యమ ఉవాచ- యముడు సావిత్రితో ఇట్లనెను –
నరకములో నున్న అన్ని కుండములు పున్నమి నాటి చంద్రునివలె గుండ్రముగా నుండును. మిక్కిలిలోతైనవి. అనేక విధములైన రాళ్ళచే కట్టబడినవి, ఈ నరకకుండములన్ని నశింపవు. ఇవి ప్రళయమున సైతము ధ్వంసము కావు భగవంతుని ఇచ్చవలననే అవి నిర్మించబడినవి. పాపములు చేసి కొన్నవారికి మిక్కిలి కష్టమును కలిగించు ఆ కుండములు అనేక రూపములలో నున్నవి.
వాటిలో మండుచున్న నిప్పులవలెనుండునది, నూరు హస్తముల ఎత్తులేచుచున్న జ్వాలలు కలది, క్రోశపరిమాణము (మూడు కిలోమీటర్లు?) కలది వహ్ని కుండము.
నాదూతలు పెట్టుబాధలు సహింపలేక బిగ్గరగా ఏడ్చుచున్న పాపులు కలది, నానా భయంకరమైన జంతువులతో నిండినది, అతి భయంకరమైన చీకటి గలది, నాదూతలచే ఎల్లప్పుడు రక్షింపబడునది ప్రశస్తి కుండము.
సలసలమఱుగు ఉప్పునీళ్ళతో నిండినది, మొసళ్ళచే నీండినది, ఒక క్రోశపరిమితమైనది క్షారకుండము.
నా యొక్క దూతలు బాధపెట్టుచుండగా, ఆహారము లేక నోరు ఎండుకొని పోవుచుండగా రక్షింపుమని ఎలుగెత్తి ఆరచుచున్న పాపులతో నిండినది, మలమూత్రములచే నిండినది, మిక్కిలి దుర్వాసన కలది, క్రోపరిమితమైనది మలకుండము.
నాభటులు దండించుచుండగా ఆహారములేక రక్షించమని ఎలుగెత్తి ఆరుచుచున్న మహాపాపులతో నిండినది, సలసలకాగు మూత్రముచే, మూత్రమునందుండు క్రిములతో నిండియున్నది, రెండుకోసుల వైశాల్యము కలది, చిమ్మచీకటిలో యుండునది మూత్రకుండము.
నాయొక్క దూతలు బాధింపుచుండగా నోళ్ళు ఎండుకొనిపోగా, శ్లేష్మమునే భుజించు పాపులతో నిండి క్రోశపరిమితమైనది శ్లేష్మకుండము. ఆ కుండమున ఉండు పాపులను ఆందలి క్రిములే భక్షించుచుండును.
గరళకుండము ఆర్ధక్రోశ వైశాల్యముతో నుండును. అచ్చట వజ్రములవంటి పండ్లు గల పాములుండును. అచ్చట ఉండు పాపులను విషమునందుండు క్రిములు భక్షించుచుండును. నా భటులు వారిని బాధించుచుండగా వణుకుచు ఎండిపోయిన గొంతులతో బిగ్గరగా వారు ఆరచుచుందురు.
దూషికా (కండ్లలోని ఊసు) కుండము కంటిలోని మలముతో నిండియుండును. అచ్చట నేత్రమలములోని కీటకములుండును. దూషికాకుండమున నుండు పురుగులు అచ్చటి పాపులను విపరీతముగా బాధించుచుండును.
వసాకుండము వసారసముతో నిండియుండును. అచ్చటనుండు పాపులు యమభటులచే బాధలు పడుచు ఆ వసనే తీనుచుందురు.
శుక్ర కుండము శుక్రముచే నిండియుండును. అది నాలుగు క్రోశముల వైశాల్యము కలది. ఆచ్చటనున్న పాపులను శుక్రకీటకములు భక్షించుచుండును.
రక్తకుండమున దుర్గంధము కల రక్తముండును. అది దిగుడు బావివలె చాలా లోతైయుండును. ఆ కుండమున నున్న పాపులు దుర్గంధము కల రక్తమును తినుచు పురుగులచే తమ శరీరములు భక్షింపబడుచుండగా బాధలు పడుచుందురు.
అశ్రుకుండము మానవుల కన్నీళ్ళతో నిండియుండును. దాని వైశాల్యము రక్తకుండమున సగముండును. అశ్రు కుండమున నున్న పాపులు నా భటులచే దండన పొందుచు కన్నీళ్ళనే ఆహారముగా స్వీకరించి కీటకములు తమ శరీరమును భక్షించుచుండగా బాధపడుచుందురు.
గాత్ర మలకుండము మానవుల శరీరమందలి మలముచే నిండియుండును. అచ్చట నున్న పాపులను నాభటులు దండించుచుండగా అందలి కీటకములు వారి శరీరములను భక్షించుచుండగా ఆ శరీరమలమునే అచ్చటి పాపులు భక్షించుచుందురు.
కర్ణమల కుండమున చెవులలోని మలమంతా ఉండును. అది వాపి కంటే నాల్గురెట్లెక్కువగా నుండును. అందలి పాపులు యమదూతలచే దండింపబడుచు, కీటకములు వారి శరీరమును భక్షించుచుండగా ఆకలివలన చెవిలోని మలమునే తిమచుందురు.
మానవుల యొక్క ఎముకలలోనుండు “మూల్గు” తో నిండినది మజ్జాకుండము. అది మిక్కిలి దుర్వాసనతో నుండును. దాని వైశాల్యము వాపీతుర్యము (నాల్గు బావులు). అచ్చట నున్న మహాపాపాత్ములు ఆమూల్గునే తినుచు యమభటుల దండనకు గురియౌదురు.
మాంసపు ముద్దలతో నిండియున్నది మాంసకుండము. అది వాపీ ప్రమాణమున నుండును. అచ్చట నున్న పాపులను నా భటులెల్లప్పుడు దండించుచునే యుందురు
మాంసకుండమున నున్న పాపులు డబ్బుకు కక్కుర్తిపడి తమ కన్యలను ముసలివారికిచ్చి పెండ్లి చేసిరి. వారీ నా భటులు కఠినముగా దండించుచుండగా వారు భయపడి రక్షింపమని ఎలుగెత్తి అరచుచుందురు. వారి శరీరమును కీటకములు తినుచుండును. ఇంకను వారికి ఆహారము లేనందువలన దుర్గంధపూరితమైన అచ్చటి మాంసమును తినుచుందురు.
నఖ కేశాది కుండములు నాలుగు నాలుగు బావుల వైశాల్యమున నుండును. అచ్చటి పాపులను నాభటులెల్లప్పుడు దండించుచునే యుందురు.
ప్రతప్త తామ్ర కుండమున బాగుగా కాలిన రాగి బొమ్మలు లక్షల సంఖ్యలోనుండును, ఆ కుండము గవ్యూతి (రెండు కోసులు) విశాలమైనది. అచ్చటనున్న పాపులను నా భటులు దండించుచుండగా వారు బాగుగా కాలిన రాగి బొమ్మలను కౌగిలించుకొని బొబ్బలు పెట్టుచుందురు.
లోహకుండము బాగుగా కాలుచున్న లోహ ప్రతిమలచే నిండి ఉండును. ఆలోహప్రతిమలు మండుచున్న నిప్పుల మధ్యనుండును. యమ భటులు పాపులను ఆ ప్రతిమలను కౌగలించుకొమ్మని ఆధికముగా దండించుచుందురు. అప్పుడాపాపులు చేయుశబ్దము మహాభయంకరమైనది.
నరకమున నొక విశాలమైన బూరుగుచెట్టు కలదు. ఆ చెట్టుకింద తీక్షణకంటక కుండము కలదు. ఆ కుండములోని ముండ్లు చాలా వాడిగలవై ధనస్సంత పొడవుగలవై ఉండును. అచ్చటి పాపులు నా దూతలచే బాధింపబడుచు ఆ బూరుగు చెట్టు పై భాగమునుండి ఈతీక్షణ కంటక కుండమున పడుచుందురు. నా దూతలు వారిని కొట్టుచుండగా వారి తలలు చిట్లిపోవుచుండును. అప్పుడు వారు ఎండిపోవుచున్న గొంతుతో నీరు కావలెననీ ఏడ్చుచుందురు.
విషకుండమున తక్షకుడు మొదలగు మహాసర్పముల విషముండుమ. దాని వైశాల్యము క్రోశ పరిమితము. అచ్చటి పాపులు నా భటులచే దండింపబడుచు అచ్చటి విషమునే ఆహారముగా స్వీకరించుచుందురు.
ప్రతప్త తైలకుండమున కీటకములేని యుండవు. అది రెండు గవ్యూలుల విశాలమైనది. అచ్చటి పాపులు నా భటులచే దండింపబడుచు మరుగుచున్న నునెలో పడి హాహాకారములు చేయుచుందురు.
శస్త్రకుండము చిమ్మచీకటివలన మహాభయంకరమై ఉండును. అచ్చట మిక్కిలి వాడియైన శూలములవంటి అనేక లోహశస్త్రములుండును. ఆ కుండము నాలుగు కోసుల వైశాల్యముతో నుండును. అక్కడనుండు పాపులను నా భటులు కుంతము మొదలగు ఆయుధములతో పొడుచుచు బాధలకు గురిచేయుదురు.
క్రిమి కుండము, భయంకరమైనవి, వికృతమైనవి వాడియైన పండ్లుగలవి, సర్పములవలె ఇటునటు తిరుగునవి యగు కీటకములచే నిండి యుండును. అది కోసు వైశాల్యము గలది. అచ్చటి పాపులను నా భటులు దండించుచుండగా అచ్చటీ. పురుగులు భక్షించుచుండగా వారు దుఃఖమున హాహాకారములు సేయుదురు.
పూయకుండము మిక్కిలి దుర్గంధముతో నుండును. అది క్రోశార్ధ పరిమితము. అచ్చట నున్న పాపులు నా భటులచే దండింపబడుచు ఆ రసినే తినుచుందురు.
సర్పకుండము రెండు గవ్యూతుల వైశాల్యమున నుండును. అచ్చట మిక్కిలి చల్లనైన నీరుండును. అచ్చటనున్న సర్పములు తాటిచెట్టంత పొడవుగా ఉండును. అచ్చట నుండు పాపుల శరీరముల చుట్టు పాములు చుట్టుకొని ఉండును. వారిని నా దూతలు దండించుచుండగా సర్పములు కరచుచుండును. అందువలన వారాబాధలకు తాళలేక హాహాకారములు చేయుదురు.
మశకాది మూడు కుండములు దోమలు మొదలైన వాటితో నిండియుండును. అవి అరకోసు వైశాల్యమున నుండును. అచ్చటనుండు పాపుల కాళ్ళకు చేతులకు దోమలు విపరీతముగా కుట్టుట వలన అవి రక్తమువలె ఎఱ్ఱగా నుండును, వాటివలన నాభటుల దండనమువలన అచ్చటి పాపులు ఎల్లప్పుడు హాహాకారము చేయుచుందురు.
వజ్రవృశ్చిక కుండములు వజ్రములు, తేళ్ళతో ఎల్లప్పుడు నిండియుండును. వాటి వైశాల్యము దిగుడుబావిలో సగముండును. ఆయా కుండములలో ఉండు పాపులను ఎల్లప్పుడు వజ్రములు, వృశ్చికములు కాటువేయుచునే యుండును.
శరాది మూడు కుండములు శరాదుల చేతనే నిండియుండును, వాటి వైశాల్యము వాపిలో సగముండును. అచ్చటనుండు పాపులు బాణములు మొదలగువాని దెబ్బలవలన రక్తమువలే ఎఱ్ఱనైయుందురు.
గోళకుండమున మరిగిపోవుచున్న బురదనీరుండును. అచ్చటి పాపులను అచ్చట నున్న కీటకములు ఎల్లప్పుడు బాధించుచుండును.
నక్రకుండమున అనేక మొసళ్ళుండును. భయంకరము, వికారమైన రూపుగల మొసళ్ళు అచ్చటనుండు పాపులనెల్లప్పుడు బాధించుచుండును.
కాకకుండమున నున్న పాపులను శతకోటి సంఖ్యలో నున్న భయంకరమైన కాకులు పొడుచుచుండును. వారు మలమూత్రములను, శ్లేష్మమును భక్షించుచు బాధలు పడుచుందురు.
సంచాలవాజి కుండములందున్న పాపులు యమభటుల దండనలచే హాహాకారము చేయుచుందురు.
“వజ్రకుండము” న వజ్రములుండును. అది చిమ్మచీకటిగానుండును. దాని వైశాల్యము నూరు ధనువులైయుండును. అట్లే "తప్త పాషాణకుండము మండుచున్న రాళ్ళచే నిర్మింపబడినది. దాని వైశాల్యము రెండు బావులంత యుండును. దానిలో నున్న రాళ్ళు మండుచున్న నిప్పు కణికలవలె నుండును “తీక్షణపాషాణకుండము” కత్తి యంచువలె వాడియైన రాళ్ళచే నిర్మించబడినది. అందలి పాపులు ఆరాళ్ళ దెబ్బలవలన రక్తము వలె ఎఱ్ఱగానుందురు. “లాలాకుండము" దుర్వాసనగల లాలజలముతో సిండియుండును. ఆ కుండము మిక్కిలి లోతు కలదై ఒక కోసు వైశాల్యమున నుండును. “తప్తమషేకుండము” న సలసలమరుగుచున్న నీటిలో కాటుకవలె నల్లనైన ఆకారముగల పాపులు ఇటునటు తిరుగుచుందురు. అది నూరు ధనువుల విశాలమై యుండును. “చూర్ణకుండము” చూర్ణద్రవములచే నిండి యుండును. అచ్చటి పాపులు నా దూతలచే దండింపబడుచు ఆ చూర్ణద్రవమునే తినుచు బాధపడుచుందురు.
చక్రతుండము కుమ్మరివాని సారె (చక్రము) వలె ఎల్లప్పుడు తిరుగుచుండును. ఆ చక్రమున కుండు ఆరెలు చాలా వాడిగానుండును. ఆ చక్రతుండము గుహవలె చాలా లోతుకలదై రెండు గవ్యూతుల వైశాల్యముతో బాగుగా మఱుగుచున్న నీటిలో ఉండును.
కూర్మకుండమున మిక్కిలి భయంకరమైన అనేక కూర్మములుండును. అచ్చటి పాపులనా జలజంతువులు ఎల్లప్పుడు భక్షించుచుండును. అది మిక్కిలి చీకటిమయమై భయంకరమై యుండును.
చాల గొప్పనైన అగ్నిజ్వాలలతో క్రోశ వైశాల్యము కలది, “జ్వాలాకుండము” మిక్కిలి లోతుకలది, మండుచున్న భస్మముతో నిండినది భస్మకుండము. అచ్చటి పాపుల శరీరమంతయు కాలుచున్న భస్మముతో నిండి యుండును. వారు ఆకలికి తాళలేక మండుచున్న భస్మమునే తినుచుందురు.
దగ్గ కుండమున మిక్కిలి మండుచున్న రాళ్లు, కట్టెలతో నిండియుండును. అది క్రోశ వైశాల్యముతో నుండును. చిమ్మచీకటితో చాలా లోతైయుండును. ఆ కుండమున నున్న పాపులు తమ శరీరములు కాలిపోవుచుండగా గొంతు నాలుక ఎండుకొని పోవునట్లు, నాభటులచే దండింపబడుచుందురు.
"తప్తసూర్మికుండము గొప్పనైన అలలతో, మిక్కిలి వేడియైన ఉప్పునీటితోనిండియుండును. అచ్చట చాలా భయంకరమైన జలజంతువులుండును. దాని వైశాల్యము రెండు గవ్యూతులు (నాలుగు కోసులు). అది చాలా లోతై చీమ్మచీకటిగా నుండును. ఆచ్చటి పాపులను జలజంతువులెప్పుడు భక్షించుచుండును. వారు అచ్చటనే తీరుగుచున్నను చీకటివలన ఒకరికొకరు కనపడరు.
అసీపత్రకుండము మిక్కిలి భయంకరమైనది. అది అర్ధక్రోశ పరిమితమై యుండును. అసిపత్రములతో (కత్తులతో) నిండియుండును. దాని ప్రక్కనే ఎత్తైన తాటి చెట్టుకలదు. అచ్చట రక్తకీటకములు ఉండును. అచ్చట నున్న పాపులు ఆతాటి చెట్టుపై నుండి అసిపత్రకుండములో పడుచు రక్తకీటకములు భక్షించుచుండగా శరీరమంతయు రక్తమయము కాగా రక్షించుమని ప్రార్థించుచుందురు.
“క్షురధారకుందము”న కత్తులవంటి అస్త్రములుండును. అది నూరుధనువుల విశాలమైనది. భయంకరమైన ఆకుండమున పాపులయొక్క రక్తము చిందుచుండును. సూచికా ముఖమను కుండమున సూది ముఖముల వంటి అస్త్రములుండును. దాని వైశాల్యము ఏబది ధనువులుండును. భయంకరమైన ఆకుండమందలి పాపులను యమభటులు శిక్షించుచుండగా అది వారి రక్తముతో నిండియుండును.
గోధాముఖకుండము గోధ (ఉడుము) అను జంతువుయొక్క ముఖాకారమున నుండును. అది చాలా భయంకరముగానుండును. అది బావివలె చాలా లోతుగానుండును. ఇరువది ధనువుల విశాలమై యుండును.
గోధాముఖి కుండము మహాపాపులకు సైతం అతి దుఃఖమును కలిగించును. వారచ్చటి కీటకములచే భక్షింపబడుచు అధిక బాధలననుభవింతురు.
“సరముఖకుండము” మానవముఖాకారమున నుండును. అది బావివలె మిక్కిలి లోతుకలదై పాపులచే ఎప్పుడు నిండియుండును. దాని వైశాల్యము పదునారు ధనువులు.
గజదంశకుండము పెద్దపెద్ద ఏనుగుల సమూహముతో కుండాకారమున నుండును. అది నూరు దనుషుల వైశాల్యము కలది. ఆ కుండమున నున్న పాపులను ఏనుగులు తమ దంతములచే పొడుచుచున్నందువలన, అచ్చటి కీటకములు తీనుటవలన వారు హాహాకారములు చేయుచుందురు. వారి రక్తమచ్చట ప్రవహించుచుండును.
ముప్పది ధనుస్సులవైశాల్యముతో గోముఖము యొక్క ఆకారమున ఉండునది గోముకుండము. అది పాపులను చాలా కష్టపెట్టును.
మిక్కిలి భయంకరమైనది, కుండవలెనుండునది, రెండు గవ్యూతుల వైశాల్యము కలది. లక్షమానవులు పట్టునది, అతివిశాలమైనది కుంభీపాక నరకము. నరకములోనుండు సమస్త కుండములలో పాపులెందరుందురో దానికి నాలుగు రెట్లు ఎక్కువగా పావులు కుంభీపాకనరకమున ఉందురు. ఆ కుంభీపాకనరకమున ఒకచోట తప్తతైలకుండము, ఇంకొకచోట తప్తలోహాది కుండము, మరియొక చోట తప్తపాషాణకుండము కలవు. అచ్చట మహాపాపులుందురు. ఆ కుంభీపాక్షనరకమున వెలుతురేమాత్రము లేనందువలన అచటనుండు పావులు ఒకరినొకరు చూచుకొనలేరు. వారినీ నా భటులు దండములతోగానీ, రోకళ్ళతోగాని దండించుచుందురు. అందువలన వారు బాధలో హాహాకారములు చేయుచుందురు.
కుంభీపాకనరకముననుండు పాపులు ఎక్కువపాతకమును చేసికొన్నవారు. ఈనరకము అన్ని విధములైన నరకములకంటె చాలా భయంకరమైనదనీ అందురు.
కాలసూత్రనరకమున పాపులు కాలనిర్మిత సూత్రమువలన బద్దులై నాభటులచే మరుగుచున్న నీటిలో ముంచబడుదురు. పైకి ఎత్తబడుదురు. వారి భోగదేహములకు నాశనము లేదు. అందువలన నా దూతలచే దండముచే రోకళ్ళచే కొట్టబడుచు అతిదుఃఖముననుభవింతురు.
అవటోదమను నరకమున నీరు అవటము వలె (రంధ్రము)వలె గుండ్రముగానుండును. ఆ నీరు మిక్కిలి వేడిగానుండును. ఈనరకము ఇరువది ధనువుల వైశాల్యముతోనుండును. అచ్చట మహాపాపులుందురు. వారు మరుగుచున్న నీటివలన దగ్గగాత్రులై నా భటులచే బాధలు పడుదురు.
“అరుంతుద” కుండములోని నీటిని ముట్టగానే అచ్చటి పాపులకు అకస్మాత్తుగా సర్వవ్యాధులు కలుగును. అచ్చటనున్న పాపులందరు దానివల్ల బాధలకు గురియగుచు హాహాకారములు చేయుచుందురు.
పాంసుభోజమను నరకమున ఎక్కువగా మండుచున్న దుమ్ము కనిపించును. దానివైశాల్యము నూరు ధసుపులు. అచ్చటి పాపులు ఆకలికి తాళలేక ఆ మండుచున్న దుమ్మునే తినుచుందురు.
పాశవేష్టనమను నరకమున పాపులు పడగానే అచ్చటి పాశములచే వారు కట్టివేయబడుదురు. అక్కడికి రాగానే వారికి కంపనము జరుగుచుండును. అట్లే శూలప్రోతమను నరకమున పాపులు పడగానే అచ్చట శూలములకు వారి శరీరములు గుచ్చుకొని పోవును. ఆ నరకము చాలా భయంకరమైనది కావున అచ్చటికి రాగానే పాపులకు వణకుపుట్టును.
“ఉల్కా కుండము”న చల్లని మంచువంటి వీరుండును. అట్లే పిడుగులు కూడా ఉండును, అచ్చటి పాపుల ముఖములపై నా భటులు పిడుగులతో కొట్టుచుందురు. ఉల్కాకుండము క్రోశార్ధపరిమితముగా అందు ఇరువది ధనుస్పుల మేర పిడుగులుండును.
“అంధకూప” నరకము భావివలె గుండ్రముగానుండును. దానిలోతు నూరు ధనుస్సులుండును. అందు నానావిధములైన భయంకరమైన క్రిములుండును. ఆ నరకమంతయు చిమ్మచీకటితో నిండియుండును. అచ్చటనున్న పాపులు చీకటివలన ఒకరినొకరు చూచుకొనలేరు. వారి శరీరములు అచ్చట మండుచున్న నీటిలో బొబ్బలెక్కును. అట్టే ఆ నరకమున మండు క్రిములు వారి శరీరములను విపరీతముగా కుట్టుచుండును. వారు అంధకారమయమైన ఆనరకమున నున్నందువలన గుడ్డివారివలె బాధలు పడుచుందురు.
“వేధన కుండము” అనేక విధములైన శస్త్రములతో నిండియుండును. దానిలోతు ఇరువది ధనుస్సులుండును. అచ్చట నున్న పొపులు ఆ శస్త్రములచే ఎల్లప్పుడు కొట్టబడుచుందురు.
“దండతాడన”మను నరకము పదువారు ధనువుల లోతులో నుండును. అచ్చటి పాపులను నా భటులు దండములచే కొట్టుచుందురు కావున దానికి దండతాడనమను పేరు కలిగినది.
“జాల బద్ధ కుండము” ముప్పది ధనుపుల లోతు కలదై యుండును. అచ్చటి పాపులు వలలో పడ్డ చేపలవలె వలలచే కట్టివేయబడుదురు.
“దేహచూర్ణ”మను నరకమున కోటి మానవుల లోతులో ఇరువై ధనుస్సుల వైశాల్యముతో మిక్కిలి లోతైయుండును. దాని అడుగుభాగము లోహముతో వేదికవలె నిర్మించబడినది. ఆ దేహచూర్ణకుండములో పడు పాపులయొక్క శరీరములు వెంటనే చూర్ణమగును, కావున ఆ నరకమును దేహచూర్ణమని పిలుతురు.
“దళన కుండము” పదునారు ధనవుల వైశాల్యమున నుండును. అచ్చటి పాపులను నా భటులు రోకళ్ళచే ఎల్లప్పుడు కొట్టుచుందరు.
“శోషణకుండము” ముప్పై ధనుస్సుల వైశాల్యముతో నూరుమానపుల లోతుతో ఉండును. అది చాలా లోతై ఉన్నందువలన మీక్కీలీ చీకటిగా ఉండును. ఆ నరకమున బాగుగా మండుచున్న ఇసుక మేటలుండును. అందువలన ఆ నరకమున పడు పాపులు నీరు, ఆహాధములేక మండుచున్న ఇసుకలపై ఉన్నందువలన వారి నోళ్ళు, పెదవులు, నాలుకలు ఎండుకొని పోవును.
“కషకుండము”న అనేక విధములైన తోళ్ళ కషాయోదకముండును. ఆ నీరు మిక్కిలి దుర్వాసనగా నుండును. దాని వైశాల్యము నూరు ధనువులుండును. అచ్చటనుండు పాపులు నీరు, ఆహారములేక దుర్వాసనగల చర్మకషాయమునే తాగుచుందురు.
“శూర్పముఖకుండము” యొక్క ముఖాగ్రభాగము చేటవలె వెడల్పుగా ఉండును. పన్నెండు ధనస్సుల వైశాల్యముతోనుండును. దానిలో బాగుగా మండుచున్న లోహపు వాలుకలుండును. అది ఎల్లప్పుడు పాపులతోనిండియుండును. లోపలనున్న అగ్ని జ్వాలలు పైకి ఎగసిపడుచుండగా ఆ నరకమునకు పోవు పొపుల శరీరములు అగ్ని జ్వాలలచే దగ్ధమగుచుండును. అందువలన అది పాపులకు అమితమైన దుఃఖమును కల్గించుమ. ఆ కుండమును "జ్వాలాముఖకుండ"మని అందురు.
“జీహ్మకుండము”న నుండు ఇటుకలన్నీ బాగుగా కాలుచుండును. ఆ కుండమున పాపులు పడగానే బాధపడి మూర్ఛపోదురు.
“ధూమాంధకుండము”పొగవలన చీకటిగానుండును. అచ్చటనుండు పాపులు పొగవలన ఉక్కిరిబిక్కిరగుచుందురు.
“నాగవేష్టనకుండము”న నూరు ధనుస్సుల వరకు సర్పములుండును. ఆ కుండమున పాపులు పడగానే సర్పములు వారిని చుటుకొనును.
ఓ సావిత్రి నీకు నరకమున నుండు ఎనభైయారు కుండములను వాటి స్వరూప స్వభావములను వివరించి చెప్పితిని. ఇంకను నీవు తెలుసుకొన వలసినదేదైన ఉన్నచో అడుగుమని యమధర్మరాజు సావిత్రితో అనెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన సావిత్ర్యుపాఖ్యానమున యమలోకములోని నరక కుండ లక్షణమను ముప్పై మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 33 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This heartwarming narrative recounts the divine origin and worship of Goddess Shashṭhī, also known as Devasenā, the daughter of Lord Brahmā and consort of Lord Kārttikeya, who serves as the divine guardian of newborn children. The chapter illustrates Her grace through the history of King Priyavrata, whose stillborn child was brought back to life when Goddess Shashṭhī appeared from the sky and touched the infant with Her merciful hands. Out of deep gratitude, the king established Her worship on the sixth day after a child's birth across his kingdom, declaring that She protects infants from illness, negative energies, and childhood mortality.