శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

7 - దత్తాత్రేయ గీత - ఎనమండుగురు గురువుల వర్ణన

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- గొప్ప భాగ్యవంతుడవగు ఓ ఉద్దవా! నీవు నాతో చెప్పిన విషయమునే నేను కూడ చేయగోరినాను. నేను స్వర్గలోకసత్యలోకములగుండా వైకుంఠమును చేరవలెనని బ్రహ్మదేవుడు, శివుడు, లోకపాలకులు కోరుచున్నారు.

ఏలయనగా, నేనీ భూలోకములో దేవకార్యమును నిశ్శేషముగా సంపన్నము చేసితిని. బ్రహ్మదేవుడు కోరగా నేను అంశయగు బలరామునితో గూడి దాని కొరకే అవతరించితిని.

యాదవవంశము మహర్షుల శాపము వలన ఇప్పటికే సుతరాము దహించబడినది. పరస్పరము కలహము వలన ఈ కులము నిశ్చయముగా నశించును. ఇప్పటినుండి ఏడవ రోజున సముద్రము కూడ ద్వారకానగరమును ముంచెత్తును.

సాధుపురుషుడవగు ఓ ఉద్దవా! అదే సమయములో నేను కూడ ఈ లోకమును విడిచి పెట్టగలను. తొందరలోనే కలి ఈ లోకమును పూర్తిగా ఆక్రమించి, కల్యాణములను నశింపజేయును.

కల్యాణగుణములు గల ఓ ఉద్దవా! నీవు ఇక్కడ నివసించనే వద్దు. నేను విడిచి పెట్టిన తరువాత కలియుగము వచ్చును. అప్పుడు జనులకు అధర్మమునందు ప్రీతి ఉండును.

నీవైతే కుటుంబసభ్యులయందు, బంధువులయందు ఆసక్తిని పూర్తిగా విడిచి పెట్టుము. మనస్సును నాయందే గట్టిగా నిలిపి, సమదృష్టి (సర్వమునందు ఈశ్వరుని దర్శించుట)తో భూలోకములో సంచరించుము.

మనము కళ్లు, చెవులు, ముక్కు మొదలగు ఇంద్రియములతో ఈ జగత్తును తెలుసుకుని, మనస్సుతో దాని గురించి ఊహాపోహలను చేస్తూ, వాక్కుతో వర్ణిస్తూ ఉంటాము. ఈ జగత్తు నశించేది, కేవలము మనస్సు యొక్క స్పందన మాత్రమే. ఇది కల్పితమని తెలియుము.

తత్త్వవిచారము, మనస్సమాధానము లేని వ్యక్తికి జగత్తులోని అనేకత్వము, దేవతలలోని అనేకత్వము సత్యమనే భ్రాంతి కలుగును. దానిని బట్టి పుణ్యపాపములు, సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములయందాతడు తగుల్కొనును. విహితకర్మ, దానిని చేయకుండుట, నిషిద్ధకర్మ అనే కర్మవికల్పములో ఆతడు తగుల్కొనును.

కాబట్టి (విక్షిప్త మైన మనస్సు గలవానికి భ్రాంతి కలుగును గనుక), ఇంద్రియముల సముదాయమును, మనస్సును వశము చేసుకొనుము. ఈ జగత్తు ఆత్మ చైతన్యమనే అధిష్ఠానమునందు ఉనికి కలిగియున్నదనియు, ఆత్మ పరమేశ్వరుడనగు నాకంటే అభిన్నమనియు దర్శించుము.

ఆత్మస్వరూపమును బుద్దితో తెలియుటయే గాక అనుభవమునకు రావలెను. అట్టి జ్ఞాని సర్వులలో తానే ఆత్మరూపముగా నుండును. అట్టి స్థితిలో నీ అంతఃకరణము సంతోషముతో నిండియుండును. నిన్ను విఘ్నము లేవియు పీడించవు.

జ్ఞాని పిల్లవాడు వలె గుణదోషవిభాగమునకు అతీతమైన సమబుద్ధిని కలిగియుండును. తప్పు అనే బుద్ధితో నిషిద్ధకర్మనుండి నివృత్తి, మంచి దనే బుద్దితో విహితకర్మాచరణము జ్ఞానికి ఉండవు. కాని, జ్ఞాని సహజము గనే నిషిద్ధకర్మనుండి నివృత్తుడై, విహితకర్మయందు ప్రవర్తించును.

జ్ఞాని సకలప్రాణులకు హితైషియై శాంతస్వభావుడై యుండును. జ్ఞానికి పరోక్ష-అపరోక్ష జ్ఞానములచే ఆత్మస్వరూపనిశ్చయముగా ఉండును. జగత్తును ఈశ్వర (ఆత్మ) రూపముగా దర్శించే ఆయనకు మరల సంసారమనే ఆపద కలుగదు. ఇది నిశ్చయము.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు గొప్ప భగవద్భక్తుడగు ఉద్దవునీ విధముగా ఆదేశించెను. అపుడు ఉద్ధవుడు ఆత్మతత్త్వమును తెలియగోరి శ్రీకృష్ణ భగవానునకు ప్రణమిల్లి ఇట్లు పలి కెను.

ఉద్దవుడు పలికెను -- దేవా! యోగమునకు నిధానమైన నీవు యోగము నుపదేశించెదవు. యోగఫలమునిచ్చే యోగస్వరూపుడవు నీవే. నీవు నాకు మోక్షమునిచ్చే సన్న్యాసరూపమైన త్యాగమును ఉపదేశించితివి.

సర్వము రూపములోనున్న ఓ అనంతుడా! కామనాత్యాగమును నీవు ఉపదేశించితివి. విషయభోగములయందాసక్త మైన చిత్తము గలవారలీ త్యాగమును చేయుట చాల కష్టము. నీయందు భక్తి లేనివారికీ ఈ త్యాగము సుతరాము సంభవమే కాదని నా అభిప్రాయము.

ఓ భగవానుడా! ఈ దేహము నీ మాయచే నిర్మితమైనది. దీనిని బట్టి భార్య, పుత్రుడు మొదలగు బంధములేర్పడినవి. దీనియందు ఇది నాది, ఇది నేను అనే వ్యామోహము, గాఢమైన ఆసక్తి నా బుద్దియందు ఉన్నవి. నీవు త్యాగమునుపదేశించితివి. కాని, ఆ త్యాగమును నేను తేలికగా నెరవేర్చే ప్రకారమును కూడ నీవు భక్తుడనగు నాకు నేర్పుము.

ఈశ్వరా! స్వయంప్రకాశ పరమాత్మయే పరమార్థము. ఆ తత్త్వమును నాకు బోధించే వక్త నీవు తప్ప మరియొకరు దేవతలలో కూడ నాకు కాన రారు. బ్రహ్మదేవుడు మొదలుగా గల ఈ దేహధారులందరు మోహితమైన బుద్ధి గలవారై, బాహ్యవిషయములే పరమార్థమని భ్రమించుచున్నారు.

ఓ భగవానుడా! ఆత్మతత్త్వమును బోధించువారు నీవు తప్ప మరియొకరు లేరు గనుక, విరక్తి జెందిన బుద్ధి గల నేను జీవులకు హితమును చేసే నారాయణుడవైన నిన్ను శరణు వేడుచున్నాను. నేను దుఃఖముల తాపముచే వేగుచున్నాను. సర్వజ్ఞుడవగు నీయందు రాగాది దోషములు గాని, దేశకాలపరిచ్చేదములు గాని లేవు. జగన్నాథుడవగు నీ వైకుంఠధామమును కాలము ఏమీ చేయలేదు.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- లోకములో కొద్ది మంది మానవులు జగత్తు యొక్క అధిష్టానమైన ఆత్మతత్త్వమునరసీ ఇంచుమించుగా తమను తామే అమంగళములైన విషయవాసనలనుండి ఉద్ధరించుకొనెదరు.

ప్రాణులు, విశేషించి మానవుడు, తనకు తానే గురువు. ఎందుకంటే, ఈ మానవుడు ప్రత్యక్షానుభవమునకు అనుమానము (బుద్దితో ఊహ చేయుట) ను జోడించి తన కేది హీతమో దానిని పొందును.

మానవదేహమునందు ఆత్మరూపుడైన ఈశ్వరుడు సకల (జ్ఞానక్రియా) శక్తులతో పూర్ణుడై ఉన్నాడు. జ్ఞానయోగకర్మయోగములయందు నిపుణులైన వివేకవంతులు ఈ దేహమునందు ఆత్మతత్త్వమును పూర్ణముగా సాక్షాత్కరించుకొనెదరు.

సృష్టిలో ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదములు గలవి, అనేక పాదములు గలవి, పాదములే లేనివి అనేకములగు ప్రాణులు గలవు. వాటి లో నాకు మానవరూపము ప్రీతిపాత్రము (ఆత్మజ్ఞానాధికారము కలది).

అంతర్యామినగు నేను ఇంద్రియములకు గోచరుడను కాను. అయినా, ఈ మానవజన్మయందు ఏకాగ్రచిత్తము గలవారు నన్ను -- తెలియబడుతూ ఉండే బుద్ధి మొదలగు గుణకార్యములే లక్షకములు కాగా, అనుమాన ప్రమాణమును కూడ ఉపయోగించి -- ఆత్మరూపముగా సాక్షాత్కరించుకొనుచున్నారు. (స్వయంప్రకాశము కాని బుద్ద్యాదులను ప్రకాశింపజేసే చైతన్యమునకు బుద్ద్యాదులు సూచకములు. దేహాదులు దృశ్యములు గనుక అనాత్మలు అని అనుమానము).

పూర్వము గొప్ప తేజశ్శాలియగు దత్తాత్రేయ మహర్షితో యదు మహారాజునకు సంవాదము జరిగెను. దీనిని కూడ ఈ సందర్భము (ఈశ్వరుని ఆత్మరూపముగా తెలియుట) లో పెద్దలు ఉదాహరించెదరు.

దత్తాత్రేయ మహర్షి యువకుడే అయినా, తిరస్కారమునకు గురి అయ్యే వేషమును దాల్చే జ్ఞాని. ఆత్మధర్మములు తెలిసిన యదుమహారాజు ఆయనను ఇట్లు ప్రశ్నించెను.

యదు మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహాత్మా! కర్మలను చేయకున్నా, మీకు మిక్కిలి నిపుణమైన ఆత్మానాత్మవివేకజ్ఞానము గలదు. తమకీ జ్ఞానము ఎక్కడిది? ఈ జ్ఞానమును పొంది తమరు లోకములో పిల్లవాడు వలె సంచరించుచున్నారు.

మానవులు తరుచుగా ఆయుర్దాయము, కీర్తిప్రతిష్టలు, సంపద, సౌభాగ్యములను కోరియే ధర్మార్థకామములయందు, బ్రహ్మజిజ్ఞాస (ఆత్మవిచారము) నందు కూడ ప్రవర్తిల్లెదరు.

తమ రైతే సమర్థులు, జ్ఞాని, నిపుణులు, సుందరులు. తమరు మధుర ముగా మాటలాడెదరు. జడుడు వలె, పిచ్చివాడు వలే, దెయ్యము పట్టినవాడు వలె ఉండే తమరు దేనినైననూ కోరరు, ఏ పనినీ చేయరు.

జనులను కోరికలు, లోభము అనే కార్చిచ్చు దహించుచున్నది. కాని, ఆ చిచ్చునుండి విముక్తడవైన నీవు, గంగనీటిలో ఉన్న ఏనుగు వలె, తాపమును పొందుటలేదు.

మహాత్మా! నీవు ఇంద్రియభోగములతో సంస్పర్శ లేని అసంగుడవు, ఒంటరివి. అయినా, నీ హృదయములో నిశ్చయముగా ఆనందము గలదు. దీనికి గల కారణమును మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి చెప్పడు.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బ్రాహ్మణభక్తుడు, పవిత్రహృదయుడు అగు యదు మహారాజు గొప్ప భాగ్యము (వైరాగ్యము) గల దత్తాత్రేయ మహర్షిని సత్కరించి ఇట్లు ప్రశ్నించెను. వినయముతో నమ్రుడై యున్న యదువును ఉద్దేశించి, ఆయన యిట్లు పలికెను.

దత్తాత్రేయ మహర్షి ఇట్లు పలి కెను --- రాజా! నేను నా బుద్ధితో ఆశ్రయించిన గురువులు చాలమంది గలరు. నేను వారినుండి జ్ఞానమును సంపాదించి విముక్తుడనై సంచరించుచున్నాను. వారిని గురించి వినుము.

భూమి, వాయువు, ఆకాశము, నీళ్లు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండ చిలువ, సముద్రము, పక్షి, తేనెటీగ, ఏనుగు.

తేనెను పట్టే వనవాసి, లేడి, చేప, పింగల, లకుముకి పిట్ట, పిల్లవాడు, కన్య, బాణములను చేయువాడు, పాము, సాలీడు, తుమ్మెద.

ఓ రాజా! నేను బుద్దితో ఆశ్రయించిన ఇరవై నలుగురు గురువులు వీరే. ఈ లోకములో వీరి ప్రవృత్తులనుండి నేను నాకు నేర్వదగిన విషయములను నేర్చుకొంటిని.

ఓ యదూ! నహుషుని పుత్రుడగు యయాతియొక్క పుత్రుడవైన నీవు పురుషులలో శ్రేష్ఠుడవు. నేను ఏయే గురువు వలన దేనిని ఏ ప్రకారముగా నేర్చుకున్నానో, ఆ వివరములను నీకు చెప్పెదను. వినుము.

ప్రాణులు తొక్కుచున్ననూ భూమి విచలితము కాదు. ఇదే వ్రతమును నేను పృథివినుండి నేర్చుకొంటిని. ధీరపురుషుడు ఇతరులు తనపై ఆక్ర మించినప్పుడు కూడా సన్మార్గమునుండి విచలితుడు కాడు. సకలప్రాణులు ప్రారబ్ధమునకు వశులై ప్రవర్తిల్లుచున్నారని ఆతనికి తెలియును.

పర్వతము సర్వకాలములలో పరోపకారమునే చేయును. పర్వతము పుట్టినది పరోపకారము కొరకే. సత్పురుషుడు పర్వతమునుండి ఇట్టి పరోపకారలక్షణమును నేర్వవలెను. చెట్టు ఉన్నది ఇతరప్రాణుల సుఖము కొరకే. సజ్జనుడు చెట్టునుండి కూడా ఈ లక్షణమును నేర్వవలేను. (పర్వతము, చెట్టు పృథివి రూపములే).

ప్రాణము ఆహారమున పేక్షించునే గాని, రుచులను కాదు. అటులనే, మననశీలుడగు సాధకుడు జీవనయాత్రకు ఆవశ్యకమైనవాటిని మాత్రమే స్వీకరించి సంతుష్టుడు కావలెనే గాని, ఇంద్రియప్రీతి కొరకు ఆరాటపడరాదు. ప్రాణములు నిలబడినచో, జ్ఞానశక్తి లుప్తము కాకుండును. ఇంద్రియప్రీతిని పరిహరించుట వలన వాగింద్రియము, మనస్సు విక్షిప్తము కాకుండును. కాబట్టి సాధకుడు అధ్యాత్మమగు ప్రాణమునుండి దేహయాత్ర కొరకు మాత్రమే విషయములను గ్రహించుట అనే సాధనను నేర్వవలెను.

సాధకుని బుద్ధి గుణదోషములకు అతీతముగా నుండవలెను. వాయువు అంతటా ప్రవేశించినా ఎక్కడా ఆసక్తము కాదు. అదే విధముగా, యోగి పలు రకముల శబ్దాది విషయములననుభవిస్తున్నా, వాటిలో దేనియందైననూ ఆసక్తిని కలిగి యుండరాదు.

పృథివీగుణమైన గంధమును వాయువు తనతో తీసుకొని పోవునే గాని, దానితో సంయోగమును పొందదు. అదే విధముగా, సాధకుడు ఈ పృథివీవికారమైన దేహమునందు, దాని బాల్యత్వకృశత్వాది గుణములయందు నేను-నాది అనే అభిమానమును కలిగియుండడు. సాధకుడు తనను శుద్ధచైతన్యరూపముగా అరయవలెను.

ఆత్మ దేహమునందు ప్రకాశిస్తున్నా సర్వవ్యాపకము. ఆత్మ దేహముచే పరిచ్చిన్నము కాదు. ఆత్మకు దేహముతో సంగము లేదు. ఆత్మ ఆకాశము వలే సర్వవ్యాపకమై సకలప్రాణులలో అనుగతమగును. ఆత్మకు పరబ్రహ్మతో భేదము లేదు. మననశీలుడగు సాధకుడు తనను అట్టి ఆత్మ చైతన్యరూపముగా భావన చేయవలెను.

వాయువు ఎగురకొట్టే మేఘము, ధూళి మొదలైనవి ఆకాశమును స్పృశించవు. అదే విధముగా, జీవతత్త్వమగు చైతన్యమును గుణకార్యములగు శబ్దాదులు స్పృశించవు. అగ్ని-నీరు-పృథివి అనువాటి వికారములైన ఆ శబ్దాదులను కాలము సృష్టించుచుండును.

నిర్మలమైన నీరు స్వభావము చేతనే ఆర్ద్రముగా, మధురముగానుండి జనులను పావనము చేయును. గంగాది జలములను చూచి, స్పృశించి, కీర్తించుటచే జనుల పాపములు పోవును. మననశీలుడగు సాధకుడు నీటిని పోలినవాడు. ఆయన నిర్మలుడు, స్వభావము చేతనే స్నేహశీలి, మధురముగా పలుకువాడు. అట్టి మహాత్ముడు గంగాది తీర్థము వంటివాడు. ఆయనను చూచి, పాదములను తాకి, సంభాషించుటచే జనులు పవిత్రులగుదురు.

అగ్ని తేజశ్శాలియై ప్రకాశించును. అగ్నిని క్షోభిల్ల జేయ శక్యము కాదు. అగ్ని దేనిని భక్షించినా (కాల్చినా) దోషము రాదు. ఏకాగ్రమగు చిత్తము గల యోగి అగ్నివంటివాడు. ఆయన తపస్సుచే తేజశ్శాలియై ప్రకాశించును. ఉదరమే పాత్రగా గల ఆయనలో పరిగ్రహమేదీ ఉండదు. ఆయన ఎటువంటి ఆహారమును తిన్నా పాపమును పొందడు.

అగ్ని ఒకచో కప్పబడి, మరియొకచో కనబడుతూ ఉండును. శ్రేయస్సును కోరువారలు అగ్నిని ఉపాసించెదరు. హోమము చేయువారల భూతభవిష్యత్తులలోని పాపమును అగ్ని నశింపజేయును. అగ్ని సకలజనుల హవిస్సును స్వీకరించును. ఆత్మజ్ఞాని అగ్ని వంటి వాడు. ఆయన తన జ్ఞానమును ఒకచో దాచి పెట్టి, మరియొకచో ప్రకటించును. శ్రేయస్సును కోరువారు ఇట్టి జ్ఞానిని సేవించెదరు. ఆయన అందరివద్ద ఆహారమును స్వీకరించును. ఆయన దాతల భూతభవిష్యత్తులయందలి పాపములను నశింపజేయును.

సర్వవ్యాపకుడగు పరమాత్మ తన మాయాశక్తిచే ఈ దేవతలు, మానవులు, పశుపక్ష్యాది ప్రాణులు గల జగత్తును సృష్టించి, ఆయా దేహములయందు చైతన్యరూపముగా ప్రవేశించెను. అగ్ని కట్టెలయందు వాటికి తగ్గ రూపములలో కనబడును. అదే విధముగా, ఒకే పరమాత్మ ఆయా దేహములయందు ఆయా జీవుల రూపముగా భాసించును.

కాలముయొక్క ప్రవాహము, వేగము తెలియ శక్యము కానివి. దాని ప్రభావముచే, చంద్రుని కళలు పెరిగి తగ్గినట్లుగా, దేహము పుట్టుకతో మొదలిడి శ్మశానమునకు వేళ్లు వరకు, వివిధవికారములను పొందును. చంద్రునకు లేనట్లే, ఈ వికారములేవియూ ఆత్మకు లేవు.

నదీప్రవాహమువంటి వేగము గల కాలముయొక్క ప్రభావముచే, ఆత్మ చైతన్యము ప్రకటమవుతూ ఉండే దేహములు, అగ్నిజ్వాలలు వలె, ఎల్లవేళలా పుట్టి నశిస్తూ ఉంటాయి. కాని అవి, సర్వదా మారిపోతూ ఉండే నదీప్రవాహము వలె, నిరంతరముగా ఉన్నవి అన్నట్లు భాసిస్తాయే గాని, వాటి పుట్టుక-నాశములు కానరావు.

సూర్యుడు గ్రీష్మకాలములో నీటిని స్వీకరించి వర్షకాలములో విడిచి పెట్టును. అదే విధముగా, దేహాద్యతిరిక్తమైన ఆత్మస్వరూపమునందు నిష్ఠ గల సాధకుడు ఆయా కాలములలో ఇంద్రియములతో శబ్దాది విషయములను స్వీకరించిననూ, వాటియందు తగుల్కొనడు.

సూర్యుడు తన స్వరూపమునందే ఉన్ననూ, జలమునందు ప్రతిబింబించి దానిలో ప్రవేశించినట్లుగా, వేర్వేరు జలాశయములలో వేర్వేరుగా కన్పట్టును. అదే విధముగా, తన స్వరూపమునందే ఉన్న ఆత్మ దేహాద్యుపాధులయందు ప్రతిఫలించి, వాటిలో ప్రవేశించినదా యన్నట్లు కన్పట్టును. స్థూలమైన బుద్ధి గలవారు దేహాదిభేదమును బట్టి ఆత్మ అనేకమని భ్రమించెదరు.

ఎప్పుడైనా ఎవనితోనైనా దేనియందైనా అతి స్నేహమును, అధికమగు ఆసక్తిని చేయరాదు. అట్లు చేయువాడు పావురము వలే దీనమగు బుద్ధి గలవాడై దుఃఖమును పొందును.

ఒకానొక పావురము అడవిలో చెట్టుపై గూడు కట్టుకొని భార్యయైన ఆడు పావురముతో గూడి నిరంతరముగా కొన్ని సంవత్సరముల కాలము నివసించెను.

ఆ పావురముల జంట ప్రేమతో నిండిన హృదయములు గలవై కాపురమును చేయుచుండెను. అవి పరస్పరము చూపును చూపుతో, దేహమును దేహముతో, బుద్ధిని బుద్ధితో బంధించుకొని యుండెను.

ఆ పావురములకు జంటకు ఆపద పొంచి ఉన్నదనే శంక లేదు. అవి వనపంక్తులయందు కలిసి తిరిగి, తిని, నీటిని త్రాగి, కూర్చుండి, నిలిచి, కబుర్లాడీ, ఆటలాడి, నిద్రించెడివి.

సంతోషమునిచ్చే ఆ ఆడు పావురమును ప్రేమతో మగ పావురము ప్రోత్సహించెడిది. ఆడు పావురము ఏయే భోగ్యవస్తువును కోరినా, ఇంద్రి యజయము లేని మగ పావురము ఎంత కష్టమైనా దానిని తెచ్చెడిది.

కొంత కాలానికి పతివ్రతయగు ఆడు పావురము మొదటి సారి గర్భవతి ఆయెను. అది మగ పావురము సన్నిధిలో గూడునందు గ్రుడ్లను పెట్టెను.

శ్రీహరియొక్క శక్తులు ఊహకు అందవు. కొంత కాలానికి ఆ గ్రుడ్లనుండి పిల్లలు పుట్టినవి. వాటికి చక్కని సుకుమారమైన అవయవములు, రోమములు ఉండెను.

ఆ పావురము దంపతులు చాల సంతోషముతో పక్షి పిల్లలను పోషించినవి. వాటికి పిల్లల యెడల ఎనలేని ప్రేమ. అవి పిల్లల కూతలను వింటూ, వాటి తియ్యని కూతలచే మహానందమును పొందినవి.

దైన్యమునెరుగని ఆ పక్షి పిల్లల రెక్కల స్పర్శ తల్లి-తండ్రి పావురములకు సుఖమునిచ్చెడీది. వాటీ కూతలు, అమాయికపు చేష్టలు, ముక్కును ముందుకు చాచుటలు ఆ పక్షులకు ఆనందమునిచ్చెడివి.

శ్రీహరి మాయచే ఆ పావురముల జంటకు హృదయములలో ఒకరిపై నొకరికి అధికమగు ఆసక్తి ఉండెడిది. అవి సంతానమునందలి వ్యామోహముచే దీనమైన అంతఃకరణమును కలిగియుండెడివి. అవి పిల్ల పక్షులను పోషిస్తూ ఉండెడివి.

పిల్లలతో కలిసి జీవిస్తున్న ఆ పక్షి దంపతులు ఒకనాడు ఆ పిల్లల కొరకు ఆహారమును తీసుకు రాగోరినవి. అవి ఆహారము కొరకు అడవిలో చుట్టూ చాల సేపు సంచరించినవి.

ఆ పక్షి పిల్లలు తమ గూడు దగ్గరలో ఇటునటు తిరుగుచుండగా, ఆ అడవిలో తిరిగే ఒక వేటగాడు అనుకోకుండా ఈశ్వరేచ్చచే వాటిని చూచెను. ఆతడు వలను పరచి వాటిని పట్టుకొనెను.

ఆ పావురముల జంటకు పిల్లలను పోషించాలనే ఉత్కంఠ ఎల్లవేళలా ఉండెడిది. అవి వెళ్లి ఆహారమును తీసుకొని తమ గూడు వద్దకు వెళ్లినవి.

లేత వయస్సులోని ఆ పక్షి పిల్లలు వలలో చిక్కుకొని ఏడ్చుచుండెను. ఇంతలో ఆడు పావురము ఆ తమ పిల్లలను చూచి చాల, దుఃఖమును పొంది ఎగురుకుంటూ ఎదురుగా వెళ్లెను.

పుట్టుక లేని శ్రీహరియొక్క మాయచే ఆ ఆడు పావురము సంతానమునందు అతిశయించిన ఆసక్తిచే బంధించబడెను. దీనమైన మనస్సు గల ఆ ఆడు పావురమునకు బంధించబడిన పిల్లలను చూస్తూండగా స్పృహ తప్పెను. అది కూడ వలచే బంధించబడెను.

మగ పావురమునకు పిల్లలు తన ప్రాణములకంటే కూడ ఎక్కువ ప్రియము. దానికి భార్య చాల అనురూపమైనది. బంధించబడిన తన పిల్లలను, భార్యను చూచి అది దీనముగా మహాదుఃఖముతో ఏడ్చెను.

అయ్యో! దుర్బుద్ధినగు నా పుణ్యము అల్పము. తృప్తి లేని నేను కృతార్థుడను కాలేకపోతిని. ఓ జనులారా! నాకు కలిగిన వినాశమును చూడుడు. ధర్మార్థకామములకు సాధనమైన గృహాశ్రమము నష్టమైనది.

నాకు భార్య అనురూపమైనది, అనుకూలమైనది. ఆమెకు భర్తయే దైవము. ఆమె నన్ను శూన్యగృహములో విడిచి పెట్టి, సాధువులైన పుత్రులతో గూడి స్వర్గమునకు వెళ్లుచున్నది.

అట్టి నేను శూన్యమగు గృహములో దీనుడనై దేని కొరకు జీవించ గోరుచున్నాను? భార్య మరణించి నేను భార్యాహీనుడనగుచున్నాను. నా పిల్లలు మరణిస్తున్నారు. నా జీవితము దుఃఖమయమైనది.

పక్షి పిల్లలు వలలో పడి బంధించబడి మృత్యువుచే మ్రింగబడుతూ వలలో పడ్డవి పడ్డట్లుగా కొట్టుకొనుచుండెను. దీనుడు, మూర్ఖుడు అగు ఆ పక్షి తన పిల్లలను చూస్తూ తాను కూడ వెళ్లి వలలలో పడెను.

క్రూరుడైన ఆ వేటగాడు పక్షి గూడుకు స్వామియగు మగ పావురమును, ఆడు పావురమును, పిల్లలను కూడ సంపాదించి కృతార్థుడై ఇంటికి వెళ్లెను.

ఈ విధముగా సుఖదుఃఖాదీద్వంద్వములలో పూర్తిగా రమించే గృహస్థునకు అంతఃకరణములో శాంతి కరువగును. ఆతడు కుటుంబమును పోషిస్తూ, పావురము వలే, దీనుడై భార్యాపుత్రాదులతో సహా నశించును.

మనిషి యే పుట్టుట యనగా మోక్షద్వారము తెరుచుకొనుటయే. ఆ విధముగా మనిషియై జన్మించి కూడా ఎవడైతే ఆ పావురము వలె సంసారమునందు ఆసక్తిని కలిగియుండునో, అట్టివాడు ఆరూఢచ్యుతుడు (పైకి వెళ్లి జారి పడినవాడు) అని మహాత్ములు చెప్పెదరు.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో దత్తాత్రేయగీతలో ఎనమండుగురు గురువులను వర్ణించే  ఏడవ అధ్యాయము ముగిసినది (7).