శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
12 - సత్సంగ మహిమ
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- సకలసంగదోషములను పోగొట్టే సత్సంగము నన్నే విధముగా నిశ్చయముగా వశము చేసుకొనునో ఆ విధముగా, యోగము (మనోనిగ్రహము), సాంఖ్యము (ప్రకృతిపురుష వివేకము), ధర్మము (విహితకర్మానుష్టానము), వేదాధ్యయనము, తపస్సు, సన్న్యా సము, అగ్నిహోత్రాది కర్మలు, ప్రజోపకారకార్యములు, దానము, వ్రతములు, యజ్ఞము, మంత్రములు, తీర్థాటనము, శౌచము మొదలైన నియమములు, అహింస ఇత్యాది యమములు నన్ను వశము చేయ లేవు.
పాపమునెరుంగని ఓ ఉద్దవా! ఏలయనగా దితిపుత్రులగు అసురులు, రాక్షసులు, మృగములు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్దులు, చారణులు, యక్షులు, విద్యాధరులు, మానవులలో రజోగుణ తమోగుణ ప్రధానులగు వైశ్యులు, స్త్రీలు, అంత్యజులు, త్వష్ట యొక్క పుత్రుడగు వృత్రుడు, కయాధువు పుత్రుడగు ప్రహ్లాదుడు మొదలగువారు,
వృషపర్వుడు, బలి, బోణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హను మంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధారుడు, ధర్మవ్యాధుడు, కుబ్ద, గోకులమునందలి గోపికలు, యజ్ఞపత్నులు ఆయా యుగములలో అనేకులు ఇతరులు నా పదమును పొందినారు.
వారు అనేకవేదములను అధ్యయనము చేయలేదు, గొప్ప మహాత్ములను ఉపాసించలేదు, వ్రతములను తపస్సులను చేయలేదు. అయినా, సత్సంగము వలన వారు నన్ను పొందినారు.
ప్రయత్నశీలి కూడా నన్ను చిత్రనిరోధము, ప్రకృతిపురుష వివేకము, దానము, వ్రతములు, తపస్సు, యజ్ఞములు, శాస్త్రవ్యాఖ్యానము, వేదాధ్యయనము, సన్న్యాసములచే పొందలేకపోవును. ఎందుకంటే, గోపికలు మాత్రమే గాక, మోహితమైన బుద్ధి గల గోవులు, చెట్లు, పక్షులు, సర్పములు మొదలైన ఇతరప్రాణులు కూడ ఒక్క భక్తిచే అట్టి నన్ను తేలికగా పొంది కృతార్థులైరి. (సత్సంగము భక్తిని కలిగించును).
శ్వఫల్కుని పుత్రుడగు అక్రూరుడు నన్ను బలరామునితో సహా మథురకు తీసుకువెళ్లాను. మిక్కిలి గాఢమైన భక్తిచే అనురాగముతో నిండిన చిత్తములు గల గోపికలు అప్పుడు నా వియోగముచే తీవ్రమైన మనోదుఃఖముననుభవించిరే గాని, సుఖము కొరకు మరియొక ఉపాయమును ఆచరించలేదు.
ఉద్దవా! ప్రియతముడనగు నేను బృందావనములోనుండగా ఆ గోపికలు ఆయా రాత్రులను నాతో గూడి అరక్షణము వలె గడిపివేసిరి. కాని, నేను లేనప్పుడైతే వారికా రాత్రులు కల్పములవలె కన్పట్టెను.
సమాధియందు మహర్షులకు ఏమీ తెలియదు. అదే విధముగా, నాయందు ప్రేమచే కట్టివేయబడిన చిత్తము గల ఆ గోపికలకు తాము గాని, తమ దేహము గాని, ఇహలోక పరలోకములు గాని తెలియకుండెను. నదులు నామరూపములను విడిచి సముద్రములో ప్రవేశించినట్లుగా, వారు నాయందు లీనమైరి.
వందలు వేల అబలలు నా స్వరూపము తెలియకున్నా నన్ను రమింపజేసే జారునిగా తలచి నన్ను ప్రేమించిరి. వారు సంగము యొక్క ప్రభావముచే పరబ్రహ్మనగు నన్ను పొందిరి.
ఓ ఉద్ధవా! కావున, నీవు విధిని షేధములను, శ్రుతిస్మృతులను, ప్రవత్తినివృత్తులను, గృహస్థసన్న్యాసాశ్రమములను, వినవలసియున్న మరియు వినియున్న ధర్మములను ప్రక్కన బెట్టుము.
సకలప్రాణులలో ఆత్మరూపుడనైన నన్ను ఒక్కనిని మాత్రమే సర్వప్రకా రములుగా శరణు జొచ్చుము. సర్వము ఆత్మయేనని తెలియుము. ఏలయ న, నన్ను శరణు జొచ్చి నీవు సకలభయములనుండి విముక్తుడవగుదువు.
ఉద్ధవుడిట్లు పలికేను --- నీవు యోగేశ్వరులగు సనకాదులకు కూడ ఈశ్వరుడవు. నీ ఉపదేశమును వినుచున్న నాకు బుద్దియందలి సందేహము తొలగుట లేదు. దానిచే, (సర్వమును పరిత్యజించుట అనే విషయములో) నా మనస్సు భ్రమ పడుచున్నది.
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఆ ఈ అపరోక్ష పరమాత్మయే దేహముల యందు ప్రవేశించి ఇంద్రియముల ద్వారా అభివ్యక్తమగుచున్నాడు. నాదముతో కూడిన ప్రాణశక్తి (పరా) ఆ పరమాత్మయే. ఆ శక్తి హృదయములో ప్రవేశించి (పశ్యంతీ మనస్సుచే గ్రహించబడే సూక్ష్మవాక్కు (మధ్యమా) అగును. ఆ సూక్ష్మవాక్కే కంఠము ద్వారా ప్రకటమై వైఖరీ వాక్కు అగును. మాత్ర (ఉచ్చారణకాలము), ఉదాత్తాది స్వరములు, వర్ణములతో కూడిన ఆ స్థూలరూపమే పెద్ద శబ్దప్రపంచము.
కట్టెను గట్టిగా మథించినప్పుడు ఆకాశములో వేడిమి రూపములోనున్న అగ్ని చిన్నదిగా ఆవిర్భవించి, గాలి సహాయముతో పెరిగి, హవిస్సుచే బాగా ప్రజ్వరిల్లును. అదే విధముగా, నా అభివ్యక్తి యైన పరావాక్కు కూడా నిశ్చయముగా వేదరూపముగా విస్తరించుచున్నది.
ఇదే విధముగా మాటలాడుట, పని, నడక, విసర్జనము (కర్మేంద్రియవృత్తులు), ఆఘ్రాణించుట, రసము, చూపు, స్పర్శ, వినికిడి (జ్ఞానేంద్రియవృత్తులు), మనస్సు (సంకల్పములు), బుద్ధి (నిశ్చయము), అహంకారము, మహత్తత్త్వము (సమష్టి ప్రాణవిజ్ఞానశక్తి), సత్త్వరజస్తమోగుణముల వికారములు నా అభివ్యక్తియే.
సర్వమును ఉజ్జీవింపజేసే ఆ ఈ ఈశ్వరుడే సత్త్వరజస్తమోగుణము లకు ఆశ్రయము. ఆయనయే లోకపద్మము పుట్టిన స్థానము. ప్రకటము కాక ముందు ఆయన తప్ప రెండవది లేదు. మాయా శక్తిని ఆలింగనము చేసు కొని ఆయనయే జగత్కారణుడై, మాయాశక్తియొక్క విశ్లేషణముచే అనేక ప్రకారములై భాసించుచున్నాడు. విత్తులు పొలములో పడి పంట యైనట్లే.
వస్త్రము యొక్క ఉనికి దారముల విస్తారమునందే గలదు. అదే విధముగా, ఈ సకలజగత్తు పరమాత్మయందు పడుగు-పేకవలె ఉన్నది. కర్మఫలముల రూపమైన ఈ సంసారమనే చెట్టు అనాది. ఇది కర్మలనే పువ్వులను, సుఖదుఃఖములనే పళ్లను ఉత్పన్నము చేయుచుండును.
సూర్యమండలము వరకు (ఆ పై సంసారము లేదు) వ్యాపించియున్న ఈ సంసారమనే చెట్టునకు పుణ్యపాపములనే రెండు విత్తనములు, కర్మవాసనలనే వంద (లెక్కలేనన్ని వేళ్లు, సత్త్వరజస్తమోగుణములనే మూడు కాండములు గలవు. పంచమహాభూతములనే ఐదు పెద్ద కొమ్మలు గల ఈ చెట్టు శబ్దస్పర్శరూపరసగంధములనే ఐదు రసములనుత్పన్నము చేయును. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు వెరసి పదకొండు దీని చిన్న కొమ్మలు. జీవపరమాత్మలనే రెండు మంచి రెక్కల పక్షులు దీనిపై గూడు కట్టుకున్నవి. వాతపిత్త శ్లేష్మములే దీని మూడు బెరడులు. సుఖదుఃఖములనే రెండు పళ్లు ఈ చెట్టుకు గలవు.
ఈ చెట్టు యొక్క ఒక పండు (దుఃఖము) ను గ్రామము (ఇంద్రియభోగములు) నందు సంచరించే గ్రద్దలు (గృహస్థులు) భుజించును. (గృహస్థులు ఇహపరములలో అనుభవించే సుఖము కూడ పరిణామమునందు దుఃఖమే). ఇంకో పండు (సుఖము) ను అరణ్యము (ఆత్మవిచారము) నందు నివసించే హంసలు (ఆత్మజ్ఞానులు) భక్షించును. అద్వయపరమాత్మ మాయాశక్తి యొక్క ఉపాధిచే అనేకరూపములుగా ప్రకటమైనాడు. ఆ పరమాత్మను పూజనీయులగు గురువుల ద్వారా తెలుసుకున్నవాడే వేదతత్త్వమును తెలిసినవాడగును.
ఈ విధముగా నీవు సావధానుడవై వివేకమును కలిగియుండుము. గురువును సేవిస్తూ నాయందు ఏకాంతమైన భక్తితో వివేకజ్ఞానమనే గొడ్డలికి పదును పెట్టుము. దానితో దేహాభిమానమనే జీవుని ఉపాధిని ఛేదించి, పరమాత్మలో విలీనమై, అప్పుడు సాధనము (కర్మ) ను విడిచి పెట్టుము.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో సత్సంగమహిమను వర్ణించే
పన్నెండవ అధ్యాయము ముగిసినది.
