శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
2 - శ్రీకృష్ణుని బాల్య లీలలు
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదురుడు భగవద్భక్తుడగు ఉద్దవుని ఈ విధముగా ప్రియతముడగు శ్రీకృష్ణునకు సంబంధించిన సమా చారమును గురించి ప్రశ్నించెను. కాని, ఈశ్వరుని స్మరణమాత్రముచే ఆయన, హృదయము ప్రేమతో నిండి ఉత్కంఠభరితుడై సమాధానమును చెప్పలేక పోయేను.
ఉద్ధవుడు ఐదు సంవత్సరముల బాలకుడై యుండగా ఒక శ్రీకృష్ణ మూర్తిని కల్పించి, దానికి సేవను పూజను చేయుచుండెను. అపుడు తల్లి చల్లి అన్నమును తినుట కొరకు పిలిచేను. కాని, తాను చేయుచున్న పూజను విడిచి వెళ్లి ఆహారమును భుజించుట ఆ బాలకునకు నచ్చలేదు.
అట్టి ఉద్ధవుడు దీర్ఘకాలమునుండియు శ్రీకృష్ణుని సేవిస్తూ వృద్దు డైనాడు. శ్రీకృష్ణుని గురించి ప్రశ్నించగానే, ఆయన ఈ ప్రభుని పాదము లను స్మరించుట మొదలిడినాడు. అట్టి ఉద్ధవుడు సమాధానమునెట్లు చెప్ప గల్గును?
శ్రీకృష్ణుని పాదముల భావన అనే అమృతముచే గొప్ప ఆనంద మును పొందియున్న ఆ ఉద్దవుడు తీవ్రమగు భక్తియోగము (భావన ద్వారా భగవంతునితో కలియుట) చే పరవశుడై, సుమారు ఒక గంట వరకు ఏమియు మాటలాడలేదు.
ఉద్దవుని దేహమంతయు పులకాంకురములతో నిండిపోయేను. ఆయన మూసియున్న కన్నుల వెంబడి ఆనందాశ్రువులను విడుచుచుండే ను. ఆయన ప్రేమప్రవాహములో మునిగిపోయెను. అట్టి ఉద్దవుని చూచి విదురుడు, ఈయన కృతార్థుడు (జీవన్ముక్తుడు) అని తలచేను.
ఉద్దవుడు మెల్లగా భగవద్భావననుండి సంసారములోనికి తిరిగి వచ్చినవాడై, కన్నులను తుడుచుకొని, భగవంతుని లీలలు స్మరణకు వచ్చుటచే విస్మయమును పొందినవాడై, విదురునితో నిట్లనెను.
ఉద్దవుడిట్లు పలికెను --- శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించినా డు. కాలము అనే కొండచిలువ మా గృహములను మ్రింగివేసినది. మా సంపదలు నశించినవి. నేను ఏమి కుశలసమాచారమును చెప్పగలను?
ఈ లోకము భాగ్యము లేనిది. మానవుడు భాగ్యవిహీనుడు. అయ్యో! యాదవులు మరింత భాగ్యహీనులు. ఏలయనగా, శ్రీహరి ఈ లోకములో ఉన్న కాలములో యాదవులు ఆయనతో కలిసి ఉండేవారు. కాని, వారాయనను గుర్తించలేదు. చంద్రుడు సముద్రములో ఉన్నంత వరకు చేపలు ఆయనను గుర్తించలేదు గదా!
యాదవులు ఇతరుల మనోభావములను తెలుసుకోగలిగే గొప్ప నిపుణులే. వారు శ్రీకృష్ణభగవానునితో బాటు ఒకే స్థానములో నుండి ఆయ నతో రమించిరి. కాని, ఆయన సకలప్రాణులకు ఆశ్రయమగు పరబ్రహ్మ అని గుర్తించలేక, ఆయన కేవలము యాదవులలో గొప్పవాడగు ఒక వ్యక్తి అనియే తలపోసిరి.
పరమేశ్వరుని మాయచే మోహితులై అనాత్మ మరియు మిథ్యా భూతము అగు జగత్తును భోగ్యముగా ఆశ్రయించియున్న యాదవులు మొదలగు వారు గాని, లేదా శ్రీకృష్ణునిపై నిష్కారణమగు వైరమును కలిగి యున్న శిశుపాలాదులు గాని, ఆయనను గురించి పలికిన పలుకులు, ఆత్మ స్వరూపుడగు ఆ శ్రీహరియందు తమ అంతఃకరణమును సమర్పించిన భక్తునకు భ్రాంతిని కలిగించ లేవు.
ఆ భగవానుడు తపస్సును చేయని మానవులకు కూడ తన త్రిలో కసుందరమగు రూపమును చూపించెను. కాని, ఇంకనూ వారు ఆ రూప మును చూచుటలో తృప్తిని చెందకుండగనే, ఆయన జనుల చూపునే తీసు కొని పోయినాడా యన్నట్లు, ఆ రూపమును ఉపసంహరించి అంతర్ధాన మును చెందినాడు.
భగవానుడు తన యోగమాయయొక్క ప్రభావమును లోకమునకు చూపగోరి మానవలీలలకు అనురూపమైన రూపమును స్వీకరించినాడు. సౌభాగ్యముయొక్క సమృద్ధికి పరాకాష్ఠమైన ఆ రూపమును చూచి ఆయన తాను కూడ ఆశ్చర్యమును పొందెడివాడు. ఆ రూపముయొక్క అవయవములు భూషణములకే వన్నెను తెచ్చుచుండెడివి.
ధర్మరాజుగారి రాజసూయయాగములో ముల్లోకములలోని జనులు కన్నులకు పరమానందమును గొలిపే శ్రీకృష్ణుని రూపమును చూచి, ఆశ్చర్యము! దేవతలను సృష్టించిన తరువాత మానవులను సృష్టిం చిన బ్రహ్మగారి నైపుణ్యమంతయు ఈనాడు ఈ రూపములో పూర్ణముగా వినియోగమునకు వచ్చినది (పర్యవసన్నమైనది) అని తలపోసిరి.
శ్రీకృష్ణుడు అనురాగముతో నిండిన చిరునవ్వుతో, హాస్యవచనము లతో మరియు లీలగా చూసిన చూపుతో గోపికలను చాల సమ్మానించెడి వాడు. అపుడు ఆ గోపికల చూపులు మరియు మనస్సులు శ్రీకృష్ణుని మీదనే నిలిచియుండెడివి. వారు ఇంటి పనులను సగములోనే విడిచి పెట్టి ఆయననే చూస్తూ నిలబడెడివారు.
సత్పురుషులు భగవానుని శాంతరూపులు. రాక్షసులు భగవానుని ఘోరరూపులు. వారిని వీరు అధికముగా పీడించుచుండగా చూచిన భగవా నుని హృదయములో గొప్ప దయ కలిగెను. చరాచర జగత్తునకు మరియు దానికి కారణమగు అవ్యక్తమునకు కూడ స్వామియగు పరమేశ్వరునకు జన్మ లేదు. అయిననూ, ఆయన మహత్తత్త్వమునకు కారణమగు మాయా శక్తిచే, తన గొప్ప అంశయగు బలరామునితో కూడి, కట్టెయందు అగ్ని ప్రకటమైన విధముగా, అవతరించెను.
భగవానుడు పుట్టుక లేనివాడే అయిననూ వసుదేవుని ఇంటిలో శ్రీకృష్ణుని రూపములో జన్మించినట్లు లీలను నెరపినాడు. ఆయన శత్రువు లక భయపడిపోయినాడా యన్నట్లు గొల్లపల్లెకు చేరి, అచట నివసించినా డు. ఆయన అనంతమగు పరాక్రమము గలవాడే అయిననూ, స్వయముగా నగరమునుండి పారిపోయినాడు. భగవానుని ఈ లీలలు గుర్తుకు వచ్చి నాకు దుఃఖము కలుగుచున్నది.
శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులగు దేవకీ వసుదేవుల పాదములకు నమస్కరించి, తండ్రీ! అమ్మా! కంసుని వలన చాల భయపడి మీకు సేవను చేయలేక పోయిన నాపై మీరు అపరాధమును మన్నించి ప్రస న్నులు కండు అని పలికెను. ఈ విషయము గుర్తుకు వచ్చినప్పుడు నాకు మనస్సులో చాల దుఃఖము కలుగుచున్నది.
శ్రీకృష్ణుడు మృత్యుస్వరూపమైన తన తీగవంటి కనుబొమ కదలికచే మాత్రమే భూమియొక్క భారమును నిర్మూలించెను. అట్టి భగవానుని పాదపద్మములను సేవించే పురుషుడు ఎవ్వడు ఆయనను మరువగల్గును?
రాజసూయ యాగములో శ్రీకృష్ణుని ద్వేషించే శిశుపాలుడు కూడ భగవంతుని పొందుటను మీరు చూచియే యున్నారు గం ! సాధకులు సమ్యగ్జర్శనము ద్వారా అట్టి భగవతాపిని మాత్రమే గోరుచుందురు. అట్టి భగవానుని వియోగమును ఎవరు సహించగలరు?
ఇంతేగాక, కురుక్షేత్రములో ఎంతో మంది వీరులు కన్నులకు ఆహ్లా దమును కలిగించే శ్రీకృష్ణుని ముఖపద్మమును శిశుపాలుని వలెనే కన్ను లతో పానము చేయుచూ యుద్ధమును చేసిరి. వారు అర్జునుని అస్త్రము లచే కొట్టబడి వీరమరణమును పొందినవారై ఆ భగవానుని ధామమును పొందిరి.
శ్రీకృష్ణునితో సరిదూగువాడు గాని, ఆయన కంటే అధికుడు గాని మరియొకడు లేడు. ఆయన స్వయముగా సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతికి, దాని కార్యమగు ముల్లోకములకు అధీశ్వరుడు. స్వయంప్రకాశ పరమానంద స్వరూపమునందు నిలిచియుండే ఆ త్రిలోకాధిపతికి అభీష్ట ములన్నియు పొందబడి యున్నవి. చిరకాలమునుండి లోకములనేలుచున్న ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు పూజాద్రవ్యములను (ఉపహార ములను) తీసుకువచ్చి తమ కిరీటముల కొనలను ఆయన కాలూనే పీఠము నకు ఆన్చి సేవించుచున్నారు.
ఓయీ విదురా! ఉగ్రసేన మహారాజు సార్వభౌమసింహాసనముపై ఆసీనుడై యుండగా శ్రీకృష్ణుడు ఆయన ముందు నిలబడి, ఓ మహారాజా! ఆలకించుడు అని విన్నవించెడివాడు. భగవానుని ఆ సేవాభాము తలపు నకు వచ్చినప్పుడు మావంటి సేవకులకు మిక్కిలి క్లేశమును కలిగించును.
ఆశ్చర్యము! దుష్టురాలగు పూతన శ్రీకృష్ణుని చంపవలెననే కోరి కతో స్తనములకు కాలకూట విషమును పూసుకొని ఆయనకు పాలను త్రాగించెను. అయిననూ, పెంచిన తల్లి యశోదకు అర మైన పుణ్యగతి ఆమెకు దక్కెను. శ్రీకృష్ణుడు అంతటి దయామయుడు. ఆయనను విడిచి మేము మరియెవరిని శరణు పొందేదము?
ముల్లోకములకు అధిపతి (త్రిగుణాత్మికయగు ప్రకృతికి అధ్యక్షుడు) అగు. శ్రీమహావిష్ణువునందు తీవ్రమగు వైరభావము గల రాక్షసులు కూడ ఆ భగవంతుని భక్తులే యని నా అభిప్రాయము. ఏలయనగా, వారు యుద్దములో కశ్యపప్రజాపతియొక్క పుత్రుడగు గరుత్మంతుని, సుదర్శన చక్రమును చేతబట్టి ఆయన భుజముపై అధిష్ఠించియున్న విష్ణువును దర్శించెడివారు.
బ్రహ్మ ప్రార్థించగా భూదేవియొక్క భారమును తగ్గించి ఆమెకు సుఖమును కలిగించుటకై శ్రీమహావిష్ణువు కంసుని కారాగారములో దేవకీ వసుదేవులకు పుత్రుడై జన్మించినాడు.
తరువాత కంసుని వలన చాల భయపడియున్న వసుదేవుడు ఆయనను నందుని గొల్లపల్లెకు చేర్చెను. ఆయన అచట బలరామునితో కూడి తన తేజస్సు బయట పడకుండగా పదకొండు సంవత్సరములు నివసీంచెను.
ఆ ప్రభుడు యమునానదీతీరమునందలి అడవిలో గోపబాలకులచే చుట్టువారబడినవాడై ఆవులను దూడలను మేపుచూ విహరించెను. ఆ అడ విలోని వృక్షములు కూతలు కూసే పక్షులతో నిండి యుండెడివి.
ఆయన తన బాల్యలీలలతో గోకులములోని జనుల మనస్సులను దోచివేసెను. ఆయన ఒకప్పుడు ఏడ్చేడివాడు; మరియొకప్పుడు నవ్వెడి వాడు; సింహపు పిల్లవలె అమాయికముగా చూచెడివాడు.
ఆయన కొంత పెద్ద వయస్సు వచ్చిన తరువాత, శోభకు పుట్టిని త్లన గోసంపదను త్రిప్పుచూ మేపుచూ, వేణువును వాయిస్తూ, తన తోడి గోపాలకులకు వినోదమును కలిగించెడివాడు. ఆయన ఆవుల మందలో తెల్లనివి మాత్రమే గాక ఇతరవర్ణపు ఆవులు, ఎద్దులు కూడ ఉండెడివి.
భోజరాజగు కంసుడు శ్రీకృష్ణుని పైకి మాయావులు, ఇచ్చవచ్చిన రూపమును దాల్చే శక్తిగలవారు అగు రాక్షసులను పం పెను. వారినందరినీ ఆయన, చిన్న పిల్లవాడు ఆటవస్తువులను వలే, అవలీలగా దునుమాడెను.
నాగరాజగు కాళీయుడు సరస్సులోని జలమునంతనూ విషపూరి తము చేసెను. ఆ జలమును త్రాగి గోపాలకులు గోవులు మరణించగా, శ్రీకృష్ణుడు ఆ కాళీయుని దండించి, వారిని మరల జీవింపజేసెను. కాళీ యుని నిష్క్రమణముచే ఆ జలములు మరల యథాప్రకారముగా స్వచ్చములై, మరల గోవులకు గోపాలకులకు త్రాగుటకు యోగ్యములాయెను.
ఇంతేగాక, ఆ శ్రీకృష్ణప్రభుడు మిక్కిలి సమృద్ధమగు ధనమును మంచిగా ఖర్చు చేయదలచినవాడై, బ్రాహ్మణోత్తముల సాహాయ్యముతో, నందమహారాజుచే గోపూజను చేయించేను.
ఓ విదురా! ఇంద్రుడు కోపించి నందవ్రజమును వర్షముతో ముంచె త్తెను. ఆ పల్లెకు ఆ విధముగా పెద్ద ఆపద వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు పర్వ తమును అవలీలగా ఎత్తి గొడుగును వలె పట్టుకొని, అందరినీ రక్షించి అను గ్రహించెను.
శరదృతువుయొక్క ప్రదోషకాలములో బృందావనము చంద్రుని వెన్నెలలతో ఉజ్జ్వలముగా ప్రకాశించుచుండగా, శ్రీకృష్ణుడు ఆ ప్రకృతితో భకు తగిన సమ్మానమునిచ్చువాడై, గోపికల మండలమునకు వన్నెను చేకూరుస్తూ, అవ్యక్తమధురమగు గీతములనెలాపిస్తూ, విహరించెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో విదుర-ఉద్ధవ సంవాదములో రెండవ అధ్యాయము ముగిసినది.
