శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
24 - ప్రకృతి పురుష వివేకము
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- భిక్షుగీతము తరువాత నీకు ప్రకృతిపురుషవివేకమును బాగుగా వర్ణించి చెప్పెదను. దీనిని పూర్వజులైన మహర్షులు విశేషముగా నిర్ధారించిరి. దీనిని తెలుసుకొని మానవుడు వెంటనే (శత్రుమిత్రాది) భేదబుద్దిని, దాని వలన కలిగే సంసారభ్రమను తొలగించుకొనును.
సృష్టికి ముందు ప్రళయమునందు దృశ్యజగత్తంతయు విజాతీయ సజాతీయ స్వగత భేదములు లేని జ్ఞానఘనమగు పరబ్రహ్మగనే ఉండెను. కృతయుగమునందలి జనులు వివేకనిపుణులై యుండిరి. అప్పుడు, వివేకవంతులకు ఏ కాలములోనైనా, అటులనే స్ఫురించెను.
శ్రుతిప్రసిద్ధమైన పరబ్రహ్మ అద్వయము, భేదములు లేనిది. వాక్కునకు, మనస్సునకు గోచరము కాని ఆ పరబ్రహ్మ సదనము (పరమార్థము). అదియే వాక్కునకు మరియు మనస్సునకు గోచరమయ్యే దృశ్యజగత్తు, ద్రష్ఠయగు జీవుడు అనే రెండుగా ప్రకటమయ్యెను.
ఆ రెండింటిలో ఒకటి ప్రకృతి. దానికి కారణము, కార్యము అనే రెండు రూపములు గలవు. రెండవ తత్త్వము ద్రష్ట. దానికే పురుషుడని పేరు.
జీవుల ప్రారబ్ధకర్మల ప్రేరణచే కాలరూపుడనగు నేను ప్రకృతిసామ్యావస్థలో క్షోభను కలుగజేసితిని. అట్టి ప్రకృతియందు సత్త్వరజస్తమస్సులనే గుణములు ఉండును.
ఆ గుణములనుండి సూత్రమనబడే సమష్టి క్రియాశక్తి మహత్ అనబడే సమష్టి విజ్ఞానశక్తితో గూడి (హిరణ్యగర్భతత్త్వము) ప్రకటమయ్యెను. అది వికారము జెంది సమష్టి-అహంకారము పుట్టెను. జీవునకు వ్యామోహము (దేహాద్యభిమానము) ను కలిగించేది అహంకారమే.
అహంకారము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములు. శబ్దాది తన్మాత్రలు, ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియానుగ్రాహక దేవతలు దానినుండియే పుట్టెను. అది చైతన్యాభాసను గ్రహించే జడతత్త్వము.
తామసాహంకారమునుండి పంచ తన్మాత్రలు, వాటినుండి పంచమహాభూతముల రూపములోనున్న దృశ్యజగత్తు పుట్టెను. రాజసాహంకారమునుండి ఇంద్రియములు, సాత్త్వికాహంకారమునుండి పదకొండుగురు ఇంద్రియానుహక దేవతలు పుట్టిరి.
ఈ తత్త్వములకు శక్తిని నేను అనుగ్రహించితిని. అవి అన్నీ కలిసి పని చేసి బ్రహ్మాండమును సృష్టించినవి. అది నాకు ఉత్తమమగు క్రీడాస్థానము.
నీటియందు స్థితి గల ఆ బ్రహ్మాండమునందు నేను నారాయణుడనై ప్రకటమైతిని. నా నాభియందు జగత్కారణమైన పద్మము ప్రకటమయ్యెను. దానియందు స్వయంభువుడగు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యెను.
బ్రహ్మాండరూపుడగు ఆ బ్రహ్మదేవుడు తపస్సు చేసి నా అనుగ్రహమును పొందెను. ఆయన రజోగుణము ద్వారా లోకపాలకులతో సహా, భూమి, అంతరిక్షము, స్వర్గము అనే మూడు లోకములను (మహరాది లోకములను కూడ) సృష్టించెను.
దేవతలకు స్వర్గము, భూతగణములకు అంతరిక్షము, మానవులు మొదలైన ప్రాణులకు భూలోకము, సిద్ధులకు ఈ మూడు లోకములకు పైన మహరాదిలోకములు నివాసస్థానములాయెను.
సర్వసమర్థుడగు బ్రహ్మదేవుడు భూమికి క్రింద అసురులకు, నాగులకు నివాసమును సృష్టించేను. సత్త్వరజస్తమోగుణములచే ప్రవర్తిల్ల జేయబడే సకలకర్మల ఫలములు భూర్భువస్స్వర్లోకములు మూడింటిలోనుండును.
యోగము, తపస్సు, సన్న్యాసము అనువాటికి మహః, జనః, తపః, సత్యమ్ అనే శుద్ధమైన (రాగద్వేషాదులు లేని లోకములు ఫలము. భక్తియోగమునకు నా ధామము ఫలము.
కాలరూపుడను, కర్మఫలదాతను అగు నేను ఈ జగత్తును కర్మఫలము లతో కూడునట్లు చేసితిని. సత్త్వరజస్తమోగుణముల ప్రవాహమైన ఈ సంసారమునందు జీవుడు (పుణ్యముచే) స్వర్గాది ఊర్ధ్వలోకములను, (పాపముచే) భూమి మొదలగు క్రింది లోకములను పొందును.
చాల చిన్నది గాని, చాల పెద్దది గాని, సన్ననిది గాని, లావుది గాని ఏయే పదార్థము ప్రసిద్దమై యున్నదో, ఆ సర్వము ప్రకృతిపురుషులు రెండింటిచే వ్యాపించబడి యున్నది.
మట్టియొక్క వికారము కుండ. బంగారముయొక్క వికారము నగ. ఆది-అంతములలో మట్టి, బంగారము మాత్రమే ఉన్నాయి (సత్). కుండ, నగ లేవు. కాబట్టి, కుండ-నగ అనుకునే మధ్యావస్థలో కూడ ఉన్నది మట్టి, బంగారము మాత్రమే. కుండ, నగ అనేవి జగద్వ్యవహారమునకు పనికి వచ్చే నామరూపములు మాత్రమే. కార్యము కారణముకంటే భిన్నముగా లేదు. జగత్తు పరమాత్మకంటే భిన్నముగా లేనే లేదు. ఉన్నది ఆత్మయే.
మట్టి అనే సత్యవస్తువును ఉపాదానముగా చేసుకొని పిండము ఘటమును సృష్టించును. అంటే ఉన్నది మట్టి మాత్రమే. అదే విధముగా, దేనిని ఉపాదానముగా చేసుకొని పూర్వరూపము పరరూపమును సృష్టించునో, ఆ ఉపాదానమే ఉన్న వస్తువు. కార్యము కారణమునుండి పుట్టి కారణములోనే విలీనమగును. కావున, కారణమే యథార్థము (కార్యము మిథ్య) అని మహాత్ములు చెప్పుచున్నారు.
సత్కార్యమగు ఈ జగత్తునకు ఉపాదానము ప్రకృతి, అధిష్ఠానము పురుషోత్తముడు. ఈ జగత్తును ప్రకృతినుండి - కాలము అభివ్యక్తము చేయును. ఆ మూడు (ప్రకృతి, పురుషుడు, కాలము) పరబ్రహ్మనగు నేనే.
పరమేశ్వరుడు సంకల్పించి స్థితి అంతమయ్యే వరకు ఈ విస్తృతమైన సృష్టి ముందు-వెనుక తరముల రూపములో నిరంతరముగా ప్రవర్తిల్లుచుండును. గుణకార్యములగు వివిధదేహములతో జన్మించే జీవుల భోగమే దీని ప్రయోజనము.
లోకముల నానాత్వమును తనయందు ప్రకటించే విరాట్ పురుషుని కాలరూపుడనగు నేను ఆవరించెదను. అప్పుడాయన లోకములతో బాటు పంచభూతములుగా విడిపోయి ప్రళయములో లీనమగుటకు అర్హుడగును.
మరణశీలమగు దేహము ఆహారమునందు, ఆహారము విత్తులయందు, విత్తులు భూమియందు, భూమి గంధతన్మాత్రయందు విలీనమగును.
గంధతన్మాత్ర జలములయందు, జలములు తమ గుణమగు రసము నందు, రసము అగ్నియందు, అగ్ని రూపతన్మాత్రయందు విలీనమగును.
రూపతన్మాత్ర వాయువులో, వాయువు స్పర్శతన్మాత్రయందు, స్పర్శ తన్మాత్ర ఆకాశమునందు, ఆకాశము శబ్దతన్మాత్రయందు, ఇంద్రియములు తమ కారణములైన అధిష్ఠానదేవతల (రాజసాహంకారము)లో లీనమగును.
ప్రియదర్శనుడవగు ఉద్దవా! కారణదేవతలు తమను నియంత్రించే సమష్టి మనస్సునందు, అది సాత్త్వికాహంకారమునందు, (మిగిలియున్న) శబ్దతన్మాత్ర తామసాహంకారమునందు విలీనమగును. సర్వ (మోహన) సమర్థమగు అహంకారము మహత్తత్త్వమునందు విలీనమగును.
సమష్టి క్రియాజ్ఞానశక్తుల సమాహారమైన ఆ మహత్తత్త్వము తనకు కారణమైన సత్త్వాది గుణములయందు, ఆ గుణములు ప్రకృతి (సొమ్యా వస్థ) యందు, ఆ ప్రకృతి అవినాశియగు కాలమునందు విలీనమగును.
కాలము మాయను ప్రవర్తిల్ల జేసే ప్రాణస్వరూపుడగు (సగుణ) ఈశ్వరునియందు, ఈశ్వరుడు పుట్టుక లేని పరమాత్మనగు నాయందు లీనమగును. పరమాత్మ అద్వయము, తనయందే ఉండునది (లీనము కానిది). పరమాత్మను ఉత్పత్తిప్రళయములకు అధిష్ఠానము (అవధి) గా మాత్రమే తెలియదగును. సాక్షాత్తుగా పరమాత్మ తెలియబడదు.
ఈ విధముగా అనుసంధానము చేయువాని మనస్సులో భేదము నిమిత్తముగా గల (అహం-మమకారముల) భ్రమ -- సూర్యోదయమైన తరువాత ఆకసమునందు చీకటి వలె -- ఎట్లు నిలిచియుండును?(నిలిచియుండదు).
కార్యకారణముల తత్త్వమునెరింగిన (సర్వజ్ఞుడనగు) నేనీ విధముగా ఉత్పత్తి ప్రళయక్రమముల ద్వారా ఆత్మానాత్మవివేకప్రకారమును చెప్పితిని. దీని వలన సంశయములనే ముడులు విడిపోవును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ప్రకృతిపురుష వివేకమును వర్ణించే
ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).
