శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

11  - మన్వంతరములు మొదలగు కాలవిభాగమును వర్ణించుట

మైత్రేయుడు ఇట్లు పలికెను --- పృథివి మొదలగు కార్యవర్గము యొక్క మిక్కిలి సూక్ష్మమగు (ఇంకనూ విడదీయ శక్యము కాని) అంశ యేది గలదో అది పరమాణువు అనబడును. ఈ పరమాణువు ఇంకనూ కార్యావస్థను పొందనిదై, మరియు ఇతర పరమాణువులతో సంయోగ మును పొందనిదై నిలిచియుండును. ఇట్టి పరమాణువులు కొన్ని కలిసిన ప్పుడు మానవులకు అట్టి సముదాయము కంటే భిన్నమగు మరియొక అవ యవి ఒకటి గలదనే భ్రాంతి కలుగుచుండును.

ఈ పరమాణువులు వేటి సూక్ష్మతమమగు అంశలో, అట్టి పృథివి మొదలగు కార్యరూపములోనున్న పదార్థములు తమ స్వరూపమునందు వికారములు లేకుండగా నిలిచి యుండగా, వాటి సమగ్రరూపము అతిశ యించిన మహత్త్వము గలది (పెద్దది). ఆ ఐక్యవస్థయందు సృష్టి ప్రళ యము మొదలగు అవస్థాభేదము గాని, కొత్త పాత అనే కాలభేదము గాని, సూర్యుడు చంద్రుడు మొదలగు పదార్థభేదము గాని లేవు.

సాధుపురుషులలో శ్రేష్ఠుడవగు ఓ విదురా! పదార్థములో అతిస్వ ల్పమగు పరమాణువు మరియు పరమమహత్తు ఉన్నట్లుగానే, పరమా ణువు మొదలగు అవస్థయొక్క లాభముచే కాలమునందు కూడ మిక్కిలి అల్పమగు అంశమును మరియు మిక్కిలి పెద్ద అంశమును మనము ఊహించవచ్చును. భగవానుని శక్తియగు కాలము కూడ భగవానుడే. సర్వ సమర్థమగు ఈ కాలము సృష్టించబడిన పదార్థజాతమునంతనూ వ్యాపించి దానిని పరిచ్ఛిన్నము చేయును.

సత్కార్యమగు ప్రపంచముయొక్క అతిసూక్ష్మమగు పరమాణు వును వ్యాపించియుండు కాలము ఏది కలదో, అది కాలముయొక్క మిక్కిలి చిన్నదియగు మానము. ప్రపంచముయొక్క సృష్టి మొదలుకొని ప్రళయము వరకు వ్యాపించియుండు కాలము అతిశయించిన మహ త్వము గలది (పెద్దది).

రెండు పరమాణువులు ఒక అణువు అగును. మూడు అణువులు ఒక త్రసరేణువు అగును. కిటికీకి కట్టిన వలలోని చిన్న చిల్లుల గుండా చీకటి గదిలోనికి ప్రవేశించే కాంతికిరణముల పంక్తియందు ఆకాశములో ఎగు రుతూ వెళ్లే (చాల తేలికయైన) ఈ త్రసరేణువును మనము కానవచ్చును.

మూడు త్రసరేణువులను వ్యాపించియుండు (అంతటి దూర మును కాంతి పయనించే) కాలమునకు త్రుటి అని పేరు. వంద త్రుటులు ఒక వేధ యగును. మూడు వేధలు ఒక లవము అగును.

 పది హేను లఘువులు ఘటిక. రెండు ఘటికలు ముహూర్తము. ఒకప్పుడు పగలు చిన్నదిగను, మరియొకప్పుడు పెద్దదిగను ఉండును. దానిని బట్టి ఆరు గాని, ఏడు గాని ముహూర్తములు మానవుల కాలమాన ములో ప్రహరము అనియు, యామము అనియు అనబడును.

ఆరు పలముల బరువు గల రాగి పాత్రకు అడుగున, నాలుగు అంగుళముల పొడవు కలిగి నాలుగు మాషముల బంగారముచే చేయబ డిన తీగతో చిల్లును చేసి, ఆ పాత్రను నీటిలో ఉంచవలెను. అప్పుడు ఆ పాత్రలో ఒక ప్రస్థము నీరు నిండి నీటిలో మునిగి పోవుటకు పట్టే సమయమునకు నాడిక అని పేరు.

ఇతరులను మన్నించే ఓ విదురా! మానవులకు నాలుగు యామ ములు పగలు, నాలుగు యామములు రాత్రి, పగలు, రాత్రి కలిసి ఒక దినము కాగా, అట్టి పది హేను దినములు ఒక పక్షము. పక్షములో శుక్లపక్ష ము, కృష్ణపక్షము అనే విభాగము గలదు.

రెండు నెలలు ఒక ఋతువు. మానవుల ఒక నెల పితృదేవతలకు ఒక దినము. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు నెలలు ఒక అయనము. అయనమునందు దక్షిణాయనము, ఉత్తరాయణము అనే విభాగము గలదు. ఈ రెండు అయనములు కలిసి దేవతలకు ఒక దినము అగును. పన్నెండు నెలలు ఒక సంవత్సరము. మానవుల పూర్ణాయుర్దాయము వంద సంవత్స రములని వేదములు చెప్పుచున్నవి.

 గురువు మొదలగు గ్రహములు, అశ్వినీ మొదలగు నక్షత్రములు మరియు ఇతరములగు నక్షత్రములతో కూడియున్న ఖగోళచక్రమునందు ఉండే కాలస్వరూపుడగు సూర్యుడు సర్వమును శాసిస్తూ జగత్తును పర్యటించుచున్నాడు. ఆయనయొక్క ఈ పరిభ్రమణము వలన మిక్కిలి సూక్ష్మమగు కాలాంశముతో మొదలిడి సంవత్సరముతో అంతమయ్యే కాలచక్రము నిరూపించ బడుచున్నది.

ఓ విదురా! ఈ కాలమునకే సంవత్సరము (సూర్యుడు రాశిచక్రమును చుట్టి వచ్చుటకు పట్టే కాలము, 372 రోజులు), పరివత్సరము (గురువు రాశిచక్రములోని ఒక రాశీనుండి మరియొక రాశీకి పయనించుటకు పట్టే కాలము), ఇడావత్సరము (అన్ని నెలలకు సమానముగా 30, వెరసి 360 రోజుల కాలము), అనువత్సరము (చంద్రగతిని బట్టి అమావాస్యతో అంతమయ్యే 12 నెలలు) మరియు వత్సరము (చంద్రుడు నక్షత్రములలో సంచరించే 27 రోజులు మాత్రమే ఒక నెల, అట్టి 12 నెలలు) అనే పేర్లు కలుగుచున్నవి.

ఓ మానవులారా! (ఓ విదురా!) పంచభూతములలో విశేషమగు తేజసే రూపముగా గల ఈ సూర్యుడు కాలమనే తన శక్తిచే సకలకారణత త్వములయందలి బీజశక్తిని పలువిధములుగా కార్యోన్ముఖము చేయుచు న్నవాడై, మానవుల (చీకటి వలన, లేదా అజ్ఞానము వలన కలిగే) వ్యామో హమును పోగొట్టుతూ, ద్యులోకమునందు సంచరించుచున్నాడు. ఆయన యజ్ఞముల ద్వారా ఆరాధించే జనులకు స్వర్గము మొదలైన మంగళ ఫల ములను ఇచ్చుచున్నాడు. అయిదు రకముల సంవత్సరముల రూపములో ఆయనయే ఉన్నాడు. ఆయనకు పూజలను చేయుడు.

విదురుడు ఇట్లు పలికెను --- నీవు పితృదేవతలు, దేవతలు మరియు మనుష్యులు అనువారల ఆయుఃప్రమాణమును వర్ణించితివి. ముల్లోకములకు అతీతులై కల్పముకంటే అధికకాలము నిలిచియుండే ఇతరజ్ఞానుల ఆయుఃప్రమాణమును గురించి చెప్పుము.

పూజ్యుడవగు నీకు భగవత్స్వరూపమగు కాలముయొక్క గతి తెలియును. ఇది నిశ్చయము. జ్ఞానులు యోగముచే సిద్ధించిన జ్ఞాననేత్ర ముతో జగత్తును దర్శించెదరు. "

   మైత్రేయుడు ఇట్లు పలికెను --- కృతవ్రేతాద్వాపరకలియుగ ములు అనే నాలుగు యుగములు వాటి సంధ్య (యుగమునకు ఆరంభ ములో ఉండే సంధి, అనగా రెండు యుగముల మధ్యకాలము) లు మరియు సంధ్యాంశము (యుగమునకు అంతములో ఉండే సంధి కాలము) లతో కలిపి పన్నెండు వేల దివ్యసంవత్సరములగునని చెప్పబడినది.

కృతయుగమునకు నాలుగు వేల దివ్యసంవత్సరములు, త్రేతా యుగమునకు మూడువేలు, ద్వాపరయుగమునకు రెండు వేలు, కలియుగ మునకు ఒక వెయ్యి దివ్యసంవత్సరములు ఉండును. ఒక దివ్యసంవత్సర ము 360 మనుష్య సంవత్సరములకు సమానము. కృతయుగమునకు సంధ్య మరియు సంధ్యాంశములు కలిపి 800, త్రేతాయుగము కు 600, ద్వాపరయుగమునకు 400, కలియుగమునకు 200 దివ్యసంవత్సరములు ఉండును.

సంధ్యకు, సంధ్యాంశమునకు మధ్యలో ఉండే కాలము యుగమన బడునని యుగవేత్తలు చెప్పుచున్నారు. ఈ సంధి కాలములు వందల దివ్యసంవత్సరములలో పరిగణించబడినవి. ప్రతి యుగమునకు ఒక విశిష్ట ధర్మము విధించబడినది.

      కృతయుగములో మానవులయందు ధర్మము నాలుగు పాదము లతో చక్కగా ప్రవర్తిల్లును. కానీ, మిగిలిన యుగములలో క్రమముగా అధ ర్మము ఒక్కొక్క పాదము పెరుగుచుండుట వలన, ఆ మేరకు ధర్మము క్షీణించుచుండును.

ఓ విదురా! ముల్లోకములకు పైన మహర్లోకమునుండి బ్రహ్మలోకము వరకు ఒక పగలు మానవలోకములోని వేయి చతుర్యుగములకు సమానము. అంతే కాలము రాత్రి కూడ ఉండును. ఆ కాలములో సృష్టికర్త నిద్రించును.

ఆ రాత్రి ముగియగానే ఈ లోకముల సృష్టి ఆరంభమై బ్రహ్మగారి పగలు కాలమంతయు కొనసాగును. ఆ కాలములో పదునలుగురు మను వులు గతించెదరు..

ప్రతి ఒక్క మనువు సుమారు డెబ్బది ఒక్క చతుర్యుగముల కాలము అధికారముననుభవించును. మన్వంతరములయందు ఆయా మనువులు, వారి వంశములకు చెందిన రాజులు, మహర్షులు, దేవతలు, వారికి ప్రభువులగు ఇంద్రాదులు, వారి అనుయాయులగు గంధర్వులు మొదలగు వారు ఏకకాలమునందు తమ తమ అధికారములయందున్నవారై, లోకములను ఏలెదరు.

ఇది బ్రహ్మగారు ప్రతిదినము చేసే సృష్టి. ముల్లోకములు దీనిలో అంతర్భాగములై యున్నవి. జీవులు తమ కర్మలననుసరించి దీనిలో పశుప క్ష్యాదులు, మానవులు, పితృదేవతలు మరియు దేవతలు అనే యోను - లలో జన్మించెదరు.

భగవానుడు తన పౌరుషమును ప్రకటిస్తూ ఈ మన్వంతరముల యందు సత్త్వగుణమునాశ్రయించినవాడై, మనువు మొదలగు తన మూర్తుల ద్వారా ఈ జగత్తును రక్షించుచున్నాడు.

దినముయొక్క అంతమునందు బ్రహ్మగారు తమోగుణము యొక్క లేశమును స్వీకరించినవాడై (తమోగుణము ఉపాధిగా గలవాడై), సృష్టివ్యాపారమును విరమించి, నిశ్చేష్టుడై యుండును. అపుడు కాలము యొక్క ప్రభావముచే సర్వము ఆయనయందు విలీనమగును.

      బ్రహ్మగారి ఆ రాత్రియందు ప్రళయము జరిగి సర్వము ఆయన యందు ఉపసంహరించబడును. ఆ . రాత్రియందు సూర్యచంద్రులు సైతము ఉండరు. భూర్బువస్సువర్లోకములు మూడు కూడ ఆయనలో విలీనమగును.

     భగవానుని శక్తి ఆదిశేషుని ముఖమునుండి అగ్ని రూపములో వెలువడును. దానిచే ముల్లోకములు దహింపబడుచుండగా, ఆ తాపముచే పీడింపబడిన భృగుమహర్షి మొదలగువారు మహర్లోకమునుండి జనలోక మునకు వెళ్లేదరు.

అంతలోనే కల్పముయొక్క అంతమునందు సముద్రములలో కెర టములు పెద్ద సంక్షోభముచే ఉవ్వెత్తున లేచిపడుచుండును. ప్రచండమగు వాయువులు వీచుటచే ఆ కెరటములు చెలియలి కట్టలను తెంచుకొని ముల్లోకములను క్షణములో ముంచివేయును.

ఆ నీటి మధ్యలో శ్రీహరి ఆదిశేషునిపై శయనించి యోగనిద్రచే కన్నులను మూసియుండును. అపుడు జనలోకనివాసులు ఆయనను స్తుతించుచుందురు.

బ్రహ్మగారి ఆయుర్దాయము ఈ సృష్టిలో సర్వాధికమైనది. బ్రహ్మ లోకమానమును బట్టి అది వంద సంవత్సరములు. కాలగమనమును బట్టి రాత్రింబగళ్లు గడచుచునే యున్నవని ఊహించవచ్చును. ఆ విధముగా అంతటి ఆయుర్దాయము క్షీణించిపోయినదా యన్నట్లు ఉండెను.

బ్రహ్మగారి ఆయుర్దాయములో సగభాగమునకు పరార్థమని పేరు. దానిలో మొదటి పదార్ధము గడచిపోయినది. ఇప్పుడు రెండవ పరార్ధము జరుగుచున్నది.

మొదటి పరార్ధముయొక్క ఆరంభమునందు వచ్చిన గొప్ప కల్ప మునకు బ్రాహ్మకల్పమని ప్రసిద్ది. ఏలయనగా, ఆ కల్పమునందే శబ్ద బ్రహ్మ అని పేరు గాంచిన వేదమయుడగు బ్రహ్మ ప్రకటమయ్యెను.

అదే పరార్దముయొక్క ఆఖరి కల్పమునకు పాద్మకల్పమని పేరు. ఏలయనగా, ఆ కల్పమునందు శ్రీహరియొక్క సరస్సువంటి నాభినుండి లోకమనే పద్మము ప్రకటమయ్యెను.

భరతవంశీయుడవగు ఓ విదురా! రెండవ పరార్దమునకు చెందిన ఈ (ఇప్పుడు నడచుచున్న) మొట్టమొదటి కల్పమునకు వారాహకల్పమని పేరు. ఏలయనగా, ఈ కల్పమునందు శ్రీహరి వరాహమూర్తియై అవతరించినాడు,

      శ్రీహరి సర్వకారణకారణుడు. ఆయనకు ఆది గాని, అంతము గాని లేవు. ఆయన కార్యోపాధికి కట్టుబడినవాడు కాదు. ఈ జగత్తునకు ఆత్మ (సారభూతమగు సత్త) ఆయనయే. ఈ రెండు పరార్దముల కాలము ఆయనకు ఒక కనురెప్పపాటు కాలమని ఆలంకారికముగా చెప్పుచున్నారు (అనగా, అది ఆయనకు ఆయుర్దాయమును లెక్క వేయుట కాదని అభిప్రాయము),

అతిసూక్ష్మమగు కాలాంశముతో మొదలు పెట్టి రెండు పరార్థ ముల వరకు వ్యాపించియున్న ఈ కాలము సర్వసమర్థమే. కాని, ఆ పరబ్ర హ్మ పై దీని పెత్తనము లేదు, అనగా పరబ్రహ్మ కాలపరిచ్చేదము లేనివా డు. దేహము, ఇల్లు అనువాటియందు అభిమానము గల అజ్ఞానులను ఈ కాలము శాసించును.

     ఏభై కోట్ల యోజనముల విస్తారము గల ఈ బ్రహ్మాండకోశము పది ఇంద్రియములు, మనస్సు మరియు పంచభూతములు అనే పదునారు వికారములతో కూడియున్నది. దీనికి బయట పృథివితో మొదలిడి వరుసగా ఒకదానికంటే మరియొకటి పదిరెట్లు ఆధిక్యము గలవై నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే సూక్ష్మపంచభూతములు, అహంకారము, మహత్తత్త్వము, ప్రకృతి అను తత్త్వములు చుట్టువారి యున్నవి. ఇంతటి బ్రహ్మాం డము ఆ పరబ్రహ్మయందు విలీనమై పరమాణువు వలె కన్పట్టును. అవినా శియగు ఆ పరబ్రహ్మ మహత్తత్త్వము మొదలగు కారణములన్నింటికీ కారణము. దానియందు ఇట్టి బ్రహ్మాండముల రాశులు ఇంకనూ కోట్ల సంఖ్యలో నున్నవి. పరమాత్మ, పూర్ణుడు అగు విష్ణువుయొక్క ధామము (స్వరూప ము) సాక్షాత్తుగా ఈ పరబ్రహ్మయే.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునొకండవ అధ్యాయము ముగిసినది (11).