శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

14 - దితి గర్భమును ధరించుట

       శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి భూమిని ఉద్ధరించుట కొరకై వరాహావతారమును దాల్చిన గాథను ఈ విధముగా మైత్రేయ మహర్షి వర్ణించి చెప్పగా విదురుడు వినెను. అయిననూ, దృఢమగు ప్ వ్రతనిష్ఠ గల విదురునకు పూర్ణమగు తృప్తి కలుగలేదు. అపుడాయన చేతులను జోడించి, మరల మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను.

ఓ మహర్షీ! యజ్ఞవరాహ రూపుడగు శ్రీహరియే మొట్టమొదటి దైత్యుడగు హిరణ్యాక్షుని చంపెనని నీవు చెప్పగా నేను వినియుంటిని,

     ఓ మహర్షీ! తన కోరయొక్క కొనపై అవలీలగా భూమిని పైకి యెత్తుచున్న వరాహ భగవానునకు రాక్షసరాజగు హిరణ్యాక్షునితో యుద్ధము జరుగుటకు కారణమేమి?

 ఓ విదురా! ధర్మవీరుడవగు నీవు చక్కగా ప్రశ్నించితివి. ఏలయనగా, మానవుల మరణపాశమును తెగగొట్టే శ్రీహరియొక్క అవతారగాథను గురించి నీవు ప్రశ్నించుచున్నావు.

ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు చిన్న పిల్లవాడు. కాని, ఆతడు నారదుని వలన శ్రీహరి మహిమను విని, ఉపదేశమును పొంది, దాని ప్రభావముచే మృత్యువును జయించి, శ్రీహరియొక్క స్థానమగు ధ్రువపదమును పొందెను.

      ఓ విదురా! నీ ప్రశ్నకు సమాధానమును చెప్పుచున్నాను. పూర్వము ఇదే విషయమును గురించి దేవతలు ప్రశ్నించగా, దేవదేవుడగు బ్రహ్మగారు ఒక వృత్తాంతమును వర్ణించి చెప్పినారు. అపుడు నేను దానిని వినియుంటిని.

ఓ విదురా! దక్షుని కుమార్తెయగు దితి మరీచి మహర్షియొక్క పుత్రుడగు కశ్యపుని భార్య. ఆమెకు సంతానమునందు ప్రీతి ఉండెను. ఆమె ఒకనాడు సంధ్యాకాలములో కామపీడితురాలై తన భర్తను ప్రార్థించెను.

కశ్యప ప్రజాపతి అగ్ని అనే జిహ్వ ద్వారా హవిస్సులను స్వీకరించే యజ్ఞపతియగు పరమేశ్వరుని పయోహోమముచే ఆరాధించి, సూర్యుడు అస్తమించుచుండగా, అగ్నిహోత్రశాలయందు ధ్యానమగ్నుడైయుండెను. అప్పుడు దితి ఆయనను ప్రార్థించెను.

ఓ విద్వాంసుడా! ఈ మన్మథుడు తన ధనస్సును ఎక్కు పెట్టి నీతో పొందు కొరకై దీనురాలనై యున్న నాపై పరాక్రమించి, ఏనుగు అరటి చెట్టును వలె, పీడించుచున్నాడు.

       నా సవతులు సంతానవతులు. వారి విభవమును చూచిన నా హృదయము దహించుకు పోవుచున్నది. కావున, నీవు సాయందు అన్ని విధములుగా అనుగ్రహమును చూపదగును. నీకు మంగళమగు గాక!

ఏ స్త్రీల కడుపున నీ వంటి భర్తలు పుత్రరూపములో జన్మించెదరో, వారు తమ భర్త విషయములో గొప్ప ఆదరమును పొందెదరు. వారి కీర్తి నిశ్చయముగా లోకములో అంతటా వ్యాపించును.

మా నాయనగారు పూజ్యుడగు దక్షుడు పుత్రికలపై గొప్ప ప్రేమ గలవాడు. ఆయన పూర్వము, అమ్మాయిలూ! మీరు ఎవనిని భర్తగా వరించెదరు? అని మమ్ములను వేర్వేరుగా ప్రశ్నించెను.

సంతానముయొక్క హితమును కోరే ఆయన కుమార్తెలమగు మా అభిప్రాయమును తెలుసుకొని, దానికి తగ్గ విధముగా నీ గుణమును స్వభావమును ఇష్టపడిన తన పదముగ్గురు కుమార్తెలను నీకు ఇచ్చి వివాహమును చేసేను.

ఓ మంగళమూర్తీ! కలువ కన్నులవాడా! మహాత్మా! కావున, నీవు నా కోరికను సఫలము చేయుము. కష్టములోనున్న వ్యక్తి మహాత్ముని సమీపించి కోరినచో, ఆ కోరిక వ్యర్థము కాదు.

ఆ దితి ఈ విధముగా కామోద్రేకముచే మోహితురాలై దైన్యముతో అధికముగా ప్రసంగించుచుండగా, మరీచిపుత్రుడగు కశ్యపుడు ఆమెను మంచి మాటలతో ఓదారుస్తూ ఇట్లు బదులు చెప్పెను.

ఓ భయస్వభావము గలదానా! నీకు ప్రియమైన కోరికను నీచే ప్రార్థించబడిన నేను నెరవేర్చెదను. మానవుడు భార్య మూలకముగా ధర్మార్థకామములనే పురుషార్థములలో కృతార్థుడగును. అట్టి భార్యయొక్క కోరికను ఎవడు నెరవేర్చకుండును?

       నావికుడు నౌక సాయముతో తాను సముద్రమును దాటుటయే గాక, ఇతరులను కూడ దాటించును. అదే విధముగా గృహస్థుడు భార్య యొక్క సాయముతో ఆకలి దప్పికలు అనే దుఃఖసముద్రమును తాను దాటుటయే గాక, మిగిలిన మూడు ఆశ్రమముల వారిని కూడ దాటించును (వారికి కూడ ఆహారాదులను సమకూర్చును).

ఓ అభిమానవతీ! శ్రేయస్సును కోరే మానవునకు భార్య తన దేహములో సగభాగమని మహర్షులు చెప్పుచున్నారు. మానవుడు తన బరువును భార్యకు అప్పజెప్పి నిశ్చింతగా తిరుగును.

దుర్గముయొక్క రక్షణను కలిగియున్న దుర్గాధిపతి బందిపోటు దొంగలను అవలీలగా జయించ గల్గును. అదే విధముగా, గృహస్థులమగు మేము ఇంద్రియములనే శత్రువులను శాస్త్రీయమైన భార్యతోడి విలాససం భోగముల ద్వారా జయించేదము. కాని, ఇంద్రియజయము ఇతరములగు ఆశ్రమముల వారికి తేలిక కాదు.

ఓ దితీ! గృహమునకు ప్రభ్వివి నీవు. అట్టి నీవు చేసిన సేవకు తగిన ప్రతి సేవను చేయుటకు మాకు గాని, గుణగ్రాహులగు ఇతర పురుషులెవ్వరికైననూ గాని, పూర్తి ఆయుర్దాయము కూడ చాలదు.

నీకు ప్రత్యుపకారమును చేయగల్గుట అసంభవమే అయినప్పటికీ, నేను సంతానము కావాలనే ఈ నీ కోరికను నెరవేర్చెదను. నీవు ఒక గంట సేపు వేచియుండుము. దాని వలన, జనులు నన్ను నిందించకుందురు.

      ఈ ఘోరమగు సంధ్యాసమయము చూచుటకైననూ భయమును  గొల్పును. ఇది భయంకరాకారులగు రాక్షసులు మొదలగు వారికి చెందిన కాలము. ఈ కాలమునందు భూతములకు ప్రభువగు రుద్రుని అనుచరలగు భూతప్రేతపిశాచాదులు సంచరించుచుండును.

ఓ సాధ్వీ! ఈ సంధ్యాకాలమునందు సకలప్రాణులకు రక్షకుడు, భూతప్రేతాదులకు ప్రభువు అగు రుద్ర భగవానుడు వృషభమునధిష్టించి సంచరించును. భూతసమూహములు ఆయనను చుట్టువారి యుండును.

రుద్రుని ప్రకాశించే జటాజూటము శ్మశానమునందలి సుడిగాలిచే చెల్లాచెదరై బూడిద నిండి యుండును. ఆయన తన బంగరు కాంతి గల స్వచ్చమగు దేహమునంతా భస్మను పూసుకొనియుండును. ఆయన నీ సోదరి సతీదేవి భర్త. ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే తన మూడు కన్నులతో అందరినీ చూచుచుండును.

ఆ మహాదేవునకు లోకములో తన వాడు గాని, పరాయి వాడు గాని లేడు. ఒకడు మిక్కిలి ఆదరించ దగినవాడు, మరియొకడు నిందనీయుడు అనే భేదము ఆయన దృష్టిలో సుతరాము లేదు. మేము అనేకవ్రతములను చేసి ఆయన మాయాశక్తిని ప్రార్థించుచుందుము. కాని, దానిని ఆయన అనుభవించి, పాదముల వద్ద దూరముగా నుంచినాడు.

       అజ్ఞానము మానవునకు ఆత్మస్వరూపము తెలియకుండగా కప్పి వేయును. అట్టి ఆవరణము విషయములో భయమును కలిగియుండుటయే అభిలషణీయము. కనుకనే, విద్వాంసులు అట్టి అజ్ఞానభయమును కోరేదరు. అట్టి వివేకులు అజ్ఞాననివృత్తి కొరకై ఆ మహాదేవుని చరితమును గానము చేయుదురు. ఆయన సత్పురుషులకు ఆశ్రయము. ఆయనతో సమానుడు గాని, అధికుడు గాని లేడు. అయిననూ, ఆయన పిశాచముల చేష్టలవలె భాసించే చేష్టలను కలిగియున్నాడు.

రుద్రుడు తన స్వరూపమునందు రమిస్తూ మానవులకు నేర్పుట కొరకై కొన్ని చేష్టలను చేయును. కాని, ఆయన అభిప్రాయమునేరుంగని మందభాగ్యులు ఆయన చేష్టలను పరిహసించెదరు. అదే సమయములో వారు, మరణించిన తరువాత కుక్కలకు నక్కలకు భోజనము కాదగిన దేహమునందు ఆత్మబుద్ధి గలవారై, దానిని వస్త్రములతో పుష్పమాలలతో మరియు ఆభరణములతో అలంకరించి, దానికి సుగంధద్రవ్యములను అలిమి లాలించుచుందురు.

    బ్రహ్మాదులు కూడ ఆ రుద్రుడు ఏర్పాటు చేసిన మర్యాదలను పాలించుచుందురు. ఈ జగత్తునకు అధిష్ఠానము ఆయనయే. మాయాశక్తి ఆయన చెప్పుచేతలలో మెలగును. ఆశ్చర్యము! సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అగు అట్టి రుద్రుడు పిశాచము వలె ప్రవర్తించుట కేవలము అనుకరణము మాత్రమే. ఆ అద్భుతలీల మనకు తెలియవచ్చుట లేదు.

 మైత్రేయుడిట్లు పలికెను --- భర్తయగు కశ్యప మహర్షి ఈ విధముగా నచ్చజెప్పెను. అయిననూ, ఆమె మనస్సు మన్మథునిచే కల్లోలితము చేయబడి యుండెను. ఆమె వేశ్య వలె సిగ్గును విడిచి ఆ బ్రహ్మర్షి యొక్క వస్త్రమును పట్టుకొనెను.

      తరువాత ఆ కశ్యప మహర్షి తన భార్యకు నిషిద్ధమగు కర్మయందు గల ఆ పట్టుదలను గమనించి, పరమేశ్వరునకు నమస్కరించి, ఏకాంతమునందు ఆమెతో గడి పెను.

తరువాత ఆయన స్నానమును చేసి, ప్రాణాయామమును చేసి, మౌనమును దాల్చెను. వికారములు లేనివాడు, స్వయంప్రకాశస్వరూపుడు, సనాతనుడు అగు పరమాత్మను ధ్యానిస్తూ ఆయన జపమును చేసెను.

భరతవంశీయుడవగు ఓ విదురా! దితి ఆ కర్మదోషముచే సిగ్గుపడి ఆ మహర్షి వద్దకు వచ్చి తలను వంచుకొని ఇట్లు పలికెను.

 దితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రమథగణాధిపతి, భూతములను పాలించువాడు అగు రుద్రుడు నా ఈ గర్భమును సంహరించకుండు గాక! నేను ఆయన విషయములో అపరాధమును చేసితిని.

మహాదేవుడు, దుష్టులకు భయంకరుడై కోపమూర్తియై శిక్షను విధించువాడు, సత్పురుషుల విషయములో దండించవలెననే భావనను  సైతము దూరముగా పెట్టి వారికి కోరికలను వర్షించువాడు, మంగళస్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము.

. ఎంతటి క్రూరులైననూ స్త్రీలపై దయను చూపెదరు. సతీదేవికి భర్త, నాకు బావగారు, గొప్ప దయ గలవాడు, మహాదేవుడు అగు ఆ రుద్ర భగవానుడు నాపై ప్రసన్నుడగుగాక!

       మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దితి తన సంతానమునకు ఇహపరలోకములలో శుభమును కోరి భగవానుని ప్రార్థించుచుండెను. ఆమె తాను అపరాధమును చేసితిననే భయముతో వణికిపోవుచుండెను. ఇంతలో కశ్యప ప్రజాపతి సంధ్యాకాల నియమమును పూర్తి చేసుకొని, ఆమెతో నిట్లనెను.

కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను --- ఓ అమంగళ స్వరూపురాలా! కోపస్వభావము గలదానా! నీ మనస్సు స్వచ్చమైనది కాదు. నీకు సంధ్యా సమయమునందు అట్టి భావన కలుగుట దోషము. నీవు నా ఆదేశమును కూడ ఉల్లంఘించితివి. పైగా, రుద్రుని అనుచరులగు దేవతలను నిశ్చయ ముగా అవమానించితివి. ఇన్ని కారణములచే, నీకు నిశ్చయముగా అమం గళ స్వరూపులగు ఇద్దరు అధములు పుత్రులై జన్మించెదరు. వారు లోకపా లకులతో సహా ముల్లోకములను పలుమార్లు ఏడిపించేదరు.

      వారు నిరపరాధులు, దీనులు అగు ప్రాణులను హింసించెదరు. స్త్రీలను చెరపట్టెదరు. అప్పుడు మహాత్ములు కోపించెదరు. అప్పుడు జగ స్నాథుడు, జగత్పాలకుడు అగు ఈ శ్రీహరి భగవానుడు అవతరించి, ఇంద్రుడు వజ్రమును చేతబట్టి పర్వతముల రెక్కలను నరికిన విధముగా, వారినిద్దరినీ సంహరించగలడు.

దితి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నా పుత్రులిద్దరు వధించబడే పక్షములో, సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడు తన సుందరమగు చేతిలో సుదర్శన చక్రమును పట్టి వారిని సంహరించుగాక! అంతేగాని, వారు కోపించిన బ్రాహ్మణుల శాపముచే మరణించరాదని నా ప్రార్థన.

బ్రాహ్మణుని శాపముచే మరణించిన వానికి, ప్రాణులకు భయమును కలిగించు వానికి నరకమునందలి వారు కూడ అనుగ్రహమును చూపరు. అట్టివాడు ఏయే జన్మను పొందిననూ, అక్కడ కూడ ఆయా ప్రాణులు వాని విషయములో అనుగ్రహమును చూపవు.

నీవు చేసిన పనికి దుఃఖించి పశ్చాత్తాపమును పొందినావు. పనిని చేసిన వెంటనే అది ఉచితమా, కాదా అని వివర్శించుకున్నావు. పైగా, శ్రీహరి భగవానునియందు, శివునియందు మరియు నాయందు గొప్ప ఆదరమును చూపినావు. కావున, నీ పుత్రులలో ఒకనికి సత్పురుషులచే కొనియాడబడే కొడుకు ఒకడు జన్మించగలడు. పవిత్రమైన పోనీ కీర్తిని జనులు భగవంతుని కీర్తితో సమానముగా గానము చేయగలరు.

మెరుగును కోల్పోయిన బంగారమును పుటము పెట్టుట మొద లగు ఉపాయములచే శుద్ధి చేయుదురు. అదే విధముగా సాధుజనులు వైరము లేకుండుట మొదలగు లక్షణములతో కూడిన వాని స్వభావమున నుకరించి, తమ అంతఃకరణమును శుద్ధి చేసుకొనెదరు.

ఈ జగత్తునకు అధిష్ఠానము భగవానుడే. భగవానుని అనుగ్రహ మున్నచో, జగత్తుయొక్క అనుగ్రహము కూడ లభించును. అట్టి స్వయంప్ర కాశస్వరూపుడగు శ్రీహరి భగవానుడు ఆ నీ పౌత్రుని అభేదజ్ఞానము (ఏ కాంతభక్తి) చే సంతోషించగలడు.

ఆ బాలకుడు గొప్ప భగవద్భక్తుడు కాగలడు. ఆతడు విశాలమగు హృదయము గలవాడై, గొప్ప ప్రభావశీలియై, గొప్పవారిలో కెల్లా గొప్పవాడుగా వెలుగొందగలడు. ఆతడు అతిశయించిన భక్తిచే పవిత్రమైన తన హృదయములో శ్రీహరిని నిలిపి దేహాభిమానమును అధిగమించగలడు.

జితేంద్రియుడగు ఆతనియందు చక్కని శీలము, సకలసద్గుణ ములు నివాసము చేయును. ఇతరులు అభివృద్ధిని చేందినపుడు ఆతడు చూచి ఆనందించును. కాని, ఇతరులు దుఃఖముననుభవించుచుండగా చూచి ఆతడు కూడ భేదమును పొందును. ఆతడు అజాతశత్రువు కాగల డు. వేసవికాలపు తాపమును చంద్రుడు తొలగించినట్లుగా, ఆతడు జనుల శోకమును బాపగలడు.

స్వచ్చమైనవాడు, పద్మమువంటి కన్నులు గలవాడు అగు శ్రీహరి తన భక్తుల కోరికననుసరించి అవతారములనెత్తుచుండును. ఆయన లక్ష్మీ దేవియొక్క శోభను కూడ తన దివ్యరూపముచే ఇనుమడింపజేయుచుండును. మెరిసే కుండలములు ఆయన ముఖమునకు అలంకారములై ఒప్పారును. అట్టి శ్రీహరిని నీ మనుమడు తన హృదయములో మాత్రమే గాక సర్వజగత్తునందు (అధిష్ఠానరూపముగా) దర్శించగలడు.

తన మనుమడు గొప్ప భగవద్భక్తుడు కాగలడని విని దితి చాల సంతోషించెను. అంతేగాక, తన ఇద్దరు పుత్రులు శ్రీహరి భగవానునిచే వధించబడెదరని తెలుసుకొని, ఆమె చాల ఉత్సాహమును పొందెను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో

పదునాలుగవ అధ్యాయము ముగిసినది (14).