శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

13 - హంస గీతి

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- సత్త్వరజస్తమోగుణములు ప్రకృతికార్యమగు బుద్దికి చెందినవే గాని, ఆత్మకు చెందినవి కావు. సత్త్వగుణముచే మిగిలిన రెండు గుణములను జయించవలెను. సత్త్వగుణమును కూడ సత్త్వగుణము (శాంతవృత్తి) తోనే జయించవలెను.

సత్త్వగుణము వర్ధిల్లిన మానవునకు నాయందు భక్తి అనే ధర్మము కలుగును. సాత్త్వికమైన ఉపాసన (సాత్త్వికపదార్థములను సేవించుట) చే సత్త్వగుణము, దాని వలన ధర్మము ప్రవర్తిల్లును.

సత్త్వగుణము వలన సర్వోత్కృష్టమైన ధర్మము వర్ధిల్లును. దానివలన రజస్తమోగుణములు నశించును. ఆ రెండు నశించగానే, వాటి మూలముగా పుట్టే అధర్మము వెంటనే నిశ్చయముగా నశించును.

శాస్త్రము, జలములు, సంతానము, దేశము, కాలము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము అనే పది గుణములకు హేతువులు. (ఇవి సాత్త్వికములైనచో సత్త్వగుణము వర్ధిల్లును. గంగాది జలములు సత్త్వగుణమును వర్ధిల్లజేయును).

ఈ ఆగమము మొదలగువాటిలో వేటిని వ్యాసాది మహాత్ములు ప్రశంసించెదరో, అవి సాత్త్వికములు; వేటిని నిందించెదరో, అవి తామసములు; వేటిని ఉపేక్షించెదరో, అవి రాజసములు.

అజ్ఞానము తొలగి ఆత్మసాక్షాత్కారము కలిగే వరకు మానవుడు సత్త్వగుణము వర్ధిల్లుటకై సత్త్వగుణప్రధానమైన ఆగమాదులను (నివృత్తిశాస్త్రము, తీర్థజలములు, వివిక్త దేశము, బ్రాహ్మముహూర్తము, నిత్యకర్మ, సాత్త్వికమంత్రము ఇత్యాదులు) మాత్రమే సేవించవలెను. దాని వలన ధర్మము, ధర్మము వలన జ్ఞానము కలుగును. .

వెదుళ్ల రాపిడినుండి పుట్టిన అగ్ని తనకు కారణమైన ఆ అడవిని తగులబెట్టి చల్లారును. ఇదే విధముగా, ఈ దేహము గుణములయందలి వైషమ్యము వలన పుట్టినది. విచారముచే పుట్టే జ్ఞానాగ్ని గుణములను భస్మము చేసి తాను కూడ ఆత్మస్వరూపమునందు విలీనమగును.

ఉద్దవుడిట్లు పలి కెను --- ఓ శ్రీకృష్ణా! ఇంద్రియసుఖములు ఆపదలకు నిలయమని మానవులు తరచుగా చేప్పెదరు. అయినప్పటికీ, ఛీ అన్నా వచ్చే కుక్కవలె, దెబ్బలు తిని కూడ వెంట పడే గాడిదవలె, కసాయినే నమ్మే మేక వలే, వారా భోగములను అనుభవించెదరు. ఇది యెట్లు?

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- అవివేకికి దేహమే నేను అనే మిథ్యాబుద్ది హృదయములో కలుగును. దాని వలన దుఃఖకారణమగు రజోగుణము మనస్సును - అది సత్త్వగుణకార్యమే ఐనా - వ్యాపించును.

అవివేకియొక్క మనస్సు రజోగుణప్రధానముగా నుండును. ఆ మనస్సులో భోగసంకల్పము పుట్టును. భోగ్యమునకు సంబంధించిన వికల్పములు ఆ సంకల్పమును బలపరచును. తరువాత, ఆ భోగ్యము యొక్క గుణముల ధ్యాస పెరుగును. దానిచే కామన పుట్టును. ఆ కామనను విడిచి పెట్టుట వానికి శక్యము కాకుండును.

రజోగుణముయొక్క వేగముచే వ్యామోహితుడైనవానికి ఇంద్రియ జయము ఉండదు. కావుననే, అట్టివాడు కామనలకు వశవర్తియై ఉండును. కర్మలకు ఉత్తరఫలము దుఃఖమేనని తెలిసినా, ఆతడు కర్మలను చేయును.

వివేకికి కూడా బుద్ధియందు రజస్తమోగుణముల విక్షేపము ఉండవచ్చును. అయిననూ, విషయభోగములయందలి దోషము ఆతనికి ఎరుకయే. కావుననే, ఆతడు సావధానుడై మనస్సును నిరోధించును. కావుననే, ఆతడు విషయభోగములయందు తగుల్కొనడు.

సాధకుడు సావధానుడై ఆసనముపై పట్టు సాధించి ప్రాణాయామ మును అభ్యసిస్తూ మనస్సును నా పై అర్పించి స్థిరము చేయవలెను. ధ్యానమును తగిన కాలములో (మూడు పూటలు) చేయవలెను. ధ్యానము కుదరలేదని నిరుత్సాహపడరాదు. సాధనలో తొందరపాటు ఉండరాదు.

మనస్సును అన్ని వైపులనుండి వెనుకకు లాగి సాక్షాత్తుగా నా పై నిలుపవలెను. నా శిష్యులైన సనకసనందనాదులు ఉపదేశించిన మనోనిగ్రహము ఇంత మాత్రమే.

ఉద్దవుడిట్లు పలికెను --- ఓ శ్రీకృష్ణా! నీవు ఎప్పుడు ఏ రూపముతో సనకసనందనాదులకు యోగమునుపదేశించితివి? ఆ రూపమును (కాలమును) గురించి నేను తెలియగోరుచున్నాను.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- బ్రహ్మదేవుని మానసపుత్రులగు సనకసనందనాదులు తండ్రిని, యోగము (మనోనిగ్రహము) యొక్క సూక్ష్మమైన అంతిమసీమను గురించి ప్రశ్నించిరి.

సనకసనందనాదులు ఇట్లు పలికిరి --- ఓ ప్రభూ! మనస్సు గుణకార్యములగు శబ్దాదులయందు, శబ్దాదులు మనస్సునందు ఆసక్తములై యున్నవి. సంసారసముద్రమును దాటి మోక్షమును కోరే సాధకునకు అవి ఒకదానిని మరియొకటి విడిచి పెట్టే ఉపాయమెయ్యది?

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బ్రహ్మదేవుడు దేవదేవుడు, స్వయంభువుడు, ప్రాణులను సృష్టించినవాడు. అయినా, ఆయన మనస్సు కర్మలచే విక్షిప్తమై యుండుటచే, ఎంత ఆలోచించినా, ప్రశ్నకు మూలములోని సంశయము ఆయనకు అంతు పట్టలేదు.

ఆ బ్రహ్మదేవుడు ప్రశ్నకు ఉత్తరమును తెలియగోరి నన్ను తలపోసెను. అప్పుడు నేను హంసరూపముతో ఆయన వద్దకు వెళ్లితిని. (హంస నీటిని పాలను విడదీసినట్లు నేను ఆత్మను గుణములనుండి విడదీసి చెప్పితిని).

ఆ సనకాదులు నన్ను చూచి దగ్గరకు వచ్చి పొదములకు నమ స్కరించి, బ్రహ్మదేవుని ఎదుట ఉంచుకొని, నీవెవరు? అని ప్రశ్నించిరి.

ఉద్దవా! తత్త్వమును తెలియగోరి ఆ మహర్షులు నన్నీ విధముగా ప్రశ్నించగా, అప్పుడు నేను వారికి చేసిన బోధను నీవు నానుండి తెలీయుము.

ఓ మహర్షులారా! ఆత్మవస్తువు అనేకము కానప్పుడు మీ ఈ (నీవెవరు?) ప్రశ్న ఎట్లు యుక్తిసంగతమగును? దేనిని (దేహాదికమును) ఆధారముగా చేసుకొని (తాదాత్మ్యమును చెంది) నేను మీ ప్రశ్నకు సమాధానమును చెప్పవలెను? (తాదాత్మ్యము లేనిదే చెప్పేవాడు, వినేవాడు అనే భేదము పొసగదు).

అయిదు భూతములు సకలప్రాణిదేహములలో సమానము. ఇది యథార్థము. మీరెవరు? అనే మీ ప్రశ్న నిరర్థకము. కాబట్టి, ఈ ప్రశ్నకు కేవలము వాగ్వ్యవహారమే ఆలంబనము గాని వస్తునిర్ణయము కాదు.

మనస్సు, వాక్కు, చూపు, మరియు ఇతరములైన ఇంద్రియములచే గ్రహించబడే సర్వము నేనే, నాకంటె వేరుగా ఏదీ లేదు. తత్త్వవిచారము చేసి ఈ సత్యమునరయుడు.

ఓ పుత్రులారా! మనస్సు గుణకార్యములగు శబ్దాదులయందు, శబ్దాదులు మనస్సునందు ప్రవేశించుచున్నవి. కాని, జీవుని ఆత్మ నేనే. ఈ మనస్సు, శబ్దాదులు జీవునకు ఉపాధియే గాని స్వరూపము కాదు.

మరల మరల గుణకార్యములగు శబ్దాదులను సేవించుటచే చిత్తము వాటియందు ఆసక్తమగును. అప్పుడు అవి చిత్తమునందు గట్టిగా నెలకొనును. జీవుని స్వరూపమైతే నేనే. కావున, సాధకుడు ఆత్మనిష్ఠుడై (నన్ను ధ్యానించువాడై) ఈ రెండింటినీ విడిచి పెట్టవలెను.

జాగ్రత్స్వప్నసుషుపులు సత్త్వాదిగుణముల వలన బుద్దియందు కలిగే అవస్థలే. జీవుడు వీటికి సాక్షి యై ఉండును గనుక, వీటికంటే విలక్షణుడని మహాత్ములచే నిశ్చయించబడినది.

ఆత్మకు సంసారములో తిరుగాడే ఈ బుద్ధితోడి తాదాత్మ్యమే బంధము. దానివలననే గుణముల వ్యాపారములు ఆత్మకు వచ్చుచున్నవి. ఆత్మ మూడు అవస్థలకు అతీతమై వాటికి సాక్షిగా ఉండే నాల్గవది. కావున, సాధకుడు ఆత్మయందు నిష్ఠను అభ్యసించవలెను. అప్పుడు గుణకార్య ములగు శబ్దాదులు, చిత్తము అనువాటినుండి ఒకేసారి విముక్తి కలుగును.

తనకు అహంకారము (దేహాభిమానము) పురుషార్థమును చెడగొట్టే బంధమని సాధకుడు గుర్తించవలెను. సాధకుడు విరక్తిజెంది అవస్థాత్రయ

సాక్షియగు ఆత్మస్వరూపమునందు నిలిచి, సంసారమును కలిగించే (భోగ) సంకల్పములను విడిచి పెట్టవలెను.

జగత్తులోని నానాత్వము సత్యమనే బుద్ది ఎంతవరకైతే తొలగిపోదో, అంతవరకు మానవుడు అజ్ఞానియే. అజ్ఞాని జాగ్రదవస్థలో కూడ స్వప్న ములోనున్నట్లే. అది యెల్లాగంటే, స్వప్నములో కూడ తెలివిగా ఉన్నట్లే అనుభవము కలుగుచుండును గదా!

ఆత్మకంటే భిన్నముగా దేవమనుష్యాదిభేదములేవియు వాస్తవముగా లేవు. కాబట్టి, కర్మలను చేయుట, కర్మఫలములైన స్వర్గాదిలోకములను పొందుట అనేవి ఈ ఆత్మకు, స్వప్నపురుషునకు వలే, కల్పితములే. స్వప్నపదార్థములు స్వప్నద్రష్టకంటె భిన్నముగా లేవు.

ఇంద్రియములకు సత్తాస్ఫూర్తులననుగ్రహించే ఆత్మ మూడు గుణముల వలన కలిగే జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలకు సాక్షి. జాగ్రదవస్థ యందు ప్రతిక్షణము నశించే స్వభావము గల పదార్థములను (బాల్యా దులను) సకలములైన ఇంద్రియములతో బాహ్యజగత్తునందు భోగించేది విశ్వుడు. స్వప్నములో హృదయమునందు జాగ్రత్సదార్థములను పోలిన వాటినే భోగించేది తైజసుడు. ఈ సర్వమును నిద్రావస్థలో తనలోనికి ఉపసంహరించేది ప్రాజ్ఞుడు. ఈ మూడింటియందు స్మరణ (నిద్ర పోయి కల గన్న నేను ఇప్పుడు తెలివిగా ఉన్నాను) రూపముగా అనుగతమయ్యే ఆత్మతత్త్వము అద్వయము.

ఈ విధముగా విచారించి, త్రిగుణాత్మకమగునా మాయచే మనస్సునందు జాగ్రత్తు మొదలైన అవస్థలు కల్పించబడుచున్నవనే తత్త్వమును నిశ్చయము చేసుకొనుడు. సత్పురుషుల బోధలను వింటూ ఆత్మానాత్మవివేకమునభ్యసించుట వలన వివేకజ్ఞానమనే కత్తికి పదును వచ్చును. దానితో మనోవ్యాధులనదగిన సంశయములనన్నింటినీ ఛేదించుడు. హృదయమునందున్న నన్ను భజించుడు.

దృశ్యము, క్షణభంగురము, గిర గిర తిరిగే కొరివి వలె మిక్కిలి చంచలము అగు జగత్తు మనస్సుయొక్క విలాస మాత్రమే. ఈ జగత్తు గట్టి భ్రమ మాత్రమే అని తెలియవలెను. రెండవది లేని ఆత్మచైతన్యమే అనేకరూపములుగా కన్పట్టుచున్నది. శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము అనే మూడు విధముల భేదము సత్త్వరజస్తమోగుణముల పరిణామమే. ఈ భేదము స్వప్నము వలె అజ్ఞానకల్పితము.

ఆత్మానందమును అనుసంధానము చేసే సాధకుడు భోగములపై ఆశను విడిచి పెట్టి, ఆ దేహేంద్రియసంఘాతమునుండి దృష్టిని వెనుకకు మళ్లించ (నేను-నాది అనే అభిమానమును విడిచి పెట్ట) వలెను. ఆతడు ఫలతృష్ణ లేనివాడగుటచే ఫలాపేక్షతో చేసే కర్మలు ఉండవు. ఒకచో భిక్షాటనము ఇత్యాదిసందర్భములలో దేహాభిమానము ఉండవచ్చును. కాని, పరమార్థము కాదనే నిశ్చయబుద్దితో అభిమానము విడిచి పెట్టబడిన ఆ దేహము ఆతనికి ఆత్మభ్రమను కలిగించలేదు. ఆ దేహము కేవలము పడిపోయేవరకు సంస్కారరూపముగా స్మరణమునకు వచ్చును.

మద్యము మత్తులో తనను విస్మరించినవాడు తాను కట్టిన వస్త్రము ఉన్నదా, ఊడినదా? అని పట్టించుకోడు. అదే విధముగా, స్వరూపసాక్షా త్కారమును పొందినవాడగుటచే ఆత్మనిష్ఠుడు దేహమును పట్టించుకోడు. నశించే స్వభావము గల దేహము ప్రారబ్ధకర్మాధీనమై ఒకచోట ఉన్నా, నిలబడినా, ఎక్కడికైనా వెళ్లినా, తిరిగి వచ్చినా ఆయన సరకు చేయడు.

ప్రాణాపానాదులు, ఇంద్రియములతో కూడిన దేహమును ప్రారబ్ధకర్మ ఉత్పన్నము చేసినది. ఆ కర్మ ఉన్నంతవరకు దేహము ఎదురుచూస్తూ కదలుచుండును. చిత్తేకాగ్రత అనే యోగమునధిష్టించి ఆత్మతత్త్వమును సాక్షాత్కరించుకున్న జ్ఞాని స్వప్నతుల్యమైన ప్రపంచమునందు మమ కారమును, దేహమునందు నేను-అనే అభిమానమును తిరిగి పొందడు.

ఓ మహర్షులారా! జ్ఞానయోగకర్మయోగముల రహస్యమును నేను మీకు ఉపదేశించితిని. నేను మీకు మోక్షధర్మమునుపదేశించగోరి వచ్చిన యజ్ఞరూపుడనగు శ్రీహరినని తెలియుడు.

ఓ మహర్షులారా! కర్మయోగము, జ్ఞానయోగము, సత్యము, వేదవిహిత ధర్మము, మధురభాషణము, అనుంచే ధర్మము, తేజస్సు, సంపద, కీర్తి, ఇంద్రియనిగ్రహములకు నేను గొప్ప ఆశ్రయము. వాటి ఫలము కూడ నేనే.

నిర్గుణుడనగు నాకు అపేక్ష ఏదీ లేదు. హితకారినగు నేను ప్రీతికి నిధానమగు ఆత్మరూపుడను. సమత్వము, అసంగత్వము, సత్యము మొదలగు సకలగుణములు నన్ను సేవించుచున్నవి.

ఈ విధముగా సనకసనందనాది మహర్షులకు నా వలన సందేహములు పటాపంచలయ్యెను. వారు గొప్ప భక్తితో నన్ను పూజించి చక్కగా స్తుతించిరి.

ఆ మహర్షులు నన్ను బాగుగా పూజించి స్తుతించిరి. అప్పుడు నేను బ్రహ్మదేవుడు చూచుచుండగా నా ధామమునకు తిరిగి వచ్చితిని.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో

హంసగీతిని వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది .