స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
5వ అధ్యాయము
నారదుడు చెప్పసాగెను. ఆ తరువాత నేను ఆ ధనము నీ వద్దే వుండనిమ్ము, అవపరము వచ్చినపుడు తీసుకొనెదనని ధర్మవర్మతో పలికి రైవతగిరికి వచ్చితిని. భూమికి భుజమానన్నట్లు ఎత్తుగా మండి సాధువుల వాహ్వానించు చుండిన ఆ గొప్ప పర్వతమున చూచి మిక్కిలి సంతోషించితిని. సద్బుద్ధిగల గృహయజమానిని పొంది భార్యాపుత్రులు ఎల్లెడలా ప్రకాశించునట్లు ఆ పర్వతముపై అనేకరకాల వృక్షములు విలసిల్లుచుండెను. సద్గురువు నుండి జ్ఞానమును పొంది శిష్యగణములు తృప్తినొందినట్లు, ఆ పర్వతముపైని కోకిలమొదలగు పక్షులు సంతృప్తిని పొంది కూయుచుండెను. శ్రీ మహాదేవుని చేరి భక్తుడు తన మనోరథమును పొందినట్లు ఆ పర్వతముమ చేరి అక్కడ తపమాచరించు నరులు కోరిన దానిని పొందెదరు. పార్థా! అట్టి పర్వత శిలనొక దానిని చేరి నేను చల్లని పిల్లవాయువునానందించుచూ ఇట్లు తలంచితిని. దుర్లభమైన స్థలమును చివరకు చేరితిని. ఇక బ్రాహ్మణుని కొరకు నేను ఉపక్రమించెదను. ఎవరైతే అత్యుత్తములో యోగ్యతములో అట్టి బ్రాహ్మణులను నేను చూడవలెను. అయిననూ, ఈ విషయమున శ్రుతివేత్తలిట్లందురు.
తెరచాపలేని నావ నీటిని దాటించనట్లే, శ్రేష్టుడైననూ ఆచారము లేని విప్రుడు కూడా సంసారమునుండి దాటించలేడు. అధ్యయనము లేని బ్రాహ్మణుడు గడ్డిలో నిప్పువలె త్వరగా శమించును. అట్టి వానికి హవ్యమునివ్వరాదు- భస్మములో హవ్యము నర్సించరు కదా! దానమునకు యోగ్యుడైన వానిని వదిలి అయోగ్యునికి దానమిచ్చినచో, ఆది గోవుని విడిచి గాడిదకు గోవుకి తగిన క్రియలను నిర్వహించుటవంటిది. మూరునికి దానమిచ్చినచో అది చవిటి భూమిలో విత్తిన విత్తనము వలే, పగిలిన కుండలో ఆవు పాలవలె, బూడిదలో పోసిన హవ్యము వలె అశాశ్వతము. విధిలేనివానికి, ఆయోగ్యునికి దానమిచ్చినచో ఆదీ నశించడమే కాదు, మిగిలిన పుణ్యము కూడా నశించును. భూమి, గోవు, భోగములు, బంగారము, దేహము, గుర్రము, కన్ను, వస్త్రము, నెయ్యి, నిప్పు, నువ్వలు, సంతతి వీనిని దానము తీసుకున్నచో ఇవి నశింపజేయును. కనుక విద్వాంసుడు గాని వాడు వీవిని దానము తీసుకొనుటనుండి భయపడవలెను. ఏ కొద్దిగా తీసుకొన్నా బురదలో ఆవువలె మునిగిపోవును. కనుక, గూఢమగు తపము గలిగి, గూడమైన స్వాధ్యాయము గలిగి తన భార్యయందే ఆసక్తిగల శాంతులకు దానమిచ్చినదే శాశ్వతము.దేశ కాలముల నెరిగి శ్రద్ధతో యోగ్యునికి దానమిచ్చినదే ధర్మము. కేవల విద్యతో గానీ, తపస్సుతో గాని యోగ్యులు కారు. ఎవరిలో శీలము విద్య, తపస్సు మూడూ వుంటాయో వారే యోగ్యులు అనబడుదురు.
ఆ మూడింటిలోనూ విద్యయే ముఖ్యమైన మహాగుణము. విద్యలేని విప్రులు కళ్ళున్న గుడ్డివారు. కనుక విద్వాంసుడు ప్రతిదేశములో ఈ జ్ఞానులను పరీక్షించవలెను. ఎవరు నా ప్రశ్నలకు సమాధానములనిత్తురో వారికే ఇచ్చెదను. అవి తలచి ఆ ప్రదేశమునుండి బయలుదేరి మహర్షుల ఆశ్రమముల యందు చరించుచూచుంటిని. ప్రశ్నరూపముననున్న ఈశ్లోకములను గానము చేయుచునుంటిని. వినుము. మాతృక ఏమిటి? ఎన్నివిధములు? ఎట్టి అక్షరములు గలది? పది అద్భుతములలో గూడిన ఇల్లునెవరెరుగుదురు? అనేక రూపములు గల స్త్రీని ఒక రూపమున చేయగలవాడెవడు? సంసారమున నుండి చిత్రకథాబంధమును తెలిసిన వాడెవడు? విద్యా పరాయణుడైన వాడెవడు సముద్రములోని భయంకర మొసలినెరుగును? ఏ బ్రాహ్మణశ్రేష్ఠుడు ఎనిమిది విధములుగా నున్న బ్రాహ్మణభావమునెరుగును? నాలుగు యుగములు మూలదీవసములను తెలుపువాడెవడు? పదునాలుగు మనువుల మూలదినమేది? ఉద్వేగపరుచునది ఏది? ఈ ఘోర సంసారమున అమిత దక్షుడెవరు? ఇక రెండు మార్గములను గూర్చి తెలిసి చెప్పగలవాడున్నాడా? ఈ నా పన్నెండు ప్రశ్నలకు సమాధానములను తెలిసిన బ్రాహ్మణోత్తములు నాకు అత్యంత పూజ్యులు, వారికి నేను ఎల్లప్పటికీ ఆరాధకుడను.
ఇట్లు గానము చేయుచూ నేను భూమిపైనంతటా తిరిగితివి. అందరూ నా ప్రశ్నలను విని కష్టమైనవివి. నీకు నమస్కారములనిరి. ఇట్లు భూమిపైనంతటా తిరిగి, తగిన బ్రాహ్మణుడు దొరకక నేను హిమాలయ శిఖరముపై కూర్చుండి మరల చింతనొందితిని. ఆందరు విపుల జూచితిని. ఇక నేనేమి జేయవలెను? అట్లాలోచించుచుండిన నాకిట్లు తట్టింది. ఈ నాటికీ నేమ ఉత్తమగ్రామమైన కలాపగ్రామమునకు వెళ్ళలేదు. మూర్తీభవించిన తపస్సువలెనున్న విప్రులక్కడ నివసించెదరు. ఎనభైనాలుగువేలమంది వేదాధ్యయవపరులున్న గ్రామమది. అక్కడికే వెళ్ళేదనని తలచి ఆకాశమున చరించువాడనై మంచును దాటి వేరొక తీరము చేరితివి. ఆక్కడ పుణ్యభూమిన, మారు యోజనములలో అనేక వృక్షములతో విలసిల్లిన గ్రామరత్నమును చూచితివి. అక్కడ పుణ్యవంతుల శ్రేష్ఠమైన ఆశ్రమములు మార్లకొలదిగా నుండెను. జీవులన్నీ పరస్పరవైరము లేకుండినవి. యజ్ఞములనాచరించు మునులకు ఎల్లప్పుడూ ఉపయోగపడునది, సత్పురుషులకు, ధర్మవంతులకు ఉపకరించునది ఆ గ్రామము. అక్కడ మునులకు శాశ్వతస్థానముండినది. స్వాహా, స్వధా, వషట్, హంత అనునవి ఎల్లప్పుడూ వినబడుచుండినవి. పార్థా! కృతయుగము యొక్క సగము బీజమక్కడ మిగిలినది. సూర్యచంద్రవంశీయుల, బ్రాహ్మణుల స్థానమైన ఆ దేశమును చేరి ద్వీజాశ్రమములను ప్రవేశించితిని.
అక్కడ ద్విజోత్తములు వివిధ వాదములను చేయుచునుందురు. మూర్తీభవించిన వేదముల వలె పరస్పరము విషయముల చర్చించెదరు. మేధావులు కొందరు వేరొకరు నింపిన(తెలిపిన) అర్థమును ఆకాశమున మాంసపు ముద్దవలె విదిల్చివేసిరి (నిరసించిరి) అపుడు నేను చేతులెత్తి నమస్కరించుచూ ఆ బ్రాహ్మణులతో నిట్లంటిని. బ్రాహ్మణులారా! పూరించుడు! ఈ కా,కా,రవములతో ప్రయోజనమేమి? జ్ఞానమున్నచో నా ఈ కష్టమైన ప్రశ్నలకు సమాధానమివ్వండి' అనగా బ్రాహ్మణులిట్లనిరి. బ్రాహ్మణుడా! నీ ప్రశ్నలేమిటో చెప్పుము. విని గ్రహించెదము. నీవు ప్రశ్నలడుగుట మాకు లాభమే కదా!' అని వారు నేనంటే నేనే ముందని రణములో వీరులవలె ఒకరినొకరు అడ్డగించిరి.అప్పుడునేను పన్నెండు ప్రశ్నలనడగగా ఆ ద్విజులు విని తేలికగా గ్రహించి ఇట్లనిరి.'ద్విజుడా! ఈ చిన్నపిల్లల ప్రశ్నలతో ఏమి లాభము? అయిననూ, మాలో అతి చిన్నవాడిగా ఎవరిని భావింతువో అతను సమాధానమివ్వగలడు. అనగా నేను ఆశ్చర్యపడి, కృతార్థుడనైతినని సంబరపడి వారిలో చిన్నవానిని అడిగితిని. అపుడు సుతనువను పేరుగల ఆ బాలుడు కాని బాలుడు (బాలురలో జ్ఞాని) నాతో ఇట్లనెను. 'ద్విజుడా! ఈ నీ చిన్న ప్రశ్నలతో నా వాక్కు నెమ్మదించినది. (నోరు పెకలడం లేదు) ఆయిననూ నన్నే చిన్నపానిగా నీవు తలచినందున చెప్పెదను.
సుతనువిట్లు చెప్పెను. మాతృకలనగా.యాభయిరెండు అక్షరములు. వానిలో ఓంకారము మొదటిది. తరువాత పదునాలుగు స్వరములు (అచ్చులు) ముప్పయిమూడు హల్లులు, అనుస్వారము, విసర్గ, జిహ్వమూలీయ, ఉపధ్మానీయములు కలిపి యాభయిరెండు. నీకు సంఖ్య చెప్పితిని. ఆర్థమును కూడా చెప్పెదను వినుము. పూర్వము జరిగిన దానిని ఇతిహాసమును చెప్పెదను. పూర్వమిది మిథిలానగరమున బ్రాహ్మణుని ఇంట జరిగినది. పూర్వము మిథిలా నగరమున కొథుముడను బ్రాహ్మణుడుండువాడు. అతను భూమిపై నున్న విద్యలనన్నింటినీ చక్కగా చదివెను. ముప్పయి ఒక్కవేల సంవత్సరాలు నిరంతరముగా చదివి గృహస్థుడాయెను. కొంతకాలమునకు అతనికి కొడుకు పుట్టెను. జడుని వలె వుండుచూ ఆ బ్రాహ్మణబాలుడు మాతృకలనే నేర్చెను. మాతృకలను తప్ప వేరొక దానినెప్పుడూ చదవడు. అపుడు తండ్రి ఖిన్నుడై ఆ జడుడగు కుమారునితో నిట్లనెను- 'కుమారా! చదువు నాయనా చదువు! చదివితే నీకు లడ్డూలనిచ్చెదను. లేనిచో వావిని వేరే ఎవరికైనా ఇచ్చెదను. చదవనిచో నీ చెవులు పిండెదను.
అనగా ఆ పుత్రుడిట్లనెను- 'నాయనా! లడ్డూలకొరకు లోభముతో చదివెదమా? పఠనమంటే పురుషులకు పరమార్థమని గదా చెప్పబడినది.' అనగా తండ్రి ఇట్లనెను. 'ఆహా! ఇట్లు పలుకుచున్న నీకు బ్రహ్మ ఆయుష్సు కలుగుగాక! కానీ, అధ్యయనము చేయని నీకీ మంచి బుద్ధి ఎట్లు కలిగినది? అనగా పుత్రుడిట్లనెను. 'నాయనా! తెలియవలసినది తెలిసినది. ఇక కంఠశోషను ఎందుకు చేయవలెనో చెప్పుము' అనగా తండ్రి ఇట్లనెను. 'బాలకా! విచిత్రముగా మాటలాడుచుంటివి. నీకు తెలిసిన అర్థమేమి? చెప్పుము. నీమాటలను వినగోరుచుంటిని.” అనగా ఆ బాలకుడిట్లనెను. 'నాయనా! అనేక తర్కములను ముప్పయి ఒక్క సంవత్సరాలు చదివికూడా నీ మనసున భ్రాంతి నిలిచినది. ఇది ఇట్లు అని దర్శమున చెప్పబడిన ధర్మములందు నీ మనసు ఊగిసలాడుచున్నది. దానిని తొలగించెదను. ఉపదేశమును పఠించుచుంటివి గానీ తత్యమును తెలియకుంటివి. పఠించుటమాత్రమే చేయు విప్రులు రెండు కాళ్ళ పశువులే. ఇక నీకు మోహమును తొలగింపజేయు అద్భుతమైన వాక్యమును చెప్పెదను వినుము. ఆకారమనగా బ్రహ్మ, ఉకారము విష్ణువు, మకారము రుద్రుడు. ఈ ముగ్గురూ (మూడూ) మూడు గుణాలే. పైనున్న ఆర్థయాత్ర సదాశివుడు. ఇది ఓంకార మాహాత్మ్యమని సనాతన శ్రుతి చెప్పుచున్నది.
ఓంకారము యొక్క గొప్పతనమును వాస్తవముగా తెలియజేయుట వేలకొలది సంవత్సరములచే గానీ, కోటికొలది గ్రంథములతో గానీ శక్యము గాదు. అయిననూ సారమనుదానినంతా చెప్పెదను వినుము. అకారము నుండి అః వరకు పదునాలుగు మనువులు. సాయంభువు, స్వారోచి, ఔత్తమ, రైవతుడు, తామసుడు, చాక్షుషుడు, వైవస్వతమనువు ఇప్పుడుండువాడు.అట్లే సావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్ర సావర్ణి, దక్షసావర్ణి, ధర్మసావర్ణి అనువారు రౌచ్యుడు, భౌత్యుడను పదునలుగురు మనువులు. తెలుపు, పాండురము, ఎరుపు, రాగివనె, పసుపు, కపిలము నలుపు, గాఢనలుపు, బూడిదవన్నె, ధూళివర్లము, పిశంగకము, మువ్వన్నె, చిత్రము, అన్ని రంగుల కలయిక అనునవి క్రమముగా వీని వర్ణములు. వైవస్వతుడు క్షకారము వర్ణము నలుపు, కకారము మొదలు పకారము వరకు ముప్పదిమూడు దేవతలు. కకారము నుండి '6 వరకు పన్నెండుగురు ఆదిత్యులు. వారు- ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు మరియు భగుడు, వివస్వంతుడు, పూష, సవిత అను పదవవాడు, పదకొండవవాడు త్వష్ట పన్నెండవ వాడు విష్ణువు గుణముల చేత అతనాదిత్యులందరిలో పెద్దవాడు. జఘున్యుని సంతానము, డకారము నుండి బకారము వరకు పదకొండుగురు రుద్రులు.
కపాలి, పింగళి, భీమ, విరూపాక్ష, విలోహిత, అజక, శాసన, శాస్త్ర, శంభు, చండ, భవ అనువారు ఏకాదశరుద్రులు. భకారమునండి షకారము వరకు ఎనిమిది వస్తువులు. వీరు ధ్రువ, ఘోర, సోమ, ఆప, నల, అనిల, ప్రత్యూష ప్రభాస అనువారు. ఇద్దరు అశ్వినీ దేవతలు హకారము. మొత్తము ముప్పది మూడు. అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయము, ఉపధ్మానీయము అనునవి జరాయుజ, అండజములు స్వేదజములు, ఉద్భిజములు అను జీవములు. భావార్థమును చెప్పితిని ఇక తత్యార్థమును చెప్పెదను వినుము. ఈ దేవతలనాశ్రయించి క్రియలొనర్చు వారే ఆర్థరూపమగు నిత్యపదమునందు లీనమయ్యేదరు. మనస్పుచే, వాక్కుచే, కర్మచే దేవతల పూజించినపుడే వాలుగు జీవయోనుల నుండి ముక్తుడగును. ఏ శాస్త్రమున ఈ దేవతలు. పాపులచేత పూజింపబడరో దానిని బ్రహ్మ స్వయముగా చెప్పిననూ శాస్త్రముగా భావించరాదు. ఈ దేవతలు ఆంతటా శ్రాతమార్గమున ప్రతిష్ఠింపబడినారు. ఈ దేవతలను కాదని తపస్సును, దానమును, జపమును చేయు దురాత్ములు వాయుమార్గముననే వణకుచునుందురు. ఆత్మను జయించని వారి మోహము యొక్క గొప్పతనమును . చూడుడు. మాతృకలను మాత్రమే చదువుతారు కానీ దేవతలను అంగీకరించరు.
సుతనువు చెప్పెను- అతని మాటలను విని తండ్రి మిగుల విస్మయము నొందెను. అనేక ప్రశ్నలనడుగగా ఆ బాలుడు వానికి తగిన సమాధానములనిచ్చెను. నేను కూడా నీకు మాతృకా ప్రశ్నను ఉత్తమమగు దానిని చెప్పితిని. ఇక ఐదైదుతో నున్న గృహమును గూర్చిన రెండవ ప్రశ్నకు సమాధానమును వినుము. మహాభూతములు ఐదు, కర్మేంద్రియాలైదు, జ్ఞానేంద్రియాలూ ఐదే. ఇంద్రియవిషయాలూ ఐదే. మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, పురుషుడు ఐదు. ఇరువదియైదవవాడు సదా శివుడు. ఈ ఇరవై అయిదుతో కూడినదే గృహమనబడును. ఈ దేహము గృహమే. నిజానికిది శివుని చేరును. వేదాంతవేత్తలు బహురూపిణియగు బుద్దియే స్త్రీయందరు. ఆ బుద్ది నానా విషయములను పొంది నానా రూపములను పొందును. ఒకే ధర్మముతో సంయోగమున్నందున అనేక విధములుగా నున్ననూ ఏకరూపయే. ఈ తత్యార్థమును తెలిసినవాడు నరకమును పొందడు. మునులుచెప్పనిదీ ఈ అర్థము. దేవతలనంగీకరించినట్లుండు ఈ వచనమును పండితులు బంధమని, చిత్రకథయని అందురు. కామాన్వితమగు ఐదవదానిని చెప్పెద వినుము. లోభమొక్కటే పెద్ద మొసలి. లోభమునుండియే పాపము, క్రోధము, కామములు కలుగును. లోభమువల్లనే మోహము, మాయ, మానము, స్తంభము, ఇతరమును పొందు కోరిక, అవిద్య, అజ్ఞానములనునవన్నీ కలుగును.
ఇతరుల ధనమును హరించుట, ఇతరుల స్త్రీలను (భార్యలను) కోరుట, మొదలగు అవివేకముతో కూడిన పాపములన్నీ . లోభమే మోహముతో సహా దీనిని జయించవలెను. దంభము, ద్రోహము, నింద, దౌర్జన్యము, మాత్సర్యము అనునవన్నీ లోభముతోనున్న పాపులకు కలుగును. గొప్ప శాస్త్రములను ధరించుచూ, పండితులై, సంశయముల ఛేదించువారైనమా లోభముతో నరకమున పడుదురు. లోభము, క్రోధము గలవారు, శిష్టాచారమును విడిచిన వారు, మనసులో కత్తులుంచుకొని (కఠినులై) వాక్కులో మాధుర్యమును చూపువారు గడ్డితో కప్పబడిన బావులవంటివారు. హేతుబలముతో ఆయా మార్గములను ఏర్పరుచువారు లోభమువలన ఆయా జాతులయందు అన్ని మార్గములను నశింపజేసెదరు. లోభముచేత ధర్మిష్ఠులైనమా క్షుద్రులై జగత్తును దోచుకొనెదరు. నిత్యమూ లోభము గలవారు పాపిష్టులని తెలియవలయు. జనకుడు, యవనాశ్వుడు, వృషాదర్శి, ప్రసేనజిత్తు అనువారు, లోభము లేనందుచేతనే స్వర్గమును చేరారు. ఆట్లే ఇతర రాజులు కూడా. కనుక లోభమును విడిచినవారు సంసారమను సముద్రమును దాటెదరు. అట్లే ఇతరులు కూడా ఈ మొసలిచేత బడినచో లోభమును విడిచి ముక్తులయ్యేదరు- ఇక విప్రుడా! బ్రాహ్మణులలో ఎనిమిది భేదములను వినుము.
మాత్ర, బ్రాహ్మణ, శ్రోత్రియ, అనూచాన, భ్రూణ, ఋషికల్ప, ఋషి, ముని అనునవి బ్రాహ్మణభేదములు. ఈ ఎనిమిది భేదములలో బ్రాహ్మణులు శ్రుతియందు మొదటివారు. తరువాతి తరువాతి వారు తమ తమ విద్యచేత, ప్రవర్తనచేత శ్రేష్ఠులు. బ్రాహ్మణ కులమునందు పుట్టి జాతిచే మాత్రమే బ్రాహ్మణుడై ఉపనయనము కానివాడు, క్రియలు లేనివాడు 'మాత్రుడు' అనడును. వేదము యొక్క ఒక భాగమునైనమా పూర్తిచేసిన వాడు, ఆచారవంతుడు, చక్కని ప్రవర్తనగల వాడు, నిగ్రహము గలవాడు, సత్యము పలుకువాడు, దయగలవాడు బ్రాహ్మణుడనబడును. కల్పముతో ఏదో నొక శాఖను ఆరువేదాంగములతో అధ్యయనము చేసినవాడు, అధ్యయనము, బోధనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహమను ఆరు కర్మలలో నిరతుడు, ధర్మము తెలిసిన విప్రుడు శ్రోత్రియుడనబడును. వేదవేదాంగముల తత్యమును తెలిసినవాడు, నిర్మలుడు, పాపములేనివాడు, శ్రోత్రియుడైన జ్ఞాని అనూచానుడనబడును. ఈ అనూచాన గుణములు కలిగి యజ్ఞముల, స్వాధ్యాయమును చేయువాడు, ఇంద్రియముల జయించినవాడు, శిష్టులు మిగిల్చిన దానిని భుజించువాడు భ్రూణుడనబడును. వైదిక, లౌకిక జ్ఞానమునంతా పొంది, నిగ్రహము గలిగి ఆశ్రమమున నుండువాడు ఋషికల్పుడు. ఊర్ధ్వరేతస్కుడు, నియమముగా భుజించువాడు, స్థిరమైనవాడు, శాపాన్నిచ్చుటకు గానీ, అనుగ్రహించుటకు గానీ శక్తిగలవాడు, సత్యసంధుడు ఋషియనబడును. వైరాగ్యము గలవాడు, అన్నీ తత్యముల తెలిసినవాడు, కామక్రోధములు లేనివాడు, ధ్యానముననుండు వాడు, క్రియలయందు స్పృహలేనివాడు, నిగ్రహముగలవాడు, మట్టి పెడ్డను, బంగారమును సమముగా చూచువాడు ముని.
ఇట్లు వంశముచేత, విద్యచేత, ప్రవర్తనచేత గొప్పవారైన బ్రాహ్మణశ్రేష్ఠులు త్రిశుక్లులనబడుచూ యజ్ఞములు మున్నగు వానియందు పూజింపబడుదురు. ఇట్లు బ్రాహ్మణవిధములు చెప్పబడినవి. ఇక యుగాదులను వినుము. కార్తీక శుద్ధనవమి కృతయుగము మొదలనబడును. వైశాఖ శుద్ధ తదియ త్రేతాయుగము మొదలు, మాఘమాసమున పూర్ణీమ ద్వాపరయుగము మొదలనబడును. శ్రావణ మాసమున కృష్ణత్రయోదశి కలియుగ ప్రారంభమనబడును. ఇవన్నీ యుగాదులు. ఇందు దానమిచ్చిన వానికి లోటుండదు. ఈ నాలుగు తిథులలో దానమిచ్చినా, హవనము చేసినా అది అనంతమగును. ప్రతియుగమున నూర్లకొలది సంవత్సరములలో దానమిచ్చినది, ఈ తిథులలో ఒక రోజు దానమిచ్చిన దానితో సమము. ఇట్లు యుగాదుల చెప్పితిని. ఇక మన్వాదుల వినుము. ఆశ్వయుజ శుద్ధనవమి, కార్తీక ద్వాదశి, చైతదియ, భాద్రపదతదియ, ఫాలున అమావాస్యా, పుష్యమున ఏకాదశి, ఆషాఢదశమీ, మాఘ సప్తమి, శ్రావణకృష్ణ అష్టమి, ఆషాఢపూర్ణిమ, కార్తీక, ఫాల్గున, చైత్రమాసములయందు పూర్ణిమ, జ్యేష్ఠమున పూర్ణిమ మన్వంతరాదులనబడును. వీనియందు దానమిచ్చినచో నదియనంతమగును. ఏ తిథిలో పూర్వము సూర్యుడు రథమును పొందెనో అది మాఘమాసమున సప్తమి, రథసప్తమి యనబడును. ఆనాడివ్వబడిన దానము, వేల్చబడిన హవ్యము భాస్కరునికి ప్రీతికలిగించును, అన్ని దరిద్రముల పోగొట్టి అనంతముగనుండును.
నిత్యమూ ఉద్వేగమును (ఆందోళనను) కలిగించు వానిని గూర్చి చెప్పెద వినుము. నిత్యము యాచించువాడు స్వర్గమునకు పాత్రుడు గాడు. దొంగలవలె అతనూ ప్రాణులకు ఆందోళన కలిగించుటచే పాపాత్ముడై వరకమును పొందును. బ్రాహ్మణా! ఏ కర్మచే నాకు మేలుకలుగును? ఇక్కడినుండి నేనెక్కడకు వెళ్ళవలెను? అని విచారించి తగిన ప్రతిక్రియచేయువానిని దక్షుడని పెద్దలందరు. ఎనిమిది నెలలచే, ప్రొద్దునిలిచిన సమయముచే, యవ్వన కాలముచే పురుషుడు తామ అంత్యకాలమున సుఖముగ నుండు పనినే చేయవలెను.వేదాంతవేత్తలు 'ఆర్చీ-ధూమ' మని రెండు మార్గములను గూర్చి చెప్పెదరు. అర్చిరాది మార్గముచే మోక్షమును, ధూమమార్గముచే పునరావృత్తి (మరల జన్మ) ని పొందెదరు. యజ్ఞములచే ధూమమార్గమున, విష్కర్మ (ఫలాపేక్షలేని) కర్మచే అర్చిర్మార్గమును పొందెదరు. ఈ రెంటికంటే ఇతరమైనది 'పాఖండమార్గము' దేవతలను గౌరవించక, మమవు సూచించిన ధర్మముల పాటించక జీవించువాడు అర్చి-ధూమ మార్గముల రెంటినీ పొందడని యథార్థము సూచింపబడినది. బ్రాహ్మణోత్తమా! నీ ప్రశ్నలకు యథాశక్తి బదులిచ్చితిని. తప్పో, ఒప్పో తెలిపి నీ గూర్చి తెలుపుము.
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి సృష్టిఖండమున కౌమారీకా ఖండమున కలాపగ్రామవాసియైన సుతనువను బ్రాహ్మణుడు నారదుని ప్రశ్నలకు బదులిచ్చుట యను ఐదవ అధ్యాయము.
