శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

27 - క్రియా యోగము

ఉద్ధవుడిట్లు పలికెను --- సాత్వతవంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ ప్రభూ! నిన్ను ఆరాధించుట అనే క్రియాయోగమును గురించి వివరించి చెప్పుము. ఏ భక్తులు నిన్ను క్రియాయోగముతో ఏ విధముగా అర్చించెదరు?

పూజనీయులగు నారదుడు, వ్యాసుడు, అంగీరసపుత్రుడగు దేవగురువు బృహస్పతి, మహర్షులు కూడ పలుమార్లు ఈ కర్మయోగమును మానవులకు మోక్షసాధనమని చెప్పుచున్నారు.

స్వయంభువుడగు బ్రహ్మదేవుడు భృగువు మొదలైన పుత్రుల కొరకు, శివభగవానుడు కూడ పార్వతీ దేవి కొరకు దేనిని ఉపదేశించెనో, అదియే పద్మమువంటి నీ ముఖమునుండి ప్రకటమైనది.

మర్యాదనిచ్చే ఓ శ్రీకృష్ణా! ఈ క్రియాయోగమే నిశ్చయముగా సకలవర్ణాశ్రమములవారికి హితకరము. ఇదియే స్త్రీలకు, శూద్రులకు కూడ ఉత్తమమైన మోక్షసాధనమని నేను తలంచుచున్నాను.

            పద్మపత్రములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నీవు జగత్తులోని ప్రభువులగు బ్రహ్మాడులకు కూడ ప్రభుడవు. నేను అనురాగము గల భక్తుడను. నాకీ కర్మయోగమును చెప్పుము.

             శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ ఉద్దవా! కర్మకాండ (గ్రంథములో గానీ, అనుష్టానములో గాని) అంతమయ్యే హద్దు ఇది అని నిర్ధారించుటకు వీలు లేదు. ఇది నిశ్చయము. కాని, దానిని నేను సంక్షేపముగా యథాతథముగా క్రమముగా వర్ణించి చెప్పెదను.

నా యజ్ఞము వైదికము, తాంత్రికము, మిశ్రమము అని మూడు విధములుగా నున్నది. ఈ మూడింటిలో ఏది నచ్చితే దానితో యథావిధిగా నన్ను బాగుగా ఆరాధించవలెను.

వ్యక్తి తన వేదశాఖలో విధించిన విధముగా ఉపనయనసంస్కారమును పొందవలెను. తరువాత శ్రద్ధాభక్తులతో నన్ను ఏ విధముగా ఆరాధించవలెనో చెప్పెదను. తెలుసుకొనుము.

ప్రతిమ, సంస్కరించబడిన భూమి, అగ్ని, సూర్యుడు, జలములు, హృదయము, బ్రాహ్మణుడు అనువాటిలో దేనియందైననూ, పూజనీయుడనగు నన్ను నిష్కపటముగా (ఫలతృష్ణ లేకుండా) సాధకుడు భక్తితో గూడి గంధాదిద్రవ్యములతో పూజించవలెను.

సాధకుడు ముందుగా పళ్లను తోముకొనవలెను. తరువాత దేహశుద్ధి కొరకై మట్టి (సబ్బు) మొదలగు ద్రవ్యములనుపయోగించి స్నానమును చేయవలెను. స్నానము చేస్తూ ఆపో హిష్ఠామ -- ఇత్యాది వైదికమంత్రములను, గంగే చ యమునే -- ఇత్యాది పురాణమంత్రములను రెండింటినీ కూడ చెప్పవలెను.

నా పూజ కర్మబంధమునుండి విముక్తిని కలిగించును. యోగ్యమగు (ఈశ్వరవిషయకమైన) సంకల్పము గల సాధకుడు వేదముచే సమగ్రముగా విధించబడిన సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలైన కర్మలతో బాటుగా నన్ను పూజించవలెను. .

రాయి, చెక్క, లోహము, ఇసుక, మణి, విలేపనము (గంధాది) అనువాటితో ప్రతిమను చేయవచ్చును. ప్రతిమ కాగితము పై గీసినది, లేదా  మనస్సులో భావనారూపము కూడ కావచ్చును. ఈ విధముగా ప్రతిమ ఎనిమిది రకములుగానున్నదని మహాత్ములు చెప్పిరి. .

ఓ ఉద్దవా! ప్రాణశక్తిస్వరూపుడగు ఈశ్వరుని ప్రకృష్టమైన స్థానమే ప్రతిమ. అది కదిలేది (సొలగ్రామాది), కదలనిది (మందిరములో విగ్రహము) అని రెండు రకములు. అచలమును పూజించే సందర్బములో ఆవాహన, ఉద్వాసన ఉండవు.

చలప్రతిమ విషయములో ఆవాహన-ఉద్వాసనలు రెండు వికల్పము. కాని, ఇసుకతో చేసిన ప్రతిమయందు ఈ రెండు తప్పనిసరి. గంధాదులతో చేసినదాని యందు స్నానము ఉండదు. దానికి, కాగితము పై గీసిన బొమ్మకు చుట్టూ నీటిని చల్లవలెను.

కపటము లేని భక్తునకు చెందిన ప్రతిమయందు దేశకాలములకనురూపముగా లభించిన శాస్త్రవిహితమైన ద్రవ్యములతో నన్ను ఆరాధించవలెను. హృదయములో కూడ భావనతో నన్ను ఆరాధించవలెను (మానసపూజా).

ఓ ఉద్దవా! ప్రతిమయందు ఆరాధనలో స్నానము, అలంకరించుట శ్రేష్టము. విలేపనముతో చేసిన ప్రతిమయైతే పురుషాదీతత్త్వములను ఆయా మంత్రములతో న్యాసము చేయవలెను. అగ్నియందు నేతితో తడిపిన హవిస్సును హోమము చేసి, నీటియందైతే తర్పణములతో నన్ను ఆరాధించవలెను. సూర్యునియందైతే అర్ఘ్యము, ఉపస్థానము అనువాటితో నన్ను పూజించవలెను. ఇవి శ్రేష్ఠమైన ఆరాధనలు.

భక్తుడు శ్రద్ధతో సమర్పించినది నీరైనా నాకు చాల ప్రియము. ఇక గంధము, ధూపము, పువ్వులు, దీపము, నైవేద్యము అనువాటిని శ్రద్దతో సమర్పిస్తే ప్రీతికరమగునని వేరుగా చెప్పవలయునా? భక్తుడు కానివాడు అధికమును సమర్పించినా నాకు ప్రీతికరము కాదు.

మరియు, సాధకుడు శుచియై ముందుగా సామగ్రిని సమకూర్చుకొని దర్భాసనముపై తూర్పు లేక ఉత్తరముఖముగా ప్రతిమకు అభిముఖముగా కూర్చుండి పూజించవలెను.

సాధకుడు తాను అంగన్యాసాదులను చేసి ప్రతిమకు మంత్రన్యాసము చేసి నిర్మాల్యమును తొలగించి మెల్లగా తుడిచి శుద్ది చేయవలెను. పూర్ణకుంభమును, ప్రోక్షణ ఇత్యాదుల కొరకై పెట్టుకున్న నీటి పాత్రను గంధాదులతో యథావిధిగా సంస్కరించవలెను.

ఆ ప్రోక్షణీపాత్రలోని నీటితో దేవపూజ చేసే స్థానమును, పూజాద్రవ్యములను, తనను ప్రోక్షించి, మూడు పాత్రలను నీరు నింపి ఆయా గంధాది ద్రవ్యములతో పూజించవలెను.

పూజ చేయువాడు పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయముల కొరకు మూడు పాత్రలను క్రమముగా హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్ అని అభిమంత్రించి, అన్నింటినీ గాయత్రీమంత్రముతో కూడ అభిమంత్రించవలెను.

సాధకుడు దేహమును ప్రాణాయామముతో మరియు ఉపాసన అనే అగ్నితో శుద్దము చేయవలెను. ఆ దేహములో హృదయమనే పద్మమునందు నాయొక్క సర్వశ్రేష్ఠమైన సూక్ష్మతత్త్వమును జ్యోతి రూపముగా ధ్యానించవలెను. జీవుడు ఈ నా సూక్ష్మతత్త్వములోని అంశయే. సిద్దులు ఓంకారముయొక్క అంతమునందు శబ్దరహితముగా ధ్యానించే తత్త్వమిదియే.

ఆత్మరూపమగు ఆ చైతన్యతత్త్వము దేహమునంతనూ వ్యాపించి ఆవేశించియుండును. దానిని చక్కగా ధ్యానించి ప్రతిమ మొదలగువాటియందు ఆవాహన చేసి స్థాపించవలెను. నా ప్రతిమయందు అంగన్యాసము చేసి నన్ను చక్కగా పూజించవలెను. .

పాద్యము, ఆచమనము, అర్ఘ్యము, స్నానము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యములు ఆసనముయొక్క నాలుగు కోణములు. విమలా, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగా, ప్రహ్వీ, సత్యా, ఈశానా, అనుగ్రహా అనే తొమ్మిది శక్తులతో ఆసనమును కల్పించవలెను.

ఆ ఆసనముపై ఎనిమిది దళములు, దుద్దు, కింజల్కములతో గొప్పగా ప్రకాశించే పద్మమును కల్పించవలెను. దానియందు నన్ను వేద తంత్రములు రెండింటితో పూజించి భుక్తిముక్తులను రెండింటిని పొందును.

తరువాత సుదర్శనమనే చక్రమును, పాంచజన్యమనే శంఖమును, కౌమోదకీ అనే గదను, నందనమనే కత్తిని, బాణములను, ' నాగలిని, రోకలిని, కౌస్తుభమాణిక్యమును, వైజయంతీమాలను, శ్రీవత్సమనే పుట్టుమచ్చను కూడ పూజించవలెను.

నందుడు, సునందుడు, ప్రచండుడు, చండుడు, మహాబలుడు, బలుడు, కుముదుడు, కుముదేక్షణుడు' అనే పార్షదులను ఎనిమిది దిక్కులయందు, గరుడుని ఎదుట పూజించవలెను.

దుర్గాదేవిని, వినాయకుని, వ్యాసుని, విష్వక్సేనుని, తనకు యెదురుగా గురుదేవుని, ఇంద్రాది దేవతలను (తూర్పు మొదలైన) ఆయా స్థానములలో ఆవాహన చేసి, అర్ఘ్యము-ఆచమనము మొదలగువాటితో పూజించవలెను.

సంపద ఉన్నచో ప్రతినిత్యము గంధము, వట్టివేరు, కర్పూరము, కుంకుమపువ్వు, అగురు అనువాటిచే సుగంధితమైన నీటితో మంత్రపూర్వకముగా అభిషేకించవలెను.

సువర్ణం ఘర్మం -- అనే అనువాకము, జితం తే -- అనే మహాపురుషవిద్య, పురుషసూక్తము, రాజనము, రౌహిణము మొదలగు సామలు అనువాటిని పఠిస్తూ అభిషేకించవలెను.

పుష్పమాలలు, గంధమునలదుటలచే; సప్రేమ - ప్రేమపూర్వకముగా; యథా-ఉచితమ్ - తగిన విధముగా; అలంకుర్వీత - అలంకరించవలేను. నా భక్తుడు నన్ను వస్త్రములు, యజ్ఞోపవీతము, ఆభరణములు, పత్రములు, పుష్పమాలలతో ప్రేమపూర్వకముగా తగిన విధముగా అలంకరించి, తిలకములను దిద్ది గంధమునలదవలెను.

పూజ చేయువాడు పాద్యము, ఆచమనీయము, గంధము, పువ్వులు, అక్షతలు, ధూపము, దీపము, నైవేద్యములను నాకు శ్రద్ధతో ఈయవలెను.

విభవమున్నచో బెల్లము, పాయసము, నెయ్యి, వెన్న, చక్కిలములు, అప్పములు, మోదకము (లడ్డు) లు, హల్వా, పెరుగు, పప్పు, కూరలను నైవేద్యము పెట్టవలెను.

పర్వదినమునాడు పళ్లను తోముట, నలుగు పెట్టుట, తల అంటుట, అభి షేకము, భక్ష్యభోజ్యములు, పాటలు, నాట్యము, వాద్యములు మొదలగువాటిని సమర్పించవలేను. వీలుంటే ప్రతిదినము చేయవలెను.

అగ్నికుండమును యథావిధిగా నిర్మించవలెను. దానికి చుట్టూ మేఖల, గొయ్యి, వేది ఉండవలెను. దానిలో అగ్నిని ఉంచి చేతినడ్డము పెట్టి గాలి ఊది ప్రజ్వరిల్లజేయవలెను. చేతితో చుట్టూ కట్టెలను దగ్గరకు చేర్చవలెను.

తరువాత అగ్నికుండము చుట్టూ దర్భలను వేసి నీటిని ప్రోక్షించవలెను. యథావిధిగా అస్వాధానకర్మ (వ్యాహృతులతో సమిధలనర్పించుట) నునెయ్యి మొదలగు ద్రవ్యములను అగ్నికి ఉత్తరముగా పెట్టి, ప్రోక్షణీ త్రలోని నీటితో వాటిని ప్రోక్షించి, అగ్నియందు నన్ను ధ్యానించవలేను.

పుటము పెట్టిన బంగారము వలె గొప్పగా ప్రకాశించే నన్ను ధ్యానించ వలెను. శాంతుడనైన నేను పద్మకేసరములవంటి వస్త్రములను దాల్చి, నాలుగు చేతులలో శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చెదను.

ప్రకాశించే కిరీటము, హస్తాభరణములు, మొలత్రాడు, శ్రేష్ఠమైన భుజపురులు, వక్షఃస్థలము పై శ్రీవత్సమనే పుట్టుమచ్చ, ప్రకాశించే కౌస్తుభమాణిక్యము, వనమాల గల నన్ను ధ్యానించవలెను.

వివేకియగు సాధకుడు నన్ను ధ్యానము చేసి పూజించి నేతితో అభిఘారము చేయబడిన సమిధలను అగ్నిలో హోమము చేయవలెను. తరువాత ఆఘారములు (ప్రజాపతయే స్వాహా, ఇంద్రాయ స్వాహా, అని నేతితో ధారగా చేసే ఆహుతులు), ఆజ్యభాగములు (అగ్నయే స్వాహా, సోమాయ స్వాహా, అని కేవలము నేతితో చేసే ఆహుతులు) అనే జంట హోమములను చేయవలెను. తరువాత నేతితో తడిపిన హవిస్సును మూలమంత్రము (ఓం నమో నారాయణాయ) తో హోమము చేయవలెను. పురుషసూక్తములోని పదునారు ఋక్కులతో ప్రతి పర్యాయము హవిస్సును గ్రహించి హోమము చేయవలెను. తరువాత ధర్మాయ స్వాహా ఇత్యాది మంత్రములతో ధర్మాది దేవతలకు క్రమమును తప్పకుండా హోమము చేయవలెను. తరువాత అగ్నయే స్విష్టకృతే స్వాహా, అనే స్విష్ట కృత (మనకు అభీష్టమును కలిగించే అగ్ని) హోమమును చేయవలెను.

సాధకుడు శ్రీహరిని పూజించి నమస్కరించి పార్షదులకు నైవేద్యమునిడవలెను. నారాయణరూపుడగు పరబ్రహ్మను ధ్యానిస్తూ మూలమంత్రము (ఓం నమో నారాయణాయ) ను జపించవలెను.

నైవేద్యము తరువాత ఆచమనమునీయవలెను. నైవేద్యము పెట్టగా మిగిలినదానిని విష్వక్సేనునికి సమర్పించవలెను. పరిమళము గల . తాంబూలము, ఏలకులు మొదలైన ముఖవాసము (నోటికి సుగంధమును కలిగించేది) ను సమర్పించి పుష్పాంజలిని ఈయవలెను.

నా లీలలను గానము చేస్తూ చేపూ నాట్యము చేస్తూ అభినయించ వలెను. నా గాథలను ఏంటూ ఇతరులు' వీనునట్లు చేయవలెను. ఈ విధముగా గంట సమయమును ఉత్సవముతో క్షణము వలె గడుపవలెను.

పురాణములలోని గొప్ప స్తవములతో, ఋషిప్రోక్తములు కాని తక్కువ స్తోత్రములతో కూడ స్తుతించవలెను. ఓ భగవానుడా! ప్రసన్నుడవు కమ్ము, అనీ సాష్టాంగనమస్కారమును చేయవలెను. .

సాధకుడు నా కుడికాలిని ఎడమ చేతితో, ఎడమ కాలిని కుడి చేతితో పట్టుకొని తలను పాదముల వద్ద ఉంచి నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను - ఓ ఈశ్వరా! మృత్యువు అనే తిమింగలము గల సంసారమనే సముద్రము వలన భయపడి నేను నిన్ను శరణు జొచ్చినాను. నన్ను కాపాడుము,

ఈ విధముగా ప్రార్థించి ప్రసాదపుష్పమును నేనిచ్చినట్లే భావించి తలపై పెట్టుకొనవలెను. తరువాత, ఉద్వాసన చెప్పే సందర్భమైతే, ఆ ప్రతిమయందు భావనచే ఉంచబడిన జ్యోతిని తిరిగి . తన హృదయమునందు భావనచే విలీనము చేయవలెను.

సాధకునకు ప్రతిమ, సూర్యుడు మొదలగువాటిలో ఎప్పుడు దేనిపై శ్రద్ద ఉండునో, దానియందు నన్ను పూజించవచ్చును. ఏలయనగా, సకలమునకు ఆత్మ (సారము) అను నేను సకలప్రాణులయందు, సాధకునియందు కూడ ఉన్నాను.

మానవుడీ విధముగా వేదమునందు, తంత్రములయందు చెప్పబడిన యాయోగమార్గములచే పూజిస్తూ, నానుండి ఇహపరములు రెండింటియందు అభీష్టమైన సిద్ధిని పొందును.

భక్తుడు గట్టి మందిరమును కట్టించినా ప్రతిమను చక్కగా ప్రతిష్ఠించవలెను. పూదోటలను పెంచవలెను. పూజలు, రథయాత్రలు, ఉత్సవములు అనువాటికి వ్యవస్థలను చేయవలెను.

ప్రతిదినము మరియు గొప్ప పర్వదినములయందు పూజ మొదలగునవి నిరాటంకముగా కొనసాగుటకై పొలములు, బజారులు, నగరములు, గ్రామములను దానము చేయు వ్యక్తి నాతో సమానమైన ఐశ్వర్యమును పొందును.

సాధకుడు ప్రతిమను ప్రతిష్ఠించి సకలభూమి పై ప్రభుత్వమును, మందిరమును కట్టి ముల్లోకముల ఆధిపత్యమును పొందును. పూజ, ఉత్సవములు మొదలగువాటిని చేసి బ్రహ్మలోకమును పొందును. ఈ మూడింటిని చేయువాడు నాతో సమానుడగును.

ఎవడైతే ఫలాసక్తి లేకుండా నన్నీ విధముగా పూజించునో ఆతడు భక్తియోగమును పొంది, దానిచే నన్నే పొందును.

ఎవడైతే తాను కాని, ఇతరులు కాని, దేవాలయనిర్వహణ కొరకు గాని, బ్రాహ్మణుని జీవిక కొరకు గాని ఇచ్చిన ఆస్తిని అపహరించునో, అట్టివాడు పదికోట్ల సంవత్సరములు నిరంతరముగా మలములోని క్రిమియై పుట్టును.

ఒక పనిని చేయువానికి, చేయించువానికి, సహకరించువానికి, అనుమోదించువానికి కూడ ఆ కర్మలో భాగముండుటచే, మరణించిన తరువాత దాని ఫలములో కూడ భాగము ఉండును. కర్మలో అధికమగు భాగమున్నచో, ఫలము కూడ అధికముగా ఉండును.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో క్రియా యోగమును నిరూపించే

ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).