నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను-
గంగాదేవి కలియుగమున ఐదువేల సంవత్సరముల తర్వాత ఎక్కడికి వెళ్ళినదో వివరముగా తెలుపుడు.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
నారదా! సరస్వతీ దేవి యొక్క శాపముననుసరించి భారతదేశమును చేరిన గంగాదేవి శాపము తీరిన తరువాత మరల వైకుంఠమునకు చేరెను. అట్లే గంగా దేవి యొక్క శాపము ముగిసినపిదప లక్ష్మీ సరస్వతులు వైకుంఠమునకు చేరిరి. వేదములలో శ్రీహరికి గంగా సరస్వతి, లక్ష్మీ, తులసీదేవి యను నలుగురు ఇష్టమైన వారని చెప్పబడినది.
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లడిగెను-
బ్రహ్మదేవుని కమండలువు లోను పరమశివుని శిరస్సు పైన నున్న గంగాదేవి ఎందువలన విష్ణుపాదాబ్జసంభవయైనది. అట్లే నారాయణుని ప్రియురాలుగా ఎట్లైనది ఈ విషయమును నాకు వివరించి చెప్పుడు.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
పూర్వకాలమున గోలోకమందు గంగాదేవి రాధాకృష్ణుల అంగములనుండి ద్రవరూపముగా పుట్టినది. ద్రవవస్తువులకు ఆమె ఆధిష్ఠాన దేవత. నవయౌవనముతో రత్నాభరణములో ఉన్న ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలెనున్నది. ఆమె శరీరకాంతి బంగారు వలె నున్నది. శుద్ధ సత్వ స్వరూపిణి యగు ఆగంగాదేవీ పీనము, కఠినమైన నితంబముతో, పీనోన్నతము, సుకఠినమైన స్తనయుగ్మముతో, అందమైన నేత్ర యుగళముతో అలరారుచున్నది. అట్లే ఆ దేవి మాలతీ మాలగిల వంకర కొప్పుగలది. పాపిటలో చందన బిందువులతో నున్న సిందూర బిందువులున్నవి. చెక్కిళ్ళపై కస్తూరి పత్రములున్నవి. ఆమె దంతములు పండిన దానిమ్మగింజలవలెనున్నవి. బంగారు కాంతి గల రెండు వస్త్రములను ధరించి శ్రీకృష్ణుని పార్శ్వమున లజ్జతో పద్మపత్రములవంటి కన్నులతో శ్రీకృష్ణుని ముఖమును చూచుచు కామముతో మూర్ఛచెందినది.
ఆ సమయమున అచ్చటనే ఉన్న రాధిక ముఖము కోపముతో ఎరుపెక్కినది. తెల్లని చంపక పుష్పము వంటి కాంతిగల ఆ రాధ రత్నాభరణములను రెండు పీతాంబరములను ధరించి వద్మముల వంటి కాంతిగల కోమలమైన పాదములమ రత్నవిమానమునుండి క్రింద ఉంచి చెలికత్తెలు చామరములు వీయగా అందమైన కొప్పును కదలించుచు కోపముతో పెదవులు కంపించగా ఆచ్చట నిలిచినది.
రాధాదేవి తన సఖులతో శ్రీకృష్ణుని పార్శ్వమందున్న రత్నసింహాసనమున కూర్చొనెను. ఆమెను చూచి శ్రీకృష్ణుడు ఆదరముతో లేచి మధురమైన మాటలతో పలుకరించెను. అచ్చటనున్న గొల్లలు వంచిన శిరస్సులతో శ్రీకృష్ణుని స్తుతింపగా రాధాదేవి సైతము అతనిని స్తుతించినది.
రాధికా దేవిని చూచి గంగ వెంటనే లేచి భయముతో అతివినయముతో కుశలమడిగెను. ఆ గంగ వినయముతో భయము వలన ఎండిపోయిన గొంతుతో శ్రీకృష్ణుని శరణు వేడినది. ఆతడామెకు అభయమివ్వగా గంగాదేవికి ధైర్యము సమకూరినది.
రాధాదేవి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను. ఆమె బ్రహ్మలందరికి ఆదిదేవత. సనాతని, పన్నెండు సంవత్సరముల కన్యవలె ఉండెను. రూపమున గుణములలో ప్రపంచమున సాటిలేనిది. అంతులేనిది, ఆద్యంత రహిత. ప్రపంచమున నున్న సుందరస్త్రీలందరికంటె సుందరమైనది. శ్రీకృష్ణునకు ఆర్ధాంగి. తేజస్సున, వయస్సున, కాంతియందు శ్రీకృష్ణునితో సమానమైనది. మహాలక్ష్మీశ్వరుడైన శ్రీకృష్ణునిచే పూజింపబడినది. శ్రీకృష్ణునకు ప్రాణప్రియ. అట్టి రాధ సింహాసనమున ఉండగా గంగాదేవి రెప్పవాలని కన్నులతో ఆమెను చూచినది.
అప్పుడు రాధ వినయవంతురాలై మధురమైన మాటలతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికినది.
రాధికోవాచ- రాధిక ఇట్లు పలికెను -
హే భగవన్ చిరునవ్వుతో నీ ముఖాంబుజమును చూచుచున్న ఈ కాముకురాలెవరు? మిమ్ములనుచాటుగా మాటిమాటికి చూచుచు పులకించిన శరీరముతో మూర్ఛపోవుచున్నది. నీవు కూడ ఆమెను కాముకుడవై చిరునవ్వుతో చూచుచున్నావు. స్త్రీజాతికి సహజమైన ప్రేమతో మాటిమాటికి క్షమించుచున్నాను. అందువలన నీకు ప్రియరాలైన ఈస్త్రీని తీసికొని గోలోకమునుండి వెళ్ళిపొమ్ము , లేనిచో నీకు మంచి జరుగదు.
శ్రీకృష్ణా! నీవు ఒకప్పుడు చందనవనములో “విరజ” తో కలిసి విహరించుచున్నప్పుడు నేను చూచీ కోపగించితిని. కాని నా స్నేహితురాండ్ర మాటలను విని నిన్ను క్షమించితిని. నీవు విరజతో కలిసి తిరుగుచున్నప్పుడు నా శబ్దమును వినినంతమాత్రమున నీవు మాయమైతివి. విరజ తన శరీరమును వదలి, నదిగా మారినది. విరజానది కోటి యోజనముల విస్తీర్ణముతో నాలుగు కోట్ల యోజనముల పొడవుతో నేటికిని, ప్రవహించుచున్నది.
నేను ఇంటికి తిరిగి పోగానే నీవు ఆమె దగ్గరకు వెళ్ళి విరజా! విరజా! అని గట్టిగా పిలిచితివి. అప్పుడు సిద్ధయోగినియైన విరజాదేవి నీటినుండి బయటకు వచ్చెను. అప్పుడామెను నీవు కౌగిలించుకొని రతి జరుపగా ఆమెకు నీవలన ఏడు సముద్రములు ఉద్భవించినవి.
శ్రీకృష్ణా! నీవొకప్పుడు చంపకవనములో శోభయను గోపికలో కలిసి తిరుగుచుండగా చూచితిని. అప్పుడు కూడ నా శబ్దమును వినగానే నీవు అంతర్ధానమైతివి. శోభకూడ తన శరీరరమును వదలి చంద్రమండలమును ప్రవేశించినది. ఆమె శరీరము గొప్ప తేజస్సుగా మారగా నీవు బాధపడు మనస్సుతో రత్నమున, బంగారమున, విద్యావంతులయందు, స్త్రీల ముఖములయందు, రాజునందు, విలువైన వస్త్రముల యందు కాసులయందు, చందనమున, నీటిలో, చిగురుటాకుల యందు రాజుల ఇండ్లయందు, దేవాలయములయందు, సంస్కృతులైన జనులయందు తేజోరూపమైన ఆమెయొక్క శరీరమును పంచిపెట్టితివి.
శ్రీకృష్ణా నీవు పూర్వము “ప్రభ” అను గోపికాస్త్రీతో కలిసి విహరించుచుండగా నేను చూచితిని. అప్పుడు కూడ నా శబ్దమును వినగానే నీవు అoతర్ధానమైతివి. “ప్రభ” కూడ దేహమును వదిలి సూర్యమండలమునకు పోయినది. అప్పుడు ఆమె శరీరమునుండి వేడియైన తేజస్సు ఉద్భవించినది. నీవప్పుడు ఆమెపై గల ప్రేమతో ఏడ్చుచు కళ్ళకు, అగ్నికి, రాజులకు, మానవసంఘములకు, దేవతలకు, దస్యులకు, సర్పములకు, బ్రాహ్మణులకు, మునులకు, సౌభాగ్యవతులైన స్త్రీలకు, కీర్తి కలవారికి ఆ తేజస్సును పంచి ఇచ్చితివి.
శ్రీకృష్ణా! ఒకప్పుడు నీవు రత్నమందిరములున్న రాసమండలమున ‘శాంతి’ యను గోపికతో కలిసి పూలపాన్పుపై ఉండగా నేను చూచితిని. అప్పుడు ఆమె నీవిచ్చిన సుగంధమైన తాంబూలమును తినినది. అట్లే నీవు కూడ ఆమె ఇచ్చిన తాంబూలమును తింటివి. అప్పుడు కూడ నా చప్పుడు వినపడగానే లీనమైపోయినది. ఆమె శరీరము శ్రేష్ఠగుణముగా రూపుదాల్చగా దానిని నీవు ఆమెపై గల ప్రేమతో ఏడ్చుచు సత్వస్వరూపుడైన విష్ణువుకు, లక్ష్మీదేవికి, సీమంత్రము నుపాసించు వైష్ణవులకు, మునులకు, ధర్మునకు, ధర్మిష్ఠులకు కొంత కొంత భాగము నిచ్చితివి.
నీవొకప్పుడు “క్షమ” యనే గోపికతో కలిసియుండగా చూచితిని. అప్పుడు నీవు మంచి వేషముతో పుష్పమాల చందనము ధరించియున్నావు. ఆ గోపిక కూడ రత్నాభరణములతో చందనముతోనుండినది. మీరిరువురు పుష్పములు చందనము కల శయ్యపై సుఖమూర్ఛితులై ఉంటిరి. ఆ సమయమున నేను మీమ్ములనిద్దరిని నిద్రనుండి లేపిన సంగతిని స్మరింపుము. అప్పుడు నేను తీసికొన్న పీతవస్త్రము, మురళి, వనమాలా కౌస్తుభరత్నములను ప్రేమతో నా చెలికత్తెల మాటపై నీకు తిరిగి ఇచ్చివేసితిని. అప్పుడు నీవు సిగ్గుతో నల్లబడితివి. అనలుపురంగు నేటికి నీ శరీరరమున కన్పించుచున్నది.
క్షమాదేవి శరీరమును వదిలిపెట్టి భూమినాశ్రయించినది. తరువాత ఆమె శరీరము ఒక శ్రేష్ఠగుణమైనది. అప్పుడు నీవామెపై గల ప్రేమతో ఏడ్చుచు ఆమె శరీరమును విష్ణుమూర్తికి, వైష్ణవులకు, ధర్మిష్ఠులకు, ధర్మునకు, దుర్బలులకు, మునులకు, దేవతలకు, పండితులకు, పంచిపెట్టితివి.
ఇంకను ఏమైన వినదల్చితివా? నీగుణమును సంపూర్ణముగా నేనెరుగుదును అని రాధ ఎరుపెక్కిన కళ్ళతో సిగ్గుపడుచు నమస్కరించుచున్న గంగతో మాట్లాడుటకు మొదలిడెను.
సిద్ధయోగినియైన గంగ యోగజ్ఞానముతో రాధాదేవి చెప్పబోవు మాటల భావమును తెలిసికొని ఆ సభమధ్యలోనుండి తన జలములలో ప్రవేశించినది. రాధాదేవి కూడ యోగజ్ఞానముతో గంగ జలరూపముతో అoతట ఉన్నట్లుగా గుర్తించి ఆ నీటినంతయు త్రాగుటకుపక్రమించెను.
గంగాదేవి యోగజ్ఞానముతో రాధాదేవియొక్క మనోభావమును గుర్తించి శ్రీకృష్ణుని పాదములను శరణువేడి ఆచ్చట విలీనమైనది. రాధాదేవి గోలోకమున వైకుంఠమున బ్రహ్మలోకము మొదలగు లోకములన్నిటిలో గంగాదేవిని చూడలేకపోయినది. గంగాదేవి తన శరీరమును ఉపసంహరించుకొన్నందువలన సమస్తలోకములు జల శూన్యమైనవి. జలజంతువులన్నియు నీరు లేక చనిపోయినవి.
అప్పుడు బ్రహ్మ, విష్ణు శివాది దేవతలందరు మనువులు, మానవులు, సిద్ధులు మునులందరు ఎండిపోయిన పెదవులు నాలుకలతో ప్రకృతి కంటె ఉన్నతుడైన సర్వేశ్వరుని చూచిరి. ఆ శ్రీకృష్ణుని యొక్క నిర్గుణ తత్వమును తెలిసికొని భక్తులననుగ్రహించు తలపుతో సాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించుకొనిరి.
సమస్త చరాచర సృష్టికి కారణ భూతుడు, జ్యోతిర్మయుడు, రత్న సింహాసనముపైనున్నవాడు, గోపాలురు చామరములు వీయగా గోపికలు నృత్యము గానము సేయుచుండగా అనేక గోపగోపీ పరివృతుడు, శరీరమంతటను చందనమును ఆలదుకొనినవాడు, రత్నభూషణ భూషితుడు, మేఘశ్యాముడు, పీతాంబరము ధరించినవాడు. పన్నెండు సంవత్సరముల బాలునివలెనుండువాడు, కోటి చంద్రులకాంతిగల శరీరము కలవాడు, కోటి మన్మథాకారుడు, ప్రాణములకన్న మిన్నయగు రాధాదేవి తాంబూలమును సేవించుచున్నవాడు, రాధాదేవి వక్షస్థలము పై నున్నవాడగు శ్రీకృష్ణుని దేవతలందరు దర్శించుకొనిరి.
మునులు, సిద్ధులు, మానవులు మొదలగు వారందరు పరమాత్మను చూచి మిక్కిలి సంతోషముతో పరమాశ్చర్యమునకు లోనైరి. అప్పుడు వారందరు కలిసి ఆలోచించుకొని శ్రీకృష్ణపరమాత్మతో తమ అందరి అభిప్రాయమును వెల్లడించుటకు బ్రహ్మదేవుని ఎన్నుకొనిరి.
బ్రహ్మదేవుడు వారి మాటలకు ఒప్పుకొని విష్ణువూర్తియొక్క కుడిభాగమున, పరమశివుని ఎడమభాగమున నున్న కృష్ణుని చూచెను. అచ్చట రాసమండలమున సమస్తము కృష్ణమయముగా కనిపించెను. అందరు ఒకే వేషముతో ఒకే ఆసనమువనున్నట్లు కన్పించిరి. రెండు భుజములతో మురళిచేతిలో ధరించి వనమాలా విభూషితుడై నెమలిపింఛమును, కౌస్తుభరత్నముమ ధరించి అతిసుందరముగా శాంతమూర్తియై యున్నట్లు కనిపించిరి. వారి వస్త్రములు, ఆకృతి, వయస్సు, తేజస్సు భూషణములందరికి ఒకే విధముగానుండినవి. అచ్చట సేవకుడెవరు? యజమాని ఎవరు అని చెప్పవీలుకాకుండెను. ఒక క్షణము కృష్ణుడు రాధ ప్రత్యేకాసనములందున్నట్లు, ఇంకొక క్షణము రాధాదేవితో కలిసి యున్నట్లు, వేరొకక్షణమున రాధాదేవి మాత్రమే కనిపించగా మరియొక క్షణమున కృష్ణుడు మాత్రమే కనిపించెను. అచ్చట స్త్రీలెవరో పురుషులెవరో బ్రహ్మదేవుడు కూడా గుర్తించలేక పోయెను.
అప్పుడు బ్రహ్మదేవుడు తన హృదయకమలముననున్న శ్రీకృష్ణుని ధ్యానమనస్కుడై దర్శించి అనేక ప్రకారములుగా నమస్కరించి భక్తితో స్తుతించెను. ఆ తరువాత హృదయకమలమున నున్న శ్రీకృష్ణుని అనుజ్ఞతో కళ్ళు తెరవగా గోపిమండల మండితుడు, తన అనుచరగణముతో కలిసి రాధాదేవి దగ్గరనున్న శ్రీకృష్ణుని చూచెను. అప్పుడు బ్రహ్మదేవుని వెంటనున్న మానవ దేవతా గణము శ్రీకృష్ణునకు పునః పునః నమస్కారములొనరించిరి.
అప్పుడు సర్వాత్మ స్వరూపుడు సర్వేశుడు సురేశ్వరుడైన పరమాత్మ వారి మనోగతమును గుర్తించి ఇట్లనెను.
శ్రీ భగవానువాచ- పరనూత్మయైన శ్రీకృష్ణుడిట్లనెను-
బ్రహ్మదేవుడా! ఇక్కడికి రమ్ము. శంకరుడా నీవు కూడ ఇక్కడికి రమ్ము. మీరు సుఖముగా ఉండుడు. మీరందరు గంగకై ఇక్కడకు వచ్చితిరి. కాని నా సమీపమున నున్న గంగను రాధాదేవి పానము చేయుటకు సిద్ధపడినది. అందువలన మీరు గంగాదేవి భయమును దూరము చేయుడు.
శ్రీకృష్ణుని మాటలు విని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో సర్వారాధ్య, శ్రీకృష్ణపూజితయగు రాధను, భక్తితో తల వంచుకొని తన చతుర్ముఖములతో ఇట్లు స్తుతించెను.
ఈగంగాదేవి రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మ మరియు నీయొక్క శరీరమునుండి జన్మించినది. ఆమె మీ ఇద్దరి అంశకలది నీకు కూతురు వంటిది. ఆమె నీ మంత్రముతో నీ పూజను చేసినచో ఆమెకు వైకుంఠమున నున్న చతుర్భుజుడైన విష్ణువు భర్తకాగలడు. భూమిలో నున్న ఆమె అంశస్వరూపమైన గంగకు సముద్రుడు భర్త కాగలడు. గోలోకమున నున్న గంగాదేవి నీ వంటిది నీకు కూతురు కూడ అని అనెను.
బ్రహ్మదేవుని మాటలను విని రాధాదేవి సరే యనెను. అప్పుడు గంగా దేవి శ్రీకృష్ణుని పాదాంగుష్ఠమునుండి బయలువెడలినది. అచ్చటనే పరమశాంతముగా ఆమె ఉండినది. ఆ గంగనీటిని బ్రహ్మదేవుడు తన కమండలువులో ఉంచుకొనగా పరమశివుడు తన శిరస్సున ధరించెను.
బ్రహ్మాదేవుడు గంగాదేవికి రాధికామంత్రమును, స్తోత్రమును, కవచమును, పూజావిధానమును, ధ్యాన ప్రకారమును, పురశ్చర్యాక్రమమును తెలిపెను. అందువలన గంగ రాధను పూజించి వైకుంఠమును చేరుకొనెను.
నారాయణునకు లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి వీరు నలుగురు భార్యలు.
అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు కాల వృత్తాంతము నిట్లు చెప్పదొడగెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-
ఓ బ్రహ్మదేవుడా! విష్ణుమూర్తీ! పరమశివుడా! గంగను మీమీలోకములకు తీసికొని వెళ్ళుడు. ఇక మీరు కాలము యొక్క వృత్తాంతమును వినుడు.
మీరు, తక్కిన దేవతలు, మునులు, సిద్ధులు, తనస్వులు ఇంకను ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వారందరు కాలమునకు అతీతులై గోలోకముననే ఉందురు.
ప్రాకృతలయమున సమస్త ప్రపంచము జలమున మునిగియున్నది. ఇతర లోకములందున్న బ్రహ్మ మొదలైనవారందరు ఇప్పుడు నాలో విలీనమై యున్నారు. ఇప్పుడు గోలోకవైకుంఠములు తప్ప తక్కిన లోకములన్నియు నీటిలో మునిగియున్నవి. అందువలన నీవు బ్రహ్మాండాదిలోకములను సృష్టింపుము. నేను ఇతర లోకములలో బ్రహ్మసృష్టిని చేసెదను.
నాకనురెప్పపాటుతోనే (నిమిషకాలముననే) బ్రహ్మ యొక్క ఆయువు తీరిపోవును. ఈవిధముగా ఎందరో బ్రహ్మలు పుట్టినారు. గతించినారు. పుట్టబోవుదురు.
ఈవిధముగా శ్రీకృష్ణుడు కాల విషయమును చెప్పి తన అంతఃపురమునకు వెళ్ళెను. దేవతలు కూడ తమతమలోకములకు పోయి మరల సృష్టిచేయుటకు ఉద్యమించిరి.
ఈవిధముగా శ్రీకృష్ణుడు కాలవిషయమును చెప్పి తన అంతఃపురమునకు వెళ్ళెను. దేవతలు కూడ తమతమలోకములకు పోయి మరల సృష్టి చేయుటకు ఉద్యమించిరి.
గంగ గోలోకమున వైకుంఠమున, కైలాసమున, బ్రహ్మలోకమున ఇంకను పూర్వమున్నచోట్ల అoతటా ఉండినది. విష్ణుమూర్తి యొక్క పాదాబ్జములనుండి బయటకు వచ్చినందువలన గంగకు విష్ణుపది యను పేరు వచ్చెను.
ఈవిధముగా మోక్షము నిచ్చు గంగోపాఖ్యానమును నీకు వివరించితిని.
శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున చెప్పబడిన గంగోపాఖ్యానమనే పదకొండవ అధ్యాయము సమప్తము.
Summary of chapter 11 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
The narrative transitions into the legendary history of Shankhachūḍa and Tulasī, revealing their previous births in the transcendent realm of Goloka. Shankhachūḍa was originally Sudāmā, an intimate cowherd friend of Lord Śrī Kṛshṇa, while Tulasī was a radiant cowherd maiden named Tulasī who was deeply devoted to the Lord. Due to an unexpected confrontation and mutual curses exchanged between Sudāmā and Goddess Śrī Rādhā during a celestial pastime, Sudāmā was cursed to be born on earth as a powerful Asura named Shankhachūḍa, while Tulasī was cursed to take birth in the mortal world as a human princess destined to become his wife.