శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

15 - జయ విజయులు శాపగ్రస్తులగుట

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కశ్యప ప్రజాపతియొక్క ఆ తేజస్సు ఇతరుల తేజస్సును నశింపజేయునది. దాని వలన దేవతలకు పీడ కలుగునేమో యను శంకచే దితి దానిని వంద సంవత్సరముల కాలము ధరించి యుండెను.

ఆ గర్భమునందలి శిశువుయొక్క తేజస్సుచే లోకముల తేజస్సు మరియు లోకపాలకుల సామర్థ్యము నశించేను. దిక్కులలో తూర్పు పడ మర అనే తేడా తెలియకుండా పోయేను. అపుడు లోకపాలకులు ఈ అవ్య వస్థను గురించి సృష్టికర్తయగు బ్రహ్మగారికి విన్నవించిరి.

ఓ ప్రభూ! ఈ చీకటిని నీవు చూచుచునే యున్నావు. ఇది మాకు. చాల భయమును గొల్పుచున్నది. నీ జ్ఞానశక్తి కాలమున మరుగున పడేది కాదు. నీకు తెలియనిది ఏదీ లేదు గదా!

ఓ దేవదేవా! నీవు జగత్తును సృష్టించినవాడవు. లోకపాలకులు సైతము నిన్ను పూజించేదరు. ఉత్కృష్టమైనవి, నికృష్టమైనవి అగు సకల ప్రాణుల అభిప్రాయములు నీకు తెలియుచుండును.

చైతన్యశక్తియే నీ బలము. గుణములలో ఒకటియగు రజోగుణ మును ఉపాధిగా స్వీకరించి, నీవీ చతుర్ముఖరూపమును పొందితివి. పరబ్ర హ్మయొక్క మాయాశక్తినుండి ప్రకటమైన నీకు అనేక నమస్కారములు.

ఈ భువనములు నీయందు ఓతప్రోత భావముచే నిలిచియున్నవి. జీవులనందరిని పాలించువాడవు నీవే. నీవు సర్వాధికుడవు. కారణము నీ రూపమే, కార్యము నీ రూపమే. అట్టి నిన్ను ఎవరైతే అభేదభావనతో కూడిన (నిష్కామ) భక్తితో ధ్యానించెదరో, వారి యోగసాధన పక్వమగును. వారు తమ శ్వాసను ప్రాణాయామము ద్వారా, ఇంద్రియములను ప్రత్యా హారము ద్వారా, మనస్సును ధారణ ద్వారా వశము చేసుకొని, నీ అనుగ్ర హమునకు పాత్రులగుదురు. అట్టి వారికి ఈ జగత్తులో దేనివలనైననూ పరా భవము లేదు.

నీ వేదరూపమగు వాక్కు జనులను, త్రాడు ఎద్దులను వలె, ధర్మా ధర్మములకు బద్దులను చేసి నియంత్రించుచున్నది. జనులు నీకు అధీనులై సావధానమనస్కులై నీకు పూజాదికమును సమర్పించుచున్నారు. నీవు ప్రాణులలో ముఖ్య (ముఖమునందు శ్వాస రూపముగా వ్యక్తమయ్యే) ప్రాణము రూపములో నున్నావు. నీకు నమస్కారము.

ఓ పరబ్రహ్మ స్వరూపుడా! అట్టి నీవు జనులకు సుఖమును కలిగిం చుము. ఈ చీకటిచే వారి కర్మానుష్టానము మూతపడినది. ఆపదలో చిక్కు కున్న మమ్ములను నీవు గొప్ప దయతో నిండిన చూపుతో చూడవలెను.

ఓ దేవా! కశ్యప ప్రజాపతి తన తేజస్సును దితియందు స్థాపించి నాడు. ఆమెయొక్క ఆ గర్భము, ఎండు కట్టెయందలి అగ్ని వలె వర్ధిల్లుతూ, దిక్కులను వెలవెల బోవునట్లు చేయుచున్నది.

మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఓ విదురా! స్వయంభువుడగు బ్రహ్మ భగవానుని స్వరూపము వేదశబ్దములచే మాత్రమే తెలియబడుచు న్నది. ఆయన నవ్వి తన మధురమగు వాక్కుతో దేవతలకు సంతోషమును కలిగిస్తూ, ఇట్లు బదులు చెప్పెను.

బ్రహ్మోవాచ ।

మీరు పుట్టుటకు ముందే నా సంకల్పమునుండి సనకుడు మొద లగు మహర్షులు. జన్మించినారు. వారికి ఈ లోకములలో పొందదగిన కోరి కలు ఏమియు లేవు. వారు ఆకాశమార్గము గుండా లోకములను సంచరిం చుచుండిరి.

శ్రీహరి ప్రాణుల సత్త్వగుణప్రధానమగు బుద్దిగుహయందు శుద్ధచై తన్యరూపముగా వెలుగొందుచుండును. ఆయనయే వైకుంఠలోకమునందు నివసించును. సకలలోకముల వారు ఆ వైకుంఠలోకమును నమస్కరించెద రు. ఒకనాడు ఆ సనకాదులు వైకుంఠలోకమునకు వెళ్లిరి.

ఆ వైకుంఠమునందలి పురుషులు అందరు శ్రీహరిని బోలిన రూపమును కలిగియుందురు. శ్రీహరిని నిష్కామభావముతో ఆరాధించుటయే వారు పాటించే ధర్మము

సకలకారణుడు, పూర్ణుడు, వేదములచే ప్రతిపాదించబడువాడు, ధర్మమూర్తి అగు శ్రీహరి భగవానుడు రజోగుణ సంబంధము లేని సత్త్వగు ణమును ఉపాధిగా చేసుకొని, అచట తన భక్తులగు మనలకు సుఖమును కలిగిస్తూ ఆ వైకుంఠమునందు విరాజిల్లుచున్నాడు.

ఆ వైకుంఠమునందు నైఃశ్రేయసమని ప్రసిద్దిని గాంచిన వనము గలదు. అది అన్ని ఋతువులకు సంబంధించిన వృక్షముల శోభతో ప్రకాశిం చుచుండును. కోరికలను వర్షించే ఆ వృక్షములతో ఆ వనము రూపు దాల్చిన మోక్షము వలె నొప్పారుచుండును.

ఆ వనములో సరస్సునందలి నీటి లోపల మకరందమును వర్షించే మాధవీ లతలు వికసించి తేనెలను ప్రసరింప జేయుచుండును. వాటి పరి మళము బుద్దియొక్క ఏకాగ్రతకు భంగము కలిగించే అవకాశము గలదు. అయిననూ, తమ భార్యలతో గూడి విమానములలో సంచరించే గంధ ర్వులు ఆ విధమగు బుద్ధిచాంచల్యమును విడనాడి, ఆ పరిమళమును మోసుకువచ్చే వాయువును నిందించుచుందురు. వారి విధముగా చేయు చూ, ప్రభువగు శ్రీహరియొక్క లీలలను గానము చేయుచుందురు. ఆ గాథలు జనుల హృదయములోని పాపములను నశింపజేయును.

ఆ వనములో పావురము కోకిల. బెగ్గురుపక్షి భరతపక్షి హంస చిలుక తీతువు నెమలి అనే పక్షులు కోలాహలము చేయుచుండును. కాని, శ్రేష్టమగు తుమ్మెద హరికథను గానము చేయుచున్నదా యన్నట్లు ఝంకారమును చేయుట ఆరంభించగానే, కనీసము కొద్ది సేపు ఆ పక్షుల కోలాహలము ఆగిపోవును.

శ్రీహరి తులసిని అలంకరించుకొనును. ఆయనకు దాని గంధము నందు ఆదరము మెండు. వైకుంఠమునందలి ఆ వనములో ఉండే మందా రము, మల్లె, గోరింట, కలువ, సంపెంగ, అర్జపుష్పము, సురపొన్న, నాగకేసరము, పొగడ, పద్మము, పారిజాతము అనే పుష్పజాతులు తులసి చేసు కున్న తపస్సును గొప్పగా కొనియాడుచుండును.

వైదూర్యములు, పచ్చలు మరియు బంగారము అనువాటితో నిండియున్న విమానములతో ఆ వైకుంఠము రద్దీగా నుండును. కేవలము శ్రీహరియొక్క పాదములకు ప్రణమిల్లిన వారికి మాత్రమే వాటిని చూచే భాగ్యము కలుగును. ఆ విమానములలో అధిరోహించే జనుల హృదయ ములో శ్రీహరి సర్వదా నీలిచియుండును. కావుననే, విశాలమగు కటిభాగ ములు కలిగి చిరునవ్వుతో శోభిల్లే ముఖములు గల స్త్రీలు కూడ పరిహా సము మొదలగు వాటిచే వారి మనస్సులలో రజోగుణమునుండి పుట్టే కామవికారములను కలిగించలేరు.

శ్రీహరియొక్క నివాసము బంగారముతో నిర్మించబడినది. దాని లోని గోడలు స్పటికమయములు. సుందరియగు లక్ష్మీదేవి ఆ ప్రాసాదము నందు తన చాంచల్యదోషమును విడిచి పెట్టి (స్థిరముగా నున్న దై), కాలి నూపురముల మువ్వలు గణగణలాడుచుండగా ఇటునటు సంచరించుచుం డును. ఆమె చేతిలో విలాస కొరకై పద్మమును ధరించియుండును. ఆమె తిరుగుచున్నప్పుడు గోడలో ప్రతిబింబము పడి, ఆమె పద్మముతో నేలను ఊడ్చుచున్నదా యనిపించును. ఆమె అనుగ్రహము కొరకై జగత్తులోని ఇతరులు ప్రయత్నించుచుందురు.

ఓ ప్రియమైన దేవతలారా! ఆ వైకుంఠమునందు లక్ష్మీదేవి తన పరిచారికలతో గూడి తన ఉద్యానవనమునందు తులసీ దళములతో శ్రీహరి భగవానుని శ్రద్దతో అర్చించుచుండెను. ఆ వనములో అమృతము వంటి నీరు (అమృతమే నీరుగా) గల దిగుడు బావులు గలవు. వాటి గట్లు పగడములతో కూర్చబడి యుండెను. ఆమె అందమైన ముంగురులతో మరియు ఎత్తైన ముక్కుతో గూడియున్న తన ముఖమును ఆ నీటిలో చూచి, శ్రీహరి తనను చుంబించుటను స్మరించెను.

మందభాగ్యులగు జనులు పాపములను పోనాడే శ్రీహరియొక్క జగద్రచన మొదలగు లీలలను వినరు. వారు నిస్సారములగు ఇతరవిషయ ములతో కూడి బుద్దిని వినాశము చేసే చెడు ప్రసంగములను వినుచుందురు. వారా వైకుంఠమును పొందలేరు. అయ్యో! ఆ ప్రసంగములు వారిని నరకములలోనికి త్రోసివేయును. అచట వారిని రక్షించువారు ఉండరు.

మనుష్యజన్మలో ధర్మమునాచరించుటకు, యథార్థవస్తువు అగు బ్రహ్మయొక్క జ్ఞానమును పొందుటకు అవకాశము గలదు. కావుననే, మేము (బ్రహ్మ మొదలగు దేవతలు) కూడ దానిని కోరుచుందుము. కాని, అయ్యో! ఎవరైతే అట్టి మానవజన్మను పొందియు శ్రీహరి భగవానుని ఆరాధించరో, వారు ఆ భగవానుని విస్తృతమగు మాయచే మోహింప జేయబడుదురు.

భక్తులు దేవాధిదేవుడగు శ్రీహరిని సర్వదా స్మరిస్తూ మృత్యువును అధిగమించెదరు. వారు బ్రహ్మాది, దేవతల కంటే కూడ ఉత్కృష్టమైనవారు. దేవతలు కూడ వారి శీలము వంటి శీలము తమకు ఉండవలెనని కోరుచుం దురు. వారిలో వారు శ్రీహరి ప్రభుని పవిత్రమగు కీర్తిని గానము చేసి దాని వలన ఉదయించిన ప్రేమచే మనస్సులో విహ్వలురై కన్నుల వెంబడి నీటిని గార్చుతూ శరీరమంతయు గగుర్పాటును పొందెదరు. అట్టి భక్తులు ఆ వైకుంఠమును పొందెదరు. -

సకలభువనములలోని జనులచే నమస్కరించబడే అప్రాకృతమగు వైకుంఠమునందు జగత్తునకు తండ్రియగు శ్రీహరి నివసించియుండును. అచట దేవశ్రేష్టుల రంగు రంగుల విమానములు ప్రకాశించుచుండును. సనకాది మహర్షులు ఇదివరలో వైకుంఠమును చూచియుండలేదు. వారు యోగశక్తియొక్క మహిమచే అక్కడకు చేరి మహానందమును పొందిరి.

ఆ సనకాది మహర్షులు ఆరు ప్రాకారద్వారములను దాటిరి. వారు శ్రీహరిని దర్శించవలెననే ఉత్కంఠచే వైకుంఠశోభను దర్శించుటలో ఆస క్తినీ చూపకుండిరి. వారిని ఆరు ద్వారముల వద్ద ద్వారపాలకులు అడ్డుకొన లేదు. తరువాత వారు ఏడవ ద్వారము వద్ద గదలను పట్టుకొని పహరా కాయుచున్న ఇద్దరు దేవతలను చూచిరి. సమానమగు వయస్సు గల వారి ద్దరు మిక్కిలి విలువైన బాహుపురులు కుండలములు కిరీటములు అనే ఆభరణములను సుందరమగు వేషములను దాల్చియుండిరి.

ఆ ద్వారపాలకులిద్దరు మదించిన తుమ్మెదలను తన వద్దకు ఆక ర్షించుచున్న వనమాలను నీలవర్ణము గల నాలుగు భుజముల మధ్యలో వచ్చునట్లుగా మెడలో ధరించిరి. ముడివడిన కనుబొమలతో, ఉబ్బియున్న ముక్కుపుటములతో, ఎర్రని కన్నులతో కూడియున్న వారి ముఖములలో కొంచెము చికాకు కనబడుచుండెను.

ఆ ద్వారములన్నియు బంగారముతో చేసినవే. వాటియందు వజ్రములు పొదగబడి యుండెను. ఆ సనకాది మహర్షులు తమను చూచుచున్న ఆ ఇద్దరు ద్వారపాలకులను లెక్కచేయకుండగా, వారి అనుమతి కొరకు ఎదురు చూడకుండగా ఆ ద్వారము లోపల ప్రవేశించిరి. వారు ముందటి ఆరు ద్వారములను కూడ అదే విధముగా దాటి వచ్చిరి. ఆ మహర్షులు సర్వత్ర సమదృష్టి గలవారు. వారు ఏ కాలమునందైననూ శంకను ఎరుగరు. వారిని ఎవ్వరైననూ అడ్డుకొనరు. వారు అంతటా అదే విధముగా సంచరించుచుందురు.

ఆ సనకాది మహర్షులు నలుగురు దిగంబరులు. వారు పెద్దవారే అయినా అయిదు సంవత్సరముల బాలకులవలె కన్పట్టుచుండిరి. వారు ఆత్మతత్త్వమునెరింగిన వారు. వారిని అడ్డుకొనుట ద్వారపాలకులకు తగదు. కాని, ఆ ద్వారపాలకులిద్దరు శ్రీహరి భగవానునకు విరుద్ధమైన స్వభావము గలవారగుటచే, ఆ మహర్షుల తేజస్సును పొగరుమోతుతన ముగా భావించి వారిని పరిహసించి, బెత్తముతో వారిని అడ్డగించిరి.

ఆ మహర్షులు మర్యాదకు ఎంతయూ తగినవారు. కాని వైకుంఠ మునందలి ఇతరదేవతలు చూచుచుండగా, శ్రీహరియొక్క ద్వారమునకు కాపలా కాసే వారిద్దరు వారిని అడ్డుకొనినారు. తమకు అత్యంతప్రీతిపాత్రుడగు భగవానుని దర్శించవలెననే ఆ మహర్షుల కోరికకు ఆ విధముగా భంగము కలిగెను. కామమును అంటి పెట్టుకొని ఉండే కోపము వారిలో కొద్దిగా ప్రవేశించెను. వారి కన్నులలో ఆ కోపము వ్యాపించుచుండెను. వారు అపుడు ఇట్లు పలికిరి.

మునులు ఇట్లు పలికిరి --- మీరు భగవానుని గొప్పగా ఆరాధించి ఇచటకు వచ్చి నివసించుచున్నారు. కావున, మీయందు ఆ భగవానుని ధర్మములుండదగును. భగవానుడు సమదర్శి. కాని మీరు దానికి విరుద్దమగు విషమస్వభావమును కలిగియున్నారు. ఇది మీకు ఎట్లు కలిగినది? పూర్ణుడగు ఆ భగవానుడు పరమశాంతస్వరూపుడు. ఆయనయందు కలహము లేనే లేదు. అట్టి స్థితిలో, శంకించదగిన వారు ఇచట ఎవరు గలరు? మీరిద్దరు కపటస్వభావము గలవారు. కావుననే, మీరు ఇతరులయందు దోషమును చూచి శంకించుచున్నారు.

సకలవిశ్వము భగవానుని ఉదరమునందు గలదు. ఆయన సకల ప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు. జ్ఞానులు ఆ పరమేశ్వరుని ఆత్మ రూపునిగా దర్శించి, ఘటాకాశమును మహాకాశమునందు వలె, తమ జీవభావమును ఆయనయందు విలీనము చేసెదరు. వారు తమ యథార్థస్వ రూపమునకు ఈశ్వరునకు మధ్యలో భేదమును చూడరు. మీరు ఈ వైకుం ఠములో దేవతల వేషములను దాల్చియున్నారు. ఇతరులెవరో వచ్చి అట్టి ఆ భగవానుని దేహమునకు హాని కలిగించెదరేమో యనీ మీరు శంకించి భయపడుచున్నారు. అల్పమైననూ భేదమును దర్శించినచో, భయము కలుగును. మీకు ఈ శంక ఎక్కడనుండి వచ్చినది? మీకీ భయము కలుగు టకు కారణమేమి?

వైకుంఠాధిపతియగు ఈ శ్రీహరి సత్త్వగుణప్రధానమగు బుద్ధికి అధ్యక్షుడై ఆత్మరూపముగా వెలుగొందే పరబ్రహ్మ. కానీ, మందబుద్దులగు మీరు ఆయనకు భయమును శంకించుచున్నారు. కావున, మీకు గొప్ప మంగళమును చేయవలెనని మేము ఈ సందర్భములో భావించుచున్నా ము. మీరు భేదదృష్టిని కలిగియున్న కారణముగా, ఈ వైకుంఠమును వదిలి పాపభూయిష్టమగు లోకములను (యోనులను) పొందుడు. అచట జీవు లకు కామక్రోధలోభములనే ముగ్గురు శత్రువులు గలరు.

ఆ మహర్షులు ఈ విధముగా పలికిరి. వారి వాక్కుల రూపములో నున్న భయంకరమగు ఆ బ్రహ్మదండము (బ్రాహ్మణశాపము) ను ఎన్ని అస్త్రములైననూ నివారించలేవు. బ్రహ్మదండమునకు సాక్షాత్తు శ్రీహరి కూడ భయపడును. శ్రీహరియొక్క అనుచరులగు వారిద్దరు ఆ మహర్షుల శాపమును విని చాల భయపడిరి. వారు వెంటనే అతిశయించిన దైన్య ముతో నేలపై బడి వారి పాదములను పట్టుకొనిరి.

అపరాధికి పూజ్యులగు మీరు శిక్షను విధించితిరి. అది అటులనే యగుగాక! మేము దేవతలమగు మీమ్ములను పరిహసించితిమి. మీరు విధించిన శిక్షను అనుభవించుట వలన ఆ దోషము పూర్తిగా దూరమగును. మేమిపుడు ఇక్కడనుండి అధమయోని లోనికి పోవుచున్నాము. మేము మీకు క్లేశమును కలిగించితిమి. ఆ పాపములో లేశమైననూ మాకు ఈ అధ మయోనిలో భగవంతుని స్మరణమునకు విఘాతము కలిగించే మోహ మును ఈయగలదు. కానీ, మాకు అట్లు కారాదని కోరుచున్నాము.

ఈ విధముగా తన సేవకులు మహాత్ములగు సనకాదుల విషయ ములో అపరాధమును చేసినారనే విషయమును పద్మనాభుడగు శ్రీహరి భగవానుడు అదే క్షణములో తెలుసుకొనెను. వెంటనే మహాత్ముల హృద యములలో నిలిచియుండే ఆయన లక్ష్మీదేవితో గూడి అచటకు నడచివచ్చెను. పరమహంస (ఆత్మజ్ఞాని) లగు మహర్షులు తమ ధ్యానములో ఆయన పాదములను అన్వేషించుచుందురు.

సేవకులు పూజాద్రవ్యములను వెంట గొనిరాగా శ్రీహరి అచటకు వచ్చి ఆ మహర్షులకు కనబడెను. వారు చేసిన సమాధియోగము రూపుకట్టి వారి ముందు నిలబడెను. ఆయనకు ఇరువైపులా రాజహంసలను బోలి యున్న వింజామరలు వీచబడుచుండెను. ఆయన శిరస్సు పై చంద్రుని వలె ప్రకాశించే గొడుగు పట్టబడెను. వింజామరలనుండి వచ్చే మంగళకర మగు వాయువుచే ఆ గొడుగు కొనలనుండి వ్రేలాడే ముత్యాల సరాలు కదలి చంద్రుని వెన్నెలలనే అమృతకణములు ఆయన పై పడుచున్నవా యన్నట్లు భాసించెను.

కోరదగిన సద్గుణములకు నిలయమగు ఆ శ్రీహరి అక్కడనున్న మరిహద్దులను మాత్రమే గాక ద్వారపాలకులను కూడ అనుగ్రహించుటకు సుముఖుడై యుండెను. ఆయన ప్రేమతో నిండిన తన చూపులను వారిపై ప్రసరింప జేసి వారి హృదయములను స్పృశించెను: వారాయనను తమ హృదయముతలో భావించుచుండిరి.నీలవర్ణము గల ఆయన విశాలమగు - వక్షఃస్థలముపై లక్ష్మీదేవి శోభిల్లుచుండి ఆమెతో ఆయన స్వర్లోకమునకు చూడామణివంటి తన ధామమగు వైకుంఠమును శోభిల్లజేయుచున్నాడా యన్నట్లు ఉండెను.

శ్రీహరియొక్క విశాలమగు నితంబమునందు పీతాంబరము, దానిపై మొలనూలు ప్రకాశించుచుండెను. ఆయన కంఠమునందలి వన మాల చుట్టూ తుమ్మెదలు చేరి ఝంకారమును చేయుచుండెను. ఆయన ముంజేతులయందు కంకణములు సుందరముగా నుండెను. ఆయన ఒక చేతిని వినతాకుమారుడగు గరుడునిపై వేసి, మరియొక చేతితో పద్మ మును విలాసముగా త్రిప్పుచుండెను.

శ్రీహరియొక్క చెవులకు గల మకరాకారపు కుండలములు తమ కాంతిచే మెరుపులను తల దన్నుచూ చెక్కిళ్లకు శోభను చేగూర్చుచుండె ను. ముఖము ఎత్తైన ముక్కుతో ప్రకాశించుచుండెను. ఆయన మణులను పొదిగిన కిరీటమును దాల్చియుండెను. నాలుగు భుజదండముల మధ్యలో చాల గొప్ప హారము విహరించుచుండెను. మెడనుండి త్రాటితో వ్రేలాడే కౌస్తుభమాణిక్యముతో వక్షఃస్థలము ప్రకాశించుచుండెను.

లక్ష్మీదేవికి తన సౌందర్యము విషయములో గల గర్వము భగవా . నుని యెదుట తొలగిపోయినదని ఆయన భక్తులు భావన చేయుచుందురు. నాకు, శివునకు, మీకు ఉపాసన కోరకై ఆయన అతిశయించిన సౌందర్య ముతో కూడిన రూపమును ప్రకటించినాడు. అట్టి శ్రీహరిని ఆ మహర్షులు చూచిరి. కాని, ఎంత చూచినా వారికి తనివి తీరలేదు. వారు తలలను వంచి ఆయనకు ఆనందముతో నమస్కరించిరి.

పద్మములవంటి కన్నులు గల ఆ శ్రీహరియొక్క 'దములు పద్మములను, కాలి వ్రేళ్లు ఆ పద్మముల కేసరములను పోలియా ఎండెను. ఆ పాదపద్మముల మకరందముతో కూడిన తులసీగంధను మ్రోసుకొని వచ్చిన వాయువు ఆ మహర్షుల ముక్కు పుటముల గుం లోపలికి ప్రవే శించెను. వారు బ్రహ్మనిష్ఠ గలవారే అయినను', అది వారి మనస్సులకు ఆనందాతిశయమును, దేహములకు రోమాంచమును కలిగించెను.

ఆ మహర్షులు శ్రీహరియొక్క మిక్కిలి అందమగు క్రింది పెదవిని, దానిపై విరిసే మల్లెలవంటి చిరునవ్వును, నల్లకలువ మొగ్గవంటి ముఖమును తలలను పైకెత్తి చూచిరి. వారి మనోరథము ఈడేరెను. మరల, పద్మరాగమాణిక్యములవంటి గోళ్లను, వాటికి ఆశ్రయమగు రెండు పాదము లను తలలను క్రిందికి దించి చూచిరి. తరువాత వారాయనను ధ్యానించిరి.

ఈ లోకములో మానవులు యోగమార్గముల ద్వారా మోక్షమును పొందగోరి కన్నులకు పండువయగు ఆ పురుషోత్తముని రూపమును అత్యా దరముతో ధ్యానించుచుందురు. శ్రీహరి అట్టి రూపమును ఆ మహర్షులకు దర్శనమిచ్చెను. ఇతరులలో కానరాని అణిమ మొదలగు అష్టైశ్వర్యములు ఆయనలో సహజసిద్దముగా నున్నవి. అట్టి భగవానుని ఆ మహర్షులు చక్కగా స్తుతించిరి.

కుమారులు ఇట్లు పలికిరి --- ఓ అనంతుడా! నీవు దుష్టులకు హృదయమునందే భాసించుచున్ననూ దాగియుందువు. అట్టి నీవు ఈనాడు మా కన్నులకు కానవచ్చుచున్నావు. నీనుండి జన్మను పొందిన మా తండ్రిగారు ఏనాడు నీ స్వరూపముయొక్క రహస్యమును మాకు వర్ణించి చెప్పినారో, ఆనాడే నీవు చెవి రంధ్రముల గుండా మా హృదయ (బుద్ధి) గుహలో ప్రవేశించియున్నావు.

ఓ భగవానుడా! నీవిప్పుడు నీ భక్తులమగు మా యెదుట నీ శుద్ధ సత్త్వప్రధానమగు సగుణరూపమును దర్శనమిచ్చి ప్రీతిని కలిగించినావు. ఈ సగుణరూపమే శాస్త్రప్రసిద్ధమైన ఉత్కృష్టమగు ఆత్మతత్త్వమని మేము గుర్తించుచున్నాము. అహంకారము, రాగము లేని మననశీలురగు భక్తులు నీ అనుగ్రహముచే దృఢమగు భక్తియోగమును పొందినవారై, ఆ ఆత్మత త్వమును తమ హృదయములో సాక్షాత్కరించుకొనుచున్నారు.

ఓ శ్రీహరీ! నీ భక్తులు, ధర్మాధర్మ (నిత్యానిత్య) వివేకము గల నేర్పరులు. వారు కేవలము నీ పాదములను మాత్రమే శరణు జొచ్చియుం దురు. కీర్తించదగిన పవిత్రమగు కీర్తి గల నీ గాథల రసము వారికి యెరుక యే. వారు నీ అనుగ్రహముచే లభించే మోక్షమునైననూ లెక్కచేయరు. నీ కనుబొమల విరుపులచే గడగడలాడే (కాలమునకు లోబడియుండే) ఇంద్రా దుల పదవులను వారు లెక్క చేయరని వేరుగా చెప్పవలయునా?

మా మనస్సులు తుమ్మెదల వలె నీ పాదపద్మములయందు మాత్రమే రమించే పక్షములో, మా వాక్కులు తులసి వలె నీ పాదముల సంబంధముచే (వర్ణనలచే) శోభిల్లే పక్షములో, మా చెవుల రంధ్రములు నీ గుణగణముల గానముచే పూరించబడే పక్షములో, మాకు మా పాపముల నిమిత్తముగా యథేచ్ఛగా నరకములో జన్మ కలుగుగాక! అట్టి జన్మకు మా అభ్యంతరము లేదు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే పంచదశోఽధ్యాయః ॥

విపులమగు కీర్తి గల ఓ పరమేశ్వరా! నీవు నీ ఈ రూపమును మా యెదుట ఆవిర్బవింప జేసితివి. భగవానుడవగు నీవు ఈ విధముగా మా యెదుట ప్రత్యక్షమైతివి. మా కన్నులు అతిశయించిన ఆనందమును పొందినవి. మనోజయము లేనివారు నిన్ను తెలియజాలరు. ఇదిగో ! చేతు లెత్తి నీకు నమస్కరించుచున్నాము.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునైదవ అధ్యాయము ముగిసినది.