శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
21 - గుణదోషముల వ్యవస్థ - వేద తాత్పర్యము
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- కర్మభక్తిజ్ఞానములు నన్ను పొందే మార్గములు. ఎవరైతే ఈ యోగములను విడిచి పెట్టి, అస్థిరములైన ఇంద్రియములతో అల్పములైన విషయభోగములను సేవించెదరో, వారు సంసారములో పరిభ్రమించెదరు.
ఎవరికి దేనియందు అధికారము గలదో దానియందు నిష్ణను కలిగియుండుట గుణము. స్వధర్మము కానిదానియందు నిష్ట దోషము. ఇదియే గుణదోషములు రెండింటియొక్క నిర్ణయము.
బ్రహ్మదేవుని మొదలుకొని చెట్టు చేమలు వరకు గల ప్రాణుల దేహములు పృథివీ-జలములు-అగ్ని-వాయువు-ఆకాశము అనే ఐదు భూతములచే నిర్మితములై జీవశక్తితో నిండియున్నవి.
ఓ ఉద్దవా! ధాతువులనుండి పుట్టే దేహములన్నీ సమానమే. అయినా, వేదము ఈ జీవులకు ధర్మాదిపురుషార్థములు సిద్ధించుటకై, వర్ణాశ్రమాది భిన్నభిన్నములైన నామరూపములను కల్పించుచున్నది.
ఉత్తముడవగు ఓ ఉద్దవా! దేశము, కాలము, అధికారము మొదలైన తత్త్వములకు, పదార్థములకు, కర్మలకు వేదరూపుడనగు నేను గుణదోషములను విధించితిని. దీని ప్రయోజనమేమనగా, మానవుని ప్రవృత్తిని సంకోచము చేయుట కొరకు మాత్రమే. ఇది నిశ్చయము. సంస్కారముచే, అథ - మరియు, కాలేన - కాలముచే, అథవా . లేదా, మహత్త్వ-అల్పతయా - పెద్దది లేక చిన్నది అగుటచే.
వస్తాదిద్రవ్యమునకు నీరు మొదలైన ద్రవ్యముచే శుద్ది. సందేహము వచ్చినప్పుడు ఇది శుద్ధము అనే సజ్జనుని మాటయే శుద్ధి. నీటిని చల్లుట ఇత్యాది సంస్కారముచే ఆహారాదిద్రవ్యము శుద్ధమగును. అప్పుడే వండిన ఆహారము శుద్ధము. నిలవ ఉన్న ఆహారము అశుద్ధము. ఇది కాలశుద్ధి. పెద్ద చెరువులోని నీరు శుద్ధము. చిన్న గుంటలోని నీరు అశుచి.
శక్తి ఉన్నప్పుడు స్నానముచే దేహమునకు శుద్ధి. శక్తి లేకపోతే స్నానము లేకున్నా భస్మాదిచే శుద్ధి. ఆశౌచము గురించి తెలిస్తే అశుద్ధి. తెలియకపోతే శుద్దియే. సంపద ఉన్నప్పుడు ఉచ్చిష్టాన్నము అశుద్ధి. ఏదీ లేని దరిద్రునకు ఏ అన్నం దొరికితే అదే శుద్ధి. ఈ దేశకాలాదులు వ్యక్తికి ఆయా దేశకాలములను బట్టి శుద్ధి-అశుద్ధులను చేస్తాయే గాని, సర్వత్రా కాదు. కాబట్టి, శుద్ధి-అశుద్ధులను యథాసంభవముగా చూసుకొనవలెను.
కర్తకు శుద్ధికరములు. ఉపనయనసంస్కారము గలవాడు ఈ విధమైన శౌచమును పొందియే వేదవిహితములైన కర్మలనాచరించవలెను.
సాంగోపాంగవినియోగములు తెలియుటయే మంత్రమునకు శుద్ధి. నాకు సమర్పించుటయే కర్మకు శుద్ధి. దేశము, కాలము, ద్రవ్యము, కర్త, మంత్రము, కర్మ అనే ఆరింటి శుద్ధిచే ధర్మము సంపన్నమగును. వాటి శుద్ధి లేనప్పుడు కలిగేది అధర్మము మాత్రమే.
విధినిబట్టి గుణమే ఒకప్పుడు దోషముగను, దోషము గుణముగను అగుచుండును. (ఉదాహరణకు, పరధర్మము పరునకు గుణమే అయినా తనకు దోషము). గుణదోషములనీ విధముగా నియమించుటను బట్టి, గుణదోషముల భేదము పరమార్థము కాదని బాధించినట్లే అగుచున్నది.
కలహము వలన తీవ్రమైన క్రోధము కలుగును. సమ్మోహము క్రోధమును వెన్నంటి యుండును. సకలములైన కార్యాకార్యములను స్మరిస్తూ ఉండే మానవుని చిత్తము సమ్మోహము వలన వెంటనే లుప్తమగును.
సత్పురుషుడవగు ఓ ఉద్ధవా! కార్యాకార్యస్మృతి లోపించుటచే జీవుడు లేనివానితో సమానము. స్మృతిని కోల్పోయి శూన్యప్రాయుడైన ఈతడు మృతునితో సమానము. వానికి పురుషార్థము వినష్టమగును.
భక్తులకు ఒకప్పుడు పరమపురుషార్థమగు మోక్షము గురించి తెలియదు. వారు దుఃఖభూయిష్ఠమగు - సంసారమార్గమునందు పరిభ్రమిస్తూ పశ్వాదిజన్మను పొందుచుందురు. వారిని సర్వము దెలిసిన వేదము మరల అదే మార్గములో ఎట్లు నియోగించును?(నియోగించదు. కాబట్టి, కామ్యకర్మలయందు వేదమునకు తాత్పర్యము లేదు).
పువ్వుని చూచి పండని భ్రాంతమైన బుద్ధి గల కొందరికి ఈ విధమైన (ఫలశ్రుతికి ముఖ్యార్థము నందు తాత్పర్యము లేదు) వేదతాత్పర్యము తెలియదు. వారు పువ్వులతో నిండిన మొక్కవలె రమణీయమైన ఫలశ్రుతి పరమార్థమని చెప్పెదరు. వేదతాత్పర్యము తెలిసినవారు అట్లు చెప్పరు. ఇది నిశ్చయము.
హింసాఫలమైన మాంసభక్షణమునందు ఆసక్తి ఉన్నచో యజ్ఞమునందు మాత్రమే అట్లు చేయుడు అని సా (వేదములోని యజ్ఞమును విధించే వాక్యము) అభిప్రాయము. సాక్షాత్తుగా పశుహింసారూపమైన యజ్ఞమును చేసి భోగములననుభవించుడని వేదవిధి కాదు. పరోక్ష మైన ఈ నా అభిప్రాయమును ఆ కర్మఠులు యెరుగరు. వారి చిత్తము భోగములపై మాత్రమే ఉన్నది.
ఎందుకంటే, తమ సుఖమునందలి కోరికతో దుష్టులైన ఆ కర్మఠులు పశువులను హింసించి క్రీడించేదరు. వారు పశుహింస గల యజ్ఞములను చేసి దేవతలను, పితృదేవతలను, భూతనాయకులను ఆరాధించెదరు.
వర్తకుడు లభించబోయే అధికధనముపై ఆశతో ఇప్పుడు ఉన్న ధనమును విడిచి పెట్టును. అదే విధముగా, కర్మఠులు హృదయములో
దేహాభిమానులైన కర్మఠుల మనస్సు ఈ విధముగా పువ్వు వలె ఆకర్షకమైన అర్థవాదహక్కులచే ఆకర్షించబడును. వారు చాల గర్వించి యుందురు. వారికి నా వార్త కూడ రుచించదు.
వేదములోని కర్మకాండకు, దేవతా (ఉపాసన) కాండకు, బ్రహ్మ (జ్ఞాన) కాండకు పరమతాత్పర్యము బ్రహ్మకు, ఆత్మకు గల అభేదమే. మంత్రద్రష్టలగు మహర్షులు విషయమును దాచి పెట్టి (సంకేతముగా) చెప్పెదరు. అట్లు చెప్పుట నాకు కూడ ప్రీతికరము.
వేదము శబ్దరూపమైన బ్రహ్మయే. ఆ శబ్దము నాభిలో ప్రాణశక్తిగా ఆవిర్బవించి, హృదయములో సంకల్పరూపమును, కంఠములో బాహ్యవాక్కు రూపమును పొందును. అంతము గాని, సీమ గాని లేని ఈ వేదవాక్కు సముద్రమువలె గంభీరమైనది, లోన ప్రవేశించ శక్యము కానిది.
నేను అపరిచ్చిన్నుడను, పరబ్రహ్మను, అనంతమగు శక్తి గలవాడను. అట్టి నాచే వర్ధిల్లజేయబడిన వాక్కు, తామరతూడుల లోపల సన్నని దారము వలె, ప్రాణులలో నాదము రూపముగా కానవచ్చుచున్నది.
సాలె పురుగు తన హృదయమునుండి నోటిగుండా దారమును వెలువరించును. అదే విధముగా అమృతస్వరూపుడు, వేదరూపుడు అగు హిరణ్యగర్భుడు మనస్సుతో అచ్చులు మొదలైన వర్ణములను సంకల్పించి, హృదయాకాశమునుండి వైఖరీ (మనము పలికే) వాక్కును అభివ్యక్తము చేయును. అనంతములగు మార్గములు గల ఈ వైఖరీవాక్కు సూక్ష్మమగు ఓంకారమునుండి ప్రకటమైనది. అచ్చులు, వర్గాక్షరములు, ఊష్మలు (శ ష స హ), అంతఃస్థలు (య ర ల వ) లతో అలంకృతమైన ఈ వాక్కు రకరకముల భాషల రూపముగా విస్తరించి యున్నది.(గాయత్రి కంటే) నాలుగేసి అక్షరములు చొప్పున అధికముగా ఉండే ఛందస్సులతో విరాజిల్లే ఈ వాక్కునకు అంతమయ్యే సీమ లేదు. సర్వసమర్థుడగు హిరణ్యగర్భుడీ వాక్కును సృష్టించి తానే (తనలో) ఉపసంహరించును.
గాయత్రి, ఉష్టిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతిచ్ఛందము, అత్యష్టి, అతిజగతి, అతివిరాట్ అనేవి (నాలు గేసి అక్షరములు చొప్పున పెరిగే) ఛందస్సులు.
ఈ వేదవాక్కు కర్మకాండలో దేనిని విధించుచున్నది? దేవతాకొండలో ఏ మంత్రమును ప్రకాశింపజేయుచున్నది? జ్ఞానకాండలో ఒక విషయమును నిషేధించుటకై అనువదించి (మరల చెప్పి) ఇతర పక్షములతో కలిపి దేనిని వికల్పము (ఇది, లేక ఆది) గా చెప్పుచున్నది? అనే ఈ విధమైన వేదవాక్కుయొక్క హృదయము (తాత్పర్యము) ను ఈ లోకములో నాకంటే ఇతరుడు ఎవడైననూ తెలియజాలడు.
వేదము కర్మకాండలో విధించే యజ్ఞము నేనే. వేదము దేవతాకాండలో ఉపదేశించే దేవతారూపములన్నీ నేనే. వేదము నన్ను పలు రూపములు (ఆకాశాది పంచభూతములు) గా వికల్పించి, వాటినన్నింటినీ నిషేధించి ప్రతిపాదించే శేషతత్త్వము నేనే. సకలవేదముల తాత్పర్యము ఇంత మాత్రమే. వేదము నన్ను అధిష్టానముగా చేసుకొని, భేదనిష్టమగు జగత్తును అనువదించి, అంతమునందు ఆ సర్వము మాయ (మిథ్య) మాత్రమేనని నిషేధించి, విరమించును.
ఏకాదశ స్కంధములో గుణదోషముల వ్యవస్థను, వేదతాత్పర్యమును నిరూపించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).
