శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
11 - భక్తి లక్షణములు
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బద్ధుడు, ముక్తుడు అనే వర్ణనము నాకు సత్త్వరజస్తమోగుణముల ఉపాధిని బట్టియే గాని వాస్తవముగా లేదు. గుణములు కూడ మాయనుండి ఆవిర్భవించినవియే గనుక వాస్తవములు కావు. కావున, నాకు బంధమోక్షములు లేవు.
ఆత్మ చైతన్యమునందు స్వప్న ప్రపంచము యథార్థముగా లేకున్నా భాసించును (వివర్తము, బుద్ధిపరిణామము). అదే విధముగా శోక మోహములు, సుఖదుఃఖములు, దేహము పుట్టుట అజ్ఞానముచే ఆత్మ స్వరూపమునందు భాసిల్లుచున్నవి. ఈ సంసారము సత్యము కాదు.
ఓ ఉద్దవా! నా మాయచే నిర్మించబడిన జ్ఞాన-అజ్ఞానములు నా శక్తులే. అనాదులగు అవి దేహధారులకు క్రమముగా మోక్షమును, బంధమును కలిగించునని తెలియుము.
గొప్ప బుద్ధిశాలివగు ఓ ఉద్దవా! జీవుడు నా అంశయే. ఈ జీవునకే అజ్ఞానముచే ఆది లేని బంధము. ఈ జీవునకే జ్ఞానముచే మోక్షము..
నాయనా! ఒకే దేహమునందు బద్దుడగు జీవుడు, ముక్తుడగు పరమాత్మ గలరు. వారి ధర్మములు పరస్పరవిరుద్దములు. వారికి గల తేడాను నేను నీకు చెప్పుచున్నాను.
ఈ జీవేశ్వరులు ఒకరినొకరు పోలియున్న మిత్రులు. ఇద్దరు చేతనులు, విడదీయ శక్యము కానివారు. వీరిద్దరు అనాదిమాయచే చెట్టువంటి ఒకే దేహమునాశ్రయించి ఉన్నారు. వారిలో జీవుడు చెట్టువంటి దేహము యొక్క ఫలమైన సుఖదుఃఖములననుభవించుచుండగా, పరమాత్మ వాటికి అతీతుడు. అయినా, జీవునికంటే పరమాత్మయొక్క శక్తి గొప్పది.
చెట్టుయొక్క ఫలమువంటి సుఖదుఃఖములను భోగించని ఆ సాక్షి చైతన్యము దేహేంద్రియాదిప్రకృతివర్గమునంతనూ ప్రకాశింపజేస్తూ దర్శించుటయే గాక, తాను స్వయముగా ప్రకాశించును. సుఖదుఃఖములయందు భోక్త యై తగుల్కొన్న జీవునకు తన స్వరూపము తెలియదు. కాబట్టి, జ్ఞానముతో నిండిన అభోక్తయే నిత్యముక్తుడు. జ్ఞానము లేని భోక్త సర్వదా బద్ధుడే.
స్వప్నమునుండి లేచినవానికి స్వప్నదేహముతో తాదాత్మ్యము ఉండదు. అదే విధముగా, ఆత్మజ్ఞానీ దేహధారిగా కనబడినా, ఆయనకు దేహముతో తాదాత్మ్యము ఉండదు. స్వప్నమును చూచుచున్నవానికి స్వప్నదేహముతో తాదాత్మ్యము ఉండును. అదే విధముగా, ఆత్మకు దేహముతో సంసర్గము లేకున్నా, ఆ జ్ఞానము లేనివాడు దేహముతో తాదాత్మ్యము కలిగియుండును.
గుణకార్యములైన చెవి మొదలగు ఇంద్రియములు గుణకార్యములే అయిన శబ్దాది విషయములను గ్రహించుచునే యుండును. అయిననూ, జ్ఞానియందు సుఖదుఃఖాది వికారములు గాని, తాను కర్తననే అహంకారము గాని ఉండవు.
ఆత్మానాత్మవివేకము లేనివాడు ప్రారబ్దమునకు వశమై యుండే ఈ దేహములో దానితో తాదాత్మ్యమును చెందియుండును. కావుననే, గుణకార్యములగు ఇంద్రియములు చేసే కర్మకు తానే కర్తనని భ్రమించి ఆ దేహమునందు నేను అనే బుద్ధితో సంసారమునందు బద్ధుడగుచున్నాడు.
జ్ఞాని ఈ విధముగా పరుండుట, కూర్చుండుట, సంచరించుట, స్నానము చేయుట, చూచుట, స్పృశించుట, ఆఘ్రాణించుట, భుజించుట, వినుట, పట్టుకొనుట మొదలగు ఇంద్రియకార్యములయందు రాగము లేక యుండును. సద్రూపుడగు ఆయన సన్నిధిలో ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తిల్లుచుండును. ఆయనకు దేహమునందున్ననూ దేహము పై నేను-నాది అనే అభిమానము లేదు. కావుననే, ఆయన ఆకాశసూర్యవాయువులవలె బద్దుడు అగుట లేదు. ఆకాశము సర్వవ్యాపకమైనా దేనితోనైననూ తగుల్కొనదు. సూర్యుడు సకలమును ప్రకాశింపజేసినా, దేనితోనైననూ తగుల్కొనడు. వాయువు అంతటా సంచరించినా, దేనితోనైననూ తగుల్కొనదు.
సాధకుడు నిపుణమైన ఆత్మానాత్మవివేకబుద్దికి వైరాగ్యముచే పదును పెట్టవలెను. అప్పుడాతని సంశయములు తొలగును. స్వప్నమునుండి మేల్కొన్నవానికి వలె ఆతనికి భేదబుద్ధి దూరమగును.
ఎవ్వాని కర్మేంద్రియ-జ్ఞానేంద్రియ-మనోబుద్దుల వ్యాపారములకు మూలములో కామనలు లేవో, అట్టివాడు దేహమునందే ఉన్నా జన్మమరణాది దేహధర్మములాతనిని స్పృశించవు.
హింసించే జనులు జ్ఞానియొక్క దేహమునొకప్పుడు హింసించ వచ్చును. ఈశ్వరేచ్చచే అనుకోకుండా ఎవరైనా ఆయనను కొంచెమైనా పూజించ వచ్చును. ఆయనలో ఈ మానావమానములు వికారమును కలిగించవు.
సమ (పరమాత్మ) దర్శనము గల జ్ఞాని మంచిని పలికి చేసే వారిని స్తుతించడు, చెడును పలికి చేసేవారిని నిందించడు. గుణదోషములకు అతీతుడగు ఆయన మౌనముగా నుండును.
మననశీలుడగు సాధకుడు తన స్వరూపమునందు రమిస్తూ మంచి-చెడులను చేయరాదు, పలుకరాదు, సంకల్పించరాదు. ఆతడీ పైన చెప్పిన విధముగా దేహమునందు నేను-నాది అనే అభిమానము లేకుండా, జడుడు వలె సంచరించవలెను.
వేదము రూపములో నున్నది పరబ్రహ్మయే. దానియందు నిష్ణాతుడైనా పరబ్రహ్మయందు నిష్ఠ లేనివాడు చేసే పరిశ్రమకు, పాలివ్వని ఆవును పాలించువానికి వలే, ఫలము శ్రమయే యగును (పురుషార్థము లేదు).
ఓ ఉద్దవా! ఇచ్చే పాలను ఇచ్చేసిన (ఇప్పుడు పాలివ్వని) ఆవును, దుష్టురాలగు భార్యను, ఇతరులచే పోషించబడే శరీరమును, దుష్టులైన సంతానమును, సత్పురుషులకు దానము చేయని అపవిత్రమైన ధనమును, నన్ను (భగవానుని) కీర్తించని వాగింద్రియమును పాలించువానికి దుఃఖము మీద దుఃఖము కలుగుచుండును.
ఓ ఉద్దవా! పావనమైన నా చేష్ట యే ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయ ములకు హేతువు. నేను లీలచే స్వీకరించే అవతారములయందలి నా జన్మను భక్తులు కోరెదరు. అట్టి నా కర్మను గాని, జన్మను గాని వర్ణించని వాక్కు నిష్ఫలము. వివేకవంతుడు అట్టి వాక్కును కలిగి యుండరాదు.
ఈ విధముగా ఆత్మవిచారము చేసి ఆత్మ అనేకమనే భ్రమను పోనాడవలెను. మనస్సును శుద్ధము జేసి సర్వవ్యాపకుడనగు నా (పరమేశ్వరుని) యందు సమర్పించవలెను. అపుడు సాధకుడు సకలకర్మలనుండి ఉపరతిని జేయవలెను.
మనస్సును పరబ్రహ్మయందు నిశ్చలముగా నిలుపుము. అట్లు చేయలేకపోయినచో, సకలకర్మలను ఫలాపేక్ష లేకుండా నాయందు సమర్పించి బాగా చేయుము.
సాధకుడు పరమకల్యాణకరములై లోకములను పావనము చేసే నా గాథలను శ్రద్ధతో విని, కీర్తించి, నిరంతరముగా స్మరించవలెను. నా అవతారములను, లీలలను నాటకాదుల ద్వారా అభినయింపజేయవలెను.
ఓ ఉద్దవా! నేనే ఆశ్రయముగా గల సాధకుడు ధర్మమును నా ప్రీతి కొరకు, భోగములను నా ప్రసాదముగా, సంపదను నా ఆరాధన కొరకు వినియోగిస్తూ సేవించవలెను. అట్టి సాధకుడు కాలాతీతుడనగు నాయందు నిశ్చలమగు భక్తిని పొందును.
ఎవడైతే సత్పురుషులతో సంగము వలన నాయందు భక్తిని పొంది నన్ను ఉపాసించునో, అట్టివానికి నా పరమపదమును సత్పురుషులే చూపించేదరు. ఆతడు నన్ను నిశ్చయముగా సునాయాసముగా పొందును.
ఉద్ధవుడిట్లు ప్రశ్నించెను --- ఓ ప్రభూ! నీ గొప్ప కీర్తిని మహాత్ములు కీర్తించెదరు. నీ దృష్టిలో సత్పురుషుడనగా యెవరు? సత్పురుషులు ఆదరముగా స్వీకరించే ఎట్టి భక్తిని నీయందు చేయదగును?
ఓ జగన్నాథా! సకలలోకములకు అధ్యక్షుడవగు నీవు సకలప్రాణులలో సాక్షి చైతన్యమవై ఉన్నావు. నేను భక్తితో శరణు వేడి ప్రణమిల్లుచున్నాను. నాకీ విషయమును చెప్పుము.
ఓ భగవానుడా! పరబ్రహ్మవగు నీవు ఆకాశము వలె అసంగుడవు, ప్రకృతికి అతీతుడవు. అయిననూ, నీవు భక్తుల కోర్కెను తీర్చుటకై పరిచ్ఛిన్నమైన దేహమును స్వీకరించి అవతరించితివి.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- భగవద్భక్తుడు దయామయుడు. ఆతడు ఏ ప్రాణీ కైననూ ద్రోహము చేయడు. సహనశీలుడగు ఆయనయొక్క గొప్ప బలము సత్యమే. భక్తుడు నిర్మలమగు అంతఃకరణము గలవాడై శత్రుమిత్రుల యెడల సమచిత్తముతో నుండును. ఆతడు సర్వులకు ఉపకారమును చేయును.
భక్తుని బుద్ది కోరికలచే కల్లోలితము కాదు. ఆతడు ఇంద్రియనిగ్రహము తో మెత్తని శాంతమైన స్వభావమును కలిగియుండును. శుద్దమైన నడవడి తో పరిగ్రహము (భోగసామగ్రిని ప్రోగుచేయుట) లేకుండ నుండును. ఆయన ఇహపరఫలములను కోరి కర్మలను చేయడు. మితముగా భోజనము చేసే ఆతడు నిశ్చలమగు భక్తితో నన్నే శరణువేడి ధ్యానించును.
భక్తుడు గంభీరమగు హృదయముతో సావధానుడై యుండును. ఆకలిదప్పికలు, శోకమోహములు, వృద్దాప్యమరణములు అనే ఆరు జీవనతరంగములనాతడు ధైర్యముతో జయించును. ఆతడు అహంకారము లేనివాడై ఇతరులను సమ్మానించును. సమర్థుడగు ఆతడు స్నేహశీలి, దయామయుడు. ఆతడు ఆత్మతత్త్వమునరయును.
నేను అనేకధర్మములను ఉపదేశించితిని. వాటిని అనుష్ఠించుటయందు అంతఃకరణశుద్ధి మొదలైన గుణములు, చేయకపోవుటయందు నరకము మొదలగు దోషములు గలవు. అయినప్పటికీ, ఈ సకలధర్మములను విడిచి కూడ ఎవడైతే నన్ను భజించునో, వాడు సత్పురుషులలో శ్రేష్ఠుడు.
నేను ఎంతటివాడను? ఎవ్వాడను? ఎటువంటివాడను? అనే విషయము తెలిసి గాని, తెలియక గాని ఎవరైతే నన్ను రెండవది లేని భక్తితో సేవించెదరో, వారు భక్తులలో శ్రేష్ఠులని నా అభిమతము.
నా మూర్తులను, సాలగ్రామములను, నా భక్తులను దర్శించుట, స్పృశించుట, పూజించుట, సేవించుట, స్తుతించుట, నమస్కరించుట, నా గుణములను లీలలను నిరంతరముగా కీర్తించుట భక్తిలక్షణములు.
ఓ ఉద్దవా! నా కథలను వినుటయందు శ్రద్ద, నన్ను నిరంతరముగా ధ్యానించుట, లభించిన సర్వమును నాకు సమర్పించుట, దాసభావముతో తనను తాను సమర్పించుకొనుట అనేవి భక్తిలక్షణములు.
నా అవతారములను లీలలను చెప్పుట, నా పర్వదినములలో పాటలు, నాట్యములు, వాద్యములు, గోష్ఠులను చేసి చేయించుట, నా మందిరములయందు ఉత్సవములను చేసి చేయించుట భక్తిలక్షణములు.
తీర్థయాత్ర, ప్రతిసంవత్సరము వచ్చే సకలపర్వదినములయందు పూజలను చేయుట, వైదికపద్దతిలో లేక తాంత్రికపద్దతిలో దీక్ష, నాకు చెందిన వ్రతములను పాలించుట అనేవి భక్తిలక్షణములు.
నా మూర్తిని స్థాపించుటయందు శ్రద్ద భక్తిలక్షణము. భక్తుడు పూదోట, పళ్ల తోట, విహారస్థానము, మందిరములను నిర్మించే ప్రయత్నమును తనంత తాను గాని, నలుగురితో కలిసి గాని చేయవలెను.
నిష్కపటముగా (ఫలతృష్ణ లేకుండా) సేవకుని వలే నా మందిరమునందు తుడుచుట, అలుకుట, నీరు చల్లుట, సర్వతోభద్రము మొదలైన మండలములను చేయుట మొదలగు సేవ భక్తికి లక్షణము.
అభిమానము, ఆత్మజ్ఞాఘనము, డాంబీకము, తాను చేసిన పనిని కీర్తించుట అనేవి భక్తునియందు ఉండరాదు. నాకు సమర్పించిన దీపమును కూడ ఇతరకార్యములకు వాడరాదు. కావుననే, రెండు వత్తులను వెలిగించవలెను. ఇతరులకు నివేదించినదానిని నాకు సమర్పించరాదు.
లోకమునందు ఎయ్యది చాల ప్రియమైనదో, ఏది తనకు చాల ప్రియమో, దానిని నాకు నివేదించవలేను. అది అనంతఫలమునిచ్చును.
మంగళకరుడవగు ఓ ఉద్దవా! సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవులు, విష్ణుభక్తుడు, ఆకాశము, వాయువు, నీరు, భూమి, ఆత్మ చైతన్యము, సకలప్రాణులు అనునవి నన్ను పూజించే స్థానములు.
ఓ ఉద్దవా! వైదికమంత్రములతో ఉపస్థానము అర్ఘ్యమునిచ్చుట ఇత్యాదులచే సూర్యునియందు, హవిష్ణును హోమము చేయుటచే అగ్నియందు, అతిథిపూజచే శ్రేష్ఠుడగు బ్రాహ్మణునియందు, గడ్డి-నీరు మొదలగువాటిచే ఆవులు-ఎద్దులయందు నన్ను ఆరాధించవలెను.
విష్ణుభక్తుని బంధువును వలె సమ్మానించుటచే, హృదయమునందు నన్ను నిష్ఠతో ధ్యానించుటచే, వాయువునందు ముఖ్యప్రాణమైన హిరణ్యగర్భుడనే భావనచే, నీటియందు నీరు-పుష్పములు మొదలైన ద్రవ్యములను సమర్పించుటచే, నన్ను ఆరాధించవలెను.
ప్రతిమ గల భూమియందు రహస్యమంత్రములతో, ఆత్మరూపుడనగు నన్ను దేహమునకు యోగ్యమైన భోగములనిచ్చుటచే, సకలప్రాణులలో సాక్షి చైతన్యరూపుడనగు నన్ను సర్వప్రాణులపై సమచిత్తముచే మరియు సుఖదుఃఖములయందు సమచిత్తముతో ఆరాధించవలెను.
శంఖము, చక్రము, గద, పద్మములతో కూడిన నా శాంతమైన రూపమును సాధకుడు ఏకాగ్రచిత్తముతో ఈ అధిష్టానములయందు ధ్యానిస్తూ, ఈ (పైన చెప్పిన విధముగా ఆరాధించవలెను.
ఎవడైతే ఏకాగ్రచిత్తము గలవాడై నన్నీ విధముగా వైదికకర్మలతో, సత్రములను నిర్మించుట మొదలైన పూర్త (ప్రజోపకార) కర్మలతో ఆరాధించునో, ఆతడు మంచి భక్తిని పొందును. సత్పురుషులను సేవించుటచే ఆతనికి నిరంతరము నా స్మరణము కలుగును.
ఓ ఉద్దవా! సంసారమును తరించుటకు సత్సంగము వలన కలిగే భక్తియోగము మినహా మంచి ఉపాయము ఇంకోటి నిశ్చయముగా లేదు. ఎందుకంటే, సత్పురుషుల జీవితలక్ష్యము నేనే.
యదువంశనందనుడవగు ఓ ఉద్దవా! తరువాత నీకీ గొప్ప రహస్యమును చెప్పెదను, వినుము. నీవు నాకు సేవకుడవు, హితకారివి, మిత్రుడవు. కావుననే, నేనీ గొప్ప రహస్యమును నీకు చెప్పెదను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో
భక్తలక్షణములను వర్ణించే
పదకొండవ అధ్యాయము ముగిసినది.
