శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
17 - వివిధధర్మముల నిరూపణ
గొప్ప బాహువులు గల ఓ శ్రీపతిప్రభూ! పూర్వము నీవు ఆ హంసరూపముతో ఏ విధముగానైతే బ్రహ్మదేవుని కొరకు ధర్మమును చెప్పితివో, అది చెప్పుము. ఉత్కృష్టమగు ఆ ధర్మము సుఖప్రదము.
శత్రువులను కృశింపజేసే ఓ శ్రీకృష్ణా! నీవు పూర్వము ఉపదేశించిన ఆ ధర్మము చాల పెద్ద కాలము తరువాత ఇప్పుడు మానవలోకములో ఇంచుమించు లుప్తమైనది. భవిష్యత్తులో కూడ ఉండబోదు.
ఓ అచ్యుతా! భూలోకమునందు గాని, విద్యలు రూపు దాల్చి ఉండే బ్రహ్మదేవుని సభయందు గాని, ధర్మమును బోధించి ఆచరించి రక్షించేవాడు నీకంటే మరియొకడు లేడు.క్షేమాయ - కల్యాణము కొరకు, సనాతనాన్ - సనాతనములైన, ధర్మాన్ - ధర్మములను, ఆహ - చెప్పెను.
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను -- తన భక్తులలో ప్రముఖుడగు ఉద్దవుడీ విధముగా ప్రశ్నించగా, ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రీతి జెంది, మానవుల కల్యాణము కొరకై సనాతనములైన ధర్మములను ఉపదేశించెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఓ ఉద్ధవా! నీ ధర్మబద్ధమైన ప్రశ్న వర్ణాశ్రమధర్మములను పాలించే శీలము గల మానవులకు మోక్షసాధనము. నీవు దానిని నానుండి తెలుసుకొనుము.
కల్పాదియందలి కృతయుగమునందు జనుల (ఒకే ఒక) వర్ణమునకు హంస అని పేరు. జనులు పుట్టుకతోనే కృతార్థులుగా నుండెడివారు. కావుననే, ఆ యుగమునకు కృతయుగమని పేరు.పుట్టినవారు; యే - ఎవరైతే; ఆల్మాచారలక్షణాః - తమ శీలము (ప్రవృత్తి) జ్ఞాపకముగా గలవారు.
విరాట్ పురుషుని నోరు, చేతులు, తొడలు, పాదములనుండి క్రమముగా బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ప్రకటమైరి. శీలము (ప్రవృత్తి) యే వారి వర్ణమునకు జ్ఞాపకము.
నా హృదయమునుండి బ్రహ్మచర్యము, నడుమునుండి గార్హ స్థ్యము, వక్షఃస్థలమునుండి వానప్రస్థము, తలనుండి సన్న్యాసము ప్రకటమైనవి.
వర్ణాశ్రమములకు చెందిన మానవుల స్వభావములు పుట్టిన స్థానమునకు తగ్గట్లుగా -- క్రింది స్థానముచే తక్కువదిగను, పై స్థానముచే గొప్పదిగను -- ఉండెను..
శాస్త్రవాక్యములయందు విశ్వాసము, దానమునందు నిష్ణ, ఇతరులను మోసగించకుండుట, వేదవేత్తలను సేవించుట, ధనమును ప్రోగుచేయు నప్పుడు చాలు అనే చిన్న తలంపు లేకుండుట అనేవి వైశ్యస్వభావములు.
వేదవేత్తలకు, గోవులకు, దేవతలకు కూడ కపటము లేకుండా సేవ చేయుట, దానిచే లభించిన దానితో తృప్తి పడుట శూద్రస్వభావములు.
శౌచము లేకుండుట, అసత్యము, చౌర్యము, నాస్తికుడై యుండుట, నిష్కారణవైరము, భోగములయందు కోరిక, కోపము, దురాశ అనునవి వర్ణాశ్రమధర్మహీనుల స్వభావములు.
ఆతడు దంతధావనము, వస్త్రములను ఉదుకుట అనువాటిని అలంకారము కొరకు చేయరాదు. ఆతని ఆసనము ఎర్రగా ఉండరాదు.
స్నానము, భోజనము, హోమము, జపము, విసర్జనములను చేయు నప్పుడు బ్రహ్మచారి మౌనమును పాటించవలెను. గోళ్లను, జుట్టును, బాహు-ఊరుమూలములయందలి రోమములతో సహా తీసివేయరాదు.
బ్రహ్మచర్యము ఒక వ్రతము. బ్రహ్మచారి ఒకప్పుడైననూ బుద్ధి పూర్వకముగా రేతస్సును సన్నము చేయరాదు. రేతస్సు స్కన్న మైనచో స్నానము చేసి, ప్రాణాయామమును చేసి, గాయత్రిని జపించవలెను. .
అనుమతితో ఇతరము (వస్తాదికము) ను దేనినైననూ సావధానుడై (చాపల్యము లేకుండా) వినియోగించవలెను.
ఆచార్యుని బ్రహ్మచారి తక్కువవాడు వలే సేవ చేయవలెను. ఆచార్యుడు వెళ్లుచున్నప్పుడు చాల దూరము కాకుండా వెనుక నడువవలెను. ఆచార్యుడు పరుండినప్పుడు చాల దూరము కాకుండా పరుండవలెను. ఆయన కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు చాల దూరము కాకుండా చేతులు జోడించి నిలువవలెను.
బ్రహ్మచారి అఖండమైన బ్రహ్మచర్యవ్రతమును ధరించి భోగములను విడిచి పెట్టి, విద్య సమాప్తమయ్యే వరకు ఈ విధమైన నడవడితో గురుకులములో నివసించవలెను.
గృహస్థుడు కానివాడు (బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్న్యాసి) యువతులను చూడరాదు; వారిని స్పృశించరాదు; వారితో కబుర్లాడరాదు; వారితో పరిహాసము, సంకేతము మొదలగువాటిని విడిచి పెట్టవలెను. సంభోగములోనున్న పశుపక్ష్యాదులకు ఎదురు వెళ్ల(చూడ)రాదు.
వంశమునానందింపజేసే ఓ ఉద్దవా! బాహ్య-ఆంతరశౌచము, ఆచమనము, స్నానము, సంధ్యోపాసనము, ఋజుస్వభావము, తీర్థములను సేవించుట, జపము, స్పృశించకూడనివాటిని స్పృశించకుండుట, తినకూడనివాటిని తినకుండుట, మాటలాడకూడని దుష్టులతో మాటలాడకుండుట, సకలప్రాణులయందు నన్ను (ఈశ్వరుని) దర్శించుట, మనస్సు-వాక్కు-దేహములను నియంత్రించుకొనుట అనేవి అన్ని ఆశ్రమములవారు పాటించదగిన ధర్మములు.
ములలో క్రిందదానినుండి పైదానికి వెళ్లవచ్చును. నా ఏకాంతభక్తుడు ఆశ్రమ హీనుడుగా ఉండరాదు, పై ఆశ్రమమునుండి క్రిందిదానికి వెళ్లరాదు.
గృహస్థుడు కాగోరిన బ్రహ్మచారి తనకు తగిన అమ్మాయిని వివాహము చేసుకొనవలెను. దోషములు లేని ఆ అమ్మాయి సమానవర్ణమునకు చెందినది, వయస్సులో చిన్నది కావలెను. ఆ తరువాత క్రమముగా తరువాతి వర్ణముల అమ్మాయిని వివాహము చేసుకొనవచ్చును.
ఉపనీతులందరికి యజ్ఞ-వేదాధ్యయన-దానములకు యోగ్యత గలదు. కాని, దానమును స్వీకరించుట, వేదమును బోధించుట, యజ్ఞమును చేయించుట అనువాటికి బ్రాహ్మణునకు మాత్రమే యోగ్యత గలదు.
పొలములలో, బజారులో జారి పడిన గింజలతో రోజును గడిపివేస్తూ సంతుష్టమైన చిత్తము గల ఆ బ్రాహ్మణుడు గొప్ప, నిష్కల్మషమైన ధర్మమును సేవించు చున్నాడు. ఆతడు చిత్తమును నాయందే సమర్పించి, అధికమగు సంసారాసక్తి లేకుండా ఇంటిలోనే ఉంటూనే, మోక్షమును పొందును.
దారిద్యముతో కష్టపడుతూ నాయందు ఏకాంతభక్తి గల వేదవేత్తను ఎవరైతే గట్టెక్కిస్తారో, వారిని నేను ఆపదలనుండి, నావ సముద్రమునుండి వలె, ఉద్దరించెదను.
గజేంద్రుడు తన దండులోని ఏనుగులను కాపాడుతూ తనను కాపాడు కొనును. అదే విధముగా, రాజు ధీరుడై ప్రజలను తండ్రివలె ఆపదలనుండి గట్టెక్కిస్తూ, తనను కూడ తానే తెలివితేటలతో ఉద్ధరించుకొనవలెను.
క్షత్రియుడు ఆపద వచ్చినప్పుడు వైశ్యవృత్తితో గాని, వేటతో గాని, బ్రాహ్మణుడు వలె అధ్యాపనముచే గాని పొట్టపోసుకొనవలెను. అంతేగాని, అధములను ఎన్నడైననూ సేవించరాదు.
ఆపదలో వైశ్యుడు శూద్రుల పనితో, శూద్రుడు ఆపదలో చాపలల్లుట మొదలగు చేతిపనులవారి వృత్తితో పొట్ట పోసుకొనవలెను. ఆపద తొలగిన తరువాత నిందించదగిన వృత్తితో జీవికను సంపాదించకూడదు.
గృహస్థుడు పంచయజ్ఞములను చేయవలెను. వేదాధ్యయనము బ్రహ్మయజ్ఞము. దేవతలు, పితృదేవతలు, ప్రాణులు, మనుష్యులు కూడ నా రూపములే. కావున, ప్రతిదినము దేవతలను హోమముతో (దేవయజ్ఞము), పితృదేవతలను పిండదానముతో (పితృయజ్ఞము), ప్రాణులను ఆహారమునిచ్చి (భూతయజ్ఞము), మనుష్యులను అన్నదాన ముతో (మనుష్యయజ్ఞము), తన విభవమునకు తగ్గట్లుగా ఆరాధించవలెను.
సంతానము, భార్య, ఆప్తులు, బంధువులతో జీవుని కలయిక (సత్రములో) బాటసారుల కలయిక వంటిది. ఏనాటి నిద్రలో ఆనాటి స్వప్నములోని బాంధవ్యములు వలే, దేహముతో బాటే వీరందరితో వియోగము తప్పదు.
సాధకుడు ఈ విధముగా (భోగములు నశ్వరములని) విచారము చేస్తూ ఇంటిలో అతిథివలే నుండవలెను. అహంకారమమకారములు లేని గృహస్థుడు ఇంటియందు ఆసక్తుడు కారాదు. అట్టివాడు జీవన్ముక్తుడు.
గృహస్థుడు సంతానమును పొంది భక్తిపూర్వకముగా గృహస్థాశ్రమకర్మలతో నన్ను ఆరాధిస్తూ గృహస్థుడుగనే ఉండవచ్చును. లేదా, వానప్రస్థుడు కాని, సన్న్యా సి కాని కావచ్చును.
ఈ విధముగా ఈ గృహస్థుని హృదయము సంసారవాసనలచే విక్షిప్తమై వ్యామోహితమగును. ఆతడు భోగములయందు తృప్తి లేక వారినే (భార్యాపుత్రాదులనే) తలపోస్తూ మరణించి, వివేకజ్ఞానము సుతరాము లేని పశుపక్ష్యాదిజన్మను పొందును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో
వివిధధర్మములను నిరూపించే పదునేడవ అధ్యాయము ముగిసినది.
