స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

24వ అధ్యాయము

నారదుడిట్లు చెప్పసాగేమ - అది విని హిమవంతుడు భార్యతో సహా ఆనందముతో ఉప్పొంగిన హృదయముతో వారదుని నమస్కరించి ఇట్లడిగెను  'అయ్యా! నేను పుణ్యవంతుడనైతే మిమ్ములనొకటి అడుగదలిచాను వాకూతురి కుడిచెయ్యి పైకిలేచినట్లున్నది. కారణమేమిటో వినగోరుచున్నాను'. అని అడుగగా నేను ఆ కారణమునిట్లు చెప్పితిని - 'ఈ దక్షిణకరము ఎల్లప్పుడూ అన్ని ప్రాణులకూ అభయమిచ్చునది - కనుక పైకి లేచినట్లున్నది. పర్వతరాజా ఈ బాలిక జగత్తులను భరించు మహేశ్వరుని భార్య. అన్ని లోకములకు తల్లి, కారణము ప్రాణుల ఉనికికి కారణము - ఈమె శివునితో కలియునట్లు, నీవు త్వరగా యథావిధి చేయము - దేవతలకిందు గొప్ప ప్రయోజనమున్నది'. అని పలికి అతనికి వీడ్కోలు పలికి వెళ్ళి ఇంద్రునితో ఆ విషయమును తెలిపితిని . 'నేమ చేయవలసినదానిని చేసితివి ఇక మిగిలిన పనికై మన్మథుని ప్రేరేపించవలెను' అని ఆదేశించి నేను తారకాసురుని వద్దకు వెళ్ళితిని 'అర్జునా! కలిపియుడనగుటచే (కలహ ప్రియుడు) ఇదంతా స్పష్టముగా చెప్పవలెనని వెళ్ళితిని - హిమవంతుడు కూడా నా మాటతో ప్రేరితుడై, శివుని ఆరాధించుటకు పార్వతిని సఖులతో సహా వెళ్ళుటకు ఆదేశించెను పార్వతి శివునికి పరిచర్యలను చేసెను.

అట్లు నియమింపడిన పార్వతి శివునికి పూజకై పూలు, పళ్ళు, నీరు తెచ్చి పెట్టెను - ఇక ఇంద్రుడు నా మాటపై మన్మథుని స్మరించెను. ఆది తెలిసి మన్మథుడు వసంతునిలో, రతిలో కలిసి మామిడిపూతయే ఆయుధముగా ఒక్కమారుగా ఆవిర్భవించెను. అంత ఇంద్రుడు తెలివిగా నవ్వుతూ మన్మథుని స్పృశించుచు ఇట్లనెను - 'రతిప్రియా! నీకు ఉపదేశము ఎక్కువగా నివ్వవలసినది లేదు - అందరి చిత్తమున నివసించు నీకు ఆందరి భావములు తెలియును - అయినప్పటికీ వా కార్యపరత్వమును స్మరించుచూ నీకు చెప్పెదను. మన్మథా! నీవు నాకొక పెద్దపనిని చేసి పెట్టవలెను - పతియను తన భార్యనుండి వియోగమును పొందిన పరమకృపాళువగు మహేశ్వరుని నీవు హిమవంతుని ఇంట జన్మించిన సతీదేవితో కలుపుము - అపుడు సంతోషించు శివపార్వతులు నీవు కోరినది చేయగలరు'. అనగా మదనుడిట్లనెను - దేవేంద్రా! ఇది అసత్యము - ఆ మహాదేవుడు. తపోరతుడు - తేజస్సులనింకొకరు కలుపనవసరం లేదని మనువనెను కదా! ఇక వీపులు వేదాంతమున మరల మరల నన్ను నిందింతురు - కామమనునది అన్నింటికి గ్రహించునది, గొప్ప పాపము నాచరించునది. ఒక పెద్ద అగ్ని.  జ్ఞానుల జ్ఞానము ఈ నిత్యశత్రువగు కామము చేత కప్పబడియున్నది - కనుక సాధువులు ఈ కామమును పామువలె ఎప్పుడూ విడిచిపెట్టవలెను అందురు. ఇట్టి స్వభావము గల నాపట్ల పాపియగు త్రాగుబోతు పట్లవలె మహేశ్వరుడు, జగద్గురువు ఎట్లు సంతుష్టుడగును?

అపుడు ఇంద్రుడిట్లనెను - 'మహాశయా! నీవట్లనవద్దు - నీవు లేనిచో ఈ భూమిపై ధర్మార్థకామమోక్షములను పొందుటకు ఎవరఝులగుదురు (ఎవరు శక్తులగుదురు?)  లోకములో ఏదైనా సాధ్యమవుతున్నదంటే దానికి మూలము కామన (కోరిక) కనుక మోక్షమును సాధించగోరు వారు కామమునెట్లు నిందింతురు? నీ రూపము మువ్విధముగా నుండునని శ్రుతి చెప్పినది నిజము. నీరూపము తామసము, రాజసము, సాత్త్యికము. అందు ముక్తికై కాక కేవలము కోరికతో నుండునది నీ తామసరూపము - సుఖబుద్ధితో, స్పృహతో వుండు రూపము రాజసము. వస్తుస్థితి నాశ్రయించునది నీ సాత్త్యిక రూపము - అట్టి నీ మూడు రూపములను ఎవరుపాసించరు? చెప్పుము. నీవు సాక్షాత్తు పరమపూజ్యునివి - కనక మాకీ పనివి చేసి పెట్టుము - ఆయిననూ, పండితులు పీడితులను చూచి వారు సామాన్యులైననూ తాము తమ ప్రాణములొడ్డి రక్షింతురు - కాని ఇది గొప్ప ప్రయోజనము అని ఆలోచించి నీవు ఈ పనిని చేయుము'. అని ఇంద్రుడనగా వివి మన్మథుడు సరేనని వసంతునితో, రతితో కలిసి కోకిలలు మొదలగు సైన్యములో హిమవత్పర్వతము వైపు కదిలెను. అచట అనేక వృక్షములతో, శాంత స్వభావముగల జంతువులతో కూడియున్న శివుని ఆశ్రమములను చూచెను. అక్కడ సాక్షాత్తు మహేశునివలె నున్న వీరకుడను శివుని ద్వారపాలుని, వేలకొలది ఇతర గుణములను మన్మథుడు చూచెను.

ఆక్కడ మన్మథుడు నాసాగ్రముపై దృష్టిని నిలిపిన, వృక్షముయొక్క నీడలో వేదికపై నున్న, నిటారుగా దేహమును నిలిపి సుఖముగా కూర్చొని సమాధిస్థితిలో ఇంద్రియవిషయములన్నింటినీ నిగ్రహించి తనలో తాను ప్రవేశించిన నిశ్చలుడైన మహేశ్వరుని చూచెను. ఆ తపోనిధినట్లు చూచి మన్మథుడు అంతరంగమును ఛేదించవలెనని తుమ్మెదల ధ్వని యను నెపముతో అతని మనసున ప్రవేశించెను. అంతలో దేవదేవుడు కళ్ళు విప్పి అనురాగముతో పార్వతిని తలుచుకొనెను. అపుడు వీరకుడు పార్వతి ఎప్పటివలె వచ్చి వెళ్ళిననెను. అంతట పార్వతి యందు తన మనస్సు అనురక్తమగుటను చూచి దేవదేవుడగు శివుడు లీలగా దానిని నిగ్రహించి తన వెనుక వైపున చూచెను. అంత బాణమునక్కు పెట్టిన మన్మథుడు కనబడెను - అతని నశింపజేయవలెనని శివుడాస్థలమును విడిచి ఎన్నో ప్రదేశములకు వెళ్ళిననూ మన్మథుడు వెంటనుండెను - నదులను, పర్వతములను, ఆశ్రములను, సరస్సులను ఎన్నింటిని చుట్టి వచ్చిననూ మన్మథుడు తన వెంటనంటుట చూచెను. ముల్లోకములలో తిరిగి పరమశివుడు చివరకు తన ఆశ్రమమునకు వచ్చి మన్మథుడు తన వెంటనే యుండుట చూచి నీశ్వసించెను. అంతట అతని మూడవ కంటినుండి వెలువడిన అగ్ని, దేవతలు ఆక్రోశించుచుండగా మన్మథుని భస్మమొనర్చెను.

 ఆ అగ్ని మన్మథుని భస్మము చేసి అన్ని దిక్కులలో తన జ్వాలలతో ఎగియుచూ జగత్తును దహించుటకు విజృంభించెను. అంతట జగత్తును రక్షించుటకు పరమశివుడు ఆ అగ్నినీ విడగొట్టి అహంకారముగల జనులలో, చంద్రునిలో, పూలలో, గీతములలో, తుమ్మెదలలో, కోకిలల గొంతులో, విహారములలో వుంచెను - దానిని పొందే కదా కామినుల హృదయము స్నేహమయమగును. ఆ అగ్ని అడ్డులేనిది, దుఃఖమును కలిగించుచూ, ఎల్లప్పుడూ జ్వలింపజేయుచుండెను. శివుని నిఃశ్వాసజ్వాలలచే మన్మథుడు భస్మమగుటను చూచి రతీదేవి తన బంధువగు వసంతునితో కలిసి దుఃఖించసాగెను  అట్టి ఆమెను చైత్రమే ఊరడించెను. ఆమె దుఃఖించుటను విని శివుడు దయతో ఆమెను చూచుచూ నిట్లనెను.  'అమ్మా! రూపము లేకున్ననూ నీ భర్త రతికాలములో కావలిసిన దానిని చేయగలడు - సంశయములేదు. వసుదేవునికి పుత్రునిగా, విష్ణువు జన్మించినపుడు అతనికి కలుగు పుత్రుడు నీకు పతికాగలడు'. అవి ఊరడించగా రతిదేవి నమస్కరించి వసంతుడు మొదలగు వారితో కలిసి తనకు ఇష్టమైన విధముగా వెళ్ళిపోయెను.

ఇది శ్రీ స్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున కుమారేశుని  మాహాత్మ్యములో కామదహనమను ఇరువదినాలుగవ అధ్యాయము.