శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

28  - అష్టాంగ యోగ విధానము

      శ్రీ కపిల భగవానుడిట్లు పలికెను --- అమ్మా! నేనిప్పుడు నీకు సబీజ (ఆలంబముతో కూడిన) యోగమును చెప్పెదను. దీనిని అనుష్టించినచో మనస్సు ప్రసన్నమై భగవానునిపై లగ్నమగును.

      యథాశక్తి తన ధర్మమునాచరించుట, అధర్మమునకు దూరముగా నుండుట, ప్రారబ్ధానుసారముగా లభించిన దానితో సంతృప్తిని జెందుట, ఆత్మజ్ఞానుల పాదములను పూజించుట.

భోగాసక్తిని పెంచే కర్మలకు దూరముగా నుండుట, మోక్షధర్మము లగు శ్రవణాదులయందు ప్రీతిని కలిగియుండుట, పవిత్రమగు ఆహార మును మితముగా భుజించుట, నిత్యము నిర్భయమగు స్థానములో ఏకాంతముగా నుండుట.

     ప్రాణులకు హింసను కలిగించకుండుట, అసత్యమును మాటలాడ కుండుట, పరధనమునపహరించకుండుట, దేహనిర్వహణకు కావలసినంత మాత్రమే వస్తువులను ప్రోగుచేయుట, బ్రహ్మచర్యము, తపస్సు, దేహ మును మనస్సును శుద్ధముగా నుంచుకొనుట, మోక్షశాస్త్రమునధ్యయ నము చేయుట, పరమేశ్వరుని పూజించుట.

మౌనముగా నుండుట, నిత్యము ఆసనములనభ్యసించి స్థిరముగా కూర్చుండుట, మెల్లమెల్లగా ప్రాణాయామము ద్వారా శ్వాసను జయించు ట, మనస్సుతో ఇంద్రియములను విషయభోగములనుండి 5 ఎకకు లాగి హృదయమునందు నిలుపుట అనే ప్రత్యాహారము.

ప్రాణములను మనస్సుతో సహా మూలాధారము మొదలగు స్థాన ములలో ఒకదానియందు నిలిపియుంచుట, శ్రీహరి లీలలను స్మరించుట, బుద్ధియొక్క ఏకాగ్రత అనువాటిని సాధకుడు అభ్యసించవలెను.

సాధకుడు ఒక యోగాసనమునందు కొంత సేపు స్థిరముగా కూర్చుండుటను అభ్యాసము చేయవలెను. అదియే ఆసనజయము. సాధ కుడు పరిశుద్దమగు స్థానమునందు ఆసనమును వేసుకొని దానిపై సుఖ ముగా యోగాసనములో చక్కగా నిటారుగా కూర్చుండి అభ్యసించవలెను.

గాలిని లోపలకు పీల్చి కొద్ది సేపు నిలిపి యుంచవలెను. తరువాత దానిని బయటకు విడిచిపెట్టి బయటనే కొద్ది సేపు నిలిపియుంచవలెను. దీనికి విరుద్ధక్రమములో కూడ ప్రాణాయామమును చేయవచ్చును. ఇట్లు చేయుట వలన ప్రాణమార్గము (నాడులు) శుద్దియై, మనస్సు అచంచల ముగా స్థిరముగా నుండును.

లోహమును నిప్పులలో కాల్చి దాని పైకి గాలిని ప్రసరింపజేసినచో దాని మాలిన్యములు తొలగిపోవును. అదే విధముగా, యోగి ప్రాణాయామ ముచే వాయువును జయించినచో, మనస్సు శీఘ్రముగా నిర్మలమగును.

సాధకులు ప్రాణాయామమును చేసి దేహములోని వాతపిత్తాదుల దోషములను తొలగించుకొనవచ్చును. మనస్సును ఈశ్వరుని రూపము వంటి ఒక స్థానముపై నిలుపుట (ధారణ) ను అభ్యసించుటచే పాపసంస్కా రములు దూరమగును. ఇంద్రియములను బాహ్యపదార్థములనుండి ఉప సంహరించుటచే భోగములయందలి ఆసక్తి తొలగును. పరమేశ్వరుని ధ్యానించుటచే ఈశ్వరునినుండి విముఖము చేసే రాగద్వేషాది గుణములు తొలగిపోవును.

యోగాభ్యాసముచే మనస్సు శుద్దమై చక్కని ఏకాగ్రతను పొందు ను. అప్పుడు సాధకుడు తన ముక్కుకొనను చూచుచున్నాడా యన్నట్లు మనస్సును ఏకాగ్రము చేసి భగవానుని మూర్తిని ధ్యానించవలెను.

శ్రీహరియొక్క పద్మమువంటి ముఖము ప్రసన్నముగా నుండును. ఆయన కన్నులు పద్మకోశము వలె అరుణవర్ణమును కలిగియుండును. నల్లని కలువ రేకులవలె శ్యామలవర్ణమును కలిగియున్న శ్రీహరి శంఖ మును చక్రమును గదను ధరించియుండును.

పద్మపు పుప్పొడివలె పచ్చగా ప్రకాశించే పట్టువస్త్రమును దాల్చిన శ్రీహరియొక్క వక్షఃస్థలము పై శ్రీవత్సము, మెడలో కౌస్తుభమాణి క్యము విరాజిల్లును.

శ్రీహరి మదించిన తుమ్మెదల మధురధ్వని గల వనమాలను మెడనుండి పాదముల వరకు ధరించును. ఆయన హారములు కంకణ ములు బాహుపురులు నూపురములు మొదలగు అమూల్యములైన ఆభరణములను ధరించియుండును.

     శ్రీహరి నడుము మొలనూలు సరములతో ప్రకాశించుచుండును. భక్తుల హృదయపద్మములే నివాసముగా గల ఆయన శాంతరూపుడై అతిశ యించిన తన సౌందర్యముతో భక్తుల మనస్సునకు కళ్లకు ఆహ్లాదమును కలిగించుచుండును.

       యౌవనమునందుండే శ్రీహరి దర్శనము అతి సుందరమైనది. సర్వలోకములచే నమస్కరించబడే శ్రీహరి భక్తులను అనుగ్రహించుటకు తొందర పడుచుండును.

      కీర్తించదగిన పవిత్రమగు కీర్తిగల శ్రీహరి పవిత్రమగు కీర్తిగల భీష్మాదుల కీర్తిని కూడ వర్ధిల్లజేయును. సాధకుడు మనస్సు స్థిరముగా నిల బడినంత వరకు ఆ శ్రీహరియొక్క పూర్ణమగు మూర్తిని ధ్యానించవలెను.

సాధకుడు తన అభిరుచికి తగ్గట్లుగా శ్రీహరి నిలిచియున్నట్లు గాని, నడచుచున్నట్లు గాని, కూర్చునియున్నట్లు గాని, లేదా పరుండియున్నట్లు గాని ధ్యానించవచ్చును. దర్శించదగిన లీలలు గల శ్రీహరి సాధకుని బుద్ధి గుహయందు చైతన్యరూపముగా నిలిచియుండును. సాధకుడు అట్టి శ్రీహ రిని పరిశుద్ధమగు భావనతో కూడిన మనస్సుతో ధ్యానించవలెను.

తన చిత్తము భగవానుని మూర్తియందలి అవయవములన్నింటి యందు నిలకడను పొందినదని గమనించిన తరువాత, మననశీలుడగు సాధకుడు మనస్సును భగవానుని ఒక్కొక్క అంగము పై విశేషముగా ఏకా గ్రము చేయవలెను.

భగవానుని అరికాళ్లు వజ్రము అంకుశము ధ్వజము పద్మముల రేఖలతో నొప్పారును. శ్రీహరియొక్క ఎత్తైన ఎర్రని గుండ్రని ప్రకాశించే గోళ్ల కాంతులు ధ్యానము చేసే మహాత్ముల హృదయములలోని చీకట్లను తరిమివేయును.

శ్రీహరియొక్క పాదములను కడిగిన నీరే గంగానదియై ప్రవహిం చగా ఆ పవిత్రజలములను శిరస్సుపై దాల్చి శివుడు మంగళస్వరూపుడా యెను. శ్రీహరియొక్క పాదము ధ్యానించువారి మనస్సులోని మాలిన్యప ర్వతములను బద్దలుకొట్టే వజ్రము. అట్టి శ్రీహరి భగవానుని పాదపద్మ మును సాధకుడు చిరకాలము ధ్యానించవలెను.

పద్మములవంటి కన్నులు గలది, సకలజగత్తును సృష్టించిన బ్రహ్మకు తల్లి, దేవతలచే నమస్కరించబడునది అగు లక్ష్మీదేవి శ్రీహరి యొక్క మోకాళ్లను తన తొడల పై నుంచుకోని చిగురుటాకులవలే ప్రకా శించే చేతులతో చక్కగా సేవ చేయును. జన్మలేనివాడు, సంసారభయ మును పోగొట్టువాడు అగు శ్రీహరిప్రభుని అట్టి మోకాళ్ల జంటను సాధ కుడు హృదయములో ధ్యానించవలెను.

బలమునకు ఆశ్రయములై నల్లయగి సె పుష్పముల కాంతితో శోభిల్లే శ్రీహరీ తొడలు గరుత్మంతుని భుజములపై అధిష్టించి ప్రకాశించు ను. ఆయన కట్టే గొప్ప పీతాంబరము మణికట్లవరకు వ్యాపించియుండును. దాని పై నుండే మొలనూలు సరములు నితంబబింబమును అంటి పెట్టుకొని యుండును. శ్రీహరీ రూపమును ఈ విధముగా ధ్యానించవలెను.

       సకలభువనములకు ఆశ్రయమైన శ్రీహరియొక్క ఉదరమునం దుండే లోతైన బొడ్డునుండి సకలలోకముల రూపములోనున్న పద్మము ఆవిర్భవించగా దానియందు బ్రహ్మ ఉదయించెను. అట్టి నాభిని ధ్యానించ వలెను. ఆయన స్తనముల జంట పచ్చలను పోలియుండును. స్వచ్చమగు హారముల కాంతులచే అవి తెల్లగా ప్రకాశించును. వాటిని ధ్యానించవలెను.

       దేవశ్రేష్టుడగు శ్రీహరి సకలలోకములకు నమస్కరించ దగినవాడు. మహాలక్ష్మికి నివాసమగు ఆయన వక్షఃస్థలము ధ్యాతల మనస్సునకు - కళ్లకు ఆనందమును కలిగించును. ఆయన కంఠము తనయందు ధరించు * డిన కౌస్తుభమాణిక్యమునకు కూడ శోభను తెచ్చి పెట్టును. సాధకుడు అట్టి కంఠమును మనస్సులో ధ్యానించవలెను.

మందరపర్వతమును గిరగిర త్రిప్పినప్పుడు ఆయన బాహువురు లకు మెరుగు పెట్టబడెను. ఆయన బాహువులను లోకపాలకులు ఆశ్ర యించి తమ కార్యములను చేయుదురు. అనంతములగు ధారలు గల సుదర్శనచక్రముయొక్క తేజస్సును సహించుట సంభవము కాదు. శంఖము పద్మములవంటి ఆయన చేతులలో రాజహంసవలె ప్రకాశించును. వీటిని అన్నింటినీ ధ్యానించవలెను.

శత్రువీరుల రక్తపు అడుసుచే పూయబడిన కౌమోదకీగద ఈ శ్రీహరి భగవానునకు ప్రియమైనది. ఆయన కంఠమునందలి వనమాల చుట్టూ తుమ్మెదల గుంపులు ఝంకారమును చేయుచున్నవి. ఆయన మెడలోని కౌస్తుభమాణిక్యము స్వచ్చమగు జీవతత్త్వమే. వీటిని సాధకుడు ధ్యానించవలెను.

      శ్రీహరి తన భక్తులను అనుగ్రహించవలెననే అభిప్రాయముతో సాకారరూపమును ధరించినాడు. ఆయన ముఖపద్మము పొడవాటి ఎత్తైన ముక్కుతో ప్రకాశించును. ఊగిసలాడే మకరకుండలముల కాంతులచే ఆయన స్వచ్చమగు చెక్కిళ్లు అధికముగా ప్రకాశించును. ఆ ముఖమును ధ్యానించవలెను.

      సౌందర్యనిధానమగు శ్రీహరియొక్క ముఖపద్మము ఉట్టని గిర జాల జుట్టుతో కూడి పద్మములవంటి నేత్రములతో మరియు అందమగు కనుబొమలతో ప్రకాశించును. తుమ్మెదలచే చుట్టువారబడి రెండు చేపలకు ఆశ్రయమైన పద్మమును ఆ ముఖము తన శోభచే తిరస్కరించును. సాధకుడు సావధానుడై ఆ ముఖపద్మమును తన మనస్సులో నింపుకొని ధ్యానించవలెను.

     భగవానుని కన్నులనుండి అధికమగు దయతో నిండిన చూపు ప్రసరించుచుండును. అది భక్తులకు భయంకరమగు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక -ఆధిదైవికములనే మూడు విధముల తాపములనుండి శాంతిని చేకూర్చు ను. ఆ చూపులోని దయ ప్రేమతో నిండిన చిరునవ్వుచే ఎన్నో రెట్లు వర్ధిల్లు చుండును. ఆ చూపు భక్తులకు అతిశయించిన అనుగ్రహమును కలిగించును. సాధకుడు తన బుద్దిగుహయందు అతిశయించిన ప్రేమతో ఆ చూపును ధ్యానించవలెను.

      శ్రీహరియొక్క చిరునవ్వు భక్తులందరికి ఉత్కటమగు దుఃఖమువ లన కలిగే కన్నీటి సముద్రములను ఎండింపజేసి ఆనందమును కలిగించు ను. ఆ నవ్వును ధ్యానించవలెను. మన్మథుని మోహింపజేసి మహర్షులకు క్షేమమును కలిగించుట కొరకు మాత్రమే ఆయన తన మాయచే కనుబొ మల వలయమును నిర్మించినాడని ధ్యానము చేయవలెను.

శ్రీహరి బిగ్గరగా నవ్వినప్పుడు క్రింది పెదవియొక్క అతిశయించిన కాంతిచే మల్లెమొగ్గలవంటి సూక్ష్మమగు పలువరుసలు ఎర్రగా కానవచ్చును. సాధకుడు ధ్యానమునకు విషయమగు శ్రీహరిని తన దేహములోని హృదయాకాశములో ప్రత్యక్షము చేసుకొని ఆ నవ్వును ధ్యానించవలెను. సాధకుడు ప్రేమరసముతో నిండిన మనస్సును శ్రీహరికి సమర్పించవలె ను. శ్రీహరికంటే భిన్నమైనదానిని దేనినైననూ చూడగోరరాదు.

ఈ విధముగా శ్రీహరి భగవానునియందు ప్రేమాతిశయము గల సాధకుని హృదయము భక్తీచే ద్రవించి ఆనందముతో శరీరమంతటా రోమాంచము కలుగును. అతిశయించిన హర్షముచే కన్నీరు స్రవించి ఆతని దేహమును పలుమార్లు తడుపును. అంతవరకు ఆతని మనస్సు చేపను పట్టే గాలము వలే శ్రీహరిని దగ్గరకు తెచ్చినది. అపుడాతడు మెల్లగా ఆ మనస్సును కూడ ధ్యేయవస్తువునుండి ఉపసంహరించును.

     సాధకుడు ధ్యానమును చేయుచుండగా ఒకానొక కాలములో మన స్సునకు అహంకారరూపమగు ఆశ్రయము, విశిష్టమగు ధ్యేయవిషయము లేకుండా పోవును. వైరాగ్యపూర్ణమగు అట్టి సాధకుని మనస్సు ను నే అయి పోయిన దీపజ్వాలవలె తన మూలమగు ఆత్మయందు విలీనమగును. ఆ స్థితిలో సాధకుడు సత్త్వరజస్తమోగుణముల ప్రవాహరూపమగు దేహాది ఉపాధియొక్క తాదాత్మ్యరూపమైన బంధమునుండి విముక్తుడగును. అపు డాతడు ధ్యాత; ధ్యేయము అనే విభాగము లేని అఖండమగు ఆత్మత త్వమే సర్వమునకు అధిష్టానముగా నున్నదని దర్శించును.

      ఆత్మతత్త్వమును ప్రత్యక్షము చేసుకున్న జ్ఞానికి మనస్సునందలి అవిద్య తొలగిపోవుటచే, ఆతడు సుఖదుఃఖములకు అతీతమైన తన బ్రహ్మ స్వరూపమునందు నిష్ఠను కలిగియుండును. ఆతని మనస్సు తన మూల మగు ఆత్మయందు విలీనమగును. ఒకప్పుడు ఆతడు అవిద్యచే తాను సుఖదుఃఖముల భోక్తనని భావించెడి వాడు. కాని, భోక్త అహంకారము మాత్రమేననియు, ఆ అహంకారము కూడ మిథ్యయేననియు ఆతడు ఇప్పుడు యెరుంగును.

      ఆత్మజ్ఞానమును పొంది కృతార్థుడైన జ్ఞానికి ఇది ఆఖరు జన్మ. మద్యముయొక్క నిషాలో కన్ను గానని వానికి తన నడుము చుట్టూ వస్త్రము ఉన్నదా, ఊడినదా అను దృష్టి ఉండదు. అదే విధముగా, ఆ జ్ఞానికి తన ఈ దేహము కూర్చున్నా, నిలబడినా, ప్రారబ్దవశముచే ఎక్కడి కైనా వెళ్లినా, తిరిగి వచ్చినా, ఆత్మజ్ఞాననిష్ఠయందున్నవాడగుటచే ఆయన పెద్దగా పట్టించుకోడు.

ఇంద్రియములతో, ప్రాణాపానాది ప్రాణవృత్తులతో కూడియున్న ఈ దేహము తనకు జన్మనిచ్చిన ప్రారబ్ధకర్మయొక్క శేషము ఉన్నంత వర కు, ఆ కర్మయొక్క ప్రభావముచే జీవించియే యుండును. కాని, ఆత్మస్వ రూపమును తెలిసి ఆ ఆత్మజ్ఞానమునందు పరినిష్ఠితుడై యున్న యోగి ధనము బంధువర్గము మొదలగు వాటితో సంబంధమును కలిగియున్న ఇట్టి దేహమును మరల పొందడు. వాస్తవముగా ఈ దేహమైననూ స్వప్నప దార్థము వలె మిథ్య మాత్రమే.


 మానవుడు తన పుత్రునియందు, ధనమునందు తానే అన్న భావ మును కలిగియుండును. కాని, వాస్తవములో వాటికంటే భిన్నముగా కానవ చ్చుచునే యున్నాడు. అదే విధముగా క్షేత్రజ్ఞుడగు పురుషుడు (పూర్ణమగు ఆత్మ) దేహాదులే యన్నట్లు భ్రమ ఉన్ననూ, వాస్తవములో ఆత్మ దేహాదుల కంటే విలక్షణమైనది.

మండే కట్టేయొక్క మంట, మంట ఆరినా ఉండే నిప్పు, మిణుగు రులు, పొగ అనునవి అగ్నినుండి పుట్టినవే. అవి అన్నీ అగ్నిగనే పరిగణించ బడుచున్నవి. కాని, వాస్తవములో అగ్ని వీటికంటే విలక్షణముగా నున్నది.

అదే విధముగా పాంచభౌతిక దేహము ఇంద్రియములు అంతఃకర ణము అనువాటిని దర్శించే ఆత్మచైతన్యము వాటికంటే విలక్షణము. బ్రహ్మయని పిలువబడే భగవానుడు ప్రకృతికంటే విలక్షణుడు.

పంచభూతముల కార్యములగు ఘటాదులను పరిశీలించినచో, అవి వాస్తవములో పంచభూతములేనని స్పష్టమగును. అదే విధముగా, జ్ఞాని సకలపదార్థములు ఆత్మస్వరూపుడగు తనయందే గలవనియు, ఆత్మ రూపుడగు తాను సకలపదార్థములయందు వ్యాపించియున్నాననియు తెలుసుకోనును.

తేజస్సు ఒక్కటియే. కానీ, అది ప్రకటమయ్యే కట్టె మొదలగు వాటి యందు పొట్టి పొడవు మొదలగు హెచ్చుతగ్గులుండుటచే, తేజస్సు (అగ్ని) అనేకరకములుగా నున్నట్లు భాసించును. అదే విధముగా, బ్రహ్మ-ఆత్మ ఒక్కటియే. కాని, అది అభివ్యక్తమయ్యే ప్రకృతికార్యములగు దేహాదుల యందు సత్త్వరజస్తమోగుణముల పాళ్లలో హెచ్చుతగ్గులు ఉన్నవి. కావున నే, వివిధములగు ఉపాధులలో ఆత్మ భిన్నమా యన్నట్లు కానవచ్చును.

ఈ ప్రకృతి భగవానుని మాయాశక్తియే. ఇదియే కార్యకారణముల రూపముగా పరిణమించి జీవుని మోహింపజేయుచున్నది. కావున, భక్తుడు దీనిని త్రోసిపుచ్చి తన బ్రహ్మ-ఆత్మస్వరూపమునందు ప్రతిష్ఠితుడై యుండవలెను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).