శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

22 - పురుష ప్రకృతి వివేకము - తత్త్వముల పరిగణనము

ఉద్దవుడిట్లు పలికెను --- జగన్నాథుడవగు ఓ ప్రభూ! మహర్షులెన్ని తత్త్వములను లెక్కించిరి? తత్త్వమును తొమ్మిది, పదకొండు, అయిదు, మూడు, వెరసి ఇరవై ఎనిమిది అని నీవు చెప్పగా మేము వినియుంటిమి.

తత్త్వములు ఇరవై ఆరని కొందరు, ఇరవై అయిదు, ఏడు, తొమ్మిది, - ఆరు, నాలుగు, పదకొండు, పది హేడు, పదహారు, పదమూడు అని పలు విధములుగా వేర్వేరు మహాత్ములు చెప్పిరి.

సనాతనుడవగు ఓ శ్రీకృష్ణా! మహర్షులు దేనినో చెప్పగోరి తత్త్వముల సంఖ్యలను ఇన్ని రకములుగా కీర్తించిరి. వారి అభిప్రాయమేదియో నీవు మాకు చెప్ప దగుదువు.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను -- మహర్షులు ఏ విధముగా చెప్పెదరో అది యుక్తమే. ఈ తత్త్వములు సర్వమునందు ఉన్నవియే. నా మాయను స్వీకరించి చెప్పువారలు ఏదైనా చెప్పగల్గుతారు. మాయచే ఘటిల్లనిది యేది గలదు?

నీవు చెప్పినది వాస్తవము కాదు, నేను చెప్పినదియే యథార్థము, అంటూ ఈ విధముగా జనులు వివాదపడెదరు. అతిక్రమించ శక్యము కాని త్రిగుణాత్మకమగు నా మాయాశక్తియే వారిట్లు వివాదపడుటకు కారణము.

సత్త్వరజస్తమోగుణములనే నా మాయాశక్తుల పరిణామమైన అంతఃకరణవృత్తుల వలన వివాదములకు విషయమైన పక్ష భేదము కలుగు చున్నది. అంతరింద్రియమైన మనస్సు, బాహ్యేంద్రియములు నిగ్రహించ బడగా, ఆ పక్షభేదము విలీనమగును. దాని వెంట వివాదము చల్లారును.

ఓ పురుషశ్రేష్ఠా! కారణకార్యభావమును బట్టి తత్త్వములు ఒకదానిలో మరియొకటి అంతర్గతము కావచ్చును. కార్యమును కారణములో, లేదా కారణమునే కార్యములో అంతర్గతము చేసి, వక్త తన అభిప్రాయమునకు అనురూపముగా లెక్కించుట సంభవమే యగును.

ఒకే తత్త్వమునందు ఇతరతత్త్వములన్నీ అంతర్గతమగుట కానవచ్చును. ఉదాహరణకు, కారణతత్త్వమునందు కార్యతత్త్వములు గాని, లేదా కార్య తత్త్వమునందే కారణతత్త్వములు గాని అంతర్భూతములు కావచ్చును.

కాబట్టి, ఈ తత్త్వములలో కారణకార్యభావము, లెక్కింపు వాదుల వివక్ష పై ఆధారపడును. ఏ వాది ఏ విధముగా నిశ్చయించి పలుకునో, ఆ విధముగానే యుక్తి పొసగును గనుక, మనము అటులనే స్వీకరించెదము.

జీవుడు అనాదికాలమునుండి అజ్ఞానముతో కూడియున్నవాడు గనుక, జీవునకు తనంత తానుగా ఆత్మజ్ఞానము కలుగదు. ఆత్మతత్త్వము తెలిసిన మరియొకడు (ఈశ్వరుడు) జీవునకు జ్ఞానముననుగ్రహించవలెను. ఈ విధముగా జీవేశ్వరభేదముతో తత్త్వములను లెక్కించుట గలదు.

ఈ దేహములో చిద్రూపులైన జీవేశ్వరులకు లేశమైననూ భేదము లేదు. కావున, జీవేశ్వరులు వేర్వేరు అనుట అసంగతము.(కాబట్టి ఒకే తత్త్వముగా లెక్కించవచ్చును). జ్ఞానము కూడ ప్రకృతిలో అంతర్గతమైన సత్త్వగుణము మాత్రమే (కాబట్టి, జ్ఞానమును బట్టి భేదము పొసగదు).

సత్త్వరజస్తమోగుణముల సామ్యావస్థయే ప్రకృతియని ప్రసిద్ధము. ఈ గుణములు క్రమముగా స్థితికి, సృష్టికి, ప్రళయమునకు హేతువులగును. ఈ గుణములు ప్రకృతికి చెందినవే గానీ, ఆత్మకు చెందినవి కావు.

ఈ ప్రసంగములో ఈ గుణములయందు సత్త్వమునుండి జ్ఞానము, రజోగుణమునుండి కర్మ, తమోగుణమే అజ్ఞానము అని చెప్పబడినది. గుణములలో క్షోభ (పరిణామము) ను కలిగించే ఈశ్వరుడే కాలరూపుడు. ఈశ్వరుని స్వభావము మహత్తత్త్వము (సమష్టిబుద్ధీశక్తి) కంటే వేరు కాదు (ఈ విధముగా తత్త్వములను ఒకటి- రెండు ఎక్కువగా, లేదా తక్కువగా లెక్కించవచ్చును).

పరమాత్మ (జీవేశ్వరుల ఐక్యము), మాయాశక్తి, మహత్తత్త్వము, (సమష్టి) అహంకారము, పృథివ్యత్తేజోవాయ్వాకాశములనే అయిదు సూక్ష్మభూతములు వెరసి తొమ్మిది తత్త్వములని నేను చెప్పితిని.

ఓ ఉద్దవా! వినికిడి, స్పర్శశక్తి, చూపు, ఆఘ్రాణించే శక్తి, ఆస్వాదించే శక్తి (చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక) అనేవి జ్ఞానేంద్రియములు. నోరు, చేతులు, జననేంద్రియము, విసర్జనేంద్రియము, కాళ్లు అనేవి కర్మేంద్రియములు. ఈ రెండింటికీ సాధారణమైన  అంతరింద్రియము మనస్సు (వెరసి పదకొండు).

శబ్దస్పర్శరూపరసగంధములు జ్ఞానేంద్రియముల విషయములు. నడక, పలుకు, మలమూత్రవిసర్జనము, చేతిపని కర్మేంద్రియఫలములు.

మహత్తత్త్వము మొదలైన కారణములుగను, శబ్దాదికార్యములుగను పరిణమించిన ప్రకృతి సత్త్వరజస్తమోగుణములచే ఈ జగత్తుయొక్క స్థితిసృష్టిప్రళయములకు ఉపాదానమై ఆ అవస్థలను నిలబెట్టుచున్నది. పరిణామము లేని పురుషుడు కేవలసాక్షి యై ఉన్నాడు.

మహత్తత్త్వము, అహంకారము మొదలైనవి జగత్తునకు ఉపాదానములు. పురుషుని సన్నిధి, ఈక్షణములచే వాటికి సృజనశక్తి లభించును. అవి ప్రకృతియొక్క బలము వలన వికారమును పొందుతూ, ఒకదానితో మరియొకటి కలిసి ఈ బ్రహ్మాండమును సృష్టించును.

తత్త్వములు ఏడు మాత్రమే అనే పక్షము గలదు. దానియందు ఆకాశము, వాయువు మొదలైన పంచభూతములు, వాటిని తెలుసుకొనే జీవుడు, ఆ జ్ఞాతృ-జ్ఞేయములకాధారమైన పరమాత్మ, వెరసి ఏడు. వాటినుండియే దేహము, ఇంద్రియములు, ప్రాణములు ఆవిర్భవించును.

తత్త్వములు ఆరు అనే పక్షములో కూడ పంచభూతములు, పరమాత్మ వెరసి ఆరు. ఆ పరమాత్మ తననుండి పుట్టిన ఆ భూతములతో కలిసి ఈ జగత్తును సృష్టించి, దానిలో అంతర్యామిగా ప్రవేశించెను.

తత్త్వములు నాలుగు అనే పక్షములో, పరమాత్మ, ఆ పరమాత్మనుండి పుట్టిన తేజస్సు, జలములు, పృథివి, వెరసి నాలుగు. నానోత్వవిశిష్టమగు ఈ జగత్తు యొక్క ఆవిర్భావము ఆ నాలుగింటినుండి ఘటిల్లినది సుమా!

పది హేడు తత్త్వములు అనే పక్షములో, ఐదు స్థూలభూతములు, శబ్దస్పర్శరూపరసగంధములనే తన్మాత్రలు. అయిదు, అయిదు జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు, పరమాత్మ వెరసి పది హేడు.

పదహారు అనే పక్షములో మనస్సును ఆత్మయందు అంతర్గతము చేయవలెను. ఆత్మయే సంకల్పించునదై మనస్సు అనబడును. ఐదు స్థూలభూతములు, తన్మాత్రలు అయిదు, అయిదు జ్ఞానేంద్రియములు, ఆత్మ వెరసి పదహారు. పదమూడు అనే పక్షములో స్థూలభూతములను తన్మాత్రలలో అంతర్గతము చేయవలెను. అవి ఐదు, ఇంద్రియములు ఐదు, మనస్సు, జీవుడు, పరమాత్మ వెరసి పదమూడు.

పదకొండు తత్త్వములనే పక్షములో, ఐదు మహాభూతములు (స్థూలసూక్ష్మములు), ఐదు ఇంద్రియములు, ఆత్మ వెరసి పదకొండు. తొమ్మిది అనే పక్షములో ఐదు మహాభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము, అనే ఎనిమిది ప్రకృతులు, ఆత్మ వెరసి తొమ్మిది.

ఈ విధముగా మహర్షులు పలు విధములుగా తత్త్వములను లెక్కించిరి. యుక్తియుక్తములగుట వలన ఈ లెక్కలన్నీ ఉచితములే. జ్ఞానుల వచనములలో అశోభనమేమి ఉండును? (ఉండదు).

ఉద్ధవుడిట్లు పలికెను --- ఓ శ్రీకృష్ణా! ప్రకృతిపురుషులు పరమాత్మ కంటే విలక్షణులే అయిననూ, ఆ తత్త్వములు ఒకదానిని విడిచి మరి యొకటి ఉండుట లేదు. కావున, వాటికి తేడా తెలియుట లేదు. ఎందు కంటే, ప్రకృతి (దేహము) లోనే ఆత్మ, ఆత్మయందే ప్రకృతి కానవచ్చును.

పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నీవు సర్వజ్ఞుడవు. నా హృదయములోని ఈ పెద్ద సందేహమును నీవు యుక్తిచే నిపుణములైన మాటలతో తొలగించుటకు తగుదువు.

ఏలయన, ఈ లోకములో జీవులకు జ్ఞానము నీ (అనుగ్రహము) వలన కలుగును. జ్ఞానభ్రంశము నీ మాయాశక్తి వలన కలుగును. నీ మాయాశక్తి యొక్క తత్త్వమును నీవు మాత్రమే యెరుగుదువు; ఇతరులైతే యెరుగరు.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- పురుషశ్రేష్ఠుడవగు ఓ ఉద్దవా! ప్రకృతి పురుషులకు భేదము గలదు. సత్త్వరజస్తమోగుణముల మేళవింపు స్వరూపముగా గల ఈ జగత్తు (దేహము)నకు జన్మాదివికారములు గలవు.

ఓ ఉద్దవా! త్రిగుణాత్మకమగు నా మాయాశక్తి గుణముల ద్వారా పలు విధములుగా భేదవృత్తులను కలిగించుచున్నది. జన్మాది వికారములు గల ఈ సృష్టి మూడు విధములుగా నున్నది: ఒకటి అధ్యాత్మము (దేహేంద్రియమనస్సంఘాతము), రెండు అధిదైవము (ఇంద్రియాను గ్రాహక దేవతలు), మూడు అధిభూతము (పంచభూతములు).

చూపు అధ్యాత్మము. రూపము అధిభూతము. ఈ కంటిలో సూర్యుని అంశ అధిదైవము. ఇవి పరస్పరము సిద్ధించుచున్నవి. అనగా, చూపు గలదు గనుక రూపము గలదు, ఇత్యాది. కాని, ఆకాశమునందలి సూర్యుడు స్వయముగా సిద్ధించు (ప్రకాశించు) చున్నాడు. ఇదే విధముగా, పరమాత్మ ఈ అధ్యాత్మ-అధిభూత-అధిదైవతత్త్వములకంటే విలక్షణము, వీటికి కారణము. స్వయంప్రకాశమగు ఆ ఆత్మ పరప్రకాశ్యములగు అధ్యాత్మాదులను ప్రకాశింపజేయుచున్నది. ఇదే విధముగా, చర్మముస్పర్శ-వాయువు, చెవి-శబ్దము-దిగ్గేవత, నాలుక-రసము-వరుణుడు, ముక్కు-గంధము-అశ్వినీదేవతలు, చిత్తము-స్మృతివిషయము-వాసు దేవుడు, మనస్సు-మంతవ్యవిషయము-చంద్రుడు, బుద్ధి-తెలియదగిన విషయము-బ్రహ్మదేవుడు, అహంకారము-అహంకారవిషయము-రుద్రుడు అనే మూడు విధముల భేదమును తెలియవలెను.

కాలము ప్రధానముయొక్క గుణముల సామ్యవస్థయందు క్షోభను కలిగించగా మహత్తత్త్వము ప్రకటమైనది. దాని పరిణామము వలన సమష్టి -అహంకారము ప్రకటమైనది. దేహాభిమానము ఇత్యాది వ్యామోహము వలన కలిగే భేదమునకు ఈ అహంకారమే హేతువు. ఈ అహంకారము సాత్త్వికము, రాజసము, తామసము అనే మూడు అంశలు గలది.

పూర్తిగా జ్ఞానస్వరూపమైన (దేహాదివిలక్షణమైన) ఆత్మ ఉంది అని, లేదు అని మానవులు వివాదపడుచునే యున్నారు. ఆత్మ చైతన్యస్వరూపుడనై యున్న నానుండి పరాజ్ముఖమైన బుద్ధి గలవారికి ఈ వివాదము , ఆగకుండా సాగుతూనే ఉన్నది. భేదమే పరమార్థమనే నిష్ఠనుండి పుట్టిన ఈ వివాదము నిశ్చయముగా వ్యర్థము.

ఉద్ధవుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! నీనుండి పరాజ్ముఖమైన బుద్ధి గల (బహిర్ముఖులైన) మానవులు తమచే చేయబడిన కర్మలచే గొప్పవి, నికృష్టములు అగు దేహములను పొంది (జన్మ), విడుచుచుందురు (మరణము).

ఓ గోవిందా! అల్పబుద్దులు ఊహనైననూ చేయజాలని ఆ విషయమును గురించి నాకు చెప్పుము. ఈ విషయమును తెలిసినవారు లోకములో అధికముగా లేరు. జనులు మాయచే వంచితులై యున్నారు.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- అయిదు జ్ఞానేంద్రియములతో కూడియున్న మానవుల మనస్సు కర్మవాసనలతో నిండియుండును. అది ఒక దేహమునుండి మరియొక దేహమును పొందును. ఆత్మ దానికంటే విలక్షణమే. కాని, తాదాత్మ్యా ధ్యాస వలన ఆత్మ దానిని అనుసరించును.

మనస్సు కర్మలకు వశమై యుండును. కనబడే ఇహలో కభోగములను, వేదము వర్ణించే పరలోకభోగములను గురించి ధ్యానిస్తూ ఉండే మనస్సు ఒకప్పుడు కొన్ని భోగముల గురించి) ఆవిర్భవించి, మరొకప్పుడు (మరికొన్ని భోగముల విషయములో) విలీనమగును. తరువాత, ఆ మనస్సుయొక్క స్మృతి లుప్తమగును.

ఒకానొక కర్మవి శేషము కారణముగా మనస్సు ఇప్పటి దేహమునందు దృఢమైన అభిమానమును కలిగియుండును. ఆ మనస్సులో పూర్వదేహముయొక్క స్మరణమైతే పూర్తిగా లుప్తమగును. అదియే ఆ పూర్వదేహాభిమాని యొక్క మరణము. ఇది నిశ్చయము.

ఉదారుడవగు ఓ ఉద్దవా! మనిషి స్వప్నమునందలి దేహముతో పూర్తిగా మమేకమై స్వప్నమును దర్శించును. మనోరథమునకు చెందిన దేహముతో కూడ మనిషి పూర్తిగా తాదాత్మ్యమును చెందును. అదే విధముగా, జీవుడు దృశ్యమగు దేహమును పూర్తిగా అభేదముగా ఆత్మగా స్వీకరించును. ఇదియే జీవునకు జన్మయని మహాత్ములు చేప్పెదరు.

ఇప్పటి స్వప్నములోని జీవునకు గడచిన స్వప్నములోని తన దేహము స్మరణకు రాదు. ఇప్పటి మనోరథదేహముతో తాదాత్మ్యము చెందిన జీవుడు గడచిన మనోరథదేహమును స్మరించడు. ఇదే విధముగా, ఈ జన్మలోని దేహముతో తాదాత్మ్యమును చెందిన జీవుడు గడచిన జన్మలోని దేహమును స్మరించడు. తాను ఇదివరకటి ఆత్మయే. కాని, తాను కొత్తగా పుట్టినవాడనని ఆతడు తలపోయును.

జీవుడు కలలలో మిథ్యాభూతములైన అనేకదేహములను సృష్టించును. అదే విధముగా, ఇంద్రియములకు ఆశ్రయమైన దేహమునందలి తాదాత్మ్యమే దేహముయొక్క పుట్టుక. దానిచే పరమార్థమగు అద్వయ పరమాత్మయందు విశ్వ తైజసప్రాజ్ఞ (జాగ్రత్స్వప్నసుషుప్తి) భేదము, అధ్యాత్మ-అధిభూత-అధిదైవభేదము, లోపల బయట అనే భేదము కలుగుచున్నవి.

ఓ ఉద్దవా! కాలముయొక్క వేగమును మనము గుర్తించలేము. దాని ప్రభావముచే ప్రతిక్షణము ప్రాణుల దేహములు పుట్టి గిట్టుచున్నవి. కాని, కాలము సూక్ష్మమగుట వలన దాని ప్రభావము కనబడుట లేదు.

కాలము జ్వాలలకు, నదులకు, చెట్టుయొక్క పళ్లకు వేర్వేరు అవస్థలను కలిగించును. (జ్వాల పెరిగి చిక్కును. నదికి వరద వచ్చి ఎండిపోవును. పండు ముదిరి ముగ్గును). అదే విధముగా, కాలము సకలప్రాణుల దేహములకు వయస్సు, బాల్యము మొదలైన అవస్థలు, ఆరోగ్యము మొదలైన స్థితులు అనువాటిని కలిగించుచుండును.

దీపజ్వాల క్షణక్షణము మారిపోవును. నదిలోని జలము క్షణక్షణము మారిపోవుచుండును. కాని, ఇది అదే దీపము, ఇది అదే నది, అని జనులు భ్రమించెదరు. అదే విధముగా, జనుల ఆయుష్టు వ్యర్థముగా గడిచిపోవుచుండును. వారి దేహములలో నిరంతరముగా మార్పులు వచ్చుచుండును. కాని, అవయవరచనలోని పోలికను బట్టి, ఈ వ్యక్తి (మధ్యవయస్కుడు) ఆతడే (యువకుడు) అనియే జనులు పలి కెదరు, భావించెదరు. వారి పలుకు అసత్యము, వారి భావన అసత్యము.

జీవుడు అజ్ఞానియే కావచ్చును. జీవుడు జన్మమరణములు లేనివాడు. కాని, జీవుడు కర్మ అనే విత్తుచే పుట్టుచున్నాడు, గిట్టుచున్నాడు అనే భ్రాంతి జనులలో గలదు. కట్టె ఉన్నప్పుడు ఆగ్ని పుట్టినట్లు, కట్టె కాలిపోగా అగ్ని ఆరిపోయినట్లు భ్రమ. అగ్నికి పుట్టుట, గిట్టుట వాస్తవముగా లేవు.

దేహమునకు ఈ ఉత్కృష్టమౌవనము)-నికృష్ణ (వృద్ధాప్యము)-అవస్థలు మనోవికారము వలన ప్రాప్తించినవి మాత్రమే, అనగా మిథ్య. ఆత్మ దేహముకంటే విలక్షణము. ఒకానొక జీవుడు అజ్ఞానముచే గుణకార్యములగు దేహాదులతో తాదాత్మ్యమును పొంది, ఈ అవస్థలు తానేనని స్వీకరించును గదా! ఆ జీవుడు ఒకానొక సమయములో వివేకమును పొంది, ఆ అధ్యాసను విడిచి పెట్టును.

తండ్రి మరణమును చూచి తాను కూడ మరణించెదననియు, కొడుకు పుట్టుటను చూచి తాను కూడ పుట్టినాననియు వ్యక్తి ఊహించును. పుట్టుట - గిట్టుటలు దేహమునకు మాత్రమే. ఆ దేహములకు సాక్షియగు ఆత్మయందు ఆ రెండు లక్షణములు ఉండవు.

విత్తునుండి మొక్క అంకురించి, తరువాత ఆ మొక్క ఎండిపోవును. ఈ విధముగా మొక్క పుట్టుటను, ఎండిపోవుటను తెలుసుకొనే వ్యక్తి వాటికి ద్రష్ట యగునే గాని, పుట్టుట-నశించుట అనే ధర్మములను పొందడు. అదే విధముగా, ఆత్మ చైతన్యము దేహసాక్షి, దేహముకంటె విలక్షణము.

వివేకము లేని వ్యక్తి ఈ విధముగా తన స్వరూపమును ప్రకృతికార్యములగు దేహాదులనుండి వివేచించడు. ఆతడు విషయభోగములు సత్యములే యని భ్రమించి వాటిలో తగుల్కొనును. ఈ తీరున ఆతడు సంసారములో పరిభ్రమించును.

కర్మలు జీవుని తన స్వరూపము విషయములో భ్రమపడి సంసారములో తీరుగాడునట్లు చేయును. ఆ జీవుడు సత్త్వగుణకార్యములగు శమదమాదుల అభ్యాసము వలన మహర్షిజన్మను గాని, దేవతాజన్మను గాని పొందును. ఆతడు రజోగుణకార్యములగు కామాదులనభ్యసించి మనిషిగా గాని, రాక్షసుడుగా గాని పుట్టును. ఆతడు తమోగుణప్రధానుడై పిశాచజన్మను, పశుపక్ష్యాదిజన్మను పొందును.

నాట్యమాడువారిని, పొట పొడువారిని చూచే వ్యక్తి ఆ నాట్యమును, పాటను అనుకరించును (వాటిని తన మనస్సులో భావన చేయును). ఇదే విధముగా, ఆత్మ అకర్తయే అయినా, అజ్ఞానబలముచే బుద్ధియొక్క అవస్థలను, దేహముయొక్క చేష్ఠలను పొందినట్లుగా భ్రమ కలుగును.

ప్రవహించే నీటితో బాటు ముందుకు సాగే నావలో ఉండి చూచినప్పుడు గట్టుమీది చెట్లు వెనుకకు కదులుతున్నట్లు కనబడును. అదే విధముగా, ఆత్మచైతన్యమునందు లేని కర్తృత్వము అజ్ఞానముచే భాసించును. కళ్లు తిరిగినప్పుడు నేల తిరుగుచున్నట్లు అనిపించును. అదే విధముగా, జడములైన దేహాదులయందు ఆత్మత్వము భాసించును.

దాశార్ణవంశీయుడవగు ఓ ఉద్దవా! పగటి కలలలోని అనుభవములు, స్వప్నములో చూడబడిన వస్తువులు అసత్యము. అదే విధముగా, ఆత్మకు భోగానుభవము, సంసారము అసత్యములు.

జన్మమరణాదిరూపమైన సంసారము మిథ్య. అయిననూ, భోగములను గురించి చింతిల్లే జీవునకు -- స్వప్నమునందలి ఆపద, దాని దుఃఖము వలె -- సంసారమునందు తిరుగాడుట తప్పుట లేదు.

ఓ ఉద్దవా! ఇంద్రియములు దుష్టములు. కావున, వాటితో భోగములను భోగించకుము. ఆత్మస్వరూపము తెలియకపోవుటచేతనే అనేకభేదములతో కూడిన ప్రపంచము సత్యమా యని భ్రమ కలుగుచున్నది. గమనించుము.

దుర్జనులు తిట్టినా, అవమానించినా, పరిహసించినా, దోషారోపణ చేసినా, కొట్టినా, కట్టివేసినా, జీవికకు భంగమును కలిగించినా, ఉమ్మి వేసినా, మూత్రము చేసినా, అజ్ఞానులీ విధముగా పలు విధములుగా చలింప జేసినా, మోక్షమును కోరే సాధకుడు ఇటువంటి కష్టము వచ్చిన ప్పుడు తనను తానే ఉద్ధరించుకొనవలెను (సాధననుండి జారిపోకూడదు).

ఉద్ధవుడిట్లు పలికెను - బోధకులలో శ్రేష్ఠుడవగు కృష్ణా! దుష్టులు చేసే ఈ అపరాధమును మనస్సులో సహించుట చాల కష్టమని నా తలపు. దానిని నీవు చెప్పిన విధముగా ఎట్లు సహించవలేనో నాకు చెప్పుము.

జగత్తునకు అధిష్టానమైన ఓ శ్రీకృష్ణా! ఎందుకంటే, నీ ధర్మమునందు నిష్ఠ కలిగి నీ పాదములను శరణు వేడిన శాంతులైన మహాత్ములకు తప్ప, విద్వాంసులకు కూడ స్వభావము చాల బలమైనది. కావున, విద్వాంసులకు కూడ దుష్టజనుల అపరాధమును సహించుట చాల కష్టము.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో

ప్రకృతి పురుష వివేకమును, తత్త్వముల పరిగణనమును

నిరూపించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).