నారద ఉవాచ- నారదుడిట్లనెను-
రాజైన సురథుడు మునిశ్రేష్ఠుడగు మేధసునివలన మహాజ్ఞానమునెట్లు పొందెను. వైశ్యుడుకూడ ఆ మహర్షివలన ముక్తినట్లు పొందేనో వివరించగలరని ప్రార్థించెను.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను
ధ్రువమహారాజునకు ఉత్కళుడను పుత్రుడుండెను. అతని పుత్రుడు నంది. స్వాయంభువ వంశమున పుట్టిన ఆ మహారాజు చాలాబలవంతుడు, సత్యమును మాట్లాడువాడు, ఇంద్రియములను జయించినవాడు. .
ఆ రాజు నూరు అక్షౌహిణుల సైన్యమును తీసికొని మహాజ్ఞానియైన సురథమహారాజు యొక్క పట్టణమును చుట్టుముట్టెను. వారిద్దరు సంవత్సరము వరకు యుద్ధముచేసిరి. ఆయుద్దమున చిరంజీవియు, విష్ణుభక్తుడునగు నందిమహారాజు సురథుని జయించెను. నంది మహారాజువల్ల తిరస్కృతుడైన సురథుడు భయముతో ఒంటరిగా దట్టమైన అడవిలోనికి పారిపోయెను, ఆ అడవిలో పుష్పభద్రానదీ తీరమున ఆ మహారాజునకు ఒక వైశ్యుడు కనిపించెను. ఆ ఇద్దరి మధ్య స్నేహమేర్పడినది. వారిద్దరు పుష్కరక్షేత్రమునకు వెళ్ళి అచ్చటనున్న మేధోముని ఆశ్రమమునకు పోయిరి. ఆ సమయమున మేధోముని తన శిష్యులకు దుర్లభమైన బ్రహ్మతత్వమును గూర్చి చెప్పుచుండెను.
రాజగు సురథుడు, వైశ్యుడు ఈ ఇద్దరు మునిశ్రేష్ఠుడగు మేధసుని నమస్కరించిరి. ఆ మహర్షి వారిద్దరకు అతిధి సత్కారముచేసి వారి కుశలమును జాతీని పేరును వేరు వేరుగా అడిగెను. అప్పుడు రాజగు సురథుడా మునిపుంగవునికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
సురథ ఉవాచ- సురధుడిట్లనెను-
పూజ్యుడా! నేను చైత్రవంశమున పుట్టిన సురథుడను రాజును. నన్ను బలవంతుడైన నందీయను రోజూ జయించి పట్టణమునుండి తరిమివేసెను. నేను ఏ ఉపాయమున రాజ్యమును తీరగిపొందెదనో దానిని మీరు నాకు చెప్పుడు. నేను మిమ్ము శరణు వేడితిని.
ఈ వైశ్యుని పేరు సమాధి. ఇతడు పరమధార్మికుడు. ఇతనిని భార్యాపుత్రులు ధనముపైగల ఆశచే ఇంటినుండి వెడలగొట్టిరి. ఈతడు ప్రతిదినము బ్రాహ్మణులకు కోటిరత్నములు దానము చేయుచుండెడువాడు. ఈతడు చేయు దానధర్మములను ఇతని భార్యపుత్రులు వ్యతిరేకించుచుండిరి. వారు కోపముతో ఇతనిని ఇంటినుండి వెళ్ళగొట్టిరి. తరువాత వారు పశ్చాత్తాపపడి రమ్మన్నను విరక్తుడై జ్ఞానవంతుడై తిరిగి ఇంటికిపోలేదు. అతని పుత్రులు పితృశోకముతో విరక్తులై తమ సంపదనంతయు బ్రాహ్మణులకు దానముచేసి ఇంటిని వదలి పెట్టి అడవికి పోయిరి.
చాలా కష్టముతో లభించు శ్రీహరి దాస్యము కావలెనని ఈ వైశ్యుడు కోరుచున్నాడు. కోరికలు లేని ఇతడు ఈ కోరికను ఎట్లు పొందునో మీరు వివరింపుడని పలికెను.
శ్రీమేధా ఉవాచ- మేధోమహర్షి ఎట్లు పలికెను-
నిర్గుణుడైన శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞచే లంఘించుటకు వీలులేనిది, త్రిగుణాత్మిక యైన విష్ణుమాయ ప్రపంచమునంతయు తన మాయచే కప్పివేయుచున్నది. ఆ దేవి కృపతో ఎవరిని అనుగ్రహించునో వారికి సుదుర్లభమైన భక్తిని ఇచ్చుచున్నది.
విష్ణుమాయయగు దుర్గ దుర్మార్గులైన ఎవరిని అనుగ్రహింపదో వారిని తన మాయవలన మోహజాలమున పడవేయును, వారికి అశాశ్వతమైన ఈ లోకమున నిత్యబుద్దీని కలిగించును. అట్లే వారికి శ్రీకృష్ణునిగాక ఇతర దేవతలను ఆరాధించు బుద్ధిని కలిగించును. ఇతరదేవతా మంత్రముల జపించునట్లు చేయును. లోభమువలన మనస్సులో మిథ్యయగు ఏదో నిమిత్తమును కల్పించుకొని ఇటునటు తిరుగుదురు. అన్యదేవతలు కూడ శ్రీహరియొక్క అంశరూపులుకావున వారిని ఏడు జన్మలవరకు సేవించి ప్రకృతీదేవియొక్క దయవలన ప్రకృతిని సేవింతురు, ఆ విధముగా విష్ణుమాయయగు ప్రకృతిని ఏడుజన్మలవరకు సేవించి సనాతనుడు, జ్ఞానానందుడగు పరమశివుని భక్తితో సేవింతురు.
శ్రీహరియొక్క జ్ఞానాధిష్టాన దేవతయగు శివుని సేవించి ఆతని దయవలన త్వరలోనే శ్రీహరి భక్తిని వారు పొందుచున్నారు. సగుణాత్మకుడు, సత్వస్వరూపియగు విష్ణువును సేవించినందువలన సత్వ జ్ఞానము కలిగి నిర్మలమైన జ్ఞానము పొందుదురు. సాత్విక గుణ సంపన్నులైన వైష్ణవులు సగుణ స్వరూపుడైన విష్ణువును సేవించి ప్రకృతికి అతీతుడు, నిర్గుణుడైన శ్రీకృష్ణభక్తిని పొందుదురు. సత్పురుషులైన శ్రీకృష్ణభక్తులు శ్రీకృష్ణమంత్రమును పొంది ఆ మంత్రమును జపించి. నిర్గుణుడైన ఆ స్వామిని సేవించి వీరుకూడ నిర్గుణులగుచున్నారు. ఇట్టి వైష్ణవులు నిరామయమైన గోలోకమున. ఉండి ఆ గోలోకవాసుని దాస్యమును సతతము చేయుచుందురు. వారు, ఆ గోలోకముననుండి అనేకులైన బ్రహ్మదేవులు గతించుచుండగా వారిని చూచుచుందురు.
శ్రీకృష్ణభక్తునినుండి విష్ణుమంత్రోపదేశమునెవరు పొందుదురో వారు తమ తండ్రి వంకనున్న వేయి తరములవారిని, తల్లి పక్షముననున్న వేయితరముల వారిని తల్లిని, తన భృత్యులను అందరిని ఉద్ధరించి గోలోకమునకు పోవును.
శ్రీకృష్ణభక్తియను నౌక ద్వారా వైష్ణవియగు దుర్గ మహాభయంకరమైన సంసారమనే సముద్రమునకు పయనించుచున్న దీనులను కర్ణధార రూపిణియై తరింపజేయుచున్నది. ఆదేవి వైష్ణవుల కర్మబంధనములను శ్రీకృష్ణపరమాత్మయొక్క తీక్షణమైన శస్త్ర స్వరూపిణియై చేదించుచున్నది,
వైష్ణవియగు ఆ శక్తి వివేకా, ఆవరణీ అనురెండురూపములతోనున్నది. వివేచికా శక్తి శ్రీకృష్ణభక్తునకు ఇతరులకు శ్రీకృష్ణుడు సత్యస్వరూపుడు నిత్యుడనియు, తద్భిన్నములన్నియు ఆశాశ్వతమైన భావమును కలిగించుచున్నది. వివేచనాత్మకమైన ఈ బుద్ధి మిక్కిలి సనాతనమైనది.
తనకు లభించిన లక్ష్మి నిత్యమైనది అనుబుద్ధి ఆవరణీ బుద్ధి. ఇట్టి బుద్ధి విష్ణుభక్తులుకాని కర్మభుజాలకు మాత్రముండును.
ఓరాజా! నేను ప్రచేతసుడను మహర్షి పుత్రుడను. నా తాత బ్రహ్మదేవుడు. నేను శ్రీశంకరునివల్ల కృష్ణ జ్ఞానమును పొంది సనాతనుడగు ఆ పరమాత్మనెల్లప్పుడు ధ్యానించుచున్నాను.
అందువలన రాజానీవు నదీతీరమునకు పోయి వైష్ణవీయగు, దుర్గాదేవిని పూజింపుము. నీకు రాజ్యమును తిరిగి పొందవలెనను కోరికయున్నందువలన ఆ పరమాత్మ నీకు ఆవరణబుద్ధిని కలిగించును.
ఇక కోరికలనన్నిటిని త్యజించి దుర్గను సేవించు వైశ్యునకు ఆ దయావతి శుద్ధమైన వివేచికా బుద్ధిని కలిగించును.
మిక్కిలి దయగల మేధోమహర్షి వారితో నిట్లని, దుర్గాదేవి పూజావిధానమును, స్తోత్రమును, కవచమును, మంత్రమును వారికి ఉపదేశించెను. వైశ్యుడా స్తోత్రకవచాదికములచే ప్రతిదినము దుర్గాదేవిని సేవించి ఆమె అనుగ్రహము వలన ముక్తిని పొందెను. రాజగు సురథుడా దేవిని పూజించి దయగల ఆ తల్లివలన రాజ్యమును, పరమైశ్వర్యమును, మనుత్వమును. పొందెను. - నారదమునీ! ఇది దుర్డోపాఖ్యానము. ఇది సుఖమును మోక్షమును కలిగించు శక్తిగలది.
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణుల సంభాషణమున చెప్పబడిన దుర్గాదేవి యొక్క ఉపాఖ్యానమున కనిపించు సురధమేధో మహర్షి సంవాదమున సురథునకు, వైశ్యునకు. వారివారి కోరికలు లభించు విషయమును తెలుపు అరవై రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 62 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Reinforcing one of the core moral mandates of the Purāṇa, this chapter declares that all women in creation, regardless of their birth, social status, or age, are direct earthly manifestations of Parā Prakṛti. The text strictly prohibits causing physical or emotional harm, disrespect, or insult to any woman, warning that abusing a woman brings immediate spiritual downfall, loss of wealth, and residence in hellish realms. Conversely, honoring women with respect, protecting their dignity, and treating them with motherly reverence brings permanent peace, prosperity, and the direct blessings of Goddess Lakshmī upon the household.