శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

6 - విరాట్ శరీరము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మహత్త త్వము మొదలగు తన శక్తులు ఒకదానితో మరియొకటి కలియకపోవుటచే వాటియందు బ్రహ్మాండమును రచించే సామర్థ్యము ఉద్బుద్దము కాలేదు. ఆ పరిస్థితిని భగవానుడు చూచెను.

అప్పుడు సర్వశక్తిమంతుడగు ఆ భగవానుడు కాలము అనే పేరు గల (యోగ్యమగు కాలమునందు ఉద్బుద్దమయ్యే) దైవీశక్తిని స్వీకరించి, మహత్తత్త్వము, అహంకారము, అయిదు సూక్ష్మభూతములు, అయిదు స్థూలభూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియము లు, మనస్సు అనే ఇరువది మూడు తత్త్వముల సముదాయమునందు ఒకేసారి ప్రవేశించెను.

ఆ భగవానుడు ఆ విధముగా విడివడియున్న తత్త్వసమూహ మును ప్రవేశించి, వాటిలో నిద్రాణముగా పడియున్న క్రియాశక్తిని ఉజ్జీవింప జేసి, వాటి మధ్యలో సంయోగమును కలిగించెను. ఆయన ఈ విధముగా విలీనమైయున్న జీవుల కర్మాశయమును ఫలమునిచ్చుట కొరకై ఉజ్జీవింప జేసెను.

ఈశ్వరుడు ప్రవేశించి తత్త్వములలో నిద్రాణమై యున్న క్రియాశ క్తిని ఉజ్జీవింప జేసి, జీవుల కర్మ ఫలోన్ముఖమగునట్లు చేసెను గదా! ఆ విధముగా ఈశ్వరునిచే ప్రేరితమైన ఆ ఇరువది మూడు తత్త్వములు తమ తమ అంశలతో విరాట్ పురుషుని ఉత్పన్నము చేసినవి.

పరమేశ్వరుడు తనయందు అంశరూపముగా ప్రవేశించగానే, జగ త్తును సృష్టించే ఆ తత్త్వములు ఒకదానితో మరియొకటి కలిసి క్షోభను పొంది, చరాచరములగు ప్రాణులకు ఆశ్రయమగు విరాట్ పురుషుని సృష్టిం చినవి.

తేజోమయుడగు ఆ విరాట్ పురుషుడు (హిరణ్యగర్భుడు) సకలజీవులతో కూడియున్నవాడై వేయి సంవత్సరములు జలములలో అండాకారములోనున్న ఆశ్రయమునందు నివసించెను.

పరమేశ్వరుని మాయాశక్తియే జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి అనే రూపములలో ప్రకటమగును. జగత్తును సృష్టించే మహత్తు మొదలగు తత్త్వముల కార్యముఅగు హిరణ్యగర్భునియందు ఆ శక్తులు గలవు. ఆయన వాటి ద్వారా తనను ఒక రూపముగను, మూడు రూపములుగను మరియు పది రూపములుగను విభజించుకొనెను.

పరమేశ్వరుని అంశ మరియు మొట్టమొదటి అవతారము (ప్రథమ జీవుడు) అగు ఈ హిరణ్యగర్భుడే (బ్రహ్మాండశరీరము దృష్ట్యా విరాట్) సక లప్రాణులకు ఆత్మ. ఆయనయందే చరాచరజగత్తు అంతయు భాసించుచున్నది (వాస్తవముగా లేకున్ననూ ఉన్నట్లు కానవచ్చుచున్నది, ఊహింపబ డుచున్నది).

విరాట్ పురుషుడు సకలప్రాణులలో ఇంద్రియముల రూపము (అ ధ్యాత్మము) గను, ఆదిత్యమండలము మొదలగువాటియందు దేవతారూప ము (అధిదైవము) గను, పంచభూతములలో శబ్దము మొదలగు విషయ ముల రూపము (అధిభూతము) గను తనను తాను మూడు ప్రకారము లుగా విభజించుకోనెను. ఇంతేగాక, ఆయన ప్రాణ-అపాన-వ్యాన-ఉదానసమానములు, నాగ-కూర్మ-కృకర-దేవదత్త-ధనంజయులు అనే పది ప్రాణ వృత్తుల రూపముగను, హృదయము అనే ఒక ప్రకారముగను కూడ ఉన్నాడు.

సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువు జగత్తును సృష్టించే ఈ మహత్తు మొదలగు తత్త్వములు చేసిన విన్నపమును స్మరించెను. ఆయన వాటికి వివిధవ్యాపారములను చేసే సామర్థ్యమును కలిగించుట కొరకై, విరాట్ పురుషుని తన చిచ్ఛక్తితో ప్రకాశింప జేసెను.

తరువాత ఆ విధముగా చైతన్యదీప్తిని పొందిన విరాట్ పురుషుని యందు వివిధదేవతల స్థానములు ప్రకటమైనవి. ఆ వివరములను నేను చెప్పెను. వినుము.

ఆ విరాట్ పురుషునకు నోరు అనే స్థానము ప్రకటము కాగానే, లోకపాలకుడగు అగ్ని దానిని తన అంశయగు వాగింద్రియముతో సహా ప్రవేశించెను. దాని వలననే, ఈ జీవుడు మాటలాడుచున్నాడు.

ఆ విరాట్ పురుషునకు దవడ ప్రకటము కాగానే, లోకపాలకుడగు వరుణుడు తన అంశయగు రసనేంద్రియముతో గూడి దానియందు ప్రవేశిం చేను. ఆ ఇంద్రియముతో ఈ జీవుడు రసమును ఆస్వాదించుచున్నాడు.

సర్వవ్యాపకుడగు విరాట్ పురుషునకు ముక్కు పుటములు ప్రక టము కాగానే, ఆ స్థానమును అశ్వినీ దేవతలు తమ అంశయగు ఫ్రణీం ద్రియముతో గూడి ప్రవేశించిరి. ఆ ఇంద్రియము జీవులకు గంధజ్ఞానమును కలిగించుచున్నది.

సర్వవ్యాపకుడగు ఆ విరాట్ పురుషునకు కన్నులు ప్రకటము కాగా నే, లోకములకు ప్రభువగు సూర్యుడు తన అంశయగు చక్షురింద్రియముతో సహా ఆ స్థానమును ప్రవేశించెను. జీవులు చక్షురింద్రియముచే రూపము లను తెలుసుకొనుచున్నారు.

ఈ విరాట్ పురుషునకు చర్మము ప్రకటము కాగానే, లోకపాలకు డగు వాయువు తన అంశయగు త్వగింద్రియముతో గూడి దానిని ప్రవేశిం చెను. జీవుడు త్వగింద్రియముతో స్పర్శను తెలియుచున్నాడు.

ఈ విరాట్ పురుషునకు చెవి దొప్పలు విడివడగానే, దిక్కులు (దిగ్గేవత) తమ అంశయగు శ్రోత్రేంద్రియముతో గూడి ఆ తమ స్థానమును ప్రవేశించినవి. ఆ ఇంద్రియముతో జీవుడు శబ్దములను తెలియుచున్నాడు.

ఈ విరాట్ పురుషునకు చర్మము ప్రకటమయ్యెను. ఓషధుల అభి మాన దేవతలు తమ అంశయగు రోమములతో గూడి ఆ స్థానమును ప్రవేశించినవి. ఆ రోమముల ద్వారా జీవుడు దురదననుభవించుచున్నాడు.

ఆ విరాట్ పురుషునకు మేడ్రము ప్రకటమయ్యెను. ప్రజాపతి తన అంశయగు రేతస్సుతో గూడి ఆ తన స్థానమును ప్రవేశించెను. దాని వలన నే, జీవుడు ఆనందముననుభవించుచున్నాడు.

విరాట్ పురుషునకు గుదము ప్రకటమయ్యెను. లోకపాలకుడగు మిత్రుడు తన అంశయగు విసర్జనేంద్రియముతో గూడి దానిని ప్రవేశించెను. దానిచే జీవుడు విసర్జన కర్మను చేయుచున్నాడు.

ఈ విరాట్ పురుషునకు రెండు చేతులు ప్రకటమయ్యెను. స్వర్గము నకు ప్రభువగు ఇంద్రుడు పట్టుకొనుటకు అవసరమయ్యే బలముతో గూడి వాటిలో ప్రవేశించేను. మానవుడు ఆ శక్తి చేతనే జీవికను సంపాదించుకోను చున్నాడు.

ఈ విరాట్ పురుషునకు పాదములు ప్రకటము కాగానే, లోకనాథు డగు విష్ణువు తన అంశయగు గతిశక్తితో కూడి వాటియందు ప్రవేశించెను. మానవుడు ఆ గతిశక్తి చేతనే తాను చేరవలసిన స్థానమును చేరుచున్నాడు.

ఈ విరాట్ పురుషునకు బుద్ది ప్రకటము కాగానే, బ్రహ్మ ఆ స్థాన మును తన అంశయగు బుద్దిశక్తితో గూడి ప్రవేశించెను. మానవుడు ఈ బుద్దిశక్తిచేతనే తెలియదగిన విషయములను తెలియుచున్నాడు.

ఆ విరాట్ పురుషునకు హృదయము ప్రకటము కాగానే, ఆ స్థాన మును చంద్రుడు తన అంశయగు మనస్సుతో గూడి ప్రవేశించెను. మాన వుడు ఆ మనశ్శక్తి చేతనే సంకల్పవికల్పములు మొదలగు వికారములను పొందుచున్నాడు.

ఈ విరాట్ పురుషునకు అహంకారము ప్రకటమయ్యెను. ఆ స్థాన మును అభిమానము (రుద్రుడు) తన అంశయగు క్రియాశక్తితో గూడి ప్రవే శించెను. ఆ శక్తిచేతనే మానవుడు తనయందు కర్తృత్వమును భావించి తాను చేయదగిన పనులను చేబట్టుచున్నాడు.

ఈ విరాట్ పురుషునకు చిత్తము ప్రకటమయ్యెను. ఆ స్థానమును మహత్తత్వము (బ్రహ్మ) తన అంశయగు చిత్తశక్తితో గూడి ప్రవేశించేను. ఆ సమష్టిబుద్ధిశక్తియొక్క అనుగ్రహము చేతనే మానవుడు విజ్ఞానమును పొందుచున్నాడు.

ఈ విరాట్ పురుషుని శిరస్సునుండి స్వర్గలోకము, నాభినుండి అంతరిక్షము, పాదములనుండి పృథివి పుట్టినవి. వాటియందు సత్త్వరజస్త మోగుణముల పరిణామములగు దేవతలు మొదలగువారు కానవచ్చుచు న్నారు.

అతిశయించిన సత్త్వగుణము కారణముగా దేవతలు స్వర్గలోకము ను, రజోగుణము ప్రధానమగుటచే మానవులు మరియు వారిని అనుస రించి యుండే గోవులు మొదలగు ప్రాణులు భూలోకమును పొందిరి.

గుణములలో మూడవది తమస్సు. రుద్రుని అనుచరులైన భూతగణములలో అది ప్రధానముగా నుండును. భగవంతుని నాభియగు అంతరిక్షము భూలోక స్వర్గలోకములకు నడుమన ఉన్నది. వారు దాని యందు నివసించెదరు.

కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! విరాట్ పురుషుని ముఖము నుండి వేదముతో. బాటు బ్రాహ్మణుడు పుట్టెను. ముఖమునుండి పుట్టుటచే బ్రాహ్మణుడు వర్ణములలో ముఖ్యుడు మరియు గురువు అగుచున్నాడు.

విరాట్ పురుషుని బాహువులనుండి పాలకవృత్తి, దానిని అవలంబించే క్షత్రియుడు పుట్టెను. ఆ పురుషుని అంశమై పుట్టిన క్షత్రియుడు వర్ణముల వారిని చోరులు మొదలగు ఉపద్రవములనుండి రక్షించును.

ఆ విరాట్ పురుషుని ఊరువులనుండి జనుల జీవికకు హేతువగు వైశ్యవృత్తి ఉదయించెను. ఆ విధముగా ఉదయించిన వైశ్యుడు కృషి గోరక్ష ణము మొదలగు కార్యములను నడిపించి మానవులకు జీవికను సంపాదిం చుచున్నాడు.

విరాట్ భగవానుని పాదములనుండి సకలధర్మములను సిద్ధింప జేయుట కొరకై సేవాధర్మము పుట్టెను. పూర్వము ఆ ధర్మమునందు శూద్రుడు పుట్టెను. ఆ సేవాధర్మము శ్రీహరికి ప్రీతికరము.

వృత్తులతో సహా శ్రీహరినుండి జన్మించిన ఈ వర్ణముల వారు తమకు గురువగు శ్రీహరిని తమ ధర్మమును శ్రద్ధతో అనుష్ఠించుట ద్వారా ఆరాధించి అంతఃకరణశుద్ధిని పొందెదరు.

ఓ విదురా! కాలము, జీవుల కర్మ మరియు తన స్వభావమగు శక్తి అనువాటితో కూడియున్న భగవానుడు తన యోగమాయయొక్క ప్రభా వముచే ఈ విరాట్ రూపముగా ప్రకటమయ్యెను. దీనిని సాకల్యముగా వర్ణించే సాహసమును ఎవడు చేయును?

ఓ విదురా! అయినప్పటికీ, నేను గురుముఖమునుండి విన్నదానిని అతిక్రమించకుండగా, నా బుద్ధికి తోచినంత మటుకు శ్రీహరియొక్క కీర్తిని వర్ణించెదను. అట్లు చేయుట వలన, ఇతరప్రసంగములచే మలినమైన నా వాగింద్రియము పవిత్రమగును.

పవిత్రమగు కీర్తి గలవారిలో శిఖామణియగు భగవానుని గుణము లను గానము చేయుట మానవుల వాక్కునకు, విద్వాంసులు వర్ణించుచుం డగా చెవులను ఆ భగవద్గాథ అనే అమృతమునకు అప్పగించుట చెవులకు సునిశ్చితమగు లాభమని మహాత్ములు చెప్పుచున్నారు గదా!

ప్రియమైన ఓ విదురా! ఆదికవియగు బ్రహ్మగారు వేయి సంవత్స .రములు యోగసాధనను చేసి దానిచే పరిపక్వ మైన బుద్ధి గలవాడై, అప్ప డైననూ ఆత్మరూపుడగు శ్రీహరియొక్క మహిమను ఖచ్చితముగా తేలు సుకొన గల్గినాడా? లేదు.

కావున, భగవానుని మాయ మాయావులకు కూడ మోహమును కలిగించును. ఏలయనగా, ఆత్మరూపుడగు శ్రీహరి కూడ స్వయముగా తన మాయయొక్క గతిని తెలియలేకున్నాడు. ఇతరులను గురించి ఇక చెప్పునదేమున్నది?

భగవానుని స్వరూపమును వర్ణించబూని వాక్కు విఫలమైనది. దానిని ఊహించబూనిన మనస్సు కూడ విఫలమైనది. అహంకారాభిమాని యగు రుద్రుడు మరియు ఇతరదేవతలు కూడ భగవానుని మహిమను అంచనా వేయలేకున్నారు. అట్టి శ్రీహరి భగవానునకు నమస్కారము.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు ఆరవ అధ్యాయము ముగిసినది (6).