శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
26 - మహత్తు మొదలగు తత్త్వముల ఉత్పత్తి
కపిల భగవానుడిట్లు పలికెను --- నేనిప్పుడు నీకు ప్రకృతి మొద లగు తత్త్వముల లక్షణమును వేర్వేరుగా వివరించి చెప్పెదను. ఈ జ్ఞానము వలన మానవుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క బంధమునుండి విముక్తుడగును.
ఈ జ్ఞానము వలన మానవుని హృదయములోని అజ్ఞానమనే ముడి విడిపోవును. దాని వలన ఆత్మసాక్షాత్కారము కలిగి మానవుడు మోక్షమును పొందునని మహర్షులు చెప్పుచున్నారు. అట్టి జ్ఞానమును నేను నీకు వివరించి చెప్పెదను.
అనాది, నిర్గుణుడు, ప్రకృతికి అతీతుడు అగు పురుషుడు ఆత్మయే. ఈ దేహేంద్రియసంఘాతములో అతిసూక్ష్మమగు స్వయంప్రకాశ తత్త్వము ఆత్మయే. ఈ జగత్తు ఆత్మచైతన్యముచే వ్యాప్తమై ప్రకాశించుచున్నది.
సర్వవ్యాపకుడగు ఆ పురుషుడే తన ఇచ్చ చే మాత్రమే తనకు సంప్రాప్తమైన తన మాయాశక్తిని లీలచే స్వీకరించెను. సత్త్వరజస్తమోగుణాత్మకమగు ఆ మాయ జగత్కారణమగుటచే సూక్ష్మము.
ప్రకృతి తన సత్త్వరజస్తమోగుణములచే తనతో సమానమైన స్వరూపము గల వివిధప్రాణులను సృష్టించెను. ఈ సంసారములో ఆ ప్రకృ తిని చూచి పురుషుడు ఆ మాయాశక్తి యొక్క ఆవరణశక్తిచే తన స్వరూపమును విస్మరించెను.
ఈ విధముగా పురుషుడు తనకంటే విలక్షణమైన ప్రకృతిని తన స్వరూపముగా పొరబడినాడు. కావుననే, ప్రకృతియొక్క గుణములు కర్మలను చేయుచుండగా, వాటి కర్తృత్వమును తన పై ఆపాదించుకొనినాడు.
పురుషుడు అకర్త, స్వతంత్రుడు, సాక్షి, ఆనందస్వరూపుడు. కాని, ఆ అధ్యాసచే పురుషునకు జననమరణప్రవాహరూప సంసారము, కర్తృత్వ ముచే కర్మబంధము, దానిచే అస్వతంత్రత సంప్రాప్తమైనవి.
దేహము, ఇంద్రియములు ప్రకృతినుండి ఉత్పన్నమగుచున్నవి. ప్రకృతికి అతీతుడైన పురుషుడు వాటితో తాదాత్మ్యమును చెంది సుఖదుఃఖ ములకు భోక్త యగుచున్నాడని మహర్షులు చెప్పుచున్నారు.
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ పురుషోత్తమా! ఈ జగత్తునకు ప్రకృతిపురుషులు హేతువు. స్థూలసూక్ష్మరూపమగు ఈ జగత్తుయొక్క స్వరూపము ప్రకృతిపురుషులే. వాటి లక్షణములను చెప్పుము.
కపిల భగవానుడిట్లు పలికెను --- సత్త్వరజస్తమోగుణాత్మకము, సూక్ష్మమైనది, ఉత్పత్తివినాశములు లేనిది, కార్యకారణరూపములోనున్నది, పృథివి మొదలగు విశేషములు స్వయముగా తనయందు లేకున్ననూ వాటికి ఆశ్రయమగునది, జగత్తునకు ముఖ్యకారణము అగు తత్త్వమును ప్రకృతి అని అందురు.
అయిదు, అయిదు, నాలుగు, పది వెరసి ఇరవై నాలుగు తత్త్వములు ప్రకృతియొక్క కార్యములు. పరబ్రహ్మ వీటిని అధిష్ఠించి బ్రహ్మాండ రూపముగా నున్నాడని మహర్షులు చెప్పుచున్నారు.
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి అయిదు స్థూల మహాభూతములు. వీటికి కారణమగు సూక్ష్మతన్మాత్రలు కూడ అయిదే. అవియే గంధము, రసము, రూపము, స్పర్శ మరియు శబ్దము అనునవి అని నేను చెప్పుచున్నాను.
చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వాక్కు, చేతులు, కాళ్లు, జనన-విసర్జనేంద్రియములు అనునవి పది ఇంద్రియములని చెప్పబడినది.
అంతఃకరణము దానిలో వచ్చే వికారముల చిహ్నమును బట్టి నాలుగు రకములుగా కానవచ్చుచున్నది. సంకల్పవికల్పముల రూపములో నుండేది మనస్సు. నిశ్చయరూపములో నుండేది బుద్ది. నేను అనే వృత్తి అహంకారము. స్మృతిరూపములో నుండేది చిత్తము.
నేనీ విధముగా సగుణబ్రహ్మయొక్క జగద్రూపమగు అవస్థలోని విశేషములను పరిగణించితిని. దీనినే ఇతరులగు ఆచార్యులు కూడ చెప్పు చున్నారు. కాలము ఇరువది అయిదవ తత్త్వము. .
కొందరు కాలము పురుషుని మహిమయని చెప్పెదరు. జీవుడు అవిద్యచే ప్రకృతితో తాదాత్మ్యమును చేంది గుణములచే చేయబడే కర్మలకు తానే కర్తనని భ్రమపడి, కాలమునకు భయపడుచున్నాడు.
సృష్టికి పూర్వము ప్రకృతియందలి సత్త్వరజస్తమోగుణములు సామ్యావస్థలోనుండుటచే ప్రకృతియందింకనూ పృథివ్యాది వికారములే మియు ప్రకటము కావు. ఆ స్థితిలో ఆ సామ్యావస్థలో కదలికను భగవానుడే కలిగించును. ఆ చేష్టకు కారణమగు భగవానునకే కాలమని వ్యవహారము.
ఈ భగవానుడే తన మాయాశక్తిచే ప్రాణులకు లోపల పురుషరూప ములో, బయట కాలరూపములో వ్యాపించియున్నాడు.
కాలము ప్రకృతియొక్క గుణములలోని సామ్యావస్థను కదల్చి వైషమ్యమును కలిగించును. ప్రకృతికి అతీతుడగు పురుషుడు అట్టి తన ప్రకృతియందు చైతన్యశక్తిని ఆధానము చేయును. అపుడా ప్రకృతి తేజోమ యమగు మహత్తత్వరూపముగా ప్రకటమగును.
నిర్వికారము, జగత్తునకు అంకురము వంటిది అగు మహత్త త్త్వము తనయందు అవ్యక్తముగానున్న జగత్తును ప్రకటింప జేయుచున్న దై, తన స్వరూపమును కప్పివేసే తీవ్రమగు ప్రళయకాలీనమైన అంధకార మును తన తేజస్సుచే త్రాగివేసెను (నశింపజేసెను).
శాస్త్రములో ప్రసిద్ధిని గాంచినది, స్వచ్చము, శాంతము, సత్త్వగు ణమయము, భగవానుని కనుగొనే స్థానము అగు చిత్తమే మహత్తత్త్వము. అదియే వాసుదేవుడనే ఉపాస్య దైవము అని మహర్షులు చెప్పుచున్నారు.
చిత్తము స్వభావముచే స్వచ్చముగా, వికారములు (విక్షేపలయ ములనే రజస్తమోగుణముల ధర్మములు) లేనిదిగా, శాంతముగా నుండును. ఇది చిత్తముయొక్క లక్షణము. చిత్తమును భూమితో సంపర్కము కలుగక ముందు స్వచ్ఛముగా నుండే నీటితో పోల్చవచ్చును.
భగవానుని చిచ్చక్తిచే ఉదయించిన మహత్తత్త్వము వికారమును చెంది, సాత్త్విక, రాజస తామస అనే మూడు విధముల క్రియాశక్తియుక్త మగు అహంకారము ప్రకటమయ్యెను. దానినుండియే మనస్సు, ఇంద్రియ ములు, పంచ మహాభూతములు పుట్టినవి.
పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు అనే రూపములో నుండే అహంకారము సాక్షాత్తుగా అనంతదేవుడని మహర్షులు చెప్పుచు న్నారు. అనంతమగు శిరస్సులు గల ఆ అనంతునకు సంకర్షణుడని పేరు.
దేవత రూపములో కర్తృత్వము, ఇంద్రియముల రూపములో కర ఇత్వము, పంచభూతముల రూపములో కార్యత్వము అహంకారము యొక్క లక్షణము. సత్త్వరజస్తమోగుణముల సంబంధముచే క్రమముగా శాంతత్వము (ప్రసన్నత), ఘోరత్వము (విక్షేపము లేక చాంచల్యము), విమూఢత్వము (మోహము) అనునవి కూడ అహంకార లక్షణములే.
సాత్త్వికాహంకారము వికారమును చెంది మనస్సు పుట్టును. దాని సంకల్పవికల్పములనుండి కామనలు పుట్టును.
ఆ మనస్తత్త్వమే ఇంద్రియాధిపతియగు అనిరుద్దుడని ప్రసిద్దిని గాంచినది. శరత్కాలమునందలి కలువవలె నల్లనైన అనిరుద్దుని యోగులు మనస్సును మెల్లమెల్లగా వశము చేసుకొని ఆరాధించెదరు.
ఓ సాధ్వీ! తైజసాహంకారము వికారమును చెంది బుద్దితత్వము పుట్టెను. ద్రవ్యములు స్పురించి వాటి విజ్ఞానము కలుగుట, ఇంద్రియము లకు ఆయా విషయముల జ్ఞానము కలుగుట అనునవి దాని కార్యములు.
సంశయము (ఒకే వస్తువునందు పలు రకముల జ్ఞానము కలుగుట), విపర్యాసము (ఒకదానిని మరియొకటిగా భావించుట), నిశ్చయము (ఖచ్చితమైన జ్ఞానము), స్మరణము, నిద్ర అను వేర్వేరు రూపములు బుద్ధి యొక్క లక్షణము.
కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అనే రెండు రకముల ఇంద్రియములు తైజసాహంకారమునుండియే పుట్టినవి. వీటిలో కర్మ ప్రాణ ముయొక్క శక్తి కాగా, విజ్ఞానము బుద్ధియొక్క శక్తి అగుచున్నది.
భగవానుని చిచ్చక్తిచే ప్రేరితమై వికారమును చెందిన తామసా హంకారమునుండి శబ్దతన్మాత్ర (రూపరసాదులతో కలయిక లేని కేవలశబ్ద ము) యు, దానినుండి ఆకాశము పుట్టినవి. శ్రోత్రేంద్రియము శబ్దమును గ్రహించును
శబ్దము అర్థమును ప్రకాశింపజేయును శబ్దమును ఉచ్చరించు వ్యక్తిని జ్ఞాపనము చేయును. శబ్దము ఆకాశమునకు తన్మాత్ర (సూక్ష్మభూతము). ఇవి శబ్దలక్షణములని పండితులు చెప్పుచున్నారు.
ఆకాశము సకలపదార్థములకు తనయందు ఉండే అవకాశముని చ్చుటయే గాక, వాటికి లోపల బయట కూడ వ్యాపించియుండును. నాడు లయందలి ఛిద్రము రూపములోనున్న ఆకాశము ప్రాణమునకు, ఇంద్రియ ములకు, మనస్సునకు ఆశ్రయమగుచున్నది. ఈ కార్యములే ఆకాశము యొక్క లక్షణము అగుచున్నవి.
శబ్దతన్మాత్రనుండి ఆకాశము పుట్టగా, కాలగమనముచే వికార మును చెందిన ఆకాశమునుండి స్పర్శతన్మాత్ర పుట్టినది. దానినుండి వాయువు పుట్టినది. స్పర్శను గ్రహించే ఇంద్రియము చర్మము.
మెత్తదనము, గట్టిదనము, చల్లదనము, వేడి, వాయువునకు తన్మాత్ర అగుట అనునవి స్పర్శయొక్క లక్షణములు.
వాయువు చెట్టు కొమ్మలు మొదలగు వాటిని కుదుపును; గడ్డి మొదలగు వాటిని ఒకచోటికి చేర్చును; అన్ని చోట్లకు వెళ్లును; గంధాది ద్రవ్యములను ప్రణము మొదలగు ఇంద్రియములకు చేర్చును; శబ్దమును చెవి వరకు చేర్చును. ఇంద్రియములన్నింటికీ శక్తిని సమకూర్చునది వాయువే. వాయువుయొక్క ఈ కార్యములే దాని లక్షణములు.
స్పర్శ తన్మాత్రగా గల వాయువునుండి కాలప్రేరణచే రూపము, దానినుండి అగ్ని పుట్టినవి. కన్ను రూపమును గ్రహించే ఇంద్రియము.
ఓ సాధ్వీ! పదార్థములకు ఆకారమును కలిగించుట, పదార్థము లకు గుణమై భాసిల్లుట, పదార్థముల విశిష్టమగు సన్నివేశము (ఆకారము, పరిమాణము) రూపములోనే తెలియబడుట, అగ్నికి స్వరూపమై యుండుట అనునవి రూపతన్మాత్రయొక్క లక్షణములు.
ప్రకాశించుట, ఆహారపదార్థములను వండుట, దాహమును కలి గించి నీటిని త్రాగుట, ఆకలిని కలిగించి ఆహారమును భక్షించుట, చలిని పోగొట్టుట, ఎండింప జేయుట అనునవి అగ్నియొక్క వ్యాపారములు.
రూపము తన్మాత్రగా గల అగ్ని దైవప్రేరణచే వికారమును చెంది రసతన్మాత్రకు జన్మనిచ్చెను. దానినుండి జలము పుట్టెను. నాలుక రస మును గ్రహించును.
రసము ఒక్కటియే. కాని, భౌతికపదార్థముల కలయికచే అది వగరు, తీపి, చేదు, కారము, పులుపు, ఉప్పు అని ఆరు విధములుగా విభాగమును పొందుచున్నది.
తడిగా చేయుట, ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణ ములను నిలబెట్టుట, దాహమును తీర్చుట, పదార్థములను మెత్తగా చేయు ట, వేడిని తొలగించుట, అధికముగా లభించుట (భూమినుండి ఊరుట) అనునవి నీటి లక్షణములు.
రసము తన్మాత్రగా గల నీరు దైవప్రేరణచే వికారమును చెంది గంధతన్మాత్ర పుట్టినది. దానినుండి పృథివి పుట్టినది. గంధమును గ్రహించే ఇంద్రియము ముక్కు.
గంధము ఒక్కటే. కాని ద్రవ్యావయవముల సమ్మేళనములోని హెచ్చుతగ్గుల వలన మిశ్రమగంధము దుర్గంధము సుగంధము మృదుగం ధము తీవ్రగంధము పులుపు వాసన మొదలగు భేదములు ఏర్పడును.
పృథివి ప్రతిమ మొదలగు రూపములలో పరమేశ్వరుని భావనకు ఆలంబనమగును. పృథివి తాను స్థిరముగా నిలిచియుండి నీరు మొదలగు వాటికి ఆధారమగుచుండును. ఆకాశమును పృథివి ఘటాకాశము, మఠాకా శము మొదలగు తీరులలో పరిచ్చిన్నము చేసినట్లు కానవచ్చును. సకలప్రా ణులలో వ్యక్తమయ్యే స్త్రీత్వపుంస్త్వాది గుణములను పృథివియే ప్రకటింప జేయుచున్నది. ఈ కార్యముల ద్వారా పృథివి తెలియబడును.
ఆకాశముయొక్క విశేషగుణము శబ్దము. దానిని గ్రహించే ఇంద్రి యము శ్రోత్రము. వాయువుయొక్క అసాధారణ గుణము స్పర్శ దానిని గ్రహించే ఇంద్రియము స్పర్శేంద్రియము.
అగ్నికి విశేషగుణము రూపము. దానిని గ్రహించేది చక్షురింద్రియ ము. నీటి విశేషగుణము రసము. దానిని గ్రహించేది రసనేంద్రియము. భూమికి విశేషగుణము గంధము. దానిని గ్రహించేది ఘ్రాణేంద్రియము.
ఉపాదానకారణము కార్యములోనికి అనువృత్తమగును. కావున, కార్యములో కారణధర్మము కూడ కనబడును. కావుననే, భూమియందు మాత్రమే తన విశేషధర్మమగు గంధముతో బాటు మిగిలిన నాలుగు భూతముల గుణములు, అనగా శబ్దస్పర్శరూపరసములు కూడ గలవు.
మహత్తు, అహంకారము, పంచభూతములు అనే ఈ ఏడు తత్త్వములు ఒకదానితో మరియొకటి కలియకుండగా నుండెను. అపుడు జగత్కారణమగు భగవానుడు, వాటిలో కలయికను తెచ్చే కాలము జీవుల కర్మాదృష్టము మరియు సత్త్వరజస్తమోగుణములు అనువాటితో గూడి వాటిని ప్రవేశించేను.
తరువాత భగవానుడు ప్రవేశించుటచే ఆ తత్త్వములలో సంక్షో భము కలిగి అవి ఒకదానితో మరియొకటి కలిసినవి. అప్పుడు ప్రాణరహిత మైన అండము పుట్టెను. దానినుండి విరాట్ పురుషుడు (సమష్టి బ్రహ్మాండ శరీరాభిమాని) ప్రకటమయ్యెను.
ఈ అండమునకు విశేషము అని పేరు. దీని చుట్టూ పది రెట్లు నీరు, దాని చుట్టూ పది రెట్లు తేజస్సు, దాని చుట్టూ పది రెట్లు వాయువు, దాని చుట్టూ పది రెట్లు ఆకాశము, దాని చుట్టూ ప్రకృతియొక్క ఆవరణము గలవు. దీనియందు ఈ లోకముల విస్తారము గలదు. ఈ విస్తారము శ్రీహరి భగవానుని రూపమే.
నీటియందున్న తేజోమయమైన ఆ బ్రహ్మాండకోశమునుండి విరాట్ పురుషుడు పైకి లేచి దానిని మరల ఆవేశించి, దానియందు అనేకఛి ద్రములను పగుల గొట్టెను.
విరాట్ పురుషునకు ముందుగా నోరు విడివడెను. దానినుండి వాగింద్రియము, దానికి అధిష్ఠాతయగు అగ్ని ప్రకటమైనవి. తరువాత ముక్కు పుటములు విడివడేను. వాటినుండి ప్రాణముతో గూడిన ఘ్రాణేంద్రి యము పుట్టెను.
ఘ్రాణేంద్రియము తరువాత దాని అధిష్టాన దేవతయగు వాయువు ప్రకటమయ్యెను. తరువాత కన్నులు విడివడెను. వాటియందు చక్షురింద్రి యము, దాని అధిష్టానమగు సూర్యుడు ప్రకటమయ్యెను. తరువాత చెవులు విడివడి శ్రోత్రేంద్రియము, దానికి అధిష్ఠానమగు దిగేవత పుట్టెను.
విరాట్ పురుషునకు తరువాత చర్మము, దానినుండి రోమములు మీసము గెడ్డము మొదలగునవి, చర్మమునకు అధిష్టానదేవతయగు ఓషధులు, తరువాత జననేంద్రియము ప్రకటమయ్యెను.
దానినుండి రేతస్సు, అభిమానిదేవతయగు ఆపోదేవుడు (జలము) పుట్టెను. తరువాత విసర్జనేంద్రియము ప్రకటమై, దానినుండి అపానము, తరువాత లోకములకు భయమును కలిగించే మృత్యువు పుట్టెను.
విరాట్ పురుషునకు చేతులు ప్రకటమై, వాటియందు బలము అనే కర్మేంద్రియము, తరువాత దానికి అధిష్టానమగు ఇంద్రుడు ప్రకటమైరి. తరువాత పాదములు ప్రకటమై, వాటినుండి గమనము అనే ఇంద్రియము, తరువాత దానికి అధిష్ఠానమగు విష్ణువు ప్రకటమైరి.
ఈ విరాట్ పురుషునకు నాడులు ప్రకటమై వాటియందు రక్తము పుట్టి వాటిని నిం పెను. తరువాత నదీదేవతలు ప్రకటమైరి. తరువాత ఆయ నకు ఉదరము ప్రకటమయ్యెను.
తరువాత ఆ విరాట్ పురుషునకు ఆకలి దప్పికలు పుట్టి, వాటికి దేవతయగు సముద్రము ప్రకటమయ్యెను. తరువాత ఆయనకు హృద యము ప్రకటమై, దానినుండి మనస్సు పుట్టెను.
మనస్సునకు దేవతయగు చంద్రుడు, బుద్దీ, దానికి దేవతయగు బ్రహ్మ ప్రకటమైరి. తరువాత అహంకారము, దానికి దేవతయగు రుద్రుడు, చిత్తము, దానికి దేవతయగు క్షేత్రజ్ఞుడు ప్రకటమైరి.
ఈ విధముగా ప్రకటమైన దేవతలు ఆ విరాట్ పురుషుని పైకి లేపు టకు సమర్థులు కాలేకపోయిరి. అపుడు వారు మరల ఆయనను లేపుటకు తమ తమ స్థానములలో ప్రవేశించిరి.
అప్పుడు అగ్ని వాక్కుతో ముఖమును ప్రవేశించెను. కాని, విరాట్ పురుషుడు పైకి లేవలేదు. వాయువు ఘ్రాణేంద్రియముతో సహా ముక్కు పుటములను ప్రవేశించిననూ, ఆయన పైకి లేవలేదు.
ఆదిత్యుడు చక్షురింద్రియముతో కన్నులను, దిగ్గేవత శ్రోత్రేంద్రియ ముతో చెవులను, ఓషధి దేవతలు రోమములతో చర్మమును, ఆపోదేవత రేతస్సుతో జననేంద్రియమును, మృత్యుదేవత అపానముతో విసర్జనేంద్రి యమును, ఇంద్రుడు బలముతో సహా చేతులను, విష్ణువు గమనముతో సహా కాళ్లను, నదీ దేవతలు రక్తముతో నాడులను, సముద్రదేవత ఆకలి దప్పికలతో ఉదరమును, చంద్రుడు మనస్సుతో బ్రహ్మగారు బుద్ధితో రుద్రుడు అహంకారముతో హృదయమును ప్రవేశించిననూ, ఆ విరాట్ పురుషుడు పైకి లేవలేదు.
చిత్తమునకు అధిష్ఠాత, క్షేత్రము (దేహము) ను ద్రష్టలై దర్శించే క్షేత్రజ్ఞుడు చిత్తముతో సహా ప్రవేశించగానే, ఆ విరాట్ పురుషుడు నీటి నుండి పైకి లేచెను.
నిద్ర పోవుచున్న వ్యక్తిని క్షేత్రజ్ఞుడు లేకుండగా ప్రాణము, ఇంద్రి యములు, మనస్సు, బుద్ది తమ బలముచే లేపజాలవు. అదే విధముగా ఆయా దేవతలు విరాట్ పురుషుని లేపలేక పోయిరి.
మానవుడు పరమేశ్వరునియందు భక్తిని చేసి, ప్రకృతి పురుషవివే కము గలవాడై, దానిచే సంసారమునందు వైరాగ్యమును పొంది, యోగ ముచే ఏకాగ్రము చేయబడిన బుద్దితో, ఈ దేహమునందే ప్రత్యగాత్మరూప ములో ఉపలభ్యముగానున్న పరమేశ్వరుని దర్శించవలెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది.
