శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

30 - యదువంశము క్షయమగుట

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుని ఉపదేశము తరువాత గొప్ప భగవద్బక్తుడగు ఉద్దవుడు అడవికి నిషమించెను. ప్రాణులను పాలించే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో అప్పుడేమి చేసెను?

యాదవులలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుని దేహము సకలప్రాణుల కళ్లకు మిక్కిలి ప్రియమైనది. తన వంశము బ్రాహ్మణుల శాఫముచే ఉపద్రవమును పొందగా, ఆయన ఆ దేహమును ఎట్లు విడిచి పెట్టెను?

ఆ శ్రీకృష్ణుని దివ్యరూపముపై లగ్న మైన చూపును యువతులు వెనుకకు మళ్లించలేకపోయిరి. ఆ రూపము చెవుల (శ్రవణము) ద్వారా సజ్జనుల హృదయములో ప్రవేశించి అక్కడ ప్రతిష్ఠితమై అక్కడనుండి తొలగిపోలేదు. ఆ రూపముయొక్క శోభ కవుల వాక్కునకు ఉల్లాసమును కలిగించుచున్నది. వారికి ఆ రూపమును వర్ణించుట ద్వారా లోకములో సమ్మానము కలుగుచున్నదని వేరుగా చెప్పవలయునా? యుద్దమునందు అర్జునుని రథము పైనున్న ఆయన రూపమును చూస్తూ మరణించిన యోధులు ఆయనలో ఐక్యమైనారు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ద్యులోకము (గ్రహణము), అంతరిక్షము (వికృతమైన సంధ్య), భూలోకము (భూకంపము) లలో పెద్ద అపశకునములు బయల్దేరెను. వాటిని చూచిన శ్రీకృష్ణుడు సుధర్మ అనే సభలో కూర్చున్న యాదవులనుద్దేశించి ఇట్లు పలికెను.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ యాదవశ్రేష్ఠులారా! ద్వారకా నగరములో ఈ భయమును గొల్పే పెద్ద అపశకునములు మృత్యుదేవతను సూచించే ధ్వజములు. కావున, మనమిచట గంట సేపు కూడ ఉండరాదు.

స్త్రీలు, పిల్లలు, వృద్దులు కూడ ఇక్కడనుండి శంఖోద్ధారమనే క్షేత్రమునకు వెళ్లవలెను. మనము ప్రభాస క్షేత్రమునకు వెళ్లేదము. అచట సరస్వతి పశ్చిమవాహిని.

ఆ సరస్వతీనదియందు స్నానము చేసి శౌచముతో ఉపవసించి ఏకాగ్రమగు చిత్తముతో దేవతలకు స్నానము, గంధాదులు మొదలైన ఉపచారములతో పూజలను చేసెదము.

మనము స్వస్తివాచనము చేసుకొని గొప్ప పుణ్యాత్ములైన బ్రాహ్మణులకు గోవులు, భూమి, బంగారము, వస్త్రములు, ఏనుగులు, గుర్రములు, రథములు, గృహములను సమర్పించి పూజించెదము.

ఏలయనగా, ఈ విధానము అశుభములను నశింపజేసి మంగళములను కలిగించే ఉత్తమమైన ఉపాయము. దేవతలు, బ్రాహ్మణులు, గోవుల పూజ ప్రాణులకు సర్వోత్తమమైన క్షేమకారణము.

మధు కైటభసంహారియగు శ్రీకృష్ణ భగవానుని ఈ మాటలను యాదవుల పెద్దలందరు శ్రద్దగా వినిరి. వారు సరే అని చెప్పి, నావల పై సముద్రమును దాటి, రథముల పై ప్రభాసక్షేత్రమునకు పయనమైరి.

యాదవులా క్షేత్రమునందు శ్రీకృష్ణ భగవానునిచే ఆదేశించబడిన పూజాదికముతో బాటుగా దానము మొదలైన సకలశ్రేయస్సాధనములను కూడ సర్వాతిశాయియగు భక్తితో చేసిరి. యాదవులకు ఆయనే దేవుడు.

ప్రారబ్దముచే నష్ట మైన వివేకము గల యాదవులు తరువాత ఆ క్షేత్రమునందు మధురమైన మద్యమును త్రావిరి. అది అధికమగు మత్తును కలిగించే పానీయము. దానిలోని రసములు మానవుని బుద్దిని భ్రష్టు పట్టించును.

అధికమగు మత్తును కలిగించే మద్యమును త్రాగి ఆ యాదవవీరులు పూర్తిగా మత్తెక్కియుండిరి. శ్రీకృష్ణుని మాయచే వ్యామోహితులైన వారలు చాల గర్వించియుండిరి. వారిలో వారికి చాల పెద్ద ఘర్షణ ఏర్పడెను.

కోపముచే  కల్లోలితులై ఆయుధములను పట్టిన యాదవులు చెలియలికట్టపై ధనుస్సులు, కత్తులు, బల్లెములు, గదలు, చిల్లకోలలు, ఈటెలతో యుద్ధము చేసిరి.

యాదవులు మిక్కిలి పొగరెక్కీ యుండిరి. వారు పరస్పరము ఎదు రేగి బాణములతో కొట్టుకుంటూ, అడవిలో ఏనుగులు దంతములతో వలె, యుద్దము చేసిరి. ఆ సమయములో వారు ఎక్కిన రథములు, ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, దున్నలు, మానవులు, కంచర గాడిదలు మొదలగు వాహనముల జెండాలు రెపరెపలాడుచుండెను.

మిక్కిలి దారుణులైన ఆ యాదవులలో కోపము గట్టిగా నెలకొనెను. ప్రద్యుమ్నుడు సాంబునితో, అక్రూరుడు భోజునితో, అనిరుద్ధుడు సాత్యకితో, సుభద్రుడు సంగ్రామజిత్తుతో, శ్రీకృష్ణుని సోదరుడైన గదుడు కొడుకైన గదునితో, సుమిత్రుడు (అ)సురథునితో యుద్ధము చేసిరి.

వారందరు మోక్షదాతయగు శ్రీకృష్ణునిచే మిక్కిలి మోహింపజేయబడి, గర్వము (మత్తు) చే గ్రుడ్డివారై యుండిరి. నిశఠుడు, ఉల్ముకుడు, సహస్రజిత్తు, శతజిత్తు, భానుడు మొదలగు ఏ ఇతరయాదవులుండిరో వారు కూడ పరస్పరము ఎదు రేగి యుద్ధము చేసిరి.

దాశార్హవృష్ణ్యంధకభోజసాత్వతా మధ్వర్బుదా మాథురశూర సేనాః ।

 విసర్జనాః కుకురాః కుంతయశ్చ మిథస్తత స్తేఽథ విసృజ్య సౌహృదమ్ ॥

అప్పుడు ఆ దాశార్హ-వృష్ణి-అంధక-భోజ-సాత్వత-మధు-విసర్జన-కుకుర -కుంతీ వంశీయులు, అర్బుద-మథుర-శూర సేన దేశీయులు కూడ ప్రేమను విడిచి పెట్టిరి. తరువాత వారు పరస్పరము యుద్ధము చేసిరి.

వ్యామోహమును పొందిన తండ్రి-కొడుకులు, అన్నదమ్ములు, తాత-మనవలు, మేనమామ-మేనల్లుళ్లు పరస్పరము యుద్దము చేసిరి. పినతండ్రి- పెదతండ్రులతో కొడుకులు యుద్ధము చేసిరి. సమానవయస్కులైన మిత్రులు, వయస్సు తేడా ఉన్న హితైషులు కూడ పరస్పరము యుద్ధము చేసిరి. జ్ఞాతులే జ్ఞాతులను సంహరించిరి.

బాణములు, ఆయుధములు క్షీణించినవి. ధనుస్సులు విరిగిపోయినవి. అప్పుడు వారు ముళ్లు ఉండే తుంగగడ్డిలను గుప్పిళ్లలోనికి తీసుకొనిరి.

గుప్పిడిచే పట్టుకొనబడిన ఆ ముళ్ల గడ్డిలు నిశ్చయముగా వజ్రముతో సమానమైన గుదియలైనవి. వారు పరస్పరము ద్వేషించుకుంటూ వాటితో కొట్టుకొనిరి. శ్రీకృష్ణుడు వారించుచుండగా, వారాయనను కూడ కొట్టిరి.

ఓ పరీక్షిన్మహారాజా! మోహమును పొంది యుద్దము కొరకు శస్త్రములను ధరించి వచ్చిన ఆ యాదవులు బలరాముని కూడ శత్రువుగనే భావించి చంపుటకే నిశ్చయించుకొనిరి.

కురువంశమునానందింపజేసే ఓ పరీక్షిన్మహారాజా! తరువాత ఆ శ్రీకృష్ణార్జునులకు చాల కోపము వచ్చెను. వారు కూడ గుప్పిడిలోని ముళ్ల గడ్డియే గుదియ కాగా, యుద్ధములో సంచరిస్తూ కొట్టిరి.

వెదురు పొదలో రాపిడిచే పుట్టే నిప్పు అడవిని తగులబెట్టును. అదే విధముగా, బ్రాహ్మణుల శాపముచే పట్టుకొనబడి, శ్రీకృష్ణుని మాయచే మోహితమైన బుద్ధి గల ఆ యాదవులయొక్క పరస్పరద్వేషము వలన కలిగిన కోపమే యాదవవంశము యొక్క వినాశమునకు హేతువు ఆయెను.

ఈ విధముగా తమ సకల (తొమ్మిది) వంశములు నశించగా, శ్రీకృష్ణ భగవానుడు మిగిలి ఉన్న భూభారము కూడ తొలగించబడినదని తలచెను.

బలరాముడు సముద్రముయొక్క చెలియలికట్టవద్ద పరమపురుషుని ధ్యానించుట అనే యోగముననుష్ఠించెను. ఆయన మనస్సును పరమాత్మ లో విలీనము చేసి మనుష్యరూపమును, భూలోకమును విడిచి పెట్టెను.

దేవకి పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు బలరాముని నిర్యాణమును కను “నేను. ఆయన రావి చెట్టుకు ఆనుకొని నేల పై మౌనముగా కూర్చుండెను.

ఆయన తనదైన కాంతితో ప్రకాశిస్తున్న చతుర్బుజరూపమును దాల్చి, పొగ లేని అగ్ని వలె, దిక్కుల చీకట్లను పోగొట్టుచుండెను.

శ్రీవత్సమనే పుట్టు మచ్చ కలిగిన ఆ రూపము మిక్కిలి మంగళకరమైనది. మేఘము వలె నల్లనైన రూపము పుటము పెట్టిన బంగరు ఆభరణముల వర్చస్సును కలిగియుండెను. ఆయన పట్టు వస్త్రముల జంటను దేహము నిండా ధరించెను.

అందమైన చిరునగవు గల ఆయనయొక్క , పద్మమువంటీ ముఖమునకు నల్లని ముంగురులే అలంకారమాయెను. పద్మములు వలే మనోహరమైన కన్నులు, ప్రకాశించే మకరాకారపు కుండలములు గల రూపమును ఆయన దాల్చెను.

మొలత్రాడు, యజ్ఞోపవీతము, కిరీటము, హస్తాభరణములు, భుజపురులు, హారములు, కాలియందేలు, ఉంగరములు, కౌస్తుభమాణిక్యములతో ఆ రూపము ప్రకాశించెను.

ఆ రూపము పూర్తిగా వనమాలచే చుట్టువారబడియుండెను. ఆయన ఆయుధములు మూర్తి దాల్చి సేవించుచుండెను. ఆయన కుడి తొడపై పద్మము వలె ఎర్రనైన ఎడమ కాలిని పెట్టి కూర్చుండెను.

జరుడనే కిరాతుడు ముసలముయొక్క మిగిలిన ఇనుప ముక్కతో బాణమును చేసెను. ఆ శ్రీకృష్ణుని పాదము వానికి లేడి ముఖము వలె కనబడెను. లేడియేననే ఆశంకతో వాడు ఆ పాదమును కొట్టెను.

పాపము చేసిన ఆ కిరాతుడు నాలుగు భుజముల ఆ పురుషుని చూచి భయపడెను. ఆతడు రాక్షససంహారియగు ఆ శ్రీకృష్ణుని కాళ్ల పై పడెను.

మహాత్మా! మధు కైటభులను సంహరించిన నీ కీర్తి గొప్పది. నీలో పాపము లేదు. పాపినైన నేను చేసిన ఈ పనిని నీవు క్షమించ దగుదువు.

ఓ విష్ణుప్రభూ! నిన్ను నిరంతరముగా స్మరించే మానవులకు అజ్ఞానమనే చీకటి నశించునని మహాత్ములు చెప్పెదరు. అట్టి నీ యెడల నేను పాపము చేసితిని.

ఓ శ్రీహరీ! నేను లేళ్లను చంపే కిరాతుడను, పాపిని. నన్ను శీఘ్రముగా సంహరించుము. అట్లు చేయుట వలన నేను మరల ఈ విధముగా మహాత్ముల యెడల అపరాధము చేయకుందును.

నీకు అధీనమై ఉండే మాయాశక్తియొక్క విలాసను బ్రహ్మదేవుడు, ఆయన పుత్రులైన రుద్రుడు-ప్రజాపతులు మొదలగువారు కూడ, మంత్రద్రష్టలైన మహర్షులు కూడ తెలియకున్నారు. ఏలయన, వారి జ్ఞానము నీ మాయ చే కప్పివేయబడినది. అట్టి నీయొక్క ఈ స్థితి (నాచే కొట్టబడుట) ని పాపజన్మగల మేము సాక్షాత్తుగా ఏమని వర్ణించగలము?

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ జరుడా! భయపడకుము. లేచి నిలబడుము. ఏలయనగా, ఈ సంకల్పము (నీచే కొట్టబడుట) ను నేనే  చేసినాను. నా అనుమతిచే నీవు పుణ్యము చేసినవారలు పొందే స్వర్గమునకు వెళ్లుము.

లీలచే దేహమును దాల్చిన శ్రీకృష్ణభగవానుడు ఈ విధముగా ఆదేశించగా, ఆ జరుడు ఆయనకు మూడు ప్రదక్షిణములు చేసి నమస్కరించి, విమానము పై స్వర్గమునకు వెళ్లాను.

దారుకుడు శ్రీకృష్ణుడు ఉన్న చోటు వెదుకుచుండెను. శ్రీకృష్ణుడు ధరించిన మాలలోని తులసియొక్క పరిమళముతో గూడిన గాలిని ఆతడు ఆఘ్రాణించి, దానిచే ఆయన ఉన్న చోటును ఊహించి అటువైపు వెళ్లాను.

అచట శ్రీకృష్ణుడు అతిశయించిన కాంతి గల ఆయుధములు చుట్టువారి యుండగా రావి చెట్టు మొదట నివాసము చేసేను. ఆ ప్రభుని చూచి దారుకుని హృదయము ప్రేమచే ఆర్ద్రమై కన్నులు నీటితో నిండెను. ఆతడు రథమునుండి క్రిందకు దూకి ఆయన కాళ్లపై కూలబడెను.

ఓ ప్రభూ! రాత్రి చంద్రుడు అస్తమించినప్పుడు వలె, నీ పద్మమువంటి పాదమును కానరాని నాకు చూపు వినష్టమైనది. చీకట్లు క్రమ్ముకున్నవి. దిక్కులు తెలియుట లేదు. శాంతి కూడ లభించుట లేదు (అని పలికెను).

ఓ పరీక్షిన్మహారాజా! రథసారథియైతే ఇట్లు పలికి పైకి చూచుచుండగనే, ఆ రథము గుర్రములతో సహా ఆకాశములో పైకి యెగిరెను. దాని జెండా పై గరుడుని చిహ్నము గలదు.

విష్ణువుయొక్క దివ్యములైన ఆయుధములు కూడ ఆ రథము వెంట వెళ్లాను. అదంతా చూచి హృదయములో ఆశ్చర్యముతో నిండిన రథసారథితో దుష్టజనశిక్షకుడగు శ్రీహరి ఇట్లు పలి కెను.

ఓ సూతా! ద్వారకానగరమునకు వెళ్లుము. యాదవులు పరస్పరము సంహరించుకొనుట, బలరాముని దేహత్యాగము, నా యీ స్థితి (దేహత్యాగము) అనువాటిని గురించి బంధువులకు చెప్పుము.

మీరు మీ మీ బంధువులతో ద్వారకలో ఉండవద్దు. నేను వదిలి పెట్టిన యాదవుల నగరమును సముద్రము ముంచివేయును.

అందరు తమ తమ సంపదను, బంధువులను తీసుకొని ఇంద్రప్రస్థమునకు వెళ్లగలరు. మా తల్లిదండ్రులను కూడ దోడ్కొని పొండు. అర్జునుడు అందరినీ రక్షించగలడు.

నీవు నా ధర్మము (భక్తి) ను అనుష్ఠిస్తూ ఉదాసీనుడవై ఆత్మనిష్ఠను కలిగియుండుము. ఇదంతా నా మాయాశక్తి యొక్క విలాసయేనని తెలుసుకొని శాంతిని పొందుము.

శ్రీకృష్ణుడిట్లు పలుకగా ఆ దారుకుడు ఆయనకు ప్రదక్షిణము చేసి మరల మరల నమస్కరించేను. ఆతడు ఆయన పాదములకు తలను ఆనించి మొక్కెను. చెడిపోయిన మనస్సుతో ఆతడు ద్వారకానగరమునకు పయనమయ్యెను.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో యదువంశక్షయమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).