శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

10 - ఇహ పర భోగములు అసారములు

శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను - సాధకుడు నేను ఉపదేశించిన స్వధర్మ ములను జాగరూకుడై ఆచరించవలెను. నాయందే ఆశ్రయము గల సాధ కుడు వర్ణ-ఆశ్రమ-కులధర్మములను నిష్కామబుద్ధితో ఆచరించవలెను.

భోగములయందు లగ్న మైన మనస్సు గల సంసారులు గుణకార్యములగు శబ్దాదివిషయములు సత్యము లేయని గట్టిగా నమ్మెదరు. వారు సుఖప్రాప్తి కై చేసే సకలకార్యములు విరుద్ధమైన దుఃఖఫలమునిచ్చును. పరిశుద్ధమగు అంతఃకరణము గల సాధకుడు ఈ సత్యమును దర్శించే అభ్యాసమును చేయవలెను.

నిద్రిస్తున్నవానికి స్వప్నములో కనబడే అనేకపదార్థములు ఒకే ఆత్మ చైతన్యమునందు కల్పించబడినవే గాని యథార్థములు కావు. తెలివిగా ఉన్నా మనస్సులో భోగవిషయములను తలపోయువాని తలపులు కూడ మిథ్యయే. అదే విధముగా, గుణకార్యములగు ఇంద్రియ ముల ద్వారా అనుభవమునకు వచ్చే నానాత్వము సత్యము కాదు.

నేనే పరమలక్ష్యముగా గల సాధకుడు కామ్యకర్మలను విడిచి పెట్టి, నిష్కామ (నిత్య నైమిత్తిక) కర్మను ఆచరించవలెను. ఆత్మవిచారమునందు బాగుగా ప్రవర్తిల్లే సాధకుడు కర్మవిధులను లెక్క చేయనక్కరలేదు.

నేనే పరమలక్ష్యముగా గల సాధకుడు అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే యమములను ఆదరముతో అనుష్ఠించవలెను. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానము అనే నియమములను మాత్రము అప్పుడప్పుడు (ఆత్మజ్ఞానమునకు విరోధము లేకుండా) అనుష్ఠించవలెను. సాధకుడు నా తత్త్వమును తెలిసి శాంతమైన స్వభావము గల గురువును నా రూపముగనే భావించి సేవించవలెను.

గర్వము, మాత్సర్యము, తొందరపాటు, మమకారము, దోషదృష్టి, వ్యర్థమగు మాటలు సాధకునియందు ఉండరాదు. పనులలో నేర్పు, గురువుపై గట్టి అనురాగము, తత్త్వమును తెలియాలనే కోరిక ఉండవలెను.

సాధకుడు భార్య, పిల్లలు, ఇల్లు, పొలములు, బంధువులు, ధనము, పశుసంపద మొదలగువాటియందు నిర్లిపుడై యుండవలెను. తనకేది సుఖమో సకలప్రాణులయందు దానినే సమానముగా చూడవలెను.

అగ్ని తాను దహించి ప్రకాశింపజేసే కట్టెకంటే విలక్షణము. అదే విధముగా, స్థూలసూక్ష్మదేహములను సాక్షియై దర్శించే స్వయంప్రకాశమగు ఆత్మ వాటికంటే విలక్షణమైనది.

కట్టెలలో ప్రవేశించిన అగ్ని కట్టె ఆరిపోగా తానే నశించినట్లు, కట్టె వెలిగినప్పుడు తాను పుట్టినట్లు, చిన్న మంటలో తానే చిన్న యన్నట్లు, పెద్ద మంట ఉన్నప్పుడు తాను పెద్ద అన్నట్లు, వేర్వేరు కట్టెలలో తాను వేర్వేరు అన్నట్లు కన్పట్టును. అదే విధముగా, వివిధదేహములలో ప్రకాశించే పరమాత్మ ఆయా దేహగుణములను పొందినట్లు కన్పట్టును.

పరమాత్మయొక్క మాయాశక్తి సత్త్వరజస్తమోగుణాత్మిక. ఆ గుణములే జీవునకు సూక్ష్మస్థూల దేహములను నిర్మించుచున్నవి. జీవుడు అజ్ఞాన ముచే ఆ దేహములతో తాదాత్మ్యమును చెంది, సంసారములో బద్దుడగు చున్నాడు. కాబట్టి, ఆత్మజ్ఞానము సంసారమును నివృత్తి చేయును.

దేహాధ్యాసయే సంసారము. కావున, తన దేహాదులయందున్న పర మాత్మను విచారముచే తెలియవలెను. పరమాత్మ అద్వయము, ప్రకృతికి అతీతము. ఈ సత్యమును విశదముగా తెలిసి, స్థూలసూక్ష్మకారణ దేహములయందలి సత్యత్వబుద్ధిని, ఆత్మబుద్ధిని విడిచి పెట్టవలెను.

జ్ఞానమునార్జించుట అగ్నిని మథించుట వంటిది. దానిలో ఆచార్యుడు క్రింది కొయ్య కాగా, శిష్యుడు పై కొయ్య. ఉపదేశమే ఆ కొయ్యల మధ్యన మథించే పుల్ల. సుఖమునిచ్చే జ్ఞానమే మధనము వలన పుట్టే అగ్ని.

ఆత్మ పుణ్యపాపముల సంస్పర్శ లేనిది. మిక్కిలి నిపుణుడైన ఆచార్యుడు ఉపదేశించగా, మిక్కిలి నిపుణుడైన శిష్యుడు అట్టి ఆత్మయొక్క జ్ఞానమును పొందును. ఆ జ్ఞానము గుణకార్యములైన విషయభోగముల మాయను, దాని వలన వచ్చే సంసారమును దహించివేయును. సంసారమునకు మూలము అజ్ఞానమే. అజ్ఞానమును నశింపజేసిన జ్ఞానము, ఇంధనము లేని అగ్ని వలే, తాను కూడ ఆత్మస్వరూపములో విలీనమగును.

పూర్వమీమాంసకులిట్లు చెప్పెదరు: కర్మలను చేసి వాటి ఫలములైన సుఖదుఃఖములను భోగించే జీవులు అనేకులు. స్వర్గాది లోకములు, కాలము, కర్మలను బోధించే వేదము, జీవాత్మలు నిత్యములు. సకలపదార్థముల స్థితి నిత్యము. ఈ సర్వము సర్వదా ఇల్లాగే ఉంది. జ్ఞానముయొక్క పరిణామమే ఆత్మ. ఘటపటాదివస్తువుల భేదమును బట్టి జ్ఞానము పుట్టుచుండును. ఈ జ్ఞానములు కూడ భిన్నభిన్నములు.

ఓ రాజా! ఈ సిద్ధాంతమునంగీకరించినా, సంవత్సరము మొదలైన అంశములు గల కాలము వలన, దేహముతోడి సంబంధము వలన సకలప్రాణులకు మరల మరల పుట్టుట, వర్ధిల్లుట, నశించుట మొదలైన వికారములు కలుగుచునే యుండును. కాబట్టి దుఃఖము అనివార్యము.

ఈ కర్మవాదమునందు, ఈ లోకములో కర్మలను చేసి సుఖదుఃఖములననుభవించే జీవునకు స్వాతంత్యము లేకపోవుట అనుభవములోనున్న విషయమే. అస్వతంత్రుడు (కర్మపరతంత్రుడు) అగు జీవుని ఏ పురుషార్థము సేవించును? (ఏదీ సేవించదు).

విద్వాంసులైన మానవులకు కూడా (చాల సార్లు) కొంచెమైనా సుఖము లేదు. మూర్ఖులకు దుఃఖము లేకుండుటయు కనబడును. కాబట్టి, మేము కర్మలయందు నిపుణులమనీ అహంకరించుట కేవలము వ్యర్థము.

సుఖమును పొంది దుఃఖమును పరిహరించే ఉపాయము తెలిసినవారు కూడా సాక్షాత్తుగా మృత్యువు యొక్క పట్టునుండి తప్పించుకొనే ఉపాయమును సుతరాము యెరుగరు.

ఉరితీయుటకై ఉరికంబము వద్దకు నడిపించబడే వ్యక్తికి వలె, మానవునకు మృత్యువు సమీపములోనుండగా, సంపద గాని, భోగము గాని ఏమి సుఖమునిచ్చును? (ఈయదు). మృత్యువు సుఖపడనీయదు.

వేదము చెప్పే స్వర్గాది సుఖము కూడ ఇహలోక సుఖము వలె దుఃఖమిశ్రితమే. దానిలో కూడ పోటీలు, అసూయలు ఉండును. ఆ సుఖమునిచ్చే పుణ్యము ప్రతిక్షణము ఖర్చు అయి సుఖము అంతమగును. పైగా, స్వర్గాదిసుఖములనిచ్చే యజ్ఞాదులు వ్యవసాయము వలె అనేకవిఘ్నములతో కూడియున్నవి. కావున, ఈ సుఖము కూడ వ్యర్థమే.

యజ్ఞము మొదలైన ధర్మకార్యమును విఘ్నములు లేకుండా చక్కగా చేసినప్పుడు ఆ ' యజమానుడు ఆ ధర్మముచే సంపాదించబడిన పుణ్యలోకమును పొందును. ఆ పొందే తీరును గురించి కూడ వినుము.

యజమానుడీ లోకములో యజ్ఞములచే దేవతలనారాధించి స్వర్గలోకమునకు వెళ్లును. ఆతడు అచట దేవతలు వలెనే దేవలోకమునకు చెందిన భోగములననుభవించును.

ఆయన తన పుణ్యముచే సంపాదించబడిన స్వచ్చమైన విమానములో మనోహరమైన వేషమును దాల్చి అప్సరసల మధ్యలో విహరించుచుండగా, గంధర్వులాయనను కీర్తించెదరు.

ఆతడు చిరుగంటల మాలలతో శోభిల్లుతూ కోరిన చోటకు వెళ్లే విమానములో అప్సరసలతో కూడి క్రీడించును. దేవతల ఉద్యానములలో సుఖించుచుండగా, పుణ్యము ఖర్చు అగుటచే ఆతడు స్వర్గమునుండి జారిపోవును. కాని, ఆతనికా విషయము కూడ తెలియదు.

పుణ్యజీవుడు పుణ్యము ఖర్చు అయ్యేంతవరకు స్వర్గములో భోగములననుభవించును. పుణ్యము ఖర్చు కాగానే ఆయనకు ఇష్టము కాకున్నా కాలము క్రిందకు పడద్రోయును. .

దుష్టుల సంగము వలన అధర్మమునందు ప్రీతి గల మానవుడు, ఇంద్రియజయము లేనివాడు, భోగములయందు తగుల్కొన్న మనస్సు గలవాడు, లోభి, స్త్రీలంపటుడు, ప్రాణులను హింసించువాడు, శాస్త్రవిధి లేకుండా పశువులను చంపి ప్రేతములను భూతగణములను పూజించువాడు పరవశులై నరకములను (పశ్వాది జన్మలను) పొందెదరు. నరకములలోని అంధకారము భయంకరమైనది.

మానవుడు దేహముతో కర్మలను చేయును. వాటి ఉత్తరఫలరూపముగా మరల దేహమును పొందును. మరణించే స్వభావము గల జీవునకు ఈ సంసారచక్రమునందు సుఖమేమున్నది?

కలకాలము జీవించే లోకములు, లోకపాలకులు నా వలన భయపడును. రెండు పరార్ధముల (వెయ్యి కల్పముల) గొప్ప ఆయుర్దాయము గల బ్రహ్మదేవుడు కూడ నా వలన భయపడును.

సత్త్వరజస్తమోగుణముల కార్యములగు ఇంద్రియములు కర్మలను చేయుచున్నవి. ఆ గుణములు వాటిని కర్మలలో ప్రవర్తిల్లజేయుచున్నవి (ఆత్మ అసంగము). కానైతే, ఈ జీవుడు గుణకార్యములగు దేహాదులతోడి తాదాత్మ్యము వలన కర్మఫలములననుభవించుచున్నాడు.

ఎంతవరకైతే సత్త్వరజస్తమోగుణములలో వైషమ్యము, అనగా దేహాదులయందు నేను-నాది అనే అధ్యాస ఉండునో, అంతవరకు ఆత్మయందు అనేకత్వము అనుభవమునకు వచ్చును. ఎంతవరకైతే ఆత్మ అనేకముగా పరిచ్చిన్నముగా భాసించునో, అంతవరకు జీవుడు కర్మకు అధీనుడై ఉండుట తప్పదు.

జీవునకు కర్మపరాధీనత ఉన్నంతవరకు ఈశ్వరుని వలన భయము తప్పదు. ఎవరైతే ఈ గుణముల వైషమ్యముచే కలిగిన దేహాదులయందు నేను-నాది అనే అభిమానమును కలిగియుందురో, వారు దుఃఖముచే పీడితులై ఇడుముల పాలగుచుందురు.

గుణములలో వైషమ్యము ఏర్పడినప్పుడు కాలము, పరమాత్మ, జీవుడు, వేదము, లోకము, స్వభావము, ధర్మము అని నన్నే పలు విధములుగా వర్ణించెదరు (అనగా, ఇవేవీ నాకంటే భిన్నముగా లేవు).

ఉద్ధవుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! జీవుడు , గుణకార్యములగు దేహాదులయందు, దేహమునుండి పుట్టే కర్మలయందు, సుఖదుఃఖములయందు ఉంటున్నా బద్దుడు కాకుండుట యెట్లు? ఒకచో, ఆత్మతత్త్వము దేహదులచే, కర్మలచే, కర్మఫలములచే ఆవృతము కాని పక్షములో, జీవునకు బంధమెట్లు సంభవమైనది?

బద్దుడు మరియు ముక్తుడు ఎట్లు ఉండును? ఎట్లు విహరించును? ఏ చిహ్నములచే తెలియబడును? ఎట్లు భోగించును? ఎట్లు విడిచి పెట్టును? ఎట్లు నిద్రించును? ఎట్లు కూర్చుండును? ఎట్లు నడచును?

ప్రశ్నల ఉత్తరములను తెలిసినవారిలో శ్రేష్ఠుడవగు అచ్యుతా! నాకీ ప్రశ్నకు సమాధానమును చెప్పుము. ఆత్మ సర్వదా గుణములతో సంబం ధము కలిగినది గనుక బద్ధము కావలెను. ఆత్మ అసంగము గనుక సర్వదా ముక్తము కావలెను. బద్దమా? ముక్తమా? ఈ భ్రమను తొలగించుము.

శ్రీమద్భాగవతములో భోగములు అసారములనే పదవ అధ్యాయము.