శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

18 - హిరణ్యాక్షునితో వరాహ భగవానుని యుద్ధము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! జలాధిపతియగు వరుణుని ఈ వచనములను విని, గర్వించియున్న హిరణ్యాక్షునకు యుద్దమును చేసే పురుషుడు లభించినందులకు హృదయము హర్షముతో నిండి పోయెను. నీవా పురుషుని చేతిలో మరణించెదవని వరుణుడు చెప్పిన మాటను ఆతడు త్రోసిపుచ్చి, నారదుని వలన శ్రీహరి ఉన్న స్థానమును తెలుసుకొని, తొందరగా రసాతలమును ప్రవేశించెను.

అచట హిరణ్యాక్షుడు పర్వతాకారములోనున్న విశ్వవిజేతయగు వరాహ భగవానుని చూచెను. ఆయన తన కోరల కొనపై భూమిని ఎత్తి తీసుకువచ్చు చుండెను. ఎర్రని కన్నుల శోభతో ప్రకాశించే ఆ భగవానుని ముందు హిరణ్యాక్షుని తేజస్సు వెలవెల పోయెను. ఆతడు ఆయనను చూచి, అరే! ఇది అడవిలో కనబడే (నీటిలో సంచరించే) పశువు!, అని పలికి నవ్వెను.

ఆ హిరణ్యాక్షుడు వరాహ భగవానునితో నిట్లు పలికెను: ఓరీ మూర్ఖ! ఇటు రమ్ము. ఆ భూమిని విడిచి పెట్టుము. జగత్తును సృష్టించిన బ్రహ్మగారు రసాతలవాసులగు మాకు ఆ భూమిని ఇచ్చినాడు. నేను చూచుచుండగా నీవా భూమిని తీసుకొని సుఖమును పొందలేవు. వరాహ రూపమును దాల్చిన నీవు దేవతలలో అధముడవు.

ఓరీ మూర్ఖ! మా శత్రువులు మమ్ములను నశింప జేయుట కొరకై నిన్ను పెంచి పోషించినారా యేమి? నీవు ఎదురు పడకుండగా మాయతో రాక్షసులను సంహరించి విజయమును పొందుచున్నావు. యోగమాయయే నీ బలము. నీ పౌరుషము అల్పము. నిన్ను సంహరించి, నేను మిత్రుల (బంధువుల) కన్నీటిని తుడిచెదను.

నేను నా భుజములతో విడిచి పెట్టబోయే ఈ గదచే నీ తల పగిలి, నీవు మరణించెదవు. అప్పుడు నీకు పూజలను చేసే మహర్షులు మరియు  దేవతలు, తల్లి వేరు నశించిన చెట్టు వలె, తమంత తామే నశించెదరు.

శత్రువు పలికిన పరుష వచనములు చిల్లకోల పోట్లవలె వరాహ భగవానునకు పీడను కలిగించినవి. ఆయన కోరల కొనలయందున్న భూదేవి భయపడుచుండెను. ఆమెను చూచి ఆయన ఆ నొప్పిని సహిస్తూ, నీటిలో ఆడ ఏనుగుతో కలిసియుండి మొసలి కాటు తిన్న మగ ఏనుగు వలె, నీటి మధ్యనుండి బయటకు వచ్చేను.

హిరణ్యాక్షుడు బంగరు రంగు జుట్టును, భయంకరమగు దంష్ట్రలను కలిగియుండెను. వరాహ భగవానుడు నీటినుండి బయటకు వచ్చు చుండగా, ఆతడు పిడుగు వలె ధ్వనిని చేయుచూ, మొసలి ఏనుగును వలె, ఆయన వైపు వేగముగా పరుగెత్తి ఇట్లనెను: పారిపోవుట అనే నిందిం చదగిన పనిని సిగ్గు లేని దుష్టులు చేయకుందురా?

జగత్కర్తయగు బ్రహ్మగారు వరాహ భగవానుని స్తుతించుచుండెను. దేవతలాయనను పుష్పవృష్టితో ముంచెత్తుచుండిరి. తనకేసి చూచు చున్న శత్రువగు హిరణ్యాక్షుని ఆయన లెక్కచేయలేదు. అప్పుడాయన ఆ భూమిని నీటికి పైన అనుకూలమగు స్థానమునందుంచి, దానియందు తన. ఆధారశక్తిని నిక్షేపించెను.

హిరణ్యాక్షుడు బంగరు ఆభరణములను, రంగు రంగుల బంగరు కవచమును ధరించియుండెను. ఆతడు పెద్ద గదను చేతబట్టి, పలుమార్లు పరుష వచనములతో వరాహ భగవానుని హృదయమునకు పీడను కలిగిం చుచుండెను. ఆయన మహాకోపము గలవాడై, బిగ్గరగా నవ్వుతూ, వానిని ఉద్దేశించి ఇట్లు పలికెను.

శ్రీ వరాహ భగవానుడు ఇట్లు పలికెను --- ఓరీ దుష్ణా! నిజమే నేను అడవిలో తిరుగాడే (నీటిలో నివసించే) పశువునే. కాని, నీవంటి కుక్క లను వెదికి పట్టుకొనుటయే నా పని. మృత్యుపాశములచే కట్టివేత బడియున్న నీ బడాయి కబుర్లను వీరులు సరుకు చేయరు.

మేము రసాతల వాసులగు మీకు ప్రజాపతి ఇచ్చిన భూమి అనే సొత్తును అపహరించే చోరులము. నీవు గదతో తరుముకొచ్చినా, మాకు సిగ్గు లేదు. కాని, ఏలాగో యుద్దరంగములో నిలిచియున్నాము. నిలబడక తప్పదు. బలశాలివగు నీతో వైరము పెట్టుకొని, ఎక్కడకు పోగలము?

పాదచారులగు వీరుల నాయకులకు నీవు అధినాయకుడవు గదా! వెంటనే శంకను విడనాడి మాకు అనిష్టమును కలిగించే ప్రయత్నమును చేయుము. మమ్ములను సంహరించి, నీ వారల కన్నీటిని తుడువుము. ప్రతిజ్ఞను చేసి దానిని పూర్తి చేయని వానికి పెద్ద మనుష్యుల మధ్య కూర్చునే అధికారము ఉండదు.

మైత్రేయుడు ఇట్లు పలికెను --- వరాహ భగవానుడు హిరణ్యాక్షుని ఉద్దేశించి మహాకోపముతో ఈ విధముగా ఎత్తి పొడుపు మాటలను పలికి, వేళాకోళము కూడా చేసెను. అపుడాతడు అల్లరి చేయబడిన నాగ రాజు వలె తనలో భయంకరమగు కోపమును నింపుకొనెను.

ఆ రాక్షసుడు కోపముతో నిట్టూర్పులను విడుచుచుండెను. ఆతని ఇంద్రియములు కోపముచే క్షోభింప జేయబడెను. ఆతడు వేగముగా వరాహ భగవానుని సమీపించి, ఆయనను గదతో గట్టిగా కొట్టెను.

శత్రువగు హిరణ్యాక్షుడు వరాహ భగవానుని వక్షఃస్థలమునందు వేగముగా గదతో కొట్టబోయెను. కాని, ఆయన ప్రక్కకు తిరిగి, యోగసిద్ధుడగు పురుషుడు మృత్యువును తప్పించుకునే విధముగా, ఆ దెబ్బను తప్పించుకొనెను.

హిరణ్యాక్షుడు కోపముతో పెదవిని కొరుకుతూ, గదను మరల తీసుకొని గిర గిర త్రిప్పుచుండెను. అపుడు వరాహ భగవానుడు కోపించి వాని మీదకు ఉరికెను.

వరాహ భగవానుడు శత్రువును కుడి కనుబొమపై గదతో సాగదీసి కొట్టబోగా, నేర్పరియగు ఆ హిరణ్యాక్షుడు తన గదతో దానిని అడ్డుకొనెను.

ఈ విధముగా హిరణ్యాక్షుడు, వరాహ భగవానుడు గొప్ప క్రోధము గలవారై ఒకరినొకరు జయించవలెననే కోరికతో బరువైన గదలతో ఒకరినొకరు కొట్టుకొనిరి.

వారిద్దరు ఒకరినొకరు మించాలనే పట్టుదలతో యుద్దమును చేయుచుండిరి. గదల పదునైన ధారలు తగిలి వారి శరీరములనుండి రక్తము ప్రసరించుచుండెను. ఆ రక్తగంధమునాఘ్రాణించగా, వారి కోపము ఇబ్బడి ముబ్బడిగా పెరిగెను. వారు భూమి కొరకై ఒకరినొకరు జయించవ లెననే కోరికతో రకరకముల పద్ధతులలో గదలను ప్రయోగించుచుండిరి. ఆవు కొరకై పోట్లాడే రెండు ఆబోతుల వలె వారు ప్రకాశించిరి.

ఓ విదురా! యజ్ఞములే అవయవములుగా గలవాడు, మాయాశ క్తిచే వరాహ రూపమును దాల్చినవాడు, పరబ్రహ్మ స్వరూపుడు అగు శ్రీహరి భూమి నిమిత్తమై హిరణ్యాక్షునితో యుద్ధము చేయుచుండెను. దానిని చూచుటకై బ్రహ్మగారు మహర్షులతో కూడి విచ్చే సెను.

ఆ హిరణ్యాక్షుడు గొప్ప ఉత్సాహముతో నిర్భయముగా దెబ్బకు దెబ్బ తీయుచూ పోరుచుండెను. వాని పరాక్రమములో తగ్గుదల కానవచ్చుట లేదు. వేలాది మహర్షులను వెంట బెట్టుకొని వచ్చియున్న పూజ్యుడగు బ్రహ్మగారు ఆ విషయమును గమనించి, ఆదివరాహరూపములో నున్న నారాయణునితో నిట్లనెను.

ఓ దేవా! నేను ఈ రాక్షసునకు వరములనిచ్చి యుంటిని. వీడు నీ పాదమూలమును శరణు జొచ్చిన దేవతలకు, బ్రాహ్మణులకు; గోవులకు మరియు నిరపరాధులగు ప్రాణులకు హానిని, భయమును, దుఃఖమును కలి గించుచున్నాడు. లోకకంటకుడగు వీనికి సాటి లేరు. వీడు యుద్దమును చేయుటకై వీరులను వెదుకుతూ లోకములను సంచరించుచున్నాడు.

ఓ దేవా! వీడు మాయావి, గర్విష్టి, పరమదుష్టుడు. వీనిని నియం త్రించువారు లేరు. చిన్న పిల్లవాడు పడగ విప్పిన పాముతో ఆడినట్లుగా, నీవు వీనితో ఆటలాడవద్దు.

ఓ అచ్యుత దేవా! భయంకరుడగు ఈ రాక్షసునకు బలమును వర్ధిల్లజేసే కాలము వచ్చే లోపులోనే, నీవు నీ మాయాశక్తిని ఆవిష్కరింపజేసి, ఈ పాపిని సంహరించుము.