడనే అయిననూ, లక్ష్మీదేవి నన్ను విడువకున్నది. ఆ లక్ష్మీదేవియొక్క అనుగ్రహముతో కూడిన ఒక్క చూపు తమపై ప్రసరించుటకై ఇంద్రాదులు ప్రతనియమములను పాటిస్తూ, కష్టపడి తపస్సును చేయుచున్నారు.

యజ్ఞములో యజమానుడు కారుచున్న నేతితో నిండియున్న పురోడాశము మొదలగు హవిస్సును సమర్పించినప్పుడు నేను దానిని అగ్ని అనే నోటితో భక్షించెదను. అంతేగాక, తాను చేసిన కర్మల ఫలమును నాకు సమర్పించి సంతుష్టుడై యున్న బ్రహ్మవేత్త నేతితో నిండియున్న ప్రతి ముద్దను భక్షించుచుండగా, ఆయన నోటిద్వారా ఆ అన్నమును భక్షిం చేది కూడ నేనే. కాని, ఆ బ్రహ్మవేత్త నోటిగుండా భక్షించినంత తృప్తిగా నేను యజ్ఞములోని హవిస్సులను కూడ భక్షించుట లేదు.

నా యోగమాయ అఖండమైనది. దానికి మొక్కవోని మహిమ గల దు. నా పాదోదకరూపమగు గంగ చంద్రుడు శిరోభూషణముగా గల శివునితో సహా సమస్తలోకములను పవిత్రము చేయుచున్నది. అట్టి నేను కూడ బ్రహ్మవేత్తల పవిత్రమగు పాదధూళిని కిరీటము పై దాల్చెదను. వారి పాద ధూళి చంద్ర శేఖరునితో సహా లోకములనన్నింటినీ పావనము చేయ దగియున్నది. అట్టి బ్రాహ్మణులను ఎవడు సహించకుండును?

బ్రాహ్మణశ్రేష్ఠులు, గోవులు మరియు రక్షకుడు లేని ప్రాణులు నా శరీరములోని భాగములు. వారికి నాకు భేదము లేదు. కాని, కొందరు పామువలె కోపిష్టులై పాపకార్యములచే చెడగొట్టబడిన బుద్ధి గలవారై, వారిని నాకంటె వేరుగా భావించెదరు. అట్టి వారిని శిక్షించే అధికారమును నేను యమునకు ఇచ్చినాను. కోపముతో బుసలు కొట్టే పాముల వంటి ఆ యముని కింకరులు కోపించి గ్రద్దల రూపములో వారిని చీల్చివేసెదరు.

బ్రహ్మవేత్తలు నిందించిననూ మానవులు నాయందు బుద్ధిని నిలిపి, సంతోషముతో నిండిన హృదయము గలవారై, వారిని పూజించవలెను. మానవులు చిరునవ్వు అనే అమృతమును చిలికించే ముఖపద్మములు గలవారై, ప్రేమతో మధురమైన వాక్కుతో వారిని స్తుతించవలెను. కోపించిన తండ్రితో యోగ్యుడగు కొడుకు వలే, ప్రియుడగు పుత్రునితో తండ్రి వలె, మానవుడు వారిని సంతోష పెట్టవలెను. నేను మీ విషయములో అటులనే చేయుచున్నాను. అట్లు చేయు మానవులకు నేను వశుడనగుదును.

కావున, వీరిద్దరు తమ ప్రభువగు నా నిశ్చయమును తెలియజాల క, మీ విషయములో అపరాధమును చేసి, వెంటనే దాని ఫలమును పొందుచున్నారు. ఈ ఇద్దరు సేవకులకు నా వియోగము తొందరలో సమా ప్రమగునట్లు మీరు అనుగ్రహించుడు. వీరు మరల నన్ను చేరుకొనునట్లు మీరు నన్ను అనుగ్రహించుడు. వారు అట్లు నన్ను చేరునట్లు నేను వారిని అనుగ్రహించుచున్నాను.

బ్రహ్మ ఇట్లు పలికెను --- శ్రీహరి మిక్కిలి మధురమైన, సమ్మా నార్హమైన, ఆ మహర్షులకు హితమును కలిగించే మాటలను పలికెను. వారి మనస్సులు కోపము అనే సర్పముచే కరువబడియున్ననూ, వారా మాటలను అమృతమును వలె ఆస్వాదించిరి. కాని, వారి బుద్ధికీ తృప్తి కలు గలేదు.(పరమపవిత్రమైనది, సాధుజనులకు ప్రీతికరమైనది అగు సరస్వతీ నదియొక్క తియ్యని జలమును ఎంత త్రాగిననూ, పాము కరిచిన వానికి దాహము తీరదు).

శ్రీహరి శ్రేష్టమైన కొద్ది పలుకులను మాత్రమే పలికెను. కాని, వాటి గొప్ప అర్థమును తెలియుట తేలిక కాదు. ఆ పలుకులలో అతిశయించిన గాంభీర్యము ఉండెను. ఆ మహర్షులు ఆ పలుకులను చెవులను రిక్కించి విని, వాటిని గురించి గాఢముగా ఆలోచించిరి. అయిననూ, వారికి భగవా నుడు ఏమి చేయదలచుకున్నాడో తెలియలేదు.

శ్రీహరి యోగమాయచే తన పరమైశ్వర్యముయొక్క ఉత్కర్షను ప్రకటించినాడు. ఆయనను చూచుటచే ఆ మహర్షులకు పరమానందము కలిగి, వారి శరీరములు గగుర్పాటును పొందినవి. వారు చేతులను జోడించి ఆయనతో నిట్లనిరి.

ఆ మహర్షులు ఇట్లు పలికిరి --- ఓ భగవానుడా! దేవా! నీవు జగ దధ్యక్షుడవై యుండియు, మీరు నన్ను అనుగ్రహించినారని మాతో పలుకు చున్నావు. మాకు నీవు చేయదలచుకున్న కృత్యము (నీ అభిప్రాయము) తెలియకున్నది.

ఓ ప్రభూ! బ్రహ్మవేత్తలకు నీవు హితకారివి. వారిని నీవు పరమదై వముగా భావించుచున్నావు. కాని వాస్తవములో, బ్రాహ్మణులకు, దేవాధిదే వులగు బ్రహ్మాదులకు కూడ నీవే ఆత్మవు, మరియు ఆరాధ్యుడవు.

సనాతన ధర్మము నీనుండీయే ప్రవర్తిల్లుచున్నది. నీవే అవతరించి దానిని రక్షించుచున్నావు. ధర్మముయొక్క సర్వోత్కృష్టమగు ఫలము సర్వ వేదసారమగు పరబ్రహ్మ. అది నీవే యని శాస్త్రములు నిర్ధారించినవి.

ఆత్మజ్ఞాననిష్టులగు మహాత్ములు నీ అనుగ్రహముచే జన్మమృ త్యుప్రవాహరూపమగు సంసారమును తరించెదరు. అట్టి నిన్ను ఇతరులు ఎవరు అనుగ్రహించ గలరు?

భక్తులు నీ పాదములయందు నవనవలాడే తులసి దళముల మాలను సమర్పించగా, గండు తుమ్మెద దానిచుట్టూ తిరుగాడుచుండును. అట్టి నీ పాదముల స్థానమును మాత్రమే కోరే లక్ష్మీదేవి నిన్ను ఎల్లవేళలా సేవించుచుండును. ఐశ్వర్యమును కోరే ఇతరులగు ఇంద్రాది దేవతలు ఆ దేవియొక్క పాదధూళిని తమ శిరస్సు పై ధరించుచుందురు.

పరిశుద్ధమగు పరిచర్యలతో సేవించే ఆ లక్ష్మీదేవికంటె నీకు మహా భక్తులయందు మాత్రమే ఆదరము మెండు. కావుననే, నీకు లక్ష్మీదేవికంటే అట్టి భాగవతోత్తములయందే ప్రీతి ఎక్కువ. బ్రహ్మవేత్తలు నడిచే దారిలోని ధూళిని ధరించి నీవు పవిత్రుడవైనావా యేమి? (కాదు). అట్టి పవిత్రతను పొంది నీవు వక్షఃస్థలమునందు లక్ష్మీదేవిని ధరించుటకు, షడ్గుణసంపన్నుడ వగుటకు అర్హుడవైనావా యేమి? కానే కాదు. నీవు స్వయముగనే ఈ సర్వ మునకు అధీశ్వరుడవై యున్నావు.

ఓ భగవానుడా! నీవు కృతత్రేతాద్వాపరములనే మూడు యుగములలో మాత్రమే ప్రత్యక్షముగా దర్శనమిచ్చెదవు. తపస్సు, దయ, దానము అనునవి ధర్మస్వరూపుడవగు నీ పాదములు. నీవు స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తును బ్రహ్మవేత్తలు మరియు దేవతల కొరకు పాలించుచున్నావు. ధర్మముయొక్క ఆ మూడు పాదములకు విఘాతమును కలిగించే రజస్తమోగుణములను పోనాడి, నీవు సత్త్వమయమగు నీ మూర్తితో మాకు వరములనొసంగుము.

ఓ దేవా! ఈ లోకములో నీవు బ్రాహ్మణులతో ప్రియముగా మాట లాడి, వారికి చక్కని సమ్మానమును చేయుచున్నావు. ఆ విధముగా నీవు మాత్రమే రక్షకుడుగా గల ఆ బ్రహ్మవేత్తల సమూహమును నీవు రక్షించని చో, నీచే ప్రవర్తిల్ల జేయబడిన మంగళకరమగు ధర్మమార్గము నశించును. ఏలయనగా, శ్రేష్ఠపురుషుడవగు నీవు దేనిని ఆచరిస్తే, లోకము దానిని ప్రమాణముగా స్వీకరించును.

నీవు సత్త్వగుణనిధానమవు. నీవు మానవుల కల్యాణమును గోరి నీ శక్తిస్వరూపులగు రాజుల ద్వారా శత్రువులను నశింపజేసినావు. నీకు ఆ ధర్మమార్గము నశించుట సుతరాము సమ్మతము కాదు. మూడు గుణము లను వశములో నుంచుకొనే నీవు జగత్తును పాలించి పోషించుచున్నావు. నీవు వినయమును చూపినంత మాత్రాన, అది నీ తేజస్సునకు భంగకారి కాదు. ఆ విధముగా వినయమును ప్రదర్శించుట నీ లీల మాత్రమే.

ఓ సర్వేశ్వరా! వీరిద్దరికీ నీవు ఏ శిక్షను విధించినా, లేదా వారికి అధికమగు ఉపహారమునిచ్చినా, మేము దానిని కపటము లేకుండగా అను మోదించుచున్నాము. అంతే గాక, మాకు కూడ ఉచితమగు దండమును విధించుము. అది కూడ మాకు స్వీకార్యమే. ఏలయనగా, మేము ఈ నిరప రాధుల జీవితములలోనికి శాపమును ప్రవేశ పెట్టితిమి.

శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ఓ మహర్షులారా! వీరిద్దరు వెంటనే రాక్షసజన్మను పొంది నాయందు కోపావేశమును కలిగియుందురు. అది వీరి మనస్సును నాయందు ఏకాగ్రము చేసి, యోగరూపముగా వర్ధిల్లును. వారు తొందరలోనే మరల నా సన్నిధికి చేరెదరు. మీరు నా ప్రేరణ చేతనే వీరికి శాపమును ఇచ్చితిరి. ఆ విషయమును గమనించుడు.

తరువాత ఆ మహర్షులు కన్నులకు పండువయగు శ్రీహరిని దర్శించిరి. స్వయంప్రకాశస్వరూపుడగు ఆ శ్రీహరి మొక్కవోని సామర్థ్యము గలవాడు. ఆయన నివాసమగు వైకుంఠమును కూడ కన్నుల పండువగా వారు చూచిరి. వైకుంఠము తనంత తానుగా ప్రకాశించే దివ్యస్థానము.

వారు శ్రీహరి భగవానునకు ప్రదక్షిణము చేసి, ప్రణమిల్లి, ఆయన అనుమతిని పొంది, ఆయన సంపదను శోభను వర్ణించుకుంటూ, మహానందముతో తిరిగి వెళ్లిరి.

శ్రీహరి భగవానుడు తన ఇద్దరు అనుచరులతో నిట్లు పలికెను: వెళ్లుడు. భయపడకుడు. మీకు మంగళము కలుగుగాక! బ్రాహ్మణశాప మును కాదని త్రోసిపుచ్చే సామర్థ్యము నాకున్ననూ, ఆ శాపము కూడ నా అభిమతమే యగుటచే, నేను అట్లు చేయనిచ్చగించుట లేదు.

పూర్వము ఒకసారి నేను యోగనిద్రలోనుండగా, మీరు లోపలకు వచ్చుచున్న లక్ష్మీదేవిని ద్వారము వద్ద అడ్డుకొనిరి. అపుడామె కోపించి మీకీ శాపమును నిర్దేశించినది.

మీరు నిరంతరముగా నాయందు క్రోధమును చేసి, బ్రహ్మవేత్తలను నిరాకరించిన పాపమును పోగొట్టుకొని, కొద్ది కాలములో మరల నా సన్నిధికి చేరుకొనగలరు.

శ్రీహరి భగవానుడు ద్వారపాలకులనీ విధముగా ఆదేశించి తన స్థానమును ప్రవేశించెను. విమానముల వరుసలతో శోభిల్లే ఆ స్థానము సర్వాతిశాయియగు సంపదతో నిండి, సర్వాధికసౌందర్యనిధానమగు లక్ష్మీ దేవిచే సేవింపబడుచున్నది.

దేవతలలో శ్రేష్టులగు ఆ జయవిజయులైతే దోట శక్యము కాని బ్రాహ్మణశాపము వలన వైకుంఠములోనుండగానే తమ శోభను గోల్పోయిరి. వారు వైకుంఠమునుండి పతితులైరి. వారి గర్వము తొలగిపోయెను.

ఓ దేవతలారా! అప్పుడు శ్రీహరియొక్క నివాసస్థానమునుండి వారిద్దరు పతితులగుచుండగా, శ్రేష్ఠమగు విమానములలో నివసించు జనులు పెద్దగా హాహాకారములను చేసిరి.

శ్రీహరియొక్క అనుయాయులలో శ్రేష్ఠులగు వారిద్దరు ఇప్పుడు దితియొక్క గర్భములోని భయంకరమగు కశ్యపుని తేజస్సును పొందిరి.

మృత్యువువంటి వారిద్దరు రాక్షసులు కవలలు. వారి తేజస్సే ఇప్పుడు మీ తేజస్సును తిరస్కరించి యున్నది. ఈ సమయములో శ్రీహరి భగవానుడే ఈ పరిస్థితిని కలిగించ గోరుచున్నాడు.

శ్రీహరి భగవానుడు ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు కారణమైన ఆది పురుషుడు. ఆయన సత్త్వరజస్తమోగుణములను తన వశ ములో నుంచుకున్న త్రిలోకాధిపతి. శ్రేష్ఠులగు యోగులైననూ ఆయన యోగమాయను తరించలేరు. అట్టి ఆ భగవానుడే మనలకు క్షేమమును కలిగించగలడు. దీని గురించి మనము చర్చించి ప్రయోజనమేమున్నది?

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో పదునారవ అధ్యాయము ముగిసినది.