శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

1 - విదుర - ఉద్ధవ సంవాదము

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! పూర్వము సకలసంపదలతో కూడియున్న తన ఇంటిని విడిచి పెట్టి అడవికి వెళ్లిన విదు రుడు, ఇదే విషయమును నీవు ఇప్పుడు నన్ను ప్రశ్నించిన విధముగానే, భగవాన్ మైత్రేయుని ప్రశ్నించినాడు.

సర్వజగన్నాథుడగు ఈ శ్రీకృష్ణ భగవానుడు మీకు రాయబారియై పౌరవరాజగు దుర్యోధనుని వద్దకు వెళ్లిన సమయములో వాని ఇంటికి వెళ్ల కుండగా, విదురుని ఇల్లు తనదిగనే భావించి అచటకు వెళ్లియుండెను.

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ శుకమహర్షీ! విదురుడు పూజ్యుడగు మైత్రేయుని ఎక్కడ కలుసుకొనెను? వారిద్దరికి సంభాషణము ఏ సమయములో జరిగినది? ఈ విషయమును మాకు వర్ణించి చెప్పుము.

స్వచ్చమగు అంతఃకరణము గల విదురుడు మహాత్ముడగు మైత్రేయునకు వేసిన ప్రశ్న, విషయములో గాని ప్రయోజనము దృష్ట్యా గాని, అల్పమైనది అయి ఉండదు. ఏలయనగా, మహాత్ముల చరితమును గురించిన ఆ ప్రశ్న మహిమాన్వితమైనది. మైత్రేయుడు బాగు బాగు అని ప్రశంసించి, ఆ ప్రశ్నను వర్ధిల్లజేసినాడు.

సూతుడిట్లు పలికెను --- పరీక్షిన్మహారాజు ఈ విధముగా ప్రశ్నిం చగా, అటువంటి సర్వజ్ఞుడగు శుకమహర్షి మిక్కిలి సంతసించినవాడై, వినుము అని హెచ్చరించి, ఇట్లు బదులు చెప్పెను.

 శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఇది ఒకనాటి మాట. ధృతరాష్ట్ర మహారాజునకు కన్ను చూపుతో బోటు వివేకము కూడ లేదు. ఆయన తన కుమారులగు దుర్యోధనుడు మొదలగు దుష్టుల అన్యాయప్రవృత్తిని సమ ర్థించెడివాడు. ఆయన చిన్న తమ్ముడు పాండుమహారాజు. పాండుపుత్రు లగు ధర్మరాజు మొదలగువారు తండ్రిని కోల్పోయిరి. ఆ ధృతరాష్ట్రుడు వారిని లక్క ఇంటిలో ప్రవేశ పెట్టి దానిని తగులబెట్టించెను.

ఆ కాలములో కౌరవవంశ చక్రవర్తియగు ధర్మరాజుయొక్క పట్టపు రాణి, ధృతరాష్ట్ర మహారాజునకు కోడలు అగు ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకొని లాగేను. వక్షఃస్థలమునందలి కుంకుమ కన్నీ టితో కడిగి వేయబడునట్లుగా ఆమె ఏడ్చెను. కాని, నిందించదగిన ఆ తన పుత్రుని చేష్టను ధృతరాష్ట్ర మహారాజు అడ్డుకొనలేదు.

ఆ కాలములో సత్పురుషుడగు ధర్మరాజును దుర్యోధనాదులు అన్యాయముగా జూదములో ఓడించిరి. సత్యనిష్ఠ గల ధర్మరాజు ప్రతిజ్ఞను పాటిస్తూ వనవాసమును చేసి గడవు పూర్తి అయిన తరువాత మరలి వచ్చెను. చేసిన ప్రతిజ్ఞ ప్రకారముగా తన తండ్రి పాలించిన రాజ్యములో తనకు రావలసిన భాగమును ఇమ్మని ఆ అజాతశత్రుడు ప్రార్థించెను. కాని, అధ ర్మమునందు రమించే దుర్యోధనుడు ఈయలేదు.

మరియు ఆ కాలములో ధర్మరాజు పంపగా జగద్గురువగు శ్రీకృ ష్ణుడు కౌరవుల సభకు వెళ్లి హితమును పలికెను. ఆయన మాటలు భీష్ముడు మొదలగు వారికి అమృతనిధానములుగా భాసించగా, దుర్యోధన మహారాజు, తనకు గల కొద్దిపాటి పుణ్యము కూడ నశించి యుండుటచే, ఆ మాటలకు లేశమైననూ విలువనీయలేదు.

ఆ కాలములో ధృతరాష్ట్ర మహారాజు సలహా కొరకై విదురుని కొరకు కబురు పెట్టెను. అప్పుడు రాజనీతిజ్ఞులలో శ్రేష్ఠుడగు విదురుడు అన్నగారి వద్దకు వెళ్లి ధర్మమును బోధించెను. ఆ బోధను నీతిశాస్త్రవేత్తలు విదురనీతి అని వ్యవహరించుచున్నారు.

 (విదురుడు ఇట్లు పలికెను ---) నీవు చేసిన అపరాధమును సహించుట చాల కష్టము. అయిననూ, అజాతశత్రువగు ధర్మరాజు సహిం చుచున్నాడు. ఆయన వాటాను ఆయనకు ఇమ్ము. ఆయన వద్ద తమ్ములతో గూడియున్న భీముడు అనే సర్పము గలదు. అది కోపముతో బుసలు కొట్టుచున్నది. నీవు భీముని వలన చాల భయపడెదవు గదా!

మోక్షప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుడు పాండవులను రక్షించే పూచీని తాను స్వీకరించినాడు. బ్రాహ్మణులను రక్షించే ఆ ప్రభుడు తన ద్వారకానగరములో యదువీరులచే ఆరాధింపబడుతూ మకాము చేసియు న్నాడు. ఆయన రాజులనందరినీ జయించిన ప్రభుడు.

పాపమే దుర్యోధనుని మూర్తిని దాల్చి నీ ఇంటిలో ప్రవేశించి పర మపురుషుడగు శ్రీకృష్ణ భగవానుని ద్వేషించుచున్నది. నీవు శ్రీకృష్ణుని నుండి విముఖుడవై ఆ పాపమూర్తియగు దుర్యోధనునియందు పుత్రప్రేమ గలవాడవై వానిని పోషించుచున్నావు. ఆ కారణముగానే నీ సంపద తొలగి పోవుచున్నది. నీవు వంశముయొక్క క్షేమమును కోరువాడవైనచో, వెంటనే దుర్బుద్ధియగు దుర్యోధనుని పరిత్యజించుము.

విదురుని స్వభావము అందరు కోరదగినది. కాని, ఆయన మాటలను విని దుర్యోధనుని కోపము పెచ్చరిల్లెను. ఆతని క్రింది పెదవి కోపముతో వణకుచుండెను. అపుడాతడు కర్ణునితో, తన తమ్ముడ ఏ దుశ్శాసనునితో మరియు శకునితో కూడినవాడై, విదురుని అవమనిస్తూ ఈ విధముగా పలికెను.

దాసీపుత్రుడగు ఈ విదురుడు కుటిలుడు. వీనిని ఇచటకు ఎవడు రప్పించినాడు? వీడు నా అన్నమును తిని శరీరమును పోషించుకుంటూ నాకు ప్రతికూలుడై, నా శత్రువుల కొమ్ము కాయుచున్నాడు. వీనిని ప్రాణములతో విడిచి పెట్టెదను. కాని, వీనిని వెంటనే నగరమునుండి బహిష్కరించుడు.

దుర్యోధనుడు ఈ విధముగా ధృతరాష్ట్రుని యెదుటనే విదురుని మిక్కిలి కరములగు వచనములతో నిందించెను. ఆ మాటలు ఆయన చెవికి బాణములవలే సోకెను. ఈ విధముగా మర్మభేదకములగు వచనము లను విని కూడా, ఆయన భగవానుని మాయాశక్తి చాల గొప్పది అని తల పోసెనే గాని, దుఃఖమును పొందలేదు. ఆయన తన ధనస్సును రాజద్వారము వద్ద ఉంచి, వెళ్లిపోయెను.

కౌరవులు చేసుకున్న పుణ్యప్రభావముచే వారికి విదురుడు లభించెను. కాని, ఇపుడాయన హస్తినాపురమునుండి బయల్వెడలి పుణ్యమును సంపాదించ గోరువాడై, భూమియందు గల శ్రీహరియొక్క క్షేత్రములకు పయనమాయెను. గంగ మొదలగు తీర్థములు ఆ శ్రీహరి పాదములనుండి జన్మించినవి. ఆయన ఆయా క్షేత్రములలో అనేకరూపములలో విరాజిల్లు చున్నాడు.

విదురుడు అనంతభగవానుని మూర్తులచే అలంకరింపబడియున్న నగరములకు, పవిత్రములగు ఉద్యానములకు, పర్వతములకు, పొదరిళ్లకు మరియు తీర్థప్రదేశములకు ఒంటరిగా యాత్రను చేసెను. ఆయన స్వచ్చ మైన నీటితో ప్రకాశించే నదులలో మరియు సరస్సులలో పుణ్యస్నానము లను చేసెను.

విదురుడు తీర్థయాత్రలను చేయునప్పుడు చెట్లనుండి రాలిన పళ్లు మొదలగు పవిత్రమగు ఆహారమును మాత్రమే భుజించెడివాడు. బంధువులు గుర్తుపట్టలేని విధముగా ఆయన అవధూతవేషములో నుండే ను. ఆయన తీర్థములన్నింటియందు మూడు పూటలా స్నానమును చేసెడి వాడు. ఆయన దేహమును అలంకరించే ప్రయత్నమును చేసెడివాడు కాదు. ఆయన నేలపై నిద్రిస్తూ, శ్రీహరిని సంతోష పెట్టే వ్రతములను పాలించెడి వాడు.

ఈ విధముగా విదురుడు భారతదేశమంతటా తీర్థయాత్రలను చేయుచూ కొంత కాలమునకు ప్రభాసతీర్థమును చేరెను. అప్పటికి ధర్మ రాజు శ్రీకృష్ణుని అనుగ్రహము వలన రాజ్యాధికారమును పొందినవాడై అఖండమగు భూమండలమును ఏకచ్ఛత్రాధిపతియై పాలించుచుండెను.

అడవిలో వేదురుడొంకలలో రాపిడిచే పుట్టిన అగ్ని వలన అడవి అంతా తగులబడిన విధముగా అన్యోన్యకలహముచే కురువంశము నాశన మయ్యేను. ఆ వృత్తాంతమును విదురుడు ప్రభాస తీర్థమునందుండగా విని చాల దుఃఖించినవాడై ఏమియు మాటలాడకుండగా సరస్వతీనదీతీరము నకు వెళ్లాను.

విదురుడు సరస్వతీనదీతీరమునందు త్రితుడు, ఉశనసుడు, మనువు, పృథువు, అగ్ని, అసితుడు, వాయుదేవుడు, సుదాసుడు, గోవులు, గుహుడు, శ్రాద్ధదేవుడు అను పేర్లతో ప్రసిద్ధిని చెందిన తీర్థములను సేవించేను.

ఇంతేగాక, ఈ లోకములో మహర్షులు మరియు దేవతలు ప్రతిష్టిం చిన శ్రీమహావిష్ణువుయొక్క ఆలయములను పెక్కింటిని విదురుడు సేవించెను. భగవానుని ఆయుధములలో ప్రముఖమగు చక్రము ఆ ఆలయశిఖర ములను అలంకరించి యుండును. వాటిని చూడగనే జనులు శ్రీకృష్ణుని స్మరించుచుందురు.

తరువాత విదురుడు సమృద్ధమగు సౌరాష్ట్రమును, సౌవీర మత్స్య కురుజాంగల ప్రాంతములను కూడ దాటివెళ్లి కొంతకాలమునకు యమునా నదీతీరమును చేరుకొని, అచట భగవద్భక్తుడగు ఉద్ధవుని దర్శించెను.

 

మిక్కిలి శాంతస్వభావము గల ఉద్దవుడు శ్రీకృష్ణభగవానుని అను చరులలో ప్రసిద్ధిని గాంచినవాడు. ఆయన ఒకప్పుడు బృహస్పతి వద్ద శిష్యునిగా నుండెడివాడు. విదురుడు ఆయనను ప్రేమతో గట్టిగా కౌగిలిం చుకొని శ్రీకృష్ణభగవానుని పుత్రపౌత్రాదులు మరియు ఆశ్రితులు అగు తన బంధువుల క్షేమసమాచారమును గురించి ప్రశ్నించెను.

శ్రీమహవిష్ణువుయొక్క నాభికమలమునందు జన్మించిన బ్రహ్మ గారు ప్రార్థించగా, పురాణపురుషులగు బలరామకృష్ణులు ఈ లోకము నందు అవతరించి యున్నారు గదా! వారు భూభారమును తగ్గించి లోక మునకు క్షేమమును కలిగించినారు. వారికి ఇప్పటికి కొంత అవకాశము లభించినది. వారు వసుదేవుని గృహములో అందరికీ ఆనందమును కలి గిస్తూ క్షేమముగా నున్నారా?

ఓ మిత్రమా! మా కురువంశీయులకు గొప్ప స్నేహితుడు, పూజ్యుడు అగు వసుదేవుడు సుఖముగా నున్నాడా? ఆయన చాల ఉదారుడు. తన తోబుట్టువులను, వారి భర్తలను తండ్రివలెనే చూచెడివాడు. ఆయన వారికి అభీష్టములగు వస్తువులను ఇచ్చి సంతోష పెట్టెడివాడు.

ఓ మిత్రమా! యాదవ సేనానాయకుడు, వీరుడు అగు ప్రద్యు మ్నుడు సుఖముగానున్నాడా? ఆయన పూర్వజన్మలో మన్మథుడు. రుక్మిణి బ్రాహ్మణులనారాధించి భగవానునినుండి ఆతనిని పుత్రునిగా బడసెను.

సాత్వత, వృష్టి, భోజ, దాశార్హ వంశములకు చెందిన యాదవులకు అధిపతియగు ఆ ఉగ్రసేన మహారాజు సుఖముగా నున్నాడా? ఆయన రాజ్యాధికారమునందలి ఆశను పూర్తిగా విడిచి పెట్టి యుండగా, పద్మపు రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడు ఆయనను మహారాజుగా అభిషేకించినాడు.

ఓ ప్రసన్నమగు మనస్సు గల ఉద్ధవా! సాంబుడు శ్రీకృష్ణభగవానునకు అనురూపమైన పుత్రుడు. రథికులలో అగ్రేసరుడగు ఆ సాంబుడు శ్రీకృష్ణునితో సమానమగు పరాక్రమము గలవాడు. పూర్వజన్మలో ఆయన సాక్షాత్తుగా పార్వతీపుత్రుడగు భగవాన్ కుమారస్వామి. ఆయనను జాంబ వతి కఠినములగు వ్రతములను సలిపి పుత్రునిగా బడసినది. ఆయన కుశలముగా నున్నాడా?

సాత్యకి క్షేమముగా నున్నాడా? ఆయన ధనుర్వేదరహస్యము లను. అర్జునుని వద్ద అభ్యసించినాడు. ఆయన శ్రీకృష్ణభగవానుని సేవించి, కేవలము ఆ సేవయొక్క ప్రభావముచే యతులకు కూడ పొందుటకు కష్ణ మైన భాగవత (భగవద్భక్త) స్థితిని తేలికగా పొందినాడు.

విద్వాంసుడు, పాపమునెరుంగనివాడు, భగవంతుని శరణు పొందినవాడు, శ్వఫల్కుని పుత్రుడు అగు అక్రూరుడు కుశలముగా నున్నాడా? ఆయన మార్గమునందలి ధూళియందు శ్రీకృష్ణభగవానుని కాలిగుర్తులను చూచి అతిశయించిన భక్తిచే మనోధైర్యమును కోల్పోయినవాడై ఆ ధూళి యందు పొరలాడినాడు.

భోజవంశీయుడైన దేవకుని పుత్రికయగు దేవకి కుశలముగా నున్నదా? ఆమె శ్రీమహావిష్ణువును సంతానముగా పొందిన దేవమాత అదితి వంటిది. వేదము తనలో విస్తారమగు యజ్ఞప్రక్రియను నిరూపించే జ్ఞానమును కలిగియున్న విధముగా, ఆమె తన గర్భమునందు భగవానుని ధరించినది.

అనిరుద్ధ భగవానుడు సుఖముగా నున్నాడా? ఆయన భక్తుల మరియు యదువంశీయుల కోరికలను పూర్తి చేయువాడు. ఆయనయే వేద ములను ఆవిర్భవింప జేసినవాడనియు, శ్రీమహావిష్ణువుయొక్క నాల్గవ అంశ అనియు మహాత్ములు వర్ణించుచున్నారు. వాక్కునకు మూలము, చిత్తము అహంకారము బుద్ధి మరియు మనస్సు అనే నాలుగింటి సమాహారము అగు అంతఃకరణములో నాల్గవ అంశము అగు మనస్సునకు ఆయన అధిష్టాన దైవము.

ఓ ఉద్దవా! హృదీకుడు, సత్యభామాతనయుడగు చారుదేష్ణుడు, గదుడు మొదలగు ఇతరులు కూడ కుశలముగా సంచరించుచున్నారా? వారు తమ హృదయేశ్వరుడగు (తమ ఆత్మరూపునిగా ప్రకాశించే) శ్రీకృష్ణుని అనన్యమగు (భేదభావన లేని) ప్రేమతో (ఏకాంత భక్తితో) చక్కగా అనుసరించుచుందురు.

ధర్మరాజునకు శ్రీకృష్ణార్జునులు రెండు భుజములవంటి వారు. ఆయన వారి సహాయముతో ధర్మబద్దముగా పాలిస్తూ లోకమర్యాదను నిల బెట్టుచున్నాడా? ఆయనకు కలుగుచున్న విజయముల పరంపరను, ఆయనకు మయుడు కట్టి ఇచ్చిన సభలో ప్రకటమైన సామ్రాజ్య వైభవమును, ఆ వైభవమునకు మూలములోనున్న అర్జునుని సేవను చూచి, దుర్యోధనుడు అసూయతో చాల దుఃఖముననుభవించెను.

భీముడు అపరాధమును చేసినవారియందు తీవ్రమగు అసహ నము గలవాడు. ఆతని కోపము పాము కోపము వలె చాల కాలము వరకు కొనసాగును. ఆతడు అట్టి కోపమును విడిచి పెట్టినాడా, లేదా? ఆతడు యుద్ధరంగములో గదను రకరకములుగా త్రిప్పుతూ సంచరిస్తూ ఉంటే, ఆతని పాదముల తాకిడిని భూమి సహించలేక పోయేడిది.

అర్జునుడు మహారథులలో మరియు సేనానాయకులలో గొప్పవా నిగా కీర్తిని గడించినాడు. అతడు శత్రువులను నిర్మూలించి ఇప్పుడు ప్రశాం తముగ నున్నాడా? కైలాసపతియగు శివుడు గుర్తు పట్టుటకు వీలులేని విధ ముగా మాయచే కిరాతవేషమును దాల్చి రాగా, ఆతడు ఆయనను తన బాణములతో కప్పివేసెను. ఆ కారణముగా, శివుడు ఆతని విషయములో చాల సంతోషించెను.

కవల బిడ్డలగు నకుల సహదేవులను కుంతియే పెంచి పోషించినది. కుంతియొక్క పుత్రులగు ధర్మరాజు, భీముడు మరియు అర్జునుడు వారిద్దరిని కంటికి రెప్పల వలె కాపాడెడివారు. గరుడపక్షుల జంట ఇంద్రుని వద్దనుండి అమృతమును లాగుకున్న విధముగా, వారిద్దరు శత్రువగు దుర్యోధనుని వద్దనుండి రాజ్యములో తమ వాటాను లాగుకొని, సుఖముగా రమించుచున్నారా?

రాజర్షులలో శ్రేష్టుడగు పాండుమహారాజు లేకున్ననూ పిల్లల కొరకై కుంతి ప్రాణములను ధరించియుండుట చాల కొనియాడ దగినది. ఆ పాండు మహారాజు సాటిలేని వీరుడు మరియు రథయుద్ధమును చేయువా రిలో శ్రేష్టుడు. ఆయన తన ధనస్సును మాత్రమే తోడుగా చేసుకొని, నాలుగు దిక్కులను జయించెను.

సౌమ్యమగు స్వభావము గల ఓ ఉద్ధవా! మరణించిన సోదరునకు ద్రోహమును చేసి పాపమును మూటగట్టుకున్న ధృతరాష్ట్రుని గురించి నేను అధికముగా శోకించుచున్నాను. ఆయన కొడుకులు చెప్పిన మాటను అనుసరించుటయే వ్రతముగా పెట్టుకొని, తన హితమును గోరే నన్ను తన నగరమునుండి పంపించి వేసినాడు.

నాకు ఈ విషయములో ఆశ్చర్యము గాని, ఖేదము గాని లేదు. ఏలయనగా, జగన్నియంతయగు శ్రీహరి మానవాకారమును దాల్చి శ్రీకృ ష్ణుడై మానవుల మనోవృత్తులకు భ్రమను కలిగించుచున్నాడు. కాని, నేను ఆయన అనుగ్రహముచే ఆయన మహిమను గాంచుచూ, ఇతరులచే తెలి యబడని వాడనై ఈ భూలోకములో సంచరించుచున్నాను.

కొందరు రాజులు తమ ధనవిద్యాకులములను చూచుకొని గర్వించినవారై, తమ సేనలను నడిపించి భూమండలమును పలుమార్లు కంపింపజేసెడివారు. భగవానుడు వారిని వధింపజేసి, తనను శరణు జొచ్చి. న పాండవులు మొదలగువారి కష్టములను తొలగించగోరెను. కావుననే, ఆయన అపరాధమును చేసిన కౌరవులను అక్కడికక్కడే శిక్షించగల్గిననూ, ఉపేక్షించినాడు. ఇది నిశ్చయము.

ఓ ఉద్దవా! పరమేశ్వరునకు పుట్టుక లేదు. కానీ, ఆయన ధర్మమా ర్గమును తప్పినవారిని నిగ్రహించుట కొరకై అవతరించును. ఆయన కర్త కాడు. కాని, ఆయన మానవులను తనవైపు త్రిప్పుకొనుట కొరకై, అనగా, లోకసంగ్రహము కొరకై, కర్మలను చేయును. అట్లు కానిచో, సత్త్వరజస్తమో గుణాత్మకమగు సంసారమునకు అతీతుడగు జ్ఞాని ఎవ్వరైననూ కర్మకు వశమైయుండే దేహసంబంధమునకు అర్హుడు అగునా? కాడు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే విదురోద్ధవసంవాదే ప్రథమోధ్యాయః ॥

ఓ మిత్రుడా! ఇంద్రుడు మొదలగు లోకపాలకులు అందరు ఆ భగ వానుని ఆజ్ఞను అనుసరించి పని చేయుచుందురు. వారు శరణు పొందగా, వారి కార్యమును సాధించి పెట్టుట కొరకై జన్మలేని భగవానుడు యదువం శములో జన్మించినాడు. ఆయనను కీర్తించినవారు పవిత్రులగుదురు. ఆయన వృత్తాంతమును చెప్పుము.

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో విదుర-ఉద్దవసంవాదమునందు మొదటి అధ్యాయము ముగిసినది.