శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
21 - కర్దమునకు భగవానుడు వరమునిచ్చుట
విదురుడిట్లు పలికెను ఓ పూజ్యా! స్వాయంభువ వంశమును మహాత్ములు కూడ ఆదరించేదరు. స్త్రీపురుష సంయోగరూపముగా ఆ వంశము పెరిగి పెద్దది ఆయెను. ఆ వంశమును గురించి చెప్పుము.
స్వాయంభువ మనువుయొక్క కుమారులను ప్రియవ్రత-ఉత్తాన పాదులు ఏడు ఖండములతో కూడియున్న ఈ భూమండలమును ధర్మము నతిక్రమించకుండగా పాలించిరి గదా!
ఓ మహర్షీ! నీవు గొప్ప పుణ్యాత్ముడవు. స్వాయంభువ మనువు యొక్క కుమార్తె దేవహూతియని ప్రసిద్ధి గాంచినది. ఆమె కర్దమ ప్రజాప తియొక్క భార్యయని నీవు చెప్పితివి.
ఆ కర్దమ ప్రజాపతి గొప్ప యోగి. ఆయన భార్యయగు దేవహూతి యందు యమము మొదలగు యోగలక్షణములు గలవు. వారిద్దరికి సంతానము ఎందరు? నేనీ విషయమును వినగోరుచున్నాను. చెప్పడు.
ఓ మహర్షీ! పూజ్యుడగు రుచి ప్రజాపతి, బ్రహ్మపుత్రుడగు దక్షుడు కూడ మనువుయొక్క కుమార్తెలను భార్యలుగా పొంది, ప్రాణులను సృష్టించిన విధానమును గురించి చెప్పుము.
ప్రజలను సృష్టించుమని బ్రహ్మగారు పూజ్యుడగు కర్దమునకు చెప్పగా, ఆయన పదివేల సంవత్సరములు సరస్వతీ నదీతీరమునందు తపస్సును చేసెను.
ఆ తపస్సులో కర్దముడు చిత్తేకాగ్రముతో గూడిన పూజావిధానము ద్వారా శరణాగతులకు వరములనొసగే శ్రీహరిని భక్తితో ఆరాధించెను.
ఓ విదురా! పుండరీకాక్షుడగు శ్రీహరి భగవానుడు అప్పటికి ప్రస న్నుడై కృతయుగారంభమునందు వేదప్రతిపాద్యమగు సచ్చిదానందరూప మును దాల్చి ఆ కర్దమునకు దర్శనమిచ్చెను.
సూర్యుని వలె నిర్మలముగా ప్రకాశించుచున్న శ్రీహరిని ఆ కర్దముడు చూచెను. ఆయన తెల్లని పద్మములు మరియు కలువల మాలను ధరించియుండెను. ఆయన ముఖపద్మము దట్టని నల్లని కేశసముదాయ ముతో, కిరీటముతో, కుండలములతో ప్రకాశించెను. స్వచ్చమగు వస్త్ర మును, దాల్చిన శ్రీహరి శంఖమును, చక్రమును, గదను, విలాస కొరకై . తెల్లని కలువను పట్టుకొనియుండెను. ఆయన చూపులు, చిరునవ్వు మన స్సునకు ఆనందమును కలిగించుచుండెను. ఆయన ఆకాశములో గరు త్మంతుని భుజములపై పద్మములవంటి పాదములను ఆన్చి యుండెను. ఆయన మెడలో కౌస్తుభమాణిక్యము, వక్షస్థలముపై లక్ష్మీదేవి ప్రకాశించిరి.
కర్దముని మనోరథము సఫలమగుటచే ఆతనికి హర్షము కలిగేను. ఆయనది ప్రేమయే స్వభావముగా గల హృదయము. ఆయన నేలపై శ్రీహరికి సాష్టాంగ నమస్కారమును చేసి, చేతులను జోడించి స్తుతించెను.
కొనియాడదగిన ఓ శ్రీహరీ! ఆహా ! సంపూర్ణ సత్త్వగుణ నిధానమవగు నీ దర్శనము వలన నా కన్నులు సఫలమైనవి. భక్తులు అనేకజన్మలలో గొప్ప పుణ్యమును చేసుకొని, దాని ప్రభావముచే దృఢమగు జ్ఞానమును పొంది నిన్ను దర్శించుటకు ప్రార్థనలను చేయుచున్నారు.
ఓ ఈశ్వరా! నీ మాయచే నశింప జేయబడిన బుద్ధి గల జనులు సంసారసముద్రమును దాటించే నావవంటి నీ పాదపద్మములను అల్పము లగు కామనల కొరకై ఆరాధించెదరు. నీవు వారికి ఆ కామనలను నెరవేర్చేదవు. ఇంద్రియసుఖము నరకములో కూడ లభించును.
నేను కూడ అట్టి కలుషితమైన చిత్తము గలవాడనే. గృహాశ్రమము నకు గృహిణి కామధేనువు. నేను నా స్వభావమునకు అనురూపమగు యువతిని వివాహమాడ గోరుచున్నాను. నీవు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షమవు. పురుషార్థములన్నింటికీ మూలమగు నీ పాదమూలమును నేను శరణు వేడుచున్నాను.
ఓ సర్వేశ్వరా! నీవు పరిశుద్దుడవు. ప్రజలను పాలించే నీవు వేదము అనే ఉపదేశమును మానవులకు అందించినావు. కామనలచే హతు లైన మానవలోకము కర్మశాస్త్రము అనే త్రాటిచే కట్టివేయబడి యున్నది. నేను కూడ అదే లోకముననుసరిస్తూ, కాలస్వరూపుడవగు నిన్ను పూజాది కముతో ఆరాధించుచున్నాను.
నీ భక్తులు భోగపరాయణులగు జనులను, వారి అనుయాయు లను దూరముగా పెట్టి, తమలో తాము నీ గుణములను గానము చేయు చుందురు. ఆ గానముయొక్క మత్తెక్కించే మధురిమలో వారు దేహధర్మ ములగు ఆకలిదప్పికలను విస్మరించెదరు. వారు నీ పాదములు అనే ఛత్ర ఛాయను ఆశ్రయించేదరు.
సంవత్సరము అనే నీ కాలచక్రము పరబ్రహ్మ అనే ఇరుసునందు తిరుగుచుండును. దానికి అధికమాసముతో కలుపుకొని పదమూడు ఆకులు గలవు. ఋతువులు అనే ఆరు కమ్మీలు గల ఆ చక్రముపై లెక్కలేనన్ని పత్రములు (సెకనులు, నిముషములు) చెక్కబడియున్నవి. నాలుగు మాస ముల కాలఖండములే మూడు నడిమి తూములుగా గల ఈ చక్రము తీవ్ర మగు వేగముతో పరుగెత్తుతూ జగత్తును తనతో వినాశము వైపునకు లాగు కొని పోవుచున్నది. కాని, అది నీ భక్తుల ఆయుర్దాయమును మాత్రము వ్యర్థము చేయలేకున్నది.
ఓ భగవానుడా! సృష్టికి పూర్వము నీవు ఒక్కడివే గలవు. నీకు సృష్టిని చేయవలెననే కోరిక కలిగెను. నీవే అధిష్టానముగా గల యోగ మాయ నీకంటే వేరుగా లేదు. సత్త్వరజస్తమోగుణములనే శక్తులను కలిగి యున్న ఆ యోగమాయ ద్వారా నీవు, సాలెపురుగు తననుండియే గూడును ప్రకటించే విధముగా, ఈ జగత్తును నీనుండియే సృష్టించి, పాలిం చుచున్నావు. మరల దానిని ప్రళయములో నీ లోనికే ఉపసంహరించెదవు.
ఓ సర్వేశ్వరా! ఆహా! నీవు మాయచే, శబ్దరూపరసస్పర్శగంధాత్మ కమగు భోగ్యజాతమును విస్తరింప జేసినావు. దానిని మాకు వరముగా నిచ్చుట నీకు సమ్మతము కాదు. అయినప్పటికీ, అది అంతతో గత్వా నాకు మోక్షరూపమగు నీ అనుగ్రహమునకే దారి తీయుగాక! ఏలయనగా, మాయచే పరిచ్చిన్నునిగా కన్పట్టే నీ తులసీమాలావిభూషితమైన రూపమును నేను కంటిని.
నీవు నిషియ పరబ్రహ్మస్వరూపుడవు. నీకు కర్మలయందు గానీ, వాటి ఫలములయందు గాని అపేక్ష లేదు. అయిననూ, నీవు నీ మాయాశక్తిచే లోకవ్యవహారమును నడిపించుచున్నావు. నీ పాదపద్మ ములు నమస్కరించ దగినవి. నీవు అల్పుడగు నావంటి భక్తుడు చేసే చిన్న ఆరాధనకైననూ కోరికలను వర్షించేదవు. అట్టి నీకు పలుమార్లు నమస్కరిం చుచున్నాను.
మైత్రేయుడు ఇట్లు పలికెను - ఈ విధముగా కర్దముడు నిష్కప టముగా గరుత్మంతుని రెక్కలపై ప్రకాశించుచున్న పద్మనాభుని స్తుతించే ను. ఆయన ప్రేమతో చిరునవ్వు నవ్వి తలను పైకెత్తి కనుబొమలను కదు పుతూ కర్దముని చూచి, అమృతమువంటి వాక్కుతో ఇట్లు పలికెను.
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను --- నీ మనస్సులోని అభిప్రాయము నాకు తెలియును. దేని కొరకైతే నీవు శమదమాది మనోనియమములతో నన్ను నిశ్చయముగా ఆరాధించితివో, దాని ఏర్పాటును నేను. పూర్వమే చక్కగా చేసియున్నాను.
ఓ ప్రజాపతీ! మనస్సును నాపై ఏకాగ్రము చేసి నన్ను పూజించే భక్తుల ఆ పూజ ఎన్నటికీ వ్యర్థము కానే కాదు. నీవంటి వారి విషయములో అసలే వ్యర్థము కాదు.
బ్రహ్మగారి పుత్రుడగు స్వాయంభువ మనువు చక్రవర్తియై బ్రహ్మా వర్తమును రాజధానిగా చేసుకొని ఏడు సముద్రములతో గూడిన భూమిని శాసించుచున్నాడు. ఆయన సదాచారము లోకములో ప్రసిద్ధము.
ఓ మహర్షీ! ధర్మజ్ఞుడు, రాజర్షియగు ఆ మనువు భార్యయగు శత రూపతో గూడి నిన్న చూడగోరి ఇచటకు ఎల్లుండి రాగలడు.
ఆయన కుమార్తె నల్లని కన్నులు గల చిన్నది. ఆమె శీలము, గుణములు గొప్పవి. ఆమె యుక్తవయస్కురాలు. మను చక్రవర్తి అట్టి తన కుమార్తెను నీకు ఇచ్చి వివాహము చేయగలడు.
ఓ మహర్షీ! గడచిన చాల సంవత్సరములనుండి భార్యను పొంద వలెననే ఆకాంక్ష నీ హృదయములో స్థిరముగా నుండెను. అట్టి రాజకన్య తొందరలోనే నీకు భార్యయై నిన్ను యథేచ్ఛగా సేవించగలదు.
ఆ రాజకన్యయందు నీవు తొమ్మిదిమంది కుమార్తెలను కనగలవు. వారు సాక్షాత్తుగా మహర్డులకు భార్యలై వారి వలన సంతానమును బడయ గలరు.
శుద్దమగు అంతఃకరణము గల నీవు కూడా నా ఆదేశమును చక్కగా అనుష్ఠించి, సకలకర్మలను వాటి ఫలములతో సహా నాకు సమర్పించి, నన్ను పొందగలవు.
నీవు ఇంద్రియములను జయించి, ప్రాణులయందు దయను చూపుతూ, సకలప్రాణులకు అభయమునిచ్చే సన్న్యాసాశ్రమమును స్వీక రించెదవు. తనతో సహా ఈ జగత్తు అంతా పరమేశ్వరునియందే నిలిచియు న్నదనే జ్ఞానము నీకు కలుగగలదు. ఇంతేగాక, నన్ను సర్వమును ఆత్మ యందు, అనగా ఆత్మరూపముగా దర్శించగలవు.
ఓ మహర్షీ! నేను నీ భార్యయగు దేవహూతియందు ఇతరసంతాన ముతో బాటు నా అంశకళతో అవతరించి, తత్త్వముల స్వరూపమును వివరించే సాంఖ్యశాస్త్రమును బోధించగలను.
ఇంద్రియములు అంతర్ముఖములైనప్పుడు మాత్రమే శ్రీహరి దర్శనమిచ్చును, ఆ భగవానుడీ విధముగా కర్దమునితో సంభాషించి, తరు వాత సరస్వతీ నదిచే చుట్టువారబడియున్న ఆ బిందుసరస్సు వద్దనుండి తన లోకమునకు వెళ్లాను.
శ్రీహరిని పొందే మార్గము (వైకుంఠ మార్గము, జ్ఞానమార్గము) ను సిద్ధపురుషులు అన్వేషించుచుందురు. గొప్ప సిద్దులందరు ఆ మార్గమును కొనియాడుచుందురు. అట్టి శ్రీహరి, కర్దముడు చూచుచుండగనే, గరుత్మం తుని రెక్కలనుండి వెలువడే సామగానమును, ఆయనచే ఉచ్చరించబడిన ఋగ్వేదమంత్రములను వింటూ, తన లోకమునకు వెళ్లాను.
శ్రీహరి తన లోకమునకు వెళ్లిన తరువాత పూజ్యుడగు - కర్దమ మహర్షి మనుచక్రవర్తి రాకను ప్రతీక్షిస్తూ బిందుసరస్సుయొక్క తీరమునం దలి తన ఆశ్రమమునందు ఉండెను.
మను చక్రవర్తి తన భార్య, కుమార్తె వెంట రాగా, బంగరు అలంకా రములతో కూడియున్న రథమునెక్కి భూమిని పర్యటించుచుండెను.
ఓ విదురా! కర్దమ మహర్షి తపోవ్రతమును పూర్తి చేసుకొని విశ్రాం తిగా నుండెను. శ్రీహరి భగవానుడు నిర్దేశించిన నాటికే మను చక్రవర్తి ఆ ఆశ్రమస్థానమునకు చేరుకొనెను.
తనను శరణు పొందిన కర్దముని చూడగానే శ్రీహరి భగవానుని హృదయము అతిశయించిన దయతో నిండిపోయెను. ఆయన కన్నుల నుండి నీటి బిందువులు జారి ఆ ఆశ్రమస్థానమునందు పడినవి.
కావుననే, ఆ స్థానమునకు బిందుసరస్సు అనే పేరు ప్రసిద్ధిని గాంచినది. పవిత్రమగు ఆ సరస్సు సరస్వతీనదిచే చుట్టువారబడి యున్న ది. దానిలోని శుభకరమగు జలము అమృతము వలె నుండును. మహర్షుల గణములు ఆ సరస్సును సేవించుచుండును.
పవిత్రములగు చెట్లు, తీగల గుంపులతో నిండియున్న ఆ ఆశ్రమ ములో పవిత్రములగు మృగములు, పక్షులు ధ్వనులను చేయుచున్నవి. అది తమంత తాముగా పుట్టి పెరిగిన చెట్ల వరుసలతో శోభిల్లుచుండెను. అన్ని ఋతువులకు చెందిన పువ్వులు, పండ్లు అచట సమృద్ధిగా నుండెను.
మదించిన తుమ్మెదల విలాసలు గల ఆ ఆశ్రమము మత్తెక్కిన పక్షుల గుంపులతో కిలకిలలాడుచుండెను. అచట నెమళ్లు హడావుడిగా నాట్యములను చేయుచుండగా, కోకిలలు తమ కూతలతో జనులను ఆహ్వా నించుచుండెను.
కడిమి, సం పెగ, అశోకము, పొగడ, వేగి, కోడి సె, లేత మామిడి అనే చెట్లతో, మల్లె మందారము అనే మొక్కలతో ఆ ఆశ్రమము శోభిల్లెను.
కన్నెలేళ్లు, బాతులు, హంసలు, పెన్నడ పులుగులు, నీటి కోళ్లు, బెగ్గురు పక్షులు, జక్కవ పిట్టలు, వెన్నెల పులుగులు అచట మనోహరముగా కూయుచుండెను.
అదే విధముగా అచట ఇర్రిలు, అడవి పందులు, ఏదు పందులు, గురుపోతులు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, కోతులు, 'ముంగిసలు, కస్తూరి మృగములు గలవు.
ఆదిరాజగు మనువు కుమార్తెతో కలిసి ఆ గొప్ప పుణ్యక్షేత్రమును చేరి ఆశ్రమమునకు వెళ్లెను. అచట అగ్నులను వ్రేల్చి విశ్రాంతిగా కూర్చుని యున్న కర్దమ మహర్షిని ఆయన చూచెను.
చిరకాలము తపస్సును చేయుటచే కర్దముని శరీరము ప్రకాశించు చుండెను. శ్రీహరి భగవానుడు ఆయనను ప్రేమతో నిండిన కటాక్షముతో చూచెను. పైగా, ఆయన శ్రీహరియొక్క అమృతమువలె మధురమైన పలుకులను వినియుండెను. కావుననే, ఆయన మరీ చిక్కినట్లుగా లేడు.
కర్దముడు పొడవైనవాడు. ఆయన కన్నులు పద్మపత్రములను బోలియుండెను. జటాధారియగు ఆయన నారబట్టలను ధరించెను. ఆయన సాన పెట్టబడని కారణముగా ప్రకాశించని గొప్ప రత్నము వలె నుండెను. మనువు దగ్గరకు వెళ్లి ఆయనను దర్శించెను.
అపుడు కర్దముడు తన పర్ణశాలకు వచ్చి నమస్కరించి ఎదుట నిల బడిన మహారాజును అభినందించి తగిన విధముగా సపర్యను అందించి సత్కరించెను.
మను చక్రవర్తి సత్కారమును స్వీకరించి కూర్చుండి శ్రద్దగా ఆల కించుచుండెను. కర్దమ మహర్షి భగవానుని ఆదేశమును గుర్తు చేసుకొని మధురమగు వచనములతో నిట్లు పలికెను. ఆయన మాటలను విని మను మహారాజు సంతోషించెను.
ఓ ప్రభూ! శ్రీహరియొక్క పాలనశక్తి నీ రూపములో నున్నది. నీ ఈ సంచారము వలన దుష్టులు శిక్షింపబడి, సత్పురుషులకు రక్షణ లభిం చును. ఇది నిశ్చయము.
సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు, ధర్ముడు మరియు వరుణుడు అనే దేవతల రూపములను నీవు ధరించుచు న్నావు. నీవు విశుద్ధ విష్ణు స్వరూపుడవు. నీకు నమస్కారము.
ఓ రాజా! నీవు మణుల గణములు పొదిగిన జయప్రదమగు రథ మునెక్కి, ధ్వనించే భయంకరమగు ధనస్సును ధరించి కదిలినప్పుడు, నీ రథమును చూచినంత మాత్రాన పాపులు భయపడెదరు. నీవు సూర్యుని వలె పెద్ద సేనను నడిపిస్తూ సాగినప్పుడు, నీ సైనికుల పాదముల తొక్కి డికి భూమండలము కంపించును. నీవీ విధముగా పర్యటించనినాడు, వెంటనే వర్ణాశ్రమనిర్వహణకు ఆలంబనమైన భగవన్నిర్మితములగు ధర్మ మర్యాదలు అన్నియు దుష్టులచే చెల్లాచెదరు చేయబడును సుమా!
నీవు ప్రమత్తుడవైనచో, భోగలాలసులగు జనులకు అడ్డు ఆపు ఉండదు. వారి కారణముగా అధర్మము వర్ధిల్లును. దుష్టులగు జనులచే కబ ళించి వేయబడి ఈ లోకము నశించును.
ఓ వీరా! అయినప్పటికీ, నేను నిన్ను అడుగుచున్నాను. నీవు ఇచ టకు వచ్చిన ప్రయోజనమును నేను నిష్కపటమగు హృదయముతో స్వీక రించెదను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది.
