శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

23 - భిక్షుగీతము

వ్యాసపుత్రుడగు శుకమహర్షి ఇట్లు పలికెను -- దాశార్హవంశీయులలో ప్రముఖుడగు శ్రీకృష్ణుడు మోక్ష ప్రదాత. ఆయన పరాక్రమము వీవసాంపైనది. . భగవద్బక్తులలో ముఖ్యుడైన ఉద్ధవుడీ విధముగా ప్రశ్నించగా, ఆయన ఆతని మాటను సత్కరించి, ఆతనితోనిట్లు పలికెను.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బృహస్పతిశిష్యుడవగు ఓ ఉద్దవా! దుర్జనులు పలికిన చెడు మాటలచే క్షోభిల్లిన మనస్సును సమాధాన పరచుటలో సమర్థుడైన సజ్జనుడు ఈ లోకములో నిశ్చయముగా లేడు.

దుర్జనులు పలికిన పరుషవచనములు .హృదయమనే మర్మస్థానమునందు నిలిచి వ్యక్తికి చాల పీడను కలిగించును. మర్మస్థానములయందు గట్టిగా బాణములచే కొట్టబడిన వ్యక్తి కూడా నిశ్చయముగా అంతటి పీడను పొందడు.

ఓ ఉద్దవా! ఈ విషయములో పెద్దలు పవిత్రమైన వృత్తాంతమునొకదానిని గొప్పగా చేప్పెదరు. దానిని నేను చెప్పెదను. నీవు చిత్తమును బాగుగా ఏకాగ్రము చేసి తెలుసుకొనుము.

ఒక భిక్షువును దుర్జనులు పరాభవించిరి. కాని, ఆయన ధైర్యమును కోల్పోలేదు. ఆయన అదంతా తన కర్మల ఫలమేనని గుర్తించి, ఒక గీతమును పాడేను.

అవంతి దేశములో ఒకానొక బ్రాహ్మణుడు ఉండెను. ఆతడు వ్యవసాయము, వర్తకము మొదలైన వృత్తులను చేసి ధనమును కూడబెట్టి పెద్ద ధనవంతుడాయెను. కాని, ఆతడు పరపీడాపరాయణుడు, కాముకుడు, లోభి, మిక్కిలి కోపిష్టి.

ఆతడు జ్ఞాతులను, అతిథులను మాట మాత్రముచేనైననూ సత్కరించలేదు. శూన్యమైన ఇంటిలో ఆయా సమయములలో ఆతడు తాను కూడ ఏ భోగములలోనైననూ సంతోషముగా జీవించలేదు.

దుష్టస్వభావముతో పరపీడాపరాయణుడైన ఆతని ప్రవర్తనచే దుఃఖితులైన కొడుకులు, బంధువులు, భార్య, కుమార్తెలు, సేవకులు ఆయనకు ప్రియమును చేయకుండిరి; పైగా, ద్రోహమును చేసిరి.

యక్షులు ధనమును దాచెదరే గాని భోగించరు. ఈతడట్టివాడు. ఈతడి విధముగా ఇహపరముల రెండింటికీ చెడినాడు. ఆతని జీవితములో ధర్మము లేదు, కామము లేదు. మనిషి సంపదలో దేవతలు, పితరులు, మనుష్యులు, ప్రాణులు, ఋషులు అనే ఐదుగురికి వాటా ఉండును. పిల్లికి బిచ్చము పెట్టని వీనిపై ఆ ఐదుగురు యజ్ఞదేవతలు కోపించిరి.

ఆ మహాయజ్ఞదేవతలననాదరము చేయుటచే ఆతనికి ఉన్న ఏదో కొద్దిపాటి పుణ్యము కూడ వినష్టమయ్యెను. ఆతడు ఎంతో కష్టపడి ధర్మకామములను విడిచి పెట్టి డబ్బును కూడబెట్టెను. ఆ డబ్బు వలన ఆతనికి మిగిలినది శ్రమ మాత్రమే. అది కూడ వినష్టమయ్యెను.

ఓ ఉద్దవా! ఆ బ్రాహ్మణాధముని సంపదలో కొంత భాగమును బంధువులు లాగుకొనగా, చోరులు కొంత పట్టుకుపోయిరి. ఆతని సంపద దైవము (ఇల్లు అంటుకొనుట ఇత్యాది) వలన కొంత, కాలము వలన కొంత (నిలవ ఉంచిన ధాన్యము చెడిపోవుట ఇత్యాది) నష్టము కాగా, ఇతర జనులు కొంత పట్టుకుపోయిరి. కొంత సంపద రాజు ఖజానాకు చేరెను.

ఆతనికి ధర్మకామములు ముందే లేవు. ఇప్పుడు అర్థము కూడ విన మాగెను. బంధువులాతనిని పట్టించుకోలేదు. అపుడాతడు అతిక్రొవి.. : శిక్యము కాని దుఃఖమును పొందెను.

ఆతడీ విధముగా సంపద నశించి ఖేదమును పొంది దీర్భముగా చింతిల్లెను. కన్నుల వెంబడి నీరు స్రవించ ఆతని కంఠము గద్గదమాయెను. అపుడాయనకు చాల పెద్ద వైరాగ్యము కలిగెను.

ఆతడిట్లు పలికెను --- అయ్యో! కష్టము! నేను దేహమును వ్యర్థముగా నిరంతరము తపింపజేసితిని. నేను ధనము కొరకై పడిన ఇటువంటి శ్రమ వలన ధర్మము సిద్ధించలేదు, భోగమైననూ సిద్ధించలేదు.

పరపీడాపరాయణులయొక్క ధనము తరచుగా ఏ కాలమునందైననూ సుఖమునీయదు. వారీ లోకములో శరీరమును కష్ట పెట్టెదరు; మరణించి నరకమును కూడ పొందెదరు.

తెల్ల మచ్చ అందమైన రూపమును కూడ చెడగొట్టును. అదే విధముగా, లోభము అల్పమే అయినా, కీర్తిమంతుల స్వచ్చమగు కీర్తిని, గుణవంతుల కొనియాడదగిన గుణములను చెడగొట్టును.

మానవులు సంపదను ప్రోగుచేయుటలో, ప్రోగు చేసినదానిని పెంచుటలో, దానిని కాపాడుటలో శ్రమ, భయము, మానసికాందోళన, భ్రమ (అధర్మమునందు ధర్మబుద్ది) లను పొందెదరు. ఆ సంపదను ఖర్చు చేయునప్పుడు, అది వినష్టమైనప్పుడు, భోగించునప్పుడు కూడ మానసికాందోళనను పొందెదరు.

సంపదలను ప్రోగు చేయునప్పుడు ఇతరుల సొత్తును అపహరించుట, డబ్బు కొరకై ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా ఇతరులను పీడించుట, అసత్యభాషణము, ఇతరులను వంచించుటకు అనువైన వేషధారణము మొదలైన డాంబీకము, ధనాశ, అది తీరని కోపము అనే దోషములు గలవు. సంపద పోగైన తరువాత గర్వము, ఇతరులను తిరస్కరించుట, గొప్పవారు తక్కువ వారు అనే భేదబుద్ధి, వైరము, ఇతరులను నమ్మకుండుట, అధికమగు పోటీ తత్త్వము, వ్యసనములు (వ్యభిచారము, మద్యపానము, జూదము) అనే దోషములు ఉండును.

మానవులకు ఈ పది హేను దుఃఖ హేతువులు. నిశ్చయముగా ధనమే మూలముగా గలవని చెప్పబడినది. కాబట్టి, మోక్షమును కోరే సాధకుడు ధనమనే పేరు గల దుఃఖ హేతువును దూరముగా విడిచి పెట్టవలెను.

అన్నదమ్ములు, భార్య, తల్లిదండ్రులు, మిత్రులు ప్రేమబంధముతో ఒక్కటిగా కలిసి ఉంటారు. కానీ, వీరందరు పావలా డబ్బులు కారణముగా కలహించుకొని వెంటనే శత్రువులుగా మారిపోతారు.

ఎందుకంటే, మిక్కిలి అల్పమైన ధనము నిమిత్తముగా వీరు మనస్సులో క్షోభ జెంది కోపముతో మండి పడెదరు. వీరు స్పర్ధ గలవారై వెంటనే ప్రేమను విడిచి పెట్టి శీఘ్రముగా బంధుత్వమును త్యజించి అపకారము చేయుదురు.

మనిషిగా పుట్టాలని దేవతలు కూడ కోరుకుంటారు. దానిలో కూడ బ్రాహ్మణత్వము గొప్ప. దానిని పొంది కూడ ఎవరైతే దానిని అనాదరము చేసి తమ పురుషార్థమును చెడగొట్టుకొనెదరో, వారు అపవిత్రమైన నరకాదులను పొందెదరు.

ఈ మానవజన్మ స్వర్గమునకు, మోక్షమునకు కూడ ద్వారము. మరణించబోయే ఏ మానవుడు అట్టి జన్మను పొంది కూడ ధనమునందాసక్తిని కలిగియుండును? ఆపదలన్నింటికీ ధనమే మూలము.

వ్యక్తియొక్క సంపదలో దేవతలు, మహర్షులు, పితరులు, ప్రాణులు, అతిథులు వాటాదారులు. వారికి పెట్టకుండా సగోత్రీకులకు, బంధువులకు కూడ పెట్టకుండా, తాను తినకుండా, కేవలము యక్షులు వలె ధనమునకు కాపలా కాస్తూ ఉండేవాడు అధఃపతితుడగును.

ధనమును సంపాదించే ప్రయత్నము ఎందుకూ పనికి రానిది. దాని వలన పురుషార్థము విస్మరించబడును. వివేకులు ధనమును యోగ్యముగా ఖర్చు చేసి కృతార్థులగుదురు. నా ధనము పోయినది. వయస్సు, బలము లుప్త మైనవి. ముదుసలిని. నేనేమి సాధించగలను?(ఏమీ సాధించలేను).

ధనమును ప్రోగు చేసే ప్రయత్నము వ్యర్థము. తెలివైనవాడు కూడ . నిరంతరముగా ఆ ప్రయత్నముతో ఎందువలన క్లేశపడు చున్నాడు? ఈ మానవుడు నిశ్చయముగా ఒకానొకని (ఈశ్వరుని మాయచే గట్టి మోహమును పొంది యున్నాడు.

మృత్యువుచే కబళించివేయబడుచున్న మానవునకు ధనముతో గాని, ధనమునిచ్చే వారితో గాని, విషయభోగములతో గాని, కోరికలను తీర్చే వారితో గాని, జన్మలనిచ్చే (కామ్య) కర్మలతో గాని ఏమి ప్రయోజనము? .

సకలదేవతారూపుడైన శ్రీహరి భగవానుడు నా యెడల నిశ్చయముగా ప్రీతి జెంది నన్నీ దశకు చేర్చియుండును. నాకు వైరాగ్యమే పడవ.

నాకింకా ఆయుష్టు మీగిలియున్నచో, ఆ కాలములో తపస్సు చేసి శరీరమును శుష్కింప జేసెదను. సకలపురుషార్థముల విషయములో పావ ధానుడనై యుండెదను. మనస్సునందు సంతోషమును కలిగియుండెదను.

నేనే చేసే ఆ సాధనయందు ముల్లోకములను పాలించే దేవతలు నన్ను అనుగ్రహించెదరు గాక! ఖట్వాంగ మహారాజు గంట సేపులో బ్రహ్మలోకమును సాధించెను.(కాబట్టి నిరాశ పడనక్కరలేదు).

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- అవంతిదేశీయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు మనస్సులో ఈ విధముగా నిశ్చయించుకొనెను. హృదయమునందలి ముడులైన అహంకార మమకారములనాయన విడిచి పెట్టి శాంతుడాయెను. ఆయన మననశీలుడైన సన్న్యాసి ఆయెను.

అయన మనస్సును, ఇంద్రియములను, శ్వాసను నియంత్రించి అసంగుడై భిక్ష కొరకు ఈ భూలోకములో సంచరించెను. ఆయన గుర్తు పట్టలేని విధముగా నగరములను, గ్రామములను ప్రవేశించెడివాడు.

మంగళకరుడవగు ఓ ఉద్దవా! పెద్ద వయస్సులో మలినుడై ఉన్న ఆ భిక్షుకుని చూచి దుష్టజనులు అనేకవిధములుగా ఆయనను తిరస్కారము చేసి పరాభవించిరి.

కొందరు ఆ మునియొక్క త్రిదండమును, కొందరు భిక్షాపాత్రను, కొందరు కమండలమును, మరికొందరు ఆసనమును, ఇంకొందరు జపమాలను కూడ లాగుకొనిరి. కొందరు చినిగియున్న కట్టు వస్త్రమును, కొందరు ఆయన వద్ద గల గుడ్డ పేలికలను లాగుకొనిరి. వారు వాటిని దాచి మరల చూపించి, ఇచ్చి మరల లాగుకొనిరి.

ఆయన భిక్షాటనముచే లభించిన అన్నమును నది ఒడ్డున కూర్చుని తినుచుండగా ఆ మహాపాపులు మూత్రము చేసి, ఆతని తల పై ఉమిసిరి.

మౌనముగా ఉన్న ఆయనను కొందరు మాటలాడించెదరు. ఆయన మాటలాడకపోయినచో కొట్టెదరు. మరికొందరు, ఈతడు చోరుడు అనే మాటలతో బెదిరించెదరు. కొందరు కట్టివేయుడు, కట్టివేయుడు అంటూ త్రాళ్లతో కట్టివేసెదరు.

ఈతడు పైకి ధర్మాత్ముడుగా కనబడినా లోపల మోసగాడు. సంపద పోవుటచే ఈతడీ భీక్షావృత్తిని స్వీకరించినాడు. ఈతనిని బంధువులు విడిచి పెట్టిరి, అంటూ కొందరాయనను తిడుతూ అవమానించేడివారు.

ఆహా! ఈతడు పెద్ద బలము గలవాడు, పర్వతరాజు వలె స్థిరమైన చిత్తము గలవాడు. మౌనముగా ఉంటూనే తన పనిని సాధిస్తాడు. మౌనంగా ఉండి చేపలను పట్టే కొంగ వలె దృఢమైన నిశ్చయము గలవాడు, అని కొందరీయనను పరిహసించెదరు. మరికొందరైతే ఆయన పై చెడు గాలిని విడిచి పెట్టెడివారు. ఆ బ్రాహ్మణుని వారు ఆటబొమ్మను వలె కట్టివేసి, తన దారిన వెళ్లకుండా అడ్డుకొనిరి.

ఈ విధముగా ఆయనకు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవిక (శీతోష్ణాది) దుఃఖములు మరల మరల కలిగెను. అది తన ప్రారబ్దమేననియు, అనుభవించదగినదేననియు ఆయన తలపో సెను (వ్యాకులుడు కాలేదు).

నీచులైన జనులు ఆయనను తన సాధుధర్మమునుండి పడద్రోయుటకై పరాభవించిరి (ఆధునికకాలములోని ర్యాగింగ్). కాని, ఆయన తన సాధుధర్మమునందే గట్టిగా నిలబడెను. ఆయన సాత్త్వికధృతి (అన్ని పరిస్థితులలో ధైర్యము కోల్పోకుండా ఉండుట) ని స్వీకరించి ఈ గాథ (అప్రయత్నముగా వెలువడిన ఉపదేశవాక్యము) ను గానము చేసెను.

బ్రాహ్మణుడు పలికెను - నా సుఖదుఃఖములకు హేతువు ఈ జనులు, దేవత, శరీరము, గ్రహములు, కర్మ, కాలము కావు. కేవలము మన స్సే కారణమని పెద్దలు చెప్తారు. మన స్సే సంసారచక్రమును త్రిప్పుచున్నది.

అధికబలము గల మనస్సు నిశ్చయముగా గుణకార్యములగు వృత్తులను సృష్టించును. ఆ వృత్తులనుండి సాత్త్విక(పుణ్య)-తామస(పాపు-రాజస(మిశ్రమ)ములై వేర్వేరు లక్షణములు గల కర్మలు కలుగును. ఆ కర్మలనుండి వాటికి తగ్గ (ఉత్తమ-నీచ-మధ్యమములైన) జన్మలు కలుగును.

పరమాత్మ క్రీయాసంగము లేని చైతన్యప్రకాశఘనము, జీవునకు హిత కారి. పరమాత్మ సంకల్పించే మనస్సుతో కూడి ఉన్నా, ఉదాసీనముగా సాక్షి యై ఉండును. కాని, జీవుడు మనస్సుతో తాదాత్మ్యమును చెంది మన సే సూక్ష్మమగు శరీరము గలవాడగును. జీవుడు గుణకార్యములగు ఇంద్రియములపై, వాటి విషయములపై ఆసక్తి కలిగియుండును. ఆ జీవుడు భోగవిషయములను సేవిస్తూ సంసారములో బద్ధుడై యుండును.

దానము, తన ధర్మమునాచరించుట, యమనియమములు, అధ్యయనములు, కర్మలు, మంచి ప్రతములు అనే సర్వమునకు అంతిమఫలము మనస్సుయొక్క నిగ్రహమే. ఎందుకంటే, మనస్సుయొక్క ఏకాగ్రత సర్వోత్కృష్టమైన యోగము.

ఎవని మనస్సు ఏకాగ్రమై ప్రశాంతముగా నుండునో, వానికి దానధర్మాలతో పని యేమియో చెప్పుము (ఏమీ లేదు). ఎవనీ మనస్సు - విక్షిప్తమై యుండునో, లేదా లయమై (నిద్ర) ఉండునో, వానికి దానధర్మాల వలన ఒరిగే ఇంకో ఫలమేమున్నది?(ఏమీ లేదు).

ఇతరములైన ఇంద్రియములు, దేవతలు కూడ మనస్సునకు వశమై ఉన్నారు. కాని, మనస్సు మాత్రము ఇంద్రియములకు, దేవతలకు కూడ వశమై లేదు. ఇది నిశ్చయము. ఎందుకంటే, సంసారభయమును కలిగించే మనస్సు అనే దేవుడు బలవంతులలోకెల్లా బలవంతుడు. ఆ దేవుని నిగ్రహించి వశపరచుకున్న ఆ వ్యక్తి దేవతలకు కూడ దేవత యగును.

మనస్సునకు రాగద్వేషములయందు ఉండే వేగమును సహించుట చాల కష్టము. మనస్సు మర్మములను పీడించే శత్రువు. దానిని జయించుట చాల కష్టము. అతిమూర్ఖులగు కొందరు అట్టి ఆ మనస్సును జయించకుండా ఈ లోకములో ఇతరమనుజులతో వ్యర్థమైన (నరక హేతువగు) కలహమునకు దిగెదరు. మనస్సును జయించలేని కారణముగా వారీ లోకములో జనులను మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే విభాగము చేసి ప్రవర్తించేదరు.

ఈ దేహము మనోవృత్తిరూపముగా కల్పితము మాత్రమే. కాని, వివేకాంధులైన మానవులు ఈ దేహమునందు నాది-నేను అనే భ్రమను కలిగియుందురు. వారు ఈ దేహము నేను అని, మరియొక దేహము ఇతరుడు అని భ్రమించెదరు. వారు సంసారసముద్రములో పరిభ్రమించే దరు. అజ్ఞానమనే ఆ సముద్రమునకు అంతము పలికే ఆవలి తీరమే లేదు.

ఒక వ్యక్తియొక్క సుఖదుఃఖములకు ఇంకో వ్యక్తి కారణమైనచో, ఆత్మకు ఏమి యగును?(ఏమి సంబంధము?) కర్తయా? కర్మయా? ఏదీ కాదు. ఎందుకంటే, ఆ కర్తృత్వకర్మత్వములు పృథివీవిరములైన దేహములకు మాత్రమే. భోజనము చేయునప్పుడు ఒకడు తన పళ్లతో నాలుకను కొరికినాడనుకొనుడు. ఆతడప్పుడు దేనిపై కోపించును?

సుఖదుఃఖములకు హేతువు ఇంద్రియాభిమాని దేవతలు అన్న పక్షములో, వాటితో ఆత్మకు ఏమి సంబంధము? ఎందుకంటే, ఆ కర్తృత్వభోక్తృత్వములనే వికారములు ఇంద్రియదేవతలకే చెందును. తన దేహములో ఒకచోట ఒక అంగముచే మరియొక అంగము కొట్టబడినచో, ఆ వ్యక్తి దేనిపై కోపించును?(దేని పైననూ కోపించడు).

ఆత్మయే సుఖదుఃఖములకు కారణము అన్నచో, ఆ పక్షమునందు ఇతరము వలన యేమి గలదు?(ఏదీ లేదు). అప్పుడు సుఖదుఃఖములు ఆత్మయొక్క స్వభావములే యగును. పైగా, ఆత్మకంటె వేరుగా మరి యొకటి లేనే లేదు. ఉన్నట్లైతే, అది మిథ్యయే యగును. సుఖము లేదు, దుఃఖము లేదు. కాబట్టి కోపించుటకు కారణమేమున్నది?(ఏమీ లేదు).

సుఖదుఃఖములకు గ్రహములు కారణమనే పక్షములో, పుట్టుక. లేని ఆత్మకు గ్రహములతో సంబంధమేమున్నది? గ్రహసంబంధము పుట్టే దేహమునకు మాత్రమే. పైగా, ఒక గ్రహముయొక్క పీడ మరియొక గ్రహమునకు ఉండునని దైవజ్ఞులు చేప్పెదరు. అట్టిచో, వ్యక్తి దేనిపై కోపించవలెను? దేహము పైనా? గ్రహము పైనా?, పురుషుని యథార్థస్వరూపము దేహముకంటె, గ్రహములకంటె విలక్షణమైనది.

సుఖదుఃఖములకు కారణము కర్మ అన్నచో, ఆత్మకు కర్మసంబంధమేమున్నది?(ఏమీ లేదు). ఏలయన, జడచేతనముల గ్రంథియందు మాత్రమే కర్మ సంభవమగును. దేహమైతే జడము. ఈ ఆత్మ శుద్ధజ్ఞానస్వరూపము (కావున, అజ్ఞానముచే తప్ప గ్రంథియే సంభవము కాదు). కాబట్టి, వాస్తవమైన కర్మ లేనే లేదు. ఈ స్థితిలో దేనిపై కోపము చేయవలెను?(మనస్సు మాత్రమే సుఖదుఃఖ హేతువు).

సుఖదుఃఖములకు కాలము హేతువన్నచో, ఆ పక్షమునందైననూ ఆత్మకు ఏమి సంబంధము?(ఆత్మ కాలాతీతము). ఈ జీవుడు పరమాత్మయొక్క అంశమే. కాబట్టి, కాలము జీవుని ఏమీ చేయలేదు. ఎల్లాగంటే, అగ్నికి జ్వాలల వలన తాపము, మంచునకు చలి ఉండవు గదా! కాబట్టి, దుఃఖము వచ్చినప్పుడు దేనిపై కోపించవలెను? వాస్తవములో, జీవుడు సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడు. కావున, విచారించినచో సుఖదుఃఖములు వాస్తవములే కావు.

అహంకారమే సంసారమును నిరూపించును. ఆ అహంకారమునకు సుఖదుఃఖములు ఉండును. ఆ విధముగా కార్యజగత్తునకు కారణమైన ప్రకృతికి కూడ అతీతమైన ఈ పరమాత్మకు సుఖదుఃఖాది ద్వంద్వముల గ్రహణము.(సంబంధము) ఏ కారణముగానైననూ, ఎప్పుడైననూ, ఎక్క డైననూ, ఏ విధముగానైననూ లేదు. ఈ సత్యమును సాక్షాత్కరించుకున్నవాడు ఇతరప్రాణుల కారణముగా భయపడడు.

ప్రాచీనులైన మహర్షులు దేహేంద్రియాదులకతీతమైన ఈ ఆత్మయందు నిష్ఠను సేవించిరి. నేను కూడ అటులనే స్వీకరించేదను. అజ్ఞానమనే సంసారసముద్రమునకు అంతము పలికే ఆవలి తీరము లేదు. దీనిని నేను మోక్ష ప్రదాతయగు శ్రీహరి పాదముల సేవచే మాత్రమే దాటి వేయగలను.

శ్రీకృష్ణ భగవానుడు పలికెను -- ఆ భిక్షుకుడు ధనము నశించినప్పుడు విరక్తుడై సన్న్యసించి మనన శీలుడాయెను. ఆయన భూమినంతటా పర్యటిస్తూ ఈ గీతిని పాడెను. దుష్టులు తిరస్కరించినా ఆయన స్వధర్మమునుండి చలించలేదు. ఆయనకు ఖేదము తొలగిపోయెను.

మనిషికి సుఖదుఃఖములనిచ్చేది ఇతరులు కాదు. ఇతరులు కలిగించెదరనేది మనస్సుయొక్క భ్రమ. అజ్ఞానము వలన మాత్రమే మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే భేదము, సంసారము కలుగును.

నాయనా! సంసారము మనఃకల్పితము మాత్రమే అగుట వలన, నీవు నాయందు ఏకాగ్రము చేయబడిన (నిశ్చయాత్మకమగు) బుద్దితో కూడి మనస్సును అన్ని విధములుగా నిగ్రహించుము. ఇంత (మనోనిగ్రహము) మాత్రమే యోగముయొక్క సారము.

ఈ బ్రహ్మనిష్ఠ ను భిక్షుకుడు గానము చేసెను. దీనిని ఎవడైతే ఏకాగ్రతతో బుద్దియందు ధారణ చేయునో, ఇతరులకు వినిపించునో, లేదా ఇతరుని వలన వినునో, అట్టివానిని సుఖదుఃఖాదిద్వంద్వములు పరాభూతుని చేయలేవు.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో భిక్షుగీతమును వర్ణించే ఇరువది

మూడవ అధ్యాయము ముగిసినది (23).