శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
9 - దత్తాత్రేయ గీత - యదు మహారాజు జీవన్ముక్తుడగుట
దత్తాత్రేయ మహర్షి ఇట్లు చెప్పెను --- లోకములోని వస్తువులను గాఢముగా ప్రేమించి పొడిని కలిగియుండుట నిశ్చయముగా దుఃఖ హేతువు. ఈ సత్యమును గుర్తించి ఎవడైతే దేనినీ ప్రోగు చేయకుండ నుండునో, వానికి (దరిద్రునకు కాదు) అంతము లేని సుఖము కలుగును.
ఒక లకుముకి పిట్టకు మాంసపు ముక్క దొరికెను. వెంటనే మాంసపు ముక్క దొరకని ఇతర పక్షులు, బలము గల గ్రద్ద మొదలైనవి, దానిని హింస పెట్టినవి. అప్పుడది ఆ ముక్కను విడిచి పెట్టి సుఖముగా నుండెను.
నాకు సమ్మానము గాని, అవమానము గాని లేవు. ఇల్లు, పిల్లలు గలవారి బెంగ నాకు లేదు. నేను నా స్వరూపమునందే వినోదించెదను. జనులకు ప్రియసంయోగము వలన కలిగే సుఖము కూడ నాకు నా స్వరూపమునందే గలదు. నేనీ లోకములో పిల్లవాడు వలె సంచరించెదను.
శిశువునకు మానావమానములు తెలియవు. శిశువునందు ఒక లక్ష్యమును కోరి చేసే ఉద్యమము కూడ ఉండదు. అట్టి శిశువు ఒకరు. జ్ఞానిసత్త్వరజస్తమోగుణాత్మకమైన సంసారమునకు అతీతముగా ఆత్మనిష్ఠుడై యుండును. ఆతడు రెండవవాడు. వీరిద్దరికి మానావ మానముల బెంగ ఉండదు. వీరు మహానందములో నిమగ్నులై ఉందురు.
ఒకచోట ఒక గృహములో పెద్దలందరు పనిమీద ఎక్కడికో వెళ్లిరి. వారి పెళ్లీడు అమ్మాయి మాత్రమే ఇంటివద్ద ఉండెను. అదే సమయములో ఆ అమ్మాయిని తమ కుమారునకు పెళ్లి చేసుకోవాలని కోరే పెద్దలు ఇంటికి రాగా, ఆమె వారిని తానే మర్యాద చేసెను.
ఓ రాజా! ఆమె వారి భోజనము కొరకై లోపల ఏకాంతములో వడ్లను దంచుచుండగా, ముంజేతికి ఉన్న గాజులు పెద్ద చప్పుడును చేసెను.
ఆమె బుద్ధిమంతురాలు. తాను వడ్లను దంచుచున్నదని అతిథులకు తెలియుట మర్యాద కాదని తలచి ఆమె సిగ్గు పడెను. ఆమె గాజులను ఒక్కొక్కటి తీసివేసి, ఒక్కొక్క చేతికి రెండు గాజులను మిగిల్చెను.
ఆ కుమారి దంచుచుండగా రెండు గాజులనుండి కూడ చప్పుడు వచ్చుచునే యుండెను. అపుడామె చెరియొక గాజును తీసివే సెను. ఒక గాజునుండి చప్పుడు రాలేదు.
శత్రువులను నియంత్రించే ఓ రాజా! జనుల స్వభావమును తెలియగోరి నేను జనావాసములను తిరుగుచుందును. నేను ఆ కుమారినుండి ఈ (క్రింద చెప్పబడబోయే) ఉపదేశమును నేర్చుకుంటిని.
చాలమంది కలిసి ఉన్నచో కలహము వచ్చును. ఇద్దరు ఉన్నా కబుర్లు సాగుచుండును. కాబట్టి, సాధకుడు కుమారియొక్క కంకణము వలె ఏకాకియై సంచరించవలెను.
సాధకుడు ఆసనమునందు స్థిరముగా కూర్చుండి, ప్రాణాయామమును చేసి, అభ్యాసము చేస్తూ మనస్సును వశము చేసుకొని ఏకాగ్రము చేయవలెను. ఇంతేగాక, వైరాగ్యమును కూడ సాధన చేయవలెను.
ఈ మనస్సు పరమాత్మయందు నిలిచినప్పుడు మెల్ల మెల్లగా కర్మవాస నలు తొలగిపోవును. మనస్సులోని సత్త్వగుణము వర్ధిల్లి, రజస్తమోగుణ ములు తొలగిపోవును. ఇంధనము లేని అగ్ని శాంతించునట్లుగా, విషయావభాసనము లేని మనస్సు ఆత్మనిష్ఠమగును. ఇదియే జీవన్ముక్తి.
ఒక కమ్మరి బాణములను చేయుచుండగా ప్రక్కనుండి మహారాజు పరివారసమేతముగా వెళ్లాను. కాని, ఆతని మనస్సు బాణమునందు లగ్నమగుటచే, ఆతడాయనను చూడనే లేదు. అదే విధముగా, ఆత్మస్వరూపమునందు విలీనమైన మనస్సు గల సాధకునకు బయట (ఘటాదికము) గాని, లోపల (సుఖాదికము) గాని ఏదో తెలియదు.
గుహవంటి రహస్యస్థానములో నివసించే పాము జాగ్రత్తగా ఒంటరిగా సంచరించును. దాని గతిని బట్టి దాని స్వభావమును అంచనా వేయలేము. అదే విధముగా, మననశీలుడైన సాధకుడు ఒంటరిగా ఉంటూ, ఒంటరిగా సంచరిస్తూ ఉండును. ఆతడు సావధానుడై చిత్తమును గుహవలె రహస్య మైన ఆత్మస్వరూపమునందు నీలుపును. ఆతని నడవడిని బట్టి ఆతనిని జనులు అంచనా వేయలేరు. ఆతడు మితభాషియై ఉండును.
శరీరము ఎప్పటికైనా నశించేదే. కాబట్టి, ఇల్లు కట్టుకున్న మనిషి దుఃఖమును పొందును. వాని ఆ ఉద్యమము నిష్పలము. పాము చీమలు పెట్టిన పుట్టలో జేరి సుఖముగా జీవించును.
సర్వమునకు ఆశ్రయమైన నారాయణదేవుడు స్వస్వరూపమునందు నిలిచియుండును. ఆ సర్వేశ్వరుడు తన మాయాశక్తిచే కల్పమునకు ఆదిలో సృష్టించబడిన ఈ జగత్తును కల్పమునకు అంతమునందు కాలమనే తన శక్తిచే తనలోనికి ఉపసంహరించును. అపుడాయన రెండవది లేని ఒక్కడుగనే ఉండును.
జగత్కారణుడు, పూర్ణుడు అగు పరమాత్మ ప్రకృతిని, జీవులను శాసించును. ఆయన తన శక్తియైన కాలముచే సత్త్వరజస్తమోగుణములను సామ్యావస్థలోనికి గొనిపోవును (ఆదియే ప్రళయము).
ఆ ప్రళయమునందు కైవల్యము (మోక్షము) అని పిలువబడే పర మాత్మ కార్యకారణములకతీతుడై ఉండును. ఉపాధులు లేని ఆయన నిర్వి శేషమగు సత్త, స్వయంప్రకాశమగు జ్ఞానము, ఆనందముల సమాహారము.
అంతశ్శత్రువులను నియంత్రించే ఓ రాజా! అద్వితీయ పరమాత్మ సృష్ట్యాదియందు తన మహిమయగు కాలముచే సత్త్వరజస్తమో గుణాత్మకమగు మాయాశక్తిని క్షోభిల్లజేసి, దానితో హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) సృష్టించును (ఆ రూపముగా ప్రకటమగును).
నానావిధమైన జగత్తును సృష్టించే ఆ సూత్రాత్మయే త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క మొదటి అభివ్యక్తి (ప్రకటరూపము). ఈ జగత్తంతయు ఆ సూత్రాత్మయందే పడుగు- పేకగా ఉన్నది. జీవుడు ప్రాణశక్తిరూపమైన ఆ సూత్రాత్మ ద్వారానే సంసారములో తిరుగాడుచున్నాడు. (పువ్వులలో దారము వలె, ప్రాణశక్తి సకలప్రాణులలో ఉండుటచే సూత్రమనబడును).
సాలె పురుగు తన హృదయమునుండి నోటిగుండా దారమును ప్రసరింపజేసి, ఆ గూడునందు విహరించి, మరల దానిని మ్రింగివేయును. ఇదే విధముగా, పరమేశ్వరుడు తననుండియే జగత్తును ప్రకటింపజేసి మరల దానిని తనలోనికి ఉపసంహరించును.
ప్రాణి నిశ్చయబుద్ధితో మనస్సును రాగము వలన గాని, ద్వేషము వలన గాని, భయము వలన గాని, దేని దేనియందైతే ఏకాగ్రముగా ధారణ చేయునో, ఆయా రూపమును పొందును.
ఒక రకం తేనెటీగ పురుగు(లార్వా) ను పట్టుకువచ్చి మట్టి గూడు లోపల పెట్టును. ఆ పురుగు ఆ యోగనే ధ్యానిస్తూ, పూర్వదేహమును విడిచి పెట్టకుండానే ఆ ఈగతో సమానమైన రూపమును పొందును.
ఓ రాజా! నేనీ విధముగా ఈ గురువులనుండి ఈ జ్ఞానమును నేర్చుకొంటిని. నా దేహమునుండి నేను నేర్చుకున్న జ్ఞానము (అనుభవము) ను చెప్పెదను వినుము.
దేహము నాకు గురువు. నేను వివేకవైరాగ్యములను దానినుండియే నేర్చుకున్నాను. ఇది జన్మమరణములను, నిరంతరమగు పీడ అనే ఉత్తరోత్తరఫలమును కలిగియుండుట ప్రసిద్ధమే. దీనితో నేను జీవేశ్వర జగత్తుల తత్త్వములను గురించి యథాతథముగా విచారము చేయుదును. అయినా, ఈ దేహము క్రిమికీటకాదులకు భక్ష్యమగుననే నిశ్చయబుద్ది నాకు గలదు. కావుననే, నేను దీనిపై ఆసక్తి లేకుండా సంచరిస్తున్నాను.
ఈ దేహమునకు ప్రీతి చేయగోరే మానవుడు కష్ట పడి ధనమును సంపాదించి భార్య, పిల్లలు, ధనము, పశువులు, సేవకులు, ఇల్లు, బంధువర్గములను విస్తరింపజేసి పోషించుచున్నాడు. చెట్లు మరణించే ముందు విత్తనమును సృష్టించును. అదే విధముగా, చెట్టువంటి ఈ దేహము కూడ తాను నశించే ముందు, ఈ జీవునకు ఇంకో దేహం పుట్టడానికి కావలసిన కర్మబీజమును సృష్టించును.
ఈ దేహాభిమానియగు పురుషుని జిహ్వ రుచ్యములగు పదార్థముల పై పునకు, దప్పిక పానీయములవైపునకు, జననేంద్రియము సంభోగము వైపునకు, చర్మము మధురమగు స్పర్శ వైపునకు, పొట్ట ఆహారము వైపున కు, చెవి సంగీతము మొదలగువాటి వైపునకు, ముక్కు సుగంధముల వైపు నకు, చంచలమగు కన్ను సుందరదృశ్యముల వైపునకు ఆకర్షించుచున్నవి. వీనిని చేయి మొదలగు కర్మేంద్రియములు వివిధవ్యాపారములలోనికి లాగుకొని పోవుచున్నవి. ఈ విధముగా ఈ ఇంద్రియములు, అనేకులగు భార్యలు గృహయజమానిని వలె, అన్ని వైపులకు లాగి వేయుచున్నవి.
భగవానుడు అనాదియగు తన మాయాశక్తితో చెట్లు, ప్రాకే ప్రాణులు, పశువులు, పక్షులు, ఈగలు, చేపలు మొదలైన వివిధదేహములను సృష్టించేను. కాని, ఆయనకు ఆయా దేహములచే సంతోషము కలుగలేదు. అపుడాయన పరబ్రహ్మసాక్షాత్కారమునకు యోగ్యమైన బుద్ధి గల మానవదేహమును సృష్టించి, ఆనందమును పొందెను.
ఈ మనుష్యజన్మ నిరంతరము వెనుకనుండి మృత్యువుచే తరుమ బడేది గనుక అశాశ్వతము. అయినప్పటికీ, పురుషార్థమునిచ్చేది గనుక, ఈ జన్మ సుతరాము దుర్లభమైనది. కావున, దీనిని పొంది వివేకవంతుడు శరీరము పడిపోయే లోపులోనే మోక్షము కొరకు శీఘ్రముగా సాధన చేయవలెను. విషయభోగములలో వ్యర్థము చేయరాదు. ఎందుకంటే, విషయభోగములు పశుపక్ష్యాదిజన్మలలో కూడా దొరుకును.
ఈ విధముగా నాకు వైరాగ్యము కలిగి నాయందు ఆత్మసాక్షాత్కారమనే దీపము వెలిగినది. నేను ఆసక్తిని, అహంకారమును విడిచి పెట్టి, ఈ లోకములో సంచరించుచున్నాను.
ఒకే గురువునుండి పొందిన జ్ఞానము సుస్థిరముగా, పూర్ణముగా ఉండదు. ఇది నిశ్చయము. ఎందుకంటే, రెండవది లేని ఈ పరబ్రహ్మతత్త్వాన్ని మహర్షులు పలు విధాలుగా వర్ణించినారు.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- గంభీరమైన జ్ఞానము గల ఆ దత్తాత్రేయ మహర్షి ఇట్లు పలికి యదువు వద్ద సెలవు తీసుకొనెను. యదువు నమస్కరించి ప్రార్థించగా, ఆయన సంతోషించి తాను వచ్చిన దారిన వెళ్లాను.
యదు మహారాజు మా పూర్వీకులకు పూర్వీకుడు. ఆయన అవధూత దత్తాత్రేయుని ఉపదేశమును విని, సకలమైన సంసారాసక్తులను విడిచి పెట్టి, సర్వమునందు ఈశ్వరుని దర్శించి జీవన్ముక్తుడాయెను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో దత్తాత్రేయగీతలో యదుమహారాజు జీవన్ముక్తుడగుటను వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
