శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
6 - దేవతలు శ్రీకృష్ణ భగవానుని దర్శించి స్తుతించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వసుదేవునకు ఆత్మవిద్యను ఉపదేశించడమైనది. అప్పుడు బ్రహ్మదేవుడు సనకాది పుత్రులతో, ఇంద్రాది దేవతలతో, మరీచి మొదలగు ప్రజాపతులతో గూడి ద్వారకకు వెళ్లాను. భూతభవిష్యత్తులకు నియామకుడగు శివుడు కూడ ప్రమథగణములతో గూడి వెళ్లెను.
పూజనీయుడగు ఇంద్రుడు, మరుద్గణములు, ఆదిత్యులు, వస్తువులు, అశ్వినీ దేవతలు, ఋభువులు, అంగీరసులు, రుద్రులు, విశ్వేదేవతలు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, యక్షులు ద్వారకకు వెళ్లిరి.
మహర్షులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు అందరు శ్రీకృష్ణుని చూడగోరి ద్వారకకు కలిసి వెళ్లిరి.
శ్రీకృష్ణభగవానుని ఆ రూపము సకలజనుల మనస్సును రంజిల్లజేసెను. సకలజనుల పాపములను పోగొట్టే ఆయన కీర్తి లోకములలో విస్తరించెను.
గొప్ప సంపదలతో నిండి విశేషముగా ప్రకాశించుచున్న ద్వారకయందు శ్రీకృష్ణుని దర్శనము వారికి అచ్చెరువును గొలి పెను. ఆయననూ చూస్తూంటే వారి కన్నులకు తృప్తి లేకుండెను.
వారు యాదవశ్రేష్ఠుడు, జగన్నాథుడు అగు శ్రీకృష్ణుని, స్వర్గములోని నందనవనమునుండి తెచ్చిన పూలతో ముంచెత్తిరి. అపుడు వారాయనను మనోహరములైన పదములు, భావములు గల వాక్కులతో స్తుతించిరి.
దేవతలు పలికిరి -- ప్రభూ! మేము నీ పాదపద్మమును బుద్ది, ఇంద్రియ ములు, ప్రాణము, మనస్సు, వాక్కులతో నమస్కరించుచున్నాము. కర్మ అనే గట్టి బంధమునుండి విముక్తిని కోరే భక్తియోగులు హృదయము లోపల నీ పాదపద్మమును ధ్యానము చేయుదురు.
పరాజయమునెరుగని ఓ దేవా! నీవు త్రిగుణాత్మకమగు మాయాశక్తిని వశము చేసుకొని నీయందే ఊహ చేయ శక్యము కాని దృశ్యజగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నావు. కాని, నీవీ కర్మలతో లేపమును పొందుట లేదు. ఇది నిశ్చయము. ఎందుకంటే, దోషరహితుడవగు నీవు ఆవరణము లేని స్వరూపానందమునందు రమించెదవు.
కొనియాడదగిన ఓ శ్రేష్ఠుడా! మానవులు సత్త్వగుణప్రధానమైన అంతః కరణముతో నీ యశస్సును శ్రవణము చేస్తే దృఢమైన శ్రద్ధ పరిపుష్టమై బాగా వర్ధిల్లును. అట్టి శ్రద్ధచే అంతఃకరణమే విధముగా శుద్దమగునో, రాగద్వేషములచే కలుషితమైన అంతఃకరణము ఆ విధముగా ఉపాసన, వేదాధ్యయనము, దానము, తపస్సు, యజ్ఞాది కర్మలచే పరిశుద్ధము కాదు.
మునులు ప్రేమచే ఆర్ద్రమైన హృదయములో నీ పాదమును ధ్యానించెదరు. సత్త్వగుణప్రధానులగు ఆత్మవేత్తలు వాసుదేవ-సంకర్షణప్రద్యుమ్న-అనిరుద్దుల (చతుర్వ్యూహ) ఉపాసనయందు మూడు పూటలా నీ పాదమునర్చించెదరు. వారు స్వర్గమునతిక్రమించి వైకుంఠమునందు నీతో సమానమైన మహిమను పొందెదరు. అట్టి నీ పాదము మా హృదయములోని అమంగళవాసనలకు అగ్ని అగు (నశింపజేయు) గాక!
ఓ ఈశ్వరా! ఋత్విక్కులు సంయతమైన చేతులతో హవిస్సును పట్టుకొని ఆహవనీయాగ్నియందు వేదవిహితమైన పద్దతిలో హోమమును చేస్తూ నీ పాదపద్మమును ధ్యానించెదరు. ఆత్మస్వరూపాన్ని కప్పివేసే మాయను తెలియగోరే జిజ్ఞాసువులు అధ్యాత్మయోగమునందు నీ పాదపద్మమునే ధ్యానము చేయుదురు. గొప్ప భగవద్భక్తులు సర్వదా పూజించేది నీ పాదపద్మమునే.
ఓ ప్రభూ! నీ వక్షఃస్థలము పై లక్ష్మీదేవితో బాటుగా వనమాల కూడ కలిసి నివసిస్తూ, పూజనీయురాలగు ఆమెకు సవతి వలె స్బర్గను కలిగించుచున్నది. కాని, నీవు వనమాల చక్కగా సంపన్నము చేయుచున్న పూజను స్వీకరించుచున్నావు. నీ పాదము మా అమంగళవాసనలను ఎల్లవేళలా నశింపజేయుగాక!
ఓ పరబ్రహ్మా! వామనావతారములో నీవు మూడు అడుగులతో కొలిచిన సందర్భములో సత్యలోకమును చేరిన నీ పాదము ఎత్తైన జెండా వలె శోభిల్లెను. మూడు లోకములలో ప్రవహించే గంగానది నీ పాదముయొక్క మూడు పతాకలవలే నున్నది. నీ పాదము దేవతల సేనకు అభయమును, రాక్షసుల సేనకు భయమును కలిగించును. నీ పాదము సత్పురుషులకు స్వర్గమును, దుష్టులకు నరకమును ఇచ్చును. ఓ భగవానుడా! అట్టి నీ పాదము మా పాపములను పోగొట్టుగాక!
బ్రహ్మదేవుడు మొదలుకొని సకలదేహధారులు పరస్పరము ఈర్ష్య మొదలైన గుణములచే పీడను పొందుచుందురు. వారు ముక్కు త్రాడు వేయబడిన ఎద్దులు వలె నీకు వశులై యున్నారు. పురుషోత్తముడవగు నీవు ప్రకృతికి, జీవులకు అతీతుడవై, సర్వమును ప్రవర్తిల్లజేయుచున్నావు. నీ పాదము మాకు సుఖమును విస్తరిల్లజేయుగాక!
ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. మాయాశక్తి, జీవులు, మహత్తత్త్వము అనువాటిని నియమించేది నీవేనని మహాత్ములు చెప్పెదరు. శీతవర్ష గ్రీష్మముల రూపములో నున్న సంవత్సరరూపమైన ఆ ఈ కాలము నీవే. కాలరూపుడవై సర్వమును నశింపజేసే నీ వేగమునకు అడ్డు లేదు. నీవే పురుషోత్తముడవు.
హిరణ్యగర్భుడు నీ (పరబ్రహ్మ) నుండి (మాయా) శక్తిని పొంది, మొక్కవోని శక్తి గలవాడైనాడు. ఆయన ఈ జగత్తునకు బీజమనదగిన మహత్తత్త్వము (సమష్టి క్రియాజ్ఞానశక్తి) ను ప్రకటించినాడు. ఆ శక్తితో కూడిన హిరణ్యగర్భుడు తేజస్సుతో నిండియున్న బ్రహ్మాండమును సృష్టించినాడు. దానియందు చుట్టూ ఏడు ఆవరణలు (పంచభూతములు, అహంకారము, మనస్సు) గలవు.
ఓ ఇంద్రియాంతర్యామీ! మాయాశక్తి తనయందలి గుణముల మేళవింపుతో విజృంభించి శబ్దాదివిషయములను నీ యెదుట ప్రస్తుతించును. శుద్ధచైతన్యస్వరూపుడవగు నీవు వాటిని సేవించుచున్ననూ లేపమును పొందవు. కావుననే, నీవు స్థావరజంగమాత్మకమగు జగత్తునకు - అధీశ్వరుడవై ఉన్నావు. కాని, నీకంటే తాము భిన్నులమని భ్రమించే జీవులు స్వతహాగా ఆత్మకు విషయసంబంధము లేకున్నా, ఉందని భ్రమపడి, ఆ విషయములకు భయపడుచుందురు.
పదునారు వేల భార్యలు చిరునవ్వుతో కూడిన ప్రక్క చూపుల ద్వారా ప్రేమను ప్రకటిస్తూ, కనుబొమలను గుండ్రముగా త్రిప్పుటచే ప్రగల్భములైన ప్రేమతోడి హావభావములను శ్రీకృష్ణునిపై బరపెడివారు. కాని, ఆయన అసంగుడే. మన్మథుని బాణములనదగిన వారి కౌగిలింత మొదలైన చేష్టలు కూడ ఆయన మనస్సును కల్లోలపరచలేకపోయెను.
నీ పాదములనుండి పుట్టిన మందాకిని మొదలైన నదులు మాత్రమే గాక, నీ అమృతగాథలనే నదులు కూడ ముల్లోకముల పాపములను పోగొట్ట సమర్థములు, శుద్ధిని గోరు జనులు రెండు రకముల తీర్థములను సేవింతురు, వేదములలో వర్ణించబడే నీ కీర్తి అనే తీర్థమును చెవులతో, నీ పాదములనుండి పుట్టిన గంగ అనే తీర్థమును స్నానములతో సేవింతురు.
శుక మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మదేవుడు శివునితో, దేవతలతో గూడి శ్రీకృష్ణునీ విధముగా స్తుతించెను. అపుడాయన ఆకాశమునందున్నవాడై శ్రీకృష్ణుని ప్రణమిల్లి ఇట్లు పలికెను.
బ్రహ్మదేవుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! సర్వముయొక్క ఆత్మ నీవే. భూమియొక్క భారమును తగ్గించుమని మేము నీకు ఇదివరలో విజ్ఞప్తి చేసితిమి. నీవా పనిని అదే విధముగా సంపన్నము చేసితివి.
నీవు సత్యసంధులైన సత్పురుషులయందు నిశ్చయముగా ధర్మమును స్థాపించి, సకలజనుల పాపములను పోగొట్టే కీర్తిని దిక్కులలో విస్తరింప జేసితివి.
నీవు యదువంశములో సర్వోత్తమమైన రూపముతో అవతరించి, జగ త్తునకు హితము చేయుటకై గొప్ప పరాక్రమము గల కర్మలను చేసితివి.
ఓ ప్రభూ! కలియుగములో సత్పురుషులగు మానవులు నీ లీలలను శ్రవణము చేసి కీర్తించి, అజ్ఞాన(నరక)మును తేలికగా దాటివేయగలరు.
ఓ పురుషోత్తమప్రభూ! తమరు యదువంశములో అవతరించి నూట ఇరవై అయిదు సంవత్సరముల కాలము గడిచిపోయెను.
సకలజగత్తునకు ఆధారమైన దేవా! ఇప్పుడు దేవకార్యమేమీ మిగిలి లేదు. ఈ యాదవవంశము కూడ మహరుల శాపముచే ఇంచుమించుగా నశించినది.
ఓ వైకుంఠనాథా! కాబట్టి, నీకిష్టమైనచో సర్వోత్తమమైన నీ వైకుంఠధామమును ప్రవేశించుము. లోకపాలురమైన మేము లోకములతో సహా నీ కింకరులము. మమ్ములను కాపాడుము.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- దేవనాయకుడవగు ఓ బ్రహ్మదేవా! నీవు చెప్పిన ఈ విషయమును గురించి నేను నిశ్చయించితిని దేవకార్యమంతయు పూర్తి అయినది. భూమియొక్క భారము తొలగించబడినది.
బలపరాక్రమములచే, సంపద చే గర్వము పెరిగిన ఈ యాదవవంశీయులు లోకమును నశింప ఉద్యుక్తు లైనారు. మహాసముద్రమును చెలియలికట్ట వలె, నేను వీరిని అడ్డుకొంటిని.
గర్వితులైన యాదవుల విశాలమైన వంశమును నేను ఉపసంహరించ కుండా నా ధామమునకు వెళ్లిపోతే, వీరు (సునామీ వలే) మర్యాదనుల్లంఘించి ఈ లోకమునకు వినాశమును తెచ్చి పెట్టెదరు.
పాపరహితుడవగు ఓ బ్రహ్మదేవా! ఇప్పుడు మహర్షుల శాపము వలన యాదవకులవినాశము ఆరంభమైనది. ఈ వంశము అంతమైన పిదప నేను నీ లోకమునకు కూడ రాగలను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగన్నాథుడగు శ్రీకృష్ణుడీ విధముగా చెప్పగా, స్వయంభువుడగు బ్రహ్మదేవుడు ఆయనకు ప్రణమిల్లి, దేవగణములతో కూడి తన ధామమునకు వెళ్లెను.
తరువాత ద్వారకలో పెద్ద చెడు శకునములు బయలు దేరెను. శ్రీకృష్ణ భగవానుడు వాటిని చూచి, తన వద్దకు వచ్చిన యాదవుల పెద్దలనుద్దేశించి ఇట్లు పలికెను.
శ్రీకృష్ణ భగవానుడు పలికెను - ఈ ద్వారకయందు ఈ చాల పెద్ద అప శకునములు నిశ్చయముగా బయలు దేరుచున్నవి. ఎందుకంటే, మహర్షుల నుండి మన వంశమునకు అతిక్రమించ శక్యము కాని శాపము కలిగినది.
ఓ పెద్దలారా! మనము జీవించియుండగోరే పక్షములో ఇక్కడ (ద్వారకలో) ఉండరాదు. ప్రభాసక్షేత్రము చాల గొప్ప పుణ్య క్షేత్రము. ఈనాడే విలంబము లేకుండా అక్కడకు వెళ్లేదము.
దక్షుని శాపము వలన నక్షత్రాధిపతియగు. చంద్రుని క్షయరోగము పట్టుకొనెను. ఆయన ప్రభాసక్షేత్రములో స్నానము చేయగానే వెంటనే ఆ రోగము తొలగిపోయి, కళలు మరల వృద్ధి చెందెను.
మనము కూడ ఆ క్షేత్రములో స్నానము చేసి, దేవతలకు పితృదేవతలకు తర్పణములనిచ్చి, సౌరస్యము ఇత్యాది అనేకగుణములు గల ఆహారమును ఉత్తములైన బ్రాహ్మణులకు సమర్పించెదము.
యోగ్యులగు ఆ బ్రాహ్మణులకు భవిష్యత్తులో మహాఫలమునిచ్చే విత్తనములవంటి గొప్ప దానములను శ్రద్ధతో ఇచ్చి, ఆ దానములచే, నావలచే సముద్రమును వలే, నిశ్చయముగా పాపములనతిక్రమించెదము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- వంశమునానందింపజేసే ఓ మహారాజా! శ్రీకృష్ణ భగవానుడీ విధముగా ఆదేశించగా, యాదవులు వెళ్లుటకు నిశ్చయించుకొని, రథములకు గుర్రములను పూన్చిరి.
ఓ రాజా! శ్రీకృష్ణ భగవానుని ఎల్లవేళలా సేవించే ఉద్దవుడు శ్రీకృష్ణుని మాటను వినెను. భయంకరములైన అపశకునములను ఆయన కూడ చూచెను. ఆయన యాదవుల ఆ ప్రయాణసన్నాహమును చూచెను.
ఉద్ధవుడు జగత్తులోని ప్రభువులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి, రెండు పాదములకు తల వంచి నమస్కరించి, దోసిలి యొగ్గి ఆయనతో నిట్లనెను.
ఉద్దవుడిట్లు పలికెను --- యోగులను పాలించే ఓ శ్రీకృష్ణా! నీవు దేవతలకు ప్రభువులగు బ్రహ్మాదులకు కూడ శాసకుడవు. నీ గురించి చేసే శ్రవణకీర్తనములు మానవులను పవిత్రులను చేయును. నీవీ యాదవవంశమును ఉపసంహరించి నిశ్చయముగా భూలోకమును విడిచి పెట్టబోవుచున్నావు. ఏలయన, ఈశ్వరుడవగు నీకు మహర్షుల శాపమునకు విరుగుడు చేసే శక్తి ఉన్నది. కాని నీవు అట్లు చేయలేదు.
ఓ కేశవా! నేను నీ పాదపద్మమును అరక్షణమైననూ విడిచి ఉండుటను సహించలేను. ఓ నాథా! నన్ను కూడ నీ ధామమునకు గొని పొమ్ము.
ఓ శ్రీకృష్ణా! నీ లీల మానవులకు గొప్ప కల్యాణకారి. చెవులకు అమృతమైన నీ లీలాశ్రవణమును చేసిన మానవుడు ఇతరమునందలి కామనను విడిచి పెట్టును.
నిద్ర, కూర్చుండుట, సంచరించుట, నిలబడుట, స్నానము చేయుట, ఆటలాడుట, భోజనము చేయుట, పూజలను చేయుట ఇత్యాదులయందు భక్తులమగు మేము నిన్ను సేవించితిమి. నీవు ప్రియమగు ఆత్మవు. నిన్ను ఎట్లు విడువగలము?
నీకు దాసులమగు మేము నీవు వినియోగించిన మాలలు, గంధము, వస్త్రములు, అలంకారములను అలంకరించుకొనెదము. నీవు తినగా మిగిలినదానిని భుజించే మేము మాయను నిశ్చయముగా జయించెదము.
మహర్షులు గాలిని భోజనము చేస్తూ (మితాహారము) ఊర్ధ్వరేతస్కులై కఠినమగు సాధనను చేసెదరు. సర్వసంగపరిత్యాగులగు వారియందు కామక్రోధాదులు గాని, పాపములు గాని ఉండవు. భిక్షాటన చేసి జీవించే ఆ మహర్షులు అక్షరపరబ్రహ్మ అని వర్ణించబడే నీ స్వరూపమును (ఆత్మరూపముగా) పొందెదరు.
ఓ మహాయోగీ! మేమైతే ఈ లోకములో కర్మలచే నిర్మించబడే సంసార మార్గములయందు తిరుగాడుచున్నాము. మేము నీ భక్తులతో గూడి నిన్నే స్మరిస్తూ, దాట శక్యము కాని అజ్ఞానమును దాటి వేయగలము.
నీ నడక, చిరునవ్వుతోడి చూపు, పరిహాసము మొదలైన మానవుల అనుకరణమును, లీలలను, ఉపదేశములను స్మరించి కీర్తించువారు మోక్షమును పొందెదరు.
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను. --- ఓ పరీక్షిన్మహారాజా! దేవకీ నందనుడగు శ్రీకృష్ణ భగవానునకు ప్రీతిపాత్రుడగు ఉద్ధవుడీ విధముగా విన్నవించెను. అప్పుడాయన అనన్యభక్తుడగు ఉద్ధవునితో నిట్లనెను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో దేవతలు శ్రీకృష్ణ భగవానుని దర్శించి స్తుతించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).
