శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

16 - భగవానుని విభూతులు

ఉద్దవుడిట్లు పలికెను --- ఆద్యంతములు లేని స్వతంత్ర పరబ్రహ్మ సాక్షాత్తుగా నీవే. సకలపదార్థములకు, ప్రాణులకు కూడ రక్షణ, జీవనము నీవే. అవి అన్నీ నీనుండి పుట్టి, నీయందు విలీనమగుచున్నవి.

ఓ భగవానుడా! నీవు పెద్ద-చిన్నయైన సకలప్రాణులలో ఉన్నావు. అంతఃకరణమును శుద్దము చేయనివారలు నిన్ను తెలియజాలరు. వేదవేత్తలు నిన్ను యథాతథముగా ఉపాసించేదరు.

మహర్షులు నిన్ను ఏయే భావములయందు భక్తితో ఉపాసించి మోక్షమును పొందెదరో, ఆ విషయమును నాకు చెప్పుము.

ప్రాణులను సృష్టించే ఓ దేవా! నీవు ప్రాణుల అంతరాత్మవై ప్రాణులను సాక్షి యై చూస్తూ ప్రాణుల మధ్యలోనే లీలను చేయుచుందువు. కాని, నీ మాయచే మోహమును పొందిన ప్రాణులు నిన్ను కనజాలవు.

గొప్ప మహిమ గల ఓ దేవా! నీవు భూలోకమునందు, దేవలోకమునందు, రసాతలమునందు సకలదిక్కులలో నీ మహిమలో కూడిన విభూతులను ప్రకటించితివి. వాటినన్నింటినీ సోకు చెప్పుము. నీ పద్మమువంటి పొదము గంగాది తీర్థములకు ఆలవాలము. అట్టి నీ పొదమునకు వేను నమస్కరిస్తున్నాను.

శ్రీకృష్ణ భగవానుడు పలికెను - ఉద్దవా! ప్రశ్న వేసే విధానము తెలిసిన పొరిలో నీవు దిట్టవు. కురుక్షేత్రములో శత్రువులతో యుద్ధమును చేయ గోరిన అర్జునుడు కూడ ఈ విధముగానే దీనిని గూర్చి నన్ను ప్రశ్నించెను.

సొమాన్యజనులవలే అర్జునుడు కూడ తాను చంపుపొడననియు, ప్రతిపక్షమువాడు చంపబడుడనియు తలచెను. రాజ్యము కొరకై బంధువుల సంహారించుట అధర్మమనియు, ఏవగించుకొనదగిన పని అనియు తలచి ఆతడు ఆ యుద్ధమునుండి వెనుదిరిగెను.

అప్పుడా పురుషశ్రేష్ఠునకు నేను యుద్ధముయొక్క అగ్రమునందు యుక్తియుక్తముగా బోధించితిని. ఆతడు నన్ను నీవు వలెనే ప్రశ్నించెను.

ఓ ఉద్దవా! ఈ ప్రాణులలో అంతర్యామినై వారి హితమును నేను సమకూర్చెదను. సకలప్రాణుల ఆత్మ స్వరూపము) నేనే. సకలప్రాణులు నానుండి పుట్టి, నాయందు మనుగడ సాగించి, నాలో విలీనమగును. కావున, నేనే సకలప్రాణుల రూపముగానున్నాను.

గతిశీలపదార్థముల గతి (జ్ఞానవంతుల జ్ఞానము) నేనే. తన వశము చేసుకొనువారీలో కాలము నేనే (ప్రభువులను కూడ కాలము తన వశము చేసుకొనును). సత్త్వరజస్తమోగుణముల సామ్యావస్థ (అవ్య క్తము) నేనే. ఇంతేగాక, ఆకోశాది పదార్థముల శబ్దాదీసహజగుణము నేనే.

సత్త్వము మొదలైన గుణములు గల తత్త్వములలో నేను క్రియాశక్తి ప్రధానమగు సూత్రాత్మను. పెద్దవాటిలో జ్ఞానశక్తిప్రధానమగు మహత్తత్త్వము నేనే. సూక్ష్మమైన తత్త్వములలో జీవతత్త్వము నేనే. జయింప శక్యము కానిపోటిలో మనస్సు నేనే.

వేదములను బోధించువారిలో బ్రహ్మదేవుడను, మంత్రములలో అకార-ఉకారమకారముల ముప్పేటయగు ఓంకారము, అక్షరములలో ఆకారము, ఛందస్సులలో మూడు పాదముల గాయత్రి నేనే.

సకలదేవతలలో ఇంద్రుడు, వసువులలో దేవతలకు హవిస్సును గొనిపోయే అగ్ని, అదితిపుత్రులలో విష్ణువు (సూర్యుడు), రుద్రులలో శివుడు (కంఠము నలుపు, ఇతరము యెరుపు) నేనే.

బ్రహ్మర్షులలో భృగువు, రాజర్షులలో స్వాయంభువమనువు, దేవర్షులలో నారదుడు, పాలిచ్చే ఆవులలో కామధేనువు నేనే.

సిద్దుల నాయకులలో కపిలుడు, పక్షులలో గరుడుడు, ప్రజాపతులలో దక్షుడు, పితృదేవతలలో అర్యముడు నేనే.

ఓ ఉద్దవా! రాక్షసులలో రాక్షసప్రభుడగు ప్రహ్లాదుడు నేనే. యక్షులకు, రాక్షసులకు ప్రభుడు, ధనాధిపతి అగు కుబేరుడు, నక్షత్రములకు, చెట్టుచేమలకు ప్రభుడగు చంద్రుడు నేనేనని తెలియుము.

గొప్ప యేనుగులలో ఐరావతము, మండుతూ ప్రకాశించేవాటిలో సూర్యుడు, మానవులలో మహారాజు నేనేనని తెలియుము. జలజంతువులకు ప్రభుడగు వరుణుడు కూడ నేనేనని తెలియుము.

గుర్రములలో ఉచ్చైశపసమనే ఇంద్రుని గుర్రము, లోహములలో బంగారము, శిక్ష వేయువారిలో యముడు, సర్పములలో వాసుకి నేనే.

పాపమునెరుంగని ఓ ఉద్దవా! గొప్ప నాగులలో ఆది శేషుడు, కొమ్మలు గల జంతువులలో మృగరాజగు సింహము, కోరలు గలవాటిలో మృగరాజగు కృష్ణపారమృగము, ఆశ్రమములలో నాల్గవదియగు సన్న్యాసము, వర్ణములలో మొదటిదగు బ్రాహ్మణ్యము నేనే.

ప్రవహించే తీర్థములలో గంగ, సరస్సులలో సముద్రము, ఆయుధములలో ధనుస్సు, ధనుస్సు పట్టినవారిలో త్రిపురాసురులను సంహరించిన శివుడు నేనే.

నివాసస్థానములలో మేరుపర్వతము, చేరుట కఠినమైనవాటిలో హిమ వత్పర్వతము, చెట్లలో రావి చెట్టు, పంట మొక్కలలో యవలు (బార్లీ) నేనే.

పురోహితులలో వసిష్ఠుడు, వేదమునందు నిష్ఠ గలవారిలో బృహస్పతి, సకల సేనానాయకులలో కుమారస్వామి, సన్మార్గప్రవర్తకులలో స్వయంభువుడగు పూజనీయ బ్రహ్మదేవుడు నేనే.

యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము (వేదమును అధ్యయనము చేసి బోధించుట), వ్రతములలో అహింసావ్రతము నేనే. శుద్ధము చేయువాటిలో పొయువు, అగ్ని, సూర్యుడు, నీరు, వేదవేత్తయొక్క వాక్కు అనే రూపములలోనుండి శుద్ది చేయువాడను నేనే.

యమనియమాసనప్రాణాయామప్రత్యాహారధారణాధ్యానసమాధులనే ఎనిమిది యోగాంగములలో చిత్తవృత్తినిరోధమనే సమాధి నేనే. విజయమును పొందగోరువారికి రాజనీతి (పరస్పరవిచారము) నేనే. నేర్పులలో ఆత్మానాత్మవివేకజ్ఞానము నేనే.

ఆత్మఖ్యాతి (బాహ్యమునందలి ఆల్చిప్పయందు చిత్తసంస్కార మైన వెండిని భ్రమచే ఆరోపించుట - క్షణికవిజ్ఞానవాదులు), అసత్-ఖ్యాతి (ఆల్చిప్పయందు సుతరాము లేని వెండిని కల్పించుట - శూన్యవాదులు), అఖ్యాతి (ఆల్చిప్ప-బుద్ధికి, వెండి-బుద్ధికి తేడా తెలియక భ్రమ పడుట - కర్మమీమాంసకులు), అన్యథాఖ్యాతి (ఆల్చిప్పయందు మ రెక్కడో ఉన్న వెండిని ఆరోపించుట - నైయాయికులు), అనిర్వచనీయఖ్యాతి (మాయాకార్యమైన అవిద్యచే ఆల్చిప్పయందు ఏ విధమైన యుక్తికి అందని వెండియొక్క ఆరోపము - వేదాంతులు) అనే వాదములలో ఎన్నటికీ తేలని సంశయము నేనే.

స్త్రీలలో శతరూప, పురుషులలో స్వాయంభువమనువు, మహర్షులలో నారాయణ మహర్షి, బ్రహ్మచారులలో సనత్కుమారుడు నేనే.

ధర్మములలో సన్న్యాసము, అభయస్థానములలో అంతర్నిష్ట (ఆత్మనిష్ట) నేనే అభిప్రాయమును దోచే ఉపొయములలో సత్యప్రియ వచనము, మౌనము శ్రేష్ఠములు. అవి నేనే. సగము పురుషుడుగను, సగము స్త్రీగను ప్రకటమైన ప్రజాపతి గొప్ప జంట. ఆ ప్రజాపతి నేనే.

ఎల్లవేళలా జాగరూకముగా ఉండుపొరిలో సంవత్సరము (సూర్యుడు), ఋతువులలో వసంతమనే ఋతువు (చైత్రవైశాఖములు), నేలలలో మార్గశీర్షమాసము (వేడి-చలి లేక సుఖకరము), నక్షత్రములలో అభిజిత్తు (ఉత్తరాషాఢ నాల్గవ పాదము, శ్రవణము మొదటి పాదము కలిసి) నేనే.

యుగములలో కృతయుగము, జితేంద్రియులలో అసితదేవలులు, వేద విభాగమును చేయువారిలో కృష్ణ ద్వైపాయనుడు, సూక్ష్మబుద్ధి గలవారిలో జ్ఞాని (ఆత్మానాత్మవివేకము గలవాడు) యగు శుక్రాచార్యుడు నేనే.

ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు గల మహాపురుషులలో శ్రీకృష్ణుడను నేనే. భగవద్భక్తులలో నీవు (ఉద్ధవుడు) నేనే. వానరులలో హనుమంతుడు నేనే. విద్యాధరులలో నా పాదస్పర్శచే ముక్తిని పొందిన సుదర్శనుడు నేనే.

రత్నములలో పద్మరాగము, అందమైనవాటిలో పద్మపు మొగ్గ, దర్భ మొక్కలలో కుశము, హోమద్రవ్యములలో ఆవు నేయి నేనే.

గంధర్వులలో విశ్వావసువు, అప్సరసలలో పూర్వచిత్తి, పర్వతములయొక్క స్థిరత్వము, పృథివియొక్క కేవలగంధము (పరిమళము మొదలైన వికారములు లేనిది) నేనే.

జలములయొక్క మధురమైన రసము, తేజశ్శాలురలో అగ్ని, సూర్య చంద్రనక్షత్రముల ప్రభ నేనే. ఆకాశముయొక్క మధురమైన శబ్దతన్మాత్ర, పరాపశ్యంతీమధ్యమావైఖరులనే శబ్దములలో మొదటిది నేనే.

బ్రాహ్మణభక్తులలో బలీ, శూరులలో అర్జునుడు నేనే. సకలప్రాణులు నా నుండియే పుట్టి, నాయందే మనుగడ సాగించి, సాయందే విలీనమగును.

ఈశ్వరుడను, జీవుడను నేనే. నేను లేకుండా ఎక్కడైననూ ఎప్పుడైననూ చేతనతత్త్వమేదియు లేదు. సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తి లేకుండా జడతత్త్వమేదియు లేదు. సర్వమునకు ఆత్మయై సర్వమై ఉన్న నేను లేకుండా సర్వము లేదు. 

నేను కొంత కాలము లెక్కించి పరమాణువుల సంఖ్యను తేల్చగలను. కాని, కోట్లాది బ్రహ్మాంములను సృష్టించే నేను నా విభూతులను మాత్రము అదే విధముగా లెక్కించి తేల్చలేను. 

తేజస్సు (ప్రభావము), సంపద, సౌందర్యము, కీర్తి, ప్రభువై యుండుట, తప్పు చేయుటకు సిగ్గు, ఆహ్లాదకరత్వము, భాగ్యము, బలము, సహనము, యథార్థజ్ఞానము అనేవి ఎక్కడెక్కడ ఉన్నా, అవి నా విభూతులే, 

ఏ సాధకుడైతే వాక్కును, మనస్సును బుద్ధితో బాగుగా నియంత్రించడో, వాని నియమనిష్ఠలు, తపస్సు, ఉపాసన, పచ్చి కుండలోని నీరు వలె నిశ్చయముగా జారిపోవును.

 

కావున (మనోనియమము లేని తపస్సు వ్యర్థము గనుక), సాధకుడు నేనే పరమలక్ష్యముగా గలవాడై నాయందలి భక్తితో నిండిన బుద్ధితో మనస్సును, వాక్కును, శ్వాసను నియంత్రించవలెను. దాని వలన సాధన పరిసమాప్తమై ఆతడు కృతకృత్యుడగును.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో

భగవానుని విభూతులను వర్ణించే

పదునారవ అధ్యాయము ముగిసినది.