శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
7 - విదురుని ప్రశ్న
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విద్వాంసుడు, వ్యాసనందనుడు అగు విదురుడు మైత్రేయుని ఈ వచనములను విని, తన పలుకు లతో ఆయనకు ముదమును గొల్పుతూ ఇట్లు పలికెను.
ఓ మహాత్మా! భగవానుడు శుద్ధచైతన్యమే స్వరూపముగా గలవా డు. ఆయనయందు వికారములేమియు లేవు. ఆయన నిర్గుణుడు. అట్టి భగ వానునకు , లీలామాత్రముగానైననూ గుణములతో మరియు క్రియలతో సంబంధము ఎట్లు పొసగును?
పిల్లలకు ఆటలయందు ప్రీతి ఉండును. వారు ఆటవస్తువులను ముందు వేసుకొని, లేదా మరికొందరు పిల్లలతో కలిసి ఆడుకొనే యత్నములో మునిగియుందురు. కాని, భగవానుడు ఆత్మతృప్తుడు. ఆయనకు ఆడుకొనుటకై తనకంటే భిన్నముగా ఇతరవస్తువులు గానీ, ఇతరవ్యక్తులు గాని లేరు. అట్టి అసంగునకు ఆటలాడుటయందు కోరిక, దానిని అనుసరించి ప్రయత్నము, ఇతరములగు క్రీడోపకరణములయందు మరియు వ్యక్తులయందు ప్రవృత్తి ఎట్లు పొసగును?
భగవానుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు తన మాయాశక్తిని ఆసరాగా చేసుకొని ఈ జగత్తును సృష్టించినాడు; ఆ శక్తితోనే దీనిని పాలిం చుచున్నాడు; మరల ఆయన ప్రళయమునందు దీనిని తనలోనికి ఉపసం హరించగలడు.
భగవానుడు నిర్విశేష జ్ఞానస్వరూపుడు. ఆయన స్వరూపముగు జ్ఞానమునందు దేశముచే గాని, కాలముచే గాని, జాగ్రత్తు మొదలగు అవ స్థచే గాని, తనంత తానుగా గాని, మరియొక నిమిత్తముచే గాని, లోపము కలుగదు. అట్టి భగవానునకు అవిద్యతో సంయోగము ఎట్లు పొసగును?
అద్వితీయుడగు భగవానుడు మాత్రమే దేహములన్నింటియందు క్షేత్రజ్ఞుని రూపములో ఉన్నాడు గదా! అట్టి స్థితిలో ఈ క్షేత్రజ్ఞుడు ఆనందమునకు దూరుడై కర్మలతో క్లేశముననుభవించుటకు కారణమేమి?
ఓ ప్రభూ! నీవు విద్వాంసుడవు. నా మనస్సు అజ్ఞానము అనే ఈ సంకటములో పడి చాల భేదముననుభవించుచున్నది. నీవు ఈ పెద్ద మానసిక దోషమును దూరము చేయుము.
శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను -- తత్త్వమును తెలియగోరే విదురుడు ఈ విధముగా ప్రేరేపించగా, అహంకారము లేని ఆ మైత్రేయుడు భగవంతుని స్మరించి చిరునవ్వుతో ఇట్లు సమాధానమును చెప్పెను.
మైత్రేయుడు ఇట్లు పలికెను --- నిత్యముక్తుడగు ఈశ్వరుడు జీవ రూపములో బద్ధుడై దీనుడై ఉండుట అనే ఈ యుక్తవిరుద్ధమగు స్థితి భగ వానుని ఆ మాయ మాత్రమే.
ఈ మానవునకు స్వప్నములో తన తల తెగినట్లుగా కానవచ్చును. కాని, అది యథార్థము కాదు. అదే విధముగా, ఈ మానవునకు తాను బద్ధుడు కాకున్ననూ, బద్ధుడనైతిని అని తన స్వరూపమునకు భిన్నముగా భాసించును. అది అజ్ఞానకల్పితము మాత్రమే.
నీటిలో చంద్రుడు ప్రతిఫలించినప్పుడు ఆ నీటికి గల కదలిక మొదలగు గుణములు, ఆ చంద్రునియందు వాస్తవముగా లేకున్ననూ, ఉన్నట్లు కన్పట్టును. అదే విధముగా దృక్ స్వరూపమగు ఆత్మయందు దేహము మొదలగు అనాత్మల గుణములు వాస్తవముగా లేకున్ననూ, ఉన్నట్లు కానవచ్చుచున్నవి.
జిజ్ఞాసువు క్రియలనుండి (కర్తృత్వమునుండి) ఉపరతిని చెంది, వాసుదేవుని అనుగ్రహమును బడసి, ఆ భగవానునియందు భక్తిని చేసిన నాడు, ఆత్మయందు అనాత్మధర్మముల ఆ అధ్యాస మెల్లగా, కాని నిశ్చిత ముగా దూరమగును.
మానవుని చిత్తములో అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభీని వేశము అనే క్లేశములు (మలములు) గలవు, ఏ కాలములో ఇంద్రియ ములు సంసారమునుండి విరమించి ద్రష్టయగు - జీవుని స్వరూపమైన శ్రీహరి పరమాత్మయందు విలీనమగునో, అదే క్షణములో మానవుని క్లేశ ములు, గాఢనిద్రలో నున్నవానికి వలే, నాశమును పొందును.
మురారి గుణములను కీర్తించుట, వినుట వలన క్లేశములన్నియు శాంతించును. ఇట్టి స్థితిలో, మనస్సునకు ఆయన పాదపద్మములను సేవిం చుటయందు ప్రీతి యేర్పడినచో, ఇక చెప్పునదేమున్నది?
ఓ ప్రభూ! నీ పలుకులు అనే చురకత్తి నా సందేహములను ఛేదిం చివేసినది. ఓ పూజ్యా! ఈశ్వరుని స్వతంత్రత, జీవుని పరతంత్రత మరియు కల్పితమగు బంధము, నిత్యమగు మోక్షము అనే రెండు అంశముల యందు ఇప్పుడు నా మనస్సు చక్కగా ప్రవేశించుచున్నది; అనగా, విరో ధాభాసలతో ఇబ్బంది పడుట లేదు.
ఓ విద్వాంసుడా! నీవు చక్కగా చెప్పితివి. మానవునకు తనలో భాసించే క్లేశములు మొదలగు వాటికి శ్రీహరియొక్క మాయయే కారణము. ఆత్మకంటే భిన్నము కాని జగత్తు భిన్నముగా నున్నట్లు, మిధ్యాభూత మగు జగత్తు యథార్థమా యన్నట్లు భాసించుటకు మూలములో జీవుని ఆ అజ్ఞానమే ఉన్నది.
ఈ లోకములో పరమమూర్ఖుడు మరియు బుద్దికి అతీతమగు ఆత్మయొక్క సాక్షాత్కారము గల జ్ఞాని అనే ఇద్దరు సుఖముగా వర్ధిల్లుచు న్నారు. ఈ రెండు అవస్థలకు మధ్యలో సంశయముతో వ్రేలాడే జనులు మాత్రము క్లేశముల ననుభవించుచున్నారు.
అనాత్మ (ఆత్మ కానిది) వస్తువు (యథార్థమగు ఉనికి గలది) కాదు. అయిననూ, అది వస్తువు వలే కనబడుచున్నది. నేను మీ పాదము లను సేవించి, దాని ప్రభావముచే ఈ ప్రతీతిని కూడ తొలగించుకొనెదను.
నీ పాదములను సేవించుటచే, నిర్వికారుడు మరియు మధు అనే రాక్షసుని (సంసారమునందలి ఆసక్తిని) దునుమాడినవాడు అగు శ్రీహరి భగవానుని పాదములయందు తీవ్రమగు ప్రేమ కలిగి, ఆ ప్రేమ ఉత్సవ ముగా వర్ధిల్లి, క్లేశములు దూరమగును.
మహాత్ములు శ్రీహరిని చేరే మార్గము వంటి వారు. చిన్న తపస్సును చేసిన వారికి వారి సేవ దుర్లభము. వారి సన్నిధిలో ఎల్లవేళలా దేవదేవుడగు జనార్ధనుడు కీర్తింపబడుచుండును.
సర్వతత్త్వములను వ్యాపించియుండే భగవానుడు సృష్ట్యాది యందు పంచభూతములు మొదలగు వికారములతో గూడిన మహత్త త్వము మొదలగు వాటిని సృష్టించి, వాటి అంశలతో విరాట్ పురుషుని ప్రక టింప జేసి, తరువాత ఆయన ఆ పురుషునియందు సత్తా (ఉనికి)-సురణము (తెలివి) ల రూపముగా ప్రవేశించెను; అనగా ఉపలభ్యుడగుచున్నాడు.
విరాట్ పురుషుడు ఆది పురుషుడు. ఆయనకు అనంతములగు పాదములు ఊరువులు మరియు బాహువులు గలవని మహాత్ములు చెప్పుచున్నారు. ఈ సమస్తలోకములు, వాటిలోని సకలప్రాణులు ఆయనయందు సంకోచము లేకుండగా, తమ తమ విస్తృతరూపములతో ఇమిడియున్నవి.
నీవు విరాట్ పురుషుని వర్ణించియుంటి ). ఇంద్రియములు, వాటికి గోచరమయ్యే శబ్దము మొదలగు విషయములు మరియు వాటి అధిష్టాన దేవతలతో సహా పది విధముల ప్రాణము ఆయనయందే ఉన్నది. ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తుల రూపములో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఆయన యందు నెలకొని యున్నది. వర్ణములు ఆయననుండియే పుట్టినవి. ఆయన విభూతులను మాకు చెప్పుము.
అనేక విధముల దేహములు గల ప్రాణులు తమ పుత్రులతో, పౌత్రులతో, మనుమరాండ్లతో, మునిమనుమలతో మరియు తమ వంశీయులతో కలిసి ఆ విరాట్ పురుషునియందు మాత్రమే ఉనికిని కలిగియున్నారు. వీరిచే ఈ జగత్తు అంతయు నిండియున్నది.
మరీచి మొదలగు ప్రజాపతులకు కూడ ప్రభువగు ఆ విరాట్ పురు షుడు ఏయే ప్రజాపతులను, సర్గములను, అనుసర్గములను మరియు మన్వంతరాధిపతులగు స్వాయంభువాది మనువులను సృష్టించినాడు?
ఓ మైత్రేయా! ఆ మనువుల వంశములను, ఆ వంశములకు చెందిన రాజుల చరిత్రలను, భూమికి పైన క్రింద ఉన్న లోకములను కూడ వర్ణించుము.
భూలోకముతో బాటు ఆ లోకముల సన్నివేశమును, విస్తారమును వర్ణించుము. పశువులు, మానవులు, దేవతలు, సరీసృపములు (పాము మొదలగు ప్రాకే జంతువులు), పక్షులు, తల్లి గర్భమునుండి పుట్టే ప్రాణు లు, స్వేదమునుండి పుట్టే పేలు మొదలగు ప్రాణులు, గ్రుడ్డునుండి పుట్టే కోడి మొదలగు ప్రాణులు, నేలను చీల్చుకొని పుట్టే మొక్కలు అనువాటి సృష్టిలోని విభాగమును మాకు బోధించుము.
ఆదికారణుడగు శ్రీనివాసుడు రజస్సత్త్వతమోగుణములను ఉపా ధిగా చేసుకొని బ్రహ్మ-విష్ణు-రుద్రరూపములను దాల్చి జగత్తును క్రమ ముగా సృష్టించి పాలించి సంహరించుచున్నాడు. ఈ జగత్కార్యమునకు సంబంధించి ఆ శ్రీనివాసుని గొప్ప లీలలను వివరముగా చెప్పుము.
వేషము, శీలము మరియు స్వభావము అనువాటిని బట్టి వర్ణాశ్రమ ముల విభాగమును, మహర్షుల పుట్టుకను, వారు చేసిన కర్మలను, మరియు వేదవిభాగమును వర్ణించుము.
ఓ ప్రభూ! ఇంతేగాక, యజ్ఞముయొక్క విస్తారమును, కర్మయోగ మార్గమును, సర్వకర్మసన్న్యాసపూర్వకమగు జ్ఞాననిష్ఠను, ప్రకృతిపురుషవి వేకముయొక్క మార్గమును మాత్రమే గాక, భగవంతునిచే సృష్టించబడిన నారదపాంచరాత్రము మొదలగు తంత్రములను కూడ వర్ణించి చెప్పుము.
వేదముచే తిరస్కరించబడిన మార్గములను అనుసరించువారు సమాజములో సృష్టించే కల్లోలములను గురించి చెప్పుము. వివిధజాతుల మధ్య సంబంధముల పరిణామమును కూడ వర్ణించుము. జీవులు తమ తమ గుణములకు మరియు కర్మలకు అనురూపమగు గతులను పొందు చుందురు. అవి యెన్ని రకములు? వాటి వివరములు ఎట్టివి?
మానవుడు ఒకదానితో మరియొకదానికి విరోధము లేని విధముగా ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములను సంపాదించుకొనవలెను గదా! ఆ విధానమును చెప్పుము. వాణిజ్యము, దండనీతి మరియు శాస్త్ర శ్రవణము అనువాటి విధానమును కూడ వర్ణించి చెప్పుము.
ఓ మహాత్మా! శ్రాద్ధవిధిని, పితృదేవతల సృష్టిని వివరించుము. కాలచక్రములో గ్రహములు, నక్షత్రములు, తారకలు ఏ విధముగా భాగమై యున్నవో వివరించుము.
దానమునకు, తపస్సునకు, యజ్ఞయాగాది కర్మలకు, నూతులను చెరువులను త్రవ్వించుట మొదలగు ప్రజాహితకార్యములను చేయుటకు లభించే పుణ్యఫలము ఎట్టిది? పరదేశములోనున్న వానికి, ఆపదలోనున్న వానికి ఏది ధర్మము? ,
ఓ పుణ్యాత్మా! ధర్మమునకు మూలమగు ఆ శ్రీకృష్ణ భగవానుడు అధర్మాత్ములను శిక్షించును. సాధకుడు ఏ మార్గముననుసరించినచో, ఆయన సంతసిల్లును? ఎట్టివారిపై ఆయన ప్రసన్నుడగును? నాకీ విషయ మును చెప్పుము.
ఓ బ్రాహ్మణశ్రేష్టా! గురువులు దీనులపై దయను కలిగియుందు రు. వారు నిష్ఠగా సేవించే శిష్యులకు మరియు తమ పుత్రులకు అడుగకుం డగనే జ్ఞానమును ఇచ్చెదరు. .
ఓ పూజ్యా! మహత్తు మొదలగు ఆ తత్త్వముల ప్రళయము ఎన్ని విధములు? ప్రళయములో భగవానుని ఏ తత్త్వములు సేవించును? ఏ తత్త్వములు యోగనిద్రను పొందియున్న భగవానుని అనుసరించి తాము కూడ విలీనమగును?
జీవుని తత్త్వమేమి? పరమేశ్వరుని స్వరూపమేమి? ఉపనిషత్తుల జ్ఞానమును, గురుశిష్యుల పరస్పరప్రయోజనమును కూడ చెప్పుము.
ఓ అనఘా! ఆ జ్ఞానమును పొందుటకు విద్వాంసులు ఏయే సాధనములను చెప్పినారు? ఏలయనగా, సాధన లేకుండగా, మానవులకు భక్తి జ్ఞానవైరాగ్యములు తమంత తాముగా ఎట్లు కలుగును?
నేను అనాదియగు అవిద్యచే మూసివేయబడిన జ్ఞాననేత్రము గల అజ్ఞానిని. కాని, నేను శ్రీహరియొక్క లీలలను తెలియగోరుచున్నాను. నీవు నా మిత్రుడవు. కావున, నేను అడిగిన ప్రశ్నలకు ఉత్తరమును చెప్పుము.
ఓ పుణ్యాత్మా! సకల వేదములు, యజ్ఞములు, దానములు మరియు తపస్సులు జీవునకు ధర్మమును బోధించి అభయమునిచ్చుట అనే పుణ్యకార్యముయొక్క అంశముతో అయిననూ సరిగావు.
ఈ విధముగా కురువంశ శ్రేష్ఠుడగు విదురుడు మైత్రేయ మహర్షిని పురాణరహస్యమును గురించి ప్రశ్నించెను. భగవంతుని గాథను చెప్పు మనీ ప్రేరేపించిన కారణముగా ఆయన హృదయము ఆనందముతో నిండీ పోయేను. ఆయన చిరునవ్వుతో విదురునితో నిట్లనెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఏడవ అధ్యాయము ముగిసినది (7).
